||సుందరకాండ ||

||పదవ సర్గ తెలుగు శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో ||

|| Sarga 10 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ దశమస్సర్గః
అర్థ తాత్పర్య తత్త్వ దీపికతో

ఈ సర్గయొక్క తాత్పర్యము సంక్షిప్తముగా టికాత్రయములో ఇలా రాస్తారు - హనుమాన్ పుష్పకే విమానే నానాలంకరణణోపశోభిత ఉపకరణభాసురశయనోత్తమ శాయినం బహు విధాభరణ విభూషిత వపుషం రావణం దదర్శ।తత్ అవిదూరతః పణవ మృదఙ్గ వేణీవీణాడక్కాది నానాతోద్యాలింగిత వపుషాం సుప్త్యవస్థాఙ్గప్రత్యాఙ్గానాం శైలూషీణాం మధ్యేఽదృతశయనశాయినీమ్ ఉజ్జ్వలాభరణోపశోభితాం మండోదరీం దృష్ట్వా స ఇయం సీతేతి సంహజాతహర్షః పుచ్ఛచుమ్బనాది కాపేయమావిశ్చకార।

అంటే హనుమ నానా అలంకారములతో శోభించుచున్నపుష్పక విమానములో అనేక అలంకారములతో శోభిస్తున్న ఉత్తమమైన శయనము మీద శయనిస్తున్న రావణుని చూచెను. అక్కడకి దగ్గరలోనే వేణు వీణా తదితర వాద్యముల అలింగనములో సుఖముగా శయనస్తున్న స్త్రీల మధ్యలో శయన్ముపై నిద్రుస్తున్న ఉజ్జ్వలమైన ఆభరణములతో అలంకరింపబడిన మండోదరిని చూచి అమె సీతయే అనుకొని హర్షముకలవాడై తోకను ముద్దెట్టుకుంటూ కోతి చేష్టలు చేసెను అని.

ముందు సర్గలలో విన్న " స్వర్గోయమ్ దేవలోకోయమ్.." అన్న మాటలకు అనుగుణముగా ఈ సర్గలో కూడా రావణుని రాజభవనములో రావణుని వర్ణనలో, రావణ స్త్రీల వర్ణనలో, ప్రతి శ్లోకములో ఇది భోగలోకము అనే మాటని పదే పదే స్థిర పరుస్తాయి.

ఇక అర్థతాత్పర్యాలతో శ్లోకములు.

||శ్లోకము 10.01||

తత్ర దివ్యోపమంముఖ్యం స్ఫాటికం రత్నభూషితమ్|
అవేక్షమాణో హనుమాన్ దదర్శ శయనాసనమ్||1||

స||తత్ర అవేక్షమాణో హనుమాన్ స్ఫాటికం రత్న భూషితమ్ దివ్యోపమమ్ ముఖ్యం శయనాసనమ్ దదర్శ||

ఇదే తిలక టీకాలో - తత్ర శాలాయాం। దివ్యోపమమ్ దివి భవేన స్వర్గవర్తిపదార్థేనైవోపమా యస్య తత్ శయనస్యాసనం పల్యఙ్కం ప్రతిష్టాపనవేదికా అవేక్షమాణా ఇతః తతః పశ్యన్।

||శ్లోకార్థములు||

అవేక్షమాణో హనుమాన్ -
సీతాన్వేషణలో వున్న హనుమంతుడు
తత్ర స్ఫాటికం రత్న భూషితమ్ -
అప్పుడు స్ఫటిక రత్న విభూషితమైన
దివ్యోపమమ్ ముఖ్యం శయనాసనమ్ -
దివ్యమైన ముఖ్యమైన శయనాసనమును
దదర్శ - చూచెను

||శ్లోకతాత్పర్యము||

"సీతాన్వేషణలోనున్న హనుమంతుడు అప్పుడు స్ఫటిక రత్న విభూషితమైన శయనాసనమును చూచెను."||10.01||

||శ్లోకము 10.02||

దాంతకాఞ్చన చిత్రాంగైః వైఢూర్యైశ్చ వరాసనైః|
మహార్హాస్తరణోపేతైః ఉపపన్నం మహాధనైః||10.02||

స|| (తత్ శయనాసనమ్) దాంతకాఞ్చన చిత్రాంగైః వైడూర్యైశ్చ మహార్హతరుణోపేతైః మహాధనైః వరాసనైః ఉపపన్నమ్ (అస్తి)||

రామ టీకాలో ఇది ఇలా విడమిడచి చెపుతారు- "అవేక్షమాణః సీతాన్వేషణం కుర్వన్ హనుమాన్ దివ్యోపమం స్వర్గస్థ శయనాసన సదృశం స్ఫాటికం స్ఫాటికమణిమయం రత్న విభూషితం మహార్హ తరుణోపేతైః బహుమూల్యాస్తరణయుక్తైః దాన్తకాఞ్చన చిత్రాఙ్గైః దన్తమయత్వ కాఞ్చనమయత్వాభ్యాం చిత్రాణ్యఙ్గాని పాదాదీని యేషాం తైః వైఢూర్యై వైఢూర్యమణిమయైశ్చ మహాఘనైః బహు మూల్యకైః వరాసనైః అల్పపర్యఙ్కైః ఉపపన్నం మహాపర్యఙ్క అవరోహణాయ సంయోజితం ముఖ్యం శయనాసనం మహాపర్యఙ్కం దదర్శ"॥

||శ్లోకార్థములు||

దాంతకాఞ్చన చిత్రాంగైః -
బంగారము దంతముల నగిషీలతోనూ
మహాధనైః వైడూర్యైశ్చ చిత్రాంగైః -
అమూల్యమైన వైఢూర్యమణి ఖచితములై అనేక వర్ణములతో గల
మహార్హతరుణోపేతైః వరాసనైః ఉపపన్నమ్ -
మంచి తొడుగులు కల ఆసనములతో కూడుకొని ఉన్న
( శయనాగారము చూచెను)

||శ్లోకతాత్పర్యము||

"ఆ శయనాగారము బంగారము దంతముల నగిషీలతోనూ అమూల్యమైన వైఢూర్యమణి ఖచితములై అనేక వర్ణములతో గల అనేక మంచి తొడుగులు కల ఆసనములతో ఉండెను". ||10.02||

||శ్లోకము 10.03||

తస్యచైకతమే దేశే సోఽగ్ర్యమాలావిభూషితమ్|
దదర్శ పాణ్డురం ఛత్రం తారాధిపతి సన్నిభమ్||10.03||

స|| స తస్య ఏకతమే దేశే అగ్ర్యమాలావిభూషితమ్ తారాధిపసన్నిభం పాణ్డురం ఛత్రం దదర్శ||

॥శ్లోకార్థములు॥

స తస్య ఏకతమే దేశే -
ఆ శయనాగారములో ఒక వైపు
అగ్ర్యమాలావిభూషితమ్ -
పూలమాలలతో అలంకరింపబడిన
తారాధిపసన్నిభం -
చంద్రునివలె ప్రకాశించుచున్న
పాణ్డురం ఛత్రం దదర్శ-
తెల్లని గొడుగును చూచెను

॥శ్లోకతాత్పర్యము॥

"ఆ శయనాగారములో ఒక వైపు, పూలమాలలతో అలంకరింపబడిన,చంద్రునివలె ప్రకాశించుచున్న తెల్లని గొడుగును చూచెను."||10.03||

||శ్లోకము 10.04||

జాతరూప పరిక్షిప్తం చిత్రభాను సమప్రభమ్|
అశోకమాలావితతం దదర్శ పరమాసనమ్||10.04||

స|| జాతరూప పరిక్షిప్తం చిత్రభాను సమ ప్రభమ్ అశోకమాలావితతమ్ (తం) పరమాసనమ్ దదర్శ||

రామటీకాలో - జాతరూపేతి। జాతరూపేణ సువర్ణేన పరిక్షిప్తం నిర్మితం చిత్రభానోః సూర్యస్య సమప్రభం అశోకమాలావితతం శోక అపహారమాలాభిః సంయుతంవివిధైర్గన్ధైః చన్దనైశ్చ జుష్టం అవికాజినేన స్వాభావిక అతికోమలోర్ణాయుచర్మణా సంవృతం ఆస్తీర్ణ వరమాల్యానాం మనోహర సుగన్ధాదినోత్తమపుష్పాణాం దామభిః మాలాభిః ఉపశోభితమ్ వాలవ్యజనహస్తాభిః సమన్తఓ వీజ్యమానం పరమాసనం మహాపర్యఙ్కఃస్థ విశేషం దదర్శ॥ ఇది మూడు శ్లోకముల తాత్పర్యము ( జాతరూపమ్ 04॥; వ్యాలవ్యజన 05॥ పరమాస్తరణా 06॥ )

||శ్లోకార్థములు||

జాతరూప పరిక్షిప్తం -
బంగారము తో నిర్మితమైన
చిత్రభాను సమ ప్రభమ్ -
సూర్యకాంతితో వెలుగుచున్న
అశోకమాలావితతమ్ -
శోకము తొలగించు పుష్పముల మాలలతో అలంకరింపబడిన
పరమాసనమ్ దదర్శ-
ఉత్తమమైన శయనాసనమును చూచెను

||శ్లోకతాత్పర్యము||

"హనుమంతుడు బంగారము తో నిర్మితమైన, కాంతి తో వెలుగుచున్న, శోకము తొలగించు పుష్పమాలలతో అలంకరింపబడిన, ఆ ఉత్తమమైన శయనాసనము చూచెను."||10.04||

||శ్లోకము 10.05||

వ్యాలవ్యజన హస్తాభి ర్వీజ్యమానం సమంతతః|
గన్ధైశ్చ వివిధైర్జుష్టం వరధూపేణ ధూపితమ్||10.05||

స|| వ్యాలవ్యజన హస్తాభిః వీజ్యమానం (తం దదర్శ) | వివిధైః గన్ధైశ్చ జుష్టం వరధూపేణ ధూపితం (తం శయనాసనం దదర్శ)||

||శ్లోకార్థములు||

వ్యాలవ్యజన హస్తాభిః వీజ్యమానం -
వ్యాలవ్యజనము చేతిలో పట్టుకొని వింజామరలు వీచబడుచున్న
వివిధైః గన్ధైశ్చ జుష్టం -
అనేక గంధములతో కూడిన
వరధూపేణ ధూపితం -
ధూపధూమము అచట సర్వత్ర వ్యాపించియున్న
(శయనాసనము) దదర్శ - చూచెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ శయనాసనమును వ్యాలవ్యజనము చేతిలో పట్టుకొని వింజామరలు వీచుచున్నవారిని చూచెను. అనేక గంధములతో కూడిన ధూపధూమము అచట సర్వత్ర వ్యాపించి యున్నది." ||10.05||

||శ్లోకము 10.06||

పరమాస్తరణా స్తీర్ణ మావికాజినసంవృతమ్|
దామభిర్వరమాల్యానాం సమన్తాదుపశోభితమ్||10.06||

