||సుందరకాండ ||

||ముప్పది ఏడవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 37 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ సప్తత్రింశస్సర్గః

ముప్పది ఆరవ సర్గలో ఉంగర ప్రదానము తరువాత వాల్మీకి సీతను 'రామ సంకీర్తన వీత శోకా' అని వర్ణిస్తాడు. రామ సంకీర్తన వీత శోకా ! అంటే రామసంకీర్తనతో శోకము వీడిన దేవి అని. రాముడు తను లేకపోవడముతో కష్టాలలో వున్నాడు అన్నమాటతో దుఃఖము కలిగినా, రాముని సంకీర్తనతో శోకము పోయినదై, సీత మనస్సు ముందు చేయవలసిన కార్యక్రమము పైకి మళ్ళుతుంది.

ఆ కార్యక్రమము సీతా రాముల కలయికే. అయితే అది రాముని కీర్తికి "సదృశముగా" అంటే అనుగుణముగా జరగాలి. అదే సహ ధర్మచారిణి అయిన సీత మనస్సులో ఎల్లప్పుడూ ఉండే మాట. ఈ సర్గలోని సీతాహనుమంతుల సంవాదములో హనుమంతుని నిరహంకార స్వరూపము, సహధర్మచారిణిగా సీత యొక్క మనస్తత్త్వము వింటాము.

ఇక ఈ సర్గలో శ్లోకాలు అర్థతాత్పర్యాలతో

||శ్లోకము 37.01||

సీతా తద్వచనం శ్రుత్వా పూర్ణచంద్ర నిభాననా|
హనూమంత మువాచేదం ధర్మార్థసహితం వచః||37.01||

స|| సీతా పూర్ణచంద్ర నిభాననా ధర్మార్థసహితం తద్వచనం శ్రుత్వా హనుమంతం ఇదం వచః ఉవాచ||

|| శ్లోకార్థములు||

సీతా పూర్ణచంద్ర నిభాననా -
పూర్ణచంద్రుని పోలిన ముఖము కల సీత
ధర్మార్థ సహితం తద్వచనం శ్రుత్వా -
ధర్మము అర్థము కలిగియున్న ఆ వచనములను విని
హనుమంతం ఇదం వచః ఉవాచ -
హనుమంతునితో ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

"పూర్ణచంద్రుని పోలిన ముఖము కల సీత, ధర్మము అర్థము కలిగియున్న ఆ వచనములను విని హనుమంతునితో ఇట్లు పలికెను." ||37.01||

||శ్లోకము 37.02||

అమృతం విషసంస్పృష్టం త్వయా వానరభాషితమ్|
యచ్చ నాన్యమనా రామో యచ్చ శోకపరాయణః||37.02||

స||వానర త్వయా యచ్చరామః న అన్యమనా యచ్చ శోకపరాయణః ఇతి భాషితం (తత్) అమృతం విషసంస్పృష్టం||

తిలక టీకాలో - యచ్చనాన్యమనా ఇతి వాక్యం ఆఖ్యాయతే తత్ అమృతం। యచ్చ శోకపరాయణమితి వాక్యం ఆఖ్యాతే తత్ విషం॥ అంటే ఇంకొక ఆలోచనలేదు అన్నమాట అమృతము. శోకములో మునిగివున్నాడు అన్నమాట విషము అని.

|| శ్లోకార్థములు||

వానర త్వయా - ఓ వానరా నీ చేత
యచ్చ రామః న అన్యమనా -
రాముడు ఇంకొకరి అలోచనలేకుండా
యచ్చ శోకపరాయణః ఇతి భాషితం -
శోకములో మునిగి యున్నాడు అని చెప్పబడిన మాట
(తత్) అమృతం విషసంస్పృష్టం-
విషముతో కూడిన అమృతము వలె నున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరా ! నీవు చెప్పినట్లు రాముడు ఇంకొకరి అలోచనలేకుండా శోకములో మునిగి యున్నాడు అన్నమాట విషముతో కూడిన అమృతములా ఉన్నది." ||37.02||

||శ్లోకము 37.03||

ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే|
రజ్జ్వేవ పురుషం బద్ధ్వా కృతాంతం పరికర్షతి||37.03||

