||సుందరకాండ ||

||ముప్పది రెండవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 32 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||


సుందరకాండ.
అథ ద్వాత్రింశస్సర్గః

ముప్పది ఒకటవ సర్గలో, "స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామమనుస్మరంతీ"అంటూ రాముని గురించే ధ్యానిస్తూ, రామకథ విని అన్ని దిశలలో చూస్తూ, సీత స్వయముగా అనందము పొందింది అని వింటాము. రామ కథ వింటే హర్షమే వస్తుంది.

అప్పుడు అన్ని దిశలలూ చూస్తున్న సీత , వృక్షశాఖలలో లీనమైన తెల్లని వస్త్రము ధరించిన , మెఱుపుతీగల వంటి వర్ణము కల వానరుని చూచి సీత మనస్సు కొంచెము చలిస్తుంది.

ఇక ముప్పది రెండవ సర్గలో శ్లోకతాత్పర్యాలు

||శ్లోకము 32.01||

తతశ్శాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానసా|
వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్సంఘాత పింగళమ్||32.01||

స||తతః శాఖాంతరేలీనం వేష్టితార్జునవస్త్రం విద్యుత్సంఘాతపింగళం తం దృష్ట్వా చలితమానసా అభవత్||

గోవిన్దరాజ టీకాలో - వేష్టితార్జునవస్త్రం వేష్టిత ధవళ వస్త్రం;భయాత్ చలిత మానసః;

తిలక టీకాలో- చలితమానసాఽదృష్టరూపోఽయమపి మాయామృగో వేతి సీతా చలిత చిత్తా ;

||శ్లోకార్థములు||

తతః శాఖాంతరేలీనం -
అప్పుడు వృక్షశాఖలలో లీనమైన
వేష్టితార్జునవస్త్రం -
తెల్లని వస్త్రము నడుము చుట్టూ ధరించిన
విద్యుత్సంఘాతపింగళం -
మెఱుపుతీగలవంటి వర్ణము కల
తం దృష్ట్వా చలితమానసా అభవత్-
వానిని చూచి చలించిన మనస్సు కలదాయెను

||శ్లోక తాత్పర్యము||

"అప్పుడు వృక్షశాఖలలో లీనమైన తెల్లని వస్త్రము ధరించిన ,మెఱుపుతీగలవంటి వర్ణము కల వానరుని చూచి చలించిన మనస్సు కలదాయెను." ||32.01||

||శ్లోకము 32.02||

సాదదర్శ కపిం తత్ర ప్రశ్రితం ప్రియవాదినం|
ఫుల్లశోత్కరాభాసం తప్తచామీకరేక్షణమ్||32.02||

స|| సా తత్ర ఫులశోత్కరాభాసం తప్తచామీకరేక్షణమ్ ప్రశ్రితం ప్రియవాదినం కపిం దదర్శ||

||శ్లోకార్థములు||

సా తత్ర ఫులశోత్కరాభాసం -
ఆమె అక్కడ వికశించిన పుష్పములకాంతితో శోభిల్లుతున్
తప్తచామీకరేక్షణమ్ -
పుడిమి బంగారపు కాంతులుగల నేత్రములతో
ప్రశ్రితం ప్రియవాదినం -
వినయముతో ప్రియవచనములు పలుకుతున్న
కపిం దదర్శ - వానరుని చూచెను.

||శ్లోక తాత్పర్యము||

"వికశించిన పుష్పములకాంతితో శోభిల్లుతున్న, పుడిమి బంగారపు కాంతులుగల నేత్రములతో , ప్రియవచనములు పలుకుతున్న వినయముతో నున్న వానరుని ఆమె చూచెను."||32.02||

||శ్లోకము 32.03||

మైథిలీ చింతయామాస విస్మయం పరమం గతా|
అహో భీమ మిదం రూపం వానరస్య దురాసదమ్||32.03||

స|| పరమం విస్మయం గతా మైథిలీ చింతయామాస| అహో వానరస్య ఇదం రూపం భీమం దురాసదమ్ ||

||శ్లోకార్థములు||

పరమం విస్మయం గతా -
విస్మయము చెందిన
మైథిలీ చింతయామాస -
మైథిలి అలోచించసాగెను
అహో వానరస్య ఇదం రూపం భీమం -
అయ్యో ఈ వానరుని రూపము భయంకరముగా
దురాసదమ్ - సమీపింప సాధ్యము కానిదిగా ఉన్నది.

