||సుందరకాండ ||

||పదహేనవ సర్గ తెలుగు శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 15 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ పంచదశస్సర్గః
( శ్లోకార్థ తాత్ప్రర్యములతో)

టీకాత్రయము లో పదహేనవ సర్గ మీదా క్లుప్తముగా ఇలారాస్తారు - "శింశుపాగ్రేఽవస్థితాయ సర్వతః చక్షుషీ ప్రచారయన్ హనుమాన్ చైత్య ప్రాసాదగతాం యథావర్ణిత గుణావస్థోపలక్షితాం తామ్ విలోక్య యుక్తైః బహుభిః హేతుభిః తస్యాః సీతాత్వం నిర్ధారయతి"; అంటే శింశుపావృక్షము పైన కూర్చున్న హనుమ అన్నివేపుల చూస్తూ చైత్యప్రాసాదము దగ్గర సీత ఏవిధముగా ఏగుణములుకలదిగా వర్ణించబడినదో అట్టి గుణములుకల ఆమెను చూచి అనేక హేతువులతో యుక్తిగా అమె సీతయే అని నిర్ధారించుకొనెను అని. ఇది అతి క్లుప్తముగా ఈ సర్గ మీద టీకా త్రయములోచెప్పబడిన కథ

ఇంకా కొంచెము విశదముగా సర్గలో జరిగిన కథ ఇలా చెప్పవచ్చు.

ఆనందకోశము లో వున్న హనుమంతుడు ఆనందముతో పులకితుడైన హనుమంతుడు ఆ అశోకవనములో శింశుపా వృక్షముపై కూర్చుని పరిసర ప్రాంతములు అన్నీ చూస్తాడు. ఆ అశోకవనము నందనవనముతో సమానముగా శోభిస్తున్నది. నందనవనము దేవతల వనము. మృగములతో, పక్షుల తో, కోకిలల కిలకిలారావముతో నిండినది. ఆ అశోకవనికలో మేడలు మిద్దెలు కూడా ఉన్నాయి. ఆ అశోకవనిక బంగారురేకులు గల పద్మములతో నిండిన చెరువులతో శోభిస్తున్నది. ఆ అశోకవనిక అనేకమైన ఆసనములతో భూగృహములతో కూడినది. అలాగ అన్ని ఋతువులలో పుష్పించు కుసుమములు పుష్పములు ఫలములు కలది. రమ్యమైన ఉదయభానుని కిరణములను ప్రజ్వలిస్తూ వున్నది ఆ అశోకవనము.

హనుమ ఆ అశోకవనిక మధ్యలో, దగ్గరలోనే వేయి స్తంభములతో తెల్లని కైలాసములా వున్న, పగడములతో చేయబడిన మెట్లు కల, బంగరుపూతలతో చేయబడిన వేదికలు కల, కళ్ళకి మిరుమిట్లు గొలిపే ఆకాశమును అంటుచున్నదా అని ఉన్నట్లు వున్న ఒక పెద్ద చైత్యప్రాసాదమును చూచెను. ఆ ప్రాసాదము కైలాసము వలె వున్నదన్నమాట. అక్కడ మలినవస్త్రములు ధరించిన, రాక్షసస్త్రీలతో చుట్టబడియున్న, ఉపవాసములతో కృశించియున్న, దీనముగా మరల మరల నిట్టూర్పులు విడుచుచున్న, శుక్ల పక్షములో నిర్మలమైన చంద్రరేఖవలె వున్న, ఒక స్త్రీని హనుమంతుడు చూచును.

పొగచే ఆవృతమైన పొగజ్వాలవలె ఆమె సౌందర్యము స్పష్ఠముగా కానరాక ఉన్నది. జీర్ణించిన ఒక ఉత్తమ తరగతి పీత వస్త్రమును ధరించియున్న ఆవిడ, ఆమె దుఃఖ భారముతో నీళ్ళతో నిండిన కళ్లతో, ఉపవాసములతో కృశించి, దీనముగా ప్రతిక్షణము ధ్యానములో ఉన్నది. అధికమైన మలముతో కృశించియున్న ఆ విశాలాక్షిని చూచి, ఈమె సీతయా అని తర్కించ సాగెను. ' ఈ అంగన ఆ కామరూపి అగు రాక్షసుని చేత తీసుకోపోబడిన సీత రూపము కలది గా కనపడుచున్నది' అని అనుకొనెను. ఆమె ధూమ్రజాలముచేత కప్పబడిన అగ్నిశిఖవలెనున్నది. సందిగ్ధమైన అర్థముగల స్మృతి వాక్యమువలె నున్నది. గుప్తముగా దాచబడిన ఐశ్వర్యము వలె నున్నది. అధికమైన అవిశ్వాసముచే చెడిన శ్రద్ధవలెనున్నది. కార్యము ఫలించని ఆశవలె, విఘ్నము కలిగిన సిద్ధివలె , కలుషమైన బుద్ధివలె నున్నది. అసత్యమగు అపవాదముచే క్షీణించిన కీర్తివలె వున్నది. అలంకారము లేక సంస్కారరహితమై కృశించి ఉన్నఆమెను, అర్ధము లోపించిన శబ్దమును కష్టముగా అర్థముచేసికొనినట్లు, ఆమె యే సీత అని అతి దుఃఖముతో తెలిసికొనగలిగెను.

బంగారువన్నెగల అవయవములతో నున్న రాముని పట్టమహిషి, అపహరింపబడినప్పటికీ ఆయన మనస్సులో చెక్కు చెదరకుండా ఉన్నది. తను రక్షించవలసిన ఆమె అపహరింపబడడము వలన కారుణ్యముతో, తనపై అధారపడిన స్త్రీ కనక దయతో, భార్య పోయినందువలన శోకముతో, తన ప్రియురాలు కాన రావకపోవడము వలన మదన బాధతో, అలాగ నాలుగు విధములుగా రాముడు దుఃఖముతో పరితపిస్తున్నాడు.

ఒకప్పుడు హనుమంతుడు మాల్యవత్పర్వతము నందు సీతావిరహముతో బాధపడుతున్న రాముని చూచెను. అప్పుడు హనుమ "ఏమి ఈ శ్రీరాముడు. ఒక స్త్రీ కోసము ఇంత విలపించుట ఏమి? వశిష్ఠుని శిష్యుడు ఒక స్త్రీకై ఇంత బాధపడుచున్నాడని తనమనస్సులో పరిహాసముగా భావించెను. కాని అ పతివ్రత అయిన సీతను చూచిన తరువాత హనుమంతుని అలోచన మారి ఎంతో గౌరవముతో తలుస్తాడు. 'రామచంద్ర ప్రభువు ఈమె లేకుండా తన దేహమును శోకముతో ధరించకలుగుచున్నాడు అంటే కష్టమైన పని సాధించకలిగాడన్నమాట. ఈ యౌవనముతో అలరారుతున్న ఈ సీతని విడచి ఒక క్షణము కూడా జీవించగలడము మహాబాహువులు కల రాముడు ఒక చేయలేని కార్యము చేసినట్లే వున్నది".

ఈ విధముగా ఆ వాయునందనుడు ఆ సీతను చూచి రాముని మనస్సులో తలచుకొని, రాముని ప్రశంశించి మనస్సులో ఆనందపడెను.

అదే మనము పదహేనవ సర్గలో వినేది.

ఇక శ్లోకార్థతాత్పర్యాలతో పంచ దశ సర్గలో శ్లోకాలు.

||శ్లోకము 15.01||

సవీక్షమాణస్తత్రస్థో మార్గమాణశ్చ మైథిలీమ్|
అవేక్షమాణశ్చ మహీం సర్వాం తామన్వవేక్షత||15.01||

స|| మైథిలీం మార్గమాణః తత్రస్థః వీక్షమాణః తాం అవేక్షమాణః చ సః హనుమాన్ సర్వాం మహీం అవేక్షత||

||శ్లోకార్థములు||

మైథిలీం మార్గమాణః సః హనుమాన్ -
మైథిలి అన్వేషణలో ఆ హనుమంతుడు
తాం అవేక్షమాణః -
ఆమెను చూచుటకై
తత్రస్థః వీక్షమాణః -
అక్కడ (శింశుపా వృక్షములో)నుంచి చూస్తూ
సర్వాం మహీం అవేక్షత -
పరిసర ప్రాంతములు అన్నీ చూడసాగెను

||శ్లోకతాత్పర్యము||

"మైథిలిని వెదుకుతూ ఛూడడానికి అక్కడ కూర్చుని వున్నఆ హనుమంతుడు పరిసర ప్రాంతములు అన్నీ చూడసాగెను." ||15.01||

ఇక్కడ వున్న హనుమ అన్ని అంగములలో ఆనందముతో పులకితుడైన వాడు. అంటే ఆనందమయ కోశములో వున్నవాడు అన్నమాట. అంటే అత్మాన్వేషణ అంతమయ్యే స్థితి అన్నమాట. ఇక శింశుపావృక్ష శాఖలలో, గుబురుగావున్న ఆకుల మధ్యలో, ఎవరికీ కనపడకుండా దాగి, సీతమ్మ సంధ్యావందనాది కార్యక్రమాలకి అటువస్తుంది అనే ధ్యాసతో ఎదురుచూస్తూ, నలువేపులా చూస్తున్న హనుమకి కనపడిన విశేషాలు ఇక వింటాము.

||శ్లోకము 15.02||

సంతానకలతాభిశ్చ పాదపైరుపశోభితామ్ |
దివ్యగన్ధరసోపేతాం సర్వతః సమలంకృతామ్||15.02||

స|| సంతానకలతాభిశ్చ పాదపైః ఉపశోభితామ్ దివ్యగంధరసోపేతామ్ సర్వతః సమలంకృతామ్ (తాం వనికాం మారుతిః సముదైక్షత) ||

||శ్లోకార్థములు||

సంతానకలతాభిశ్చ - సంతానక లతలతో కూడిన
పాదపైః ఉపశోభితామ్ - వృక్షములతో శోభిస్తున్న
దివ్యగంధరసోపేతామ్ - దివ్యమైన వాసనలుగల
సర్వతః సమలంకృతామ్ - అంతటా అలంకరింపబడిన
( అశోకవాటికను చూచెను)

||శ్లోకతాత్పర్యము||

"సంతానక లతలతో కూడిన వృక్షములతో శోభిస్తున్న , దివ్యమైన వాసనలుగల అంతటా అలంకరింపబడిన (ఆ అశోక వనికను చూచెను)". ||15.02||

