Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 70

Vasishta narrates Ikshwaku lineage !!

||om tat sat||

బాలకాండ
సప్తతితమ స్సర్గః
( వసిష్ఠుడు ఇక్ష్వాకు వంశ చరిత్ర చెప్పుట)

తతః ప్రభాతే జనకః కృతకర్మా మహర్షిభిః |
ఉవాచ వాక్యం వాక్యజ్ఞః శతానందం పురోహితమ్ ||

స|| తతః ప్రభాతే మహర్షిభిః కృతకర్మా జనకః వాక్యజ్ఞః శతానందమ్ పురోహితమ్ (ఇదం) వాక్యం ఉవాచ ||

తా|| పిమ్మట ప్రభాత సమయమున మహర్షులు చేయవలసిన పనులు పూర్తి చేసి వాక్యజ్ఞుడైన జనకుడు పురోహితుడగు శతానందునితో ఈ వాక్యములను చెప్పెను.

భ్రాతా మమ మహాతేజా యవీయానతిధార్మికః |
కుశధ్వజైతి ఖ్యాతః పురీమ్ అధ్యవసత్ శుభామ్ ||
వార్యాఫలక పర్యంతాం పిబన్నిక్షుమతీం నదీమ్ |
సాంకాశ్యాం పుణ్యసంకాశాం విమానమివ పుష్పకమ్ ||

స|| మమ భ్రాతా మహాతేజా యవీయానతి ధార్మికః కుశధ్వజ ఇతి ఖ్యాతః వార్యా ఫలక పర్యంతం ఇక్షుమతీం నదీం పిబన్ ఇవ (శుభాం పురీం) పుణ్యసంకాశం పుష్పకం విమానమివ( శుభాం పురీం) సాంకశ్యాం శుభాం పురీం అధ్యవసత్||

స|| "నా తమ్ముడు అతి తేజోవంతుడు అతి ధార్మికుడు కుశధ్వజుడు అను పేరుపొందిన వాడు. అతడు ఇక్షుమతీ నదీ జలములను తాగుచున్నట్లు ఉన్న సాంకశ్యాఅనబడు పుణ్యనగరము పుష్పక విమానము వంటి శుభమైన నగరములో నివశించును".

తమహం ద్రష్టుమిచ్ఛామి యజ్ఞ గోప్తా స మే మతః |
ప్రీతిం సో sపిమహాతేజా ఇమాం భోక్తా మయా సహ ||

స|| తం యజ్ఞ గోఫ్తా అహం ద్రష్టుం ఇచ్ఛామి | సః అపి మహాతేజా మయా సహ ఇమాం భోక్తా | స మే మతః |

తా|| "యజ్ఞమునకు సహాయపడిన అతనిని చూచుటకు కోరికగానున్నది. మహాతేజోవంతుడైన అతడు కూడా నాతో ఇక్కడ ఆనందములో పాల్గొనవచ్చును అని నా అభిమతము".

ఏవముక్తేతు వచనే శతానందస్య సన్నిధౌ |
ఆగతాః కేచిదవ్యగ్రా జనకస్తాన్ సమాదిశత్ ||

స|| శతానందస్య సన్నిధౌ ఏవం ఉక్తే తు కేచిత్ అవ్యగ్రాః ఆగతాః | జనకః తాన్ సమాదిశత్ |

తా|| శతానందుని సన్నిధిలో ఇట్లు చెప్పబడుచుండగా కొందరు యోధులు అచటికి వచ్చిరి. జనకుడు వారిని అదేశించెను.

శాసనాత్తు నరేంద్రస్య ప్రయయు శ్శీఘ్రవాజిభిః |
సమానేతుం నరవ్యాఘ్రం విష్ణుమింద్రాజ్ఞయా యథా ||

స|| నరేంద్రస్య శాసనాత్ నరవ్యాఘ్రం సమానేతుం శీఘ్రవాజిభిః ప్రయయు యథా ఇంద్ర ఆజ్ఞయా విష్ణుం |

తా|| అ నరేంద్రుని ఆజ్ఞతో ఆ నరవ్యాఘ్రుని తీసుకువచ్చుటకు వేగముగాపోవు అశ్వములపై ఇంద్రుని ఆజ్ఞతో విష్ణువు వద్దకు పోయిన దూతలవలె వెళ్ళిరి.