స|| పరమాస్తరణాస్తీర్ణమ్ ఆవికాజిన సంవృతమ్ సమన్తాత్ దామభిః వరమాల్యానాం ఉపశోభితమ్ తం శయనాసనం దదర్శ||

||శ్లోకార్థములు||

పరమాస్తరణాస్తీర్ణమ్ -
మెత్తని పరుపులతో
ఆవికాజిన సంవృతమ్ -
మెత్తనిగొర్రె చర్మములతో కప్పబడిన
సమన్తాత్ దామభిః వరమాల్యానాం ఉపశోభితమ్ -
అంతటా మంచి మాలలతో శోభాయమానముగా అలంకరింపబడిన
( ఆ శయనాగరము చూచెను)

||శ్లోకతాత్పర్యము||

"మెత్తని పరుపులతో మెత్తనిగొర్రె చర్మములతో కప్పబడిన అంతటా మంచి మాలలతో శోభాయమానముగా అలంకరింపబడిన ఆ శయనాగారము చూచెను." ||10.06||

||శ్లోకము 10.07||

తస్మిన్ జీమూతసంకాశం ప్రదీప్తోత్తమకుణ్డలమ్|
లోహితాక్షం మహాబాహుం మహారజతవాససమ్||7||

స|| తస్మిన్ జీమూతసంకాశం ప్రదీప్తోత్తమకుణ్డలమ్ మహారజతవాససం లోహితాక్షం (ప్రసుప్తం /శయానం) మహాబాహుం (దదర్శ)||

రామ టీకాలో - జీమూత సంకాశం శ్యామత్వేన మేఘసదృశం, ప్రదీప్తాని ఉజ్జ్వల కుణ్డలాని యస్య, మహారజతం స్వర్ణతన్తు నిర్మితం ।

||శ్లోకార్థములు||

తస్మిన్ జీమూతసంకాశం -
అక్కడ మేఘములవలెనున్న
ప్రదీప్తోత్తమకుణ్డలమ్-
శ్రేష్టమైన కుండలములు ధరించిన
మహారజతవాససం లోహితాక్షం-
ఎఱ్ఱని కళ్ళు గల, రజత వర్ణపు వస్త్రములు ధరించిన
మహాబాహుం (దదర్శ) -
మహాబాహువులు కలవానిని చూచెను.

||శ్లోకతాత్పర్యము||

"ఆ శయనాశనము లో మేఘములవలెనున్న శ్రేష్టమైన కుండలములు ధరించిన, ఎఱ్ఱని కళ్ళు గల, ఎఱ్ఱని వస్త్రములు ధరించిన, మహాబాహువులతో వున్న ఒక మహానుభావుని చూచెను."||10.07||

||శ్లోకము 10.08||

లోహితేనానులిప్తాఙ్గం చన్దనేన సుగన్ధినా|
సన్ధ్యారక్త మివాకాశే తోయదం సతటిద్గణమ్||10.08||

స||(సః) లోహితేన సుగంధినా చందనేన అనులిప్తాంగం (సః రావణః) సంధ్యారక్తం సతటిద్గణమ్ తోయదం ఇవ అదృశ్యత||

||శ్లోకార్థములు||

లోహితేన సుగంధినా చందనే -
సుగందముకల ఎర్రని చందనముతో
అనులిప్తాంగం -
అదలుకొని వున్న
సః రావణః -
ఆ రావణుడు
సంధ్యారక్తం సతటిద్గణమ్ తోయదం ఇవ అదృశ్యత -
సంధ్యాసమయపు ఎఱ్ఱని కాంతి తో మెరుపులతో నిండిన మేఘములవలె కనపడెను

||శ్లోకతాత్పర్యము||

"సుగంధముకల ఎర్రని చందనముతో అదలుకొని వున్న, ఆ రావణుడు, సంధ్యా సమయపు ఎఱ్ఱని కాంతితో మెరుపులతో నిండిన మేఘములవలె కనపడెను." ||10.08||

||శ్లోకము 10.09||

వృతమాభరణైః దివ్యైః సురూపం కామరూపిణమ్|
స వృక్షవనగుల్మాఢ్యం ప్రసుప్త మివ మన్దరమ్||10.09||

స||సురూపం కామరూపిణమ్ సః వృక్షవనగుల్మాడ్యం మందరం ఇవ (తం) ప్రసుప్తం (రావణం దదర్శ)||

||శ్లోకార్థములు||

దివ్యైః ఆభరణైః వృతం సురూపం -
దివ్యమైన ఆభరణములను ధరించిన మంచి రూపము గల
కామరూపిణమ్ -
కోరిన రూపము ధరించగల
స వృక్షవనగుల్మాఢ్యం మందరం ఇవ -
వృక్షములతో వనములతో పొదలతో నిండిన మందర పర్వతము వలె నున్న
ప్రసుప్తం (రావణం దదర్శ) -
నిదురిస్తున్న రావణుని చూచెను

||శ్లోకతాత్పర్యము||

"దివ్యమైన ఆభరణములతో భూషితుడైన, సురూపము గల కామరూపి అగు, వృక్షములు వనములతో నిండి పర్వతపర్వతములాగా నిద్రిస్తున్న రావణుని చూచెను".॥10.09॥

||శ్లోకము 10.10||

క్రీడి త్వోపరతం రాత్రౌ వరాభరణభూషితమ్|
ప్రియం రాక్షస కన్యానాం రాక్షసానాం సుఖావహమ్||10||

స|| రాత్రౌ క్రీడిత్వా ఉపరతం వరాభరణభూషితమ్ రాక్షస కన్యానాం ప్రియం రాక్షసానాం సుఖావహం (ప్రసుప్తం) తం (సః దదర్శ)||

||శ్లోకార్థములు||

రాత్రౌ క్రీడిత్వా ఉపరతం -
రాత్రి అంతా ఆడిన ఆటలతో అలసిపోయిన ,
వరాభరణభూషితమ్ -
మంచి ఆభరణములతో భూషితుడైన
రాక్షస కన్యానాం ప్రియం -
రాక్షసకన్యలకు ప్రియుడైన
రాక్షసానాం సుఖావహం-
రాక్షసులకు సుఖము కలిగించు

||శ్లోకతాత్పర్యము||

"రాత్రి అంతా ఆడిన ఆటలతో అలసిపోయిన , మంచి ఆభరణములతో భూషితుడైన, రాక్షసకన్యలకు ప్రియుడైన, రాక్షసులకు సుఖము కలిగించు, తాగి అలసిపోయిన , ప్రకాశించుచున్న శయనముపై నిద్రలోనున్న వీరుడు, రాక్షాసధిపతి అగు రావణుని చూచెను". ||10.10||

||శ్లోకము 10.11||

పీత్వాఽప్యుపరతమ్ చాపి దదర్శ స మహాకపిః|
భాస్వరే శయనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపమ్||11||

స|| పీత్వా ఉపరతం చ భాస్వరం శయనే ప్రసుప్తం వీరం రాక్షసాధిపం మహాకపిః దదర్శ||

||శ్లోకార్థములు||

పీత్వా ఉపరతం చ -
తాగి అలసిపోయిన ,
భాస్వరం శయనే ప్రసుప్తం వీరం -
ప్రకాశించుచున్న శయనముపై నిద్రలోనున్న వీరుడు
రాక్షసాధిపం మహాకపిః దదర్శ-
రాక్షాసధిపతి అగు రావణుని హనుమ చూచెను.

||శ్లోకతాత్పర్యము||

" హనుమాన్ తాగి అలసిపోయిన , ప్రకాశించుచున్న శయనముపై నిద్రలోనున్న వీరుడు, రాక్షాసధిపతి అగు రావణుని చూచెను". ||10.11||

||శ్లోకము 10.12||

నిశ్శ్వసంతం యథా నాగం రావణం వానరర్షభ|
ఆసాద్య పరమోద్విగ్నః సోఽపాసర్పత్సు భీతవత్ ||10.12||

స||సః వానరర్షభః యథా నాగం నిః శ్వసంతం రావణం ఆసాద్య పరమోద్విగ్నః సుభీతవత్ ఉపాసర్పత్||

తిలక టీకాలో - యథా నాగం గజమివ నిఃశ్వసన్తం రావణం ఆసాద్య పరమోద్విగ్నోఽయం పాపీ దేవీం హృతవాన్ ఇతి ఏతత్ సమీపం అవస్థానం అనుచితం ఇతి ఖిన్నోచిత్ ఉపాసర్పత। సుభీతవత్ సుభీతో యథా భయహేతోః పిశాచాదేః సంముఖే స్థాతుం అశక్తః ఉపాసర్పతి తద్వత్ ॥

||శ్లోకార్థములు||

సః వానరర్షభః - ఆ వానరపుంగవుడు
యథా నాగం నిః శ్వసంతం-
గజము వలే ఉచ్చ్వాస నిశ్వాసములు చేయుచున్న
రావణం ఆసాద్య - రావణుని సమీపించి
పరమోద్విగ్నః సుభీతవత్ ఉపాసర్పత్ -
భయముతో ఉద్విగ్నుడై వెనుకడుగు వేశెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ వానరర్షభుడు, గజము వలే వున్న ఉచ్చ్వాస నిశ్వాసములు చేయుచున్న రావణుని సమీపించి, భయముతో ఉద్విగ్నుడై వెనుకడుగు వేశెను." ||10.12||

ఆ హనుమంతుడు ఏనుగ లాగా ఉచ్చ్వాస నిశ్వాసములు చేయుచున్న రావణుని ,
"ఆసాద్య" సమీపించి, ఉద్విగ్నమనస్సు కలవాడై, "ఉపాసర్పత్ సుభీతవత్",
భయపడినట్లు ఒక అడుగు వెనక్కివేశాడుట.

ఇక్కడ కవి రెండు పదాలను ఉపయోగిస్తాడు. 'పరమోఽద్విగ్నః' , 'సుభీతవత్';

ఉద్విగ్న మనస్సు ఎందుకు? దీన్నిగురించి రామాయణ తిలకలో ఇలా రాస్తారు. "అయం పాపీ దేవీం హృతవాన్ ఇత్యేతత్ సమీపే ఆస్థానమ్ అనుచితమితి ఖిన్నచిత్తో ఉపాసర్పత్"| " ఈ పాపత్ముడు దేవిని ఎత్తుకుపోయాడు. వీడి సమీపములో ఉండడము కూడా అనుచితము అని ఖిన్న మనస్సుతో వెనక్కి పోయాడు." అని.

ఇక రెండవమాట 'సుభీతవత్ '! దీనిమీద రామాయణ తిలకలో ఇలా రాస్తారు. 'సుభీతవత్ - సుభీతా యథా భయహేతోః పిశాచాదేః సంముఖేస్థాతుం అశక్తః ఉపసర్పత్ తద్వత్|' "సు భీతవత్ అంటే భయపడతగు పిశాచములు మున్నగు వారి సమ్ముఖములో నిలబడలేక వెనకి పోయినట్లు" అని. ఇది క్షణిక మాత్రమే.

