||సుందరకాండ ||

|| పంతొమ్మిదవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 19 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ఏకోనవింశస్సర్గః
( శ్లోకార్థ తాత్పర్య తత్త్వదీపికతో)

ఈ సర్గలో మనకు వినబడేది రావణాసురుడు సీతమ్మ వర్ణన. అశోకవనములో ప్రవేశించినప్పుడు సీత ఎలావున్నది అన్న ప్రశ్నకి సమాధానముగా వాల్మీకి సీతమ్మను అనేక విధములుగా వర్ణిస్తాడు.

ఈ వర్ణనలో పరమాత్మకోసము తపిస్తున్న జీవాత్మ ఎలా వుంటుందో అది మనకి కనిపిస్తుంది అంటారు భాష్యం అప్పలాచార్యులవారు. ఈ సర్గలో బాహ్యార్థము అంతరార్థము ఒకటిలానే ఉంటాయి.

అప్పుడు అశోకవనములో ప్రవేశిస్తున్న, రాక్షసాధిపుడగు రావణుని చూచి, ఆ వైదేహి పెనుగాలిలో ఊగులాడె అరటి చెట్టులా వణికి పోయెను. ఆ అశోకవనములో శుష్కించిపోయి రోదించుచూ భూమి మీద కూర్చుని ఉన్న సీత, ఒక్క రామునే ధ్యానించుచూ, దుఃఖముయొక్క అంతు తెలియని స్థితిలో ఉండెను.

ఆ విధముగా కట్టువడి కూర్చుని ఉన్న ఆ సీతని వాల్మీకి ఈ విధముగా వర్ణిస్తాడు. ఆమె అపవాదములతో పాతివేయబడిన కీర్తివలె నున్నది. మననము లేనందు వలన ఉపయోగింపబడని విద్యవలె నున్నది. ఆమె సన్నపడిన మహాకీర్తివలె, అవమానింపబడిన శ్రద్ధవలె, పూజద్రవ్యములు లేని పూజవలె, నిష్ఫలమైన ఆశవలె ఉన్నది.

సీతమ్మకి ఇంకా మరెన్నో ఉపమాలాలు చెప్పబడతాయి. ఆమె వస్తుంది అనుకున్న లబ్ది ధ్వంసమైనట్లు వున్నది. శిరసావహింపబడని ఆజ్ఞవలె నున్నది. అపాతకాలములో జ్వలిస్తున్న దిశవలె నున్నది. నిర్వర్తింపబడని పూజవలె నున్నది. ధ్వంసించబడిన లతలవలె నున్నది.
శూరులు పోయిన సేనవలె నున్నది. చీకటిచే ఆవరింపబడిన కాంతి వలెనున్నది. ఎండి పోయిన నదివలె నున్నది. అపవిత్రమైన వేదికవలె నున్నది. శమించిన అగ్ని జ్వాలవలె నున్నది. రాహువుచే మింగబడిన పూర్ణచంద్రుని వలె నున్నది.

ఆలా ఎల్లప్పుడూ రామునే ధ్యానించుచున్న ఆ సీతను లోభపరచుటకు రావణుడు, తన చావును కోరుకుంటున్నట్లు, ప్రయత్నము చేయును.

ఇక ఈ సర్గలో శ్లోకాలు అర్థ తాత్పర్యాలతో.

||శ్లోకము 19.01, 02||

తస్మిన్నేవ తతః కాలే రాజపుత్త్రీ త్వనన్దితా|
రూపయౌవనసంపన్నం భూషణోత్తమ భూషితమ్||19.01||
తతో దృష్ట్వైవ వైదేహీ రావణం రాక్షసాధిపం|
ప్రావేపత వరారోహా ప్రవాతే కదళీ యథా||19.02||

స|| తతః తస్మిన్ ఏవ కాలే భూషణోత్తమభూషితం రూపయౌవ్వన సంపన్నం రాక్షసాధిపం రావణం దృష్ట్వైవ రాజపుత్రీ అనిందితా రూపయౌవ్వన సంపన్నం భూషణోత్తమభూషితం వరారోహా వైదేహీ ప్రవాతే కదళీ యథా ప్రావేపత||

