Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 69

Dasaratha arrives in Mithila !!

|| om tat sat ||

తతో రాత్ర్యాం వ్యతీతాయాం సోపాధ్యాయస్సబాంధవః |
రాజా దశరథో హృష్టః సుమంత్రం ఇదమబ్రవీత్ ||

తా|| పిమ్మట రాత్రి గడిచిన తరువాత హర్షముతో దశరథ మహారాజు తన ఉపాధ్యాయులు బంధువులతో కూడినవాడై సుమంతునితో ఇట్లు పలికెను.

బాలకాండ
ఏకోన సప్తతితమ స్సర్గః
( దశరథమహారాజు సపరివారముగా మిథిలా నగరము చేరుట)

పిమ్మట రాత్రి గడిచిన తరువాత హర్షముతో దశరథ మహారాజు తన ఉపాధ్యాయులు బంధువులతో కూడినవాడై సుమంతునితో ఇట్లు పలికెను. "ఇవాళ ధనాధ్యక్షులు పుష్కలముగా ధనమును తీసుకొని , వజ్రములు అనేకవిథములైన రత్నములతో సర్వసన్నద్ధులై ముందుగా వెళ్ళవలెను. అలాగే చతురంగబలములు వివిధ వాహనములతో శీఘ్రముగా పోవలెను అని నాఆజ్ఞ. బ్రాహ్మణులగు వశిష్ఠుడు , వామదేవుడు, జాబాలి ,కాశ్యపుడు దీర్ఘాయువు కల మార్కండేయుడు అలాగే కాత్యాయనుడు ముందుగా పోవుదురు గాక. దూతలు కాలము దాటకూడదని నన్ను త్వరపెట్టుచున్నారు".

ఆ దశరథుని ఆజ్ఞతో ఆ చతురంగ బలములు కల ఆ సేన ఋషులతో కూడి ఆయనను అనుసరించెను.

దశరథ మహరాజు పరివారము నాలుగు దినములు ప్రయాణము చేసి విదేహనగరము చేరిరి. శ్రీమంతుడగు జనకుడు దశరథ మహారాజు వచ్చుటవిని ఎదురుగావచ్చి దశరథ మహారాజుకి పూజలు చేసెను. వృద్ధుడగు దశరథ మహారాజుకి సంతోషపడిన జనక మహారాజు ఎదురుగా వచ్చి తన హర్షమును ప్రకటించెను. ఆనందించుచున్న ఆ నరశ్రేష్ఠుడు అగు జనకుడు ఆ నరశ్రేష్ఠుడు అగు దశరథునితో ఇట్లు పలికెను. " మహారాజా ! నీకు స్వాగతము. అదృష్ఠము పొందినవాడను. ఓ రాఘవ వీర్యశుల్కము గెలిచిన పుత్రులిద్దరి ప్రేమను అందుకొనుడు. మహాతేజోవంతుడైన, భగవాన్ ఋషి వశిష్ఠుడు ద్విజ శ్రేష్ఠులతో ఇఅచటికి వచ్చుట వలన అదృష్ఠము పొందిన వాడను. పరాక్రమవంతులలో శ్రేష్ఠులు మహాత్ములు అగు రఘువంశజులతో సంబంధము వలన అదృష్ఠముతో విఘ్నములన్నీ పోయినవి. మా కులము సుపూజితమైనది. రేపు ఉదయము యజ్ఞము యొక్క సమాప్తము అయినపుడు ఈ నరశ్రేష్ఠుడగు రాముని వివాహము చేయతగును".

ఋషుల మధ్యలో జనకుని యొక్క ఆ మాటలను విని మాటలలో శ్రేష్ఠుడైన ఆ నరాధిపుడు దశరథ మహారాజు ఆ జనకునితో ఇట్లు పలికెను.

" పూర్వకాలములో తీసుకొనువాడు ఇచ్చువాడి అధీనములో వుంటాడు అని వింటిని . ఓ ధర్మజ్ఞ నీవు ఏమి చెప్పెదవో అదేవిథముగా చెసెదను". సత్యవాది ధర్మిష్ఠుడగు ఆరాజుయొక్క యశస్కరమైన మాటలను విని మిథిలాధిపతి కి చాలా ఆశ్చర్యమువేసెను.

అప్పుడు మునిగణములు అందరూ పరస్పరము కలిసికొని అత్యంత ప్రేమతో ఆరాత్రిని గడిపిరి. అప్పుడు మహాతేజోవంతుడైన రాముడు విశ్వామిత్రునితో కలిసి లక్ష్మణునితో కలిసి తండ్రి పాదములను తాకెను. జనకుని చే బాగుగా పూజించబడి పుత్రులగు రామలక్ష్మణులను చూచి దశరథుడు పరమసంతోషముతో రాత్రి గడిపెను. మహాతేజోవంతుడైన జనకుడు యజ్ఞ క్రియలను ధర్మముగా అనుసరించి కుమార్తెల వివాహ సంబంధమైన క్రియలను కూడా చేసెను.

ఈ విథముగా శ్రీమద్ వాల్మీకి రామాయణములో బాలాకాండలో అరువది తొమ్మిదవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్ ||

జనకోs పి మహాతేజాః క్రియాం ధర్మేణ తత్త్వవిత్ |
యజ్ఞస్య చ సుతాభ్యాం చ కృత్వా రాత్రిమువాసహ||

మహాతేజోవంతుడైన జనకుడు యజ్ఞ క్రియలను ధర్మముగా అనుసరించి కుమార్తెల క్రియలను కూడా చేసెను.

 

|| om tat sat ||