ఈ రెండు మాటలు పరస్పర విరుద్ధముగా వున్నాయా అనిపించవచ్చు. ఇక్కడ రెండు సంఘటనలు జరిగాయి. ఈ దుర్మార్గుడు సీతని తీసుకు పోయాడని ఉద్విగ్నుడయ్యాడు. ఆ గట్టిగా ఏనుగ లాగ వున్న ఉచ్చ్వాస నిఃశ్వాసములు క్షణికమాత్రము భయకారణమైంది. ఆ భీతితో ఒక అడుగు వెనక్కి వేశాడు హనుమ అని.

||శ్లోకము 10.13||

అధాఽఽరోహణ మాసాద్య రావణం వానరర్షభః |
సుప్తం రాక్షసశార్దూలం ప్రేక్షతే స్మ మహాకపిః||13||

స||మహాకపిః అథ ఆరోహణమ్ ఆసాద్య వేదికాంతరం ఆశ్రితః సుప్తం రాక్షసశార్దూలం ప్రేక్షతే స్మ||

రామ టీకాలో - అథేతి। అథ ఉపసర్పానన్తరమ్ వేదికాన్తరమాసాద్య ప్రాప్య ఆరోహణమ్ సోపానమాశ్రితః సన్ క్షీబం మత్తం రాక్షస శార్దూలమ్ ప్రేక్షతేస్మ।

||శ్లోకార్థములు||

మహాకపిః అథ ఆరోహణమ్ ఆసాద్య -
ఆ మహాకపి ఇంకొక మెట్లపైకి ఎక్కి
వేదికాంతరం ఆశ్రితః -
వేదికను ఆశ్రయించి
సుప్తం రాక్షసశార్దూలం ప్రేక్షతే స్మ -
నిద్రిస్తున్న రాక్షశార్దూలమగు రావణుని చూడసాగెను."

||శ్లోకతాత్పర్యము||

"ఆ మహాకపి ఇంకొక మెట్లపైకి ఎక్కి, ఆ నిద్రిస్తున్న రాక్షశార్దూలమగు రావణుని చూడసాగెను." ||10.13||

||శ్లోకము 10.14||

శుశుభే రాక్షసేన్ద్రస్య స్వపత శయనోత్తమమ్|
గన్ధ హస్తిని సంవిష్టే యథా ప్రస్రవణం మహత్||10.14||

స|| స్వపతః రాక్షసేంద్రస్య శయనోత్తమమ్ యథా ప్రస్రవణే సంవిష్టే మహత్ గంధిహస్తిని ఇవ శుశుభే||

తిలక టీకాలో - గన్ధహస్తిని, యస్య గన్ధేన అన్య గజాః పలాయన్తే స గన్ధ గజః

||శ్లోకార్థములు||

స్వపతః రాక్షసేంద్రస్య శయనోత్తమమ్ -
నిద్రించుచున్న రాక్షసేన్ద్రుని యొక్క శయనాసనము
సంవిష్టే మహత్ గంధిహస్తిని -
నిదురించుచున్న పెద్ద ఏనుగు కల
యథా ప్రస్రవణే సంవిష్టే -
ప్రస్రవణ పర్వతము వలె
శుశుభే - శోభించెను
(ఇవ అస్తి)

||శ్లోకతాత్పర్యము||

"రాక్షసేంద్రుడు పడుకుని ఉన్న ఆ శయనాసనము, మదముకారుచూ ఏనుగ శయినించిన ప్రస్రవణ పర్వతము వలె శోభించెను"||10.14||

ఇక్కడ రావణుని గన్ధ హస్తిని తో ఉపమానము చేప్పబడినది. గన్ధ హస్తిని అంటే ఏ ఏనుగ వాసనతో అన్ని గజములు పలాయనమవునో అట్టి ఏనుగ అని. అలాగే రావణుని చూచిన వెంటనే అందరూ పలాయనమంత్రము పఠిస్తారు అని రావణుని పరాక్రమము సూచింపబడినది.

||శ్లోకము 10.15||

కాఞ్చనాఙ్గదసన్నద్ధౌ దదర్శ స మహాత్మనః |
విక్షిప్తౌ రాక్షసేన్ద్రస్య భుజావిన్ద్రధ్వజోపమౌ||15||

స|| కాఞ్చనాఙ్గదసన్నద్ధౌ విక్షిప్తౌ ఇన్ద్రధ్వజౌపమౌ రాక్షసేన్ద్రస్య భుజౌ స మహాత్మనః దదర్శ|

||శ్లోకార్థములు||

స మహాత్మనః విక్షిప్తౌ రాక్షసేన్ద్రస్య -
ఆ మహాత్ముడైన నిదురించుచున్న రాక్షసేన్ద్రునియొక్క
కాఞ్చనాఙ్గదసన్నద్ధౌ భుజౌ -
బంగారపు బాహుపురలతో వున్న భుజములు
ఇన్ద్రధ్వజోపమౌ -
ఇన్ద్రుని ధ్వజములవలె

||శ్లోకతాత్పర్యము||

"ఆ మహాత్ముడైన నిదురించుచున్న రాక్షసేన్ద్రుని యొక్క బంగారపు బాహుపురలతో వున్న భుజములు ఇన్ద్రుని ధ్వజములవలె (వుండెను)" ॥10.15॥

||శ్లోకము 10.16||

ఐరావత విషాణాగ్రై రాపీడనకృతవ్రణౌ|
వజ్రోల్లిఖితపీనాంసౌ విష్ణుచక్రపరిక్షితౌ||10.16||

స|| ఐరావతవిషాణాగ్రైః ఆపీడనకృతవ్రణౌ వజ్రోల్లిఖితపీనాంసౌ విష్ణుచక్రపరిక్షితౌ (రాక్షసేంద్రస్య భుజౌ దదర్శ)||

తిలక టీకాలో - ఆపీడనే యుద్ధే కృతవ్రణౌ కృతవ్రణకిణౌ వజ్రేణోల్లిఖితౌ క్షతౌ పీనాంసౌ యయోః తౌ వజ్రచక్రయోః అపి అసాధ్య మృత్యురితి భావః।

||శ్లోకార్థములు||

ఐరావతవిషాణాగ్రైః ఆపీడనకృతవ్రణౌ -
ఇరావతముతో పోరాడిన మచ్చలతో
వజ్రోల్లిఖితపీనాంసౌ -
వజ్రాయుధము యొక్క గాట్లతో
విష్ణుచక్రపరిక్షితౌ-
విష్ణుచక్రము వలన కలిగిన మచ్చలతోవున్న
(రాక్షసేంద్రస్య భుజౌ దదర్శ)-
రాక్షసేన్ద్రుని భుజములను చూచెను

||శ్లోకతాత్పర్యము||

"బంగారపు బాహుపురలతో వున్న, ఇరావతము తో పోరాడిన మచ్చలతో , వజ్రాయుధము యొక్క గాట్లతో, విష్ణుచక్రము వలన కలిగిన మచ్చలతోవున్న ఆ రాక్షసేంద్రుని బాహువులు హనుమ చూచెను".||10.16||

ఇక్కడ పానుపై పైకి చేతులు చాచుకు పడుకొని ఉన్న రావణుని భుజములను వాల్మీకి ఆరు శ్లోకాలలో వర్ణిస్తాడు

ఇక్కడ భుజముల వర్ణనలో ఇంద్రుని వజ్రాయుధము విష్ణుచక్రముల ధాటికి నిలబడగలిగిన భుజములు అని రావణుని పరాక్రమము మీద ధ్వని.

భుజముల వర్ణనలో, అవి ఎలాంటి భుజములు ?

"వజ్రోల్లిఖిత పీనాంసౌ"- వజ్రాయుధపు గాట్లు కలిగినవి "విష్ణు చక్ర పరిక్షతౌ"- విష్ణు చక్రము యొక్క గాయముల మచ్చలు కలిగినవి (9.16). అవి "దేవ దానవ రావిణౌ "(9.20) దేవదానవులను విలపించిన భూజాలుట. అవి రావణుని శౌర్యమును ప్రకటిస్తున్నాయి అన్నమాట. ఇంకా పైగా, ఆ బాహువులు మందర పర్వతములో పగపట్టి పరున్న పాములవలె ఉన్నవట.

సర్వకర్మలకు మూలము బాహువులు. కర్మలే మనను బంధించునవి. అట్లు బంధ హేతువులగు బాహువులను చూచి హనుమ అశ్చర్యముతో మనకు వర్ణిస్తాడు. కామపూరితమైన మనసుయొక్క ప్రేరణ చేసెడి కర్మలను బంధహేతువులుగా గుర్తింపపవలె నని రావణ బాహువుల వర్ణన చేయబడినది.

"బాహువుల గురించి ముందు నాలుగొవ సర్గలో ఒక సారి విన్నాము."అద్వారేణ మహాబాహుః ప్రాకారమభిపుప్లువే" అవి హనుమంతుని బాహువులు. "రామార్థం వానరార్థం చ" అని రాముని కొఱకు వానరుల కొఱకు నిష్కామ కర్మ చేస్తున్న హనుమంతునివి. అ బాహువులు చేసే ఆ నిష్కామ కర్మలతో బంధములు కలగవు. అవి మహాబాహువులు.

ఇక్కడ రావణ బాహువుల వర్ణనలో మనకి తెలిసేది ఈ రావణ బాహువులు భోగలోకములో అనుభవిసున్న బాహువులు అని.

||శ్లోకము 10.17||

పీనౌ సమసుజాతాంశౌ సంగతౌ బలసంయుతౌ|
సులక్షణ నఖాఙ్గుష్టౌ స్వఙ్గుళీతల లక్షితౌ||10.17||

స||(తస్మై) పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బలసంయుతౌ సులక్షననఖాంగుష్ఠౌ స్వంగుళీతల లక్షితౌ తౌ రాక్షసాధిపస్య భుజౌ దదర్శ)||

||శ్లోకార్థములు||

పీనౌ సమసుజాతాంసౌ -
సమసుందరములైన మూపు గలవై
సంగతౌ బలసంయుతౌ బలముతో బలిసివున్న
సులక్షననఖాంగుష్ఠౌ -
శుభలక్షణములు కల అంగష్ఠములతో
స్వంగుళీతల లక్షితౌ -
వేళ్ళతో అరచేతులతోనూ

||శ్లోకతాత్పర్యము||

" సమసుందరములైన మూపు గలవై, బలిసివున్న ఆ రాక్షసాధిపతి భుజములు శుభలక్షణములు కల వేళ్ళతోనూ గోళ్ళతోనూ అరచేతులతోనూ వున్నాయి"||10.17||

||శ్లోకము 10.18||

సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరౌపమౌ|
విక్షిప్తౌ శయనే శుభ్రే పఞ్చశీర్షావివౌరగౌ||10.18||

స||సంహితౌ పరిఘాకారౌ కరికరౌపమౌ వృత్తౌ పంచశీర్షా ఉరగౌ ఇవ శుభ్రే శయనే విక్షిప్తౌ తౌ రాక్షసాధిపస్య భుజౌ దదర్శ||

||శ్లోకార్థములు||

సంహితౌ పరిఘాకారౌ -
పరిఘాకారములో
కరికరౌపమౌ వృత్తౌ -
ఏనుగుయొక్క తోడ వలె గుండ్రముగా వున్న ( ఆ బాహువులు)
శుభ్రే శయనే విక్షిప్తౌ -
శుభ్రమైన ఆ శయనాశనము మీద నిదురించుచున్న
పంచశీర్షా ఉరగౌ ఇవ -
ఇదు తలలు కల పాములలాగా
(రాక్షసాధిపస్య భుజౌ దదర్శ - రాక్షసాధిపతి బాహువులు కనపడెను)

||శ్లోకతాత్పర్యము||

"పరిఘాకారములో ఏనుగుయొక్క తోడ వలెనున్న ఆ బాహువులు రెండూ, శుభ్రమైన ఆ శయనాశనము మీద పడగవిప్పిన ఇదు తలలు కల పాములలాగా కనిపిస్తున్నాయి."||10.18||

||శ్లోకము 10.19||

శశక్షజతకల్పేన సుశీతేన సుగన్ధినా |
చన్దనేన పరార్థ్యేన స్వనులిప్తౌ స్వలఙ్కృతౌ ||10.19||