గోవిన్దరాజులవారు తమ టీకాలో - 'భూషణోత్తమభూషితం రూపయౌవ్వన సంపన్నం రాక్షసాధిపం రావణం' అంటారు. అవి ఆభరణాలు ధరించి రూపము యౌవ్వనము తో కూడిన రావణుని వర్ణనలు

||శ్లోకార్థములు||

తతః తస్మిన్ ఏవ కాలే -
అప్పుడు అదేసమయములో
రూపయౌవ్వన సంపన్నం -
రూపయౌవ్వన సంపదలు కల
భూషణోత్తమభూషితం -
ఉత్తమమైన భూషణములతో భూషింపబడిన
రాక్షసాధిపం రావణం దృష్ట్వైవ -
రాక్షసాధిపుడగు రావణుని చూచినప్పుడే
రాజపుత్రీ అనిందితా -
దోషరహిత రాజపుత్రి
వరారోహా వైదేహీ -
అందమైన కటిప్రదేశము కల ఆ వైదేహి
ప్రవాతే కదళీ యథా ప్రావేపత -
పెనుగాలిలో ఊగులాడె అరటి చెట్టులా వణికి పోయెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు అదేసమయములో రూపయౌవ్వన సంపదలు కల, ఉత్తమమైన భూషణములతో భూషింపబడిన, రాక్షసాధిపుడగు రావణుని చూచినప్పుడే దోషరహిత రాజపుత్రి అందమైన కటి ప్రదేశము కల వైదేహి, పెనుగాలిలో ఊగులాడె అరటి చెట్టులా వణికి పోయెను." ||19.01-02||

||శ్లోకము 19.03||

అచ్చాద్యోదరమూరుభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ|
ఉపవిష్టా విశాలాక్షీ రుదన్తీ వరవర్ణినీ||19.03||

స||విశాలాక్షీ వరవర్ణినీ ఊరుభ్యాం ఉదరం బాహూభ్యాం పయోధరౌ అచ్ఛాద్య రుదన్తీ ఉపవిష్టా||

||శ్లోకార్థములు||

విశాలాక్షీ వరవర్ణినీ -
ఆ ఉత్తమమైన వర్ణము కల విశాలాక్షి
ఊరుభ్యాం ఉదరం -
తన తొడలతో ఉదరమును
బాహూభ్యాం పయోధరౌ అచ్ఛాద్య -
బాహువులతో స్తనములను కప్పుకొని
రుదన్తీ ఉపవిష్టా - కూర్చుని విలపింపసాగెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ ఉత్తమమైన వర్ణము కల విశాలాక్షి తన తొడలతో ఉదరమును, బాహువులతో స్తనములను కప్పుకొని కూర్చుని విలపింపసాగెను."||19.03||

||శ్లోకము 19.04||

దశగ్రీవస్తు వైదేహీం రక్షితాం రాక్షసీగణైః|
దదర్శ సీతాం దుఃఖార్తాం నావం సన్నామివార్ణవే ||19.04||

స|| దశగ్రీవస్తు రాక్షసీగణైః రక్షితామ్ దుఃఖార్తామ్ ఆర్ణవే సన్నాం నావమివ వైదేహీం సీతాం దదర్శ||

||శ్లోకార్థములు||

దశగ్రీవస్తు - ఆ దశగ్రీవుడు కూడా
రాక్షసీగణైః రక్షితామ్ -
రాక్షసీ గణములచేత రక్షింపబడుచున్న
దుఃఖార్తామ్ - అత్యంత దుఃఖములో వున్న
ఆర్ణవే సన్నాం నావమివ -
సాగరమధ్యములో చిక్కుకొని ఉన్న నావ లాగ ఉన్న
వైదేహీం సీతాం దదర్శ -
విదేహరాజు పుత్రియగు సీతను చూచెను.

||శ్లోకతాత్పర్యము||

"ఆ దశగ్రీవుడు కూడా రాక్షసీ గణములచేత రక్షింపబడుచున్న అత్యంత దుఃఖములో సాగరమధ్యములో చిక్కుకొని ఉన్న నావ లాగ ఉన్న విదేహరాజు పుత్రియగు సీతను చూచెను." ||19.04||

||శ్లోకము 19.05||

అసంవృతాయాం మాసీనాం ధరణ్యాం సంశితవ్రతాం
ఛిన్నాం ప్రపతితాం భూమౌ శాఖామివ వనస్పతేః||19.05||