ఇక్కడనుంచి ఏడు శ్లోకాలలో హనుమకు కనపడిన అశోకవనము యొక్క వర్ణన వస్తుంది. ఈ ఏడు శ్లోకాలమీద రామటీకాలో కొంచెము పదములను విశదీకరిస్తూ రాసిన మాటలు చదవతగినవి. ఇక రామ టీకాలో చెప్పిన మాట. - "సంతానకేతి॥ సంతానకాభిః ఉపశోభితామ్ అత ఏవ నన్దనసంకాశాం నన్దనవన సదృశీం, వాపీభిః ఉపశోభితాం, బహుభిః ఆసనైః కుథైః మహారాజస్థితి యోగ్య కమ్బళ విశేషైః ఉపేతాం, సర్వర్తు కుసుమైః పాదపైః అశోకానాం శ్రియా చ సూర్యోదయప్రభామ్ అసకృత్ వినిష్పతత్భిః విహగైః నిష్పత్రశాఖామివ క్రియమాణాం చిత్రైః పుష్పావతంసకైః ఉపలక్షితైః సమూలపుష్పరచితైః సమూలాని మూలసహితాని యాని పుష్పాణి తైః రచితైః, పుష్పభారేణ అతిపుష్పధారణేన, అతిభారో యేషాం తైః మర్దినీం స్పృశద్భిరివ శోకనాశనైః అశోకైః అశోకవిశేషైః ప్రదీప్తమివ అశోకవనికాం తత్రస్థః శింశుపాయాం స్థితో మారుతిః సముదైక్షత। సప్తం ఏకాన్వయి" ॥

ముందు వచ్చే శ్లోకాల తాత్పర్యము రామ టీకాకు అనుగుణముగానే వస్తుంది.

||శ్లోకము 15.03||

తాం స నన్దనసంకాశాం మృగపక్షిభి రావృతాం|
హర్మ్యప్రాసాద సంభాధాం కోకిలాకులనిస్వనామ్|| 15.03||

స|| తాం నందన సంకాశం పాదపైః ఉపశోభితమ్ మృగపక్షిభిః ఆవృతం కోకిలాకులనిఃశ్వనామ్ హర్మ్యప్రాసాద సంభాదాం (తాం వనికాం దదర్శ) ||

||శ్లోకార్థములు||

నందన సంకాశం - నందనవనముతో సమానముగాగల
పాదపైః ఉపశోభితమ్ - వృక్షములతో శోభిస్తున్న
మృగపక్షిభిః ఆవృతం - మృగాలతో పక్షుల తో నిండిన
కోకిలాకులనిఃశ్వనామ్ - కోకిలల కిలకిలారావముతో నిండిన
హర్మ్యప్రాసాద సంభాదాం - మేడలు మిద్దెలతో కూడిన
( ఆ అశోకకవనిక చూచెను)

||శ్లోకతాత్పర్యము||

"నందనవనముతో సమానముగాగల వృక్షములతో శోభిస్తున్న, మృగాలతో పక్షుల తో నిండిన, కోకిలల కిలకిలారావముతో నిండిన, మేడలు మిద్దెలతో కూడిన;" || 15.03||

ఆ అశోకవనము నందనవనముతో సమానముగా శోభిస్తున్నది అని అంటాడు కవి. నందనవనము దేవతల వనము. అంటే ఇక్కడ ఆ దేవి ఉండతగిన వనము అని స్ఫురిస్తుంది.

||శ్లోకము 15.04||

కాఞ్చనోత్పలపద్మాభిః వాపీభిరుపశోభితామ్|
బహ్వాసనకుథోపేతాం బహుభూమి గృహాయుతామ్||15.04||

స|| (అశోక వనికా) కాంచనోత్పలపద్మాభిః వాపీభిః ఉపశోభితాం బహ్వాసనకుథోపేతాం బహు భూమి గృహాయుతమ్ (అస్తి) ||

||శ్లోకార్థములు||

కాంచనోత్పలపద్మాభిః - బంగారురేకులుగలపద్మములతో నిండిన
వాపీభిః ఉపశోభితాం - చెరువులతో శోభిస్తున్న
బహ్వాసనకుథోపేతాం - అనేకమైన ఆసనములతో
బహుభూమి గృహాయుతమ్ - అనేకమైన భూగృహములతో కూడిన
( ఆ అశోకకవనిక చూచెను)

||శ్లోకతాత్పర్యము||

"ఆ అశోకవనిక బంగారురేకులుగలపద్మములతో నిండిన చెరువులతో శోభిస్తున్నది. అనేకమైన ఆసనములతో భూగృహములతో కూడినది" ||15.04||

||శ్లోకము 15.05||

సర్వర్తుకుసుమై రమ్యాం ఫలవద్భిశ్చ పాదపైః|
పుష్పితానాం అశోకానాం శ్రియా సూర్యోదయప్రభామ్||15.05||
ప్రదీప్తమివ తత్రస్థో మారుతిః సముదైక్షత|

స|| (తత్ అశోకవనికా) సర్వర్తుకుసుమైః ఫలవద్భిః పుష్పితానాం అశోకానాం పాదపైః రమ్యాం, సూర్యోదయ ప్రభాం ఇవ ప్రదీప్తం (వనికామ్) తత్రస్థః మారుతిః సముదైక్షత ||

||శ్లోకార్థములు||

సర్వర్తుకుసుమైః ఫలవద్భిః -
అన్ని ఋతువులలో పుష్పించు కుసుమములు ఫలములు కల
పుష్పితానాం అశోకానాం -
పుష్పించుచున్న అశోక వృక్షములతో
సూర్యోదయ ప్రభాం ఇవ ప్రదీప్తం -
ఉదయభానుని తేజస్సుతో ప్రజ్వలిస్తున్న
తత్రస్థః మారుతిః సముదైక్షత - అక్కడ వున్న హనుమ చూచెను

||శ్లోకతాత్పర్యము||

"అన్ని ఋతువులలో పుష్పించుకుసుమములు పుష్పములు ఫలములు కల రమ్యమైన పుష్పించుచున్న అశోక వృక్షములతో, ఉదయభానుని కిరణముల వలె ప్రజ్వలిస్తూ వున్న అశోకవనమును ఆ వృక్షముపైనున్న మారుతి చూచెను." ||15.05||

ఆ వనము క్రింద నించి పై దాకా పుష్పములతో నిండిన, శోకమును నాశనము చేయు అశోకవృక్షములతో నిండి యున్నది. అంటే సీతాన్వేషణ ఫలించలేదు అను శోకమును నాశనము చేయుటకు తగిన వనము అన్నమాట

||శ్లోకము 15.06,07||

నిష్పత్రశాఖాం విహగైః క్రియమానా మివాసకృత్||15.06||
వినిష్పతద్భిః శతశః చిత్రైః పుష్పావతంసకైః|
అమూలపుష్పనిచితైః అశోకైః శోకనాశనైః||15.07||

స|| అసకృత్ వినిష్పతద్భిః శతశః విహగైః నిష్పత్రశాఖాం క్రియమాణాం ఇవ చిత్రైః పుష్పావతంసకైః అమూలపుష్పనిచితైః శోకనాశనైః అశోకైః (అస్తి) ||

||శ్లోకార్థములు||

అసకృత్ వినిష్పతద్భిః శతశః విహగైః -
తరచుగా వందలకొలదీ పక్షులు వాలడమువలన రాలిపోయిన ఆకులు గల వృక్షములు
నిష్పత్రశాఖాం క్రియమాణాం ఇవ చిత్రైః -
చిత్రీకరింపబడిన పత్రములు లేని వృక్షములవలె నున్న
పుష్పావతంసకైః అమూలపుష్పనిచితైః -
క్రిందనించి పై దాకా పుష్పములతో నిండిన యున్న
శోకనాశనైః అశోకైః -
శోకమును నాశనము చేయు అశోకవృక్షములతో (నిండియున్నది)

||శ్లోకతాత్పర్యము||

"(ఆ అశోకవనములో) వందలకొలదీ పక్షులు వాలడమువలన రాలిపోయిన ఆకులు గల శాఖలతో వున్న వృక్షములు చిత్రీకరింపబడినట్లు వున్నాయి. శోకమును నాశనము చేయు అశోకవృక్షములతో ఆ వనిక క్రిందనించి పై దాకా పుష్పములతో నిండిన యున్నది." ||15.06,07||

"అశోకైః శోకనాశనైః" శోకము నాశనము చేయు అశోకవృక్షములతో నిండినది అని చెప్పడములో, ఇక్కడ సీతమ్మ కనపడలేదు అనే దుఃఖము నాశనము కాగలదు అని ఒక ధ్వని.

||శ్లోకము 15.08||

పుష్పభారాతిభారైశ్చ స్పృశద్భిరివ మేదినీం|
కర్ణికారైః కుశుమితైః కింశుకైశ్చ సుపుష్పితైః||15.08||

స|| పుష్పభారాతిభారైశ్చమేదినీం స్పృశద్భిః ఇవ కుశుమితైః కర్ణికారైః కింశుకైశ్చ సుపుష్పితైః (తాం వనికాం మారుతిః దదర్శ)||

||శ్లోకార్థములు||

పుష్పభారాతిభారైశ్చ -
బాగా విరబూచిన పుష్పముల భారముతో
మేదినీం స్పృశద్భిః ఇవ -
భూమిని స్పృశించుచున్నవా అన్నట్లు వున్న
కుశుమితైః కర్ణికారైః - కుసుమములతో, కర్ణికారములతో
కింశుకైశ్చ సుపుష్పితైః -
బాగుగా పుష్పించిన కింశుక వృక్షములతో (నిండియున్నది)

||శ్లోకతాత్పర్యము||

"బాగా విరబూచిన పుష్పముల భారముతో భూమిని స్పృశించుచున్నవా అన్నట్లు వున్న కర్ణికార, కింశుక వృక్షములతో నిండి యున్నది"||15.08||

||శ్లోకము 15.09||

స దేశః ప్రభయా తేషాం ప్రదీప్త ఇవ పర్వతః|
పున్నగా సప్తవర్ణాశ్చ చమ్పకోద్దాలకాస్తథా||15.09||
వివృద్ధమూలా బహవః శోభన్తే స్మ సుపుష్పితాః|

స|| తేషాం ప్రభయా సః దేశః సర్వతః ప్రదీప్త ఇవ| వివృద్ధమూలాః సుపుష్పితాః పున్నగాః సప్తపర్ణస్చ తథా చంపకాః ఉద్దాలకాః శోభన్తే స్మ||

||శ్లోకార్థములు||

తేషాం ప్రభయా -
ఆ వృక్షముల కాంతులతో
సః దేశః సర్వతః ప్రదీప్త ఇవ -
ఆ ప్రదేశము అంతా ప్రజ్వలిస్తున్నట్లు వుంది
వివృద్ధమూలాః సుపుష్పితాః పున్నగాః -
పుష్పములతో పూర్తిగా నిండిన పున్నాగ,
సప్తపర్ణస్చ తథా చంపకాః ఉద్దాలకాః శోభన్తే స్మ-
సప్తపర్ణ చంపక అలాగే ఉద్దాలక వృక్షములు శోభించుచున్నాయి.

||శ్లోకతాత్పర్యము||.

