||Sundarakanda ||

|| Sarga 1|| Summaryof all Slokas in Telugu !


||ఓమ్ తత్ సత్||

తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః |
ఇయేషపదమన్వేష్టుం చారణాచరితే పథే ||1||

తా|| అప్పుడు శతృవులను నాశనము చేయగల హనుమంతుడు రావణునిచే తీసుకుపోబడిన సీతను వెదుకుటకై చారణులు పయనించు గగనమార్గమున పోవుటకు నిశ్చయించుకునెను.

హరిః ఓమ్
ఓమ్ శ్రీరామాయ నమః
శ్రీమద్వాల్మీకి రామాయణే
సుందరకాండే
ప్రథమస్సర్గః

( సీతాన్వేషణలో నిరాశాపరులైన వానరులు సంపాతి ద్వార , రావణుని చేత అపహరింపబడిన సీత లంకానగరములో ఉన్నది అని తెలుసుకుంటారు. లంక వెళ్ళడానికి మహేంద్రగిరి దగ్గర సముద్రతీరములో ఎవరు ఆ సముద్రము దాటగలరు అని ఆలోచిస్తారు. అప్పుడు జాంబవంతుని చే ప్రేరేపింపబడిన హనుమంతుడు సీతాన్వేషణకోసము సముద్ర లంఘనము చేయుటకు సిద్ధపడతాడు. ఇక్కడ సుందరకాండ మొదలవుతుంది.)

అప్పుడు శతృవులను నాశనము చేయగల, జాంబవంతునిచే ప్రేరేపింపబడిన హనుమంతుడు రావణునిచే తీసుకుపోబడిన సీతను వెదుకుటకై చారణులు పయనించు గగనమార్గమున పోవుటకు నిశ్చయించుకునెను.

ఆ హనుమంతుడు దుష్కరమైన అనన్యశక్యమైన పనిని సాధించుటకై మెడను చాచి తలను పైకెత్తి గోవులకుపతి అయిన ఆంబోతు వలె విరాజిల్లెను. అప్పుడు మహాబలవంతుడు ధీరుడు అయిన హనుమంతుడు వైఢూర్యమణులలా ఆకుపచ్చని రంగుతో నీటితో పోలిన పచ్చిక బీళ్ళమీద అనాయాసముగా తిరగసాగెను.

ఆ మహేంద్రగిరిపై ధీమంతుడు అయిన హనుమంతుడు తన వేగముతో పక్షులు మృగములను భయపెట్టుచూ, తన ఛాతితో వృక్షములను కూలగొడుతూ సింహము వలె తిరగసాగెను. సహజమగా నలుపు తెలుపు పసుపు ఎఱుపు రంగులు కల ధాతువులతో వున్న ఆ మహేంద్ర పర్వతము, ఆ రంగులతో అలంకరించబడినదా అన్నట్లు ఉండెను.

ఆ పర్వతముపై తమ ఇఛ్చానుసారము రూపము ధరించగల యక్ష, కిన్నర, గంధర్వులు, దేవతలతో సమానులైన పన్నగులు, తమ పరివార సమేతముగా వసిస్తూ వున్నారు. ఆ వానరోత్తముడు శ్రేష్టమైన ఏనుగులతో సంచరింపబడుచున్న ఆ పర్వతముపై నిలబడి, తనే ఒక మదగజము లాగ ప్రకాశించుచుండెను.

అప్పుడు వెళ్ళుటకు నిశ్చయించుకొనిన హనుమంతుడు సూర్యునకు ఇంద్రునకు వాయువునకు, స్వయంభువు అయిన బ్రహ్మకు అంజలిఘటించి, తూర్పు దిశగా తిరిగి తన తండ్రి అయిన వాయువుకు అంజలిఘటించి , దక్షుత గల హనుమంతుడు దక్షిణ దిశగా వెళ్ళుటకు తన దేహమును పెంచెను.

ప్లవంగ ప్రవరులు అనగా వానర వీరులు చూచుచూ వుండగా , రామ అభ్యుదయముకోసము ఎగరడానికి కృతనిశ్చయుడై , హనుమంతుడు పర్వదినములలో సముద్రము పొంగిన రీతిని తన శరీరమును పెంచెను. కొలవడానికి సాధ్యముకానట్లుగా పెంచిన శరీరముతో సముద్రము పై లంఘించుటకై ఆ పర్వతమును తన చేతులతో పాదములతోను నొక్కిపట్టెను.

అచలమైనప్పటికి ఆ వానరుని చే నొక్కబడిన ఆ పర్వతము ఒక క్షణము చలించెను. అప్పుడు చెట్లమీద వున్న పూశిన పూలన్ని రాలి క్రింద పడెను. చెట్లనుంచి ముక్తిపొంది రాలిన సుగంధముగల పూలతో నిండినదై ఆ పర్వతము పూలపర్వతములాగ శోభించెను.

ఆ ఉత్తమవీరుడగు హనుమంతునిచే నొక్కబడి, ఆ పర్వతము మత్త గజములాగ నీళ్ళని స్రవించెను. ఆ మహేంద్ర పర్వతము ఆ హనుమంతుని బలముతో నొక్కబడి బంగారము వెండి రీతి రేఖలతో మెరిశెను. ఆ పర్వతము ధూమ్రవర్ణముగల విశాలమైన శిలలను ధూమ్రవర్ణముగల జ్వాలతో అగ్ని విరజిమ్మినట్లు విరజిమ్మెను. ఆ పర్వతము చేత పీడింపబడి గుహలలోనున్న జీవ జాలము అంతా భయముతో వికృతమైన స్వరములతో ఆక్రందన చేశెను.

ఆ నొక్కబడిన పర్వతరాజము చేత మరల నొక్కబడిన పెద్దపెద్ద జంతువులు చేసిన ధ్వనులు, భూమిలో అన్ని దిక్కులలోనూ, సమీప అరణ్యములలోనూ ప్రతిధ్వనించాయి. స్వస్థిక చిహ్నములుగల పడగలువున్న సర్పములు తమ తలలతో భయంకరమైన విషమును కక్కుచూ తమ కోరలతో శిలలను కరిచినవి. ఆ విధముగా క్రోధముతో విషముగల కోరలతో కొరకబడిన ఆ శిలలు అగ్నిచే జ్వలించి వెయిముక్కలు అయ్యెను. అ పర్వతము పై పెరిగిన , ఆ విషమును శమింపగల ఔషధులు కూడా ఆ సర్పముల విషమును శమింపలేకపోయెను.