స|| అసంవృతాం ధరణ్యాం ఆసీనామ్ ఛిన్నాం భూమౌ ప్రపతితామ్ వనస్పతేః శాఖామివ ||

||శ్లోకార్థములు||

అసంవృతాం ధరణ్యాం ఆసీనామ్ -
భూమి మీద కూర్చుని ఉన్న ఆ సీత
ఛిన్నాం భూమౌ ప్రపతితామ్ -
విరగకొట్టి భూమి మీద పడవేసిన
వనస్పతేః శాఖామివ -
చెట్టు కొమ్మలవలె వుండెను

||శ్లోకతాత్పర్యము||

"భూమి మీద కూర్చుని ఉన్న ఆ సీత విరగకొట్టి భూమి మీద పడవేసిన చెట్టు కొమ్మలవలె వుండెను." ||19.05||

||శ్లోకము 19.06||

మలమణ్డిన చిత్రాఙ్గీం మండనార్హాం అమణ్డితామ్|
మృణాళీ పఞ్కదిగ్ధేవ విభాతి న విభాతి చ||19.06||

స|| మలమణ్డన చిత్రాఙ్గీం మణ్డనార్హాం అమణ్డితామ్ పఞ్కదిగ్ధా మృణాలీ ఇవ భాతి న విభాతి చ||

||శ్లోకార్థములు||

మలమణ్డన చిత్రాఙ్గీం -
మలినమాలిన్యలులతో కప్పబడినా సుందరముగా నున్న
మణ్డనార్హాం అమణ్డితామ్ -
ఆభరణములు ధరింపగలదైననూ ఆభరణములు లేక
పఞ్కదిగ్ధా మృణాలీ ఇవ -
బురదలోని తామరతూడు వలె
భాతి న విభాతి చ -
ప్రకాశించకుండా ప్రకాశించుచున్నట్లు వున్నది

||శ్లోకతాత్పర్యము||

"మలినమాలిన్యలులతో కప్పబడినా సుందరముగా నున్న , ఆభరణములు ధరింపగలదైననూ ఆభరణములు లేక ఆమె బురదలోని తామరతూడు వలె ప్రకాశించకుండా ప్రకాశించుచున్నట్లు వున్నది." ||19.06||

||శ్లోకము 19.07||

సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మనః|
సఙ్కల్పహయసంయుక్తైః యాన్తీమివ మనోరథైః||19.07||

స|| సంకల్పహయసంయుక్తైః మనోరథైః విదితాత్మనః రాజసింహస్య రామస్య సమీపం గచ్ఛన్తీమివ |

||శ్లోకార్థములు||

సంకల్పహయసంయుక్తైః మనోరథైః -
సంకల్పమనే హయములద్వారా మనో రథముపై
విదితాత్మనః రాజసింహస్య -
రాజసింహుడు విదితాత్ముడగు
రామస్య సమీపం గచ్ఛన్తీమివ -
శ్రీరాముని సమీపమునకు చేరుచున్నదా అన్నట్లు వున్న

||శ్లోకతాత్పర్యము||

"సంకల్పమనే హయములద్వారా మనో రథముపై రాజసింహుడు విదితాత్ముడగు శ్రీరాముని సమీపమునకు చేరుచున్నదా అన్నట్లు ఉండెను." ||19.07||

||శ్లోకము 19.08||

శుష్యన్తీం రుదతీం ఏకాం ధ్యానశోకపరాయణామ్|
దుఃఖ స్యాన్తం అపశ్యన్తీం రామాం రామం అనువ్రతామ్||19.08||