స||కృతాంతః పురుషః రజ్జ్వా బద్ధ్వా ఇవ సువిస్తీర్ణే ఐశ్వర్యే వా సుదారుణే వ్యసనే వా పరికర్షతి ||

|| శ్లోకార్థములు||

కృతాంతః పురుషః - విధి పురుషుని
రజ్జ్వా బద్ధ్వా ఇవ - తాడుతో కట్టబడిన వాని వలె
సువిస్తీర్ణే ఐశ్వర్యే వా - అత్యంత ఐశ్వర్యమున్నవాడో
సుదారుణే వ్యసనే వా - దారుణమైన వ్యసనములకలవాడో
పరికర్షతి - తీసుకుపోవును.

||శ్లోకతాత్పర్యము||

" పురుషుడు అత్యంత ఐశ్వర్యముతో వున్నాలేక దారుణమైన వ్యసనములతో వున్నా గాని విధి వానిని తాడుతో కట్టిన వాని వలె తీసుకుపోవును." ||37.03||

రామ టీకాలో - । ఐశ్వర్యే వ్యసనేవా విధ్యమానం పురుషం రజ్జ్వా బద్ధ్వేవ కృతాన్తః కాలః పరికర్షతి తాభ్యాం అన్యత్ర కరోతి అతి అర్థః। ఏతేన రావణ విధ్వంసః అవశ్యం భవతి ఇతి సూచితం।

అంటే ఐశ్వరముతో తులతూగుతున్నా లేక వ్యసనములలో మునిగియున్నా గాని విధి వాళ్ళని తాడుతో కట్టి లాక్కొని తన మార్గములో పోతుంది అంటే ఇంకొకమార్గములో తీసుకుపోవును అని . ఈ మాటతో రావణుడి నాశనము తప్పదు అని సూచింప బడినది అంటారు.

||శ్లోకము 37.04||

విధిర్నూనమసంహార్యః ప్రాణినాం ప్లవగోత్తమః|
సౌమిత్రం మాం చ రామం చ వ్యసనైః పశ్య మోహితాన్||37.04||

స|| ప్లవగోత్తమ ప్రాణినామ్ నూనం విధిః అసంహార్యః | వ్యసనైః మోహితాన్ సౌమిత్రిం మాం చ రామం చ పశ్య||

|| శ్లోకార్థములు||

ప్లవగోత్తమ ప్రాణినామ్ -
ఓ ప్లవగోత్తమా ప్రాణులకు
నూనం విధిః అసంహార్యః -
విధి నిజముగనే బలీయము
వ్యసనైః మోహితాన్ -
వ్యసనపరంపరలలో పడిన
సౌమిత్రిం మాం చ రామం చ పశ్య-
లక్ష్మణుని రాముని నన్నూ చూడుము.

||శ్లోకతాత్పర్యము||

"ఓ ప్లవగోత్తమా ! విధి నిజముగనే బలీయము. వ్యసన పరంపరలలో పడిన లక్ష్మణుని రాముని నన్నూ చూడుము." ||37.04||

ఇక్కడ 'విధి నిజముగనే బలీయము' అన్న సీతమాటతో, సామాన్య మానవులకు దానిని అధిగమించడము కానే కాదా అనిపించవచ్చు. మనకి సుందరకాండలో తెలిసివచ్చేది, హనుమంతుడి లాంటి ఆచార్యుడు సాన్నిధ్యములో ఉంటే అన్ని కష్టాలు అధిగమించవచ్చు అని.

ఇంకో మాట. అంతరార్ధములో రాముడు పరమేశ్వర అవతారమని సీత అయోనిజ లక్ష్మియే అని వింటాము. అలాంటి వారుకూడా విధివశాత్తు కష్టాలలో పడ్డారు అంటే అదే రామాయణ మూలరహస్యము. రాముడు అవతారపురుషుడైనాకాని , అన్ని సుఖదుఃఖాలు సామాన్య మానవుడి రీతి ఎదుర్కొని ముందుకు ఎలాపోవాలో చూపిస్తాడు. అదే రామాయణ రహస్యము

||శ్లోకము 37.05||

శోకస్యాస్య కదా పారం రాఘవోఽధిగమిష్యతి|
ప్లవమానః పరిశ్రాంతో హతనౌ స్సాగరే యథా||37.05||