"ఆ వృక్షముల కాంతులతో ఆ ప్రదేశము అంతా ప్రజ్వలిస్తున్నట్లు వుంది. అక్కడ పుష్పములతో పూర్తిగా నిండిన పున్నాగ, అలాగే సప్తపర్ణ చంపక ఉద్దాలక వృక్షములు శోభించుచున్నాయి."||15.09||

||శ్లోకము 15.10||

శాతకుమ్భనిభాః కేచిత్ కేచిదగ్ని శిఖోపమాః||15.10||
నీలాఙ్జననిభాః కేచిత్ తత్రాఽశోకా సహస్రశః|

స|| తత్ర సహస్రశః కేచిత్ శాతకుమ్భనిభాః కేచిత్ అగ్నిశిఖోపమాః కేచిత్ నీలాంజననిభాః అస్తి||

||శ్లోకార్థములు||

తత్ర సహస్రశః - అక్కడ వేలకొలది వున్న అశోకవృక్షములలో
కేచిత్ శాతకుమ్భనిభాః- కొన్ని బంగారుకాంతులతో
కేచిత్ అగ్నిశిఖోపమాః - కొన్ని అగ్నిశిఖలులాగ వున్నాయి
కేచిత్ నీలాంజననిభాః అస్తి - కొన్ని కాటుక రంగులో

||శ్లోకతాత్పర్యము||

"అక్కడ వేలకొలది వున్న అశోకవృక్షములలో కొన్ని బంగారుకాంతులతో శోభిస్తున్నాయి. కొన్ని అగ్నిశిఖలులాగ వున్నాయి.కొన్ని కాటుక రంగులో భాసిస్తున్నాయి."||15.10||

తిలకటీకాలో - నీలాఞ్జననిభా ఇతి। ఏవం ఉక్త్యాఽశోకానామనేకవర్ణపుష్పత్వం సూచితమ్ ఇతి ||; అంటే కొన్ని కాటుక రంగులో భాసిస్తున్నాయి అనడములో అశోకవనములో అనేకరంగులు వున్నాయి అని సూచింపబడుతోంది అన్నమాట. .

||శ్లోకము 15.11-12||

నన్దనం వివిధోద్యానం చిత్రం చైత్రరథం యథా||15.11||
అతివృత్త మివాచిన్త్యం దివ్యం రమ్యం శ్రియా వృతం|
ద్వితీయ మివ చాకాశం పుష్పజ్యోతి ర్గణాయుతమ్ ||15.12||

స|| వివిధ ఉద్యానమ్ నందనం యథా చిత్రం చైత్రరథం యథా అతివృత్తం అచింత్యం దివ్యం రమ్యం శ్రియా వృతం పుష్పజ్యోతిర్గణాయుతం ద్వితీయం ఆకాశమ్ ఇవ||

మళ్ళీ నాలుగు శ్లోకాలలో అశోక ఉద్యాన వర్ణన వస్తుంది. దాని మీద తిలక టికాలో రాయబడినమాట చదవతగినది.

ఇక తిలక టీకాలో - వివిధోద్యానమ్ నన్దనమివ నన్దనమ్ ఆనన్దకమ్ చైత్రరథమ్ కుబేరవనం ఇవ, చిత్రం యథేత్యుభయాన్వయి అతివృత్తమ్ ఉపమానీభూత వన ద్వయాభ్యాం అధికమ్, ద్వితీయాకాశం ఇవ పుష్పరూప జ్యోతిర్గణైః ఆయుతం వ్యాప్తం, పఞ్చమం సాగరమివ పుష్పరూప అనేక రత్నైశ్చిత్రమ్, సర్వేషు ఋతుషు పుష్పాణీ యేషు తైః పాదపైః నిచితం వ్యాప్తం, నానానినదైః అనేకవిధనినాద విశిష్టైః మృగగణద్విజైః, రమ్యం గన్ధాడ్యమ్ ద్వితీయం గన్ధమాధనం ఇవ అనేక గన్ధ ప్రవహమ్ అత ఏవ పుణ్యగన్ధైః మనోహరమ్ ఉద్యానం శుశుభే ఇతి శేషః శ్లోక చతుష్టయమ్ ఏకాన్వయి||

||శ్లోకార్థములు||

వివిధ ఉద్యానమ్ నందనం యథా -
వివిధ ఉద్యానములతో నందన ఉద్యానము వలె నున్నది
చిత్రం చైత్రరథం యథా -
అనేక రంగులుకల ఆ ఉద్యానము చైత్రరథము అనే ఉద్యానము వలె నున్నది
అతివృత్తం అచింత్యం దివ్యం రమ్యం శ్రియా వృతం-
వూహకి అందని అతి దివ్యము రమ్యము శ్రియముతో వున్న ఆ ఉద్యానవనము
పుష్పజ్యోతిర్గణాయుతం -
పుష్పరూపముగల జ్యోతిర్గణములతో నిండి
ద్వితీయం ఆకాశమ్ ఇవ -
రెండవ ఆకాశము వలె నున్నది

||శ్లోకతాత్పర్యము||

"వివిధ ఉద్యానములతో వున్న ఆ అశోక వనము నందన ఉద్యానము వలె నున్నది. అనేక రంగులుకల ఆ ఉద్యానము కుబేరుని చైత్రరథము అనే ఉద్యానము వలె నున్నది. ఊహకి అందని, అతి దివ్యము రమ్యము శ్రియముతో వున్న ఆ ఉద్యానవనము పుష్ప రూపముగల జ్యోతిర్గణములతో నిండి యున్న రెండవ ఆకాశము వలె నున్నది."||15.11,12||

తిలకటీకాలో - "వివిధోద్యానమ్ నన్దనమ్, యథా నన్దనమాహ్లాదకమ్ తద్వత్ ఆహ్లాదకమ్ చైత్ర రథం కుబేరవనం యథా చిత్రమ్ తద్విచిత్రమ్ ॥ అంటే నందనవనములా వివిధ ఉద్యానములు వున్నాయి అనడములో నందనవనము ఎంత ఆహ్లాదకరమో ఇక్కడి ఉద్యానములు కూడా అంత ఆహ్లాదకరముగా వున్నాయి అని సూచింపబడుతోంది అని. అంటే సీతమ్మకి తగిన వనము అని కూడా ధ్వని.

||శ్లోకము 15.13-14||

పుష్పరత్నశతై శ్చిత్రం పఞ్చమం సాగరం యథా |
సర్వర్తుపుష్పైర్నిచితం పాదపైర్మధుగన్దిభిః||15.13||
నానానినాదైరుద్యానం రమ్యం మృగగణైర్ద్విజైః|
అనేక గన్ధప్రవహం పుణ్యగన్ధం మనోరమమ్||15.14||
శైలేంద్రమివ గన్ధాఢ్యం ద్వితీయం గన్ధమాదనమ్|

స|| పుష్పరత్నశతైః చిత్రం , పఞ్చమం సాగరం యథా సర్వఋతుపుష్పైః మధుగన్ధిభిః పాదపైః , ద్విజైః మృగ గణైః నానానినాదైః నిచితం రమ్యం అనేకగన్ధప్రవహం గన్ధాఢ్యం పుణ్యగంధం మనోరమమ్ ద్వితీయం గన్ధమాదనమ్ శైలేంద్రమివ అస్తి ||

ఇక తిలక టీకాలో - "పఞ్చమం సాగరమివ పుష్పరూప అనేక రత్నైశ్చిత్రమ్ సర్వేషు ఋతుషు పుష్పాణీ యేశు తైః పాదపైః నిచితం వ్యాప్తం, నానానినదైః అనేకవిధనినాద విశిష్టైః మృగగణద్విజైః, రమ్యం గన్ధాడ్యమ్ ద్వితీయం గన్ధమాధనం ఇవ అనేక గన్ధ ప్రవహమ్ అత ఏవ పుణ్యగన్ధైః మనోహరమ్ ఉద్యానం శుశుభే ఇతి శేషః శ్లోకచతుష్టయమ్ ఏకాన్వయి।

||శ్లోకార్థములు||

పుష్పరత్నశతైః చిత్రం -
వందలకొలది పుష్పములనే రత్నములతో
పఞ్చమం సాగరం యథా -
ఐదవ సాగరము వలె నున్న
సర్వఋతుపుష్పైః మధుగన్ధిభిః పాదపైః -
అన్ని ఋతువులలో పుష్పించు పుష్పములతో, మధుగంధపు వాసనలతో వున్న వృక్షములతో
ద్విజైః మృగ గణైః నానానినాదైః నిచితం-
పక్షుల మృగ గణముల నినాదములతో నిండిన
అనేకగన్ధప్రవహం పుణ్యగంధం మనోరమమ్ -
మంచి సువాసనలతో మనోహరముగా వున్న( ఆ వనము)

||శ్లోకతాత్పర్యము||

"వందలకొలది పుష్పములతో ఆ వనము రెండవ సాగరము వలె నున్నది. అన్ని ఋతువులలోపుష్పించు పుష్పములతో, మధుగంధపు వాసనలతో వున్న వృక్షములతో , పక్షుల మృగముల నినాదములతో నిండిన, అనేకమైన గంధములు కల వాయువులతో మనోరమముగా వున్నది." ||15.13,14||

||శ్లోకము 15.15||

శైలేంద్రమివ గన్ధాఢ్యం ద్వితీయం గన్ధమాదనమ్|
అశోకవనికాయాం తు తస్యాం వానరపుంగవః ||15.15||
సదదర్శా విదూరస్థం చైత్యప్రాసాద ముచ్ఛ్రితమ్|

స|| సః వానరపుంగవః తస్యాం గన్ధమాడ్యం గన్ధమాదనమ్ శైలేంద్రం ఇవ అశోకవనికాయామ్ మధ్యే అవిదూరస్థం ఉచ్ఛ్రితమ్ చైత్య ప్రాసాదమ్ దదర్శ||

||శ్లోకార్థములు||

సః వానరపుంగవః - ఆవానరపుంగవుడు
తస్యాం గన్ధమాడ్యం గన్ధమాదనమ్ శైలేంద్రం ఇవ -
గంధమాదన పర్వతము వలె ఆ గుబాళించు చున్న
అశోకవనికాయామ్ మధ్యే - అశోకవనము మధ్యలో
అవిదూరస్థం ఉచ్ఛ్రితమ్ చైత్య ప్రాసాదమ్ దదర్శ -
సమీపములోనే ఎత్తైన చైత్యప్రాసాదము చూచెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ వానరపుంగవుడు గంధమాదన పర్వతము వలె ఆ గుబాళించు చున్నఆ అశోకవనిక మధ్యలో, దగ్గరలోనే ఒక పెద్ద చైత్యప్రాసాదమును చూచెను." ||15.15||

||శ్లోకము 15.16,17||

మధ్యే స్తమ్భ సహస్రేణ స్థితం కైలాసపాణ్డురమ్||15.16||
ప్రవాళాకృత సోపానం తప్తకాఞ్చనవేదికం|
ముష్ణన్తమివ చక్షూంషి ద్యోతమానమివ శ్రియా||15.17||
విమలం ప్రాంశుభావత్వా దుల్లిఖన్త మివామ్బరమ్|

