Srimad Valmiki Ramayanam

Balakanda

Chapter 6 ... Dasaratha !!

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

బాలకాండ
ఆఱవ సర్గము

తస్యాం పుర్యాం అయోధ్యాయాం వేదవిత్ సర్వసంగ్రహః |
దీర్ఘదర్శీ మహాతేజాః పౌరజానపద ప్రియః ||
ఇక్ష్వాకూణాం అతిరథో యజ్వా ధర్మపరో వశీ |
మహర్షికల్పో రాజర్షిః త్రిషు లోకేషు విశ్రుతః ||
బలవాన్ నిహతామిత్రో మిత్రవాన్ విజితేంద్రియః |
ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః శక్ర వైశ్రవణోపమః ||
యథా మనుర్మహాతేజా లోకస్య పరిరక్షితా |
తథా దశరథోరాజా వసన్ జగదాపాలయత్ ||

తా|| అయోధ్యానగరములోనున్న దశరథ మహారాజు కోసలరాజ్యమును పరిపాలించెను. ఆ దశరథ మహారాజు వేదార్థములను పూర్తిగా తెలిసుకున్నవాడు, దూరదృష్టి గలవాడు, చాలా తేజస్సు కలవాడు, పురజనులకు జనపదమునుండు అందరికీ ప్రియమొనర్చువాడు, ఇక్ష్వాకు వంశములో అతిరథుడు , విధి యుక్తముగా యజ్ఞయాగాదులను చేయువాడు, ధర్మమును అనుసరించువాడు, ఈ విధముగా అందరినీ వశములోనుంచుకొనువాడు, మహర్షితో సమానమైనవాడు, రాజ ఋషి, ముల్లోకములలో ప్రసిద్ధుడు, బలవంతుడు , శతృవులను అంతముచేయగలిగిన వాడు, జితేంద్రియుడు , మిత్రులు గలవాడు, ధనములు తదితర నిధులు కలిగియుండుటలో ఇంద్రునితో కుబేరునితో సమానుడు, లోక పరిరక్షణ యందు మహాతేజముకల వైవస్వత మనువు వలె పరిపాలించువాడు.

తేన సత్యాభిసంధేన త్రివర్గం అనుతిష్ఠతా |
పాలితా సా పురీ శ్రేష్ఠా ఇంద్రేణేవ అమరావతీ ||
తస్మిన్ పురవరే హృష్ఠా ధర్మాత్మానో బహుశ్రుతాః |
వరాస్తుష్టా ధనైః స్వైః స్వైః అలుబ్ధాః సత్యవాదినః ||

తా|| సత్యసంధుడు, ధర్మమును అనుసరించి ధర్మ అర్థ కామములను మూడింటిని రక్షించువాడు అయిన ఆ మహారజు ఇంద్రుడు అమరావతిని పాలించినటుల పాలించుచుండెను. ఆ శ్రేష్ఠమైన నగరములో జనులు సంతోషముతో నుండిరి. ఆ జనులు ధర్మాత్ములు, అనేక శాస్త్రములను వినినవారు, తాము కష్ఠపడి సంపాదించిన ధనముతో తృప్తిచెందినవారు, సత్యము పలుకువారు.

నాల్పసన్నిచయః కశ్చిత్ ఆసీత్ తస్మిన్ పురోత్తమే |
కుటుంబీ యో హ్యసిద్ధార్థోSగవాశ్వ ధనధాన్యవాన్ ||
కామీ వా న కదర్యో వా నృశంసః పురుషః క్వచిత్ |
ద్రష్టుం శక్యం అయోధ్యాయాం న అవిద్వాన్ న చ నాస్తికః ||

తా|| అ ఉత్తమమైన నగరములో సంపన్నుడు కానివాడు, గోవులు అశ్వములు ధనధాన్యములులేనివాడు లేడు . వారు తమ సంపదలను ధర్మయుక్తముగా వినియోగించెడివారు. ఆ పురములో కామమునకు లొంగిన వాడు, లోభి , కౄరుడు , విద్యాహీనుడు, నాస్తికుడు గాని కానరారు.

సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః |
ఉదితాశ్శీలవృత్తభ్యాం మహర్షయః ఇవామలాః ||
నాకుండలో నామకుటీ నాస్రగ్వీ నాల్పభోగవాన్ |
నామృష్టో నానులిప్తాంగో నాసుగంధశ్చ విద్యతే ||

తా|| ఆనగరములో స్త్రీ పురుషులు ధర్మ ప్రవర్తనలో శ్రేష్ఠులు, నిగ్రహము కలవారు , సత్ స్వభావము కలవారు , సదాచారసంపన్నులు , మహాఋషులవలె నిర్మల హృదయముకలవారు. ఇంకా చెవికి కుండలములులేనివాడు , తలకు మకుటములేనివాడు, తనసంపదకు తగినటుల భోగములను అనుభవించనివాడు , అభ్యంగస్నానములను చేయనివాడు , సుగంధములను అనుభవించనివాడు , ఆ నగరములో లేడు .