ఈ పర్వతము భూతములచే ముక్కలు చేయబడుతున్నదని తలచిన తపస్వీకులు, అదే విధముగా తమ స్త్రీ గణములతో విద్యాధరులు కూడ ఆ పర్వతమునుంచి పైకి ఎగిరిపోయిరి. ఎగిరిపోతూ పానభూమిపై మహత్తరమైన భోజన పాత్రలను , బంగారపు మద్య పాత్రలను వదిలి పైకి పోయిరి. అలా పైకి పోతూవారిచేత తినబడుచున్న భక్ష్యాలు, అనేక విధములైన లేహ్యములు, చిన్నవి పెద్దవి అగు పాత్రలు, మాంసమును, ఎద్దు చర్మములు, బంగారుపిడులు కల కత్తులు అక్కడే వదిలి వేయబడినాయి.

విద్యాధరులు కంఠములో బంగారు తాళ్ళు, శిరమున ఎఱ్రని పూలతో , మద్యపానముతో మదించిన వారై , ఎఱ్ఱని కళ్ళు కలవారై , ఎఱ్ఱని లేపములతో అలంకరింపబడినవారై ఆకాశములోకి ఎగిరిరి. విస్మితులు సస్మితులు అయిన విద్యాధరస్త్రీలు హారాలు అందియలు బాహుపురులు కంకణాలు ధరించి ఆకాశములో నిలబడిరి. అ విద్యాధరులలో మహర్షులు , అన్నివిద్యలలో ప్రవీణులు అగు వారు కూడా ఆకాశములో నుంచుని ఆ పర్వతమును ఆశ్చర్యముగా చూచుచుండిరి.

అప్పుడు ఆ ఆకాశములో నిలబడిన చారణులకు సిద్ధులకు పరిశుద్ధమనస్సు కల ఋషుల మాటలు వినపడ్డాయి. "ఈ పర్వతముతో సమానమైన వాడు, మహావేగము కలవాడు, వాయుపుత్రుడు అయిన హనుమంతుడు మకరాలయమైన సముద్రమును దాటగోరుచున్నాడు. రామకార్యముకొఱకు, వానరుల కోసము అన్యులకు శక్యము కాని దుష్కరమైన కార్యమును సాధించుటకు సముద్రమునకు ఆవలి వడ్దు చేరగోరచున్నాడు"అని.

ఆ తపస్వీకుల మాటలు విన్న విద్యాధరులు అప్పుడు వానరులలో వృషభరాజమైన అప్రమేయుడగు హనుమంతుని ఆ మహేంద్ర గిరి పై చూచిరి. పర్వతము వంటి శరీరము కల ఆ హనుమంతుడు పర్వతముపై తన రోమములను విదిల్చెను. మేఘములవలె గర్జించెను. పక్షిరాజు పన్నగమును తిప్పినట్లు వెంట్రుకలతో నిండిన పొడవైన తన తోకను గిరగిరా తిప్పెను. మహావేగముతో పోబోతున్న ఆ హనుమంతుడి వెనకభాగమున నిట్టనిటారుగానున్న ఆ హనుమంతుని లాంగూలము, గరుత్మంతుని చే తీసుకుపోబడుతున మహాసర్పము వలె నుండెను. ఆ వానరుడు పరిఘలాగా వున్న బాహువులను బిగబట్టి, నడుమును సన్నముగా చేసి, పాదములను ఎగరడానికి సిద్ధము చేశెను. అతి పరాక్రమవంతుడైన హనుమంతుడు తన భుజములను శిరస్సును వంచి తనలోనున్న తేజస్సును బలాన్ని పెంపొందించుకునెను. తన కళ్ళను పైకెత్తి తను పయనించవలసిన ఆకాశమార్గము వైపు చూస్తూ తన ఊపిరిని బిగబట్టెను.

వానరులలో ఏనుగు వంటి వాడూ, మహాబలుడూ అయిన హనుమంతుడు పాదములతో ధృడముగా తనువున్నస్థానమును అదిమిపెట్టి , చెవులను వంచి, ఎగురుటకు సిద్ధముగావుండి అచట వున్న వానరులతో ఆ వానర శ్రేష్టుడు ఈ వచనములను వచించెను.

" ఏవిధముగా రామునిచే వదిలినబాణము పోవునో, ఆవిధముగా వాయు వేగముతో రావణునిచే పాలించబడు లంకకు వెళ్ళెదను. లంకలో జనకాత్మజ కనిపించనిచో, అదే వేగముతో సురాలయమునకు వెళ్ళెదను. ఒకవేళ దేవలోకములో సీతను చూడలేకపోతే శ్రమలేకుండా రాక్షస రాజుని బంధించి తీసుకు వచ్చెదను. అన్నివిధములుగా కృతకార్యుడనై సీతాదేవితో సహా నేను వచ్చెదను. లేక లంకను రావణునితో సహా పెకిలించి తీసుకువచ్చెదను".

వానరులతో ఈ విధముగా చెప్పి వానరోత్తముడైన హనుమంతుడు మరి ఒక ఆలోచన లేకుండా ఆకాశములోకి ఎగిరెను. ఆ కపికుంజరుడు అగు హనుమానుడు తనను తానే గరుత్మంతునిగా భావించుకొనెను.

హనుమంతుడు అలా వేగముతో ఎగరగా ఆపర్వతము పై నున్న వృక్షములు తమ కొమ్మలను ముడుచుకొని అన్ని చోటలనుంచి పైకి ఎగిరెను. పుష్పములతో విరబూచియున్న మదించిన పక్షులు వసిస్తున్నఆ వృక్షములు ఆ హనుమంతుని తొడలవేగముతో పెకలింపబడి నిర్మలాకాశములో్కి పయనించినవి. ఆ తోడలవేగముతో పెకలించబడిన వృక్షములు , దూరదేశయాత్రకు పోవుటకు బయలుదేరిన దగ్గిర బంధువును అనుసరించినట్లు , హనుమంతుని అనుసరించినవి. ఆ తొడలవేగముతో పెకలింపబడిన మద్ది ఇంకా ఉతమమైన చెట్లు, రాజుని సైన్యము అనుసరించినట్లు, హనుమంతుని అనుసరించినవి.