స|| సుశీతేన సుగంధినా శశక్షజతకల్పేన పరార్థ్యేన చందనేన స్వనులిప్తౌ (భుజౌ దదర్శ) ||

||శ్లోకార్థములు||

సుశీతేన సుగంధినా -
చల్లని మంచి గంధములతో
శశక్షజతకల్పేన -
శశకముయొక్క రక్తములాంటి ఎర్రని
పరార్థ్యేన చందనేన స్వనులిప్తౌ -
మంచి చందనముతో పూయబడి
స్వలఙ్కృతౌ - అలంకరింపబడిన

||శ్లోకతాత్పర్యము||

"(ఆ భుజములు) చల్లని మంచి గంధములతో శశకముయొక్క రక్తములాంటి ఎర్రని చందనముతో పూయబడినవి; ||10.19||

||శ్లోకము 10.20||

ఉత్తమస్త్రీవిమృదితౌ గన్ధోత్తమనిషేవితౌ|
యక్ష కిన్నర గన్ధర్వ దేవ దానవ రావిణౌ||10.20||

స|| ఉత్తమస్త్రీవిమృదితౌ గన్ధోత్తమనిషేవితౌ యక్ష కిన్నర గంధర్వ దేవ దానవ రావిణౌ తౌ భుజౌ దదర్శ||

తిలకటీకాలో - దదర్శాత్వాదరేణ దదర్శ నాతః పునరుక్తిః మహాహీ మహాసర్పౌ అత్ర ద్విభుజత్వకథనాత్ యుద్ధాది కాల ఏవ వింశతి భుజత్వం దశశీర్షత్వం చేతి బోధ్యమ॥

||శ్లోకార్థములు||

ఉత్తమస్త్రీవిమృదితౌ -
ఉత్తమమైన స్త్రీల చేత మర్దింపబడిన
గన్ధోత్తమనిషేవితౌ -
ఉత్తమమైన సుగంధములచేత పూయబడిన
యక్ష కిన్నర గంధర్వ దేవ దానవ -
యక్షకిన్నర గంధర్వ దేవ దానవులను
రావిణౌ - విలపించిన
(తౌ భుజౌ దదర్శ - ఆ భుజములను చూచెను)

||శ్లోకతాత్పర్యము||

"ఉత్తమమైన స్త్రీల చేత మర్దింపబడినవి , ఉత్తమమైన సుగంధములచేత పూయబడినవి, యక్షకిన్నర గంధర్వ దేవ దానవులను విలపించిన భుజములు అవి".||10.20||

ఈ భుజముల వర్ణలలో "భుజౌ" అంటూ రెండు భుజములని మనకి సూచిస్తాడు. అలాగే మకుటము గురించి చెపుతూ ఒకటే శిరస్సు లాగా వర్ణన చేయబడినది. పది తలలు ఇరవైచేతులు గల రావణుని ఇలా ఎలా వర్ణింపబడడమైనది అని మనకు ఆశ్చర్యము రావచ్చు.

తిలక టీకాలో పది తలలు ఇరువది భుజములు యుద్ధకాలములో నే ఉంటాయి అని తెలిసికొనవలెను అంటారు.

రావణుడు కామరూపి. కామరూపి కనక యుద్ధములోనూ వెలుపల తిరుగునప్పుడు పది తలల తోనూ, ప్రియురాండ్రతో కలిసి రమించునపుడు ఒక శిరస్సుతోనూ ఉంటాడని మనము భావించ వచ్చు.

కాని దీనికి వేరొక అర్ధము ఉంది.రావణుడు మనస్సు. అది రావణుడు అనే మాటలో అర్థము. పది ఇంద్రియములు పది ముఖములు. నిద్రించునపుడు ఇంద్రియ వ్యాపారములు విరమించును. మనసు మాత్రమే పనిచేయుచుండును. అందుచే పది తలలు ఉండవు. ఇరువది చేతులూ ఉండవు. మరల లేచినపుడు ఇంద్రియములు తమ తమ వ్యాపారములను ఆరంభించును. అందుచే పది తలలు లేచును. మనము పడుకున్నప్పుడు కన్ను చూడదు. చెవి వినదు. కాని లేచే సరికి మాటలు వినిపించును. వాసనలు వచ్చుచుండును. అందుచే ఇంద్రియములు లేచును అన్నమాట.

అంటే ఇంద్రియవ్యాపారములు తగ్గినప్పుడు హనుమ సీతాన్వేషణ చేయుచున్నాడు.

||శ్లోకము 10.21||

దదర్శ స కపిః తస్య బాహూ శయనసంస్థితౌ|
మన్దరస్యాన్తరే సుప్తౌ మహాహీ రుషితా ఇవ||10.21||

స|| స కపిః తత్ర మందరస్య అంతరే సుప్తౌ రుషితౌ మహాహీ ఇవ శయనసంస్థితౌ తస్య బాహూ దదర్శ||

||శ్లోకార్థములు||

స కపిః తత్ర మందరస్య అంతరే -
ఆ వానరుడు అక్కడ మందరపర్వతములో
సుప్తౌ రుషితౌ మహాహీ ఇవ -
రోషముతో నిదురించుచున్న మహాసర్పముల వలెనున్న
శయనసంస్థితౌ తస్య బాహూ దదర్శ-
అతని బాహువులను శయనము మీద చూచెను

||శ్లోకతాత్పర్యము||

"మందరపర్వతములో రోషముతో నిద్రుంచుచున్న సర్పములు లావున్న, శయనము మీద నిద్రించుచున్న రావణుని బాహువులను హనుమంతుడు తిలకించెను." ||10.21||

||శ్లోకము 10.22||

తాభ్యాం పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వరః|
శుశుభఽచలసంకాశః శృఙ్గాభ్యామివ మన్దరః||22||

స|| అచల సంకాశః సః రాక్షసేశ్వరః పరిపూర్ణాభ్యాం తాభ్యామ్ భుజాభ్యామ్ శృఙ్గాభ్యాం మన్దర ఇవ శుశుభే||

||శ్లోకార్థములు||

అచల సంకాశః సః రాక్షసేశ్వరః -
పర్వతములా వున్న ఆ రాక్షసేశ్వరుడు
పరిపూర్ణాభ్యాం తాభ్యామ్ భుజాభ్యామ్ -
పరిపూర్ణముగా వున్న అతని బాహువులతో
శృఙ్గాభ్యాం మన్దర ఇవ శుశుభే -
రెండు శిఖరములు వున్న మందరపర్వతము వలె విరాజిల్లెను

||శ్లోకతాత్పర్యము||

తా||"పర్వతములా వున్న ఆ రాక్షసేశ్వరుడు ఆ రెండు భుజములతో రెక్కలువున్న మందర పర్వతము వలె విరాజిల్లెను." ||10.22||

||శ్లోకములు 10.23,24||

చూతపున్నాగసురభి ర్వకుళోత్తమసంయుతః|
మృష్టాన్నరససంయుక్తః పానగన్ధపురస్సరః||10.23||
తస్య రాక్షస సింహస్య నిశ్చక్రామ మహాముఖాత్|
శయానస్య వినిశ్శ్వాసః పూరయన్నివ తద్గృహమ్||10.24||

స|| శయానస్య తస్య రాక్షస సింహస్య మహాముఖాత్ చూతపున్నాగ సురభిః వకుళోత్తమసంయుక్తః మృష్టాన్నరసంయుక్తః పానగంధ పురస్సరః వినిఃశ్వాసః నిశ్చక్రామ| తత్ గృహం పూరయన్నివ అస్తి||

||శ్లోకార్థములు||

శయానస్య తస్య రాక్షస సింహస్య మహాముఖాత్ -
నిద్రిస్తున్న ఆ రాక్షససింహుని మహాముఖమునుంచి
చూతపున్నాగ సురభిః -
చూత పున్నాగ పు సువాసనలతో
వకుళోత్తమసంయుక్తః -
ఉత్తమమైన వకుళ వాసనలతో కలిసిన
మృష్టాన్నరసంయుక్తః -
మృష్టాన్నపుభోజనముల వాసనలతో కలిసి
పానగంధ పురస్సరః -
త్రాగిన పానముల సుగంధములతో కలసి
వినిఃశ్వాసః -
విడువబడిన ఉఛ్వాస నిఃశ్వాసములు
తత్ గృహం పూరయన్నివ నిశ్చక్రామ-
ఆ గృహమును నింపుతున్నట్లు వెలువడెను

||శ్లోకతాత్పర్యము||

"నిద్రిస్తున్న ఆ రాక్షససింహుని మహాముఖమునుంచి చూత పున్నాగ పు సువాసనలతో వకుళ వాసనలతో కలిసిన, మృష్టాన్నపుభోజనముల వాసనలతో కలిసి , త్రాగిన పానముల సుగంధములతో కలసి, వస్తున్న ఉచ్చ్వాస నిశ్వాసములు ఆ గృహమును నింపుతున్నాయి". ||10.23,24||

||శ్లోకము 10.25||

ముక్తామణి విచిత్రేణ కాఞ్చనేన విరాజితమ్|
ముకుటేనాపవృత్తేన కుణ్డలోజ్జ్వలితాననమ్||25||

స|| ముక్తామణివిచిత్రేణ కాంచనేన అపవృతేన మకుటేన విరాజితమ్ కుణ్డలోజ్జ్వలితాననమ్ (సః దదర్శ)||

||శ్లోకార్థములు||

ముక్తామణివిచిత్రేణ కాంచనేన -
ముత్యములు మణులతో పొదగబడిన
అపవృతేన మకుటేన విరాజితమ్ -
ప్రక్కన పెట్టబడిన బంగారు కిరీటముతో విరాజిల్లుచున్న
కుణ్డలోజ్జ్వలితాననమ్ -
కుండలముల కాంతితో జ్వలిస్తున్న ముఖముకల

||శ్లోకతాత్పర్యము||

"ముత్యములు మణులతో పొదగబడిన ప్రక్కన పెట్టబడిన బంగారు కిరీటముతో విరాజిల్లుచున్, కుండలముల కాంతితో జ్వలిస్తున్న ముఖముకల ( రావణుని హనుమ చూచెను)" ||10.25||

||శ్లోకము 10.26||

రక్తచన్దన దిగ్దేన తథా హారేణ శోభినా |
పీనాయత విశాలేన వక్షసాఽభివిరాజితమ్||26||

స|| రక్తచందన దిగ్ధేన హారేణ శోభినా పీనాయత విశాలేన వక్షసా అభివిరాజితమ్||

||శ్లోకార్థములు||

రక్తచన్దన దిగ్దేన -
రక్తచందనము చే అలకబడిన
హారేణ శోభినా -
ముత్యాలహారముతో ఒప్పుతున్న
పీనాయత విశాలేన వక్షసా -
బలిష్ఠము విశాలము అయిన వక్షస్థలముతో
అభివిరాజితమ్ - విరాజిల్లుచున్న

||శ్లోకతాత్పర్యము||

"బలిష్టము, రక్తచందనము చే అలకబడిన ముత్యాలహారముతో ఒప్పుతున్న, బలిష్ఠము విశాలము అయిన వక్షస్థలముతో విరాజిల్లుచున్న"||10.26||

||శ్లోకము 10.27||

పాణ్డురేణాపవిద్ధేన క్షౌమేణ క్షతజేక్షణమ్|
మహార్హేణ సుసంవీతం పీతే నోత్తమవాససా||27||