నామృష్టభోజీ నాదాతా నాప్యనంగదనిష్కధృక్ |
నాహస్తాభరణో వాపి దృశ్యతే నాప్యనాత్మవాన్ ||
నానాహితాగ్నిః నాయజ్వా నక్శ్ షుద్రో వా న తస్కరః |
కశ్చిదాసీత్ అయోధ్యాయాం న చ నిర్వృతసంకరః ||

తా|| అచట ఆకలిగలవారు , అతిథి అభ్యాగతులను అనాదరము చేయువారు , అర్థులకు దానము చేయనివారు ఆ నగరములో లేరు. హస్తాభరణములను కంఠాభరణములను ధరించనివారు లేరు. అంతః కరణ శుద్ధి లేనివారు కూడా లేరు. ఆచట అగ్నికార్యములను చేయనివాడు, యాగములను ఆచరించనివాడు , చాలీ చాలని సంపదలు కలవాడు , దొంగలు, వర్ణసంకరులు గాని లేరు.

స్వకర్మనిరతా నిత్యం బ్రాహ్మణా విజితేంద్రియాః |
దానాధ్యయనశీలాశ్చ సంయతాశ్చ ప్రతిగ్రహే ||
న నాస్తికో నానృతకో న కశ్చిదబహుశ్రుతః |
న అసూయకో న చ అశక్తో న అవిద్వాన్ విద్యతే తదా ||
నాషడంగవిదత్రాసీత్ నావ్రతో నాసహస్రదః |
న దీనః క్షిప్తచిత్తో నా వ్యధితో నాపి కశ్చన ||

తా|| ఆచటి బ్రాహ్మణులు విధియుక్తమైన తమ తమ పనులలో శ్రేష్ఠులు , జితేంద్రియులు, దానశీలురు , జపము వేదాధ్యయనము చేసెడి స్వభావము గలవారు. వారు దానములను స్వీకరించుటలో విముఖులు. ఆ నగరములో నాస్తికులు, అసత్యవాదులు , శాస్త్రములను విననివారు , అసూయాపరులు , అశక్తులు, విద్వాంసులు కాని వారు లేరు. ఆ నగరమున వేదాంగములు తెలియనివారు , వ్రతములను ఆచరించనివారు , వేలకొలదీ దానములను చేయనివాడు , దీనుడు, వ్యాకులమైన మనస్సు గలవాడు , రోగపీడుతుడు గాని లేరు.

కశ్చిన్నరో వా నారీ వా నా శ్రీమాన్ నాప్య రూపవాన్ |
ద్రష్టుం శక్యం అయోధ్యాయాం నాపి రాజన్య భక్తిమాన్ ||
వర్ణే ష్వగ్రచతుర్థేషు దేవతా అతిథి పూజకాః |
కృతజ్ఞాశ్చ వదాన్యాశ్చ శూరా విక్రమసంయుతాః ||
దీర్ఘాయుషో నరాస్సర్వే ధర్మం సత్యం చ సంశ్రితాః |
సహితాః పుత్రపౌత్రైశ్చ నిత్యం స్త్రీభిః పురోత్తమే ||
క్షత్రం బ్రహ్మ ముఖంచాసీత్ వైశ్యాః క్షత్ర మనువ్రతాః |
శూద్రాః స్వధర్మ నిరతాః త్రీన్ వర్ణానుపచారిణః ||

తా|| స్త్రీ పురుషులలో శ్రీమంతులు గానివారు , రూపములేనివారు , రాజభక్తి లేని వారు ఆ నగరములో కనపడరు. ఆ నగరములో నాలుగువర్ణములవారు దేవతలను అతిథులను పూజించెడివారు, కృతజ్ఞత కలవారు, బ్రాహ్మణులు పాండిత్యముగలవారు , శూరులు పరాక్రమము గలవారు. ఆచటి నరులు అందరు సత్యమును ధర్మమును ఆచరించుటచే దీర్ఘమైన ఆయుస్సు గలవారు, భార్యపుత్రపౌత్రులతో కలిసి వుండెడివారు. అచటి క్షత్రియులు భ్రహ్మణులను గౌరవించెడివారు. వైశ్యులు క్షత్రియుల ఆజ్ఞలను పాటించెడివారు. శూద్రులు తమ ధర్మమును నిర్వర్తించుచూ ఆ మూడూ వర్ణములవారిని సేవించెడివారు .

సా తేన ఇక్ష్వాకునాథేన పురీ సుపరిరక్షితా |
యథా పురస్తాన్మనునా మానవేంద్రేణ ధీమతా ||

తా|| అట్టి నగరమును ఆ ఇక్ష్వాకు వంశజుడైన దశరథమహారాజు పూర్వకాలములో ప్రతిభావంతుడు మానవేంద్రుడు అయిన మనువు వలె పరిపాలించుచుండెను.

