Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 55

Viswamitra obtains boons from Mahadeva !!

|| om tat sat ||

బాలకాండ
ఏబదిఇదవ సర్గము

తతస్తాన్ అకులాన్ దృష్ట్వా విశ్వామిత్రాస్త్రమోహితాన్ |
వసిష్ఠశ్చోదయామాస కామధుక్ సృజ యోగతః ||

స|| తతః విశ్వామిత్రాస్త్ర మోహితాన్ అకులాన్ దృష్ట్వా వసిష్ఠః "కామధుక్ సృజ యోగతః" ఇతి చోదయామాస ||

తా||ఆప్పుడు విశ్వామిత్రుని అస్త్రములచే చలింపబడి తత్తరపోయినవారిని చూచి వసిష్ఠుడు " ఓ కామధేను యోగ్యులను సృజింపుము " అని ప్రోత్సహించెను.

తస్యా హూంభారవాజ్జాతాః కాంభోజా రవిసన్నిభాః |
ఊధసస్త్వథ సంజాతాః పప్లవాః శస్త్ర పాణయః ||

స|| తస్య హూంభారావాత్ జాతాః రవిసన్నిభాః కాంభోజాః | ఊధసస్త్వథ శస్త్ర పాణయః పప్లవాః సంజాతాః ||

తా|| ఆ కామధేనువు యొక్క హూంకారమునుండి రవితేజము కల కాంభోజులు , పొదుగునుండి శస్త్రములను ధరించి ఉన్న పప్లవులు ఉద్భవించిరి.

యోనిదేశాచ్చ యవనా శకృద్దేశాత్ శకస్తథా |
రోమకూపేషు చ మ్లేచ్చా హారీతాస్సకిరాతకాః ||

సా|| యవనా యోనిదేశాత్ చ | తథైవ శకః శకృదేశాత్ | మ్లేచ్చా హరీత కిరాతకాః రోమకూపేషు ( సంజాతాః) ||

తా|| అదేవిధముగా యోని దేశమునుండి యవనులు , శకృదేశమునుండి శకులు, రోమకూపమునుండి మ్లేచ్ఛులు, హారీతులు, కిరాతులు ( ఉద్భవించిరి)

తై స్తైః నిషూదితం సర్వం విశ్వామిత్రస్య తత్ క్షణాత్ |
సపదాతిగజం సాశ్వం స రథం రఘునందన ||

స్స||హే రఘునందన ! తైః స్తైః తత్ క్షణాత్ విశ్వామిత్రస్య సర్వం సపదాతిగజం సాశ్వం , స రథం నిషూదితం ||

తా|| ఓ రఘునందన ! వారిచే తత్క్షణమే విశ్వామిత్రునియొక్క పాద గజ అశ్వ రథ సైన్యములు నాశనము చేయబడెను.

దృష్ట్వా నిషూదితం సైన్యం వసిష్ఠేన మహాత్మనా |
విశ్వామిత్రసుతానాం చ శతం నానావిధాయుధమ్|
అభ్యధావత్ సుసంక్రుద్ధం వసిష్ఠం జపతాం వరమ్ ||

స|| మహాత్మనా వసిష్ఠేన నిషూదితం సైన్యం దృష్ట్వా సుసంకృద్ధం శతం విశ్వామిత్రసుతానాం నానావిధాయుథమ్ వసిష్ఠం జపతాం వరం అభ్యధావత్ ||

తా|| మహాత్ముడైన వసిష్ఠుని వలన నాశనము చేయబడిన సైన్యమును చూచి వందమంది విశ్వామిత్రుని పుత్రులు కోపముతో వివిథ రకములైన ఆయుధములతో తపోధనుడైన వసిష్ఠునిపై పరుగెత్తుకొని వచ్చిరి.

హూంకారేణ తాన్ సర్వాన్ దదాహ భగవాన్ ఋషిః |
తే సాశ్వరథపాదాతా వసిష్ఠేన మహాత్మనా |
భస్మీకృతా ముహూర్తేన విశ్వామిత్రసుతాస్తదా ||

స|| భగవాన్ ఋషిః హుంకారేణ తాన్ సర్వాన్ దదాహ | తదా తే విశ్వమిత్రసుతా స అశ్వ రథ పాదాతా ముహూర్తేన వసిష్ఠేన భస్మీకృతా ||

తా|| పూజ్యుడైన ఆ ఋషి హూంకారముతో వారిని భశ్మమొనర్చెను . అవిధముగా ఆ విశ్వామిత్రుని సుతులు అశ్వ రథ పాదచారులతో క్షణములో వసిష్ఠునిచే భశ్మము చేయబడిరి.