స|| శుష్యంతీం రుదతీం ఏకాం ధ్యానపరాయణామ్ దుఃఖస్య అంతం అపశ్యంతీం రామాం రామమ్ అనువ్రతామ్ ||

||శ్లోకార్థములు||

శుష్యంతీం రుదతీం -
శుష్కించిపోయి రోదించుచూ
ఏకాం ధ్యానపరాయణామ్ -
ఒంటరిగా ధ్యానిమగ్నురాలైన
దుఃఖస్య అంతం అపశ్యంతీం -
దుఃఖముయొక్క అంతు తెలియని
రామాం రామమ్ అనువ్రతామ్ -
రాముడి మీదనే మనస్సు నిలిపిన

||శ్లోకతాత్పర్యము||

'ఆమె శుష్కించిపోయి రోదించుచూ ఒక్క రామునే ధ్యానించుచూ దుఃఖముయొక్క అంతు తెలియని స్థితిలో ఉండెను.' ||19.08||

||శ్లోకము 19.09||

వేష్టమానాం తథఽఽవిష్టాం పన్నగేన్ద్రవధూమివ|
ధూప్యమానాం గ్రహేణేవ రోహిణీం ధూమకేతునా||19.09||

స|| తథా అవిష్టాం వేష్టమానాం పన్నగేంద్ర వధూమివ ధూమకేతునా గ్రహేణ ధూప్యమానామ్ రోహిణీం ఇవ ||

||శ్లోకార్థములు||

తథా అవిష్టాం -
ఆ విధముగా కట్టువడి కూర్చుని ఉన్న (ఆ సీత)
వేష్టమానాం పన్నగేంద్ర వధూమివ -
చుట్టచుట్టుకొనియున్న పన్నగేంద్రుని వధువువలె
ధూమకేతునా గ్రహేణ ధూప్యమానామ్ రోహిణీం ఇవ -
గ్రహముల పొగలలో చిక్కుకొని ఉన్న రోహిణి వలె నున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఆవిధముగా కట్టువడి కూర్చుని ఉన్న ఆ సీత చుట్టచుట్టుకొనియున్న పన్నగేంద్రుని వధువువలె , గ్రహముల పొగలలో చిక్కుకొని ఉన్న రోహిణి వలె నున్నది." ||19.09||

||శ్లోకము 19.10||

వృత్తశీలకులేజాతాం ఆచారవతి ధార్మికే|
పునస్సంస్కారమాపన్నాం జాతా మివ దుష్కులే||19.10||

స|| జాతాం ధార్మికే ఆచారవతీ వృత్తశీలకులే సంస్కారం ఆపన్నాం దుష్కులే పునః జాతాం ఇవ ||

గోవిన్దరాజులవారి టీకాలో - " వృత్తం దృఢం శీలం స్వభావో యస్య తత్, తచ్చతత్ కులం తస్మిన్ ఆచారవతీ సమయాచారవతీ ధార్మికే యజ్ఞాది ధర్మ ప్రధానే ఏవం భూతే కులే జాతామ్, సంస్కారమాపన్నామ్ వివాహరూప సంస్కారమాపన్నామ్తః సంస్కారద్వారా దుష్కులే పునర్జాతాం ఇవ స్థితామ్ , కుమారానాం ఉపనయనమివ కుమారీణాం ద్వితీయం జన్మ, "వైవాహికో విధిః స్త్రీణామౌపనాయనికః స్మృతః', ఇతి స్మృతేః||

||శ్లోకార్థములు||

జాతాం ధార్మికే ఆచారవతీ -
ధార్మిక ఆచారవతీ శీలమైన కులములో జన్మించి
వృత్తశీలకులే సంస్కారం ఆపన్నాం -
సంస్కారవంతమైన కులములో ప్రవేశించినప్పటికి,
దుష్కులే పునః జాతాం ఇవ -
దుష్కులములో జన్మించిన స్త్రీవలె

||శ్లోకతాత్పర్యము||

"ధార్మిక ఆచారవతీ శీలమైన కులములో జన్మించి సంస్కారవంతమైన కులములో ప్రవేశించినప్పటికి, అమె ఇప్పుడు దుష్కులములో జన్మించిన స్త్రీవలె కనపడుతున్నది." ||19.10||

||శ్లోకము 19.11||

అభూతేనాపవాదేన కీర్తిం నిపతితా మివ|
అమ్నాయానాం అయోగేన విద్యాం ప్రశిథిలామివ||19.11||

