Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 53

Vasistha's refuses to yield Sabala !!

|| om tat sat ||

ఏవముక్తా వసిష్ఠేన శబలా శత్రుసూదన |
విదధే కామధుక్ కామాన్ యస్య యస్య యథేప్సితమ్||

ఓ రామా ! వసిష్ఠుని చేత ఇట్లు చెప్పబడిన ఆ శబలా ఎవరికి ఎమి కోరిక గలదో దాని ప్రకారము ( భోజనములను) తయారు చేసెను.

బాలకాండ
ఏబది మూడవ సర్గము

శతానందుడు విశ్వామిత్రుని కథ చెప్పసాగెను.

’ ఓ రామా ! వసిష్ఠుని చేత ఇట్లు చెప్పబడిన ఆ శబలా ఎవరికి ఎమి కోరిక గలదో దాని ప్రకారము విశ్వామిత్రునకు అతని బలగములకు భోజనములను తయారు చేసెను. ఆ భోజనములో చెఱుకు గడలనూ రసములనూ తేనలనూ పానీయములను అనేకవిధములైన భక్ష్యములనూ సమకూర్చెను. ఆచట పర్వతరాసులవలెనున్న వేడిగానున్న మృష్టాన్నములు , పాయసములు , పెరుగుధారలు ఉండెను. అనేకవిధములగు రుచులుగల భక్ష్యములు , తినిబండారములతో పూర్తిగా పాత్రలు ఉండెను. ఓ రామా ! విశ్వామిత్రుని బలగమంతయూ వసిష్టుని ఆదరముతో మిక్కిలి తృప్తిపడిన హృష్ట పుష్ట జనులతో నిండినదాయెను.

'అప్పుడు రాజర్షి అగు విశ్వామిత్రుడు కూడా మిక్కిలి సంతుష్టుడాయెను. అంతఃపుర శ్రేష్ఠులు , బ్రాహ్మణులు, పురోహితులు అమాత్యులు మంత్రులతో కూడి భృత్యులతో సహా పూజింపబడిన ఆ రాజు అత్యంత సంతోషముతో ఇట్లు పలికెను'.

"ఓ బ్రహ్మన్ ! పూజింపతగిన నీ చేత నేను సత్కారములతో పూజింపబడితిని. ఓ వాక్య విశారద నాది ఒక మాట ఉన్నది. వినుడుగాక. ఓ భగవన్ ! ఒక లక్ష గోవులను తీసుకొని ఈ శబల నాకు ఇయ్యబడుగాక. అది ఒక రత్నము. రత్నము లన్నియూ హరించువాడు రాజు. ఓ బ్రాహ్మణుడా ! అందువలన ధర్మముగా ఇది నాకు చెందినదే . అందువలన శబలను నాకు ఇమ్ము".

'విశ్వామిత్రునిచే ఈ విధముగా చెప్పబడిన మునిసత్తముడు ధర్మాత్ముడు అగు వసిష్ఠుడు ఆ రాజు తో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను'.

" ఓ రాజన్ ! లక్ష కాని కోటిగాని గోవులతో కాని , వెండి రాశులతో గాని శబలను ఇవ్వను. ఓ రాజా ఇది నానుండి వేరగుటకు వీలు లేదు. మాన్యులకు కీర్తివలె నాకు శబలతో విడదీయని సంబంధము. అదియే నాకి హవ్యము కవ్యము నా జీవనయాత్ర కూడా . అదియే అగ్నిహోత్ర కార్యములకూ భూతబలికి మూలము. అదే విథముగా స్వాహాకారములు వషట్కారములూ వివిధములైన విద్యలకూ మూలము. ఓ రాజర్షీ ! ఇచట సంశయములేదు. అదియే సర్వస్వము. నిజముగా అదియే నాకు సర్వస్వము ఎల్లప్పుడు ఆనందదాయకము. ఓ రాజన్ ! కారణములు చాలాఉన్నాయి. నేను నీకు శబలను ఇవ్వను."

'ఈవిధముగా వసిష్ఠునిచేత చెప్పబడిన తరువాత వాక్య విశారదుడైన విశ్వామిత్రుడు సంభ్రమముతో అర్థముతో వున్న మాటలతో ఇట్లు పలికెను. " నీకు బంగారు తాళ్ళతోనూ , సువర్ణ ఆభరణములతోనూ అంకుశములతోనూ అలంకృతమైన పదులాగువేల ఏనుగలు ఇచ్చెదను .నీకు కింకిణములతో నున్న నాలుగు తెల్లని గుఱ్ఱములతో నున్న ఎనిమిది వందల బంగారు రథములను ఇచ్చెదను. ఓ సువ్రత ! తగినదేశములో పుట్టిన, మంచి వంశములో పుట్టిన, మంచి బలముగల పదనొకండు వేల అశ్వములనిచ్చెదను. అదేవిథముగా వయస్సులోనున్న అనేక రంగులు కల ఒక కోటి ఆవులను ఇచ్చెదను. నాకు శబలను ఇమ్ము. ఓ ద్విజోత్తమా ! రత్నములైన బంగారమైనా నీవు కోరినంత ఇచ్చెదను. నాకు శబలను ఇమ్ము".

'ధీమతుడైన విశ్వామిత్రుడు ఇట్లు చెప్పగా , వసిష్ఠుడు " ఓ రాజా ఏట్టిపరిస్థితిలోనూ శబలను ఇవ్వను" అని చెప్పెను. మరల ఇట్లు చెప్పెను. "ఓ రాజన్ ఇది నారత్నము. ఇదియే నాధనము. ఇదియే నాసర్వస్వము. ఇదియే నాజీవితము. ఇదియే నా దర్శ పూర్ణమాస యాగములకు దక్షిణలతో కూడిన యజ్ఞములకు (ఆధారము). అదేవిధముగా అనేక కార్యములకు కూడా ఇదియే నా సర్వస్వము "|

"ఓ రాజన్ ! నా కార్యములన్నిటికీ సంశయములేకుండా ఇదియే మూలము. ఎక్కువ మాటలు అనవసరము. నా మనోరథములను తీర్చు కామధేనువును ఇవ్వను".

ఈ విథముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో బాలకాండలోని ఎబది మూడవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||

అదోమూలాః క్రియాస్సర్వా మమరాజన్ న సంశయః |
బహూనా కిం ప్రలాపేన న దాస్యే కామదోహినీమ్ ||

తా|| ఓ రాజన్ ! నా కార్యములన్నిటికీ సంశయములేకుండా ఇదియే మూలము. ఎక్కువ మాటలు అనవసరము. నా మనోరథములను తీర్చు కామధేనువును ఇవ్వను.