Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 39

Story of Sagara-2 ( contd )!


విశ్వామిత్ర వచః శ్రుత్వా కథాంతే రఘునందనః |
ఉవాచ పరమప్రీతో మునిం దీప్తమివానలమ్ ||

'విశ్వామిత్రుని వచనములను వినిన శ్రీరాముడు అగ్నితో సమానమైన తేజస్సుగల ఆ మునితో ఇట్లు పలికెన".

బాలకాండ
ముప్పది తొమ్మిదవ సర్గము
( సగరుని యజ్ఞము)

విశ్వామిత్రుని వచనములను వినిన శ్రీరాముడు అగ్నితో సమానమైన తేజస్సుగల ఆ మునితో ఇట్లు పలికెను. 'ఓ మహాత్మా ! మా పూర్వీకులు ఆ యజ్ఞమును ఎట్లు చేసిరి ? ఆ కథను విస్తరముగా వినగోరుచున్నాను. మీకు శుభమగుగాక'. విశ్వామిత్రుడు ఆ కాకుత్స్థునితో చిరునవ్వుతో ఇట్లు పలికెను. ' ఓ రామా ! మహాత్ముడైన సగరుని యొక్క కథను విస్తారముగా వినుము '.

విశ్వామిత్రుడు చెప్పసాగెను:

' శంకరుని మామగారు అయిన హిమవంతుడు అనబడు అచలోత్తముడు, వింధ్య పర్వతము పరస్పరము చూచుకొనుచుండెడివారు. ఓ పురుషోత్తమా ! ఆ యజ్ఞము వారిద్దరి మధ్యలో నున్న ప్రదేశములో అయ్యెను. ఆ ప్రదేశము యజ్ఞకర్మలకు ప్రశస్తి పొందినది. నాయనా రామా ! సగరునియొక్క స్థిరమైన ఆజ్ఞప్రకారము అశ్వమేధ అశ్వ చర్యలను మహారథుడైన అంశుమంతుడు చేసెను. ఆ యజ్ఞములో ఓక పర్వదినమున వాసవుడు ( ఇంద్రుడు ) రాక్షసరూపములో యజమాని యొక్క యజ్ఞములో నియోగించబడిన అశ్వమును అపహరించెను. ఓ రామా ! ఆ అశ్వము అపహరించబడినందువలన ఉపాధ్యాయ ఋత్విజ గణములందరూ యజమాని అయిన సగరునితో ఇట్లు చెప్పిరి. " ఓ సగరా ! ఈ పర్వదినమున యజ్ఞాశ్వమును అపహరింపబడినది. అపహరించినవానిని చంపి ఆ అశ్వమును కూడా మరల తీసుకు రావలెను . ఓకవేళ యజ్ఞమునకు భంగము కలిగినచో అందరికీ అశుభమగును. అందువలన ఎట్టి క్రియలవలన క్రతువునకు భంగములేకుండునో ఆట్టి పని చేయవలెను".

విశ్వామిత్రుడు చెప్పసాగెను:

' ఆ ఋత్వుజుల మాటలను విని తన అరువదివేల పుత్రులతో ఇట్టి వచనములను పలికెను." ఓ ఉత్తములారా ! ఆ రాక్షసుల గమనమును నేను చూడలేదు. ఈ మహాక్రతువు మంత్రవేత్తలైన మహానుభావులచే నిర్వహింపబడుచున్నది. ఓ పుత్రులారా ! మీరు వెళ్ళండి, ఆన్ని సముద్రములచే చుట్టబడిన భూమిని వెదుకుడు . ఆ అశ్వము కనపడునంతవఱకు భూమిలో ఒక్కొక్క యోజనమును విస్తారముగా తవ్వి వెదుకుడు. నా ఆజ్ఞప్రకారము ఆ అశ్వమును అపహరించిన వానిని పట్టుకోనుడు. నేను ఋత్విజ గణములతో పౌత్రుడైన అంశుమంతునితో కూడి దీక్షలో నుండెదను. నేను ఇచటనే ఉండెదను. ఆ తురగ దర్శనమగువరకు మీకు క్షేమమగుగాక" .

'ఇట్లు ఆజ్ఞాపింపబడిన రాజకుమారులు సంతోషముతో , పిత్రువచనముల ననుసరించి భూమండలము వెదుకుటకు బయలు దేరిరి. "ఓ రామా ! వారిలో ప్రతి ఒక్కరూ వజ్రముతో సమానమైన గోళ్ళతో ధరణీతలమంతయూ తవ్వసాగిరి. ఓ రఘునందనా ! అతి దారుణమైన వజ్రాయుధముతో సమానమైన శూలములతో నాగళ్ళతో తవ్వబడుచున్న ఆ భూమిలోనుంచి భయంకర నాదము వెలువడెను. ఓ రాఘవా ! అట్లు తవ్వ బడుచున్నప్పుడు నాగులూ అసురులూ అజేయులగు రాక్షసులు తదితర ప్రాణులూ భయముతో శబ్దములు చేయసాగిరి. ఓ రఘునందనా ! ఆ అరవై వేల వీరులు భూమినంతయూ మిక్కిలి లోతుగా రసాతలము వరకు తవ్విరి. ఆవిథముగా త్రవ్వుతూ ఓ నరశార్దూల ! పర్వతములతో నిండియున్న ఈ జంబూద్వీపమంతయూ ఆ రాజకుమారులు పర్వతములలో సంచరించిరి'.

విశ్వామిత్రుడు చెప్పసాగెను

'అప్పుడు దేవగణములు గంధర్వులతో, అసురులతో, నాగులతో మనస్సులో కలవరపడుచూ పితామహుడగు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. వారు దుఃఖభరితులై , భయకంపితులై మహత్ముడైన బ్రహ్మదేవుని ప్రసన్నునిగా చేసికొని ఇట్లు పలికిరి. "ఓ భగవన్ ! సగరాత్మజులు భుమండలమంతయూ తవ్వుచున్నారు. చాలామంది మహాత్ములు ఈ తలమందు నివశించువారు చంపబడుచున్నారు. " వీడే మన యజ్ఞమును భంగము చేసినవాడు", " వీడిచేతనే అశ్వము అపహరింపబడినది" అని సమస్త భూతములనూ ఆ సగరాత్మజులు సంహరించుచున్నారు' అని.

|| ఈ విధముగా వాల్మీకిచే రచింపబడిన ఆదికావ్యమైన శ్రీమద్రామాయణములోని బాలకాండలో ముప్పది తొమ్మిదవ సర్గ సమాప్తము||

|| ఓమ్ తత్ సత్ ||

అయం యజ్ఞహరోsస్మాకం అనేనాశ్వోs పనీయతే |
ఇతితే సర్వభూతాని నిఘ్నంతి సగరాత్మజాః ||

తా|| " వీడే మన యజ్ఞమును భంగము చేసినవాడు" " వీడిచేతనే అశ్వము అపహరింపబడినది" అని సమస్త భూతములనూ ఆ సగరాత్మజులు సంహరించుచున్నారు".


|| Om tat sat ||