పర్వతాకారములో నున్న హనుమంతుడు, అనేక పుష్పములతో నిండిన వృక్షములచేత అకాశములో అనుసరింపబడుతూ అద్భుతమైన రూపములో కనపడెను. పెద్దపెద్దవృక్షములు మహేంద్రునికి భయపడి సాగరములో మునిగిన పర్వతములవలే ఆ సాగరములో పడి మునిగిపోయెను. అనేకరకములైన పుష్పములు మొగ్గలచేత కప్పబడినట్టి, మేఘమువలెనున్న హనుమంతుడు మిణుగురు పురుగులు చే ఆవరింపబడిన పర్వతము వలే శోభించెను. ఆ హనుమంతుని వేగము నుంచి విముక్తులైన వృక్షములు కూడా పుష్పములను వదులుచూ తమ స్నేహితులను వదిలి వెనకి తిరిగిన వారివలె, ఆ సాగరములో పడినవి.

హనుమంతుని వేగము వలన పైకి లేచిన అనేకరకములైన విచిత్రమైన పుష్పములు భారములేనివై సాగరములో పడినవి. భారములేని కారణము వలన సముద్రములో పైకి తేరిన ఆ పుష్పములతో, ఆ సముద్రము నక్షత్రములతో నిండిన ఆకాశము వలె శోభించెను. అనేకమైన వర్ణములు గల పుష్పములతో కప్పివేయబడిన ఆ కపి, ఆకాశములో మెరుపులతో ఒప్పారే మేఘము వలె ప్రకాశించెను. హనుమంతుని వేగము వలన పైకి ఎగిసిన పుష్పములు సముద్రములో పడి ఆ సముద్రము సుందరమైన నక్షత్రములతో కూడి ఉదయించిన ఆకాశమువలె శోభించెను.

ఆకాశములో ఎగురుతూ ఆకాశములోకి చాచబడిన హనుమంతుని ఆ రెండు బాహువులు పర్వతమునుంచి బయటకు వస్తున్న రెండు ఇదుతలల సర్పములవలె ఉండెను. అలా ఎగురుతున్న మహా కపి తరంగములతో కూడిన సాగరమును అలాగే ఆకాశమును త్రాగుచున్నాడా అన్నట్లుగా కనపడెను. వాయుమార్గమును అనుసరించుచున్న ఆ వానరుని కళ్ళు మెఱుపులవిద్యుత్కాంతితో ఒప్పారుచూ పర్వతముమీద వున్న రెండు నిప్పుమంటలలాగ ప్రకాశించుచుండెను. పింగాక్షములుకలవారి లో ముఖ్యుడగు హనుమంతుని పింగాక్షములు అనగా కళ్ళు ఉదయిస్తున్న సూర్య చంద్రునివలె ప్రకాశించుచుండినవి.

ఆ హనుమంతుని ఏఱ్ఱని ముక్కు, కాంతిచే ఎఱ్ఱబారిన ముఖము సంధ్యాసమయములో ని సూర్యమండలము లాగా ప్రకాశించెను. ఆకాశములో ఎగురుతున్న హనుమంతుని లాంగూలము మహోన్నతముగా నిలచిన ఇంద్రధ్వజము లాగ శోభించెను. తెల్లని దంతములు గల , మహా బలవంతుడు, బుద్ధిమంతుడు , వాయు పుత్రుడు అయిన హనుమంతుని తోక చక్రాకారముతో వుండి ఆ హనుమంతుడు గూడుకట్టిన సూర్యునిలా శోభిల్లుచుండెను. ఆ మహాకపి ఎఱ్ఱని పిరుదులతో రెండుభాగముల కల గైరికధాతువుతో కూడిన గిరివర్యునిలాగ శోభించెను.

సాగరము దాటుతున్న ఆ వానరసింహము యొక్క చంకల మధ్యలోనుంచి పోవుచున్న వాయువు, జీమూతము వలె గర్జించుచుండెను. దక్షిణదిశగా పయనిస్తున్న ఆ వానరముఖ్యుడు ఉత్తరదిశలో ఉదయించి ఆకాశమార్గములో పయినించి క్రింద పడుతున్న ఉల్కలాగ కనిపించెను. అకాశములో సూర్యునిలా పయనించుచున్న హనుమంతుడు ,తన నడుము చుట్టూ కట్టబడి అలాగే కట్టబడిన మాతుంగమువలే కనపడెను. ఆకాశములోనున్న ఆ వానరుని శరీరము యొక్క ఛాయ సాగరములో గాలికి కదిలిపోతున్న నౌక వలె కనిపించెను.

ఆ మహాకపి సాగరములో ఏ ఏ ప్రదేశములపై ఎగురుచుండెనో ఆప్రదేశములలో సాగరజలము పెద్ద పెద్ద కెరటములతో అతని వేగముతో చలిస్తూ ఉన్మాదం చెందినట్లు కనపడుచున్నది. ఆ వానరుడు మహావేగముతో ఎగురుచుండగా సాగరములో తరంగములు కోడంత ఎత్తు లేచి అతని వక్షస్థలముతో ఢీకొనుచున్నవా అనునట్లుండెను. బలవంతుడగు హనుమంతుని వలన జనించిన గాలి , మేఘముల గాలి కలిసి భయంకరమైన ఘోష తో సాగరమును కంపింపసాగెను. ఆమహాకపి సాగరముపై ఎగురుచుండగా భూమి ఆకాశముల మద్య స్థానమును విరజిమ్ముచున్నట్లుండెను.

మహావేగముతో ఎగురుచున్న ఆ హనుమంతుడు ఆ మహాసాగరములో లేచిన మేరు మందర పర్వతములతో సమానమైన తరంగములను లెక్కించుచున్నాడా అన్నట్లు ఉండెను. ఆ మహాకపి వేగమువలన పైకి లేచిన నీటి తుంపర మేఘములతో కలిసి శరత్కాలపు మేఘములా భాసిల్లెను. అప్పుడు సముద్రజలము పైకి లేవడము వలన సముద్రములోని తిమింగలములు మొసళ్ళు తాబేళ్ళు, వస్త్రములు తోలగించబడిన శరీరముల అవయవములవలె కనిపించెను. ఆ ఆకాశములో ఎగురుచున్న హనుమంతుని చూచి సాగరములో ని భుజంగములు ఆ హనుమతుని గరుత్మంతుడేనని భ్రమించాయి.

