Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 76

Parasurama- 3 !!

||om tat sat ||

శ్రుత్వా చ జామదగ్న్యస్య వాక్యం దాశారథిస్తదా |
గౌరవాద్యంత్రిత కథః పితూరామమ్ అథాబ్రవీత్ ||

"తండ్రిమీదగౌరవముతో మిన్నకున్నరాముడు జమదగ్ని యొక్క పుత్రుని మాటలను విని ఇట్లు పలికెను".

బాలకాండ
డెబ్బది ఆఱవ సర్గ

అప్పటివరకు తండ్రిమీదగౌరవముతో మిన్నకున్నరాముడు జమదగ్ని యొక్క పుత్రుని మాటలను విని పరశురామునితో ఇట్లు పలికెను. "ఓ బ్రహ్మన్ ! ఓ భార్గవ ! పిత్రు ఋణము తీర్చుకొనుటకు చేసిన కార్యము గురించి వింటిని . దానికి నా అభినందనలు. ఓ భార్గవ ! వీర్యహీనుడని అశక్తుడని అని నా పరాక్రమమును అవమానించితివి. ఇప్పుడు నాపరాక్రమము చూడుము."

ఇట్లు చెప్పి పరాక్రమవంతుడైన రాముడు పరశురాముని ధనస్సును అతని చేతులనుంచి అవలీలగా గ్రహించెను. రాముడు ధనస్సులో బాణమును సంధించి పిమ్మట క్రుద్ధుడైన రాముడు జమదగ్ని కుమారుడు అగు పరశురామునితో ఇట్లు పలికెను. "బ్రాహ్మణుడవు విశ్వామిత్రునితో సంబంధముగలవాడవు అందువలన నాకు పూజ్యుడవు. ఓ పరశురామ అందువలన ప్రాణము తీయుటకు అశక్తుడను.
నీ పాదగతిని కాని తపోబలముతో అర్జించిన పుణ్యలోకములను కాని నీ కోరికప్రకారము నశింపచేసెదను .ఇది వైష్ణవ బాణము. దివ్యమైనది. శత్రుపురములను నాశనము చేయగలది. వీరుల బలదర్పములను అణచేయునది. వ్యర్థముగా పడదు".

శ్రేష్ఠమైన ధనస్సు ధరించిన రాముని చే లోకము స్తబ్ధము ఆయెను. ఆ పరశురాముడు తన వీరత్వము కోల్పోయి రాముని చూచెను. పరాక్రమము సన్నగిల్లి పోగా , తేజస్సు కోల్పోయినవాడై కమలపత్రాక్షుడైన రాముని తో ఇట్లు మెల్లిగా మెల్లిగా పలికెను. "పూర్వము నాచేత భూమండలమంతుయూ కాశ్యపునికి ఇచ్చినప్పుడు కాశ్యపుడు నన్ను అచట ఉండతగదు అని చెప్పెను. ఆందువలన గురువచనములు పాటించుటకు నేను పృథివీమండలములో నివశించలేదు. ఓ కకుత్‍స్థ ! కాశ్యపుని భూమిలో ఉండనని ప్రతిజ్ఞపూనితిని. ఓ రాఘవ ! ఓ వీరా ! ఈ పాదగతిని నశింపచేయకుము. మహేంద్రపర్వతమునకు మనోవేగముతో పోయెదను. ఓ రామా ! అసమాన్యమైన తపస్సుతో నేను సంపాదించిన లోకములను నీ శరముతో నశింపచేయుము. ఆలస్యము వలదు. ఓ పరంతప ! ఈ ధనస్సు యొక్క పరామర్శతో నీవు మధును చంపిన సురేశ్వరుడవని గ్రహించుచున్నాను. ఈ సురగణములన్నీ అసహాయశూరుడవగు అద్భుతకర్మలను చేయగలవాడవు అగు నిన్ను చూచుచున్నారు. ఓ కాకుత్‍స్థ ! త్రైలోక నాయకుడవైన నీచేత ఓటమిపొందుట నాకు సిగ్గుపడ వలసిన విషయము కాదు. ఓ రామ ! ఓ మంచివ్రతములను చేసినవాడా ! తిరుగులేని నీ బాణము ప్రయోగింపుము. శరమోక్షముతో నేను మహేంద్రగిరి పోయెదను".

అప్పుడు పరశురాముడు రామునితో అట్లు పలికినప్పుడు మిక్కిలి ప్రతాపముగల శ్రీమంతుడు అగు దాశరథి ఉత్తమమైన శరమును ప్రయోగించెను. రామునిచే తన తపస్సుతో ఆర్జింపబడిన లోకములు నశింపచేయబడగా , పరశురాముడు పర్వతోత్తమమైన మహేంద్ర పర్వతమునకు వెళ్ళెను. అప్పుడు అన్ని దిశలలోను చీకట్లు పోయెను. సురలు ఋషిగణములూ ఆయుధములు ధరించియున్న రాముని ప్రశంసించిరి.

పరశురాముడు కూడా దశరథ రాముని ప్రశంసించి, ఆ ప్రభువునకు ప్రదక్షిణము చేసి తన త్రోవన పోయెను.

ఈ విథముగా బాలకాండలో దెబ్బది ఆరవ సర్గము సమాప్తము.

||ఓమ్ తత్ సత్ ||

రామం దాశరథిం రామో జామదగ్న్యః ప్రశస్య చ |
తతః ప్రదక్షిణమ్ కృత్వా జగామాత్మగతిం ప్రభుః ||

"పరశురాముడు దశరథ రాముని ప్రశంసించి ప్రభువునకు ప్రదక్షిణము చేసి తన త్రోవన పోయెను".

||Om tat sat ||