Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 45

Sagara manthan!

విశ్వామిత్రః వచశ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః |
విస్మయం పరమం గత్వా విశ్వామిత్రం అథాబ్రవీత్ ||
తా|| విశ్వామిత్రుని వచనములను వినిన లక్ష్మణునితోగూడిన రాఘవుడు అమితాశ్చర్యముతో విశ్వామిత్రునితో ఇట్లనెను.

బాలకాండ
నలుబది అయిదవసర్గము
( క్షీరసాగర మథనము - దేవాసుర సంగ్రామము)

లక్ష్మణునితోగూడి విశ్వామిత్రుని వచనములను వినిన రాఘవుడు అమితాశ్చర్యముతో విశ్వామిత్రునితో ఇట్లనెను. " ఓ బ్రహ్మన్ ! మీచే చెప్పబడిన ఈ పుణ్యమైన గంగావతరణము , సాగరము యొక్క పూర్తి చాలా అద్భుతమైనవి".

విశ్వామిత్రునిచే చెప్పబడిన శుభమైన కథలను గురించి లక్ష్మణునితో కూడి రాముడు ఆలోచించుచూ ఉండగా ఆ రాత్రి గడిచిపోయెను. పిమ్మట ప్రశాంతమైన ప్రభాతసమయములో శత్రుభయంకరుడైన రాముడు ప్రభాతకార్యక్రములను ముగించి మహాముని విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. "ఓ మహామునీ ! వినతగిన ఉత్తమమైన కథ వినడమైనది. పవిత్రమైన రాత్రి గడిచి పోయినది. ఈ కథలను గురించి అలోచించుచూ మననము చేయుటలో రాత్రి క్షణములో గడిచి పోయినది. ఇప్పుడు నదులలో శ్రేష్ఠమైన త్రిపథను దాటుదము. పుణ్యకర్మలను చేయు ఋషుల సుఖమైన నావ వున్నది. భగవత్సమానులైన మీరు ఇచట ఉన్నారని తెలిసి ఆ నావ త్వరగా వచ్చినది".

ఆ మహాత్ముడైన విశ్వామిత్రుడు అ రాఘవుని యొక్క వచనములను విని ఋషి సంఘములతో రామలక్ష్మణులతో నదిని దాటెను.

ఉత్తర తీరమును చేరి ఋషిగణములను పూజించి 'విశాల" అనబడు నగరమును చూచిరి. అప్పుడు ఆ మునివరుడు రామలక్ష్మణులతో సహా రమ్యమైన దివ్యమైన స్వర్గముతో సమానమైన విశాల నగరమునకు వెళ్ళేను. అప్పుడు మహాప్రాజ్ఞుడైన రాముడు మహాముని అగు విశ్వామిత్రునికి అంజలి ఘటించి ఉత్తమమైన విశాల నగరము గురించి అడగసాగెను."ఓ మహాముని ! నీకు క్షేమమగుగాక . ఈ విశాలా నగరములో ఏ రాజవంశము పాలించున్నదో వినుటకు కోరిక గానున్నది. ఇది వినుటకు కుతూహలముగా నున్నది".

ఆ రామునియొక్క ఆ మాటలను వినిన ఆ మునిపుంగవుడు ఆ విశాల నగరముయొక్క వురాతనమైన కథను చెప్పుటకు సిద్ధమాయెను.

'ఓ రామా |ఇంద్రునియొక్క శుభమైన కథను , ఈ దేశములో జరిగిన వృత్తాంతమును వినిపించెదను. ఓ రాఘవా వినుము. ఓ రామా ! పూర్వము కృతయుగములో దితి యొక్క పుత్రులు మహాబలవంతులు. అదితి యొక్క పుత్రులు మహాభాగులు వీరులు ధర్మము చేయువారు. ఓ నరశ్రేష్ఠా | అప్పుడు వారికి అమరులు , ముసలితనములేనివారు, రోగములు లేనివారుగా అగుట ఏట్లు అని ఆలోచనవచ్చెను. ఓ రామా అట్లు అలోచించుచున్న వారికి క్షీరసాగరము మథించి దానినుంచి వచ్చిన రసము పొందుదము అని ఆలోచన కలిగెను. మిక్కిలి శక్తి సంపన్నులైన ఆ దేవ దానవులు వాసుకిని తాడుగను మందరపర్వతమును కవ్వముగను చేసి క్షీరసాగరమును చిలికిరి'.

'వేయి సంవత్సరముల తరువాత తాడుగా నియోజింపబడిన వాసుకి శిరస్సునుంచి విషములు గ్రక్కెను, తన దంతములతో శిలలను కాటువేయసాగెను. ఆ హాలా హల మగు మహావిషము నుంచి అగ్ని ఉద్భవించెను. దానిచే దేవాసుర మనుష్యులతోకూడిన జగత్తు అంతయు దగ్ధమయ్యెను. అప్పుడు దేవతలందరూ శరణార్థులై మహాదేవుడు పశుపతి శంకరుడు అనబడు రుద్రుని "రక్షింపుము" "రక్షింపుము" అని ప్రార్థన చేసిరి. దేవతలచే ఈ విధముగా ప్రార్థింపబడిన దేవతలకు ఈశ్వరుడైన శంకరుడు అచటికి వచ్చెను. అచటికే శంఖచక్రములు ధరించిన శ్రీహరి కూడా వచ్చెను. అప్పుడు శ్రీహరి మందహాసముతో శూలము ధరించిన రుద్రునితో ఇట్లనెను. " ఓ సురశ్రేష్ఠ ! నీవు సురలలో అగ్రజుడివి. కనుక దేవదానవ క్షీరమథనములో మొదటగా వచ్చిన విషమును అగ్రపూజగా భావించి దానిని స్వీకరింపుము" అని. ఈ విధముగా చెప్పి అ సురశ్రేష్ఠ ( మహావిష్ణువు) అంతర్ధానమయ్యెను. పరమేశ్వరుడుకూడా మహావిష్ణువు మాటలు విని , దేవతల భయము చూచి ఘోరమైన హాలాహలమనబడు విషమును అమృతముతో సమానముగా గ్రహించెను. పిమ్మట దేవతలకు ఈశ్వరుడైన ఆ భగవన్ ఆ దేవతలను వీడి వెళ్ళిపోయెను'.