పది యోజనములు పొడవూ ముప్పది యోజనముల వెడల్పూ గల ఆ వానరసింహుని నీడ జలములో మనోహరముగా కనపడెను. ఆ వాయుపుత్రుని అనుసరించి సాగరములో పోవుచున్న ఆ హనుమంతుని ఛాయ దట్టమైన తెల్లని మేఘసముదాయము వలే ప్రకాశించుచుండెను.

మహాతేజోవంతుడు మహాకాయముగలవాడు అగు హనుమంతుడు ఆకాశములో ఏ అధారము లేకుండా ఎగురుతూ ఉంటే అతడు రెక్కలు ఉన్న పర్వతము లాగ భాసించెను. బలవంతుడగు ఆ కపికుంజరుడు వేగముతో ఏ మార్గములో పోవుచుండెనో అచట సముద్రము లోయలాగ ఏర్పడెను. హనుమంతుడు వాయువులాగ మేఘములను తనతో లాక్కొని పోతూ, పక్షి సంఘములను కొనిపోతున్న పక్షిరాజు వలే శోభించెను. హనుమంతుని వేగముచే లాక్కొని పోతున్న తెలుపు ఎరుపు నలుపు ఆకుపచ్చరంగుల మేఘములు అతి సుందరముగా శోభించుచున్నవి.

ఆ మేఘములలోకి పోతూ బయటకి వస్తూ వున్న ఆ హనుమంతుడు, మేఘములలో దాగి బయటకువచ్చు చంద్రునివలె కనిపించెను. అప్పుడు త్వరగా ఎగురుచున్న ఆ హనుమంతుని చూచి దేవ గంధర్వ దానవులు పుష్పవర్షములు కురుపించిరి. అప్పుడు రామకార్యము సాధించుటకు ఎగురుచున్న ఆ వానరోత్తముని సూర్యుడు తపింపచేయలేదు. వాయువు అతనిని సేవించెను. ఆకాశములో పయనించుచున్న మహాతేజస్సుగల హనుమంతుని ఋషులు స్తుతించిరి. దేవతలు గంధర్వులు ప్రశంసిస్తూ గానము చేసిరి.

శ్రమలేకుండా పయనించుచున్న కపివరుని చూచి నాగులూ యక్షులూ రాక్షసుకు దేవతలూ పక్షులూ కొనయాడసాగారు. ఆ ప్లవంగములలో శార్దూలము లాంటి హనుమంతుడు అలా ఎగురుతూ పోవుచుండగా ఇక్ష్వాకుకులమును గౌరవించు సాగరుడు చింతించ సాగెను. "ఇప్పుడు నేను వానరేంద్రుడు అయిన హనుమంతునికి సహాయము చేయకపోనిచో అప్పుడు తెలిసినవారి దృష్టి లో నేను నిందింప తగినవాడను అగుదును. నేను ఇక్ష్వాకునాధుడగు సగరునిచే పెంపోదింపబడితిని. ఈ ఇక్ష్వాకు సచివుడు అగు హనుమంతుడు అలసట పొందకూడదు. ఎలాగైతే ఈ వానరుడు విశ్రమించునో అలాగ చేయవలెను. నామీద విశ్రమించిన పిమ్మట ఆ వానరుడు సుఖముగా దాటగలడు".

సముద్రుడు ఈవిధముగా అలోచించి సాగరములో దాగివున్న బంగారముతో నిండిన గిరిసత్తముడైన మైనాకుని తో ఇట్లు పలికెను. "ఓ గిరి శ్రేష్ఠుడా! నీవు ఇచట పాతాళములో వున్న అసుర సంఘములకు అడ్డుగా దేవేంద్రుని ఆజ్ఞతో వున్నావు. పరాక్రమము పెంచుకొని మళ్ళీ పైకి రాగల అసురులు పైకి రాకుండా అప్రమేయమైన పాతాళ ద్వారమును మూసి నిలబడ్డావు. ఓ గిరిసత్తమా నీకు పైకి కిందకి అడ్డముగాను పెరిగే శక్తి వుంది. అందువలన ఓ గిరిసత్తమ నిన్ను ప్రొత్సహిస్తున్నాను. పైకి నిలబడు".

సముద్రుడు మైనాకునితో ఇంకా చెప్పసాగెను.

"వానరులలో శార్దూలము , వీరుడు , దుష్కరమైన కర్మలను చేయగలవాడు అగు ఈ హనుమంతుడు రామకార్యము సాధించుటకు నీ మీదుగా ఆకాశములో ఎగిరి పోవుచున్నాడు. ఇక్ష్వాకుకులమును సేవించు ఇతనికి సహాయము చేయుట నా ధర్మము. ఇక్ష్వాకులు నాకు పూజ్యులు. నీకు కూడా పూజించతగినవారు. వారికి సహాయము చేయవలెను. ఇది వారికి సహాయము చేయతగిన అవకాశము. ఈ అవకాశమును కోలుపోరాదు. చేయతగిన కార్యము చేయబడనిచో ఆ కార్యము ఎప్పుడూ మనస్సును విధించును. సలిలముల నుండి పైకి రమ్ము. ఈ అకాశములో ఎగురువారిలో శ్రేష్ఠుడు అగు హనుమంతుడు మన అతిథి, మరియు పూజించ తగినవాడు. ఈ వానరుడు నీ మీద విశ్రమించు గాక".

సముద్రుడు మైనాకునితో ఇంకా చెప్పసాగెను

" ఓ బంగారు శిఖరములు కలవాడా ! నీవు దేవ గంధర్వులచే సేవింపబడినవాడవు. హనుమంతుడు నీపై విశ్రమించి పిమ్మట మిగిలిన సముద్రము దాటగలడు. కాకుత్‍స్థుల సత్యపరాయణము, మైథిలీ అపహరణము, వానరేంద్రుని శ్రమ చూసి నీవు పైకి వచ్చుట సబబు".

