Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 72

The Four marriages !!

||om tat sat ||

తముక్తవంతం వైదేహం విశ్వామిత్రో మహామునిః |
ఉవాచ వచనం వీరం వసిష్ఠసహితో నృపమ్ ||
"అట్లు వీరుడైన విదేహమహరాజు చే చెప్పబడిన వసిష్టునితో కూడిన మహాముని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను".

బాలకాండ
ద్విసప్తతితమస్సర్గః
( శ్రీరామ లక్ష్మణ భరత శతృఘ్నలకు సీత ఊర్మిళా మాండవీ శ్రుతకీర్తులను ఇచ్చి వివాహమొనర్చుటకు నిశ్చయించుట)

అట్లు జనక మహరాజు తన వంశ వృత్తాంతమును చెప్పిన పిమ్మట వసిష్టునితో కూడిన మహాముని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. "ఓ నరపుంగవా ! ఇక్ష్వాకు విదేహ కులములు సాటిలేనివి వాటి వైభవము వర్ణింపబడలేనివి. వీటితో సమానమైనవి లేవు. ఓ రాజా! సీతా ఊర్మిళలతో రామ లక్ష్మణుల సంబంధము ధర్మరీత్యా . రూపసంపదలలో కూడా సమానము. ఓ నరశ్రేష్ఠా ! చెప్పతగిన నా వచనములను మీరు వినుదురుగాక . మీ తమ్ముడు అగు రాజు కుశధ్వజుడు అతి ధర్మజ్ఞుడు. ఓ రాజా! ఈ ధర్మాత్ముడగు కుశధ్వజునికి గల భువిలో అతి సందరమైన ఇద్దరు కుమార్తెలను ఓ నరశ్రేష్ఠా ధీమతులైన కుమారులు భరత శతృఘ్నుల భార్యలు అగుటకు ప్రార్థించుఉన్నాను. ఓ రాజా! నీ పుత్రికలను ఈ మహాత్ముల కోసము కోరుచున్నాను. దశరథుని ఈ పుత్రులు రూపయౌవ్వన సంపదలు కలవారు. లోకపాలునితో సరితూగువారు.దేవులతో సమానమైన పరాక్రమము కలవారు. ఓ రాజేంద్ర ! ఈ సంబంధముతో పుణ్యకార్యములు చేసిన ఇక్ష్వాకువంశము మిథిలాధిపతుల వంశము కూడా దృఢపడును" అని.

వసిష్ఠుని సమ్మతితో చెప్పబడిన విశ్వామిత్రుని వచనములను విని ఆ మునిపుంగవులకు అంజలిఘటించి జనక మహారాజు ఇట్లు పలికెను.

"ఓ మునిపుంగవులారా ! మీరు స్వయముగా అజ్ఞాపించుటవలన ఈ కులసంబంధము తగినది అని భావిస్తున్నాను.మా కులము ధన్యమైనది. మీకు శుభము అగుగాక. కుశధ్వజుని పుత్రికలు ఇద్దరూ భరత శతృఘ్నులకు పత్నులు అగుదురు గాక. నలుగురు రాజపుత్రుల నలుగురు రాజపుత్రికల పాణిగ్రహణము ఒకేదినమున అగుగాక. ఓ బ్రహ్మన్ !మనుష్యులు భగ ప్రజాపతి ఉత్తర ఫలుగుణి లో ఉన్నప్పుడు జరుగు వివాహము ప్రశంసించుదురు".

సౌమ్యమైన ఇట్టి వచనములను ఆ ఇద్దరితో పలికి , జనకుడు కృతాంజలి ఘటించి మరల ఇట్లు పలికెను .

"ఓ మునిపుంగవులారా ! నాకు ఉపకారము చేసితిరి. ఎల్లప్పుడూ మీకు శిష్యుడుగానుందును. ఈ ముఖ్యమైన ఆసనములను స్వీకరించుడు. ఈ ( మిథిలానగరము) దశరథుని అయోధ్యాపురి వలె నే అని భావించుడు. నా ప్రభుత్వములో సందేహము లేదు. మీరు ఆజ్ఞాపించినటులనే అగును".

అట్లు చెప్పిన విదేహరాజుకి రఘునందనుడగు రాజు దశరథుడు సంతోషముతో జనక మహారాజు కి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.
"ఓ మిథిలేశ్వరులరా ! మీకు శుభమగుగాక . మీకు అసంఖ్యాకమైన గుణములు కలవు. ఋషులు రాజుసంఘములు మీ చేత పూజింపబడినవి. నేను నా భవనమునకు వేళ్ళెదను. శ్రాద్ధ కర్మలను అన్నింటినీ చేసెదను" . అని చెప్పెను

అప్పుడు రాజా దశరథుడు జనక మహారాజు అనుమతితో ఆ మునీంద్రులు ఇద్దరితో కలిసి వెళ్ళెను.

అతడు తన ఆలయమునకు పోయి విథి విధానముగా శ్రాద్ధకర్మలను నిర్వహించి ప్రభాత సమయములో ఉత్తమమైన గోవుల దానము చేసెను. ప్రతి ఒక్కరి పుత్త్రులకోసము ధర్మానుసారముగా లక్ష గోవులను బ్రాహ్మణునకు దానమిచ్చెను. అ గోవులు బంగారపు కొమ్ములు గలవి ,పాలు సమృద్ధిగా ఇచ్చునవి, దూడలు ఉన్నవి శ్రేష్ఠమైనవి. అట్టి నాలుగు లక్షల ఆవులను బ్రాహ్మణులకు ఇచ్చెను. పుత్రవత్సలుడగు రఘునందనుడు పుత్త్రులక్షేమముకోరకు గో దానము ఇచ్చి ఇంకా చాలా ధనమును కూడా బ్రాహ్మణులకు ఇచ్చెను. నలుగురు పుత్రులతో కలిసి గోదానములను ఇచ్చిన ఆ దశరథ మహారాజు లోకపాలులచే చుట్టబడిన సౌమ్యుడగు ప్రజాపతి వలె ప్రకాశించుచుండెను.

|| ఈ విథముగా బాలకాండలోని దెబ్బది రెండవ సర్గ సమాప్తము||

|| ఓమ్ తత్ సత్ ||

స సుతైః కృతగోదానైః వృతస్తు నృపతిస్తదా |
లోకపాలైరివాభాతి వృతః సౌమ్యః ప్రజాపతిః ||

" పుత్రులతో కలిసి గోదానములను ఇచ్చిన ఆ ( దశరథ) మహారాజు లోకపాలులచే చుట్టబడిన సౌమ్యుడగు ప్రజాపతి వలె ప్రకాశించుచుండెను"

|| ఓమ్ తత్ సత్ ||

 

 

||om tat sat ||