||సుందరకాండ ||

||ముప్పది ఒకటవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 31 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ఏకత్రింశస్సర్గః

ఈ సర్గ "సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహార హ !" అనే మాటతో మొదలవుతుంది. ఇక్కడ "హ" అంటే "అహా!" అన్నట్లు. అది ఆనందాశ్చర్యములతో పలికే మాట. ఏమిటామాట అంటే అది "మధురం వాక్యం". ఆ మధురమైన వాక్యములతో చెప్పబడిన రామకథ.

ఆలాగ హనుమంతుడి చే చెప్పబడిన రామ కథ. ఇక ఆ రామకథ వింటాము..

||శ్లోకము 31.01||

ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహాకపిః|
సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహార హ||31.01||

స||మహాకపిః ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా వైదేహ్యామధురం వాక్యం సంశ్రవే వ్యాజహార హ||

||శ్లోకార్థములు||

మహాకపిః ఏవం బహువిధాం - ఆ మహాకపి ఇలాగ అనేక విధములుగా
చింతాం చింతయిత్వా - మనస్సులో వున్న విషయాలపై ఆలోచించి
వైదేహ్యా మధురం వాక్యం సంశ్రవే - వైదేహి కి మధురమైన మాటలను నవినిపించుటకు
వ్యాజహార హ - పలికెను ( ఆహ !)

||శ్లోకతాత్పర్యము||

"ఆ మహాకపి ఇలాగ అనేక విధములుగా మనస్సులో ఆలోచించి వైదేహికి మధురమైన మాటలు వినిపించుటకు ఇలా పలికెను." ||31.01||

గోవిన్దరాజులవారి టీకాలో- యద్వా పాఠ్యే గేయేచ మధురమితి సంశ్రవే మధురం జ్ఞాన ప్రసారణ ద్వారా ఇన్ద్రియేభ్యో నిసృత్య విషయాన్ గృహీత్వా తదన్తరం హి రసో జాయతే లోకే; అత్ర న తథా; యత్ర శబ్ద సంసర్గో జాయతే తత్ర రస జాయత ఇత్యతిశయోక్తిః | మధురం జ్ఞానమపి తద్వారా రసజనకం వాక్యం పూర్వాపర నిరూపణం వినా స్వయం రసజనకం వైదేహ్యాః వైదేహీ నిమిత్తం | కులానురోధేన దేహే నిస్పృహాయాః దేహమపి దత్త్వా రసవహత్వంచ్యతే||

ఈ సర్గ "సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహార హ !" అనే మాటతో మొదలవుతుంది. ఇక్కడ "హ" అంటే "అహా!" అన్నట్లు. అది ఆనందాశ్చర్యములతో పలికే మాట. ఏమిటామాట అంటే అది "మధురం వాక్యం". ఆ మధురమైన వాక్యములతో చెప్పబడిన రామకథ. ఆ రామకథ ఆ మహకపి వినిపించాడు. ఎవరికి? "వైదేహ్యా" అంటే విదేహ మహరాజు కూతురికి అని అర్థము. ఇంకో అర్థము దేహముతో సంబంధములేని ఆ సీతమ్మకి అని.

ఇరువది ఎనిమిదవ సర్గలో వింటాము,"శీఘ్రం గమిష్యామి యమస్య మూలం", అంటే యముడి దగ్గరకు పోవడానికి సిద్దముగా వున్నాను అంటుంది సీత. అంటే అలాంటి స్థితిలో వున్నసీతమ్మకి ప్రాణముపోసినది ఈ రామకథ. దేహమునందు నిస్పృహకలిగి, దేహము తనది కాదని వదిలిన సీతమ్మకు, మరల మమత పెంచినదీ రామకథ, అంటారు గోవిన్దరాజులవారు.