లవణాంభసి లో దాగి వున్న, మహా వృక్షములతో కూడిన ఆ హిరణ్యనాభుడు అగు మైనాకుడు ఈ మాటలు విని జలములనుండి పైకి వచ్చెను. అలా పైకి వచ్చిన మైనాకుడు సాగర జలములనుండి జలధరమైన మేఘములలోనుంచి వచ్చిన సూర్యుని వలె ఉండెను. ఆ పర్వతము యొక్క శిఖరములు కరిగించిన బంగారములా ఉండడము వలన శస్త్రముల రంగు కల ఆకాశము అంతా బంగారు కాంతిని పొందినది. సహజమైన కాంతితో విరాజిల్లు బంగారు శిఖరములు కల ఆ గిరిసత్తముడు వంద సూర్యులకాంతితో విరాజిల్లెను.

క్షణములో సాగరములో నియోజింపబడిన ఆ పర్వతము యొక్క శిఖరములను అ మహాత్ముడగు హనుమంతుడు చూచెను.

ఆ లవణాంభసి మధ్యలో అసంగతముగా పైకి లేచి, ముందు నిలబడిన ఆ పర్వతమును చూచి, ఇది ఒక విఘ్నము అని తలచి, ఆ మహావేగము కల కపిసత్తముడు పైకి పెరిగిన పర్వతమును, వాయువు మేఘములను చెదరకొట్టినట్లు, తన వక్షస్థలముతో ఢీకొని పడవేసెను.

ఆవిధముగా వానరునిచేత పడగొట్టబడి, ఆ పర్వతోత్తముడు అగు మైనాకుడు వానరుని వేగము తెలిసికొని సంతోషపడెను. సంతోషపడిన ఆ పర్వతము, సంతోషపడిన మనస్సు కలవాడై మానుషరూపము ధరించి , అ శిఖరములలో నిలబడినవాడై ఆ వీరుడైన వానరునితో మైనాకుడు ఇట్లు పలికెను.

"ఓ వానరోత్తమా ! నీవు దుష్కరమైన కర్మ చేయుచున్నావు. నా శిఖరములలో దిగి సుఖముగా విశ్రమించుము. ఈ సాగరము రాఘవుని కులములో పుట్టిన వారిచేత ప్రవర్థింపబడినది. ఆ సాగరుడు రామహితముకోరి నిన్ను పూజచేయకోరుతున్నాడు".

" ఉపకారము చేసినవారికి ప్రత్యుపకారము చేయుట సనాతన ధర్మము. ఆ విధముగా ప్రత్యుపకారము చేయదలిచిన ఆ సాగరుడు నీకు సమ్మానము చేయుటకు అర్హుడు. ఆ సాగరునిచేత నీకోసము గౌరవముతో నేను ప్రేరేపింపబడితిని. ఓ కపిశార్దూలమా! నీవు కూర్చొనుము. నా శిఖరములలో విశ్రమించి వెళ్ళుదువు గాక ".

"నూరు యోజనములను లంఘించుచున్న ఈ వానరుడు నీ శిఖరములలో విశ్రమించి వేళ్ళును అని సాగరుడు నన్ను ప్రేరేపించెను. ఓ వానరోత్తమ అందువలన ఈ మంచిరుచీ వాసనలు గల కందమూలఫలాదులు ఆరగించి విశ్రమించి ప్రయాణము కొనసాగించుము".

మైనాకుడు ఇంకా చెప్పసాగెను.

"ఓ కపిముఖ్యుడా !మూడు లోకములలో ప్రఖ్యాతికెక్కిన సద్గుణాల కారణముగా మాకు కూడా నీతో సంబంధము ఉన్నది. ఓ మారుతాత్మజా! వేగముతో ఎగర గలవారిలో నీవు ముఖ్యుడవు అని నాకు తెలుసు".

"ధర్మము తెలిసినవారికి తెలిసినది, సామాన్యుడైననూ అతిథి పూజార్హుడు. అటువంటప్పుడు నీ లాంటి మహాపురుషుని గురించి చెప్పనవసరము లేదు. ఓ కపికుంజరా! దేవతలలో శ్రేష్ఠుడు అయిన వాయుదేవుని కుమారుడవు. వేగములో ఆ వాయుదేవునతో సమానుడవు. ఓ ధర్మము తెలిసిన వాడా ! నిన్ను పూజించినచో వాయుదేవుడు ఆ పూజలను పొందును. అందువలన నీవు కూడా నాకు పూజనీయుడవు. దానికి కారణము వినుము. నాయనా ! పూర్వము కృతయుగములో పర్వతములు పక్షులవలే రెక్కలతో ఉండెడివి. అవి గరుత్మంతుని వేగముతో అన్ని దిక్కులలో వెళ్ళుచుండెడివి. అప్పుడు ఆ పర్వతముల అకస్మిక ప్రయాణములవలన దేవసంఘములు ఋషులతో సహా అన్ని భూతములు అవి పడునని భయముతో ఉండెడివారు. అప్పుడు శతక్రతువులు చేసిన వేయి కళ్ళుకల ఇంద్రుడు కోపముతో పర్వతములయొక్క రెక్కలను చేదింపసాగెను. ఆ దేవతల రాజు కోపము కలవాడై వజ్రాయుధముతో నా పైకి వచ్చెను. అప్పుడు నేను మహాత్ముడైన వాయుదేవునిచే వేగముగా పడవేయబడితిని. ఓ ప్లవంగములలో ఉత్తముడా ! రెక్కలతో సహా ఈ సాగరములో పడవేయబడి నీ తండ్రి చేత రక్షింప బడితిని".

మైనాకుడు ఇంకా చెప్పసాగెను

"ఓ కపిముఖ్యుడా ! అందువలన వాయుదేవుడు నాకు గౌరవనీయుడు. అందువలన నేను నిన్ను గౌరవించుచున్నాను. నీతో నా సంబంధము ఉత్తమైన గుణముల వలన కలిగినది. ఓ మహాకపి ! ఈ కార్యములో ఈ విధముగా పోవుచూ సంతోషమైన మనస్సుతో నా యొక్క, సాగరునియొక్క ప్రీతిని పొందతగిన వాడివి. ఓ కపిసత్తమ! శ్రమతీర్చుకొని, పూజలను అందుకొని , మా ప్రేమని గౌరవించు. నీ దర్శనముతో నేను ప్రీతి పొందినవాడను" అని.

ఈ విధముగా చెప్పబడిన ఆ వానరోత్తముడు ఆ మైనాకునితో ఇట్లనెను.