స|| పాణ్డురేణ అపవిద్ధేన క్షౌమేణ క్షతజేక్షణామ్ మహార్హేణ పీతేన ఉత్తమవాససా సుసంవీతమ్ (తం దదర్శ)||

||శ్లోకార్థములు||

పాణ్డురేణ అపవిద్ధేన క్షౌమేణ -
తెల్లని పక్కకు తొలగిన ఉత్తరీయముతో
క్షతజేక్షణామ్ - ఎఱ్ఱని కళ్ళుగల
మహార్హేణ పీతేన ఉత్తమవాససా -
శ్రేష్టమైన పీతాంబరము తో
సుసంవీతమ్ - పూర్తిగా కప్పబడిన

||శ్లోకతాత్పర్యము||

"ఎఱ్ఱని కళ్ళుగల రావణుడు పక్కకు తొలగిన తెల్లని ఉత్తరీయముతో శ్రేష్టమైన పీతాంబరము ధరించి ఉన్నాడు. ||10.27||

||శ్లోకము 10.28||

మాషరాశీ ప్రతీకాశం నిశ్శ్వసంతం భుజఙ్గవత్|
గాఙ్గే మహతి తోయాన్తే ప్రసుప్తమివ కుఞ్జరమ్||28||

స|| మాషరాశీప్రతీకాశం భుజంగవత్ నిఃశ్వసంతం మహతి గాంగే తోయాన్తే ప్రసుప్తం కుంజరం ఇవ (ప్రసుప్తం తం దదర్శ)||

||శ్లోకార్థములు||

మాషరాశీప్రతీకాశం -
మాష రాశి వలె వున్న
భుజంగవత్ నిఃశ్వసంతం -
బుసలు కొట్టె మహాసర్పములా ఉచ్చాసనిశ్వాసములతోవున్న
మహతి గాంగే తోయాన్తే -
మహత్తరమైన గంగానది మధ్యలో
ప్రసుప్తం కుంజరం ఇవ -
నిదురిస్తున్న ఏనుగు వలె వున్న

||శ్లోకతాత్పర్యము||

"మాష రాశి వలె వున్న, బుసలు కొట్టె మహాసర్పములా ఉచ్చాసనిశ్వాసములతో వున్న, మహత్తరమైన గంగానది మధ్యలో నిద్రుస్తున్న ఏనుగు వలె నున్న;" ||10.28||

||శ్లోకము 10.29||

చతుర్భిః కాంచనైర్దీప్తైః దీప్యమాన చతుర్దిశమ్|
ప్రకాశీకృత సర్వాఙ్గం మేఘం విద్యుద్గణైరివ||29||

స|| చతుర్భిః దీపైః దీప్యమానా చతుర్దిశమ్ విద్యుత్ గణైః ప్రకాశీకృత మేఘం ఇవ (ప్రకాశికృత) సర్వాంగం (తం దదర్శ)||

||శ్లోకార్థములు||

చతుర్భిః దీపైః దీప్యమానా చతుర్దిశమ్ -
నాలుగు బంగారు దీపముల చేత నాలుగు దిశలలో ప్రకాశింప బడుతూ
విద్యుత్ గణైః ప్రకాశీకృత మేఘం ఇవ -
మెరపుల సమూహములతో ప్రకాశించుచున్న మేఘమువలె
ప్రకాశీకృత సర్వాఙ్గం -
సమస్త అంగములు ప్రకాశింపచేయబడుతున్న

||శ్లోకతాత్పర్యము||

"నాలుగు వేపులా బంగారు దీపముల చేత ప్రకాశింప బడుతూ ఆ రావణుడు మెరపుల సమూహములతో ప్రకాశించుచున్న మేఘమువలె సమస్త అంగములు ప్రకాశింప చేయబడుతున్న; " ||10.29||

||శ్లోకము 10.30||

పాదమూలగతాశ్చాపి దదర్శ సుమహాత్మనః|
పత్నీః స ప్రియభార్యస్య తస్య రక్షఃపతేర్గృహే||10.30||

స|| సుమహాత్మనః పాదమూలగతాః పత్నీశ్చ సప్రియభార్యస్య రక్షః పతేః గృహే దదర్శ||

||శ్లోకార్థములు||

సుమహాత్మనః పాదమూలగతాః పత్నీశ్చ -
పాదముల వద్దనున్నభార్యలను
పత్నీశ్చ సప్రియభార్యస్య -
భార్యలను ప్రియురాలను
రక్షః పతేః గృహే -
రాక్షస రాజు గృహములో
సుమహాత్మనః దదర్శ -
ఆ మహాత్ముడు చూచెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ రాక్షసాధిపతి గృహములో పాదముల వద్దనున్న రావణ భార్యలను ప్రియురాలను ఆ వానరుడు చూచెను".||10.30||

||శ్లోకము 10.31||

శశిప్రకాశవదనాః చారుకుణ్డలభూషితాః|
అమ్లానమాల్యాభరణా దదర్శ హరియూథపః||10.31||

స|| హరియూథపః శశిప్రకాశవదనాః చారుకుణ్డలభూషితాః అమ్లానమాల్యాభరణాః దదర్శ||

||శ్లోకార్థములు||

శశిప్రకాశవదనాః -
చంద్రునివలె ప్రకాశిస్తున్న ముఖము కలవారు
చారుకుణ్డలభూషితాః -
అందమైన కుండలములు ధరించినవారు
అమ్లానమాల్యాభరణా -
వాడిపోని పూలమాలలు ధరించినవారిని
హరియూథపః దదర్శ - హనుమంతుడు చూచెను

||శ్లోకతాత్పర్యము||

"చంద్రునివలె ప్రకాశిస్తున్న ముఖము కలవారు, అందమైన కుండలములు ధరించినవారు, వాడిపోని పూలమాలలు ధరించినవారిని, హనుమంతుడు చూచెను".||10.31||

||శ్లోకము 10.32||

నృత్తవాదిత్రకుశలా రాక్షసేన్ద్రభుజాఙ్కగాః|
వరాభరణధారిణ్యో నిషణ్ణా దదృశే హరిః||10.32||

స|| హరిః నృత్తవాదిత్రకుశలాః రాక్షసేంద్ర భుజాంకగాః వరాభరణధారిణ్యః నిషణ్ణాః దదర్శ||

||శ్లోకార్థములు||

నృత్తవాదిత్రకుశలా -
నృత్య వాద్యములలో ప్రవీణులు
రాక్షసేన్ద్రభుజాఙ్కగాః నిషణ్ణాః -
రావణుని భుజముపై అంకములపై ఆనుకొని వున్నవారినిన
వరాభరణధారిణ్యో-
మంచి ఆభరణములు ధరించినవారిని
దదృశే హరిః - హనుమ చూచెను

||శ్లోకతాత్పర్యము||

"నృత్య వాద్యములలో ప్రవీణులు, అందమైన ఆభరణములను ధరించి రావణుని భుజముపై అంకములపై ఆనుకొని వున్నవారిని హనుమ చూచెను. ||10.32||

||శ్లోకము 10.33||

వజ్రవైఢూర్యగర్భాణి శ్రవణాన్తేషు యోషితమ్|
దదర్శ తాపనీయాని కుణ్డలాన్యఙ్గదాని చ||33||

స|| శ్రవణాంతేషు యోషితం వజ్రవైఢూర్యగర్భాణి తాపనీయాని కుణ్డలాని అంగదానిచ దదర్శ||

||శ్లోకార్థములు||

శ్రవణాంతేషు -
చెవులకు చివర
వజ్రవైఢూర్యగర్భాణి -
వజ్రవైఢూర్యములతో కూడిన
తాపనీయాని కుణ్డలాని -
సువర్ణ కుండలములను ధరించిన
అంగదానిచ యోషితాం దదర్శ -
బాహుపురులు గల సుందరమైన స్త్రీలను చూచెను

||శ్లోకతాత్పర్యము||

"చెవులకు చివర వజ్రవైఢూర్యములతో కూడిన సువర్ణ కుండలములను ధరించిన, బాహుపురులు గల సుందరమైన స్త్రీలను చూచెను"||10.33||

||శ్లోకము 10.34||

తాసాం చన్ద్రోపమైర్వక్త్రైః శుభేర్లలితకుణ్డలైః|
విరరాజ విమానం తన్నభః తారాగణైరివ ||10.34||

స|| లలితకుణ్డలైః చంద్రోపమైః శుభైః వక్త్రైః తత్ విమానం తారగణైః నభః ఇవ విరరాజ||

||శ్లోకార్థములు||

తాసాం - వారి
చంద్రోపమైః శుభైః వక్త్రైః -
చంద్రునితో సమానమైన శుభ కరమైన ముఖములతో
లలితకుణ్డలైః -
లలిత కుండలములతో
తత్ విమానం తారగణైః నభః ఇవ -
ఆ శయనాశనము తారాగణములతో కూడిన ఆకాశము వలె
విరరాజ - విరాజిల్లెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు చంద్రునితో సమానమైన ముఖములు కల, మనోహరములైన కుండలములు ధరించినవారితో నిండిన ఆ శయనాశనము తారాగణములతో ప్రకాశిస్తున్న ఆకాశము వలె ప్రకాశించు చుండెను." ||10.34||

||శ్లోకము 10.35||

మదవ్యాయామఖిన్నస్తా రాక్షసేన్ద్రస్య యోషితః|
తేషు తేష్వవకాశేషు ప్రసుప్తాస్తనుమధ్యమాః||10.35||

స|| మదవ్యాయామఖిన్నాః తనుమధ్యమాః తాః రాక్షసేంద్రస్య యోషితాః తేషు తేషు అవకాశేషు ప్రసుప్తాః||

||శ్లోకార్థములు||

మదవ్యాయామఖిన్నాః -
మదన వ్యాయాయములతో ఖిన్నులైన
తనుమ్మధ్యమాః -
సన్నని నడుము కల
తాః రాక్షసేంద్రస్య యోషితాః -
ఆ రాక్షసేంద్రుని వనితలు
తేషు తేషు అవకాశేషు ప్రసుప్తాః -
తమ తమ అవకాశము ఉన్నచోటులలో నిద్రపోయిరి

||శ్లోకతాత్పర్యము||

"మదన వ్యాయాయములతో ఖిన్నులైన, సన్నని నడుము కల ఆ రాక్షసేంద్రుని వనితలు తమ తమ అవకాశము ఉన్నచోటులలో నిద్రపోయిరి" ||10.35||

||శ్లోకము 10.36||

అఙ్గహారైః తథైవాన్యా కోమలైరైర్వృత్తశాలినీ|
విన్యస్త శుభసర్వాఙ్గీ ప్రసుప్తా వరవర్ణినీ||10.36||