సుఖదుఃఖాలు వినిన తరువాత మనో ప్రేరణతో వస్తాయి. కాని ఈ రామకథ వినినంతట మాత్రముననే, మనస్సుతో సంబంధము లేకుండా ఆనందము కలిగిస్తుంది అంటారు గోవిన్దరాజులవారు తమ టీకాలో. సహజముగా కథ అంతయూ విన్న తరువాత , పూర్వాపర నిరూపణము చేసిన తరువాత, లోకములో కథలు ఆనందమును కలిగిస్తాయి. కాని రామకథ చెవిలో పడినంత మాత్రముననే ఆనందము కలిగించును.

సీతమ్మ మనసు ఇంద్రియములతో కలిసివుండలేదు. మనస్సు ఇంద్రియములద్వారా ప్రసరించి, శబ్దమును కలిగించినప్పుడే పొందవలసిన ఆనందము, రామ కథ వినినంతమాత్రమున నే కలిగించును. అందుకనే "మృతసంజీవనం రామ చరితం" అంటారు పూర్వీకులు.

పదహారవ సర్గలో "నైషా పశ్యతి రాక్షస్యః.. "(16.25) అంటూ సీతని వర్ణిస్తాడు కవి. సీత మనస్సంతా రాముది మీదే వుందిట. సీతకి రాక్షసులు కనపడట లేదుట, సీతకి పుష్పములు ఫలములు కనపడట లేదుట. ఎందుకు ? సీత మనస్సంతా రాముడి మీదే వుండడము వలన. అలాంటి సీతకు వినపడేట్టుగా హనుమంతుడు "వ్యాజహార", అంటే రామకథ పలికెను.

వ్యాజహర అనే పదములో " అజహార" అనే క్రియా పదము కూడా వుంది. "అజహార" అంటే 'తెచ్చెను' అని. అంటే ఏమిటి తెచ్చెను?. శరీర భావము వదిలేసిన సీతకు శరీరభావము తెచ్చెను అని ఇంకో అర్థము.

రామకథలోని గొప్పతనము శరీరమును నిలుపును. చెవికి ఇంపగును. శరీరభావములేని సీతకు (ఆత్మకు) ఆనందము కలిగించును. ఇట్టి విచిత్రమగు శక్తికల రామకథను పలుకుచున్నాడని ముగ్ధుడై వాల్మీకి "హ" అంటాడు .

||శ్లోకము 31.02||

రాజా దశరథో నామ రథ కుంజిర వాజిమాన్|
పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహయశాః||31.02||

స|| దశరథః నామ రాజా రథకుంజిరవ్యాజిమాన్ పుణ్యశీలః మహాకీర్తిః ఇక్ష్వాకూణాం మహాయశాః||

||శ్లోకార్థములు||

దశరథః నామ రాజా - దశరథుడు అను పేరుగల రాజు
రథకుంజిర వ్యాజిమాన్ - అనేకమైన రథములు ఏనుగులు అశ్వములు కలవాడు
పుణ్యశీలః మహాకీర్తిః - పుణ్యశీలుడు, మహాకీర్తిగలవాడు
ఇక్ష్వాకూణాం మహాయశాః - ఇక్ష్వాకులలో మహత్తరమైన యశస్సు కలవాడు

||శ్లోకతాత్పర్యము||

దశరథుడు అను పేరుగల రాజు అనేకమైన రథములు ఏనుగులు కలవాడు, పుణ్యశీలుడు, మహాకీర్తిగలవాడు ఇక్ష్వాకులలో మహత్తరమైన యశస్సు కలవాడు

||శ్లోకము 31.03||

రాజర్షీణాం గుణశ్రేష్ఠః తపసా చర్షిభిస్సమః|
చక్రవర్తికులే జాతః పురందరసమో బలే||31.03||

స|| (సః) రాజర్షీణాం గుణశ్రేష్ఠః తపసా ఋషిభిః సమః చ బలే పురందర సమః చక్రవర్తికులే జాతః||

||శ్లోకార్థములు||

రాజర్షీణాం గుణశ్రేష్ఠః - రాజర్షులలో శ్రేష్ఠమైన గుణములు కలవాడు
తపసా ఋషిభిః సమః చ - తపస్సులో ఋషులతో సమానమైన వాడు.
బలే పురందర సమః - బలములో ఇంద్రునితో సమానుడు
చక్రవర్తికులే జాతః - చక్రవర్తుల కులములో జన్మించినవాడు.

