||సుందరకాండ ||

|| ఇరువది నాలుగవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 24 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ చతుర్వింశస్సర్గః

ఇరువది నాలుగొవ సర్గలో కూడా, సామదాన భేద దండో పాయములను ఉపయోగించి సీతాదేవిని లొంగ పరుచుకొమ్మని ఆజ్ఞాపించిన రావణుని ఆజ్ఞ ప్రకారముగా, ఆ రాక్షస్త్రీలు సీతను చుట్టుముట్టి ఎన్నోవిధములుగా చెప్పడము కొనసాగుతుంది .

"మనుష్యజాతిలో వుండి మనుష్యుడికే భార్యగా వుండడము, - "బహుమన్యసే" -గొప్పదనుకుంటున్నావు" ; "ప్రత్యాహర మనోరామాత్"- "రాముడిని మనస్సులోంచి తొలగించుకో"; ఇవి ఆ రాక్షసస్త్రీల మాటలు.

ఇక్కడ ఇంకో ధ్వని వస్తుంది. అది రాముడు సీత మనుష్యజాతివారని. రామాయణము మానవ జన్మ ధరించినవారి కథ అని .

రామాయణములో బాలకాండలో మొదటిశ్లోకాలలో మనము వాల్మీకి నారదుల సంభాషణలో విన్నది కూడా ఇదే . వాల్మీకి అడిగిన ప్రశ్న- ఈ లోకములో ( చెప్పిన పదహారు లక్షణములు కలవాడు ఎవరు? అని. మనుష్యజాతి లోనే పుట్టి, ఎన్నో ఉపద్రవములను ఎదురుకొని, ధర్మాచరణమే ప్రధానముగా ప్రవర్తించిన మనుష్యుడు , ఆ పదహారుగుణములు కలవాడు, ఇక్ష్వాకు కులములో జన్మించిన రాముడు అని నారదుని సమాధానము. అలాగ రామాయణము మనుష్య జాతి వారి కథ అని మనకి వాల్మీకి మళ్ళీమళ్ళీ చెపుతూవుంటాడు.

రాక్షస స్త్రీలు చెప్పేది - ఆ "త్రైలోక్య వసు భోక్తారమ్" ముల్లోకాల ఐశ్వరము అనుభవించే రావణుని వరించు అని. దానికి సీత చెప్పిన సమాధానము వినతగినది. మననము చేయ తగినది.

"దీనో వా రాజ్యహీనో వా"; దీనుడైనా సరే రాజ్యహీనుడైనా సరే, ఆయనే నా భర్త - అయనే నాగురువు. అంతేకాదు అలా భర్తను అనుసరించే భార్యలందరి గురించి సీత చెపుతుంది.

ఇక ఇరువది నాల్గొవ సర్గలో శ్లోకాలు అర్థతాత్పర్యాలతో.

||శ్లోకము 24.01||

తతస్సీతాముపాగమ్య రాక్షస్యో వికృతాననః|
పరుషం పరుషా నార్య ఊచుస్తాం వాక్యమప్రియమ్ ||24.01||

స|| వికృతాననః పరుషాః రాక్షస్యః తతః సీతాం ఉపాగమ్య అనార్య పరుషం అప్రియం వాక్యం తాం ఊచుః ||

||శ్లోకార్థములు||

వికృతాననః పరుషాః రాక్షస్యః -
వికృతమైన కళ్ళు గల భయపెట్టు రాక్షసస్త్రీలు
తతః సీతాం ఉపాగమ్య -
అప్పుడు సీతను సమీపించి
అనార్య పరుషం -
అవమానకరమైన పరుషమైన
అప్రియం వాక్యం తాం ఊచుః -
అప్రియమైన వచనములతో అమెతో ఇట్లనిరి.

||శ్లోకతాత్పర్యము||

"వికృతమైన కళ్ళు గల భయపెట్టు రాక్షసస్త్రీలు అప్పుడు సీతను సమీపించి అవమానకరమైన పరుషమైన అప్రియమైన వచనములతో అమెతో ఇట్లనిరి".||24.01||

||శ్లోకము 24.02||

కిం త్వం అన్తఃపురే సీతే సర్వభూతమనోహరే|
మహార్హశయనోపేతే న వాసమనుమన్యసే||24.02||

స|| సీతే సర్వభూత మనోహరే త్వం అంతఃపురే మహార్హశయనోపేతే వాసం న అనుమన్యసే కిం?

||శ్లోకార్థములు||

సీతే సర్వభూత మనోహరే -
ఓ సమస్త భూతములకు మనోహరమైన సీతా
మహార్హశయనోపేతే అంతఃపురే -
అతిమనోహరమైన శయనములతో ఒప్పారు అంతఃపురములో
త్వం వాసం న అనుమన్యసే కిం? -
ఉండడానికి నీవు ఎందుకు అంగీకరించుటలేదు.

||శ్లోకతాత్పర్యము||

"ఓ సమస్త భూతములకు మనోహరమైన సీతా ! అతిమనోహరమైన శయనములతో ఒప్పారు అంతఃపురములో ఉండడానికి నీవు ఎందుకు అంగీకరించుటలేదు." ||24.02||

||శ్లోకము 24.03||

మానుషీ మానుషష్యైవ భార్యా త్వం బహుమన్యసే|
ప్రత్యాహార మనో రామాన్ న త్వం జాతు మర్హసి||24.03||

స|| త్వం మానుషీ మానుషస్యైవ భార్యా బహుమన్యసే (యది తత్) ప్రత్యాహార రామాన్ త్వం జాతు న అర్హసి||

||శ్లోకార్థములు||

త్వం మానుషీ -
నీవు మానవకాంతవు
మానుషస్యైవ భార్యా బహుమన్యసే -
మానవునకే భార్యగా ఉండుట గొప్పగా భావిస్తే
త్వం జాతు న అర్హసి -
నీవు జీవించివుండుటకు తగినదానివి కాదు
ప్రత్యాహార మనో రామాన్ -
మనస్సులో రామునుంచి మరల్చుకో

||శ్లోకతాత్పర్యము||

తా|| ". నీవు మానవకాంతవు. మానవునకే భార్యగా ఉండుట గొప్పగా భావిస్తే నీమనస్సు మరల్చుకో. ||24.03||

"మనుష్యజాతిలో వుండి మనుష్యుడికే భార్యగా వుండడము, - "బహుమన్యసే" - గొప్పదనుకుంటున్నావు" ; "ప్రత్యాహర మనోరామాత్"- "రాముడిని మనస్సులోంచి తొలగించుకో"; ఇవి ఆ రాక్షసస్త్రీల మాటలు.

ఇక్కడ ఇంకో ధ్వని వస్తుంది. అది రాముడు సీత మనుష్యజాతివారని. రామాయణము మానవ జన్మ ధరించినవారి కథ అని .

