Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 70

Vasishta narrates Ikshwaku lineage !!

||om tat sat||

తతః ప్రభాతే జనకః కృతకర్మా మహర్షిభిః |
ఉవాచ వాక్యం వాక్యజ్ఞః శతానందం పురోహితమ్ ||

తా|| పిమ్మట ప్రభాత సమయమున మహర్షులు చేయవలసిన పనులు పూర్తి చేసి వాక్యజ్ఞుడైన జనకుడు పురోహితుడగు శతానందునితో ఈ వాక్యములను చెప్పెను.

బాలకాండ
సప్తతితమ స్సర్గః
( వసిష్ఠుడు ఇక్ష్వాకు వంశ చరిత్ర చెప్పుట)

పిమ్మట ప్రభాత సమయమున మహర్షులు యజ్ఞము కోసము చేయవలసిన పనులు పూర్తి చేసి వాక్యజ్ఞుడైన జనకుడు పురోహితుడగు శతానందునితో ఈ వాక్యములను చెప్పెను. "నా తమ్ముడు అతి తేజోవంతుడు అతి ధార్మికుడు కుశధ్వజుడు అను పేరుపొందిన వాడు. అతడు ఇక్షుమతీ నదీ జలములను తాగుచున్నట్లు ఉన్న సాంకశ్యాఅనబడు పుణ్యనగరము , పుష్పక విమానము వలె నుండు శుభమైన నగరములో నివశించును. యజ్ఞమునకు సహాయపడిన అతనిని చూచుటకు కోరికగానున్నది. మహాతేజోవంతుడైన అతడు కూడా నాతో ఇక్కడ ఆనందములో పాల్గొనవచ్చును అని నా అభిమతము". శతానందుని సన్నిధిలో ఇట్లు చెప్పబడుచుండగా కొందరు యోధులు అచటికి వచ్చిరి. జనకుడు వారిని కుశధ్వజుని తీసుకు వచ్చుటకు అదేశించెను.

అ నరేంద్రుని ఆజ్ఞతో ఆ కుధ్వజుని తీసుకువచ్చుటకు ఇంద్రుని ఆజ్ఞతో విష్ణువు వద్దకు పోయిన దూతలవలె వేగముగాపోవు అశ్వములపై వెళ్ళిరి. వారు సాంకాశ్యనగరము చేరి కుశధ్వజుని చూచిరి. జనకుని అలోచనలను యథాతథముగా నివేదించిరి. అప్పుడు కుశధ్వజ మహారాజు ఆ శ్రేష్ఠమైన బలశాలురైన దూతలద్వారా ఆ మాటలను విని జనకుని ఆజ్ఞానుసరించి బయలుదేరి మిథిలానగరము వచ్చెను. పిమ్మట కుశధ్వజుడు మహాత్ముడు ధర్మవత్సలుడు అగు జనకుని చూచెను. ధార్మికుడగు జనక మహారాజుకి శతానందునికి అభివాదమొనర్చి రాజులకు తగు దివ్యమైన ఆసనముపై కూర్చునెను. పిమ్మట ఆతి తేజస్సు గల వీరులు అగు సోదరులు కూర్చుని మంత్రిశ్రేష్ఠుడగు సుదామనుని పిలిపించిరి. "ఓ మంత్రివర్యా! శీఘ్రముగా వెళ్ళి అత్యంత తేజముకల , జయింపబడని ఇక్ష్వాకు మహరాజుని తన పుత్రులతో మంత్రులతో తీసుకు రమ్ము".

అతడు వెళ్ళి రఘుకులోత్తముని చూచి శిరస్సువంచి నమస్కరించి ఇట్లు పలికెను. "ఓ వీర ! అయోధ్యాధిపతి ! మిథిలానగరపు రాజు వైదైహుడు పురోహితులు ఉపాధ్యాయులతో కూడిన మిమ్ములను చూచుటకు కోరికగలవాడు". ఆ మంత్రివర్యుని వచనములను వినిన పిమ్మట ఆ దశరథ మహరాజు ఋషిగణములు బంధువులు తో కలిసి జనకుడు ఉన్నచోటికి వెళ్ళెను.

వాక్యకోవిదుడైన దశరథ మహారాజు మంత్రులతోనూ ఉపాధ్యాయులతోనూ బంధువులతో కూడి జనక మహరాజు తో ఇట్లు పలికెను. "ఓ మహారాజ ! భగవాన్ వసిష్ఠుడు మహర్షి ఇక్ష్వాకు కులదైవము ఆని, ఆయన అన్ని కార్యములలో మాకు మార్గమును చూపించునని తెలిసిన విషయమే. ధర్మాత్ముడగు వసిష్ఠుడు విశ్వామిత్రుని అంగీకారముతో మహర్షులందరితో కూడి మాగురించి చెప్పవలసిన రీతిగా చెప్పును". నరశ్రేష్ఠుడైన ఆ దశరథమహారాజు ఆ రాజుల సమక్షములో ఇట్లు పలికి మిన్నకుండెను.

అప్పుడు వాక్యజ్ఞుడైన భగవంతునితో సమానమైన ఋషివర్యుడు వసిష్ఠుడు వైదేహునితో అతని పురోహితునితో ఇట్లు పలికెను.