స|| అన్యా నృత్తశాలినీ వరవర్ణినీ కోమలైః అంగహారైః తథైవ విన్యస్త శుభ సర్వాంగీ ప్రసుప్తా ||

||శ్లోకార్థములు||

అన్యా నృత్తశాలినీ వరవర్ణినీ -
అందులో ఒక వరవర్ణిని నృత్యశాలిని
కోమలైః అంగహారైః -
కోమలమైన అంగములతో
తథైవ విన్యస్త శుభ సర్వాంగీ -
అలాగే నృత్య భంగిమలో
ప్రసుప్తా - శయనించుయున్నది

||శ్లోకతాత్పర్యము||

"అందులో ఒక వరవర్ణిని, నృత్యశాలిని, కోమలమైన అంగములతో అలాగే నృత్య భంగిమలో శయనించుయున్నది." ||10.36||

||శ్లోకము 10.37||

కాచిద్వీణాం పరిష్వజ్య ప్రసుప్తా సంప్రకాశతే|
మహానదీ ప్రకీర్ణేన నళినీ పోత మాశ్రితా||10.37||

స||వీణాం పరిష్వజ్య ప్రసుప్తా కాచిత్ మహానదీప్రకీర్ణా పోతం ఆశ్రితా నళినీ ఇవ సంప్రకాశతే||

||శ్లోకార్థములు||

కాచిత్ వీణాం పరిష్వజ్య ప్రసుప్తా -
వీణను కౌగిలించికొని నిద్రపోతూ వున్న ఒక వనిత
మహానదీప్రకీర్ణా -
మహానదీ ప్రవాహములో పోతూ
పోతం ఆశ్రితా -
పడవను ఆశ్రయించిన
నళినీ ఇవ సంప్రకాశతే -
లత వలె ఒప్పారుచున్నది

||శ్లోకతాత్పర్యము||

"వీణను కౌగిలించికొని నిద్రపోతూ వున్న ఒక వనిత మహానదీ ప్రవాహములో పోతూ ఒక పడవకి తగిలిన (పడవని ఆశ్రయించిన) లత వలే ఒప్పుతూ వున్నది."||10.37||

||శ్లోకము 10.38||

అన్యాకక్షగతేనైవ మడ్డుకేనాసితేక్షణా|
ప్రసుప్తా భామినీ భాతి బాలపుత్రేన వత్సలా||10.38||

స||అన్యా అసితేక్షణా కక్షగతేనైవ మడ్డుకేన ప్రసుప్తా ఇవ వత్సలా బాలపుత్రా భామినీ ఇవ భాతి ||

||శ్లోకార్థములు||

అన్యా అసితేక్షణా -
ఇంకొక నల్లని కళ్ళు గల వనిత
కక్షగతేనైవ మడ్డుకేన ప్రసుప్తా -
చంకలో మడ్డుకమును పట్టుకోని నిద్రపోతూ
వత్సలా బాలపుత్రా భామినీ ఇవ భాతి -
వాత్సల్యముతో బాలకపుత్రుని ఎత్తుకొని ఉన్నభామిని వలె విరాజిల్లెను

||శ్లోకతాత్పర్యము||

"ఇంకొక నల్లని కళ్ళు గల వనిత చంకలో మడ్డుకమును పట్టుకోని నిద్రపోతూ బాలకపుత్రుని వాత్సల్యముతో ఎత్తుకొని ఉన్నభామిని వలె విరాజిల్లెను" ||10.38||

||శ్లోకము 10.39||

పటహం చారుసర్వాఙ్గీ పీడ్యశేతే శుభస్తనీ|
చిరస్య రమణం లబ్ధ్వా పరిష్వజ్యేవ భామినీ||39||

స|| చారుసర్వాంగీ శుభస్తనీ భామినీ చిరస్య రమణం లబ్ధ్వా పటహం పరిష్వజ్యేవ పీడ్య శేతే (భామినీ దదర్శ)||

రామ టీకాలో - చారుసర్వాఙ్గీ అన్యా చిరస్య బహుకాలాత్ రమణం లబ్ధ్వా రమణం పతిం లబ్ధ్వా అతఏవ పరిష్వజ్య కామినీ ఇవ పటహమ్ న్యస్య పరిష్వజ్యస శేతే ।

||శ్లోకార్థములు||

చారుసర్వాంగీ శుభస్తనీ భామినీ -
సుందరమైన అంగములు కల, శుభకరమైన స్తనములు కల ఒక భామిని
చిరస్య రమణం లబ్ధ్వా భామినీ ఇవ-
చిరకాలము పిమ్మట రమించిన భామిని వలె
పటహం పరిష్వజ్య పీడ్య శేతే -
పటహము అను వాద్యమును గట్టిగా కౌగిలించికొని నిద్రపోయెను

||శ్లోకతాత్పర్యము||

"సుందరమైన అంగములు కల, శుభకరమైన స్తనములు కల ఒక భామిని, చిరకాలము పిమ్మట రమణించిన భామిని వలె పటహము అను వాద్యమును గట్టిగా కౌగిలించికొని నిద్రపోయెను." ||10.39||

||శ్లోకము 10.40||

కాచిద్వంశం పరిష్వజ్య సుప్తా కమలలోచనా|
రహః ప్రియతమం గృహ్య సకామేన చ కామినీ||40||

స||కమలలోచనా కాచిత్ వంశమ్ పరిష్వజ్య రహః ప్రియతమమ్ గృహ్య సకామా కామినీ ఇవ సుప్తా (కామినీం దదర్శ)||

||శ్లోకార్థములు||

కమలలోచనా కాచిత్ వంశమ్ పరిష్వజ్ -
ఇంకొక కమలములవంటి కళ్ళు గల వనిత వేణువును కౌగలించుకొని
రహః ప్రియతమమ్ గృహ్య -
రహస్యముగా ప్రియతమతో కలిసిన
సకామా కామినీ ఇవ సుప్తా -
కామముపొందిన కామినివలే నిద్రపోయెను

||శ్లోకతాత్పర్యము||

"ఇంకొక కమలములవంటి కళ్ళు గల వనిత వేణువును గాఢముగా కౌగలించుకొని రహస్యముగా ప్రియతమతో కలిసిన కామినివలే నిద్రపోయెను."||10.40||

||శ్లోకము 10.41||

విపఞ్చీం పరిగృహ్యాన్యా నియతా నృత్తశాలినీ|
నిద్రావశమనుప్రాప్తా సహకాంతేవ భామినీ||10.41||

స|| నృత్తశాలినీ అన్యా విపంచీం పరిగృహ్య నియతా సహకాంతా భామినీ ఇవ నిద్రావశమ్ అనుప్రాప్తా (భామినీం దదర్శ)||

||శ్లోకార్థములు||

నృత్తశాలినీ అన్యా విపంచీం పరిగృహ్య -
ఇంకొక నృత్యశాలిని ఒక విపంచి అనబడు వీణను హృదయమునకు హత్తుకొని
నియతా సహకాంతా భామినీ ఇవ -
కాంతుని పోందిన స్త్రీ వలె
నిద్రావశమ్ అనుప్రాప్తా - నిద్ర పోయెను

||శ్లోకతాత్పర్యము||

"ఇంకొక నృత్యశాలిని ఒక విపంచి అనబడు ఏడు తంత్రుల వీణను హృదయమునకు హత్తుకొని నిద్రావస్థలో కాంతుని పోందిన స్త్రీ వలె నిద్ర పోయెను". ||10.41||

||శ్లోకము 10.42||

అన్యాకనకసంకాశైః మృదుపీనైః మనోరమైః|
మృదఙ్గం పరిపీడ్యాఙ్గైః ప్రసుప్తా మత్తలోచనా||10.42||

స|| మత్తలోచనా అన్యా కనకసంకాశైః మృదుపీనైః మనోహరైః అఙ్గైః మృదఙ్గం పరిపీడ్య ప్రసుప్తా ||

||శ్లోకార్థములు||

మత్తలోచనా అన్యా కనకసంకాశైః -
ఇంకొక బంగారు వర్ణముకల మత్తలోచన
మృదుపీనైః మనోహరైః అఙ్గైః -
మృదువైన మనోహరమైన అవయవాలతో
మృదఙ్గం పరిపీడ్య ప్రసుప్తా -
మృదంగమును గట్టిగా కౌగలించుకొని నిద్రించెను.

||శ్లోకతాత్పర్యము||

"ఇంకొక మత్తలోచన బంగారు వర్ణముకల మృదువైన మనోహరమైన అవయవాలతో ఒక మృదంగమును గట్టిగా కౌగలించుకొని నిద్రించెను." ||10.42||

||శ్లోకము 10.43||

భుజపార్శ్వాన్తరస్థేన కక్షగేణ కృశోదరీ|
పణవేన సహానిన్ద్యా సుప్తా మదకృతశ్రమా||10.43||

స|| అనింద్యా కృశోదరీ మదకృత శ్రమా భుజపార్స్వాన్తరస్థేన కక్షగేన పణవేన సహ సుప్తా||

||శ్లోకార్థములు||

అనింద్యా కృశోదరీ -
అనింద్యమైన కృశోదరము కల
మదకృత శ్రమా -
మదనకార్యముల శ్రమతో
భుజపార్స్వాన్తరస్థేన కక్షగేన -
చంకలో బాహువులతో
పణవేన సహ సుప్తా -
పటవము అనే వాద్యముతో నిదురించెను

||శ్లోకతాత్పర్యము||

"అనింద్యమైన కృశోదరము కల, మదనకార్యముల శ్రమతో చంకలో బాహువులతో పణవమనే వాద్యాముతో నిద్రపోయెను." ||10.43||

||శ్లోకము 10.44||

డిణ్డిమం పరిగృహ్యాన్యా తథైవాసక్త డిణ్డిమా|
ప్రసుప్తా తరుణం వత్సం ఉపగుహ్యేన భామినీ||10.44||

స|| ఆసక్తడిణ్డిమా అన్యా డిణ్డిమం పరిగృహ్య తరుణం వత్సం ఉపగృహ్య ఇవ సుప్తా||

తిలక టీకాలో - డిణ్డిమం పరిగృహ్య ఆలిఙ్గ్య।తరుణం రమ్యం వత్సం పుత్రం చ పరిగృహ్య ప్రసుప్తేవ।

||శ్లోకార్థములు||

ఆసక్తడిణ్డిమా -
దిణ్డిమముపై ఆసక్తిగల
అన్యా డిణ్డిమం పరిగృహ్య -
ఒక ఆమె డిణ్డిమము పట్టుకోని
తరుణం వత్సం ఉపగృహ్య ఇవ -
ఒక చిన్న శిశువును ఎత్తుకున్న స్త్రీవలె
ప్రసుప్తా - నిదురించుచుండెను

||శ్లోకతాత్పర్యము||

"మరొక వనిత డిణ్డిమము అనబడే వాద్యమును పట్టుకొని ఇంకొక డిణ్డిమమును కౌగలించుకొని నిద్రపోతూ , ప్రియుని కౌగలించుకుంటూ ఇంకో చేతులో శిశువును ఎత్తుకున్న స్త్రీవలె నుండెను." ||10.44||

||శ్లోకము 10.45||

కాచిదాడమ్బరం నారీ భుజసంయోగపీడితమ్|
కృత్వా కమలపత్త్రాక్షీ ప్రసుప్తా మదమోహితా||10.45||