సాంకాశ్యాం తే సమాగత్య దదృశుశ్చ కుశధ్వజమ్ |
న్యవేదయన్ యథావృత్తం జనకస్య చ చింతితమ్ ||
తద్వృత్తం నృపతిః శ్రుత్వా దూతశ్రేష్ఠైర్మహాబలైః |||
ఆజ్ఞయాథ నరేంద్రస్య ఆజగామ కుశధ్వజః |
స దదర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలమ్ ||

స|| తే సాంకాశ్యం సమాగత్య కుశధ్వజం దదృశుః చ | జనకస్య చింతితం యథావృత్తం న్యవేదయన్ చ| అథ నృపతిః కుశధ్వజః దూత శ్రేష్ఠైః మహాబలైః తత్ వృత్తం శ్రుత్వా నరేంద్రస్య ఆజ్ఞయా ఆజగామ ||సః మహాత్మానం జనకం ధర్మవత్సలం దదర్శ||

తా|| వారు సాంకాశ్యనగరము చేరి కుశధ్వజుని చూచిరి. జనకుని అలోచనలను యథాతథముగా నివేదించిరి. అప్పుడు కుశధ్వజ మహారాజు ఆ శ్రేష్ఠమైన బలశాలురైన దూతలద్వారా ఆ మాటలను విని జనకుని ఆజ్ఞానుసరించి బయలుదేరి వచ్చెను. ( వచ్చిన పిమ్మట) మహాత్ముడు ధర్మవత్సలుడు అగు జనకుని చూచెను.

సోs భివాద్య శతానందం రాజానం చాపి ధార్మికమ్ |
రాజార్హం పరమం దివ్యం ఆసనం చాధ్యరోహత ||

స|| సః ధార్మికం రాజానం శతానందం అపి అభివాద్య రాజార్హం పరమం దివ్యం ఆసనం అధ్యరోహిత చ ||

తా|| ఆతడు ధార్మికుడగు రాజుకి శతానందునికి అభివాదమొనర్చి రాజులకు తగు దివ్యమైన ఆసనముపై కూర్చునెను.

ఉపవిష్టావుభౌ తౌ తు భ్రాతరావతి తేజసా |
ప్రేషయమాసతుర్వీరౌ మంత్రి శ్రేష్ఠం సుదామనమ్||

స|| తౌ ఉభౌ వీరౌ భ్రాతరాః అతి తేజసా ఉపవిష్టౌ మంత్రి శ్రేష్ఠం సుదామనమ్ ప్రేషయామాస ||

తా|| ఆతి తేజస్సు గల వీరులు అగు సోదరులు కూర్చుని మంత్రిశ్రేష్ఠుడగు సుదామనుని పిలిపించిరి.

గచ్ఛ మంత్రిపతే శీఘ్రం ఇక్ష్వాకుం అమితప్రభమ్ |
ఆత్మజైస్సహ దుర్దర్షం ఆనయస్వ స మంత్రిణమ్ ||

స|| మంత్రిపతే ! శీఘ్రం గచ్ఛ అమిత ప్రభం ఇక్ష్వాకుం దుర్ధర్షం ఆత్మజైః సహ స మంత్రిణం ఆనయస్వ ||

తా|| "ఓ మంత్రివర్యా! శీఘ్రముగా వెళ్ళి అత్యంత తేజముకల , జయింపబడని ఇక్ష్వాకు మహరాజుని తన పుత్రులతో మంత్రులతో తీసుకు రమ్ము".

ఔపకార్యం స గత్వా తు రఘూణాంకులవర్థనమ్|
దదర్శ శిరసా చైనం అభివాద్యేదమబ్రవీత్ ||

స|| స ఔపకార్యం గత్వా రఘూణాం కులవర్ధనమ్ దదర్శ శిరసా చ ఏనంఅభివాద్య ఇదం అబ్రవీత్ |

తా|| అతడు వెళ్ళి రఘుకులోత్తముని చూచి శిరస్సువంచి నమస్కరించి ఇట్లు పలికెను.