||శ్లోకతాత్పర్యము||

"రాజర్షులలో శ్రేష్ఠమైన గుణములు కలవాడు, తపస్సులో ఋషులతో సమానమైన వాడు. బలములో ఇంద్రునితో సమానుడు. చక్రవర్తుల కులములో జన్మించినవాడు". ॥31.03॥

||శ్లోకము 31.04||

అహింసారతి రక్షుద్రో ఘృణీ సత్యపరాక్రమః|
ముఖ్యశ్చ ఇక్ష్వాకువంశస్య లక్ష్మీవాన్ లక్ష్మివర్ధనః||31.04||

స|| (సః) అహింసా రతి అక్షుద్రః ఘృణీ సత్యపరాక్రమః ఇక్ష్వాకువంశశ్చ ముఖ్యః చ లక్ష్మీవాన్ లక్ష్మివర్ధనః||

||శ్లోకార్థములు||

అహింసా రతి - ఆహింసలో అనురక్తి గలవాడు
అక్షుద్రః ఘృణీ సత్యపరాక్రమః -
క్షుద్రుడు కాడు, దయకలవాడు, సత్యమనే ఆయుధముకల పరాక్రముడు
ఇక్ష్వాకువంశశ్చ ముఖ్యః చ- ఇక్ష్వాకువంశములోముఖ్యుడు
లక్ష్మీవాన్ లక్ష్మివర్ధనః - లక్ష్మికలవాడు లక్ష్మిని పెంపొందింప కలవాడు

||శ్లోకతాత్పర్యము||

"ఆహింసలో అనురక్తి గలవాడు. ఉదారుడు క్షుద్రుడు కాడు, దయకలవాడు, సత్యమనే ఆయుధముకల పరాక్రముడు. ఇక్ష్వాకువంశములోముఖ్యుడు. లక్ష్మికలఆడు లక్ష్మిని పెంపొందింప కలవాడు." ||31.04|

||శ్లోకము 31.05||

పార్థివవ్యంజనైర్యుక్తః పృథుశ్రీః పార్థివర్షభః|
పృథివ్యాం చతురంతాయాం విశ్రుత స్సుఖదః సుఖీ||31.05||

స|| (సః) పార్థివవ్యంజనైః యుక్తః పృథుశ్రీః పార్థివర్షభః చతురంతాయాం పృథివ్యాం విశ్రుతః సుఖదః సుఖీ చ||

॥శ్లోకార్థములు॥
పార్థివవ్యంజనైః యుక్తః -
రాజలక్షణములు కలవాడు
పృథుశ్రీః పార్థివర్షభః -
ఇశ్వర్యము కలవాడు. రాజులలో రాజు
చతురంతాయాం పృథివ్యాం విశ్రుతః -
నాలుగు సముద్రములతో చుట్టబడిన భూమండలము లో పేరుగలవాడు
సుఖదః సుఖీ చ - సుఖములను కలగించువాడు తాను సుఖముగా నుండువాడు

॥శ్లోకతాత్పర్యము॥

"రాజలక్షణములు కలవాడు, ఇశ్వర్యము కలవాడు. రాజులలో రాజు. నాలుగు సముద్రములతో చుట్టబడిన భూమండలము లో పేరుగలవాడు, సుఖములను కలగించువాడు తాను సుఖముగా నుండువాడు".

||శ్లోకము 31.06||

తస్య పుత్త్రః ప్రియోజ్యేష్ఠః తారాధిపనిభాననః|
రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠః సర్వధనుష్మతామ్||31.06||