స|| స్తంభ సహస్రేణ స్థితమ్ కైలాసపాణ్డురమ్ ప్రవాళకృతసోపానమ్ తప్తకాంచన వేదికాం చక్షూంసి ముష్ణన్తం ఇవ శ్రియా ద్యోతమానం ఇవ విమలం ప్రాంశుభావత్వాత్ అంబరం ఉల్లిఖంతమివ||

||శ్లోకార్థములు||

స్తంభ సహస్రేణ స్థితమ్ - వేయి స్తంభములతో
కైలాసపాణ్డురమ్ - తెల్లని కైలాసములా వున్న
ప్రవాళకృతసోపానమ్ - పగడములతో చేయబడిన మెట్లు కల
తప్తకాంచన వేదికాం - బంగరుపూతలతో చేయబడిన వేదికలు కల,
చక్షూంసి ముష్ణన్తం ఇవ శ్రియా ద్యోతమానం -
కళ్ళకి మిరుమిట్లు గొలిపే శ్రియముతో వెలిగిపోతున్న
విమలం ప్రాంశుభావత్వాత్ అంబరం ఉల్లిఖంతమివ -
తెల్లగా ఎత్తుగావుండి ఆకాశమును అంటుచున్నదా అని ఉన్నట్లు వున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఆ ( చైత్య ప్రాసాదము) వేయి స్తంభములతో తెల్లని కైలాసములా వున్న, పగడములతో చేయబడిన మెట్లు కల, బంగరుపూతలతో చేయబడిన వేదికలు కల, కళ్ళకి మిరుమిట్లు గొలిపే , ఆకాశమును అంటుచున్నదా అని ఉన్నట్లు వున్నది." ||15.16,17||

||శ్లోకము 15.18,19||

తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతామ్||15.18||
ఉపవాసకృశాం దీనాం నిశ్స్వసన్తీం పునః పునః|
దదర్శ శుక్లపక్షాదౌ చన్ద్రరేఖామివామలామ్||15.19||

స|| తతః మలినసంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం పునః పునః నిఃశ్వసంతీం శుక్లపాక్షాదౌ అమలాం చన్ద్రరేఖామివ ( అబలాం) తాం దదర్శ||

||శ్లోకార్థములు||

తతః మలినసంవీతాం - అక్కడ మలినవస్త్రములు ధరించిన
రాక్షసీభిః సమావృతాం - రాక్షసస్త్రీలతో చుట్టబడియున్న
ఉపవాసకృశాం దీనాం - ఉపవాసములతో కృశించి దీనముగా యున్న
పునః పునః నిఃశ్వసంతీం - మరల మరల నిట్టూర్పులు విడుచుచున్న
శుక్లపాక్షాదౌ అమలాం చన్ద్రరేఖామివ -
శుక్లపక్షములో నిర్మలమైన చంద్రరేఖవలె నున్న
తాం దదర్శ - ఆమెను చూచెను

||శ్లోకతాత్పర్యము||

"అక్కడ మలినవస్త్రములు ధరించిన రాక్షసస్త్రీలతో చుట్టబడియున్న ఉపవాసములతో కృశించియున్నదీనముగా మరల మరల నిట్టూర్పులు విడుచుచున్న శుక్లపక్షములో నిర్మలమైన చంద్రరేఖవలె నున్న స్త్రీని చూచెను." ||15.18,19||

||శ్లోకము 15.20||

మన్దం ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం|
పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసోః||15.20||

స|| (సా) మన్దం ప్రఖ్యాయమానేన రూపేణ ధూమజలేన పినద్ధాం రుచిరప్రభామ్ విభావసోః శిఖామివ(అస్తి) ||

రామ టీకాలో - "రూపేణ రుచిర ప్రభా యస్యా తాం ధూమజాలేన పినద్ధామ్ అచ్ఛాదితాం విభావసూః అగ్రే శిఖామివ"||

||శ్లోకార్థములు||

ధూమజలేన పినద్ధాం -
పొగచే ఆవృతమైన
విభావసోః శిఖామివ -
అగ్నిజ్వాల యొక్క శిఖ వలె
రూపేణ రుచిరప్రభామ్ -
రూపములో కళ తో కూడిన అందము
మన్దం ప్రఖ్యాయమానేన -
స్పష్టముగా కానరాక నున్నది

||శ్లోకతాత్పర్యము||

"పొగచే ఆవృతమైన అగ్నిజ్వాల యొక్క శిఖవలె, రూపములో కళ తో కూడిన ఆమె అందము స్పష్ఠముగా కానరాక ఉన్నది." ||15.20||

||శ్లోకము 15.21||

పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాససా|
సపఙ్కాం అనలఙ్కారం విపద్మామివ పద్మినీమ్ ||15.21||

స|| పీతేన ఏకేన ఉత్తమవాససా సంవీతాం సపఙ్కం అనలఙ్కృతాం విపద్మాం పద్మినీం ఇవ ||

తిలక టీకాలో - క్లిష్టేన జీర్ణేన, సపఙ్కాం మలవచ్ఛరీరాం|

రామ టీకాలో - క్లిష్టేన జీర్ణతయా ప్రతీతేన ఏకేన ఉత్తమవాససా సంవీతామ్, అనలఙ్కారామ్ అలఙ్కితరహితామ్ అత ఏవ విపద్మాం పద్మరహితాం పద్మినీం సరసీమివ సపఙ్కాం మలినాం ||

||శ్లోకార్థములు||

ఏకేన క్లిష్టేన పీతేన ఉత్తమవాససా సంవీతాం -
ఒక క్షీణించిన ఉత్తమ తరగతి పీత వస్త్రము ధరించియున్న
అనలఙ్కారం సపఙ్కం-
అలంకారములు లేకుండా దుమ్ముకొట్టుకు పోయిన శరీరముతో
విపద్మాం పద్మినీం ఇవ - పద్మములు లేని తామరుకొలను వలె

||శ్లోకతాత్పర్యము||

"అలంకారములు లేకుండా దుమ్ముకొట్టుకు పోయిన శరీరముతో జీర్ణించిన ఒక ఉత్తమ తరగతి పీతవస్త్రమును ధరించియున్న ఆమె, పద్మములు లేని తామరకొలను వలె నున్నది." ||15.21||

||శ్లోకము 15.22||

వ్రీడితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్వినీమ్|
గ్రహేణాఙ్గారకేణేవ పీడితామివ రోహిణీమ్||15.22||

స|| వ్రీడితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్వినీం అంగారకేణ గ్రహేణా పీడితాం రోహిణీం ఇవ ( చ అస్తి) |

||శ్లోకార్థములు||

వ్రీడితాం దుఃఖసంతప్తాం -
దుఃఖములో మునిగి తలవంచుకొనియున్న
పరిమ్లానాం తపస్వినీం -
శోభ తరిగిపోయి దైన్య స్థితిలో వున్న
అంగారకేణ గ్రహేణా పీడితాం రోహిణీం ఇవ -
అంగారకగ్రహముచేత పీడింపబడిన రోహిణి వలె నున్నది.

||శ్లోకతాత్పర్యము||

"ఆమె దుఃఖములో శోభ తరిగిపోయి మునిగి తలవంచుకొనియున్నది. తపస్వినివలె నున్నది. అంగారకగ్రహముచేత పీడింపబడిన రోహిణి వలె నున్నది." ||15.22||

||శ్లోకము 15.23||

అశ్రుపూర్ణముఖీం దీనాం కృశామనశనేన చ|
శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణామ్||15.23||

స|| దుఃఖపరాయణామ్ అశ్రుపూర్ణముఖీం దీనాం అనశనేన కృశాం నిత్యం శోకధ్యానపరాం (తాం దదర్శ)||

||శ్లోకార్థములు||

దుఃఖపరాయణామ్ అశ్రుపూర్ణముఖీం -
దుఃఖ భారముతో నీళ్ళతో నిండిన కళ్లతో
అనశనేన కృశాం దీనాం -
ఉపవాసములతో కృశించి దీనముగా
శోకధ్యానపరాం -
శోకముతో ప్రతిక్షణము ధ్యానములో ఉన్న
తాం దదర్శ - ఆమెను చూచెను

||శ్లోకతాత్పర్యము||

"దుఃఖ భారముతో నీళ్ళతో నిండిన కళ్లతో ఉపవాసములతో కృశించి దీనముగా శోకముతో ప్రతిక్షణము ధ్యానములో ఉన్నఆమెను హనుమ చూచెను" ||15.23||

||శ్లోకము 15.24||

ప్రియం జనమపశ్యంతీం పశ్యన్తీం రాక్షసీగణమ్|
స్వగణేన మృగీం హీనాం శ్వగణాభివృతా మివ||15.24||

స|| సా ప్రియం జనం అపశ్యంతీం రాక్షసీగణం పశ్యంతీం స్వగణేన హీనాం శ్వగణాభివృతాం మృగీం ఇవ (అస్తి)||

||శ్లోకార్థములు||

ప్రియం జనం అపశ్యంతీం - ప్రియమైన జనులు కానరాక
రాక్షసీగణం పశ్యంతీం - రాక్షసీగణములనే చూస్తూ
స్వగణేన హీనాం - తన మందనుంచి విడిపోయి
శ్వగణాభివృతాం - వేటకుక్కలతో చుట్టబడియున్న
మృగీం ఇవ - ఆడ జింకవలె ఉండెను

||శ్లోకతాత్పర్యము||

"ఆమె ప్రియమైన జనులు కానరాక రాక్షసీగణములనే చూస్తూ , ఆమె తన మందనుంచి విడిపోయి వేటకుక్కలతో చుట్టబడియున్న ఆడ జింకవలె ఉండెను." ||15.24||

||శ్లోకము 15.25||

నీలనాగాభయావేణ్యా జఘనం గత యైకయా|
నీలయా నీరదాపాయే వనరాజ్యా మహీమివ||15.25||

స|| సా జఘనం గతయా నీలనాగాభయా వేణ్యా నీరదాపాయే నీలయా వనరాజ్యా మహీం ఇవ |

రామటీకాలో - నీలనాగభయా కృష్ణసదృశ్యాజఘనం పృష్టాన్తదేశం గతయా ప్రాప్తయా కేశవిన్యాసాభావేన జటీ భూతయా వేణ్యా ఉపలక్షితాం నీరదాపాయే ఘనాగమే నీలయా వనరాజ్యా మహీం ఇవ స్థితాం సీతాం దదర్శ।

తిలక టీకాలో - పురోభాగీయవేణీద్వయరాహిత్యేన పృష్టలమ్బైక్యయా వేణ్యా నీలనాగభయా నీలసర్ప తుల్యయా వేణ్యోపలక్షితామ్ అనేన తత్ సర్పే అన్యస్య మరణమేవేతి సూచితమ్। మేఘాపాయే నీలయా వనరాజ్యోపలక్షితాం మహీం ఇవ స్థితామ్ ।

||శ్లోకార్థములు||

సా జఘనం గతయా - జఘనము వఱకు వేలాడుచున్న
నీలనాగాభయా వేణ్యా - నల్లని పామువలె ఉన్న ఒంటిజడతో వున్న
నీరదాపాయే నీలయా - శరద్ ఋతువులో ముదురు ఆఉపచ్చరంగు కల
వనరాజ్యా మహీం ఇవ - చెట్లతో నిండిన భూమివలె నున్న

||శ్లోకతాత్పర్యము||

"జఘనము వఱకు వేలాడుచున్న నల్లని పామువలె ఉన్న ఒంటిజడతో వున్న ఆమె శరద్ ఋతువులో ముదురు ఆకుపచ్చరంగు కల వృక్షపంక్తితో కూడిన భూమివలె నున్నది."||15.25||

||శ్లోకము 15.26||

సుఖార్హం దుఃఖసంతప్తాం వ్యసనానాం అకోవిదామ్|
తాం సమీక్ష్య విశాలాక్షీం అధికం మలినాం కృశామ్ ||15.26||
తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః|