యోధానాం అగ్నికల్పానాం పేశలానామ్ అమర్షిణామ్ |
సంపూర్ణా కృతవిద్యానాం గుహా కేసరిణాం ఇవ ||
కాంభోజవిషయే జాతైః బాహ్లీకైశ్చ హయోత్తమైః |
వనాయుజైః నదీజైశ్చ పూర్ణా హరిహయోత్తమైః ||
వింధ్యపర్వతజై ర్మత్తైః పూర్ణా హైమవతైరపి |
మదాన్వితైరతిబలైః మాతంగైః పర్వ తోపమైః ||
ఇరావత కులీనైశ్చ మహాపద్మ కులైస్తథా |
అంజనాదపి నిష్పన్నైః వామనాదపి చ ద్విపైః ||

తా|| అచటి యోధులు పరాక్రమమున అగ్నివంటివారు . కుటిలత్వము లేనివారు. పరాభవము సహింపనివారు, అన్ని విధ్యలలో ఆరి తేరిన వారు. అట్టి యోధులచే నిండిన ఆ నగరము సింహముయొక్క గుహవలె దుర్భేద్యముగా నుండెను.
కాంభోజ దేశపు గుఱ్ఱములతోనూ , బాహ్లీకదేశపు ఉత్తమమైన అశ్వములతోనూ , వనాయురాజ్యపు అశ్వములతోనూ , నదీదేశపు ఉత్తమమైన అశ్వములతోనూ ఆ పురము నిండియుండెను. వింధ్యపర్వత ప్రాంతమున పుట్టిన మదపుటేనుగలతోనూ , హిమాలయపు మహాగజములతోనూ , మిక్కిలి బలించి మదించి పర్వతములవలెనున్న మాతంగములతోనూ , ఇరావతవంశమునకు చెందినవీ , మహాపద్మజాతి చెందినవీ , అంజన జాతికి చెందినవీ , వామనజాతిలో జన్మించినవీ అగు భద్రగజములతో ఆ పురము నిండియుండెను.

భద్రై ర్మంద్రై: మృగైశ్చైవ భద్రమంద్రమృగైస్తథా |
భద్రమంద్రైః భద్రమృగైః మృగమంద్రైశ్చ సా పురీ ||
నిత్యమత్తైః సదా పూర్ణా నాగైః అచలసన్నిభైః |||

తా|| భద్రజాతి గజములతోడనూ , మంద్రజాతి గజములతోడనూ , మృగజాతి గజములతోడనూ , అట్లే భద్ర మంద్ర, భద్రమృగ , మంద్రమృగ సంకర్షణముతో పుట్టిన గజములతోనూ , భద్ర మంద్ర మృగ మూడు జాతుల సంకర్షణముతో జన్మించిన గజములతోనూ ఆ నగరము నిండియుండెను.

సా యోజనే చ ద్వే భూయః సత్యనామా ప్రకాశతే |
యస్యాం దశరథో రాజా వసన్ జగదపాలయత్ ||
తామ్ పురీం స మహాతేజా రాజా దశరథో మహాన్ |
శశాస శమితామిత్రో నక్షత్రాణీవ చంద్రమాః ||

తా|| ఆ నగరము బయట రెండు యోజనముల మేరకు వ్యాపించియుండెను. సార్థక నామము గల ఆ అయోధ్యానగరమును దశరథమహారాజు పరిపాలించుచుండెను. రాజ శిరోమణి , మహాతేజోవంతుడు ఆయిన దశరథమహారాజు , చంద్రుడు తనకాంతితో నక్షత్రములను కాంతివిహీనము చేసినటుల తన శతృవులను తేజోవిహీనులను గావించుచూ పరిపాలించుచుండెను.

తాం సత్యనామాం దృఢతోరణార్గళాం
గృహైః విచిత్రైః ఉపశోభితాం శివామ్ |
పురీం అయోధ్యాం నృసహస్రసంకులాం
శశాస వై శక్రసమో మహీపతిః ||

తా|| ఆ నగరము పేరుకు తగినటుల ధృడమైన గడియలుగల ద్వారములతోనూ చిత్రములైన గృహములతోనూ, శోభిల్లుచుండెను. వేలకొలదీ పురజనులతో నిండియున్న ఆ అయోధ్యానగరమును ఇంద్ర సమానుడైన ఆ దశరథ మహారాజు పరిపాలించుచుండెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే
వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే షష్ఠః సర్గః ||

|| సమాప్తం ||
|| ఈ విధముగా శ్రీమద్రామాయణములో బాలకాండలో ఆఱవ సర్గ సమాప్తము. ||


|| om tat sat ||