స||కమలపత్రాక్షీ కచిత్ నారీ అడమ్బరమ్ భుజసంయోగ పీడితమ్ కృత్వా మదమోహితా ప్రసుప్తా||

రామ టీకాలో - కాచిత్ నారీ ఆడమ్బరం వాద్య విశేషం భుజసంయోగేన భుజ ఆలిఙ్గనేన పీడితం కృత్వా ప్రసుప్తా।

||శ్లోకార్థములు||

కమలపత్రాక్షీ కచిత్ నారీ అడమ్బరమ్ -
ఒక కమలపత్రాక్షి ఆడంబరమను వాద్యమును
భుజసంయోగ పీడితమ్ కృత్వా-
భుజములతో కౌగలించుకొని
మదమోహితా ప్రసుప్తా -
మదమోహితయై నిద్రపోతున్నది.

||శ్లోకతాత్పర్యము||

"ఒక కమలపత్రాక్షి ఆడంబరమను వాద్యమును భుజములతో కౌగలించుకొని మదమోహితయై నిద్రపోతున్నది". ||10.45||

||శ్లోకము 10.46||

కలశీ మపవిధ్యాన్యా ప్రసుప్తా భాతి భామినీ|
వసన్తే పుష్పశబలా మాలేవ పరిమార్జితా||46||

స||కలశీం అపవిధ్య ప్రసుప్తా అన్యా భామినీ వసన్తే పరిమార్జితా పుష్పశబలా మాలేవ భాతి ||

రామటీకాలో - ప్రసుప్తా కలశీం జలపూర్ణఘటీం అపవిధ్య హస్తప్రక్షేపాదినా విపర్యాస్య పరమార్జితా ప్రసుప్తా పుష్ప శబలా శబలిత పుష్ప అన్యా పరమార్జితా గ్లానిదూరీకర్ణాయ కృతమార్జనా పుష్ప మాలేవ భాతి।

||శ్లోకార్థములు||

కలశీం అపవిధ్య ప్రసుప్తా -
నిద్రలో కలశమును తన్ని
అన్యా భామినీ - ఇంకొక భామిని
వసన్తే - వసంత ఋతువులో
పరిమార్జితా - తడుప బడిన
పుష్పశబలా మాలేవ భాతి -
పుష్పముల మాల వలె కనపడుచున్నది

||శ్లోకతాత్పర్యము||

"నిద్రలో కలశమును తన్ని ఆ నీటితో తడిసిన ఒక భామిని వసంతఋతువులో నీటితో తడపబడిన పుష్పమాల లాగ వుండెను." ||10.46||

||శ్లోకము 10.47||

పాణిభ్యాంచ కుచౌ కాచిత్ సువర్ణకలశోపమౌ|
ఉపగుహ్యాబలాసుప్తా నిద్రా బలపరాజితా ||10.47||

స|| కాచిత్ అబలా పాణిభ్యాం సువర్ణకలశోపమౌ కుచౌ ఉపగుహ్య నిద్రాబలపరాజితా సుప్తా||

||శ్లోకార్థములు||

కాచిత్ అబలా - ఇంకొక వనిత
పాణిభ్యాం - తన చేతులతో
సువర్ణకలశోపమౌ కుచౌ -
బంగారు కలశములను పోలిన తన కుచద్వయమును
ఉపగుహ్య - హత్తుకొని
నిద్రాబలపరాజితా సుప్తా -
నిద్రాబలముచేత పరాజిత అయి నిద్రపోవుచున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఇంకొక వనిత బంగారు కలశములను పోలిన తన కుచద్వయమును తన చేతులతో హత్తుకొని నిద్రాబలముచేత పరాజిత అయి నిద్రపోవుచున్నది." ||10.47||

||శ్లోకము 10.48||

అన్యాకమలపత్రాక్షీ పూర్ణేన్దుసదృశాననా|
అన్యామాలిఙ్గ్య సుశ్రోణీం ప్రసుప్తా మదవిహ్వలా||48||

స|| కమలపత్రాక్షీ పూర్ణేందుసదృశాననా అన్యా మదవిహ్వలా సుశ్రోణీమ్ అన్యాం ఆలింగ్య ప్రసుప్తా||

||శ్లోకార్థములు||

కమలపత్రాక్షీ -
ఇంకొక కమలపత్రాక్షి
పూర్ణేందుసదృశాననా -
పూర్ణచంద్రుని తో సదృశమైన వదనము కల
మదవిహ్వలా సుశ్రోణీమ్ అన్యాం ఆలింగ్య -
మత్తులో ఇంకొక అందమైన సుశ్రోణీ అగు వనితను కౌగలించుకొని
ప్రసుప్తా -నిద్రించుచున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఇంకొక కమలపత్రాక్షి పూర్ణచంద్రుని తో సదృశమైన వదనము కలది, మత్తులో ఇంకొక అందమైన సుశ్రోణీ అగు వనితను కౌగలించుకొని నిద్రించుచున్నది." ||10.48||

||శ్లోకము 10.49||

అతోద్యాని విచిత్రాణి పరిష్వజ్య వరస్త్రియః|
నిపీడ్య చ కుచైః సుప్తాః కామిన్యః కాముకాన్ ఇవ||49||

స|| వరస్త్రియః విచిత్రాణి ఆతోద్యాని పరిష్వజ్య కామిన్యః కాముకానివ కుచైః నిపీడ్య సుప్తా||

||శ్లోకార్థములు||

వరస్త్రియః విచిత్రాణి ఆతోద్యాని పరిష్వజ్య -
కొందరు వరస్త్రీలు విచిత్రమైన వాద్యములను కౌగలించుకొని
కామిన్యః కాముకానివ -
కామనిలు కాముకలను కౌగలించుకున్నట్లు
కుచైః నిపీడ్య సుప్తా -
కుచములను పట్టుకొని నిద్రించుచున్నారు

||శ్లోకతాత్పర్యము||

"కొందరు వరస్త్రీలు విచిత్రమైన వాద్యములను కౌగలించుకొని, కామనిలు కాముకలను కౌగలించుకున్నట్లు కుచములను పట్టుకొని అక్కడ నిద్రపోతున్నారు." ||10.49||

||శ్లోకము 10.50||

తాసామ్ ఏకాన్త విన్యస్తే శయానాం శయనే శుభే|
దదర్శ రూపసంపన్నాం అపరాం స కపిః స్త్రియమ్||50||

స|| స కపిః తాసాం ఏకాన్త విన్యస్తే శుభే శయనే శయానమ్ రూపసంపన్నామ్ స్త్రియమ్ దదర్శ||

తిలక టీకాలో - అథ ప్రథాన మహిషీ దర్శనమ్ ।

||శ్లోకార్థములు||

తాసాం ఏకాన్త విన్యస్తే -
వారిలో ఏకాంతముగా
శుభే శయనే శయానమ్ -
శుభమైన శయనములో శయనించుచున్న
రూపసంపన్నామ్ స్త్రియమ్ -
రూపసంపన్నముగల ఒక స్త్రీని
స కపిః దదర్శ - ఆ వానరుడు చూచెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ వానరుడు వారిలో ఏకాంతముగా శుభమైన శయనములో శయనించుచున్న రూపసంపన్నముగల ఒక స్త్రీని చూచెను."||10.50||

||శ్లోకములు 10.51,52||

ముక్తామణి సమాయుక్తైః భూషణైః సువిభూషితామ్|
విభూషయన్తీమివ తత్ స్వశ్రియా భవనోత్తమమ్||10.51||
గౌరీం కనకవర్ణాభాం ఇష్టాం అన్తఃపురేశ్వరీమ్|
కపిర్మండోదరీం తత్ర శయానాం చారురూపిణీమ్||10.52||

స||ముక్తామణి సమాయుక్తైః భూషణైః సువిభూషితాం తత్ స్వశ్రియా తత్ భవనోత్తమమ్ విభూషయంతీం ఇవ గౌరీం కనకవర్ణాభామ్ ఇష్టాం అంతఃపురేశ్వరీమ్ చారురూపిణీమ్ తత్ర శయానాం మండోదరీం (దదర్శ)||

రామటీకాలో - తాసాం సమీపే ఏకాన్తవిన్యస్తే శయనే శయానాం రూపసంపన్నామ్ తాం ఉత్తమాం స్వశ్రియా సుశోభయా భవనోత్తమం విభూషయన్తీమ్ గౌరీం గౌరవర్ణామ్ ఇష్టాం రావణోత్కటేచ్ఛావిషయీభూతామ్ అన్తః పురేశ్వరీమ్ స్త్రియమ్ దదర్శ। సార్థ శ్లోకద్వయం ఏకాన్వయీ।

తిలక టీకాలో - గౌరీమ్ పీతామ్ అతఏవ కనకవర్ణాభామిష్టామ్ రావణస్య అతిప్రియామ్, అంతఃపురేశ్వరీమ్అన్తః పుర స్త్రీణామ్ ఈశ్వరీమ్కపిః మణ్డోదరీమ్ దదర్శ।

||శ్లోకార్థములు||

ముక్తామణి సమాయుక్తైః భూషణైః-
మణులు రత్నములతో కూడిన
భూషణైః సువిభూషితాం -
ఆభరణములతో అలంకరింపబడిన
తత్ స్వశ్రియా తత్ భవనోత్తమమ్ విభూషయంతీం ఇవ -
తన కాంతులతో ఆ ఉత్తమమైన భవనమునకు అందము చూకూర్చుచున్నదా అన్నట్లు ఉన్న
గౌరీం కనకవర్ణాభామ్ -
బంగారు వర్ణము కల,
ఇష్టాం అంతఃపురేశ్వరీమ్ -
రావణునికి ఇష్టమైన, అంతఃపురమునకు రాణి అయిన
తత్ర శయానాం - అక్కడ పడుకొని వున్న
చారురూపిణీమ్ మండోదరీం (దదర్శ) - అందమైన రూపము గల మండోదరిని (చూచెను)

||శ్లోకతాత్పర్యము||

"బంగారుమణులతో కూడిన ఆభరణములతో విభూషితమైన, తన కాంతులతో ఆ ఉత్తమమైన భవనమునకు అందము చూకూర్చుచున్నదా అన్నట్లు ఉన్న, బంగారు వర్ణము కల, రావణునికి ఇష్టమైన, అంతఃపురమునకు రాణి అయిన, అందమైన రూపము గల, నిద్రిస్తున్న మండోదరిని అక్కడ చూచెను." ||10.51,52||

||శ్లోకములు 10.53,54||

సతాం దృష్ట్వా మహాబాహుః భూషితాం మారుతాత్మజః|
తర్కయామాస సీతేతి రూపయౌవనసంపదా||53||
హర్షేణ మహతాయుక్తో ననన్ద హరియూథపః||54||