స|| విశాలాక్షీం అధికం మలినాం కృశాం తాం సమీక్ష్య సీతా ఇతి తర్కయామాస||

రామటీకాలో - సుఖార్హం ఇతి। సుఖార్హా సుఖయోగ్యం వ్యసనానాం దుఃఖానాం అకోవిదామ్ ఆవైజ్ఞాత్రీం సదుఃఖసంతప్తాం తాం సీతామ్ విలోక్య ఉపపాదిభిః సీతాబోధన సమర్థైః కారణైః ఇయం సీతా ఇతి తర్కయామాస।

||శ్లోకార్థములు||

సుఖార్హం దుఃఖసంతప్తాం -
సుఖపడతగిన, దుఃఖములో మునిగియున్న
వ్యసనానాం అకోవిదామ్ -
కష్టములను చవి చూడని
అధికం మలినాం కృశాం -
కృశించి పోయి మాలిన్యముతో కూడిన
విశాలాక్షీం విశాలమైన కళ్ళు గల
తాం సమీక్ష్య సీతా ఇతి తర్కయామాస -
ఆమెను చూచి ఈమె సీతయా అని తర్కించసాగెను

||శ్లోకతాత్పర్యము||

"సుఖపడతగిన, దుఃఖములో మునిగియున్న, కష్టములను చవి చూడని, అధికముగా కృశించి పోయి మాలిన్యముతో కూడిన ఆ విశాలాక్షిని చూచి ఈమె సీతయా అని తర్కించ సాగెను." ||15.26||

||శ్లోకము 15.27||

హ్రియమాణా తదా తేన రక్షసా కామరూపిణా||15.27||
యథారూపాహి దృష్టా వై తథా రూపేయ మఙ్గనా|

స|| ఇయం అంగనా తథారూపా తదా కామరూపిణా తేన రక్షసా హ్రియమాణా యథారూపా దృష్టా ఇతి||

రామ టీకాలో - తర్కప్రకారమాహ - హ్రియమాణేతి॥ తేన రావణేన హ్రియమాణా సా సీతా తదా హరణసమయే యథారూపా దృష్టా యాదృగ్వేషవర్ణాదిమత్ అనుభూతా తథారూపా అయం। ఇతి॥

||శ్లోకార్థములు||

ఇయం అంగనా - ఈ అంగన
తదా కామరూపిణా రక్షసా తేన - ఆ కామరూపి అగు రాక్షసుని చేత-
హ్రియమాణా - తీసుకోపోబడిన
యథారూపా తథారూపా దృష్టా ఇతి -
ఏ రూపము కలదో ఆ రూపము కలదిగా కనపడుచున్నది.

||శ్లోకతాత్పర్యము||

"ఈ అంగన ఆ కామరూపి అగు రాక్షసుని చేత తీసుకోపోబడిన ఏ రూపము కలదో ఆ రూపము కలదిగా కనపడుచున్నది." ||15.27||

"యథారూపా తథారూపా", అంటే అప్పుడు రావణుడు తీసుకుపోయినప్పుడు ఏ రూపములో వున్నదో, ఇప్పుడు ఇక్కడ అదే రూపములో కనిపిస్తోంది అని - అంటే అందువలన ఈమె సీతయే అని హనుమంతుని తర్కము.

||శ్లోకము 15.28,29||

పూర్ణ చన్ద్రాననాం సుభౄం చారువృత్తపయోధరామ్||15.28||
కుర్వన్తీం ప్రభయా దేవీం సర్వా వితిమిరా దిశః|
తాం నీలకేశీం బిమ్బోష్టీం సుమధ్యామ్ సుప్రతిష్టితామ్||15.29||
సీతాం పద్మపలాశాక్షీం మన్మథస్య రతిం యథా|

స|| పూర్ణ చంద్రాననాం సుభౄం చారువృత్త పయోధరాం సర్వాః దిశాం ప్రభయా వితిమిరాః కుర్వతీం దేవీం నీలకేశీం బింబోష్టీం సుమధ్యాం సుప్రతిష్ఠితాం పద్మపలాశాక్షీం మన్మథస్య రతీం యథా సీతాం (దదర్శ) ||

||శ్లోకార్థములు||

పూర్ణ చంద్రాననాం - పూర్ణ చంద్రునిబోలి వున్న
సుభౄం చారువృత్త పయోధరాం -
ఆకర్షణీయమైన కనుబొమ్మలతో, అందమైన వృత్తాకారములో ఉన్న పయోధరములతో
సర్వాః దిశాం ప్రభయా వితిమిరాః -
అన్ని దిశలలో చీకటిని పారద్రోలు కాంతిని విరజిల్లుచూ
నీలకేశీం బింబోష్టీం సుమధ్యాం -
నల్లని జుట్టుగల, దొండపండువంటి పెదవులుకల, సన్నటి నడుము కల
సుప్రతిష్ఠితాం పద్మపలాశాక్షీం -
అందమైన అవయవాలతో, పద్మము యొక్క రేకులవంటి కళ్ళు కల,
మన్మథస్య రతీం యథా సీతాం -
మన్మధునియొక్క రతీదేవి లా వున్న సీతను (చూచెను)

||శ్లోకతాత్పర్యము||

"పూర్ణ చంద్రునిబోలి వున్న , ఆకర్షణీయమైన కనుబొమ్మలతో, అందమైన వృత్తాకారములో ఉన్న పయోధరములతో , అన్ని దిశలలో చీకటిని పారద్రోలు కాంతిని విరజిల్లుచూ, నల్లని జుట్టుగల దేవి, దొండపండువంటి పెదవులుకల , సన్నటి నడుము కల ,పద్మము యొక్క రేకులవంటి కళ్ళు కల, మన్మధుని రతీ దేవి వలె నున్న సీతాదేవి ని హనుమంతుడు చూసెను." ||15.28,29||

గోవిన్దరాజులవారు తమటీకాలో " పూర్నచన్ద్రాననాం అన్న శ్లోకమునుంచి "విద్యాం ప్రశిథిలామ్ ఇవ" అన్న శ్లోకమువరకు ఒకటే వాక్యము అంటారు. గోవిన్దరాజులవారు తమ టీకాలో ముఖ్యమైన పదాలకి వివరణ ఇస్తారు.

||శ్లోకము 15.30||

ఇష్టాం సర్వస్య జగతః పూర్ణచన్ద్ర ప్రభామివ ||15.30||
భూమౌ సుతనుమాసీనాం నియతామివ తాపసీం |

స|| సా పూర్ణచన్ద్ర ప్రభాం ఇవ సర్వస్య జగతః ఇష్టాం నియతాం తాపసీం ఇవ భూమౌ ఆసీనామ్ సుతనుం (అస్తి) ||

||శ్లోకార్థములు||

సా పూర్ణచన్ద్ర ప్రభాం ఇవ - ఆమె పూర్ణచంద్రుని వెన్నెలవలె
సర్వస్య జగతః ఇష్టాం - జగత్తులోని సమస్త ప్రాణులకు ప్రీతిపాత్రురాలు
నియతాం తాపసీం ఇవ - నియమవతి అయి తపస్వివలె
భూమౌ ఆసీనామ్ సుతనుం - ఆమె భూమి మీద కూర్చుని ఉన్నది

||శ్లోకతాత్పర్యము||

"ఆమె పూర్ణచంద్రుని వెన్నెలవలె, జగత్తులోని సమస్త ప్రాణులకు ప్రీతిపాత్రురాలు. నియమవతి అయి తపస్వివలె ఆమె భూమి మీద కూర్చుని ఉన్నది." ||15.30||

తిలకటీకాలో - చన్ద్రప్రభా సదృశాం సర్వ ఆనన్దకారకత్వేన ; సమస్త ప్రాణులకు ప్రీతిపాత్రులు కాబట్టి చంద్రుని వెన్నెలతో సదృశమైనది అని.

రామ టీకాలో - మన్మథస్య సంబన్ధినీమ్ రతీం యథా అతిరూపాత్వేన తత్ సదృశీం సర్వస్య జగతః ఇష్టాం పూజ్యామ్ । అత్యంత సౌందర్యవతి కాబట్టి మన్మథుని రతితో సదృశము అని.

||శ్లోకము 15.31||

నిశ్స్వాసబహుళాం భీరుం భుజగేన్ద్ర వధూమివ ||15.31||
శోకజాలేన మహతా వితతేన న రాజతీమ్|

స|| సా భీరుం భుజగేన్ద్రవధూమ్ ఇవ నిఃశ్వాసబహుళాం మహతా వితనేన శోఖజాలేన న రాజతీం (అస్తి) ||

||శ్లోకార్థములు||

సా భీరుం భుజగేన్ద్రవధూమ్ ఇవ - భయపడుతూ భుజగేంద్రుని పత్నివలె
నిఃశ్వాసబహుళాం - నిట్టూర్పులు విడుచుచున్న
మహతా వితనేన శోఖజాలేన - అధిక శోకజాలలో చిక్కుకొని
న రాజతీమ్ - ప్రకాశ హీనముగా వున్నది

||శ్లోకతాత్పర్యము||

"భయపడుతూ బుసలు కొడుతున్న భుజగేంద్రుని పత్నివలె నిట్టూర్పులు విడుచుచున్న అమె అధిక శోకముతో ప్రకాశవిహీనముగా వున్నది." ||15.31||

తిలకటీకాలో - భుజగేన్ద్రవధూ సాదృశమ్ దుష్ప్రధృష్యత్వేన రక్షః కులనాశకత్వేన- అంటే సీతమ్మకి బుసలు కొట్టుచున్న భుజగేన్ద్ర పత్ని అన్న ఉపమానము రాక్షస కులనాశనము సూచించుచున్నది అని.

||శ్లోకము 15.32||

సంసక్తాం ధూమజాలేన శిఖామివ విభావసోః||15.32||
తాం స్మృతీమివ సన్దిగ్ధామ్ వృద్ధిం నిపతితామివ|

స||ధూమ్రజాలేన సంసక్తాం విభావసౌ శిఖామివ సందిగ్ధామ్ స్మృతీం ఇవ నిపతితం ఋద్ధమివ తామ్ ( దదర్శ)||

గోవిన్దరాజ టికాలో- ఋద్ధిం సంపదమ్ నిపతితాం క్షీణామ్, అంటే క్షీణించిన సంపదవలె నున్నది అని ;

రామ టీకాలో - నిపతితం ఋద్ధమివ భీత్యా చౌరాదిభిః క్క్వచిన్నిక్షిప్తామ్ ఋద్ధిమ్ - అంటే భయపడి చోరులచే త దాచి పెట్టబడిన సంపద వలె నున్న అని