దృష్ట్వా వినాశితాన్ పుత్త్రాన్ బలం చ సుమహాయశాః |
సవ్రీడశ్చింతయావిష్టో విశ్వామిత్రో అభవత్ తదా ||
సముద్ర ఇవ నిర్వేగో భగ్న దంష్ట్ర ఇవోరగః |
ఉపరక్త ఇవాదిత్యః సద్యో నిష్ప్రభతాం గతః ||
హతపుత్ర బలో దీనో లూనపక్ష ఇవ ద్విజః|
హతదర్పో హతోత్సాహో నిర్వేదం సముపద్యత ||

స|| వినాశితాన్ పుత్త్రాన్ బలం చ దృష్ట్వా తదా సు మహాయశః విశ్వామిత్రః స వ్రీడః చింతయావిష్ఠో అభవత్ | సః సముద్ర ఇవ నిర్వేగో (అభవత్) | భగ్న దంష్ట్ర ఉరగః ఇవ ( అభవత్) | ఉపరక్త ఆదిత్యః ఇవ నిష్ప్తభతాం గతః సద్య (ఇవ) అభవత్ | హతపుత్ర బలః లూనపక్ష ఇవ దీనః | హత దర్పః| హత ఉత్సాహః| నిర్వేదం సముపద్యత||

తా|| నాశనము చేయబడిన పుత్రులను బలములను చూచి మహాయశోవంతుడైన విశ్వామిత్రుడు సిగ్గుతో చింతాక్రాంతుడయ్యెను. అతడు సముద్రునివలె వేగము లేని వాడయ్యెను. కోఱలు తీసిన పామువలె గ్రహణము పట్టి తేజో విహీనుడైన సూర్యుని వలె నుండెను. చంపబడిన సుతులు, సైన్యముల తో (విశ్వామిత్రుడు) ఱెక్కలు పోయిన పక్షివలె దీనముగా నుండెను. గర్వము అణిగి, ఉత్సాహము పోయి నిర్వేదము పొందెను.

స పుత్రమేకం రాజ్యాయ పాలయేతి నియుజ్య చ |
పృథివీం క్షత్ర ధర్మేణ వనమేవాన్వపద్యత ||
స గత్వా హిమత్పార్శ్వం కిన్నరోరగసేవితమ్ |
మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహతపాః ||

స|| సః ఏకం పుత్రం పృథివీం క్షత్ర ధర్మేణ రాజ్యాయ పాలయేతి నియుజ్య వనమేవ అన్వపద్యత్ |సః కిన్నరోరుగ సేవితం హిమవత్ పార్శ్వం గత్వా మహదేవ ప్రసాదార్థం తపః తేపే ||

తా|| అతడు ఒక పుత్రుని రాజ్యమును క్షత్రధర్మముతో రాజ్యము పాలింపమని చెప్పి వనములకు పోయెను. అతడు కిన్నరులు నాగులు చే సేవింపబడిన హిమవత్పర్వత పార్శ్వములో వెళ్ళి మహాదేవుని ప్రసాదము కొఱకు తపము చేసెను.

కేనచిత్వథ కాలేన దేవేశో వృషభధ్వజః |
దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలమ్||
కిమర్థం తప్యసే రాజన్ బ్రూహి యత్ తే వివక్షితమ్|
వరదోSస్మి వరో యస్తే కాంక్షితస్సోS భిదీయతామ్ ||

స|| అథ కేనచిత్ కాలేన వరదః వృషభధ్వజః విశ్వామిత్రం మహాబలం దర్శయామాస|| హే రాజన్ ! వరదో అస్మి | బ్రూహి కిమర్థమ్ తప్స్యసే ! యః సః కాంక్షితః స అభిదీయతాం |తే యః వరః |

తా|| పిమ్మట కొంత కాలము తర్వాత వృషభధ్వజుడు అగు వరదుడు మహాబలుడైన విశ్వామిత్రునకు దర్శనమిచ్చెను. "ఓ రాజన్ ! సంతుష్ఠుడనైతిని. చెప్పుము ఎందుకు తపస్సు చేయుచున్నావు. నీ కోరికను దెలుపుము. నీవు కోరిన వరముఇచ్చెదను"