అయోధ్యాధిపతేర్వీర వైదేహో మిథిలాధిపః |
స త్వాం దృష్టుం వ్యవసితః సోపాద్ధ్యాయ పురోహితమ్||

స|| హే వీర అయోధ్యాధిపతే | మిథిలాధిపః వైదేహః సః స ఉపాధ్యాయ పురోహితం త్వాం దృష్టుం వ్యవసితః ||

తా||" ఓ వీర ! అయోధ్యాధిపతి ! మిథిలానగరపు రాజు వైదైహుడు పురోహితులు ఉపాధ్యాయులతో కూడిన మిమ్ములను చూచుటకు కోరికగలవాడు".

మంత్రిశ్రేష్ఠవచః శ్రుత్వా రాజా సర్షిగణస్తదా |
సబంధురగమత్ తత్ర జనకో యత్ర వర్తతే ||

స|| మంత్రిశ్రేష్ఠ వచః శ్రుత్వా తదా రాజా స ఋషిగణః సబంధుః యత్ర జనకః వర్తతే తత్ర ఆగమత్ ||

తా|| ఆ మంత్రివర్యుని వచనములను వినిన పిమ్మట ఆ రాజు ఋషిగణములు బంధువులు తో కలిసి జనకుడు ఉన్నచోటికి వెళ్ళెను.

స రాజా మంత్రి సహితః సోపాధ్యాయ స్సబాంధవః |
వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠో వైదేహమిదమబ్రవీత్ ||

స|| మంత్రిసహితః స ఉపాధ్యాయ స బాంధవః సః వాక్యవిదాం శ్రేష్ఠః రాజా వైదేహం ఇదం అబ్రవీత్ ||

తా|| మంత్రులతోనూ ఉపాధ్యాయులతోనూ బంధువులతో కూడి వాక్యకోవిదుడైన రాజు జనకునితో ఇట్లు పలికెను.

విదితం తే మహారాజ ఇక్ష్వాకుకుల దైవతమ్ |
వక్తా సర్వేషు కృత్యేషు వసిష్ఠో భగవాన్ ఋషిః ||

స|| మహారాజ వసిష్ఠః భగవాన్ ఋషిః ఇక్ష్వాకు కులదైవతం సర్వేషు కృత్యేషు వక్తా (ఇతి) విదితం ||

తా|| "ఓ మహారాజ ! భగవాన్ వసిష్ఠుడు మహర్షి ఇక్ష్వాకు కులదైవము ఆని అన్ని కార్యములలో మాకు మార్గమును చూపించునని తెలిసిన విషయమే" ||

విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః సహ సర్వైర్మహర్షిభిః |
ఏష వక్ష్యతి ధర్మాత్మా వసిష్ఠో మే యథాక్రమమ్ ||

స|| ధర్మాత్మా వసిష్ఠః విశ్వామిత్రాభ్యనుజ్ఞాతః సర్వైః మహర్షిభిః సహ ఏష వక్ష్యతి మే యథాక్రమమ్ ||

తా|| "ధర్మాత్ముడగు వసిష్ఠుడు విశ్వామిత్రుని అంగీకారముతో మహర్షులందరితో కూడి మాగురించి చెప్పవలసిన రీతిగా చెప్పును".

ఏవముక్త్వా నరశ్రేష్ఠే రాజ్ఞాం మధ్యే మహాత్మనామ్ |
తూష్ణీం భూతే దశరథే వసిష్ఠో భగవాన్ ఋషిః ||
ఉవాచ వాక్యం వాక్యజ్ఞో వైదేహం స పురోధసమ్ |||

స|| దశరథే నరశ్రేష్ఠే రాజ్ఞాంమధ్యే మహాత్మనామ్ ఏవం ఉక్త్వా తూష్ణీం భూతే వాక్యజ్ఞో భగవాన్ ఋషిః వైదేహం స పురోధసం వాక్యం ఉవాచ ||

తా|| నరశ్రేష్ఠుడైన ఆ దశరథమహారాజు ఆ రాజుల సమక్షములో ఇట్లు పలికి మిన్నకుండగా వాక్యజ్ఞుడైన భగవంతునితో సమానమైన ఋషివర్యుడు వైదేహునితో అతని పురోహితునితో ఇట్లు పలికెను.