రామాయణములో బాలకాండలో మొదటిశ్లోకాలలో మనము వాల్మీకి నారదుల సంభాషణలో విన్నది కూడా ఇదే . వాల్మీకి అడిగిన ప్రశ్న- ఈ లోకములో ( చెప్పిన పదహారు లక్షణములు కలవాడు ఎవరు? అని. మనుష్యజాతి లోనే పుట్టి, ఎన్నో ఉపద్రవములను ఎదురుకొని, ధర్మాచరణమే ప్రధానముగా ప్రవర్తించిన మనుష్యుడు , ఆ పదహారుగుణములు కలవాడు, ఇక్ష్వాకు కులములో జన్మించిన రాముడు అని నారదుని సమాధానము. అలాగ రామాయణము మనుష్య జాతి వారి కథ అని మనకి వాల్మీకి మళ్ళీమళ్ళీ చెపుతూవుంటాడు.


||శ్లోకము 24.04||

త్రైలోక్య వసుభోక్తారం రావణం రాక్షసేశ్వరమ్|
భర్తార ముపసంగమ్య విహరస్వ యథా సుఖమ్||24.04||

స|| రాక్షసేశ్వరం త్రైలోక్య వసుభోక్తారం రావణం భర్తారం ఉపసంగమ్య యథా సుఖం విహరస్వ||

||శ్లోకార్థములు||

రాక్షసేశ్వరం త్రైలోక్య వసుభోక్తారం - త్రిలోకభోగములనుఅనుభవించు రాక్షసేశ్వరుడు(అగు)
రావణం భర్తారం ఉపసంగమ్య -
రావణుని భర్తగా పొంది
యథా సుఖం విహరస్వ -
సుఖముగా విహరించుము

||శ్లోకతాత్పర్యము||

" రాక్షసేశ్వరుడు త్రిలోకభోగములనుఅనుభవించు రావణుని భర్తగా పొంది సుఖముగా విహరించుము." ||24.04||

||శ్లోకము 24.05||

మానుషీ మానుషం తం తు రామమ్ ఇచ్చసి శోభనే|
రాజ్యాత్ భ్రష్టం అసిద్ధార్థం విక్లబం త్వ మనిందితే||24.05||

స|| శోభనే అనిందితే త్వం తు రాజ్యాత్ భ్రష్టం అసిద్ధార్థం మానుషం విక్లబం మానుషం తం రామం ఇచ్ఛసి ||

||శ్లోకార్థములు||

శోభనే అనిందితే - ఓ మంగళప్రదమైన దోషరహితమైన
త్వం తు రాజ్యాత్ భ్రష్టం - నువ్వు రాజ్యభ్రష్ఠుడు
అసిద్ధార్థం మానుషం - సిద్ధిపొందని మనుష్యుడు,
విక్లబం మానుషం - కష్టములలో ఉన్న మనిషి
తం రామం ఇచ్ఛసి - అగు రామునే కోరుకొనుచున్నావు

||శ్లోకతాత్పర్యము||

"ఓ మంగళప్రదమైన దోషరహితమైన సీతా ! నువ్వు రాజ్యభ్రష్ఠుడు సిద్ధిపొందని మనుష్యుడు, కష్టములలో ఉన్న మనిషి అగు రామునే కోరుకొనుచున్నావు". ||24.05||

||శ్లోకము 24.06||

రాక్షసీనాం వచః శ్రుత్వా సీతా పద్మనిభేక్షణా|
నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం ఇదం వచనమబ్రవీత్ ||24.06||

స|| సీతా పద్మనిబేక్షణా రాక్షసీనాం వచః శ్రుత్వా అశ్రుపూర్ణాభ్యాం నేత్రాభ్యాం ఇదం వచనం అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

సీతా పద్మనిబేక్షణా -
కలువపూవు వంటి కళ్ళు గల సీత
రాక్షసీనాం వచః శ్రుత్వా -
ఆ రాక్షస స్త్రీల మాటలు విని
అశ్రుపూర్ణాభ్యాం నేత్రాభ్యాం -
భాష్పములు నిండిన కళ్లతో
ఇదం వచనం అబ్రవీత్ -
ఈ వచనములను పలికెను

||శ్లోకతాత్పర్యము||

"కలువపూవు వంటి కళ్ళు గల సీత ఆ రాక్షస స్త్రీల మాతాలు విని భాష్పములు నిండిన కళ్లతో ఇట్లు పలికెను."||24.06||

||శ్లోకము 24.07||

యదిదం లోకవిద్విష్ట ముదాహరథ సంగతాః|
నైతన్ మనసి వాక్యం మే కిల్బిషం ప్రతిభాతి మే||24.07||

స||సంగతాః లోకవిద్వష్టం యత్ ఇదం వాక్యం ఉదాహరథ ఏతత్ వః మే మనసి కిల్బిషం ప్రతిభాతి న ||

||శ్లోకార్థములు||

సంగతాః -
ఇక్కడ కూడబడిన మీరందరిచేత
యత్ ఇదం లోకవిద్వష్టం -
ఏ ఈ విధమైన లోకములో నిదింపబడు
వాక్యం ఉదాహరథ -
మాటలు చెప్పుచున్నారో
వః మే మనసి కిల్బిషం ప్రతిభాతి న -
ఆ పాపపు మాటలు నా మనస్సునకు కోంచెము కూడా ఒప్పవు

||శ్లోకతాత్పర్యము||

"ఇక్కడ కూడబడిన మీరందరిచేత చెప్పబడిన లోకములో నిదింపబడు మాటలు ఏవి ఉన్నయో అవి నా మనస్సునకు కోంచెము కూడా ఒప్పవు" ||24.07||

||శ్లోకము 24.08||

న మానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి|
కామం ఖాదత మాం సర్వా న కరిష్యామి వో వచః||24.08||

స|| మానుషీ రాక్షసస్య భార్యా భవితుం న అర్హతి | సర్వాన్ మాం కామం ఖాదత| వో వచః న కరిష్యామి||

||శ్లోకార్థములు||

మానుషీ రాక్షసస్య భార్యా -
మానవ స్త్రీ రాక్షసుని భార్య
భవితుం న అర్హతి -
అగుట ఎప్పటికీ తగదు
సర్వాన్ మాం కామం ఖాదత -
మీరందరూ నన్ను సుఖముగా తినుడు
వో వచః న కరిష్యామి - మీ మాటలను నేను వినను

||శ్లోకతాత్పర్యము||

"మానవ స్త్రీ రాక్షసుని భార్య అగుట ఎప్పటికీ తగదు. మీరందరూ నన్ను సుఖముగా తినుడు. మీ మాటలను నేను వినను" ||24.08||

||శ్లోకము 24.09||

దీనో వా రాజ్యహీనో వా యో మే భర్తా స మే గురుః|
తం నిత్యమనురక్తాఽస్మి యథా సూర్యం సువర్చలా||24.09||

స|| దీనః వా రాజ్యహీనః వా యో మే భర్తః సః మే గురుః| తం నిత్యం అనురక్తాస్మి యథా సువర్చలా సూర్యం అనురక్తసి||

||శ్లోకార్థములు||

దీనః వా రాజ్యహీనః వా -
దీనుడైనా గాని రాజ్యహీనుడైనా గాని
యో మే భర్తః సః మే గురుః -
ఎవరు నా భర్తో వారే నాగురువు
తం నిత్యం అనురక్తాస్మి -
అయనను ఎల్లప్పుడు అనుసరించెదను
యథా సువర్చలా -
ఏవిధముగా సువర్చల
సూర్యం అనురక్తసి -
సూర్యుని అనుసరించునో ( అదే విధముగా)

||శ్లోకతాత్పర్యము||

"దీనుడైనా గాని రాజ్యహీనుడైనా గాని ఎవరు నా భర్తో వారే నాగురువు. సువర్చల సూర్యుని అనుసరించినటులే నేను నా భర్తనే అనుసరించెదను." ||24.09||

రాక్షస స్త్రీలు చెప్పినది - ఆ "త్రైలోక్య వసు భోక్తారమ్" ముల్లోకాల ఐశ్వరము అనుభవించే రావణుని వరించు అని. దానికి ఇక్కడ సీత చెప్పిన సమాధానము వినతగినది. మననము చేయ తగినది.