రామ టీకాలో - సందిగ్ధామ్ అర్థనిశ్చయవిషయక సందేహ విశిష్టాం స్మృతీం స్మృతిం ఇవ; అంటే నిశ్చయమైన అర్థముచెప్పడానికి సందిగ్ధముగా వున్న స్మృతివలె అని

||శ్లోకార్థములు||

ధూమ్రజాలేన సంసక్తాం - ధూమ్రజాలముచేత కప్పబడిన
విభావసౌ శిఖామివ - కనపడని అగ్నిశిఖవలెనున్నది
సందిగ్ధామ్ స్మృతీం ఇవ - సందిగ్ధమైన స్మృతివలె
నిపతితం ఋద్ధమివ - దాచి పెట్టబడిన సంపద వలె
(తామ్ దదర్శ) - ( ఆమెను చూచెను)

||శ్లోకతాత్పర్యము||

"ఆమె ధూమ్రజాలముచేత కప్పబడిన అగ్నిశిఖవలెనున్నది. సందిగ్ధమైన స్మృతి వాక్యమువలె నున్నది." ||15.32||

||శ్లోకము 15.33||

విహతా మివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ||15.33||
సోపసర్గాం యథాసిద్ధిం బుద్ధిం స కలుషామివ|

స|| విహతామివ శ్రద్ధాం చ ఆశాం ప్రతిహతాం ఇవ సోపసర్గాం సిద్ధిమ్ ఇవ సకలుషాం బుద్ధిమివ ||

రామటీకాలో- నాస్తికబుద్ధ్యా అనాదృతాం శ్రద్ధామివ, ప్రతిహతాం లాభా అభావాత్ నివృత్తామ్ ఆశాం ఇవ, సోపసర్గామ్ విఘ్నైః సంయుక్తాం సిద్ధిం ఇవ, సకలుషాం సంశయాదినా విశిష్టాం బుద్ధిం ఇవ। అంటే నాస్తికత్వమువలన సడలిన శ్రద్ధ వలె, లాభము లేదని ఓడిపొయిన ఆశవలె, సంశయముల వలన కలుషితమైన విశిష్టమైన బుద్ధివలె అని.

||శ్లోకార్థములు||

విహతామివ శ్రద్ధాం - సడలి పోయిన శ్రద్ధవలెనున్నది
ఆశాం ప్రతిహతాం ఇవ - ఓడిపోయిన ఆశవలె
సోపసర్గాం సిద్ధిమ్ ఇవ - విఘ్నము కలిగిన సిద్ధివలె
సకలుషాం బుద్ధిమివ - కలుషమైన బుద్ధివలె

||శ్లోకతాత్పర్యము||

"ఆమె సడలి పోయిన శ్రద్ధవలెనున్నది. ఓడిపోయిన ఆశవలె, విఘ్నము కలిగిన సిద్ధివలె , కలుషమైన బుద్ధివలె నున్నది."

||శ్లోకము 15.34||

అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ||15.34||
రామోపరోధవ్యధితాం రక్షోహరణ కర్శితామ్|

స||అభూతేన అపవాదేన నిపతితాం కీర్తిమివ రామోపరోధవ్యధితాం రక్షోహరణ కర్శితాం (తామ్ దదర్శ)||

రామటీకాలో - "రామోపరోధేన రామసేవా నిరోధేన వ్యధితాం", అంటే రాముని సేవకి ప్రతిబంధము కలిగినది అనే వ్యధతో వున్నఆమె అని.

||శ్లోకార్థములు||

అభూతేనాపవాదేన నిపతితాం కీర్తిమివ -
అపవాదముచే క్షీణించిన కీర్తివలె
రక్షోహరణ కర్శితాం -
రాక్షసునిచే అపహరింపబడి కృశించిపోయిన
రామోపరోధవ్యధితాం -
రాముని సేవకి ప్రతిబంధము కలిగినదను వ్యధలో వున్న

||శ్లోకతాత్పర్యము||

"అపవాదముచే క్షీణించిన కీర్తివలె , రాక్షసునిచే అపహరింపబడి కృశించిపోయిన, రాముని రాముని సేవకి ప్రతిబంధము కలిగినదను వ్యధలో వున్న;" ||15.34||

||శ్లోకము 15.35,36||

అబలాం మృగశాబాక్షీం వీక్షమాణాం తత స్తతః||15.35||
భాష్పామ్బుపరిపూర్ణేన కృష్ణవక్రాక్షిపక్ష్మణా|
వదనేనాప్రసన్నేన నిశ్స్వసన్తీం పునః పునః||15.36||

స|| మృగశాబాక్షీం భాష్పామ్బుపరిపూర్ణేన కృష్ణవక్రాక్షి పక్ష్మణా అప్రసన్నేన వదనేన తతః తతః వీక్షమాణం పునః పునః నిశ్స్వసన్తీం అబలాం ||

||శ్లోకార్థములు||

మృగశాబాక్షీం - లేడి కన్నులతో
భాష్పామ్బుపరిపూర్ణేన - భాష్పములతో నిండిన
కృష్ణవక్రాక్షి పక్ష్మణా - నల్లని కనుబొమ్మల కల
అప్రసన్నేన వదనేన - ప్రసన్నముకాని వదనముతో
తతః తతః వీక్షమాణం - అటూ ఇటూ చూస్తూ వున్న
పునః పునః నిశ్స్వసన్తీం అబలాం -
మళ్ళీ మళ్ళీ నిట్టూర్పులు విడుచుచూ వున్న అబలను

||శ్లోకతాత్పర్యము||

"లేడి కన్నులతో, భాష్పములతో నిండిన నల్లని కనుబొమ్మల కల ఆ అబల ప్రసన్నముకాని వదనముతో మళ్ళీ మళ్ళీ నిట్టూర్పులు విడుచుచూ వున్నది." ||15.35,36||

||శ్లోకము 15.37||

మలపఙ్కధరాం దీనాం మణ్డనార్హాం అమణ్డితామ్|
ప్రభాం నక్షత్రరాజస్య కాలమేఘైరివావృతామ్||15.37||

స|| మలపఙ్కధరాం దీనాం మణ్డనార్హాం అమణ్డితామ్ కాలమేఘైః ఆవృతాం నక్షత్రరాజస్య ప్రభాం ఇవ||

||శ్లోకార్థములు||

మలపఙ్కధరాం దీనాం -
మలినమైన అంగములతో దీనముగా నున్న
మణ్డనార్హాం అమణ్డితామ్ -
ఆభరణములకు అర్హురాలైనప్పటికీ ఆభరణములు లేకుండా వున్న ఆమె
కాలమేఘైః ఆవృతాం - నల్లని మేఘములతో కప్పబడిన
నక్షత్రరాజస్య ప్రభాం ఇవ - నక్షత్రరాజుని కాంతి వలెనున్నది.

||శ్లోకతాత్పర్యము||

"మలినమైన అంగములతో దీనముగా నున్న, ఆభరణములకు అర్హురాలైనప్పటికీ ఆభర్ణములు లేకుండా వున్న ఆమె, నల్లని మేఘములతో కప్పబడిన నక్షత్రరాజుని కాంతి వలె నున్నది." ||15.37||

||శ్లోకము 15.38||

తస్య సందిదిహే బుద్ధిః ముహుః సీతాం నిరీక్ష్యతు|
ఆమ్నాయానాం అయోగేన విద్యాం ప్రశిథిలామివ||15.38||

స|| ఆమ్నాయానాం అయోగేన ప్రశిథిలాం విద్యాం ఇవ సీతాం నిరీక్ష్య తస్య బుద్ధిః తు ముహుః సందిదిహే||

||శ్లోకార్థములు||

ఆమ్నాయానాం అయోగేన - మననము చేయకుండా వున్నందువలన
ప్రశిథిలాం విద్యాం ఇవ - మరుగుపడిన విద్యవలె నున్న
సీతాం నిరీక్ష్య - సీతను చూచి
తస్య బుద్ధిః తు - అతని మనస్సులో కూడా
ముహుః సందిదిహే - పదే పదే సందేహము కలుగుచుండెను

||శ్లోకతాత్పర్యము||

"మననము చేయకుండా వున్నందువలన మరుగుపడిన విద్యవలె నున్న సీతను చూచి అతని మనస్సులో పదే పదే ఈమె సీతయా అని సందేహము కలుగుచుండెను." ||15.38||

||శ్లోకము 15.39||

దుఃఖేన బుబుధే సీతాం హనుమాననలఙ్కృతామ్|
సంస్కారేణ యథా హీనాం వాచం అర్థాంతరం గతమ్||15.39||

స|| హనుమాన్ అనలంకృతామ్ సంస్కారేణ హీనం అర్థాంతరం గతం వాచం యథా సీతాం దుఃఖేన బుబుధే||

తిలక టీకాలో - దుఃఖ బోధ్యత్వే హేతుః - అనలంకృతామ్ ఇతి। సంస్కారేణేతి స్నానులేపాదిః అఙ్గ సంస్కారః। వాచో వ్యాకరణజ్ఞానాదిజః సంస్కారః। దేవ్యా అర్థాన్తరగతత్వం దేశాన్తరగతత్వమ్ । వాచస్తు వివక్షితార్థాత్ అన్యార్థ బోధకత్వమ్ । వాచోఽర్థం యథా వ్యాకరణాద్యాభ్యాస దుఃఖేన వ్యుత్పత్తిం సంపాద్య బుధ్యతే, తద్వత్ సీతాం కష్టేన బుబుధే।

రామ టీకాలో - సంస్కారేణ యథోచిత స్నానాది రూప సంస్కృత్యా హీనామ్ అత ఏవ అర్థాన్తర గతాం వాచం ఇవ అనలంకృతాం సీతామ్ దుఃఖేన బుబుధే।

||శ్లోకార్థములు||

హనుమాన్ అనలంకృతామ్ సీతాం -
హనుమ అలంకారములు లేని సీతను
సంస్కారేణ హీనం - సంస్కార రహితమై
అర్థాంతరం గతం - అర్థము మారిపోయిన
వాచం యథా - మాటలాగా వున్న
దుఃఖేన బుబుధే - కష్టముతో తెలిసికొనగలెను

||శ్లోకతాత్పర్యము||

"హనుమ అలంకారములు లేని సీతను, సంస్కార రహితమై అర్థము మారిపోయిన మాటలాగా, కష్టముతో తెలిసికొనగలెను." ||15.39||

||శ్లోకము 15.40||

తాం సమీక్ష్య విశాలాక్షీం రాజపుత్రీం అనిందితామ్|
తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభిః||15.40||

స|| అనిందితాం రాజపుత్రీం విశాలాక్షీం సమీక్ష్య తాం సీతా ఇతి కారణైః ఉపపాదిభిః తర్కయామాస||

రామ టీకాలో- " తాం సీతాం సమీక్ష్య కారణైః హేతుభిః ఉపపాదయన్ సన్ ఇయం సీతేతి తర్కయామాస అనుమానేన నిశ్చయం చకార" అంటే ఆ సీతను కారణములతోను హేతువులను ప్రతిపాదించి తన అనుమానమును నిశ్చయము చేసుకొనెను అని.