స|| సాగరే హతనౌః ప్లవమానః పరిశ్రాంతః యథా రాఘవః అస్య శోకస్య పారం కదా అధిగమిష్యసి ||

|| శ్లోకార్థములు||

సాగరే హతనౌః -
సాగరములో నౌకాభంగమువలన
ప్లవమానః పరిశ్రాంతః యథా -
సాగరములో కొట్టుకొనువచున్నవానివలే
రాఘవః అస్య శోకస్య పారం -
రాముడు ఆ సాగరపు అవతలి తీరము
కదా అధిగమిష్యసి - ఎప్పుడు చేరును?

||శ్లోకతాత్పర్యము||

"సాగరములో నౌకాభంగమువలన సాగరములో నున్నవానివలే శోకసాగరములో నున్న రాముడు ఆ సాగరపు అవతలి తీరము ఎప్పుడు చేరును?" ||37.05|

||శ్లోకము 37.06||

రాక్షాసానాం వధం కృత్వా సూదయిత్వా చ రావణం|
లంకా మున్మూలితాం కృత్వా కదా ద్రక్ష్యతి మాం పతిః||37.06||

స|| కదా రాక్షసానాం చ వధం కృత్వా రావణం సూదయిత్వా కదా లంకాం ఉన్మూలితాం కృత్వా మాం పతిః ద్రక్ష్యతి ||

|| శ్లోకార్థములు||

కదా రాక్షసానాం చ వధం కృత్వా -
ఎప్పుడు రాక్షసులను వధించి
రావణం సూదయిత్వా - రావణుని హతమార్చి
కదా లంకాం ఉన్మూలితాం కృత్వా -
ఎప్పుడు లంకను నాశనము చేసి
మాం పతిః ద్రక్ష్యతి -
నన్ను నా పతిదేవుడు చూచును?

||శ్లోకతాత్పర్యము||

"ఎప్పుడు రాక్షసులను వధించి రావణుని హతమార్చి లంకను నాశనము చేసి నన్ను నా పతి దేవుడు చూచును?"||37.06||

||శ్లోకము 37.07||

స వాచ్య సంత్వరస్యేతి యావ దేవ న పూర్యతే|
అయం సంవత్సరః కాలః తావద్ధి మమ జీవితమ్||37.07||

స|| అయం సంవత్సర కాలః యావదేవ న పూర్యతే సంత్వరస్యేతి సః వాచ్యః | మమ జీవితం తావద్ధిః||

|| శ్లోకార్థములు||

అయం సంవత్సర కాలః -
ఈ సంవత్సరకాలము
యావదేవ న పూర్యతే -ఎప్పుడో పూర్తి కాకుండా
సంత్వరస్యేతి సః వాచ్యః -
త్వరగా రావలెను అని ఆయనకి చెప్పవలయును
మమ జీవితం తావద్ధిః -
నా జీవితము అంతవరకే

||శ్లోకతాత్పర్యము||

"ఈ సంవత్సరకాలము పూర్తి కాకుండా త్వరగా రావలెను అని ఆయనకి చెప్పవలయును. నా జీవితము అంతవరకే." ||37.07||

||శ్లోకము 37.07||

వర్తతే దశమే మాసో ద్వౌతు శేషౌ ప్లవంగమ|
రావణేన నృశంసేన సమయో యః కృతో మమ||37.08||

స|| ప్లవంగమ రావణేన నృశంసేన మమ కృతః సమయః దశమే మాసః వర్తతే | శేషః ద్వౌ తు||

|| శ్లోకార్థములు||

ప్లవంగమ రావణేన నృశంసేన -
ఓ ప్లవంగమ దురాత్ముడగు రావణుని చేత
మమ కృతః సమయః - నాకు పెట్టబడిన గడువు
దశమే మాసః వర్తతే - పదవ మాసము గడుచుచున్నది
శేషః ద్వౌ తు - మిగిలినవి రెండే మాసములు

||శ్లోకతాత్పర్యము||

"ఓ ప్లవంగమ దురాత్ముడగు రావణుని చేత పెట్టబడిన గడువు అది. పదవ మాసము గడుచుచున్నది. మిగిలినవి రెండే మాసములు". ||37.08||

||శ్లోకము 37.09||

విభీషణేన చ భ్రాత్రా మమ నిర్యాతనం ప్రతి|
అనునీతః ప్రయత్నేన న చ తత్ కురుతే మతిమ్||37.09||

