Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 62

Story of Sunahsepha- 2 !!

|| om tat sat ||

శునశ్శేఫం నరశ్రేష్ఠ గృహీత్వా తు మహాయశాః |
వ్యశ్రామ్యత్ పుష్కరే రాజా మధ్యాహ్నే రఘునందన ||

"ఓ నరశ్రేష్ఠా ! రఘునందన ! మహా యశస్సు గల ఆరాజు శునశ్శేఫుని తీసుకుని వెళ్ళుతూ మధ్యాహ్న సమయమున పుష్కరక్షేత్రములో విశ్రమించెను".

బాల కాండ
అఱువది రెండవ సర్గము.

శతానందుడు విశ్వామిత్రుని కథ కొనసాగించెను.

'ఓ నరశ్రేష్ఠా ! రఘునందన ! మహా యశస్సు గల ఆరాజు శునశ్శేఫుని తీసుకుని వెళ్ళుతూ మధ్యాహ్న సమయమున పుష్కరక్షేత్రములో విశ్రమించెను. ఆ రాజు విశ్రమించుచుండగా శునశ్శేఫుడు పుశ్కరక్షేత్రములో ఋషులతో తపము చేయుచున్న తన మేనమామ యగు మహా యశస్సు గల విశ్వామిత్రుని చూచెను. బిక్కపోయి, దీనుడై , శ్రమచేత దప్పిక గలవాడై అ ముని యొక్క కాళ్లపై పడెను. అనంతరము శునశ్శేఫుడు ఇట్లు పలికెను'.

"నాకు తల్లీ లేదు. తండ్రి బంధువులు తెలిస్న వాళ్ళూఎక్కడా లేరు. ఓ శౌమ్యుడా ! మునిపుంగవా! ధర్మానుసారముగా నన్ను నీవు రక్షింప గలవు. ఓ మునిశ్రేష్ఠ ! అందరికీ నీవే దిక్కు. అందరికి నీవు రక్ష. ఆ అంబరీష మహరాజుయొక్క కార్యము సఫలము కావలెను. నాకు దీర్ఘాయువు కావలెను. ఉత్తమమైన తపస్సు ఒనరించి నేను స్వర్గ లోకము పొందవలెను. ఇది జరుగుటకు భవ్యమైన మనస్సుతో అనాధుడైన నన్ను నీవే కాపాడవలెను. ధర్మాత్మా ఈ కష్ఠమునుంచి తండ్రి పుత్త్రులను కాపాడినట్లు నీవు నన్ను కాపాడగలవు".

'మహాతపోవంతుడైన విశ్వామిత్రుడు అతనియొక్క ఆ మాటలను విని అతనిని అనేకవిథములుగా ఓదార్చి తన పుత్త్రులతో ఇట్లు పలికెను'.

"తండ్రులు తముచేసిన కార్యముల శుభము కొఱకు, పరలోక హితము కొఱకు,పుత్త్రులను కోరెదరు. ఇప్పుడు అట్టి కాలము వచ్చినది. అ బాలుడగు మునికుమారుడు నా శరణు కోరుచున్నాడు. ఓ పుత్త్రులారా ఇతని జీవితము నిలుపుటకు మీరు ప్రియము చేసెదరు గాక. మీరు అందరూ మంచి పనులు చేసిన వారు. అన్ని ధర్మములను పాటించువారు. మీరు నరేంద్రునియొక్క యజ్ఞపశువు గా అగ్నిని తృప్తి పరచెదరు గాక. అప్పుడు శునశ్శేఫుడు రక్షింపబడును. దేవతలు తర్పింపబడుదురు. యజ్ఞము అవిఘ్నముగా జరిగి పోవును. మీరు నాయొక్క మాటలు నిలబెట్టినవారగుదురు".

'ఓ రామా ! సుతులగు మధుష్యందాదులు ముని యొక్క వచనములను విని కొంచెము అభిమానము తోనూ కొంత లీలగను భావించి ఇట్లు చెప్పిరి. "ఓ విభో ! తన స్వంతమైన సుతులను చంపి అన్యుల పుత్త్రులను ఏట్లు రక్షించెదవు ? అటుల చేయుట బోజనములో కుక్క మాంసము వలె ఇది అకార్యము కదా" .

'ఆ మునిపుంగవుడు ఆ పుత్త్రుల వాక్యములను విని క్రోథముతో మడిపడుతున్న కళ్ళు కలవాడై ఇట్లనెను. "నా మాటను దాటి ఇట్లు అమర్యాదకపూర్వముగా మీరు చెప్పినది దారుణము, దిగ్భ్రాంతికరము, ధర్మమునకు విరుద్ధము. మీరందరూ వసిష్ఠపుత్రుల వలె కుక్కమాంసము తింటూ వెయ్యి సంవత్సరములు భూమిపై పడియుండెదరు గాక' " అని తన్ పుత్రులను శపించెను.

'విశ్వామిత్రుడు పుత్త్రులను శపించి పిమ్మట ఆర్తుడైయున్న శునశ్శేఫునకు రక్షణ కుదిర్చి ఇట్లు పలికెను. "పవిత్రమైన పాశములతో బంధించబడి ఎరుపు రంగుగల పూలమాలలతో అలంకరింపబడి విష్ణు యూపస్తంభము చేరి నీ వాక్కుతో అగ్నిని స్తుతింపుము. ఓ మునిపుత్త్రక ! అంబరీషుని యజ్ఞములో రెండు దివ్యమంత్రములను చెప్పెదను. వానిని గానము చేయుము. అప్పుడు వాని వలన నీ కోరిక తీరును".

'శునశ్శేపుడు ఆ రెండు మంత్రములను తీసుకొని, వెంటనే ఆ రాజసింహము అయిన అంబరీషునితో ఇట్లు పలికెను'.

" ఓ రాజసింహా !మహాబలశాలి ! సభకు శీఘ్రముగా పోయెదము. ఓ రాజేంద్ర ! అచట కూర్చుని వెంటనే దీక్ష తీసుకొనుము ". ముని కుమారుని ఆ మాటలను విని ఆ రాజు సంతోషముతో వెంటనే యజ్ఞవాటికకు వెళ్ళెను.

'ఆ రాజు సదస్యుల అనుమతితో యజ్ఞపశువును పవిత్ర మొనర్చి , ఎర్రని మాలలతో అలంకరించి యూపస్తంభమునకు కట్టిరి. అట్లు కట్టబడిన ముని పుత్త్రకుడు ఇంద్రుని అగ్నిని యథావిథిగా స్తుతించెను'.

'ఓ రాఘవ ! అప్పుడు ఇంద్రుడు రహస్యమైన ఆ స్తుతితో తృప్తి పడి శునశ్శేఫునకు దీర్ఘాయువు ప్రసాదించెను'.

'ఓరామ ! ఓ నరశ్రేష్ఠా | ఆ రాజు యజ్ఞముయొక్క సమాప్తము అవగనే ఇంద్రునిచే బహుగుణములైన ఫలితములతో ప్రసాదింపబడెను'.

'ఓ రామా ! ధర్మాత్ముడగు విశ్వామిత్రుడుఅచట మళ్ళీ పదివేల సంవత్సరములు తపస్సు చేసెను'.

|| ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణము లో బాలకాండలో అరువది రెండవ సర్గము సమాప్తము ||.

|| ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||