అవ్యక్త ప్రభవో బ్రహ్మ శాశ్వతో నిత్య అవ్యయః |
తస్మాన్మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపస్సుతః |
వివస్వాన్ కాశ్యపాజ్జజ్ఞే మనుర్వైవస్వతః స్మృతః ||

స||అవ్యక్తప్రభవో బ్రహ్మ శాశ్వతః నిత్యః అవ్యయః | తస్మాత్ మరీచిః సంజజ్ఞే | మరీచేః సుతః కాశ్యపః| కాశ్యపాత్ జజ్ఞే వివస్వాన్ | మనుః వైవస్వతః స్మృతః |

తా|| "అవ్యక్తమైన భగవత్స్వరూపమునుంచి ఉదయించిన బ్రహ్మ శాశ్వతుడు నిత్యుడు. అతనినుంచి మరీచుడు జన్మించెను. మరీచుని సుతుడు కాశ్యపుడు. కాశ్యపుని నుంచి వివస్వతుడు . మనువు వివస్వతునినుంచి జన్మించెను".

మనుః ప్రజాపతిపూర్వం ఇక్ష్వాకుస్తు మనోః సుతః |
తమిక్ష్వాకుం అయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకమ్ ||

స|| మనుః పూర్వమ్ ప్రజాపతిః | మనోః సుతః ఇక్ష్వాకుః అస్తు| పూర్వకం తం ఇక్ష్వాకుం అయోధ్యాయాం రాజానం విద్ధి |

తా|| "మనువు మొదటి ప్రజాపతి. మను యొక్క పుత్రుడు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకుని అయోధ్యాధిపతిగా ఎఱుంగుము".

ఇక్ష్వాకోs స్తు సుత శ్శ్రీమాన్ కుక్షిరిత్యేవ విశ్రుతః |
కుక్షేరథాత్మజ శ్శ్రీమాన్ వికుక్షి రుదపద్యత ||

స|| ఇక్ష్వాకః సుతః శ్రీమాన్ కుక్షిః ఇతి విశ్రుతః ఏవ | అథ కుక్షేః ఆత్మజ వికుక్షిః ఉపపద్యత |

తా|| "ఇక్ష్వాకుని సుతుడు కుక్షి అని విదితము. ఆ కుక్షి సుతుడు వికుక్షి" .

వికుక్షేస్తు మహాతేజా బాణః పుత్త్రః ప్రతాపవాన్ |
బాణస్యతు మహాతేజా ఆనరణ్యః ప్రతాపవాన్ ||

స|| వికుక్షే పుత్త్రః మహాతేజా ప్రతాపవాన్ బాణః అస్తు| బాణస్యతు ( సుతః) మహాతేజా ప్రతాపవాన్ అనరణ్యః (అస్తు)|

తా|| "వికుక్షి పుత్రుడు మహాతేజోవంతుడైన బాణుడు. బాణుని యొక్క పుత్రుడు మహాతేజోవంతుడైన అనరణ్యుడు".

అనరణ్యాత్ పృథుర్జజ్ఞే త్రిశంకుస్తు పృథోసుతః |
త్రిశంకోరభవత్ పుత్త్రో దుందుమారో మహాయశాః ||
దుందుమారాన్మహాతేజా యువనాశ్వోవ్యజాయత్ |||

స|| అనరణ్యాత్ జజ్ఞే పృథుః | పృథోః సుతః త్రిశంకుః అస్తు | త్రిశంకోః పుత్త్రః మహాయశాః దుందుమారో అస్తు | దుందుమారాత్ మహాతేజా యువనాశ్వో అజాయత ||

తా|| "అనరుణ్యుని పుత్రుడు పృథు. పృథుని పుత్రుడు త్రిశంకు. త్రిశంకుని పుత్రుడు మహాయశోవంతుడైన దుందుమారుడు. దుందుమారుని పుత్రుడు యవనాశ్వుడు".

యువనాశ్వసుతస్త్వాసీత్ మాంధాత పృథివీపతిః|
మాంధాతుస్తు సుతశ్శ్రీమాన్ సుసంధిరుదపద్యత ||

స||యువనాశ్వస్య సుతః పృథివీపతిః మాంధాత ఆసీత్ | మాంధాతస్య సుతః శ్రీమాన్ సుసంధిః ఉపపద్యత ||

తా|| "యవనాశ్వుని పుత్రుడు మాంధాత. మాంధాతుడు శ్రీమంతుడైన సుసంధికి జన్మనిచ్చెను".