స|| భ్రాత్రా విభీషణేన మమ నిర్యాతనం ప్రతి ప్రయత్నేన అనునీతః | తత్ మతిం న కురుతే||

|| శ్లోకార్థములు||

భ్రాత్రా విభీషణేన -
తమ్ముడగు విభీషణుని చేత
మమ నిర్యాతనం ప్రతి -
నన్ను రామునకు అప్పగించవలను అని
ప్రయత్నేన అనునీతః -
ప్రయత్నము చేయబడుచున్నది
తత్ మతిం న కురుతే -
అది రావణుని బుద్ధిలోకి రాలేదు

||శ్లోకతాత్పర్యము||

"తమ్ముడగు విభీషణుడు నన్ను రామునకు అప్పగించవలనను ప్రయత్నములో ఉన్నవాడు. అది రావణుని బుద్ధిలోకి రాలేదు". ||37.09||

విభీషణుడు చెప్పాడు అన్నమాట ముందు జరగబోయే కథకు బీజములాంటిది. హనుమ అందరి గృహాలు కాల్చినా విభీషణుని గృహము తాకడు. ఆ తరువాత విభీషణుడు రాముని శరణుకోరడము, విభీషణ పట్టాభిషేకము జరగబోయే ఘట్టాలు.

||శ్లోకము 37.10||

మమ ప్రతి ప్రదానం హి రావణస్య న రోచతే|
రావణం మార్గతే సంఖ్యే మృత్యుః కాలవశం గతమ్||37.10||

స|| మమ ప్రతి ప్రదానం హి రావణస్య న రోచతే | కాలవశం గతం రావణం సంఖ్యే మృత్యుః మార్గతే||

|| శ్లోకార్థములు||

మమ ప్రతి ప్రదానం హి -
నన్నుతిరిగి అప్పగించుట
రావణస్య న రోచతే -
రావణునికి ఇష్టము లేదు
కాలవశం గతం రావణం -
కాలవశమైన రావణుడు
సంఖ్యే మృత్యుః మార్గతే -
యుద్ధములో మృత్యువు కోరుకొనుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"నన్నుతిరిగి అప్పగించుట రావణునికి ఇష్టము లేదు. కాలవశమైన రావణుడు యుద్ధములో మృత్యువు కోరుకొనుచున్నాడు. " ||37.10||

||శ్లోకము 37.11||

జ్యేష్ఠా కన్యాఽనలా నామ విభీషణ సుతా కపే|
తయా మమేద మాఖ్యాతం మాత్రా ప్రహితయా స్వయమ్||37.11||

స|| కపే ఆనలా నామ విభీషణ జ్యేష్టా సుతా కన్యా మాత్రా ప్రహితయా తయా స్వయం మమ ఇదం ఆఖ్యాతం ||

|| శ్లోకార్థములు||

కపే ఆనలా నామ విభీషణ జ్యేష్టా సుతా కన్యా -
ఓ వానరా అనలా అను పేరుగల విభీషణుని జ్యేష్ట
మాత్రా ప్రహితయా - తల్లిచేత పంపించబడి
తయా స్వయం మమ ఇదం ఆఖ్యాతం -
తనే ఇది స్వయముగా చెప్పెను

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరా అనలా అను పేరుగల విభీషణుని కుమార్తె తల్లి ప్రోత్సాహముతో స్వయముగా నాకు ఇది చెప్పెను." ||37.11||

సీతమ్మ ఈ సంగతి ఎలా తెలిసింది అన్నమాట, విభీషణుని కూతురు అనల ద్వారా అని ఇక్కడ సీతమ్మ విశదీకరిస్తుంది. ఇందులో "మాత్రా ప్రహితయ స్వయా" అంటూ అనల తల్లిని కూడా కలపడమైనది. అంటే విభీషణుని కుటుంబం అంతా ఈ విషయములో ఏకత్రమై ఉన్నారని ధ్వని. విభీషణుడు రావణుని కోవకి చెందిన వాడు కాడని త్రిజట స్వప్నములో కూడా సూచించడమైనది.

||శ్లోకము 37.12||

అసంశయం హరిశ్రేష్ఠ క్షిప్రం మాం ప్రాప్స్యతే పతిః|
అంతరాత్మా హి మే శుద్ధః తస్మిం శ్చ బహవో గుణాః||37.12||