"దీనో వా రాజ్యహీనో వా"; దీనుడైనా సరే రాజ్యహీనుడైనా సరే, ఆయనే నా భర్త -ఆయనే నాగురువు. అంతేకాదు అలా భర్తను అనుసరించిన భార్యలందరి గురించి సీత చెపుతుంది

||శ్లోకము 24.10||

యథా శచీ మహాభాగా శక్రం సముపతిష్టతి|
అరుంధతీ వశిష్ఠం చ రోహిణీ శశినం యథా||24.10||

స|| యథా మహాభాగా శచీ శక్రం సముపతిష్ఠతి ( తథైవ)| యథా అరుంధతీ వశిష్ఠం రోహిణీ శశినం చ||

||శ్లోకార్థములు||

యథా మహాభాగా శచీ -
ఏ విధముగా మహా పతివ్రత శచీ
శక్రం సముపతిష్ఠతి -
ఇంద్రుని అనుసరించినట్లు
యథా అరుంధతీ వశిష్ఠం -
అరుంధతి వశిష్టుని
రోహిణీ శశినం చ-
రోహిణి చంద్రుణ్ణి ( అనుసరించినట్లు)

||శ్లోకతాత్పర్యము||

"ఏ విధముగా మహా పతివ్రత శచీ ఇంద్రుని అనుసరించినట్లు
అరుంధతి వశిష్టుని, రోహిణి చంద్రుణ్ణి అనుసరించినట్లు." ||24.10||

||శ్లోకము 24.11||

లోపముద్రా యథాఽగస్త్యం సుకన్యా చ్యవనం యథా|
సావిత్రీ సత్యవంతం చ కపిలం శ్రీమతీ యథా||24.11||

స|| యథా లోపముద్రా అగస్త్యం యథా సుకన్యా చ్యవనం యథా సావిత్రీ సత్యవంతం చ కపిలం శ్రీమతీ యథా ||

||శ్లోకార్థములు||

యథా లోపముద్రా అగస్త్యం -
ఏ విధముగా లోపముద్ర అగస్త్యుని
యథా సుకన్యా చ్యవనం -
ఏ విధముగా సుకన్య చ్యవనుని
యథా సావిత్రీ సత్యవంతం -
ఏ విధముగా సావిత్రి సత్యవంతుని
చ కపిలం శ్రీమతీ యథా -
ఏ విధముగా కపిలుని శ్రీమతిని
(అనుసరించినటులే నేను రాముని అనుసరించెదను.)

||శ్లోకతాత్పర్యము||

" మహాపతివ్రతలైన లోపముద్ర అగస్త్యుని, సుకన్య చ్యవనుని, సావిత్రి సత్యవంతుని కపిలుని శ్రీమతి అనుసరించినటులే నేను రాముని అనుసరించెదను."||24.11||

||శ్లోకము 24.12||

సౌదాసం మదయంతీవ కేశినీ సగరం యథా|
నైషధం దమయంతీవ భైమీ పతిమనువ్రతా||12||
తథాఽహం ఇక్ష్వాకు రామం పతిమనువ్రతా|

స|| యథా మదయంతీ సౌదాసం ఇవ కేసినీ సగరం యథా భైమీ దమయంతీ నైషధం ఇవ అనువ్రతా తథా అహం ఇక్ష్వాకునాథం పతిం రామం అనువ్రతా ||

||శ్లోకార్థములు||

యథా మదయంతీ సౌదాసం ఇవ -
ఎలాగ మదయంతి సౌదాసుని
కేసినీ సగరం యథా -
కేసిని సగరుని లాగా
భైమీ దమయంతీ నైషధం ఇవ అనువ్రతా -
భీముని దమయంతి నైషధుని అనుసరించినట్లు
తథా అహం ఇక్ష్వాకునాథం -
నేను ఇక్ష్వాకునాధుడగు
పతిం రామం అనువ్రతా -
పతి అగు రాముని అనుసరించెదను

||శ్లోకతాత్పర్యము||

" మదయంతి సౌదాసుని , కేసిని సగరుని, భీముని దమయంతి నైషధుని అనుసరించినట్లు నేను ఇక్ష్వాకునాధుడగు నా పతి రాముని అనుసరించెదను." ||24.12||

సీతమ్మ చెప్పిన మాట. సువర్చల సూర్యుని అనుసరించినట్లు, మహాపతివ్రతలైన శచి శక్రుని,
అరుంధతి వశిష్ఠుని, రోహిణి చంద్రుని, లోపముద్ర అగస్త్యుని, సుకన్య చ్యవనుని, సావిత్రి సత్యవంతుని అనుసరించినటులనే, తను కూడా రాముని అనుసరిస్తాను అని.

ఈ మాటలలో సీత పాతివ్రత్యము మనకి కనిపిస్తుంది. ఆ పాతివ్రత్యమే హనుమను అకర్షిస్తుంది.

||శ్లోకము 24.13||

సీతాయా వచనం శ్రుత్వా రాక్ష్యసః క్రోధమూర్ఛితాః||13||
భర్త్సయన్తి స్మ పరుషైః వాక్యై రావణచోదితా|

స|| రావణ చ ఉదితా రాక్షస్యః సీతాయాః వచనం శ్రుత్వా క్రోధమూర్ఛితాః పరుషైః వాక్యః భర్త్సయన్తి స్మ||

||శ్లోకార్థములు||

రావణ చ ఉదితా రాక్షస్యః -
రావణునిచే ఆజ్ఞాపింపబడిన ఆ రాక్షస స్త్రీలు
సీతాయాః వచనం శ్రుత్వా-
సీతయొక్క ఆ మాటలు విని
క్రోధమూర్ఛితాః - క్రోధమూర్ఛితులై
పరుషైః వాక్యః భర్త్సయన్తి స్మ-
పరుషమైన వాక్యములతో భయపెట్టసాగిరి.

||శ్లోకతాత్పర్యము||

తా|| రావణునిచే ఆజ్ఞాపింపబడిన ఆ రాక్షస స్త్రీలు సీతయొక్క ఆ మాటలు విని క్రోధమూర్ఛితులై పరుషమైన వాక్యములతో భయపెట్టసాగిరి. ||24.13||

||శ్లోకము 24.14||

అవలీనః స నిర్వాక్యో హనుమాన్ శింశుపాద్రుమే||14||
సీతాం సంతర్జయన్తీనామ్ రాక్షసీనాం స శుశ్రువే||

స|| కపిః సః హనుమాన్ నిర్వాక్యః శింశుపాద్రుమే అవలీనః సీతాం సంతర్జయన్తీనాం రాక్షసీనామ్ సః శుశ్రువే ||

||శ్లోకార్థములు||

శింశుపాద్రుమే అవలీనః -
శింశుపావృక్షములో దాగి యున్న
కపిః సః హనుమాన్ నిర్వాక్యః -
ఆ వానరుడు మౌనముగా
సీతాం సంతర్జయన్తీనాం -
సీతాదేవిని బెదిరిస్తున్న
రాక్షసీనామ్ సః శుశ్రువే -
ఆ రాక్షసస్త్రీల మాటలను వినెను

||శ్లోకతాత్పర్యము||

తా|| శింశుపావృక్షములో దాగి యున్న ఆ వానరుడు మౌనముగా సీతాదేవిని బెదిరిస్తున్న ఆ రాక్షసస్త్రీల మాటలను వినసాగెను. ||24.14||

||శ్లోకము 24.15||

తామభిక్రమ్య సంక్రుద్ధా వేపమానాం సమన్తతః||24.15||
భృశం సంలిలిహుర్దీప్తాన్ ప్రలమ్బాన్ దశనచ్చదాన్|