స|| అభూతేన అపవాదేన నిపాతితాం కీర్తిమివ ఆమ్నాయతానామ్ అయోగేన ప్రశిథిలామ్ విద్యాం ఇవ||

||శ్లోకార్థములు||

అభూతేన అపవాదేన - అసత్యమైన అపవాదములతో
నిపాతితాం కీర్తిమివ - పాతివేయబడిన కీర్తివలె నున్నది
ఆమ్నాయతానామ్ అయోగేన - వైదిక జ్ఞానము ఉపయోగించకుండా
ప్రశిథిలామ్ విద్యాం ఇవ - శిథిలమైన విద్య వలె

||శ్లోకతాత్పర్యము||

"ఆమె అసత్యమైన అపవాదములతో పాతివేయబడిన కీర్తివలె నున్నది. మననము లేనందు వలన ఉపయోగింపబడని విద్యవలె నున్నది." ||19.11||

||శ్లోకము 19.12||

సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితామ్|
పూజామివ పరిక్షీణాం ఆశాం ప్రతిహతామివ||19.12||

స|| సన్నామ్ మహాకీర్తిం ఇవ విమానితాం శ్రద్ధాం ఇవ పరిక్షిణాం పూజాం ఇవ ప్రతిహతాం ఆశాం ఇవ||

||శ్లోకార్థములు||

సన్నామ్ మహాకీర్తిం ఇవ - సన్నపడిన మహాకీర్తివలె
విమానితాం శ్రద్ధాం ఇవ - అవమానింపబడిన శ్రద్ధవలె,
పరిక్షిణాం పూజాం ఇవ - పూజద్రవ్యములు లేని పూజవలె
ప్రతిహతాం ఆశాం ఇవ - నిష్ఫలమైన ఆశవలె ఉన్నది

||శ్లోకతాత్పర్యము||

"ఆమె సన్నపడిన మహాకీర్తివలె, అవమానింపబడిన శ్రద్ధవలె, పూజద్రవ్యములు లేని పూజవలె, నిష్ఫలమైన ఆశవలె ఉన్నది." ||19.12||

||శ్లోకము 19.13||

అయతీమివ విధ్వస్తాం ఆజ్ఞాం ప్రతిహతామివ |
దీప్తామివ దిశం కాలే పూజాం అపహృతా మివ||19.13||

స|| విధ్వస్తాం అయతీం ఇవ ప్రతిహతాం ఆజ్ఞాం ఇవ కాలే దీప్తితాం దిశమివ అపహృతాం పూజాం ఇవ||

గోవిన్దరాజుల వారి టీకాలో- 'అత్ర పూజాశబ్దేన పూజా ద్రవ్యముచ్యతే'; అంటే ఇక్కడ పూజ అన్న మాటకి పూజా ద్రవ్యము అని చెప్పబడుతుంది అని.

||శ్లోకార్థములు||

విధ్వస్తాం అయతీం ఇవ - వస్తుంది అనుకున్న లబ్ది ధ్వంసమైనట్లు
ప్రతిహతాం ఆజ్ఞాం ఇవ - శిరసావహింపబడని ఆజ్ఞవలె
కాలే దీప్తితాం దిశమివ - ఆపాతకాలములో జ్వలిస్తున్న దిశవలె
అపహృతాం పూజాం ఇవ - దొంగిలింపబడిన పూజ వలె

||శ్లోకతాత్పర్యము||

"ఆ సీత, వస్తుంది అనుకున్న లబ్ది ధ్వంసమైనట్లు వున్నది. శిరసావహింపబడని ఆజ్ఞవలె నున్నది. ఆపాతకాలములో జ్వలిస్తున్న దిశవలె నున్నది. నిర్వర్తింపబడని పూజ వలె నున్నది. " ||19.13||

||శ్లోకము 19.14||

పద్మినీమివ విధ్వస్తాం హతశూరాం చమూమివ|
ప్రభామివ తమోధ్వస్తాం ఉపక్షీణామివాపగామ్||19.14||