||శ్లోక తాత్పర్యము||

విస్మయము చెందిన మైథిలి అలోచించసాగెను. "అయ్యో ఈ వానరుని రూపము భయంకరముగా సమీపింప సాధ్యముకానిదిగా ఉన్నది." ||32.03||

||32.03||

||శ్లోకము 32.04||

దుర్నిరీక్ష మితి జ్ఞాత్వా పునరేవ ముమోహ సా|
విలలాప భృశం సీతా కరుణం భయమోహితా||32.04||

స|| దుర్నిరీక్ష్యం ఇతి జ్ఞాత్వా పునః ముమోహ | భయమోహితా సీతా భృశం కరుణం విలలాప||

||శ్లోకార్థములు||

దుర్నిరీక్ష్యం ఇతి జ్ఞాత్వా పునః ముమోహ ఏవ -
చూడశక్యముగానున్నది అని తలచి మళ్ళీ కలత చెంది తీవ్రముగా విలపింపసాగెను
భయమోహితా సీతా భృశం కరుణం విలలాప -
అని తలచి మళ్ళీ భయపడి తీవ్రముగా విలపింపసాగెను

||శ్లోక తాత్పర్యము||

"ఈ వానరుని రూపము చూడశక్యముగానున్నది అని తలచి మళ్ళీ కలత చెంది తీవ్రముగా విలపింపసాగెను."||32.04||

||శ్లోకము 32.05||

రామరామేతి దుఃఖార్తా లక్ష్మణేతి చ భామినీ|
రురోద బహుధా సీతా మందం మందస్వరా సతీ||32.05||

స|| భామినీ దుఃఖార్తా రామరామేతి లక్ష్మణేతి మందం మందస్వరా సతీ బహుధా రురోద ||

||శ్లోకార్థములు||

భామినీ దుఃఖార్తా - దుఃఖములో మునిగి యున్నఆ భామిని
రామరామేతి లక్ష్మణేతి - రామా రామా అని లక్ష్మణా అని
మందం మందస్వరా సతీ - మెల్లగా మందస్వరముతో
బహుధా రురోద - అనేకవిధములుగా రోదించెను

||శ్లోక తాత్పర్యము||

"దుఃఖములో మునిగి యున్నఆ భామిని, రామా రామా అని లక్ష్మణా అని, మెల్లగా మెల్లగా మందస్వరముతో అనేకవిధములుగా రోదించెను." ||32.05||

||శ్లోకము 32.06||

సాతం దృష్ట్వా హరిశ్రేష్ఠం వినీతవ దుపస్థితమ్|
మైథిలీ చింతయామాస స్వప్నోఽయమితి భామినీ||32.06||

స|| సా వీనీతవత్ ఉపస్థితం తం హరిశ్రేష్ఠం దృష్ట్వా మైథిలీ అయం స్వప్నః ఇతి చింతయామాస||

||శ్లోకార్థములు||

వీనీతవత్ ఉపస్థితం - వినయముగా కూర్చుని ఉన్న
తం హరిశ్రేష్ఠం దృష్ట్వా - ఆ వానరశ్రేష్ఠుని చూచి
సా మైథిలీ అయం స్వప్నః - ఆ సీత ఇది కలయే
ఇతి చింతయామాస - అని అనుకొనసాగెను

||శ్లోక తాత్పర్యము||

"ఆ సీత వినయముగా కూర్చుని ఉన్న ఆ వానరశ్రేష్ఠుని చూచి ఇది కలయే అని అనుకొనసాగెను." ||32.06||

||శ్లోకము 32.07||

సా వీక్షమాణా పృథు భుగ్నవక్త్రమ్
శాఖామృగేంద్రస్య యథోక్త కారమ్|
దదర్శ పింగాధిపతే రమాత్యం
వాతాత్మజం బుద్ధిమతాం వరిష్ఠమ్||32.07||