స|| తస్య జ్యేష్ఠ పుత్రః ప్రియః రామః నామః తారాధిపనిభాననః విశేషజ్ఞః సర్వధనుష్మతాం శ్రేష్ఠః||

||శ్లోకార్థములు||

తస్య జ్యేష్ఠ పుత్రః ప్రియః-
ఆయన యొక్క ప్రియమైన జ్యేష్ఠపుత్రుడు
రామః నామః -
రాముడను పేరుగలవాడు
తారాధిపనిభాననః విశేషజ్ఞః -
చంద్రునిముఖమువంటి ముఖము కలవాడు, విశేషజ్ఞానము కలవాడు
సర్వధనుష్మతాం శ్రేష్ఠః

||శ్లోకతాత్పర్యము||

"ఆయన యొక్క ప్రియమైన జ్యేష్ఠపుత్రుడు రాముడను పేరుగలవాడు. చంద్రునిముఖమువంటి ముఖము కలవాడు, విశేషజ్ఞానము కలవాడు. ధనస్సు ధరించువారిలో శ్రేష్ఠుడు

||శ్లోకము 31.07||

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా|
రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరంతపః||31.07||

స|| (సః) పరంతపః స్వస్య ధర్మస్య రక్షితా స్వజనస్య రక్షితా జీవలోకస్య ధర్మస్య చ రక్షితా ||

||శ్లోకార్థములు||

పరంతపః - శతృవులను తపించు వాడు
స్వస్య ధర్మస్య రక్షితా - స్వధర్మమును పాటించువాడు
స్వజనస్య రక్షితా - స్వజనములను రక్షించువాడు
జీవలోకస్య ధర్మస్య చ రక్షితా - జీవలోకమును ధర్మమును రక్షించువాడు

||శ్లోకతాత్పర్యము||

"శతృవులను తపించు వాడు. స్వధర్మమును పాటించువాడు. స్వజనములను రక్షించువాడు. జీవలోకమును ధర్మమును రక్షించువాడు."॥31.07॥

ఇక్కడ హనుమంతు ని ద్వారా విన్నమాట, రాముడు తన స్వధర్మమును రక్షించుకొనును. తనవారిని రక్షించుకొనువాడు, జీవలోకమును రక్షించువాడు, అలాగే ధర్మమును రక్షించువాడు.

ఇదే శ్లోకము బాలకాండలో ప్రథమసర్గ అంటే సంక్షేపరామాయణములో వస్తుంది.

రాముని ప్రధానలక్షణము రక్షకత్వము. రాముడు భగవదవతారము. భగవదవతారమునకు ప్రధాన ప్రయోజనము సాధు రక్షణము, ధర్మరక్షణము. "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా " అన్న భగవద్గీత మాటలో కూడా అదే అర్థము.

రాజుగా రాముడు రక్షకుడు. అట్లు రక్షించుటలో తన ధర్మమును రాజు రక్షించుకోవలెను. అందుకే ముందుగా తనధర్మమును రక్షించుకొనువాడని చెప్పబడినది. రెండవది స్వజనమును రక్షించుట. తనదేశములో ప్రజలని రక్షింపనివాడు , వారి అనురాగము కోల్పోయి తన రాజత్వమునే కోల్పోవును.
రక్షణమనగా ఆపదలను తొలగించుట. అభిమతమును సమకూర్చుట. ఇది రాజు చేయవలసిన ధర్మము.

మూడవది జీవలోక రక్షణము. రాజు సర్వభూతహితుడై ప్రవర్తించవలయును. తనవారను కాపాడుతూ ఇతరుల నాశనముకు యత్నింపరాదు. ప్రజలనే కాక సమస్త జీవకోటికి బాధ్యుడు.

నాలుగవది ధర్మ రక్షణము.ప్రజలు వారి వారి ధర్మములను అనుసరించునట్లు చూచుట రాజు ధర్మము.