ఏవముక్తస్తు దేవేన విశ్వామిత్రో మహాతపాః |
ప్రణిపత్య మహాదేవం ఇదం వచన మబ్రవీత్ ||
యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ |
సాంగోపాంగోపనిషదః స రహస్యః ప్రదీయతామ్ ||

స|| దేవేన ఏవం ఉక్తస్తు మహాతపాః విశ్వామిత్రః మహాదేవం ప్రణిపత్య ఇదం వచనమ్ అబ్రవీత్ ||హే మహదేవ సాంగోపాంగో ధనుర్వేదః స రహస్యః ఉపనిషదః హే అనఘ మమ ప్రదీయతాం |

తా|| దేవునిచేత ఇట్లు చెప్పబడిన విశ్వామిత్రుడు మహదేవునకు నమస్కరించి ఇట్లు పలికెను. "ఓ మహాదేవా సాంగో పాంగముగా ధనుర్వేదము ను రహస్యమైన ఉపనిషదులను నాకు ప్రసాదించుడు".

యాని దేవేషు చాస్త్రాణి దానవేషు మహర్షిషు |
గంధర్వ యక్ష రక్షస్సు ప్రతిభాంతు మమానsఘ||
తవప్రసాదాద్భవతు దేవదేవ మమేప్సితమ్|
ఏవమస్త్వితి దేవేశో వాక్యముక్త్వా గతస్తదా||

స|| దేవేషు దానవేషు మహర్షిసు గంధర్వ యాని శస్త్రాని ప్రతిభాంతు హే అనఘ మమ ( ప్రదీయతామ్ )||హే దేవ దేవ తవ ప్రసాదాత్ మమేప్సితం భవతు| తదా ఏవం అస్తు ఇతి దేవేశో వాక్యముక్త్వా గతః ||

తా|| దేవతల దానవుల మహర్షుల గందర్వుల వద్ద ఏ ప్రతిభావంతమైన అస్త్రములు కలవో ఓ అనఘ! నాకు ప్రసాదింపుడు. "ఓ దేవ దేవా నీ ప్రసాదముతో నాకు కావలసిన కోరిక తీరుతుంది". అప్పుడు ఈశ్వరుడు " అట్లే అగుగాక" అని చెప్పి వెళ్ళిపోయెను.

ప్రాప్యచాస్త్రాణి రాజర్షిః విశ్వామిత్రో మహాబలః|
దర్పేణ మహతా యుక్తో దర్పపూర్ణో అభవత్ తదా||
వివర్ధమాణో వీర్యేణ సముద్ర ఇవ పర్వణి |
హతమేవ తదా మేనే వసిష్ఠం ఋషిసత్తమమ్||

స|| రాజర్షిః మహాబలః విశ్వామిత్రః దర్పేణ మహతా యుక్తో ( తత్) అస్త్రాణి ప్రాప్య తదా దర్పపూర్ణం అభవత్ ||వివర్థమాణో వీర్యేణ సముద్ర ఇవ పర్వణి తదా వసిష్ఠం ఋషిసత్తమం హతమేవ (ఇతి) మేనే||

తా|| మహాబలవంతుడు దర్పముచే విర్రవీగు ఆ రాజర్షి అస్త్రములు పొంది ఇంకా పూర్తిగా గర్వము కలవాడయ్యెను. పర్వకాలమందు సముద్రమువలె పరాక్రమవృద్ధితో ఋషిసత్తముడగు వసిష్ఠుడు హతమైనట్లే తలచెను.

తతో గత్వా ఆశ్రమపదం ముమోచాస్త్రాణి పార్థివః|
యైస్తత్ తపోవనం సర్వం నిర్దగ్ధం చాస్త్ర తేజసా ||
ఉదీర్యమాణమస్త్రం తత్ విశ్వామిత్రస్య ధీమతః|
దృష్ట్వా విప్రద్రుతాస్సర్వే మునయ శ్శతశోదిశః ||
వసిష్ఠస్య చ యే శిష్యాః తథైవ మృగ పక్షిణః|
విద్రవంతీ భయాద్భీతా నానాదిగ్భ్యః సహస్రశః ||