స|| వేపమానాం తాం సమన్తతః అభిక్రమ్య సంకృద్ధాః దీప్తాన్ ప్రలమ్బాన్ దశనచ్ఛదాన్ భృశం సంలిలిహుః||

||శ్లోకార్థములు||

వేపమానాం తాం -
వణికిపోతున్న ఆ సీతను
సమన్తతః అభిక్రమ్య సంకృద్ధాః -
దగ్గరకు వచ్చి చుట్టుముట్టి కోపముతో
దీప్తాన్ ప్రలమ్బాన్ దశనచ్ఛదాన్ భృశం సంలిలిహుః-
తమ పెదవులను మళ్ళీ మళ్ళీ నాకుకుంటు భయపెట్టసాగిరి

||శ్లోకతాత్పర్యము||

"వణికిపోతున్న ఆ సీతను, తమ పెదవులను మళ్ళీ మళ్ళీ నాకుకుంటూ, కోపముతో చుట్టుముట్టిరి." ||24.15||

||శ్లోకము 24.16||

ఊచుశ్చ పరమక్రుద్ధాః ప్రగృహ్యాశు పరశ్వధాన్||24.16||
నేయమర్హసి భర్తారం రావణం రాక్షసాధిపమ్|

స|| పరమకృద్ధాః ఆశు పరశ్వధాన్ ప్రగృహ్య ఊచుశ్చ| ఇయం రాక్షసాధిపం రావణం భర్తారం న అర్హసి||

||శ్లోకార్థములు||

పరమకృద్ధాః ఆశు -
అతి కృద్ధులైన వారు వెంటనే
పరశ్వధాన్ ప్రగృహ్య ఊచుశ్చ -
గొడ్రాళ్లను తీసుకొని ఇట్లు పలికిరి
ఇయం రాక్షసాధిపం రావణం -
ఈమె రాక్షసాధిపతి అగు రావణుని
భర్తారం న అర్హసి -
భర్తగా పొందుటకు అర్హురాలు కాదు

||శ్లోకతాత్పర్యము||

"ఆ రాక్షసస్త్రీలు తమ గొడ్రాళ్లను తీసుకొని ఇట్లు పలికిరి." ఈమె రాక్షసాధిపతి అగు రావణుని భర్తగా పొందుటకు అర్హురాలు కాదు." ||24.16||

||శ్లోకము 24.17||

సా భర్త్స్యమానా భీమాభి రాక్షసీభిర్వరాననా||24.17||
సా భాష్పముపార్జన్తీ శింశుపాం తాముపాగమత్||

స|| భీమాభిః రాక్షసీభిః భర్త్స్యమానా సా వరాననా సభాష్పం అపసర్పన్తీ తాం శింశుపాం ఉపాగమత్||

||శ్లోకార్థములు||

భీమాభిః రాక్షసీభిః -
భయంకరులైన ఆ రాక్షసస్త్రీలచే
భర్త్స్యమానా సా వరాననా -
భయపెట్టబడిన ఆ వరానన
సభాష్పం అపసర్పన్తీ -
కన్నీళ్ళు కార్చుచూ
తాం శింశుపాం ఉపాగమత్ -
ఆ శింశుపా వృక్షమువద్దకు వెళ్ళెను

||శ్లోకతాత్పర్యము||

"భయంకరులైన ఆ రాక్షసస్త్రీలచే భయపెట్టబడిన ఆ వరానన కన్నీళ్ళు కార్చుచూ ఆ శింశుపా వృక్షమువద్దకు వెళ్ళెను." ||24.17||

||శ్లోకము 24.18||

తతస్తాసాం శింశుపాం సీతా రాక్షసీభిః సమావృతా||24.18||
అభిగమ్య విశాలాక్షీ తస్థౌ శోకపరిప్లుతా||

స|| తతః విశాలాక్షీ సీతా తాం శింశుపాం అభిగమ్య రాక్షసీభిః సమావృతా శోకపరిప్లుతా తస్థౌ ||

||శ్లోకార్థములు||

తతః విశాలాక్షీ సీతా -
అప్పుడు ఆ విశాలాక్షి సీత
తాం శింశుపాం అభిగమ్య -
ఆ శింశుపా వృక్షమును సమీపించి
రాక్షసీభిః సమావృతా -
రాక్షసస్త్రీలచే చుట్టబడియున్నదై
శోకపరిప్లుతా తస్థౌ -
శోకములో మునిగియుండెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ విశాలాక్షి ఆ శింశుపా వృక్షమును సమీపించి రాక్షసస్త్రీలచే చుట్టబడియున్నదై శోకములో మునిగియుండెను." ||24.18||

||శ్లోకము 24.19||

తాం కృశాం దీనవదనాం మలినామ్బరధారిణీమ్||24.19||
భర్త్సయాం చక్రిరే సీతాం రాక్షస్య స్తాం సమన్తతః|

స|| తాః రాక్షస్యః కృశాం దీనవదనాం మలిన అంబర ధారిణీం తాం సీతాం సమంతతః భర్త్సయాం చక్రిరే||

||శ్లోకార్థములు||

తాః రాక్షస్యః -
ఆ రాక్షస స్త్రీలు
కృశాం దీనవదనాం -
దీన వదనముతో కృశించి వున్న
మలిన అంబర ధారిణీం -
మలినమైన బట్టలను ధరించియున్న
తాం సీతాం సమంతతః - ఆ సీతను చుట్టుముట్టి
భర్త్సయాం చక్రిరే - భయపెట్టసాగిరి

||శ్లోకతాత్పర్యము||

"ఆ రాక్షస స్త్రీలు దీన వదనముతో మలినమైన బట్టలను ధరించుచున్న సీతను మరింత భయపెట్టసాగిరి." ||24.19||

||శ్లోకము 24.20||

తతస్తాం వినతా నామ రాక్షసీ భీమదర్శనా||24.20||
అబ్రవీత్కుపితాకారా కరాళా నిర్ణతోదరీ|

స||తతః భీమదర్శనా కుపితాకారా కరానా నిర్ణతోదరీ వినతానామ రాక్షసీ తాం అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

తతః భీమదర్శనా -
అప్పుడు భయంకరమైన రూపముగల
కుపితాకారా కరాళా -
వికృతమైన నల్లగా వున్న
నిర్ణతోదరీ - లోతుకుపోయిన పొట్టతో
వినతా నామ రాక్షసీ -
వినత అను పేరుగల రాక్షసి
తాం అబ్రవీత్ -
సీతతో ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు భయంకరమైన రూపముగల వికృతమైన , నల్లగావున్న లోతుకుపోయిన పొట్టతో కల, వినత అను పేరుగల రాక్షసి, సీతతో ఇట్లు పలికెను." ||24.20||

||శ్లోకము 24.21||

సీతే పర్యాప్త మేతావత్ భర్తుస్నేహో నిదర్శితః||24.21||
సర్వత్రాతికృతం భద్రే వ్యసనా యోపకల్పతే|

స|| సీతే భర్తుః స్నేహః నిదర్శితః | ఏతావత్ పర్యాప్తం భద్రే |సర్వత్ర అతికృతం వ్యసనాయ ఉపకల్పతే||

||శ్లోకార్థములు||

సీతే భర్తుః స్నేహః నిదర్శితః -
సీతా భర్తపై ప్రేమ చూపించావు
ఏతావత్ పర్యాప్తం భద్రే -
ఓ శుభాంగీ అది చాలు
సర్వత్ర అతికృతం -
ఏదైనా అతిగా చేస్తే
వ్యసనాయ ఉపకల్పతే -
అది కష్టములకు దారితీయును'

||శ్లోకతాత్పర్యము||

"ఓ సీతా నీ భర్తపై ప్రేమ చూపించావు. అది చాలు. ప్రతీది అతిగా చేస్తే అది కష్టాలకి దారితీయును." ||24.21||

||శ్లోకము 24.22||

పరితుష్టాస్మి భద్రం తే మానుషస్తే కృతో విధిః||24.22||
మమాపి తు వచః పథ్యం బ్రువన్త్యాః కురు మైథిలి|