స|| హరిశ్రేష్ఠ పతిః క్షిప్రం మాం అసంశయం ప్రాప్స్యతి| మే అంతరాత్మాచ శుద్ధః తస్మింశ్చ బహవః గుణాః |

రామ టీకాలో - హి యతః మే అన్తరాత్మా శుద్ధః తస్మిన్ రామే చ బహవో గుణాః అతః పతిః రామః క్షిప్రం సంప్రాప్స్యతే।

|| శ్లోకార్థములు||

హరిశ్రేష్ఠ - ఓ వానరశ్రేష్ఠుడా
పతిః క్షిప్రం మాం అసంశయం ప్రాప్స్యతి -
నా పతి తప్పక నన్ను చేరుకొనును
మే శుద్ధః అంతరాత్మాచ -
నా పవిత్రమైన అంతరాత్మ
తస్మింశ్చ బహవః గుణాః -
ఆయనలోని లోని అనేకమైన గుణములను ఎరుగును.

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరశ్రేష్ఠుడా ! నాపతి తప్పక నన్ను చేరుకొనును. నా పవిత్రమైన అంతరాత్మ, రామునిలోని అనేకమైన గుణములను ఎరుగును." ||37.12||

||శ్లోకము 37.13||

ఉత్సాహః పౌరుషం సత్త్వ మానృశంస్యం కృతజ్ఞతా|
విక్రమశ్చ ప్రభావశ్చ సంతి వానర రాఘవే ||37.13||

స|| వానర రాఘవే ఉత్సాహః పౌరుషం సత్త్వం అనృశంస్యం కృతజ్ఞతా విక్రమశ్చ ప్రభవశ్చ సంతి ||

|| శ్లోకార్థములు||

వానర రాఘవే - ఓ వానరా ! రాఘవునిలో
ఉత్సాహః పౌరుషం సత్త్వం -
ఉత్సాహము పౌరుషము సత్త్వము
అనృశంస్యం కృతజ్ఞతా -
ధైర్యసాహసములు కృతజ్ఞత
విక్రమశ్చ ప్రభవశ్చ సంతి -
పరాక్రమము సౌజన్యము కలవు

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరా ! రాఘవునిలో ఉత్సాహము పౌరుషము సత్త్వము ధైర్యసాహసములు కృతజ్ఞత పరాక్రమము సౌజన్యము కలవు. " ||37.13||

||శ్లోకము 37.14||

చతుర్దశ సహస్రాణి రాక్షసానాం జఘాన యః|
జనస్థానే వినా భ్రాత్రా శత్రుః కః తస్య నో ద్విజేత్||37.14||

స|| యః జనస్థానే వినా భ్రాత్రా చతుర్దశ సహస్రాణి రాక్షసానాం జఘాన తస్య కః శత్రుః నః ద్విజేత్ ||

|| శ్లోకార్థములు||

యః జనస్థానే వినా భ్రాత్రా -
ఎవరు జనస్థానములో తమ్ముని సహాయము లేకుండా
చతుర్దశ సహస్రాణి రాక్షసానాం జఘాన -
పదునాలుగువేల రాక్షసులను హతమార్చెనో
తస్య కః శత్రుః నః ద్విజేత్ -
అట్టి వాడు ఇంక ఎవరిని జయించలేడు

||శ్లోకతాత్పర్యము||

"ఎవరు జనస్థానములో తమ్ముని సహాయము లేకుండా పదునాలుగువేల రాక్షసులను హతమార్చెనో అట్టి వాడు ఇంక ఎవరిని జయించలేడు?" ||37.14||

||శ్లోకము 37.15||

న స శక్య స్తులయితుం వ్యసనైః పురుషర్షభ|
అహం తస్య ప్రభావజ్ఞా శక్రస్యేవ పులోమజా||37.15||