స|| విధ్వస్తాం పద్మినీం ఇవ హతశూరం చమూం ఇవ తమోధ్వస్తాం ప్రభాం ఇవ ఉపక్షీణామ్ అపగాం ఇవ||

||శ్లోకార్థములు||

విధ్వస్తాం పద్మినీం ఇవ - ధ్వంసము చేయబడిన లతలవలె
హతశూరం చమూం ఇవ - శూరులు పోయిన సేనవలె
తమోధ్వస్తాం ప్రభాం ఇవ - చీకటిచే ఆవరింపబడిన కాంతి వలె
ఉపక్షీణామ్ అపగాం ఇవ - ఎండి పోయిన నదివలె

||శ్లోకతాత్పర్యము||

"ధ్వంసము చేయబడిన లతలవలెనున్నది. శూరులు పోయిన సేనవలె నున్నది. చీకటిచే ఆవరింపబడిన కాంతి వలెనున్నది. ఎండి పోయిన నదివలె నున్నది." ||19.14||

||శ్లోకము 19.15||

వేదీమివ పరామృష్టాం శాన్తాం అగ్నిశిఖామివ|
పౌర్ణమాసీ మివ నిశాం రాహుగ్రస్తేన్దుమణ్డలామ్ ||19.15||

స|| పరామృష్టాం వేదీం ఇవ శాంతాం అగ్నిశిఖాం ఇవ రాహుగ్రస్తేన్దుమణ్డలాం పౌర్ణమాసీం నిశాం ఇవ ||

||శ్లోకార్థములు||

పరామృష్టాం వేదీం ఇవ - అపవిత్రమైన వేదికవలె
శాంతాం అగ్నిశిఖాం ఇవ - శమించిన అగ్ని జ్వాలవలె
రాహుగ్రస్తేన్దుమణ్డలాం - రాహువుచే మింగబడిన చంద్రమండలము
పౌర్ణమాసీం నిశాం ఇవ - పౌర్ణమినాటి రాత్రివలె

||శ్లోకతాత్పర్యము||

"అపవిత్రమైన వేదికవలె నున్నది. శమించిన అగ్ని జ్వాలవలె నున్నది. రాహువుచే మింగబడిన చంద్రుడు కల పౌర్ణమి రాత్రివలె." ||19.15||

||శ్లోకము 19.16||

ఉత్కృష్ణపర్ణకమలాం విత్రాసిత విహఙ్గమాం|
హస్తి హస్తపరామృష్టాం ఆకులాం పద్మినీమివ||19.16||

స|| హస్తిహస్తపరామృష్టామ్ ఉత్కృష్టపర్ణకమలామ్ విత్రాసిత విహఙ్గమాం ఆకులామ్ పద్మినీం ఇవ ||

||శ్లోకార్థములు||

హస్తిహస్తపరామృష్టామ్ - గజముల తొండములతో ధ్వంసము చేయబడిన
ఉత్కృష్టపర్ణకమలామ్ - ఉత్కృష్టమైన తామరలు పత్రములు కల
విత్రాసిత విహఙ్గమాం - భయపడిన పక్షులతో ఆవరింపబడిన
ఆకులామ్ పద్మినీం ఇవ - కలుషమైన సరస్సు వలె

||శ్లోకతాత్పర్యము||

"ఆమె, గజముల తొండములతో ధ్వంసము చేయబడిన, ఉత్కృష్టమైన పత్రములు తామరలు కల, భయపడిన పక్షులతో ఆవరింపబడిన, కలుషమైన సరస్సు వలె నున్నది." ||19.16||

||శ్లోకము 19.17||

పతిశోకతురాం శుష్కాం నదీం విస్రావితామివ|
పరయా మృజయా హీనాం కృష్ణపక్ష నిశామివ||19.17||