స|| తతః స పార్థివః ఆశ్రమపదం గత్వా అస్త్రాణి ముమోచ | తత్ అస్త్ర తేజసా యైః తత్ తపోవనమ్ సర్వం నిర్దగ్దం |తత్ ధీమతః విశ్వామిత్రస్య ఉదీర్యమానం అస్త్రమ్ దృష్ట్వా సర్వే శతశో విప్రద్రుతా దిశః ( గతాః) |వశిష్ఠస్య శిష్యాః తథైవ సహస్రశః మృగ పక్షిణః భయాద్భీతా నానాదిగ్భ్యః విద్రవన్తీ ||

తా||పిమ్మట ఆ రాజు ఆశ్రమ పదమునకు పోయి అస్త్రములను ప్రయోగించెను. ఆ అస్త్రముల తేజస్సు వలన ఆ తపోవనము అంతా దగ్ధమాయెను. ఆ ధీమతుడగు విశ్వామిత్రుని యొక్క చెలరేగుతున్న అస్త్రములను చూచి అచటి వందలకొలదీ మునులందరూ అన్నిదిక్కులలో పోయిరి. వసిష్ఠుని శిష్యులు అలాగే వేలకొలదీ మృగములు పక్షులు భయభీతులై ఆన్ని దిక్కులవైపు పోయిరి.

వసీష్ఠాశ్రమపదం శూన్యమాసీన్మహాత్మనః |
ముహూర్తమివ నిశ్శబ్దం ఆశీదిరిణ సన్నిభమ్||

స|| మహాత్మనః వసిష్ఠాశ్రమపదం శూన్యం ఆసీత్. ముహూర్తమివ అశీదిరిణ సన్నిభం నిశ్శబ్దం ఆసీత్||

తా|| మహాత్ముడైన ఆ వశిష్ఠ ఆశ్రమపదము శూన్యమాయెను. క్షణములో శ్మశానవాటిక లాగా నిశ్శబ్దము ఆవరించెను.

వదతో వై వసిష్ఠస్య మాభైరితి ముహుర్ముహుః|
నాశయామ్యద్య గాధేయం నీహారమివ భాస్కరః ||

స|| మాభైరితి ముహుర్ముహుః వసిష్ఠస్య వదతో అద్య గాధేయం భాస్కరః నీవారమివ అద్య నాశయామి ||

తా|| "భయపడకుడు" అని మరల మరల చెప్పుచూ వసిష్ఠుడు ఇట్లనెను " "ఈదినమున ఆ గాధేయుని సూర్యుడు మంచుని నాశనముచేసినట్లు చేసెదను".

ఏవముక్త్వా మహాతేజా వసిష్ఠో జపతామ్ వరః |
విశ్వామిత్రం తదా వాక్యం సరోషం ఇదమబ్రవీత్ ||
ఆశ్రమం చిర సంవృద్ధం యద్వినాశితవానపి |
దురాచారోsసి తన్మూఢ తస్మాత్ త్వం న భవిష్యసి ||

స|| ఏవం ఉక్త్వా మహాతేజా జపతామ్ వరః వసిష్ఠః తదా విశ్వామిత్రం సరోషం ఇదం వాక్యం అబ్రవీత్ |చిర సంవృద్ధం ఆశ్రమమ్ యద్వినాసితవానపి దురాచారోసి ! తస్మాత్ తన్ మూఢ త్వం న భవిష్యసి ||

తా|| ఈ విధముగా చెప్పి తపోనిథి అయిన వసిష్ఠుడు విశ్వామిత్రునితో కోపముతో ఇట్లు పలికెను. "చాలాకాలమునుండి వృద్ధిలోనున్న ఈ ఆశ్రమపదమును నాశనమొనర్చిదురాచారాము చేసితివి. అందువలన ఓ మూఢుడా నీవు ఇక ఉండవు "

ఇత్యుక్త్వా పరమకృద్ధో దండముద్యమ్య సత్వరః |
విధూమమివ కాలాగ్నిం యమదండ మివాపరమ్||

స|| ఇత్యుక్త్వా పరమకృద్ధః విధూమం కాలాగ్నీం ఇవ అపరం యమదండ మివ దండం సత్వరః ఉద్యమ్య ||

తా|| ఈ విధముగా చెప్పి అతి క్రోధముతో ధూమము లేని కాలాగ్ని వలే ఒక యమదండము వలె నున్న తన దండముతో ఎత్తెను.

|| ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచపంచాశస్సర్గః ||

|| ఈ విథముగా శ్రీమద్రామాయణములో బాలకాండలో ఎబది ఇదవ సర్గము సమాప్తము.||

|| ఓమ్ తత్ సత్ ||

 

|| om tat sat ||