స||పృథుభుగ్నవక్త్రం శాఖామృగేంద్రస్య యథోక్తారమ్ పింగాధిపతేః అమాత్యం వాతాత్మజం బుద్ధిమతాం వరిష్ఠం సా వీక్షమాణా దదర్శ||

||శ్లోకార్థములు||

పృథుభుగ్నవక్త్రం -
పెద్ద ముఖము కలవాడు
శాఖామృగేంద్రస్య యథోక్తారమ్ -
వానరరాజాధిపతి ఆజ్ఞను పరిపాలించు,
పింగాధిపతేః అమాత్యం వాతాత్మజం -
సుగ్రీవుని అమాత్యుడు అగు వాయునందనుడూ
బుద్ధిమతాం వరిష్ఠం -
బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అగు హనుమంతుని
వీక్షమాణా సా దదర్శ-
అటూ ఇటూ పరికీలిస్తున్నా ఆమె చూచెను

||శ్లోక తాత్పర్యము||

అలా పరికిస్తూ ఉన్న సీత పెద్ద ముఖము కలవాడు, వానరరాజాధిపతి ఆజ్ఞను పరిపాలించు, సుగ్రీవుని అమాత్యుడు అగు వాయునందనుడూ, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అగు హనుమంతుని చూచెను ||32.07||

||శ్లోకము 32.08||

సా తం సమీక్ష్యైవ భృశం విసంజ్ఞా
గతాసుకల్పేన బభూవ సీతా|
చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య భూయో
విచింతయామాస విశాలనేత్రా||32.08||

స||సా తం సమీక్ష్యైవ భృశం విసంజ్ఞా గతాసుకల్పేవ బభూవ| విశాలనేత్రా చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య విచింతయామాస||

||శ్లోకార్థములు||

సా తం సమీక్ష్యైవ భృశం విసంజ్ఞా -
ఆమె అతనిని చూచిన వెంటనే మూర్ఛిల్లి
గతాసుకల్పేవ బభూవ -
ప్రాణము పోయినదానివలె ఆయెను
విశాలనేత్రా చిరేణ సంజ్ఞాం ప్రతిలభ్య -
విశాలనేత్రములు కల ఆ దేవి మరల వెంటనే తేరుకొని
విచింతయామాస - ఆలోచించసాగెను

||శ్లోక తాత్పర్యము||

"ఆమె అతనిని చూచిన వెంటనే మూర్ఛిల్లి , ప్రాణము పోయినదానివలె ఆయెను. విశాలనేత్రములు కల ఆ దేవి వెంటనే తేరుకొని మరల ఆలోచించసాగెను." ||32.08||

||శ్లోకము 32.09||

స్వప్నే మయాఽయం వికృతోద్య దృష్టః
శాఖామృగః శాస్త్రగణైర్నిషిద్ధః|
స్వస్త్యస్తు రామాయ స లక్ష్మణాయ
తథా పితుర్మే జనకస్య రాజ్ఞః|| 32.09||

స|| అద్య మయా వికృతః శాస్త్రకారణైః నిషిద్ధః శాఖామృగః స్వప్నే దృష్టః| సలక్ష్మణాయ రామాయ తథా రాజ్ఞః మే పితుః జనకస్య స్వస్తిః అస్తు||

||శ్లోకార్థములు||

అద్య మయా శాస్త్రకారణైః నిషిద్ధః-
ఇప్పుడు నేను శాస్త్రములో నిషిద్ధింపబడిన
వికృతః శాఖామృగః స్వప్నే దృష్టః -
వికృతమైన వానరుని స్వప్నములో చూచితిని
సలక్ష్మణాయ రామాయ -
లక్ష్మణునితో కూడిన రామునకు
తథా రాజ్ఞః మే పితుః జనకస్య -
అలాగే రాజు నా తండ్రి అగు జనకునకు
స్వస్తిః అస్తు - శుభము అగుగాక

||శ్లోక తాత్పర్యము||

"ఇప్పుడు నేను వికృతమైన శాస్త్రములో నిషిద్ధింపబడిన వానరుని స్వప్నములో చూచితిని. లక్ష్మణునితో కూడిన రామునకు అలాగే రాజు నా తండ్రి అగు జనకునకు శుభము అగుగాక." ||32.09||

||శ్లోకము 32.10||

స్వప్నోఽపి నాయం నహి మేఽస్తి నిద్రా
శోకేన దుఃఖేన చ పీడితాయాః|
సుఖం హి మే నాస్తి యతోఽస్మిహీనా
తేనేందుపూర్ణప్రతిమాననేన||32.10||