ఇట్లు చతుర్విధములుగా రక్షణమును సాగించు వాడు రాముడు.
పరమాత్మగా రాముడు రక్షకుడు. పరమాత్మకు ప్రధాన లక్షణము రక్షణమే.
'అ'కారము పరమాత్మకు పేరు. "అవరక్షణే" అనే మాటలో మనకి తెలిసేది , అకారము రక్షణకే. 'అ' అనే అక్షరము అన్ని అక్షరములకు ముందున్న అక్షరము. సర్వ వాఙ్మయమునకు అది మూలము.సర్వ పదార్థములకు పరమాత్మయే మూలము. అందుచే 'అ'కారమునకు అర్థము పరమాత్మ.

సర్వజగత్తుకు కారణమైనవాడు, సర్వజగత్తు రక్షకుడైనవాడు ఆ 'అ'కారముచే తెలియచేయబడును. ఈ శ్లోకములో పరమాత్మగా రక్షకుడైన రాముని స్వభావము తెలియచేయబడినది.

రామకథ చెప్పే హనుమంతుడు , సీత కి వినపడేలా రాముని గురించి ఇలా చెపుతూ, రక్షకుడు అనే మాటతో రాముడు జగద్రక్షకుడు, నీవు ఈ దుఃఖ సముద్రమునుంచి రక్షింపబడతావు అని స్ఫురించేట్లుగా అంటాడు.

||శ్లోకము 31.08||

తస్య సత్యాభిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః|
సభార్యః సహ చ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనమ్||31.08||

స|| తస్య సత్యాభిసందస్య వృద్ధస్య పితుః వచనాత్ వీరః స భార్యః స భ్రాత్రా చ వనం ప్రవ్రాజితః||

||శ్లోకార్థములు||

తస్య సత్యాభిసందస్య - ఆ వీరుడు సత్యసంధుడు
వృద్ధస్య పితుః వచనాత్ - తన యొక్క వృద్ధుడగు తండ్రి మాటలను అనుసరించి
వీరః స భార్యః స భ్రాత్రా చ - ఆ వీరుడు భార్యతో తమ్మునితో కలిసి
వనం ప్రవ్రాజితః - వనమునకు పోయెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ వీరుడు సత్యసంధుడు తన యొక్క వృద్ధుడగు తండ్రి మాటలను అనుసరించి భార్యతో తమ్మునితో కలిసి వనమునకు పోయెను".॥31.08॥

||శ్లోకము 31.09||

తేన తత్ర మహారణ్యే మృగయాం పరిధావతా|
రాక్షసా నిహతాశ్శూరా బహవః కామరూపిణః||31.09||

|| తత్ర మహారణ్యే మృగయాం పరిధావతా బహవః కామరూపిణః శూరాః రాక్షసాః నిహతాః||

||శ్లోకార్థములు||

తత్ర మహారణ్యే - అక్కడ మహారణ్యములో
మృగయాం పరిధావతా - మృగములను వేటాడుతూ
బహవః కామరూపిణః - అనేకమంది కామరూపులు
శూరాః రాక్షసాః నిహతాః- శూరులు అగు రాక్షసులు సంహరింపబడిరి

||శ్లోకతాత్పర్యము||

"అక్కడ మహారణ్యములో మృగములను వేటాడుతూ అనేకమంది కామరూపులు శూరులు అగు రాక్షసులు ఆయనచేత సంహరింపబడిరి,

||శ్లోకము 31.10||

జనస్థాన వధం శ్రుత్వా హతౌ చ ఖరదూషణౌ|
తత స్త్వమర్షాపహృతా జానకీ రావణేన తు||31.10||
వంచయిత్వా వనే రామం మృగరూపేణ మాయయా|

||స|| స తతః జనస్థానవధం చ ఖరదూషణౌ హతః శ్రుత్వా వనే మృగరూపేణ మాయయా రామం వంచయిత్వా రావణేన జానకీ అమర్షా అపహృతా||

||శ్లోకార్థములు||

స తతః జనస్థానవధం చ - అక్కడ జనస్థానములో రాక్షసుల వధ
ఖరదూషణౌ హతః శ్రుత్వా - ఖరదూషణుల హతమార్చబడడము విని
వనే మృగరూపేణ మాయయా - వనములో మాయతో మృగరూపములో
రామం వంచయిత్వా - రాముని వంచించి
రావణేన జానకీ అమర్షా అపహృతా - రావణుని చేత, సీత అపహరింపబడెను

||శ్లోకతాత్పర్యము||

"అక్కడ జనస్థానములో రాక్షసుల వధ, ఖరదూషణుల హతమార్చబడడము విని, మాయా వనములో మృగరూపములో రాముని వంచించి, రావణుని చేత సీత అపహరింపబడెను".