స|| పతిశోకతురాం విస్రావితాం శుష్కాం నదీం ఇవ పరయా మృజయా హీనామ్ కృష్ణపక్షనిశాం ఇవ||

||శ్లోకార్థములు||

పతిశోకతురాం విస్రావితాం -
పతిశోకముతో దుఃఖములో నున్న
విస్రావితాం శుష్కాం నదీం ఇవ -
నీరు పక్కకి మరలించబడి శుష్కించిన నది వలె
పరయా మృజయా హీనామ్ - సంధ్యావందనమునకు తగని
కృష్ణపక్షనిశాం ఇవ - కృష్ణ పక్షములో రాత్రివలె

||శ్లోకతాత్పర్యము||

"పతిశోకముతో దుఃఖములో నున్న, నీరు పక్కకి మరలించబడి శుష్కించిన సంధ్యావందనమునకు తగని నది వలె , కృష్ణపక్షములో నున్న రాత్రివలె నున్నది." ||19.17||

||శ్లోకము 19.18||

సుకుమారీం సుజాతాఙ్గీం రత్నగర్భగృహోచితామ్|
తప్యమానామివోష్ణేన మృణాళీ మచిరోద్ధృతామ్ ||19.18||

స|| సుకుమారీం సుజాతాఙ్గీం రత్నగర్భగృహోచితాం తప్యమానాం అచిరోద్ధతామ్ మృణాలీం ఇవ ||

||శ్లోకార్థములు||

సుకుమారీం సుజాతాఙ్గీం -
సుకుమారి , సుందరమైన వయవములు గలది
రత్నగర్భగృహోచితాం -
రత్నగర్భమైన గృహములలో నివశించతగినది
తప్యమానాం అచిరోద్ధతామ్ -
పెకలింపబడి ఎండవేడికి తపించిపోయిన
మృణాలీం ఇవ - తామరపూవులా వున్నది

||శ్లోకతాత్పర్యము||

"సుకుమారి , సుందరమైన వయవములు గలది, రత్నగర్భమైన గృహములలో నివశించతగినది అయిన ఆ సీత పెకలింపబడి ఎండవేడికి తపించిపోయిన తామరపూవులా వున్నది". ||19.18||

||శ్లోకము 19.19||

గృహీతా మాళితాం స్తమ్భే యూధపేన వినా కృతాం|
నిశ్శ్వసన్తీం సుదుఃఖార్తాం గజరాజవధూమివ ||19.19||

స|| నిఃశ్వసంతీం సుదుఃఖార్తాం గృహీతాం స్తంభే ఆలితాం యూథపేన వినా కృతామ్ గజరాజవధూం ఇవ||

||శ్లోకార్థములు||

గృహీతాం స్తంభే ఆలితాం - పట్టుకోబడి స్తంభమునకు కట్టబడి
యూథపేన వినా కృతామ్ - గజరాజునుంచి విడివడిన
గజరాజవధూం ఇవ - గజరాజు వధువు వలె
నిఃశ్వసంతీం సుదుఃఖార్తాం - అతి దుఃఖముతో నిట్టూర్చుచున్న

||శ్లోకతాత్పర్యము||

"ఆమె పట్టుకోబడి స్తంభమునకు కట్టబడి గజరాజునుంచి విడివడిన గజరాజు వధువు వలె అతి దుఃఖముతో నిట్టూర్చుచున్నది."||19.19||

||శ్లోకము 19.20||

ఏకయా దీర్ఘయా వేణ్యా శోభమానాం అయత్నతః|
నీలయా నీరదాపాయే వనరాజ్యా మహీమివ||19.20||

స|| దీర్ఘయా ఏకయా వేణ్యా అయత్నతః శోభమానామ్ నీరదాపాయే నీలయా వనరాజ్యా మహీం ఇవ||

||శ్లోకార్థములు||

దీర్ఘయా ఏకయా వేణ్యా - పోడుగైన ఒక జడతో
అయత్నతః శోభమానామ్ - అప్రయత్నముగా శోభించుచున్న
నీరదాపాయే - వర్షాకాలపు చివరిలో
నీలయా వనరాజ్యా - నల్లని వృక్షములబారుతో వున్న
మహీం ఇవ - భూమిలా శోభిస్తున్నది

||శ్లోకతాత్పర్యము||

"అప్రయత్నముగా పోడుగైన ఒక జడతో శోభించుచున్న ఆమె వర్షాకాలపు చివరిలో నల్లని వృక్షములబారుతో వున్న భూమిలా శోభిస్తున్నది." ||19.20||

||శ్లోకము 19.21||

ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ|
పరీక్షీణాం కృశాం దీనాం అల్పాహారాం తపోధనామ్||19.21||