స|| మైథిలీ పరితుష్టా అస్మి | తే మానుషః విథిః కృతః | తే భద్రం| మమ బ్రువంత్యాః వచః అపి కురు||

||శ్లోకార్థములు||

మైథిలీ పరితుష్టా అస్మి -
మైథిలీ ! సంతోషిస్తున్నాను
తే మానుషః విథిః కృతః -
నువ్వు నీ మానుష విధిని నిర్వర్తించావు
తే భద్రం - నీకు మంగళమగు గాక
మమ బ్రువంత్యాః వచః అపి కురు -
ఇప్పుడు నేను చెప్పిన మాటలు వినుము

||శ్లోకతాత్పర్యము||

" మైథిలీ ! సంతోషిస్తున్నాను. నువ్వు నీ మానుష విధిని నిర్వర్తించావు. నీకు మంగళమగు గాక. ఇప్పుడు నేను చెప్పిన మాటలు వినుము." ||24.22||

||శ్లోకము 24.23||

రావణం భజ భర్తారం భర్తారం సర్వ రక్షసామ్||24.23||
విక్రాన్తం రూపవన్తం చ సురేశ మివ వాసవమ్|
దక్షిణం త్యాగశీలం చ సర్వస్య ప్రియదర్శనమ్||24.24||

స|| సర్వరాక్షసాం భర్తారం విక్రాంతం రూపవంతం సురేశం వాసవం ఇవ దక్షిణం త్యాగశీలం చ సర్వస్య ప్రియదర్శనమ్ రావణం భర్తారం భజ||

||శ్లోకార్థములు||

సర్వరాక్షసాం భర్తారం -
రాక్షసులందరికి రాజు
విక్రాంతం రూపవంతం -
విక్రాంతుడు, రూపవంతుడు
సురేశం వాసవం ఇవ దక్షిణం -
ఇంద్రుడు, దేవేంద్రుడు లాగ దయకలవాడు
త్యాగశీలం చ సర్వస్య ప్రియదర్శనమ్ -
త్యాగశీలుడు అందరికీ ప్రీతిపాత్రుడు
రావణం భర్తారం భజ - అట్టి రావణుని భర్తగ పొందుము

||శ్లోకతాత్పర్యము||

"రాక్షసులందరికి రాజు, విక్రాంతుడు, రూపవంతుడు ఇంద్రుడు దేవేంద్రుడు లాగ త్యాగశీలుడు, అందరికీ ప్రియదర్శనుడు అయిన రావణుని భర్తగ పొందుము." ||24.23,24||

||శ్లోకము 24.25, 26||

మానుషం కృపణం రామం త్యక్త్వా రావణ మాశ్రయ|
దివ్యాఙ్గరాగా వైదేహీ దివ్యాభరణభూషితా||24.25||
అద్య ప్రభృతి సర్వేషాం లోకానాం ఈశ్వరీ భవ|
అగ్నే స్స్వాహా యథా దేవీ శచీఽవేంద్రస్య శోభనే||24.26||

స|| మానుషం కృపణం రామం త్యక్త్వా, రావణం ఆశ్రయ|| వైదేహీ దివ్యాభరణభూషితా దివ్యాంగరాగా అద్య ప్రభృతి సర్వేషాం లోకానాం ఈశ్వరీ భవ యథా అగ్నేః దేవీ స్వాహా ఇంద్రస్య శచీ ఇవ ||

||శ్లోకార్థములు||

మానుషం కృపణం రామం త్యక్త్వా, -
మనుష్యుడు కృపణుడు అయిన రాముని వదిలి
రావణం ఆశ్రయ -
రావణుని ఆశ్రయించుము.
వైదేహీ దివ్యాభరణభూషితా -
ఓ వైదేహీ! దివ్యాభరణములతో అలంకరించుకున దానవై
దివ్యాంగరాగా -
దివ్యమైన మైపూతలతో కలదానవై
అద్య ప్రభృతి - ఇప్పటినుంచి
సర్వేషాం లోకానాం ఈశ్వరీ భవ -
లోకములో అందరికీ మహారాణివై
యథా అగ్నేః దేవీ స్వాహా -
అగ్ని కి స్వాహా దేవి లాగా
ఇంద్రస్య శచీ ఇవ -
ఇంద్రుడిడికి శచీదేవి లాగా అనుభవింపుము.

||శ్లోకతాత్పర్యము||

" మనుష్యుడు కృపణుడు అయిన రాముని వదిలి రావణుని ఆశ్రయించుము. ఓ వైదేహీ! దివ్యాభరణములతో అలంకరించుకున దానవై దివ్యమైన మైపూతలతో కలదానవై ఇప్పటినుంచి లోకములో అందరికీ మహారాణివై అగ్ని కి స్వాహా దేవి లాగా ఇంద్రుడిడికి శచీదేవి లాగా అనుభవింపుము." ||24.25, 26||

||శ్లోకము 24.27||

కిం తే రామేణ వైదేహీ కృపణేన గతాయుషా|
ఏతదుక్తం చ మే వాక్యం యది త్వం న కరిష్యసి||24.27||
అస్మిన్ ముహూర్తే సర్వాస్త్వాం భక్షయిష్యామహే వయమ్|

స|| తే కృపణేన గతాయుషః రామేణ కిం| ఏతత్ ఉక్తం మే వాక్యం యది త్వం న కరిష్యసి త్వాం అస్మిన్ ముహూర్తే వయం సర్వాః భక్షయిష్యామహే ||

||శ్లోకార్థములు||

కృపణేన గతాయుషః -
దీనుడు ప్రాణములు పోయినవాడు అగు
రామేణ తే కిం -
రామునితో నీకు పని ఏమి
ఏతత్ ఉక్తం మే వాక్యం -
ఇలా నేను చెప్పిన మాటలు
యది త్వం న కరిష్యసి -
నీవు చేయకపోయినచో
త్వాం అస్మిన్ ముహూర్తే -
నిన్ను ఈ క్షణములో
వయం సర్వాః భక్షయిష్యామహే-
మేము అందరము భక్షించెదము

||శ్లోకతాత్పర్యము||

తా|| "నీకు దీనుడు ప్రాణములు పోయినవాడు అగు రామునితో పని ఏమి? ఇలా నేను చెప్పిన మాటలు విని నీవు చేయకపోయినచో ఈ క్షణములో మేము నిన్ను భక్షించెదము". ||24.27||

||శ్లోకము 24.28||

అన్యాతు వికటా నామ లమ్బమానపయోధరా||24.28||
అబ్రవీత్ కుపితా సీతాం ముష్టి ముద్యమ్య గర్జతీ|

స|| లంబమాన పయోధరా అన్యా వికటా నామ తు ముష్టిం ఉద్యమ్య గర్జతీ సీతాం అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

లంబమాన పయోధరా అన్యా -
వేలాడబడు స్తనములు కల ఇంకొక
వికటా నామ తు - వికటా అనబడు (రాక్షసి)
ముష్టిం ఉద్యమ్య - పిడికిటని ఎత్తి
గర్జతీ సీతాం అబ్రవీత్ -
గర్జిస్తూ సీతతో ఇట్లు చెప్పెను

||శ్లోకతాత్పర్యము||

"వికటా అనబడు వేలాడబడు స్తనములు కల ఇంకొక రాక్షసి పిడికిటని ఎత్తి గర్జిస్తూ సీతతో ఇట్లు చెప్పెను." ||24.28||

||శ్లోకము 24.29||

బహూన్ అప్రియరూపాణి వచనాని సుదుర్మతే ||24.29||
అనుక్రోశాన్ మృదుత్వా చ్చ సోఢాని తవ మైథిలి|