" అవ్యక్తమైన భగవత్స్వరూపమునుంచి ఉదయించిన బ్రహ్మ శాశ్వతుడు నిత్యుడు. అతనినుంచి మరీచుడు జన్మించెను. మరీచుని సుతుడు కాశ్యపుడు. కాశ్యపుని నుంచి వివస్వతుడు . మనువు వివస్వతునినుంచి జన్మించెను. మనువు మొదటి ప్రజాపతి. మను యొక్క పుత్రుడు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకుని అయోధ్యాధిపతిగా ఎఱుంగుము. ఇక్ష్వాకుని సుతుడు కుక్షి అని విదితము. ఆ కుక్షి సుతుడు వికుక్షి. వికుక్షి పుత్రుడు మహాతేజోవంతుడైన బాణుడు. బాణుని యొక్క పుత్రుడు మహాతేజోవంతుడైన అనరణ్యుడు. అనరుణ్యుని పుత్రుడు పృథు. పృథుని పుత్రుడు త్రిశంకు. త్రిశంకుని పుత్రుడు మహాయశోవంతుడైన దుందుమారుడు. దుందుమారుని పుత్రుడు యవనాశ్వుడు.
యవనాశ్వుని పుత్రుడు మాంధాత. మాంధాతుడు శ్రీమంతుడైన సుసంధికి జన్మమునిచ్చెను. సుసంధుని కి ఇద్దరు పుత్రులు ధ్రువ సంధి ప్రశేనజిత్ అని. యశస్వీ అయిన ధ్రువసంధి కి భరతుడను పేరుగల వాడు పుట్టెను. భరతునికి మహాతేజోవంతుడైన అసితుడు కలిగెను".

వసిష్ఠుడు ఇక్ష్వాకు వంశ చరిత్ర చెప్పసాగెను.

"అసితునికి హేహైయా తాలజంఘ శశిబిందు అనబడు రాజులు వీరులు శత్రువులు అయిరి. వారితో యుద్ధములో ప్రతియుద్ధము చేయలేక రాజు ప్రవాశితుడయ్యెను. అ తక్కువ బలముగల రాజు మంత్రులతో కూడా హిమవత్పర్వతములను చేరి భృగు ప్రశ్రవణములో నివశించుచుండెను. అతనికి ఇద్దరి భార్యలు గర్భిణులు అని వినడమైనది. ఒక భార్య గర్భవినాశనముకొఱకు తన సపత్నికి విషము ఇచ్చెను. అచట ఆ రమ్యమైన శ్రేష్ఠమైన హిమవంతములో భార్గవచ్యవనుడను ముని ఉండెను. ఆ పద్మమువంటి కళ్ళు గల మహాలక్ష్మికాళింది తనకు పుత్రుడు కావలనని కోరికతో ఆ భార్గవునకు వందనము చేసెను. పుత్రుడుకావలనను కోరికతో పుత్రుడు జన్మించుటకు కోరిక గల ఆమెతో ఆ విప్రుడు ఇట్లు చెప్పెను. ’ ఓ మహాభాగా నీకు గర్భములో మంచి మహావీరుడగు మహాతేజోవంతుడగు త్వరలో జన్మించెదడు. ఓ కమలాక్షి ! అతడు విషమును సహించగలడు భయము లేదు’. పతిశోకములో నున్న ఆ పతివ్రత రాజపుత్రి చ్యవనునికి నమస్కరించి పుత్రుని పొందెను. సపత్నీ ద్వ్రారా గర్భచ్ఛిన్నముకోసము విషము ఇవ్వబడినను విషముతో కూడా పుట్టిన వాడగుటచే అతడు సగరుడు అనబడెను".

"సగరునికి అసమంజుడు అలాగే అసమంజునికి అంశుమంతుడు కలిగెను. అంశుమతునికి దిలీపుడు దిలీపునికి భగీరథుడు కలిగిరి. భగీరథునకు కకుత్‍స్థుడు కకుత్‍శ్థునికి రఘు కలిగిరి. రఘుపుత్రుడు తేజస్వి అగు ప్రవృద్ధుడు అయ్యెను | ప్రవృద్ధుడు కల్మషాదుడు అయ్యెను. అతనికి శంఖణుడు కలిగెను. శంఖణుని పుత్రుడు సుదర్శనుడు.సుదర్శనునికి అగ్నివర్ణుడు కలిగెను. అగ్నివర్ణుని పుత్రుడు శీఘ్రగుడు. శీఘ్రగుని పుత్రుడు మరు. మరుని పుత్రుడు ప్రశుశుకుడు. ప్రశుశుకునికి అంబరీషుడు కలిగెను. అంబరీషునికి పృథివీపతి అగు నహూషుడు కలిగెను. నహూషునకు యయాతి కలిగెను. యయాతి పుత్రుడు నాభాగుడు".

"నాభాగుని పుత్రుడు అజుడు. అజుని పుత్రుడు దశరథుడు. ఆ దశరథునకు జన్మించిన సోదరులు రామలక్ష్మణులు".

"ఓ రాజా ! ఇక్ష్వాకుకులములో జన్మించిన రాజులు సూర్యవంశము వారు. అత్యంత ధార్మికులు. సత్యవాదులు".

"ఓ రాజా రామలక్ష్మణులు నీ కుమార్తెలకు తగిన వరులు . ఓ జనక మహారాజా ! తగిన వారికి తగిన వారిని ఇచ్చుటకు తగును ."

ఈ విథముగా బాలకాండలో డెబ్బయవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్ ||

రామలక్ష్మణయోరర్థే త్వత్సుతే వరయే నృప |
సదృశాభ్యాం నరశ్రేష్ఠ సదృశే దాతుమర్హసి ||

"ఓ రాజా రామలక్ష్మణులు నీ కుమార్తెలకు తగిన వరులు . ఓ నరశ్రేష్ఠ తగిన వారికి తగిన వారిని ఇచ్చుటకు తగును

||ఓమ్ తత్ సత్ ||

 

 

 

 

||om tat sat ||