"ఓ మైనాకా ! నేను నీ మాటలతో ఆతిధ్యము తీసికొనినట్లే ప్రీతి పొందితిని. ఆతిధ్యము తీసుకొనలేదు అని అనుకొనవద్దు. నా కార్యకాలము సమీపించుచున్నది. పగలు గడిచిపోతున్నది. మధ్యలో ఆగకూడదని నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను కూడా" అని. వీరుడైన హనుమంతుడు ఈ విధముగా చెప్పి ఆ పర్వతమును చేతితో తాకి ఆకాశములో ప్రవేశించి చిరునవ్వుతో వెళ్ళెను.

ఆ అనిలాత్మజుడు ఆవిధముగా అ మైనాకునిచేత సాగరునిచేత గౌరవింపబడి కార్యము సిద్దిపోందుటకు ఆశీర్వాదములతో ప్రస్తుతింపబడెను. ఆ సాగరమును మైనాకుని వదిలి హనుమంతుడు దూరముగా ఆకాశములోకి ఎగిరి తన తండ్రియొక్క మార్గమును అనగా వాయుమార్గము అనుసరిస్తూ వెళ్ళెను.

ఆ వాయుసూనుడు మళ్ళీ ఏత్తైన మార్గము చేరి, ఆ పర్వతమును చూస్తూ అధారము లేకుండా నిర్మలాకాశములో వెళ్ళెను. హనుమంతుడు ఆవిధముగా చేసిన రెండవ అద్భుత కార్యముచూచి సురలు సిద్ధులు ఋషులు అందరూ హనుమంతుని ప్రశంసించిరి.

అక్కడవున్న దేవతలు అలాగే సహస్రాక్షుడైన వాసవుడు కూడా బంగారు శిఖరములు గల మైనాకుని పనితో సంతోషపడిరి. ధీమంతుడైన శచీపతి సంతోషముతో పర్వతములలో శ్రేష్ఠుడైన మైనాకునితో గద్గదమైన స్వరముతో స్వయముగా ఇట్లు పలికెను.

" ఓ బంగారు శిఖరములు కల శైలేంద్రా! నీవు చేసిన పనికి నేను సంతోషపడిన వాడను. ఓ సౌమ్యుడా ! నీకు అభయము ఇచ్చుచున్నాను. నీవు సుఖముగా వుండుము. శతయోజనముల లంఘనము చేయుట భయపడతగినదైననూ భయములేని విక్రాంతుడగు హనుమంతునికి నీచేత గొప్ప సహాయము చేయబడినది. ఈ వానరుడు రాముని హితము కోఱకే పోవుచున్నాడు. అట్టివానికి సత్కారము చేసిన నీతో అత్యంత సంతోషపడితిని" అని.

అప్పుడు దేవతల అధిపతి అయిన శతక్రతుని సంతోషము చూచి ఆ పర్వతోత్తముడు అగు మైనాకుడు ఎంతో సంతోషపడెను. అప్పుడు మైనాకుడు వరములు ఇవ్వబడినవాడై అచటే నిలబడి పోయెను. హనుమంతుడు కూడా క్షణకాలములో మరల సాగరముపై పోవుచుండెను.

అప్పుడు దేవతలు గంధర్వులు సిద్ధులు ఋషులతో కూడి సూర్యునితో సమానమైన ప్రకాశము కల నాగమాతయగు సురసతో ఇట్లు పలికిరి. "ఈ శ్రీమంతుడైన హనుమంతుడు సాగరముపై ఎగురుచున్నాడు. అతనికి నీవు విఘ్నము కల్పించుము. ఘోరమైనరూపముతో, పర్వతముతో సమానమైన రూపముతో, కోరలతో, గోరోచనవర్ణము కల కళ్ళతో ఆకాశమంతటి నోటిని తెఱిచి విఘ్నము కల్పించుము. అతని బలము పరాక్రమము తెలిసికొన కోరుచున్నాము. ఉపాయముతో నిన్ను జయించునా లేక విషాదము పొందునా అని."

ఈవిధముగా దేవతలచేత చెప్పబడి గౌరవింపబడిన ఆ సురసా దేవి సముద్రము మధ్యలో రాక్షస రూపము ధరించెను. అప్పుడు అసహజము వికృతము భయంకరము అయిన రూపముతో ఆకాశములో ఎగురుచున్న హనుమంతుని అడ్డగించి సురస ఇట్లు పలికెను.

"ఓ వానరోత్తమ ! ఈశ్వరుడు నిన్ను నా ఆహారముగా ఒసగినాడు. నేను నిన్ను భక్షించెదను. నా నోటిలో ప్రవేశించుము".

సురసచేత ఈ విధముగా చెప్పబడినవాడైన ఆ వానరుడు , సంతోషముగల వదనముతో అంజలి ఘటించి ఇట్లు పలికెను."రాముడు అని పేరుగలవాడు , దశరథుని పుత్రుడు, భార్య సీత మరియు తమ్ముడు లక్ష్మణుని తో కలిసి దండకావనము ప్రవేశించెను. రాక్షసులకి బద్ధవైరుడు అగు రాముడు , అన్యకార్యములలో నిమగ్నుడై వుండగా , ఆయన భార్య యశస్వినిఅగు సీతా రావణునిచే అపహరింపబడినది. నేను ఆయన దూతను. సీతాదేవి దగ్గరకు రామ శాసనము తో పోవుచున్నవాడను. ఓ రామరాజ్యములో వశించు దేవి ! నువ్వు రామునకు సహయము చేయుట ధర్మము. లేనిచో మైథిలిని చూచి క్లిష్టమైన కార్యములు సాధింపగల రామునిని చూచి నీ నోటిలోకి వచ్చెదను. నీకు సత్యముగా చెప్పుచున్నాను".

ఈ విధముగా హనుమంతుని చేత చెప్పబడిన, ఇచ్ఛానుసారము రూపము ధరించగల సురస మరల ఇట్లు చెప్పెను."ఎవరు నన్ను దాటి పోలేరు. ఇది నాకు ఇవ్వబడిన వరము" అని.

తనమాటను లక్ష్యము చేయక పోగోరుచున్న హనుమంతుని తో హనుమంతుని బలము తెలిసికొనగోరి ఆ నాగమాత సురస ఈ మాటలను చెప్పెను. "ఓ వానరోత్తమా ! ఇప్పుడు నా నోటిలో సత్వరముగా ప్రవేశించి వెళ్ళుము. పూర్వము ఈ విధముగా బ్రహ్మదేవుడు వరము ఇచ్చెను". అప్పుడు సురస తన నోటిని బాగా తెఱిచి మారుతి ఎదురుగా నిలబడెను. సురస చేత ఈవిధముగా చెప్పబడిన హనుమంతుడు కృద్ధుడయ్యెను.