సుసంధేరపి పుత్త్రౌ ద్వౌ ధ్రువసంధిః ప్రసేనజిత్ |
యశస్వీ ధ్రువసంధిస్తు భరతో నామనామతః ||
భరతాత్తు మహాతేజా అసితో నామ జాతవాన్ ||

స|| సుసంధేః ద్వౌ పుత్రౌ ధ్రువసంధిః ప్రసేనజిత్ ఆసీత్ | యశస్వీ ధ్రువసంధిస్తు భరతో నామ నామతః ( సుతః అస్తు)| భరతాత్ తు మహాతేజా అసితః నామ ( పుత్రః) జాతవాన్ |

తా||" సుసంధుని కి ఇద్దరు పుత్రులు ధ్రువ సంధి ప్రశేనజిత్ అని. యశస్వీ అయిన ధ్రువసంధి కి భరతుడను పేరుగల వాడు పుట్టెను. భరతునికి మహాతేజోవంతుడైన అసితుడు కలిగెను".

యస్యైతే ప్రతిరాజాన ఉదపద్యంత శత్రవః |
హైహయాస్తాలజంఘాశ్చ శూరాశ్చ శశిబిందవః ||

స|| యస్య ప్రతి శూరాః హైహేయాః తాలజంఘాః శశిబిందవః రాజానః శత్రవః ఉదపద్యంత||

తా|| "అతనికి రాజులు హేహైయా తాలజంఘ శశిబిందు అనబడు వీరులు శత్రువులు అయిరి".

తాంస్తు స ప్రతియుధ్యన్ వై యుద్ధే రాజా ప్రవాసితః |
హిమవంతం ఉపాగమ్య భృగు ప్రస్రవణే sవసత్ ||
అసితోల్పబలో రాజా మంత్రిభిః సహితస్తదా |
ద్వే చాస్య భార్యే గర్భిణ్యౌ బభూవతురితి శ్రుతమ్ ||

స|| తాంస్తు యుద్ధే అప్రతియుధ్యన్ వై రాజా ప్రవాసితః | సః అల్పబలః రాజా అసితః మంత్రిభిః సహితః హిమవంతం ఉపాగమ్య భృగు ప్రశ్రవణే అవసత్ || అస్య ద్వే భార్యే గర్భిణ్యౌ బభూవతుః ఇతి శ్రుతమ్ ||

తా|| "వారితో యుద్ధములో ప్రతియుద్ధము చేయలేక రాజు ప్రవాశితుడయ్యెను. అ తక్కువ బలముగల రాజు మంత్రులతో కూదా హిమవత్పర్వతములను చేరి భృగు ప్రశ్రవనములో నివశించుచుండెను. అతనికి ఇద్దరి భార్యలు గర్భిణులు అని వినడమైనది".

ఏకా గర్భ వినాశాయ సపత్న్యై సగరం దదౌ |
తతశ్శేలవరం రమ్యం బభూవాభిరతో మునిః|
భార్గవశ్చ్యవనో నామ హిమవంతముపాశ్రితః ||

స|| ఏకా భార్యా గర్భవినాశాయ సపత్న్యై సగరమ్ దదౌ | తతః రమ్యం శైల వరం హిమవంతం ఉపాశ్రితః భార్గవశ్చ్యవనో నామ మునిః భభూవ ||

తా|| "ఒక భార్య గర్భవినాశనము కొఱకు తన తోకూడిన సపత్నికి విషము ఇచ్చెను. అచట ఆ రమ్యమైన శ్రేష్ఠమైన హిమవంతములో భార్గవచ్యవనుడను ముని ఉండెను".