స|| మహాబాహుః స మారుతాత్మజః భూషితం తాం దృష్ట్వా రూపయౌవ్వనసంపదా సీతా ఇతి తర్కయామాస| హరియూథపః మహతా హర్షేణ యుక్తః ననన్ద||

||శ్లోకార్థములు||

మహాబాహుః స మారుతాత్మజః -
మహాబాహువులుకల ఆ మారుతాత్మజుడు
రూపయౌవ్వనసంపదా -
రూపయవ్వన సంపదములతో కూడిన
భూషితం తాం దృష్ట్వా -
ఆభరణములతో భూషితమైన ఆమెను చూచి
సీతా ఇతి తర్కయామాస -
ఈమె సీతయా అని బావించి
మహతా హర్షేణ యుక్తః -
మహత్తరమైన ఆనందముతో కూడినవాడై
హరియూథపః ననన్ద -
ఆ వానరుడు ఉప్పొంగి పోయెను

||శ్లోకతాత్పర్యము||

"మహాబాహువులు కల ఆ మారుతాత్మజుడు ఆభరణములతో భూషితమైన, రూపసంపన్నము కల ఆమెను చూచి 'ఈమె సీతయా ' అని భావించి మహత్తరమైన ఆనందముతో ఉప్పొంగి పోయెను" ||10.53,54||

||శ్లోకము 10.55||

అస్ఫోటయామాస చుచుమ్బ పుచ్ఛం
ననన్ద చిక్రీడ జగౌ జగామ|
స్తమ్భాన్ ఆరోహాన్ నిపపాత భూమౌ
నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం||55||

స|| ఆస్ఫోటయామాస పుచ్ఛమ్ చుచుంబ ననన్ద చిక్రీడ జగౌ జగామ స్వామ్ కపీణాం ప్రకృతీం నిదర్శయన్ స్తంభాన్ ఆరోహన్ నిపపాత||

రామటీకాలో - ఆస్ఫోటయామాస ఇతి। స్వాం స్వకీయాం కపీనామ్ ప్రకృతిం దర్శయన్ ఆస్ఫోటనాదికమ్ ఆనన్ద సూచకస్వజాతి ధర్మమ్ చకార అత ఏవ స్తంభాన్ ఆరోహత్ నిపపాత చ।

||శ్లోకార్థములు||

ఆస్ఫోటయామాస పుచ్ఛమ్ చుచుంబ ననన్ద -
జబ్బలు చరుచుకుంటూ తోకను ముద్దెట్టుకుంటూ ఆనందపడెను
చిక్రీడ జగౌ జగామ -
ఆటపాటలతో తిరిగెను
స్వామ్ కపీణాం ప్రకృతీం నిదర్శయన్ -
తన కపిత్వము చూపించుచూ
స్తంభాన్ ఆరోహన్ నిపపాత -
స్తంభములను ఎక్కుతూ క్రిందకు దూకెను

||శ్లోకతాత్పర్యము||

తా|| ( ఆ సంతోషముతో) జబ్బలు చరుచుకుంటూ తోకను ముద్దెట్టుకుంటూ ఆటపాటలతో స్తంభములను ఎక్కుతూ క్రిందకు దూకుతూ వానరులకు స్వాబావికమైన ప్రకృతిని ప్రదర్శించెను

ఆ సీతాన్వేషణలో అంతఃపురస్త్రీలలో ప్రధానురాలగు మండోదరిని చూచెను. రూపము యౌవ్వనము లలో ఆమె సీతలాగే ఉండెను. మండోదరికూడా సీతమ్మవలెనే అందకత్తె. యౌవ్వనవతి. హనుమ సీతమ్మ అనుకొనుటకు ఆ రూపము యౌవ్వనమే కారణము. గుణములబట్టి చూచినచో ఆమె సీతమ్మకు సమానురాలు కాదు. తాత్కాలికముగా హనుమంతునికి ఈ ఆలోచన తట్టలేదు. అవిడ సీతయే అనుకొని మహదానందము పడతాడు.

నిండుదనము లేని పసివారికి ఏదైన హర్షకాలము కలిగినచో ఎలాగ ఏట్లెగిరి గంతులు వేయుదురో, అట్లే హనుమంతుడు కూడా ఎగిరి గంతులు వేసెను. ఆ గంతులే ఇది పూర్ణమైన స్థితి కాదని కపిచేష్టితమని సూచించుచూ, "నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం" (10.54) అంటాడు కవి. అంటే కపి ప్రవృత్తిని ప్రదర్శించెను అని అంటాడు.
పిల్లలకు ఏదైనా ఉత్సాహము కలిగినచో గంతులు వేయుదురు. వారి ఆనందము క్రియల చేతనే ఎక్కువగా ఆవిష్కృతము అగును. అదే విషయము సూచించుటకు కవి ఇక్కడ చాలా క్రియా పదములను ఉపయోగించెను.

చూడబడినది నిజమైన సీతకాదని, అతని చేష్టల చేతనే మనకి స్ఫురింప చేయుచూ
చివరికి ఇది కపి ప్రవృతి అని పేర్కొనెను.

కేవలము శాస్త్రములలో చదివి ఊహించి (1) దర్శించినట్లు అనుభవించుట
(2) ప్రత్యక్షముగా దర్శించుట అను ఈ రెండిటికీ భేదమును మండోదరీ దర్శనమున సీతాదర్శనమున మనకు కనపడును.

ఆ రెండింటికి వున్న భేదమే అనుభవమునకు అనుభూతికి ఉన్న తేడా. సీతవలెనున్న మండోదరి చూచినప్పుడు హర్షముతో గంతులు వేసెను. పాటలు వచ్చెను. హర్షము అనుభవించెను. నిజముగా సీతను చూచినపుడు "భాష్పపర్యాకులేక్షణః"(16.2), అంటే కన్నీటితో నిండిన కనులు గలవాడై విచారించుచూ మాట్లాడక యుండిపోయెను.

తుమ్మెద పూవు చుట్టు తిరుగునంతసేపు ధ్వని చేయును. పూవుపై వ్రాలి మకరందమును ఆస్వాదించునపుడు మౌనమే తప్ప ధ్వని చేయదు. అట్లే ఆత్మానుభవము గాని భగవదనుభము కాని పొందువారు కంఠము గద్గదమై ఒడలు గగుర్పొరచి తన్మయత్వములో ఉందురు కాని బాహ్యముగా చేష్టలతో ఆనందమును ఆవిష్కరింపరు.

ఇలా కుప్పిగంతులతో కూడిన హర్షము మనకు తెలియపరచేది, ఇచటి దర్శనము సీతాదర్శనము కాదు అని.

ఇంకొక విశేషము

ఇంకా తొమ్మిదవసర్గలో " అససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివవేశనమ్" అని చెప్పినప్పుడు , హనుమంతుడు పంచకోశములలో మనోమయ కోశము లో ప్రవేశించాడని విన్నాము. ఈ సర్గలో ఆ మనోమయకోశములో నిద్రపోతున్న రావణుని గురించి వింటాము.

మనస్సు నందలి వాసనలు లేదా చిత్త వృత్తులు మూడు దశలు కలిగి వుంటాయి.

(1) సుప్త దశ
(2) క్షీణ దశ
(3) ఉద్బుద్ధ దశ అని.

ఒకప్పుడు చిత్తవృత్తులు నిద్రించు చుండును. ఆ నిద్రలో వాని శక్తి బయటకు ప్రసరింపదు. నిద్రించువాడు ఎంత క్రూరుడైననూ నిద్రలో క్రూరములగు వ్యాపారములను చేయడు

ఎల్లప్పుడూ అసుర రాక్షసములైన చిత్తవృత్తులు, ఆ నిద్రా సమయములో అణగి యుండును. అవి ఒకప్పుడు బాగుగా తగ్గి కృశించినట్లుగా కూడా వుండును. ఆ రాక్షస వృత్తులు కోపము బాగుగా తగ్గినప్పుడు కూడా లేవన్నట్లు ఉండును. కాని చిన్న కణమువలె నున్న నిప్పుపై కొద్దిగా ఊక వేసి రాజబెట్టినచో మరల ఎట్లు అది ప్రజ్వరిల్లునో, అదే విధముగా కృశించిన కామక్రోధాదులు కూడా అనుభవింపదగిన విషయములు లభించినచో మరల విజృంభించును.

కావున మనో వృత్తులు నిద్రాణములై ఉన్నదశలో అన్వేషణ సాగింపవలెను. రాజస తామసములగు భావనలు ప్రకృతివశమున తగ్గియున్నప్పుడే అన్వేషణ సాగించవలెనని దీనిచే సూచింపబడినది.

అట్టి దశలో కూడా దానిని జయింపశక్తి కలవానికి కూడా మనసు భయమునే కలిగించును. అందుకనే శత్రుకర్షణుడైన హనుమంతుడు, వేయిమంది రావణులను చంపగల హనుమంతుడు, నిద్రలో వున్న రావణుని చూచి భయపడి ఒక అడుగు వెనకవేశెను అని వర్ణిస్తాడు వాల్మీకి.

అలాగే ఆత్మ అన్వేషణలో కూడా రాజస తామస ప్రకృతులు అణగబడియున్నప్పుడే
ఆ అత్మాన్వేషణ ముందుకు సాగుతుంది. ప్రతి శ్లోకములో అన్వేషణ లో బాహ్య సౌందర్యము విషయభోగము ఎంత ఆకర్షించునో, దానిని తట్టుకొని అత్మాన్వేషణ సాగుట ఎంతకష్టమో , ఇంద్రియార్థములు ఇంద్రియములను ఎంత బలాత్కరించునో ఈ సర్గలలో మనకు కనపడును.

హనుమంతుని అన్వేషణలో లోకోత్తరమగు సౌందర్య ము కల భవనములు, శిల్పములు, స్త్రీలు, మధురములగు భక్ష్యములు, పానములు కనపడును. అది అంతా చూసి, "స్వర్గోయం దేవలోకోయమ్.." అనుకుంటాడు హనుమ. వానిని అన్నింటినీ చూచుచూ వాటివేపు మనసు పోకుండా సీతాన్వేషణ సాగుచుండును. దీనిని మనకి తెలియ చేయుటకా అన్నట్లు బాహ్యసౌందర్యము ఇక్కడ చాలా అధికముగా వాల్మీకి వర్ణించెను.

బాలకాండలో అయోధ్యాపుర వర్ణన వుంది. సుందరకాండలో లంకానగర వర్ణన వుంది.
అయోధ్యాపుర వర్ణనకు లంకాపుర వర్ణనకు భేదము కనిపిస్తుంది.

అయోధ్యాపురవర్ణనలో పట్టణవర్ణ కన్న ప్రజల వర్ణన అధికముగా కనిపించును. ' నాకుండలీ నామకుటీ నాస్రగ్వీ నాల్పభోగవాన్' అంటూ వారి సంపదను, "ననాస్తికః నచానృతకథః నావిద్వాన్ నా బహుశ్రుతః" అంటూ వారి గుణసంపదను వర్ణించును.

లంకావర్ణనలో భవన యౌవ్వన వర్ణన. ఇది బాహ్యాభ్యుదయము. దీని యందు ఆసక్తి కలిగియుండుటయే ఆత్మబంధ హేతువు. దీని యందు దృష్టి మరలక ఆత్మయందే ఏకాగ్రచిత్తము కలవాడు మాత్రమే అత్మ దర్శనము చేయగలడు.

ఈ రహస్యమును మనకి హనుమంతుని సీతాన్వేషణ మనకు సూచిస్తుంది.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే దశమస్సర్గః||

||om tat sat||

updated 23/10/2022 0555