హనుమంతుడు " నీ నోరు నన్నుఎలా భరించగలదో అలాగ చేయి ". అని చెప్పి ఆ వానరుడు క్రోధముతో తను పది యోజనములు పొడుగు పది యోజనములు వెడల్పుగా అయ్యెను. మేఘములతో సమానముగా పది యోజనములు పెరిగిన ఆ హనుమంతుని చూచి సురస తన నోటిని ఇరవై యోజనముల విస్తీర్ణము చేసెను.

అప్పుడు హనుమంతుడు కూడా కోపముతో ముప్పది యోజనములు విస్తీర్ణముగా పెరిగెను. అప్పుడు సురస తన నోటిని నలభై యోజనముల విస్తీర్ణముగా చేసెను. అప్పుడు హనుమంతుడు ఏభై యోజనముల విస్తీర్ణముగా పెరిగెను. అప్పుడు సురస తన నోటిని అరవై యోజనముల విస్తీర్ణముగా పెంచెను. అలాగే హనుమంతుడు డెబ్బై యోజనముల విస్తీర్ణముగా పెరిగెను. అప్పుడు సురస తన నోటిని ఎనభై యొజనముల విస్తీర్ణము చేసెను. అప్పుడు పర్వతాకారముగల హనుమంతుడు తొంభై యోజనముల విస్తీర్ణముగా పెరిగెను. అప్పుడు సురస తన నోటిని నూరు యోజనముల విస్తీర్ణము చేసెను.

అప్పుడు బుద్ధిమంతుడు అయిన హనుమంతుడు సుదీర్ఘమైన నాలుక గలది ఘోరమైన ఆ సురస తెరిచిన నోటిని చూచి, తన కాయమును చిటికిన వేలు మాత్రము చేసెను. అ మహాబలవంతుడు క్షణములో ఆమె నోటిలో ప్రవేశించి మళ్ళీ బయటకు వచ్చి ఆకాశములో నిలబడి ఇట్లు పలికెను.

"ఓ దాక్షాయణి ! నీ నోటిలో ప్రవేశించితిని. నీ వరము సత్యము అయినది. నీకు నమస్కారము. ఇక వైదేహి ఎచటవున్నదో అచటికి వెళ్ళెదను". రాహుముఖములోనుంచి వెలువడిన చంద్రునివలె నున్న నోటినుంచి బయటపడిన హనుమంతుని చూచి సురస తన నిజమైన రూపము ధరించి ఇట్లు పలికెను.

"ఓ సౌమ్యుడా ! వానరులలో శ్రేష్టుడా ! సుఖముగా నీ కార్యసిద్ధికి పొమ్ము. వైదేహిని రామునితో చేర్చుము"అని.

అప్పుడు హనుమంతుని చేత చేయబడిన మూడవ దుష్కర కార్యమును చూచి "సాధు సాధు" అని, అన్ని భూతములు ప్రశంసించినవి. వేగములో గరుత్మంతుని తో సమానమైన ఆ హనుమంతుడు ప్రతిఘటింపకాని ఆ వరుణాలయము అగు సాగరము మీద దూసుకుంటూ ఆకాశముమార్గములో ఎగరసాగెను.

ఆ ఆకాశమార్గము ధారళమైన వర్షములు కురిపించెడి మేఘముల మార్గము. పక్షులు ఎగురు మార్గము. కైశికాచార్యులు వెళ్ళు మార్గము. అదే ఇరావతము పయనించు మార్గము. ఆ ఆకాశమార్గము సింహములు, ఏనుగులు, పులులు, పక్షులు, సర్పములు గల అందముగా అలంకరించబడిన వాహనములు వెళ్ళుమార్గము. హవ్యముతీసుకుపోవు అగ్నుల , వజ్రాయుధముతో సమానమైన శస్త్రములుకల దేవతల మార్గము. పుణ్యకర్మలు చేసి స్వర్గముపొందిన మహానుభావులు ఏతెంచే మార్గము. ఆ మార్గము చాలా బాగా అలంకరింపబడిన హవ్యము తీసుకొని చిత్రభానుడు పోవు మార్గము. గ్రహములు నక్షత్రములు తారాగణములు సేవించు మార్గము. మహర్షి గంధర్వ నాగ యక్ష గణములు విహరించు మార్గము, గంధర్వరాజగు విశ్వావసుడు సేవించుమార్గము. ఆ మార్గము దేవేంద్రుని గజము పోవు మార్గము. చంద్రుడు సూర్యుడు పయనించు మార్గము. జీవలోకము పైన విశాలముగా బ్రహ్మచేత నిర్మింపబడిన మార్గము. శ్రేష్ఠులు వీరులు అగు విద్యధరులు సేవించు మార్గము. ఆ ఆకాశ మార్గములో గరుత్మంతుని లాగా హనుమంతుడు ఎగురుచూ వెళ్ళసాగెను.

మారుతాత్మజుడగు హనుమంతుడు అన్నివైపుల కనపడుతూ పెద్దరెక్కలు వున్నపర్వతములాగా ఆకాశములో నిరాధారముగా ఎగురుచూ కనపడెను. అలా ఎగురుచున్న హనుమంతుని చూచి సింహిక అను కామరూపిణీ అగు రాక్షసి , తన శరీరము పెంచుకొనుచూ ఇట్లు అనుకొనెను.

"చాలాకాలము తరువాత ఒక పెద్ద జంతువు ఆహారముగా నా వశములోకి వచ్చినది. ఈ వేళ దీర్ఘకాలము తరువాత నాకు తినుటకు దొరికినది". ఈవిధముగా మనస్సులో అలోచించి ఆ సింహిక వానరుని నీడ పట్టు కొనెను.

అలాగ తన నీడ పట్టుకోనబడగానే హనుమంతుడు ఆలోచించ సాగెను.

" సాగరములో ఎదురుగాలివలన నిరోధింపబడిన నౌక లాగా నేను ఆకాశములో నిరోధింపబడి ఉన్నాను" అని. అప్పుడు హనుమంతుడు కింద, పైన, పక్కన చూచి సముద్రము నుంచి పైకి లేచిన పెద్ద జంతువును చూచెను.