స|| ఉపవాసేన శోకేన ధ్యానేన భయేన చ పరిక్షీణాం కృశాం దీనాం అల్పహారాం తపోధనామ్ ||

||శ్లోకార్థములు||

ఉపవాసేన శోకేన - ఉపవాసములతో శోకముతో
ధ్యానేన భయేన చ - ధ్యానముతో భయముతో
పరిక్షీణాం కృశాం దీనాం - కృశించి దీనముగానున్న
అల్పహారాం తపోధనామ్ - స్వల్పాహారముతో తపమే ధనముగా గల

||శ్లోకతాత్పర్యము||

"ఉపవాసములతో శోకముతో ధ్యానముతో భయముతో క్షీణించి కృశించి దీనముగానున్న ఆ సీత తపమే ధనముగా స్వల్పాహారముతో ఉన్నది." ||19.21||

||శ్లోకము 19.22||

అయాచమానాం దుఃఖార్తాం ప్రాఞ్జలిం దేవతామివ|
భావేన రఘుముఖ్యస్య దశగ్రీవ పరాభవమ్||19.22||

స|| దేవతాం ఇవ దుఃఖార్తాం భావేన రఘుముఖ్యస్య దశగ్రీవ పరాభవమ్ ప్రాంజలిం అయాచమానామ్||

||శ్లోకార్థములు||

దుఃఖార్తాం దేవతాం ఇవ -
దుఃఖములో నున్న దేవతవలె నున్న
ప్రాంజలిం - అంజలిఘటించి
దశగ్రీవ పరాభవమ్ - రావణ పరాభవము
భావేన అయాచమానామ్ రఘుముఖ్యస్య -
రాఘవుని కోరుచున్నదా అన్నట్లు వున్నది

||శ్లోకతాత్పర్యము||

"దుఃఖములో నున్న దేవతవలె నున్నఆ సీత అంజలిఘటించి రాఘవముఖ్యునిచేత రావణ పరాభవము కోరుచున్నదా అన్నట్లు వున్నది". ||19.22||

||శ్లోకము 19.23||

సమీక్షమాణాం రుదతీమనిన్దితాం
సుపక్ష్మ తామ్రాయత శుక్లలోచనామ్|
అనువ్రతాం రామమతీవ మైథిలీం
ప్రలోభయామాస వధాయ రావణః ||19.23||

స||| సమీక్షమానామ్ రుదతీం అనిందితాం సుపక్ష్మ తామ్రాయత శుక్లలోచనామ్ అతీవ రామం అనువ్రతామ్ మైథిలీం రావణః వధాయ ప్రలోభయామాస||

||శ్లోకార్థములు||

సమీక్షమానామ్ రుదతీం అనిందితాం -
అటూఇటూ చూచుచున్న రోదించుచున్న దోషములేని
సుపక్ష్మ తామ్రాయత శుక్లలోచనామ్ -
చక్కని కనురెప్పలుగల, కొనలలో ఎరుపుదనము, తెల్లని విశాలనేత్రములు కల
అతీవ రామం అనువ్రతామ్ మైథిలీం-
ఎల్లప్పుడూ రామునే ధ్యానించుచున్న ఆ సీతను
రావణః వధాయ ప్రలోభయామాస -
రావణుడు తన చావును కోరుకుంటున్నట్లు ప్రయత్నము చేయసాగెను

||శ్లోకతాత్పర్యము||

"రోదించుచున్న దోషములేని, చక్కని కనురెప్పలు గల, కొనలందు ఎరుపుదనము, తెల్లని విశాలనేత్రములు కల, ఎల్లప్పుడూ రామునే ధ్యానించుచున్న, తనను ర్క్షించేవారికోసమా అన్నట్లు అటూ ఇటూ సమీక్షుంచున్న సీతను , రావణుడు తన చావును కొరకా అన్నట్లు ప్రలోభించుటకు ప్రయత్నము చేయసాగెను." ||19.23||

ఈ శ్లోకముతో పంతొమ్మిదవ సర్గ సమాప్తము.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ఏకోనవింశస్సర్గః||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో పంతొమ్మిది సర్గ సమాప్తము.

||ఓం తత్ సత్||
||ōm tat sat||