తత్రైకా తు మహాభాగా భార్గవం దేవవర్చసమ్ |
వవందే పద్మపత్రాక్షీ కాంక్షంతీ సుతమాత్మనః ||

స|| తత్ర ఏకా మహాభాగా పద్మపత్రాక్షీ ఆత్మనః సుతం కాంక్షంతీ దేవ వర్చసం భార్గవం వవందే ||

తా|| "ఆ పద్మము వంటి కళ్ళు గల మహాలక్ష్మి తనకు పుత్రుడు కావలనని కోరికతో ఆ భార్గవునకు వందనము చేసెను".

తం ఋషిం సాభ్యుపాగమ్య కాళిందీ చాభ్యవాదయత్ |
స తామభ్యవదద్విప్రః పుత్త్రేప్సుం పుత్త్రజన్మని ||

స|| సా కాళిందీ తం ఋషిం అభి ఉపాగమ్య అభ్యవాదయత్ చ | పుత్రేప్సుం పుత్రజన్మని తం సః విప్రః అభ్యవదత్ ||

తా|| "ఆ కాళింది ఆ ఋషిని సమీపించి అభివాదము చేసెను. పుత్రుడుకావలనను కోరికతో పుత్రుడు జన్మించుటకు కోరిన ఆమెతో ఆ విప్రుడు ఇట్లు చెప్పెను".

తవకుక్షౌ మహభాగే సుపుత్త్రసుమహాబలః |
మహావీర్యో మహాతేజా అచిరాత్ సంజనిష్యతి ||
గరేణ సహిత శ్శ్రీమాన్ మాశుచః కమలేక్షణే |

స|| మహాభాగే తవ కుక్షౌ సుమహాబలః సుపుత్త్రః మహావీర్యః మహాతేజా అచిరాత్ సంజనిష్యతి || కమలేక్షణే శ్రీమాన్ గరేణ సహితః మాశుచః ||
తా|| " ఓ మహాభాగా నీకు గర్భములో మంచి మహావీరుడగు మహాతేజోవంతుడగు త్వరలో జన్మించెదడు. ఓ కమలాక్షి ! అతడు విషమును సహించగలడు భయము లేదు".

చ్యవనం తు నమస్కృత్య రాజపుత్రీ పతివ్రతా |
పతిశోకతురా తస్మాత్ పుత్త్రం దేవీ వ్యజాయత ||

స|| పతిశోకతురా పతివ్రతా రాజపుత్రీ చ్యవనం నమస్కృత్య పుత్త్రం దేవీ వ్యజాయత ||

తా|| "పతిశోకములో నున్న ఆ పతివ్రత రాజపుత్రి చ్యవనునికి నమస్కరించి పుత్రుని పొందెను".

సపత్న్యా తు గరస్తస్యై దత్తో గర్భజిఘాంసయా |
సహ తేన గరేణైవ జాత స్స సగరోs భవత్ ||

స|| సపత్న్యా గరః తస్యై గర్భ జింఘాసయా దత్తః తేన గరేణైవ సహ జాతః సః సగరో అభవత్ ||

తా|| "సపత్నీ ద్వ్రారా గర్భచ్ఛిన్నము కోసము విషము ఇవ్వబడినను విషముతో కూడాపుట్టిన వాడగుటచే సగరుడు అనబడెను".

సగరస్యాసమంజస్తు అసమంజాత్ తథాంశుమాన్ |
దిలీపోంశుమతః పుత్త్రో దిలీపస్య భగీరథః ||

స|| సగరస్యాః అసమంజః అస్తు | తథా అసమంజాత్ అంశుమాన్ | అంశుమతః పుత్త్రో దిలీపః | దిలీపస్య భగీరథః |

తా|| "సగరునికి అసమంజుడు అలాగే అసమంజునికి అంశుమంతుడు కలిగెను. అంశుమతునికి దిలీపుడు దిలీపునికి భగీరథుడు కలిగిరి".