స|| అయం స్వప్నః అపి న | శోకేన దుఃఖేన చ పీడితాయాః మే నిద్రా నాస్తి హి మే సుఖం నాస్తి హి యతః ఇంద్రపూర్ణప్రతిమానేన తేన హీనా అస్మి ||

||శ్లోకార్థములు||

అయం స్వప్నః అపి న -
ఇది స్వప్నము కూడా కాదు
శోకేన దుఃఖేన చ పీడితాయాః మే నిద్రా నాస్తి హి -
శోకములో దుఃఖముతో పీడింపబడిన నాకు నిద్ర కూడా లేదు
మే సుఖం నాస్తి హి -
నాకు సుఖము కూడాలేదు
యతః ఇంద్రపూర్ణప్రతిమానేన ఎందుకు అంటే పూర్ణచంద్రుని బోలి ముఖముగల
తేన హీనా అస్మి - వానిని బాసి

||శ్లోక తాత్పర్యము||

"శోకములో దుఃఖముతో పీడింపబడిన నాకు నిద్ర కూడా లేదు, కనుక ఇది స్వప్నము కూడా కాదు. పూర్ణచంద్రుని బోలి ముఖముగల వానిని బాసి శోకములో దుఃఖములో వున్న నాకు నాకు సుఖము కూడాలేదు." ||32.10||

||శ్లోకము 32.11||

రామేతి రామేతి సదైవ బుద్ధ్యా
విచింత్య వాచా బ్రువతీ త మేవ|
తస్యానురూపం చ కథాం తమర్థం
ఏవం ప్రపశ్యామి తథా శృణోమి||32.11||

స|| రామేతి రామేతి సదా ఏవ బుద్ధ్యా విచింత్య తమేవ బృవంతీ తస్య అనురూపం తదర్థం కథాం ఏవ ప్రపశ్యామి తథా శ్రుణోమి ||

||శ్లోకార్థములు||

రామేతి రామేతి సదా ఏవ బుద్ధ్యా విచింత్య -
రామా రామా అంటూ సదా అదే చింతనతో
తమేవ బృవంతీ - అయననే స్మరిస్తూ
తస్య అనురూపం తదర్థం కథాం ఏవ -
అందుకు అనుగుణముగా అలాంటి కధలనే
ప్రపశ్యామి తథా శ్రుణోమి -
వింటూ చూస్తూ ఉన్నట్లు ఉన్నాను

||శ్లోక తాత్పర్యము||

"రామా రామా అంటూ సదా అదే చింతనతో అయననే స్మరిస్తూ అందుకు అనుగుణముగా అలాంటి కధలనే వింటూ చూస్తూ ఉన్నట్లు ఉన్నాను ."||32.11||

||శ్లోకము 32.12||

అహం తస్యాద్య మనోభవేన
సంపీడితా తద్గత సర్వభావా|
విచింతయంతీ సతతం తమేవ
తథైవ పశ్యామి తథా శృణోమి||32.12||"

స|| అహం తస్య మనోభావేన సంపీడితా తద్గతసర్వభావా సతతం తమేవ విచింతయంతీ తథైవ పశ్యామి తథా శ్రుణోమి ||

||శ్లోకార్థములు||

అహం తస్య మనోభావేన సంపీడితా -
నేను ఆయనతో మనస్సు నిండినదై పీడింపబడినదై
తద్గతసర్వభావా సతతం తమేవ విచింతయంతీ -
అన్నివిధములుగా అయనపై భావము కలదాననై ఆలోచించుచూ
తథైవ పశ్యామి తథా శ్రుణోమి -
అదే చూస్తూ వింటూ ఉన్నాను

||శ్లోక తాత్పర్యము||

"నేను ఆయనతో మనస్సు నిండినదై , పీడింపబడినదై , అన్నివిధములుగా అయనపై భావము కలదాననై అయనే చూస్తూ వింటూ ఉన్నాను." ||32.12||

||శ్లోకము 32.13||

మనోరథ స్స్యాదితి చింతయామి
తథాపి బుద్ధ్యా చ వితర్కయామి|
కిం కారణం తస్య హి నాస్తి రూపమ్
సువ్యక్త రూపశ్చ వద త్యయం మామ్||32.13||