||శ్లోకము 31.11||

సమార్గమాణస్తాం దేవీం రామః సీతామనిందితామ్||31.11||
అససాద వనే మిత్రం సుగ్రీవం నామ వానరం |

స|| సః రామః సీతాం అనిందితాం దేవీం వనే మార్గమాణః సుగ్రీవం నామ వానరం మిత్రం అససాద||

||శ్లోకార్థములు||

సః రామః - ఆ రాముడు
అనిందితాం దేవీం సీతాం - దోషరహితమైన దేవిని సీతను
వనే మార్గమాణః - వనములో అన్వేషిస్తూ
సుగ్రీవం నామ వానరం - సుగ్రీవుడు అను పేరుగల వానరుని
మిత్రం అససాద - మిత్రుడుగా పొందెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ రాముడు దోషరహితమైన సీతను వనములో అన్వేషిస్తూ సుగ్రీవుడు అను పేరుగల వానరుని మిత్రుడుగా పొందెను." ||31.11||

||శ్లోకము 31.12||

తతః స వాలినం హత్వా రామః పరపురంజయః||31.12||
ప్రాయచ్ఛత్ కపిరాజ్యం తత్సుగ్రీవాయ మహాబలః|

స||తతః సః పరపురంజయః మహాబలః రామః వాలినం హత్వా కపిరాజ్యం తత్ సుగ్రీవాయ ప్రాయచ్ఛత్||

||శ్లోకార్థములు||

తతః సః పరపురంజయః - అప్పుడు శతృవుల నగరములను జయించగల
మహాబలః రామః - మహాబలవంతుడగు రాముడు
వాలినం హత్వా కపిరాజ్యం - వాలిని హతమార్చి,
కపిరాజ్యం తత్ సుగ్రీవాయ ప్రాయచ్ఛత్ - ఆ వానర రాజ్యమును సుగ్రీవునకు ఇచ్చెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు శతృవుల నగరములను జయించగల మహాబలవంతుడగు రాముడు, వాలిని హతమార్చి, ఆ వానర రాజ్యమును సుగ్రీవునకు ఇచ్చెను." ||31.12||

||శ్లోకము 31.13||

సుగ్రీవేణాపి సందిష్టా హరయః కామరూపిణః||31.13||
దిక్షు సర్వాసు తాం దేవీం విచిన్వంతీ సహస్రశః|

స|| సుగ్రీవేణ సందిష్టాః సహస్రశః కామరూపిణః హరయః సర్వాసు దిక్షుః తాం దేవీం విచిన్వంతీ ||

||శ్లోకార్థములు||

సుగ్రీవేణ సందిష్టాః సుగ్రీవునిచే పంప బడిన
సహస్రశః కామరూపిణః హరయః - వేలకొలదీ తముకోరిన రూపము దాల్చగల వానరులు
సర్వాసు దిక్షుః - అన్ని దిశలలోను
తాం దేవీం విచిన్వంతీ - ఆ దేవిని వెదుకు చున్నారు

||శ్లోకతాత్పర్యము||

"సుగ్రీవునిచే పంప బడిన వేలకొలదీ తముకోరిన రూపము దాల్చగల వానరులు, సీతను అన్వేషించుటకై అన్ని దిశలలోను పంపబడిరి".||31.13||s

||శ్లోకము 31.14||

అహం సంపాతి వచనాత్ శతయోజనమాయతమ్||31.14||
అస్యా హేతౌ ర్విశాలాక్ష్యాః సాగరం వేగవాన్ ప్లుతః|