స|| సుదుర్మతే మైథిలి అప్రియరూపాణి బహూని తవ వచనాని అనుక్రోశాత్ మృదుత్వాత్ సోఢాని ||

||శ్లోకార్థములు||

సుదుర్మతే మైథిలి -ఓ దుర్మతీ ! మైథిలీ
అప్రియరూపాణి బహూని -
అప్రియమైన మాటలు చాలా (పలికావు)
తవ వచనాని - నీ మాటలు
అనుక్రోశాత్ మృదుత్వాత్ సోఢాని -
మంచితనముతో జాలితో సహించాము

||శ్లోకతాత్పర్యము||

"ఓ దుర్మతీ ! మైథిలీ ! అప్రియమైన మాటలు చాలాపలికావు. మా మంచితనముతో జాలితో వాటిని సహించాము" ||24.29||

||శ్లోకము 24.30||

న చ నః కురుషే వాక్యం హితం కాలపురస్కృతమ్||24.30||
అనీతాసి సముద్రస్య పారం అన్యైర్దురాసదమ్|

స|| మైథిలి కాలపురస్కృతాం హితం వాక్యం న కురుషే| అన్యైః దురాసదమ్ సముద్రస్య పారమ్ ఆనీతా అసి||

||శ్లోకార్థములు||

మైథిలి - ఒ మైథిలి
కాలపురస్కృతాం హితం -
కాలానుకూలమైన హితకరమైన
వాక్యం న కురుషే -
మాటలు వినుటలేదు
అన్యైః దురాసదమ్ సముద్రస్య పారమ్ -
అన్యులకు దాటుటకు శక్యముకాని సముద్రముని
ఆనీతా అసి -
దాటించి నీవు తీసుకురాబడినావు

||శ్లోకతాత్పర్యము||

"ఓ మైథిలీ ! కాలానుకూలమైన హితకరమైన మా మాటలు వినుటలేదు. దాటుటకు శక్యముకాని సముద్రముని దాటించి నీవు తీసుకురాబడినావు". ||24.30||

||శ్లోకము 24.31||

రావణాన్తః పురం ఘోరం ప్రవిష్టా చాపి మైథిలి||24.31||
రావణస్య గృహే రుద్ధా మస్మాభిస్తు సురక్షితామ్|
నత్వాం శక్తః పరిత్రాతు మపి సాక్షాత్ పురన్దరః||24.32||

స|| మైథిలి ఘోరం రావణాంతః పురం ప్రవిష్టా అసి|| రావణస్య గృహే రుద్ధాం అస్మాభిః సురక్షితాం త్వాం పరిత్రాతుం సాక్షాత్ పురందరః అపి న శక్తః |

||శ్లోకార్థములు||

మైథిలి - మైథిలి
ఘోరం రావణాంతః పురం ప్రవిష్టా అసి -
ఘోరమైన రావణాంతః పురములో వున్నదానవు
రావణస్య గృహే రుద్ధాం అస్మాభిః సురక్షితాం-
రావణుని గృహములో అతని ఐశ్వర్యము మాచేత రక్షింపబడుచున్నది.
త్వాం పరిత్రాతుం -
నిన్ను రక్షించుటకు
సాక్షాత్ పురందరః అపి న శక్తః -
సాక్షాత్తు పురందరునికి కూడా సాధ్యము కాదు.

||శ్లోకతాత్పర్యము||

" రావణ గృహములో మాచేత రక్షింపబడుతున్న నీవు సాక్షాత్తు పురందరుడు కూడా రక్షింపలేడు." ||24.31,32||

||శ్లోకము 24.33||

కురుష్వ హిత వాదిన్యా వచనం మమ మైథిలి|
అలం అశ్రుప్రపాతేన త్యజ శోకమనర్థకమ్||24.33||

స|| మైథిలీ హితవాదిన్యా మమ వచనం కురుష్వ|| అలం అశ్రు ప్రపాతేన | అనర్థకమ్ శోకం త్యజ||

||శ్లోకార్థములు||

మైథిలీ హితవాదిన్యా - మైథిలీ! (నీ) హితము కోరు
మమ వచనం కురుష్వ- మా మాటలు వినుము
అలం అశ్రు ప్రపాతేన - ఈ కళ్ళనీళ్ళు చాలు
అనర్థకమ్ శోకం త్యజ - అనర్థకమైన శోకమును విడువుము

||శ్లోకతాత్పర్యము||

" మైథిలీ! నీ హితము కోరు మా మాటలు వినుము. ఈ కళ్ళనీళ్ళు చాలు. అనర్థకమైన శోకమును విడువుము".||24.33||

||శ్లోకము 24.34||

భజ ప్రీతిం చ హర్షం చ త్యజైతాం నిత్య దైన్యతామ్|
సీతే రాక్షసరాజేన సహ క్రీడా యథాసుఖమ్ ||24.34||

స|| ఏతాన్ నిత్య దైన్యతాం త్యజ | ప్రీతిం చ హర్షం చ భజ||సీతే రాక్షసరాజేన సహ యథా సుఖం క్రీడా||

||శ్లోకార్థములు||

ఏతాన్ నిత్య దైన్యతాం త్యజ -
ఈ విధమైన నిత్యదైన్యమును విడువుము
ప్రీతిం చ హర్షం చ భజ -
ప్రేమను సంతోషమును అనుభవించుము
సీతే రాక్షసరాజేన సహ-
ఓ సీతా రాక్షసరాజు తో
యథా సుఖం క్రీడా -
యథాసుఖముగా అనుభవింపుము

||శ్లోకతాత్పర్యము||

"ఈ విధమైన నిత్యదైన్యమును విడువుము. ప్రేమను సంతోషమును అనుభవించుము. ఓ సీతా రాక్షసరాజు తో యథాసుఖముగా అనుభవింపుము."||24.34||

||శ్లోకము 24.35||

జానాసి యథా భీరు స్త్రీణాం యౌవనమధ్రువమ్|
యావన్న తే వ్యతిక్రామేత్ తావత్ సుఖమవాప్నుహి||24.35||

||స|| భీరు స్త్రీణాం యౌవనం యథా అధ్రువం జానాసి హి | తే యావత్ న అతిక్రమేత్ తావత్ సుఖం అవాప్ను హి||

||శ్లోకార్థములు||

భీరు స్త్రీణాం యౌవనం -
ఓ పిరికిదానా ! స్త్రీలకు ఈ యౌవ్వనము
యథా అధ్రువం జానాసి హి -
శాశ్వతము కాదు అని నీకు తెలుసు
తే యావత్ న అతిక్రమేత్ - అది గడిచిపోక ముందే
తావత్ సుఖం అవాప్ను హి - సుఖమును అనుభవించుము

||శ్లోకతాత్పర్యము||

. ఓ పిరికిదానా ! ఈ యౌవ్వనము శాశ్వతము కాదు అని నీకు తెలుసు. అది గడిచిపోక ముందే సుఖమును అనుభవించుము

||శ్లోకము 24.36||

ఉద్యానాని చ రమ్యాణి పర్వతోపవనాని చ|
సహ రాక్షసరాజేన చర త్వం మదిరేక్షణే||24.36||

||స|| మదిరేక్షణే రమ్యాణి ఉద్యానాని పర్వత ఉపవనాని చ త్వం రాక్షసరాజేన సహ చర ||

||శ్లోకార్థములు||

మదిరేక్షణే రమ్యాణి ఉద్యానాని -
ఓ మదిరేక్షణ రమ్యమైన ఉద్యానవనములను
పర్వత ఉపవనాని చ -
పర్వత ఉప ఉద్యానవనములను
త్వం రాక్షసరాజేన సహ చర -
నీవు రాక్షసరాజుతో విహరించుము

||శ్లోకతాత్పర్యము||

"ఓ మదిరేక్షణ రమ్యమైన ఉద్యానవనములను పర్వత ఉద్యానవనములను రాక్షసరాజుతో విహరించుము." ||24.36||

||శ్లోకము 24.37||

స్త్రీ సహస్రాణి తే సప్త వశే స్థాస్యంతి సున్దరీ|
రావణం భజ భర్తారం భర్తారం సర్వ రక్షసామ్||24.37||