స|| మనోరథః స్యాత్ ఇతి చింతయామి | బుద్ధ్యా చ తథా వితర్కయామి | తస్య రూపం నాస్తి హి | అయం సువ్యక్తరూపః మామ్ వదతి కారణం కిం ||

||శ్లోకార్థములు||

మనోరథః స్యాత్ ఇతి చింతయామి -
ఇది నామనోరథము అని అనుకుంటాను
బుద్ధ్యా చ తథా వితర్కయామి -
మనస్సులో తర్కించుకుంటాను
తస్య రూపం నాస్తి హి -
కాని ఆ తర్కమునకు రూపము ఉండదు కదా
అయం సువ్యక్తరూపః మామ్ వదతి కారణం కిం -
కాని ఇప్పుడు ప్రత్యక్షముగా కనిపిస్తున్న రూపము మాట్లాడు చున్నది అది ఎలాగ?

||శ్లోక తాత్పర్యము||

ఇది నామనోరథము అని అనుకుంటాను. నా మనస్సులో తర్కించుకుంటాను. కాని ఆతర్కమునకు రూపము ఉండదు కదా. కాని ఇప్పుడు ప్రత్యక్షముగా కనిపిస్తున్న రూపము మాట్లాడు చున్నది అది ఎలాగ? ||32.13||

||శ్లోకము 32.14||

నమోఽస్తు వాచస్పతయే సవజ్రిణే
స్వయంభువే చైవ హుతాశనాయచ|
అనేన చోక్తం యదిదం మమాగ్రతో
వనౌకసా తచ్చ తథాస్తు నాన్యథా||32.14||

స|| సవజ్రిణే వాచస్పతయే స్వయంభువే చ ఏవ హూతాశనాయ చ నమః అస్తు| అనేన వనౌకసా మమ అగ్రతః యత్ ఇదం ఉక్తం తత్ తథా అస్తు| అన్యథా న||

||శ్లోకార్థములు||

సవజ్రిణే వాచస్పతయే స్వయంభువే చ -
ఇంద్రునకు, బృహస్పతికి బ్రహ్మదేవునకు నమస్కారములు.
ఏవ హూతాశనాయ చ నమః అస్తు-
అలాగే అగ్నిదేవునకు కూడా నమస్కారము
అనేన వనౌకసా మమ అగ్రతః యత్ ఇదం ఉక్తం -
ఈ వనవాసుడు నా ముందర చెప్పినది
తత్ తథా అస్తు - నిజము అగు గాక
అన్యథా న - అసత్యము కాకూడదు

||శ్లోక తాత్పర్యము||

ఇంద్రునకు నమస్కారము. బృహస్పతికి బ్రహ్మదేవునకు నమస్కారములు. నా ముందున్న ఈ వనవాసుడు చెప్పినది నిజము అగు గాక . అది అసత్యము కాకూడదు గాక||32.14||

వినయముగా కనపడుతున్న హనుమ, ఇది కలా కాదా అని మధనపడిన సీతకి ఒకటే దోవ కనిపిస్తుంది.

" ఇంద్రునకు నమస్కారము. బృహస్పతికి, బ్రహ్మదేవునకు నమస్కారములు.
నా ముందున్న ఈ వనవాసుడు చెప్పినది నిజము అగు గాక."

మనస్సు కలత చెందినపుడు అది అనేక మార్గాలలో పోతుంది. దానిని అదుపులోకి తీసుకురావడము మొదటి కార్యక్రమము. సీత బృహస్పతికి బ్రహ్మదేవునకు నమస్కారము చేస్తూ, తథాస్తు అనుకోవడములో సీత చేసినది అదే.

అదే ముప్పది మూడవసర్గలో మనము వినే మాట

||ఓం తత్ సత్