భగీరథాత్ కకుత్ స్థశ్చ కకుత్ స్థస్యరఘుస్సుతః |
రఘోస్తు పుత్త్ర స్తేజస్వీ ప్రవృద్ధః పురుషాదకః ||

స|| భగీరథాత్ కకుత్‍స్థః చ | కకుత్‍స్థస్య సుతః రఘుః | రఘోః పుత్త్రః తేజస్వీ పురుషాదకః ప్రవృద్ధః అస్తు |

తా||" భగీరథునకు కకుత్‍స్థుడు కకుత్‍శ్థునికి రఘు కలిగిరి.రఘుపుత్రుడు తేజస్వి అగు ప్రవృద్ధుడు అయ్యెను" |

కల్మాషపాదో హ్యభవత్ తస్మాజ్జాతస్తు శంఖణః |
సుదర్శన శ్శంఖణస్య అగ్నివర్ణ స్సుదర్శనాత్ ||

స|| (ప్రవృద్ధః) కల్మషాదో హి అభవత్ | తస్మాత్ జాతస్తు శంఖణః | శంఖణస్య (సుతః) సుదర్శనః | సుదర్శనాత్ అగ్నివర్ణః |

తా||" ప్రవృద్ధుడు కల్మషాదుడు అయ్యెను. అతనికి శంఖణుడు కలిగెను. సంఖణుని పుత్రుడు సుదర్శనుడు.సుదర్శనునికి అగ్నివర్ణుడు కలిగెను".

శీఘ్రగస్త్వగ్నివర్ణస్య శీఘ్రగస్య మరుస్సుతః |
మరోః ప్రశుశ్రుక స్త్వాసీత్ అంబరీషః ప్రశుశ్రుక్రాత్ ||

స|| అగ్నివర్ణస్య (సుతః) శీఘ్రః | శీఘ్రగస్య సుతః మరుః| మరోః ప్రశుశుకః ఆసీత్ | ప్రశుశుకాత్ అంబరీషః |

తా|| "అగ్నివర్ణుని పుత్రుడు శీఘ్రుగుడు. శీఘ్రుగుని పుత్రుడు మరు. మరుని పుత్రుడు ప్రశుశుకుడు. ప్రశుశుకునికి అంబరీషుడు కలిగెను".

అంబరీషస్య పుత్త్రో sభూత్ నహూషః పృథివీపతిః|
నహుషస్య యయాతిస్తు నాభాగస్తు యయాతిజః ||

స|| అంబరీషస్య పుత్రః పృథివీపతిః నహూషః అభూత్ | నహూషస్య యయాతి అస్తు| యయాతిజః సుతః నాభాగ అస్తు |

తా|| "అంబరీషునికి పృథివీపతి అగు నహూషుడు కలిగెను. నహూషునకు యయాతి కలిగెను. యయాతి పుత్రుడు నాభాగుడు".

నాభాగస్య బభూవాజో అజా ద్దశరథో sభవత్|
అస్మాద్దశరథా జ్జాతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ||

స|| నాభాగస్య అజః సుతః బభూవ | అజాత్ సుతః దశరథో అభవత్ | అస్మాత్ దశరథౌ జాతౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ ||

తా|| "నాభాగుని పుత్రుడు అజుడు. అజుని పుత్రుడు దశరథుడు. ఆ దశరథునకు జన్మించిన సోదరులు రామలక్ష్మణులు".

ఆదివంశ విశుద్ధానాం రాజ్ఞాం పరమ ధార్మిణామ్ |
ఇక్ష్వాకుకుల జాతానాం వీరాణాం సత్యవాదినామ్ ||

స|| ఇక్ష్వాకుకుల జాతానాం రాజ్ఞాం ఆదివంశ విశుద్ధానాం పరమ ధార్మిణాం సత్యవాదినాం ||

తా|| "ఇక్ష్వాకుకులములో జన్మించిన రాజులు శుద్ధమైన ఆదివంశము వారు. అత్యంత ధార్మికులు. సత్యవాదులు".

రామలక్ష్మణయోరర్థే త్వత్సుతే వరయే నృప |
సదృశాభ్యాం నరశ్రేష్ఠ సదృశే దాతుమర్హసి ||

స|| హే నృప ! రామ లక్ష్మణయోః అర్థే త్వత్ సుతే వరయే | హే నరశ్రేష్ఠ సదృశాభ్యాం సదృసే దాతుం అర్హసి ||

తా|| "ఓ రాజా! రామలక్ష్మణులు నీ కుమార్తెలకు తగిన వరులు . ఓ నరశ్రేష్ఠ ! తగిన వారికి తగిన వారిని ఇచ్చుటకు తగును"

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్తతితమ స్సర్గః ||
సమాప్తం ||

 

 

 

 

||om tat sat||