స|| సుందరీ సప్త సహస్రాణీ స్త్రీ తే వశే స్థాస్యంతి |సర్వరక్షసాం భర్తారం రావణం భజ||

||శ్లోకార్థములు||

సుందరీ సప్త సహస్రాణీ స్త్రీ -
ఓ సుందరీ ఏడువేలమంది స్త్రీలు
తే వశే స్థాస్యంతి - నీ వశములో వుండెదరు
సర్వరక్షసాం భర్తారం - రాక్షసులందరికి రాజు అగు
రావణం భజ - రావణుని భర్తగా స్వీకరింపుము

||శ్లోకతాత్పర్యము||

"ఓ సుందరీ నీకు ఏడువేల స్త్రీలు సేవ చేశెదరు. రాక్షసులందరి రాజగు రావణుని భర్తగా స్వీకరింపుము." ||24.37||

||శ్లోకము 24.38||

ఉత్పాట్య వాతే హృదయం భక్షయిష్యామి మైథిలి|
యది మే వ్యాహృతం వాక్యం న యథావత్ కరిష్యసి||24.38||

స|| మైథిలీ యది మే వ్యాహృతం వాక్యం యథావత్ న కరిష్యసి తే హృదయం ఉత్పాట్య భక్షయిష్యామి ||

||శ్లోకార్థములు||

మైథిలీ యది మే వ్యాహృతం వాక్యం -
మైథిలీ ఒకవేళ నేను చెప్పిన మాటలు ్
యథావత్ న కరిష్యసి - చెప్పినట్లు చేయకపోతే
తే హృదయం ఉత్పాట్య- నీ హృదయముని పెకిలించి
భక్షయిష్యామి - తినివేసెదను

యది మే వ్యాహృతం వాక్యం -
if the words spoken by me
యథావత్ న కరిష్యసి -
are not followed as is
మైథిలీ తే హృదయం ఉత్పాట్య-
Maithili, will pluck out your heart
భక్షయిష్యామి - eat it up

||శ్లోకతాత్పర్యము||

"మైథిలీ ఒకవేళ నేను చెప్పిన మాటలు వినకపోయినచో నీ హృదయముని పెకిలించి తినివేసెదను."||24.38||

||శ్లోకము 24.39||

తతశ్చణ్డోదరీ నామ రాక్షసీ క్రోథమూర్ఛితా|
భ్రామయన్తీ మహచ్చూల మిదం వచనమబ్రవీత్||24.39||

స|| తతః చండోదరీ నామ రాక్షసీ క్రోధమూర్ఛితా మహత్ శూలం భ్రామయంతీ ఇదం వచనం అబ్రవీత్||

||శ్లోకార్థములు||

తతః చండోదరీ నామ రాక్షసీ -
అప్పుడు చండోదరీ అనబడు రాక్షసి
క్రోధమూర్ఛితా - క్రోధమూర్చితురాలై
మహత్ శూలం భ్రామయంతీ -
మహత్తరమైన శూలము గిరగిరా త్రిప్పుచూ
ఇదం వచనం అబ్రవీత్ - ఈ మాటలు పలికెను

||శ్లోకతాత్పర్యము||

తా|| అప్పుడు క్రోధమూర్చితురాలైన చండోదరీ అనబడు రాక్షసి శూలము గిరగిరా త్రిప్పుచూ ఈ మాటలు పలికెను

||శ్లోకము 24.40||

ఇమాం హరిణ లోలాక్షీం త్రాసోత్కమ్పిపయోధరామ్|
రావణేన హృతాం దృష్ట్వా దౌర్హృదో మే మహానభూత్||24.40||

స|| హరిణలోలాక్షీం త్రాసోత్కంపిత పయోధరాం రావణేన హృతాం ఇమామ్ దృష్ట్వా మే మహాన్ దౌర్హృదః అభూత్ ||

||శ్లోకార్థములు||

రావణేన హృతాం -
రావణుని చేత అపహరించబడిన
హరిణలోలాక్షీం - హరిణలోలాక్షిని
త్రాసోత్కంపిత పయోధరాం -
కంపిస్తున్న స్తనములు గల ,
ఇమామ్ దృష్ట్వా - ఆమెను చూచి
మే మహాన్ దౌర్హృదః అభూత్ -
నాకు గొప్ప కోరిక గలిగెను

||శ్లోకతాత్పర్యము||

" రావణుని చేత అపహరించబడిన, కంపిస్తున్న స్తనములు గల హరిణలోలాక్షిని చూచినపుడు నాకు గొప్ప కోరిక గలిగెను." ||24.40||

తిలక టీకాలో - దౌర్హృదః గర్భిణ్యా గర్భకృత్ ఇచ్ఛావిశేషో దౌర్హృదమ్; 'దౌర్హృదం' అంటే గర్భించిన స్త్రీలలో గర్భము వలన్ కలిగిన కోరికలను దౌర్హృదమ్ అని అంటారు. అంటె అంత గట్టి కోరిక అని

||శ్లోకము 24.41||

యకృత్ప్లీహ మథోత్పీడం హృదయం చ సబన్ధనమ్|
అన్త్రాణ్యపి తథా శీర్షం ఖాదేయ మితి మే మతిః||24.41||

స|| యకృత్ ప్లీహం ఉత్పీడమ్ సబంధనమ్ హృదయం చ అన్త్రాణ్యపి తథా శీర్షం ఖాదేయం ఇతి మే మతిః||

తిలక టీకాలో - యకృత్ దక్షిణ భాగస్థః కాలఖణ్ఢాఖ్యో మాంస విశేషః | ప్లీహమ్ హృదయ వామభాగస్థో గుల్మాఖ్యో మాంస విశేషః | ఉత్పీడమ్ హృదయోపరిస్థిత మాంసబన్ధనమ్|
అంటే ఇక్కడ ఆ రాక్షసి హృదయభాగములో ఆన్నివేపులగల మాంసము తినడానికి కోరిక గలదు అన్నట్లు చెపుతుంది.

||శ్లోకార్థములు||

యకృత్ ప్లీహం ఉత్పీడమ్ -
యకృత్తును ప్లీహాన్నిపీకి
సబంధనమ్ హృదయం చ -
నరములతో సహా గుండెకాయను
అన్త్రాణ్యపి తథా శీర్షం -
పేగులను శిరస్సును
ఖాదేయం ఇతి మే మతిః-
తినవలెను అని తోచుచున్నది

||శ్లోకతాత్పర్యము||

"యకృత్తును ప్లీహాన్నిపీకి నరములతో సహా గుండెకాయను, పేగులను శిరస్సును తినవలెను అని తోచుచున్నది."

||శ్లోకము 24.42||

తతస్తు ప్రఘసా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ |
కంఠమస్యా నృశంసాయాః పీడయామ కిమాస్యతే||24.42||

స|| తతః ప్రఘసా నామ రాక్షసీ (ఇదం) వాక్యం అబ్రవీత్| అస్యాః నృశంసాయాః కంఠం పీడ్యామ | కిం ఆస్యతే||

||శ్లోకార్థములు||

తతః ప్రఘసా నామ రాక్షసీ -
అప్పుడు ప్రఘసా అనబడు రాక్షసి
(ఇదం) వాక్యం అబ్రవీత్ - ఈ మాటలు చెప్పెను.
అస్యాః నృశంసాయాః - ఈ కౄరురాలి
కంఠం పీడ్యామ - కంఠము పీడించెదము
కిం ఆస్యతే - ఇంకా అలస్యము ఎందుకు?