'ఓ రఘునందన ! ఓ అనఘా! అప్పుడు దేవతలూ అసురులు అందరూ మళ్ళీ క్షీరసముద్రము చిలకసాగిరి. అప్పుడు కవ్వముగా నియోగించబడిన పర్వతము పాతాళములో ప్రవేశించెను. అప్పుడు దేవతలు గంధర్వులతో సహా మధుసూదనుని ప్రస్తుతించిరి." అన్ని భూతములకు నీవే గతి . ముఖ్యముగా దేవతలకు . ఓ మహాబాహో ! నీవు ఆ పర్వతమును ఉద్ధరించుటకు తగినవాడవు". అప్పుడు భగవంతుడైన హృషీకేశుడు కూర్మరూపమును ధరించెను. ఆ శ్రీహరి పర్వతమును తన మూపున వహించి ఆ క్షీరసాగరములో శయనించెను. ఆ పురుషోత్తముడు పర్వతాగ్రమును తన చేతితో తిప్పుచూ దేవతల మధ్యలో నుండి క్షీరసాగర మథనమును చేయసాగెను.

'ఒక వేయి సంవత్సరముల పిమ్మట మొదట దండ కమండలములతో గూడిన ధన్వంతరీ అనబడు మహాపురుషుడు , ఆ తరువాత మంచి వర్చస్సు గల అప్సరసలు ఉద్భవించిరి . ఓ మనుజశ్రేష్ఠా ! "అప్సు" మథనము చేయుటవలన వచ్చిన రసము నుంచి ఉద్భవించిన వరింపదగిన వనితలు కనుక వారు అప్సరసలు అనబడిరి. ఓ కకుత్ స్థ! ఆ ఆరుకోట్ల సువర్చసలతో అసంఖ్యాకులైన పరిచారికలు కుడా ఉద్భవించిరి. ఆ దేవ దానవులందరూ వారిని గ్రహింపలేదు. వారిని స్వీకరించకపోవుటవలన వారందరూ సాధారణ అప్సరసలు గా వుండిపోయిరి. ఓ రఘునందనా ! అప్పుడు వరుణుని యొక్క కన్య వారుణీ , ఒక మహాభాగుని వెదుకు మార్గములో క్షీరసముద్రమునుంచి బయటికి వచ్చెను. ఓ రామా ఓ వీరా ! ఆ వరుణిని పుత్రికను దితియొక్క పుత్రులు స్వీకరించలేదు. ఆ అనిందిత అయిన ఆమెను అదితి యొక్క పుత్రులు స్వీకరించిరి. అందువలన దితి యొక్క పుత్రులు అసురులు, అదితి యొక్క పుత్రులు సురులు అనబడిరి. వారుణీని స్వీకరించిన సురలు సంతృప్తులై ఆనందపడిరి. ఓ నరశ్రేష్ఠా ! హయములలో శ్రేష్ఠమైన ఉచ్చైశ్రవము , రత్నములలో మణి అయిన కౌస్థుభము ( క్షీర సముద్రమునుంచి) ఉద్భవించెను. అటులనే ఉత్తమమైన అమృతము ఉద్భవించెను'.

'ఓ రామా ! అమృతము ఉద్భవించినపుడు మహా యుద్ధమాయెను. ఆ యుద్ధములో అదితి పుత్రులు దితిపుత్రులను సంహరించిరి. ఓ వీరా ! అసురులందరూ రాక్షసులతో కూడి ఒక పక్షమున వుండగా ముల్లోకములకు అశ్చర్యము కలగించు యుద్ధము జరిగెను. అప్పుడు అంతా క్షయమగుచుండగా మహాబలవంతుడగు మహావిష్ణువు మోహినీ రూపముధరించి ఆ ఆమృతమును తీసుకుపోయెను. అక్షయుడు పురుషోత్తముడు అయిన విష్ణువును కొందరు ఎదిరించిరి. ప్రభవిష్ణుడగు విష్ణువు యుద్ధములో వారిని సంహరించెను. ఓ వీరా అదితి దితిల పుత్రుల ఘోర యుద్ధములో అదితియొక్క పుత్రులు దితియొక్క పుత్రులను సంహరించిరి'.

'పురందరుడు ( ఇంద్రుడు) దితి పుత్రులను సంహరించి రాజ్యము పొంది సంతోషముతో ఋషిసంఘములతో చారణులతో కూడిన లోకములను శాసించెను'.

|| ఈ విధముగా వాల్మీకి రామాయణములో బాలకండలో నలుబది ఇదవ సర్గ సమాప్తము ||
|| ఓమ్ తత్ సత్ ||

నిహత్యదితపుత్త్రాంశ్చ రాజ్యంప్రాప్య పురందరః |
శశాస ముదితో లోకాన్ సర్షి సంఘాన్ స చారణాన్ ||

'పురందరుడు ( ఇంద్రుడు) దితి పుత్రులను సంహరించి రాజ్యము పొంది సంతోషముతో ఋషిసంఘములతో చారణులతో కూడిన లోకములను శాసించెను'.

|| ఓమ్ తత్ సత్ ||


|| om tat sat ||