||శ్లోకార్థములు||

అనిందితాం రాజపుత్రీం - నిందింపలేని రాజపుత్రి
విశాలాక్షీం సమీక్ష్య - విశాలాక్షిని చూచి
తాం సీతా ఇతి కారణైః - ఈమె సీత అని
కారణైః ఉపపాదిభిః తర్కయామాస - తగిన కారణములతో అలోచించ సాగెను

||శ్లోకతాత్పర్యము||

"నిందింపలేని రాజపుత్రి విశాలాక్షి అగు ఆమెని చూచి ఈమె సీత అని అనేక తగిన కారణములతో అలోచించ సాగెను." ||15.40||

||శ్లోకము 15.41||

వైదేహ్యా యాని చాఙ్గేషు తదా రామోఽన్వకీర్తయత్|
తాన్ ఆభరణజాలాని గాత్రశోభీన్యలక్షయత్||15.41||

స|| తదా రామః యాని ఆభరణజాలాని వైదేహ్యాః అంగేషు అన్వకీర్తయత్ గాత్రశోభిని తాని అలక్షయత్ ||

||శ్లోకార్థములు||

తదా రామః యాని ఆభరణజాలాని -
అప్పుడు రాముడు ఏ ఆభరణములు
వైదేహ్యాః అంగేషు అన్వకీర్తయత్ -
వైదేహి అంగములలో ఉండెనని కీర్తించెనో
గాత్రశోభిని తాని అలక్షయత్ -
గాత్రములను శోభింపచేయుచున్న ఆ ఆభరణములను చూచెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు రాముడు వైదేహి అంగములలో ఏ ఏ ఆభరణములు కీర్తించెనో, అట్టి గాత్రములను శోభింపచేయుచున్న ఆ ఆభరణములను చూచెను." ||15.41||

||శ్లోకము 15.42||

సుకృతౌ కర్ణవేష్టౌ చ శ్వదంష్ట్రౌ చ సుసంస్థితౌ|
మణివిద్రుమ చిత్రాణి హస్తేష్వాభరణాని చ ||15.42||
శ్యామాని చిరయుక్తత్వాత్ తథా సంస్థానవంతి చ|

స|| సుకృతౌ కర్ణవేష్టౌ సుసంస్థితౌ శ్వందష్ట్రౌ చ హస్తేషు మణివిద్రుమ చిత్రాణి ఆభరణాని చ చిరయుక్తత్వాత్ శ్యామాని సంస్థానవంతి చ ||

||శ్లోకార్థములు||

సుకృతౌ కర్ణవేష్టౌ - సుకృతమైన కర్ణ కుండలములతో
సుసంస్థితౌ శ్వందష్ట్రౌ చ - చక్కగా ఉన్న శ్వదంష్ట్రములతో
హస్తేషు మణివిద్రుమ చిత్రాణి ఆభరణాని చ -
హస్తములమీద మణులతో రూపొందించబడిన ఆభరణములు,
చిరయుక్తత్వాత్ - చిరకాలము ఉపయోగించడము వలన
శ్యామాని సంస్థానవంతి చ - మాసిపోయి శరీరము మీద మచ్చలు చూసెను.

||శ్లోకతాత్పర్యము||

"సుకృతమైన కుండలములతో, చక్కగా ఉన్న శ్వదంష్ట్రములతో, హస్తములమీద మణులతో రూపొందించబడిన ఆభరణములు, చిరకాలము ఉపయోగించడము వలన మాసిపోయి, శరీరము మీద మచ్చలు చూసెను." ||15.42||

||శ్లోకము 15.43,44||

తాన్యే వైతాని మన్యేఽహం యాని రామోఽన్వకీర్తయత్||15.43||
తత్రయా న్యవహీనాని తాన్యహం నోపలక్షయే |
యాన్యస్యా నావహీనాని తాన్ ఇమాని నసంశయః||15.44||

స||యాని రామః అన్వకీర్తయత్ తాన్యేవ అహం మన్యే| తత్ర యాని అవహీనాని తాని అహం నోపలక్ష్యే |అస్యాః యాని న అవహీనాని తాని ఇమాని సంశయః న||

||శ్లోకార్థములు||

యాని రామః అన్వకీర్తయత్ - ఏవి రాముడు వర్ణించెనో
తాన్యేవ అహం మన్యే - అవి ఆ అభరణములే అని నేను అనుకుంటాను
తత్ర యాని అవహీనాని - అప్పుడు క్రిందపడవేసినవి
తాని అహం నోపలక్ష్యే - అవి నాకు కనపడుట లేదు.
అస్యాః యాని న అవహీనాని - వానిలో ఏవి పడవేయలేదో
తాని ఇమాని సంశయః న - అవి ఇవే అని సందేహము లేదు

||శ్లోకతాత్పర్యము||

"అవి రామునిచే వర్ణింపబడినవే అని అనుకుంటాను. అప్పుడు క్రిందపడవేసినవి నాకు ఇప్పుడు కనపడుట లేదు. వానిలో ఏవి పడవేయలేదో, అవి ఇవే అని సందేహము లేదు" ||15.43,44||

||శ్లోకము 15.45||

పీతం కనకపట్టాభం స్రస్తం తద్వసనం శుభమ్|
ఉత్తరీయం నగాసక్తం తదా ద్రష్టుం ప్లవఙ్గమైః||15.45||

స|| పీతం కనకపట్టాభం శుభం ఉత్తరీయం స్రక్తం నగాసక్తం తత్ వస్త్రం తదా ప్లవఙ్గమైః ద్రష్టం||

||శ్లోకార్థములు||

పీతం కనకపట్టాభం - ఆ పచ్చని బంగారు వన్నెగల
శుభం ఉత్తరీయం - ఆ శుభమైన ఉత్తరీయమును
స్రక్తం నగాసక్తం తత్ వస్త్రం - సీత జారవిడచగా చెట్టుకి చుట్టుకున్న వస్త్రము
తదా ప్లవఙ్గమైః ద్రష్టం - అప్పుడు వానరులచే చూడబడినది.

||శ్లోకతాత్పర్యము||

"ఆ పచ్చని బంగారు వన్నెగల ఆ శుభమైన ఉత్తరీయమును అప్పుడు సీత జారవిడవగా చెట్టుకి చుట్టుకున్న వస్త్రము అప్పుడు వానరులచే చూడబడినది."||15.45||

||శ్లోకము 15.46||

భూషణాని చ ముఖ్యాని దృష్టాని ధరణీ తలే|
అనయైవాపవిద్దాని స్వనవన్తి మహన్తి చ||15.46||

స|| నయైవ ధరణీ తలే అపవిద్ధాని స్వనవన్తీ మహన్తి ముఖ్యాని భూషణాని చ ద్రష్టాని||

||శ్లోకార్థములు||

నయైవ ధరణీ తలే అపవిద్ధాని -
అమె చేతనే భూమి మీద పడవేయబడిన
స్వనవన్తీ మహన్తి ముఖ్యాని భూషణాని -
చప్పుడు చేస్తూ (పడివేయబడిన) మహత్తరమైన ముఖ్యమైన భూషణములు
చ ద్రష్టాని - కూడా చూడబడినవి

||శ్లోకతాత్పర్యము||

" తీసుకుపోబడుతూ ధరణీ తలము మీద చప్పుడు చేస్తూ పడవేయబడిన అమూల్యమైన ప్రధానమైన ఆభరణములను వానరులు చూచిరి". ||15.46||

||శ్లోకము 15.47||

ఇదం చిరగృహీతత్వాత్ వ్యసనం క్లిష్టవత్తరమ్|
తథాఽపి నూనం తద్వర్ణం తథా శ్రీమత్ యథేతరత్||15.47||

స|| ఇదం వసనం చిరగృహీతత్వాత్ క్లిష్టవత్తరమ్ తథాపి నూనం తద్వర్ణం ఇతరత్ యథా తథా శ్రీమత్||

||శ్లోకార్థములు||

ఇదం వసనం చిరగృహీతత్వాత్ - చాలాకాలము ధరింపబడిన ఈ వస్త్రము
క్లిష్టవత్తరమ్ తథాపి - క్లిష్టముగా ఉన్నది. అయినప్పటికీ
నూనం తద్వర్ణం - అయినప్పటికీ దాని రంగు
ఇతరత్ యథా తథా శ్రీమత్- అప్పుడు ఎలాగవున్నదో ఇప్పుడు అలాగే ఉన్నది

||శ్లోకతాత్పర్యము||

" చాలాకాలము ధరింపబడిన ఈ వస్త్రము క్లిష్టముగా ఉన్నది. అయినప్పటికీ దాని రంగు కాంతి అప్పుడు ఎలాగవున్నదో ఇప్పుడు అలాగే ఉన్నది" ||15.48||

||శ్లోకము 15.48||

ఇయం కనకవర్ణాఙ్గీ రామస్య మహిషీ ప్రియా |
ప్రణష్టాఽపి సతీ యాఽస్య మనసో న ప్రణస్యతి||15.48||

స|| ఇయం కనకవర్ణాఙ్గీ రామస్య ప్రియా మహిషీ సతీ యా ప్రణష్టాపి అస్య మనసః నప్రణస్యతి ||

||శ్లోకార్థములు||

ఇయం కనకవర్ణాఙ్గీ - ఈ బంగారువన్నెగల అవయవములతో నున్న
రామస్య ప్రియా మహిషీ సతీ - రాముని ప్రియురాలు పట్టమహిషి సతి
యా ప్రణష్టాపి - అపహరించబడి నష్టపోయిననూ
అస్య మనసః న ప్రణస్యతి - ఆమె మనస్సు మాత్రము చెక్కు చదరకుండా ఉన్నది

||శ్లోకతాత్పర్యము||

"ఈ బంగారువన్నెగల అవయవములతో నున్న రాముని పట్టమహిషి అపహరింపబడి నప్పటికీ ఆయన మనస్సులో చెక్కు చెదరకుండా ఉన్నది."

||శ్లోకము 15.49,50||

ఇయం సా యత్కృతే రామశ్చతుర్భిః పరితప్యతే|
కారుణ్యే నానృశంస్యేన శోకేన మదనేన చ||15.49||
స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితేత్యానృశంస్యతః|
పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ||15.50||

స|| యత్ కృతే రామః ప్రణష్టా స్త్రీ ఇతి కారుణ్యాత్ ఆశ్రితేతి అనృశంస్యతః నష్టా పత్నీ ఇతి శోకేన ప్రియా ఇతి మదనేన కారుణ్యేన ఆనృశంస్యేన శోకేన మదనేన చతుర్భిః పరితప్యతే సా ఇయం||