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ప్రఘసా అనబడు రాక్షసి ఈ మాటలు చెప్పెను. "ఈ కౄరురాలి కంఠము పీడించెదము. ఇంకా అలస్యము ఎందుకు?" ||24.42||

||శ్లోకము 24.43||

నివేద్యతాం తతో రాజ్ఞే మానుషీ సా మృతేతి హ |
నాత్ర కశ్చన సందేహాః ఖాదతేతి స వక్ష్యతి ||24.43||

స|| తతః రాజ్ఞే నివేద్యతాం సా మానుషీ మృతః ఇతి || తతః సః ఖాదత ఇతి వక్షతి | అత్ర కశ్చన సందేహః న||

||శ్లోకార్థములు||

తతః రాజ్ఞే నివేద్యతాం -
అప్పుడు రాజుకు నివేదించెదము
సా మానుషీ మృతః ఇతి -
ఆ మానుషీ చనిపోయినది అని
తతః సః ఖాదత ఇతి వక్షతి -
అప్పుడు అయన అమెను తినుడు అని చెపును
అత్ర కశ్చన సందేహః న -
ఇందులో కోంచెము కూడా సందేహము లేదు

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు రాజుకు ఆ మానుషీ చనిపోయినది అని నివేదించెదము. అప్పుడు అయన అమెను తినుడు అని చెపును. ఇందులో కోంచెము కూడా సందేహము లేదు". ||24.43||

||శ్లోకము 24.44||

తతస్త్వజాముఖీ నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ |
విశ స్యేమాం తత స్సర్వాః సమాన్ కురుత పీలుకాన్||24.44||

స|| తతః అజాముఖీ నామ రాక్షసీ వాక్యం అబ్రవీత్| సర్వాః ఇమామ్ విశస్య తతః సమాన్ పీలుకాన్ కురుత||

||శ్లోకార్థములు||

తతః అజాముఖీ నామ రాక్షసీ -
అప్పుడు అజాముఖీ అను రాక్షసి
వాక్యం అబ్రవీత్ - ఈ వాక్యములను పలికెను.
సర్వాః ఇమామ్ విశస్య
తతః సమాన్ పీలుకాన్ కురుత

||శ్లోకతాత్పర్యము||

తా|| అప్పుడు అజాముఖీ అను రాక్షసి ఈ వాక్యములను పలికెను. "ఈమెను చంపి అందరికీ సమానముగా భాగములను చేయుడు

||శ్లోకము 24.45||

విభజామ తతః సర్వా వివాదో మే న రోచతే|
సేయ మానీయతాం క్షిప్రం లేహ్యా ముచ్చావచం బహు||24.45||

స|| తతః సర్వాః విభజామ | మే వివాదః న రోచతే| క్షిప్రం పేయం ఉచ్చావచమ్ బహు లేహ్యాం ఆనీయతామ్ ||

||శ్లోకార్థములు||

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు అందరము పంచుకుందాము. నాకు వివాదములు ఇష్టము లేదు. వెంటనే అన్నిరకముల మద్యము, పలువిధములైన లేహ్యములను తీసుకు రండు." ||24.45||

||శ్లోకము 24.46||

తతశ్శూర్పణఖానామ రాక్షసీ వాక్యమబ్రవీత్ |
అజాముఖ్యా యదుక్తం హి తదేవ మమరోచతే ||24.46||

స|| తతః శూర్పణఖా నామ రాక్షసీ వాక్యం అబ్రవీత్ | అజాముఖీ యత్ ఉక్తం తదేవ మమ రోచతే||

||శ్లోకార్థములు||

తతః శూర్పణఖా నామ రాక్షసీ -
అప్పుడు శూర్పణఖా అనబడు రాక్షసి
వాక్యం అబ్రవీత్ - ఈ మాటలు చెప్పెను.
అజాముఖీ యత్ ఉక్తం - అజాముఖి చెప్పిన మాటలు
తదేవ మమ రోచ - నాకు నచ్చినవి

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు శూర్పణఖా అనబడు రాక్షసి ఈ మాటలు చెప్పెను. "అజాముఖి చెప్పిన మాటలు నాకు నచ్చినవి." ||24.46||

||శ్లోకము 24.47||

సురా చానీయతాం క్షిప్రం సర్వ శోకవినాశినీ|
మానుషం మాంసం ఆసాద్య నృత్యామఽథ నికుమ్భిలామ్||24.47||

స|| క్షిప్రం సర్వశోకవినాశినీ సురా చ ఆనీయతామ్ | మానుషా మాంసమ్ ఆస్వాద్య అథ నికుంభలాం నృత్యామః||

||శ్లోకార్థములు||

క్షిప్రం సర్వశోకవినాశినీ -
వెంటనే సర్వశోకవినాశిని అగు
సురా చ ఆనీయతామ్ -
మద్యమును తీసుకురాబడు గాక
మానుషా మాంసమ్ ఆస్వాద్య -
ఈ మనుష్య మాంసము తిని
అథ నికుంభలాం నృత్యామః -
నికుంభలానృత్యము చేద్దాము

||శ్లోకతాత్పర్యము||

"వెంటనే సర్వశోకవినాశిని అగు మద్యమును తీసుకురండు. ఈ మనుష్య మాంసము తిని నికుంభలానృత్యము చేద్దాము". ||24.47||

||శ్లోకము 24.48||

ఏవం సంభర్త్స్యమానా సా సీతా సురసుతోపమా|
రాక్షసీభిః సుఘోరాభి ర్ధైర్యముత్సృజ్య రోదితి||24.48||

స|| సుఘోరాభిః రాక్షసీభిః ఏవం సంభర్త్స్యమానా సురసుతోపమా సా సీతా ధైర్యం ఉత్సృజ్య రోదితి||

||శ్లోకార్థములు||

సుఘోరాభిః రాక్షసీభిః -
ఘోరమైన రాక్షస్త్రీలచేత
ఏవం సంభర్త్స్యమానా -
ఈ విధముగా భయపెట్టబడిన
సురసుతోపమా సా సీతా -
దేవతలతో సమానమైన ఆ సీత
ధైర్యం ఉత్సృజ్య రోదితి -
ధైర్యము కోల్పోయి విలపింపసాగెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ ఘోరమైన రాక్షస్త్రీలచేత ఈ విధముగా భయపెట్టబడిన దేవతలతో సమానమైన సీత ధైర్యము కోల్పోయి విలపింపసాగెను." ||24.48||

ఈ విధముగా భయపెట్ట బడిన సీత ధైర్యము కోల్పోయి విలపింపసాగెను అని రాస్తారు వాల్మీకి. ఈ శ్లోకముతో ఇరువది నాలుగొవ సర్గ స్మాప్తము అవుతుంది.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే చతుర్వింశస్సర్గః||

|| om tat sat||

 

 

 

 

 

 

 

||ఓమ్ తత్ సత్||