స|| అస్య విశాలాక్ష్యాః హేతోః సంపాతి వచనాత్ అహం శతయోజనం ఆయతం సాగరం ప్లుతః ||

||శ్లోకార్థములు||

అస్య విశాలాక్ష్యాః హేతోః - ఆ విశాలాక్షి కారణముగా
సంపాతి వచనాత్ - సంపాతి వచనములపై
అహం శతయోజనం ఆయతం - నేను వందయోజనములు విస్తీర్ణమైన
సాగరం ప్లుతః - సాగరమును దాటితిని

||శ్లోకతాత్పర్యము||

"ఆ విశాలాక్షి కారణముగా సంపాతి వచనములపై నేను వందయోజనములు విస్తీర్ణమైన సాగరమును దాటితిని." ||31.14||

||శ్లోకము 31.15||

యథారూపం యథావర్ణాం యథాలక్ష్మీం చ నిశ్చితామ్||31.15||
అశ్రౌషం రాఘవస్యాహం సేయ మాసాదితా మయా|

స|| అహమ్ రాఘవస్య తాం యథారూపం యథావర్ణం యథాలక్ష్మీం అశ్రౌషం సా ఇయం మయా ఆసాదితా||

||శ్లోకార్థములు||

అహమ్ రాఘవస్య అశ్రౌషం - నేను రాఘవునిచే చెప్పబడిన
తాం యథారూపం యథావర్ణం యథాలక్ష్మీం -
అదే రూపము వర్ణము లక్షణములు వర్చస్సులను
సా ఇయం మయా ఆసాదితా - ఈమె లో నాచేత చూడబడినది

||శ్లోకతాత్పర్యము||

"నేను రాఘవునిచే చెప్పబడిన రూపము వర్ణము లక్షణములు వర్చస్సులను ఈమె లో చూచుచున్నాను". ||31.15||

||శ్లోకము 31.16||

విరరామైవ ముక్త్వాసౌ వాచం వానరపుంగవః|
జానకీ చాపి తత్ శ్రుత్వా పరం విస్మయమాగతా||31.16||

స|| అసౌ వానరపుంగవః ఏవం ఉక్త్వా విరరామ|| తత్ శ్రుత్వా జానకీ చ పరం విస్మయం ఆగతా అపి||

||శ్లోకార్థములు||

అసౌ వానరపుంగవః - ఆ వానరపుంగవుడు
ఏవం ఉక్త్వా విరరామ- ఈ విధముగా చెప్పి విరమించెను
తత్ శ్రుత్వా జానకీ చ - ఆ మాటలను విని జానకికి
పరం విస్మయం ఆగతా అపి- అత్యంత ఆశ్చర్యము కలిగెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ వానరపుంగవుడు ఈ విధముగా చెప్పి విరమించెను. ఆ మాటలను విని జానకికి అత్యంత ఆశ్చర్యము కలిగెను." ||31.16||

||శ్లోకము 31.17,18||

తతః సా వక్రకేశాంతా సుకేశీ కేశసంవృతమ్||31.17||
ఉన్నమ్య వదనం భీరు శ్శింశుపావృక్ష మైక్షత||31.18||

స|| తతః వక్రకేశాంతా భీరుః క్లేశసంవృతం సా వదనం ఉన్నమ్య శింశుపావృక్షం ఏక్షత|| '

||శ్లోకార్థములు||

తతః వక్రకేశాంతా భీరుః -

భయస్వభావము కల వక్రములైన కేశాంతములు గల
క్లేశసంవృతం సా వదనం - కేశములచే కప్పబడిన తన ముఖమును
ఉన్నమ్య శింశుపావృక్షం ఏక్షత - పైకెత్తి శింశుపా వృక్షముపైకి చూచెను

||శ్లోకతాత్పర్యము||

"భయస్వభావము కల వక్రములైన కేశాంతములు గల కేశములచే కప్పబడిన తన ముఖమును పైకెత్తి శింశుపా వృక్షముపైకి చూచెను." ||31.17,18||

||శ్లోకము 31.19||

నిశమ్య సీతా వచనం కపేశ్చ దిశశ్చ సర్వాః ప్రదిశశ్చవీక్ష్య|
స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామ మనుస్మరంతీ||31.19||