గోవిన్దరాజులవారు తమ టీకాలో - రామః కారుణ్యాదిభిః చతుర్భిఃయత్కృతే పరితప్యతే స ఇయం| కారుణ్యాదీనాం పరితాప హేతుత్వమ్ విభజ్య దర్శయతి - స్త్రీతి| ఆపత్ కాలే స్త్రీయో రక్షణీయాః తన్నకృతమితి కారుణ్యాత్ పరితప్యతే | ఆనృశంస్యమ్ అకౄరత్వమ్ ఆశ్రిత సంరక్షణైకస్వభావత్వం ఇతి తావత్| తస్మాత్ ఆశ్రితా న రక్షితేతి పరితప్యతే| పత్నీ నష్టేతి పరితప్యతే|ప్రియా నష్టేతి మదనేన పరితప్యతే ఇతి యోజనా|| టీకా తాత్పర్యము దీనిని అనుసరించి రాయబడినది.

||శ్లోకార్థములు||

ప్రణష్టా స్త్రీ ఇతి కారుణ్యాత్ -
తను రక్షించవలసిన ఆమె అపహరింపబడడము వలన కారుణ్యము
ఆశ్రితేతి అనృశంస్యతః -
తనపై అధారపడిన స్త్రీ కనక దయ
నష్టా పత్నీ ఇతి శోకేన -
భార్య పోయినందువలన శోకము
ప్రియా ఇతి మదనేన -
తనప్రియురాలు కానరవకపోవడము వలన మదన బాధ
కారుణ్యేన ఆనృశంస్యేన శోకేన మదనేన -
కారుణ్యముతో దయతో, శోకముతో , మదనముతో
చతుర్భిః పరితప్యతే -
అలాగ నాలుగు విధముల బాధతో రాముడు పరితపిస్తున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"తను రక్షించవలసిన ఆమె అపహరింపబడడము వలన కారుణ్యము, తనపై అధారపడిన స్త్రీ కనక దయ, భార్య పోయినందువలన శోకము , తనప్రియురాలు కానరవకపోవడము వలన మదన బాధ, అలాగ నాలుగు విధముల బాధతో రాముడు పరితపిస్తున్నాడు."

||శ్లోకము 15.51||

అస్యా దేవ్యా యథా రూపం అఙ్గప్రత్యఙ్గ సౌష్టవమ్|
రామస్య చ యథారూపం తస్యేయ మసితేక్షణా||15.51||

స|| అస్యాః దేవ్యాః రూపం అఙ్గప్రత్యఙ్గసౌష్టవం యథా చ తస్య రూపం యథా ఇయం అసితేక్షణా||

||శ్లోకార్థములు||

అస్యాః దేవ్యాః రూపం - ఆ దేవియొక్క రూపము
అఙ్గప్రత్యఙ్గసౌష్టవం యథా - అంగముల సౌష్టవము
తస్య రూపం యథా - ఆయన యొక్క రూపమునకు తగినట్లే
ఇయం అసితేక్షణా - ఈ అసితేక్షణ కూడా

||శ్లోకతాత్పర్యము||

" ఆ దేవియొక్క రూపము అంగముల సౌష్టవము ఆయన యొక్క రూపమునకు తగినట్లే ఉన్నాయి." ||15.51||

||శ్లోకము 15.52||

అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్టితమ్|
తేనేయం స చ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి||15.52||

స|| అస్యాః దేవ్యాః మనః తస్మిన్ తస్య అస్యాం ప్రతిష్టితం| తేన ఇయం ధర్మాత్మా స చ ముహూర్తమపి జీవతి||

||శ్లోకార్థములు||

అస్యాః దేవ్యాః మనః తస్మిన్ -
ఈ దేవియొక్క మనస్సు ఆయనపై
తస్య అస్యాం ప్రతిష్టితం -
అయనయొక్క మనస్సు ఈమె పై ప్రతిష్టింపబడియున్నాయి
తేన ఇయం ధర్మాత్మా - అందువలనే ఆ ధర్మాత్ముడు
స చ ముహూర్తమపి జీవతి -
ఈమెయూ క్షణమైన జీవించకలుగుతున్నారు.

||శ్లోకతాత్పర్యము||

"ఈ దేవియొక్క మనస్సు ఆయనపై, అయనయొక్క మనస్సు ఈమె పై ప్రతిష్టింపబడియున్నాయి. అందువలనే ఆ ధర్మాత్ముడు ఈమెయూ క్షణమైన జీవించ కలుగుతున్నారు."||15.52||

||శ్లోకము 15.53||

దుష్కరం కృతవాన్ రామో హీనోయదనయా ప్రభుః|
ధారయ త్యాత్మనో దేహం న శోకే నావసీదతి||15.53||

స|| ప్రభుః రామః అనయా హీనః ఆత్మనః దేహం ధారయతి ఇతి యత్ శోకేన న అవసీదతి దుష్కరం కృతవాన్ ||

గోవిన్దరాజులవారు తమటీకాలో - మాల్యవతి శైలే రామస్య సీతావిరహ క్లేశాతిశయం నిశమ్య,హన్త వశిష్టశిష్యః కస్మాశ్చిత్ స్త్రియాః కృతే కథం ఏవం భూత్ ఇతి వినిన్ద్య పరిహాసితవాన్ స్వయం విరక్తతయా సంప్రత్యస్యా వైలక్షణ్యా అతిశయ దర్శనేన విశేషజ్ఞతయా ఏతత్ విరహే రామస్య దేహధారణం అశక్యం ఇత్యాహ దుష్కరమితి|

||శ్లోకార్థములు||

ప్రభుః రామః అనయా హీనః -
రామచంద్ర ప్రభువు ఈమె లేకుండా
ఆత్మనః దేహం ధారయతి ఇతి -
తన దేహమును ధరించకలుగుచున్నాడు అంటే
యత్ శోకేన న అవసీదతి - ఏ విధముగా శోకముకు లొంగిపోలేదో
దుష్కరం కృతవాన్ - ఒక కష్టమైన పని సాధించకలిగాడన్నమాట

||శ్లోకతాత్పర్యము||

"రామచంద్ర ప్రభువు ఈమె లేకుండా తన దేహమును శోకముతో ధరించకలుగుచున్నాడు అంటే ఒక కష్టమైన పని సాధించకలిగాడన్నమాట."||15.54|

గోవిన్దరాజులవారు తమ టీకాలో ఇలా వాఖ్యానించారు; "ఒకప్పుడు హనుమంతుడు మాల్యవత్పర్వతము నందు సీతావిరహముతో బాధపడుతున్న రాముని చూచెను. అప్పుడు హనుమ "ఏమి ఈ శ్రీరాముడు. ఆడుదానికై ఇంత విలపించుట ఏమి? వశిష్ఠుని శిష్యుడు ఒక స్త్రీకై ఇంత బాధపడుచున్నాడని తనమనస్సులో పరిహాసముగా భావించెను. కాని అ పతివ్రత అయిన సీతను చూచిన తరువాత హనుమంతుని అలోచన మారి ఎంతో గౌరవముతో తలుస్తాడు. 'రామచంద్ర ప్రభువు ఈమె లేకుండా తన దేహమును శోకముతో ధరించకలుగుచున్నాడు అంటే కష్టమైన పని సాధించకలిగాడన్నమాట. ఈ యౌవనముతో అలరారుతున్న ఈ సీతని విడచి ఒక క్షణము కూడా జీవించగలడము, మహాబాహువులు కల రాముడు ఒక చేయలేని కార్యము చేసినట్లే వున్నది".

||శ్లోకము 15.54||

దుష్కరంకురుతే రామో య ఇమాం మత్తకాసినీమ్|
సీతాం వినా మహాబాహుః ముహూర్తమపి జీవతి||15.54||

స|| యః ఇమామ్ సీతాం మత్తకాశినీం వినా ముహూర్తమపి జీవతి మహాబాహుః రామః దుష్కరం కురుతే||

||శ్లోకార్థములు||

యః ఇమామ్ సీతాం - ఈ సీతని
మత్తకాశినీం వినా -
యౌవనముతో అలరారుతున్నఆమె లేకుండా
ముహూర్తమపి జీవతి -
ఒక క్షణమైనను జీవించుచున్నాడు అంటే
మహాబాహుః రామః దుష్కరం కురుతే -
మహాత్ముడైన రామ ఒక దుష్కరమైన పని సధించుచున్నాడు.||

||శ్లోకతాత్పర్యము||

"ఈ యౌవనముతో అలరారుతున్న ఈ సీతని విడచి ఒక క్షణము కూడా జీవించగలడము, మహాబాహువులు కల రాముడు, ఒక చేయలేని కార్యము చేసినట్లే వున్నది."||15.54||

||శ్లోకము 15.55||

ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్టః పవన సంభవః|
జగామ మనసా రామం ప్రశశంస చ తం ప్రభుమ్||15.55||

స|| పవనసంభవః తదా సీతాం దృష్ట్వా ఏవం హృష్టః మనసా రామం జగామ తాం ప్రభుం ప్రశశంస చ||

||శ్లోకార్థములు||

పవనసంభవః తదా సీతాం దృష్ట్వా - ఆ వాయునందనుడు అలా సీతను చూచి
మనసా రామం జగామ - రాముని మనస్సులో తలచుకొని
తాం ప్రభుం ప్రశశంస చ - ఆ ప్రభువును ప్రశంశించి
ఏవం హృష్టః - ఈ విధముగా మనస్సులో ఆనందపడెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ వాయునందనుడు అలా సీతను చూచి రాముని మనస్సులో తలచుకొని ఆయనను ప్రశంశించి ఈ విధముగా మనస్సులో ఆనందపడెను."||15.55||

సీతాసందర్శనముతో హనుమ సీతారాములను తలచుకుంటూ ఆనందపడెను.

ఈ శ్లోకముతో రామాయణములో పదహేనవ సర్గలో శ్లోకాలు సమాప్తము.

ఇది సీతా సందర్శన సర్గ.

ఇక్కడ సీత మూడు రూపములతో కనపడును.

(1) ఆమె దేవదేవుని దివ్యమహిషి అయిన లక్ష్మి
(2) ఆమెయే సీతయై అవతరించెను. కావున దేవిగా హనుమచే అరాధింపబడును
(౩) ఆమె జగన్మాత. తల్ల్లివలె సర్వేశ్వరునికి జీవులకు మధ్యవర్తి అయి జీవుని సర్వేశ్వరునితో చేర్చునదై ఉండును.

ఇట్లు ఘటకురాలై విభీషణునికి రామునితో కలయికకు పరోక్షముగా సాయపడును.

రావణుడు వినకపోయిననూ భగవానుడగు రామునితో మైత్రి చేసికొనమని ఉపదేశించి
రామునితో ఘటనచేయ ప్రయత్నించును.

జీవుని వలె నటించుచూ పరమాత్మకు దూరమైనపుడు జీవుడు మరల పరమాత్మకు చేరుటకు ఏట్లు ప్రవర్తింపవలెనో అంతరంబుగా ఉపదేశించును.

బాహ్యముగా పతివ్రతయగు స్త్రీ , భర్తనుంచి దూరముగా ఉన్నప్పుడు ఎట్లు ప్రవర్తించునో ఉపదేశించెను. ఇట్లు సీతయందు భిన్నరూపములు మనకు కనపడును.

అదే అలోచనతో ఈ సర్గ సమాప్తము.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే పంచదశస్సర్గః||

ఈ విధముగా రామాయణములో పదహేనవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||