అప్పుడు ఆ మారుతి ఆ వికృతరూపమైన జంతువు చూచి అలోచించసాగెను. "కపిరాజగు సుగ్రీవునిచేత చెప్పబడిన చూచుటకు అద్భుతముగాగల అత్యంత బలమైన జంతువు ఇదే. దానికి సందేహము లేదు" అని తలచెను. బుద్ధిమంతుడైన హనుమంతుడు ఆ జంతువును సింహిక అని అర్థముచేసి కొని, వర్షకాలపు మేఘములా తన శరీరమును పెంచెను. అలాగ పెరుగుతున్నవానరుని చూచి ఆ సింహిక పాతాళబిలం లాంటి తన నోటిని తెరచి, మేఘములవలె గర్జిస్తూ వానరుని వెంటబడెను. అప్పుడు మేధావి అయిన హనుమంతుడు తన శరీరమంత ప్రమాణములో తెరవబడిన సింహిక నోటి ద్వారా లోపలి సింహిక అవయములను చూచెను

మహాబలుడు వజ్రము వంటి దేహము కలవాడు అగు ఆ వానరుడు, మళ్ళీ తన దేహము చిన్నది గాచేసి ఆ సింహిక నోటిలో దూకెను. సిద్ధులు చారణులు రాహువుచే పూర్ణమి నాటి చంద్రుడు మింగబడినట్లు, హనుమంతుడు ఆ నోటిలో మునుగుట చూచిరి. అప్పుడు సింహిక నోటిలోకి దూకిన ఆ వానరుడు తీక్షణమైన తన గోళ్ళతో ఆ సింహిక ఆయువుపట్టుని చీల్చి మనో వేగముతో పైకి వచ్చెను. ఆ కపి ప్రవరుడు ధైర్యముతో దక్షతో ఆ సింహికను చూచి పడగొట్టి తన శరీరమును పెంచెను.

ఆ హనుమంతునిచేత అమె గుండె చీల్చబడగా ఆ సింహిక విహిత జీవి అయి నీళ్ళలో పడెను.

అలా పడిన సింహికను చూచి ఆకాశములో చరించు భూతములు హనుమంతుని తో ఇట్లు పలికిరి. " ఓ వానరశ్రేష్ఠా! ఇప్పుడు నీచేత గొప్ప జంతువు చంపబడినది. అసాధ్యమైన పని చేయబడినది. నీ అభీష్ఠ కార్యమును సాధించుకొనుము. ఓ వానరేంద్ర ! ఎవరిలో ధైర్యము, సూక్ష్మ దృష్టి, సునిశితబుద్ధి, దక్షత ఈ నాలుగూ కలవో అట్టివారు కర్మాచరణములో సిద్ధిపొందెదరు". వారిచేత స్తుతింపబడి పూజనీయుడైన హనుమంతుడు తన కార్యము నిశ్చయించుకొని గరుత్మంతునిలాగా ఆకాశమార్గమున ఎగురుతూ పోయెను.

వంద యోజనముల తరువాత సముద్రముయొక్క అవతల తీరము చెరుతూ, అన్ని వేపుల పరికింపగా వృక్షములతో రాజించు వనము కనబడెను. అప్పుడు మహాపర్వత శిఖరములా ఒప్పారు హనుమంతుడు కేతక ఉద్దాలక నారికేళ వృక్షములతో నిండినది, అనేక శిఖరములతో కూడినది, విచిత్రకూటమగు లంబపర్వత శిఖరముపై దిగెను.

శాఖామృగశ్రేష్ఠుడగు హనుమంతుడు దిగుతూనే నానా విధమైన వృక్షములతో వున్న ద్వీపాన్నిమలయ పర్వత ప్రాంతములను చూచెను. సముద్రమును, సముద్ర తీర ప్రాంతములను, సముద్రప్రాంతములోని వృక్షములను, సాగరతో కలియు నదీ ముఖములను చూచి, ఆకాశమును అడ్డగించునటుల వున్న మేఘములతో సమానమైన తన శరీరము చూచి అలోచించ సాగెను. సుందరమైన నానావిధములైన రూపము ధరించగలవాడు, శత్రువులకు అశక్య మైనవాడు అగు హనుమంతుడు సముద్రము యొక్క అవతలి తీరము చేరి, తన శరీరమును చూచుకొని, తన కార్యము గురించి సమీక్షించెను.

" నా పెరిగిన శరీరమును , వేగమును చూచి రాక్షసులకు నాపై కుతూహలము ఎక్కువ అగును" అని ఆ మహావానరుడు అనుకొనెను. పిమ్మట మహీధరముతో సమానమైన తన శరీరమును చిన్నదిగా చేసి, అజ్ఞానము పోయిన ఆత్మజ్ఞాని స్వరూపము పొందినట్లు, తన స్వరూపమును సంతరించుకొనెను. త్రివిక్రముడై బలిని హరించి తన స్వాభావికరూపము ధరించిన విష్ణువు లాగ హనుమంతుడు తన మహారూపమును చిన్నదిగాచేసి సహజ రూపమును ధరించెను.

ఆ విధముగా సీతాదేవి ని వెతుకుటకై మహేంద్ర శిఖరమునుంచి ఆకాశములోకి ఎగిరి , దానవులకు పన్నగములకు స్థానమై యున్న ఆ సాగరమును తన బలముతో జయించి, అ మహ సాగరము యొక్క అవతల తీరము చేరిన వానరోత్తముడగు హనుమంతుడు, అప్పుడు అమరావతిలా వున్న లంకను చూచెను.

ఈ విధముగా వాల్మీకియొక్క ఆదికావ్యమైన రామాయణములో సుందరకాండలో ప్రథమసర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

స సాగరం దానవపన్నగాయుతమ్
బలేన విక్రమ్య మహోర్మిమాలినమ్|
నిపత్య తీరే చ మహోదధే స్తదా
దదర్శ లంకాం అమరావతీమ్ ఇవ|| 201||

తా|| దానవులకు పన్నగములకు స్థానమై యున్న ఆ సాగరమును తన బలముతో జయించి, అ మహ సాగరము యొక్క అవతల తీరము చేరి, హనుమంతుడు అమరావతిలా వున్న లంకను చూచెను.

||ఓమ్ తత్ సత్||