స|| సీతా కపేః వచనం నిశమ్య సర్వాః దిశః చ ప్రదిశః చ వీక్ష్యా స్వయం సర్వాత్మనా రామం అనుస్మరంతీ పరమం ప్రహర్షం జగామ||

||శ్లోకార్థములు||

సీతా కపేః వచనం నిశమ్య - సీత వానరుని మాటలను విని
సర్వాః దిశః చ ప్రదిశః చ వీక్ష్యా- అన్ని దిశలు భాగాలు చూస్తూ
స్వయం సర్వాత్మనా రామం అనుస్మరంతీ -
స్వయముగా అందరి ఆత్మలలో ఉండు రామునే స్మరిస్తూ
పరమం ప్రహర్షం జగామ- ఆనండభరితురాలయ్యెను

||శ్లోకతాత్పర్యము||

"వానరుని మాటలను విని అన్ని దిశలు భాగాలు చూస్తూ స్వయముగా అందరి ఆత్మలలో ఉండురామునినే ధ్యానిస్తూ సీత ఆనండభరితురాలయ్యెను." ||31.19||

||శ్లోకము 31.20||

సాతిర్యగూర్ధ్వం చ తథా ప్యధస్తాన్
నిరీక్షమాణా తం అచింత్య బుద్ధిమ్|
దదర్శ పింగాధిపతేరమాత్యమ్
వాతాత్మజం సూర్య మివోదయస్థమ్||31.20||

స|| సా తిర్యక్ ఊర్ధ్వం చ తథాపి అథస్తాత్ నిరీక్షమాణా అచిన్త్యబుద్ధిం పింగాధిపతేః అమాత్యం ఉదయస్థం సూర్యం ఇవ తం వాతాత్మజం దదర్శ||

||శ్లోకార్థములు||

సా తిర్యక్ ఊర్ధ్వం చ తథాపి అథస్తాత్ - ఆమె పైకి క్రిందకీ అన్నివైపులా
నిరీక్షమాణా - చూచి
అచిన్త్యబుద్ధిం పింగాధిపతేః అమాత్యం - ఊహించలేని బుద్ధిగల వానరాధిపతి సచివుని
ఉదయస్థం సూర్యం ఇవ తం - ఉదయభానుని వలె నున్న ఆ
వాతాత్మజం దదర్శ - హనుమంతుని చూచెను

||శ్లోకతాత్పర్యము||

"ఆమె పైకి క్రిందకీ అన్నివైపులా చూచి అచిన్త్య బుద్ధికలవాడు, పింగాధిపతి మంత్రీ, ఉదయభానుని వలె నున్న హనుమంతుని చూచెను." ||31.20||

హనుమంతుడు ఈ విధముగా చెప్పి విరమిస్తాడు.

ఇక్కడ ముందు సీతకు తెలిసిన రామకథ చెప్పి సీతకు నమ్మకము కలిగిస్తాడు. ఆ తరువాత ఆమెకి తెలియని రామసుగ్రీవ మైత్రిని, సీతాన్వేషణమును, సాగర లంఘనము గురించి వివరిస్తాడు. ఆ మాటలను విని జానకికి అత్యంత ఆశ్చర్యపోతుంది. సీత వానరుని మాటలను విని అన్ని దిశలలో చూచి రామునినే ధ్యానిస్తూ ఆనంద భరితురాలయ్యెను.

ఇదే ఆలోచనతో వానర శ్రేష్ఠుడు వైదేహికి వినిపించాడు కూడా.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ఏకత్రింశస్సర్గః||

|| ఓమ్ తత్ సత్||