స|| సః పురుషర్షభః వ్యసనైః తులయితుం న శక్యః | పులోమజా శక్రస్యేవ అహం తస్య ప్రభావజ్ఞా||

|| శ్లోకార్థములు||

సః పురుషర్షభః - ఆ పురుషర్షభుడు
వ్యసనైః తులయితుం న శక్యః -
వ్యధలతో కలత చెందడు
పులోమజా శక్రస్యేవ -
పులోమజ ఇంద్రుని ఎరిగి నట్లు
అహం తస్య ప్రభావజ్ఞా -
నాకు ఆయన ప్రభావము తెలుసు

||శ్లోకతాత్పర్యము||

"ఆ పురుషర్షభుడు వ్యధలతో కలత చెందడు. పులోమజ ఇంద్రుని ప్రభావముఎరిగి నట్లు నాకు ఆయన ప్రభావము తెలుసు." ||37.15||

||శ్లోకము 37.16||

శరజాలాంశుమాన్ శూరః కపే రామదివాకరః|
శత్రురక్షోమయం తోయం ఉపశోషం నయిష్యతి||37.16||

స|| కపే శూరః రామ దివాకరః శరజాలాంశుమాన్ శత్రురక్షోమయం తోయం ఉపశోషం నయిష్యతి ||

|| శ్లోకార్థములు||

శూరః రామ - శూరుడైన రాముడు
దివాకరః శరజాలాంశుమాన్ -
సూర్యునికిరణమువంటి శర జాలముతో
శత్రురక్షోమయం తోయం -
శత్రువులైన రాక్షస సమూహములనే జలరాశిని
ఉపశోషం నయిష్యతి - ఎండింపచేస్తాడు

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరా ! శూరుడైన రాముడు సూర్యునికిరణమువంటి శర జాలముతో శత్రువులైన రాక్షస సమూహములనే జలరాశిని ఎండింపచేస్తాడు". ||37.16||

||శ్లోకము 37.17||

ఇతి సంజల్పమానాం తాం రామార్థే శోకకర్షితామ్|
అశ్రుసంపూర్ణనయనాం ఉవాచ వచనం కపిః||37.17||

స|| ఇతి సంజల్పమానాం రామార్థే శోకకర్శితాం అశ్రు సంపూర్ణనయనాం తాం కపిః (ఇదం) వచనం ఉవాచ||

|| శ్లోకార్థములు||

ఇతి సంజల్పమానాం -
ఈ విధముగా మాట్లాడుచున్న
రామార్థే శోకకర్శితాం -
రాముని కొఱకై శోకములో మునిగియున్న
అశ్రు సంపూర్ణనయనాం -
అశ్రువులతో నిండిన కళ్ళు గల
తాం కపిః (ఇదం) వచనం ఉవాచ -
ఆ సీతతో ఆ వానరుడు ఇట్లు పలికెను.

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఈ విధముగా మాట్లాడుచున్న, రాముని కొఱకై శోకములో మునిగియున్న అశ్రువులతో నిండిన కళ్ళు గల ఆ సీతతో ఆ వానరుడు ఇట్లు పలికెను." ||37.17||

||శ్లోకము 37.18||

శ్రుత్వైవతు వచో మహ్యం క్షిప్ర మేష్యతి రాఘవః|
చమూం ప్రకర్షన్మహతీం హర్యృక్షగణసంకులామ్||37.18||

స|| రాఘవః శ్రుత్వైవతు మహ్యం వచః క్షిప్రం ఏష్యతి చమూం ప్రకర్షన్ మహతీం హర్యక్షుగణసంకులాం ||

|| శ్లోకార్థములు||

రాఘవః శ్రుత్వైవతు మహ్యం వచః -
రాఘవుడు నా మాటలు వినగానే
హర్యక్షుగణసంకులాం -
భల్లూక వానర గణములతో కూడిన
చమూం ప్రకర్షన్ మహతీం -
మహత్తరమైన సైన్యముతో
క్షిప్రం ఏష్యతి - వెంటనే వచ్చును

||శ్లోకతాత్పర్యము||

"రాఘవుడు నా మాటలు వినగానే భల్లూక వానర గణములతో కూడిన మహత్తరమైన సైన్యముతో వెంటనే వచ్చును." ||37.18||

||శ్లోకము 37.19||

అథవా మోచయిష్యామి త్వాం అద్యైవ వరాననే|
అస్మాత్ దుఃఖాత్ ఉపారోహ మమ పృష్ఠమనిందితే||37.19||

స|| వరాననే అథవా అద్యైవ త్వాం అస్మాత్ దుఃఖాత్ మోచయిష్యామి | అనిందితే మమ పృష్టం ఉపారోహ||

|| శ్లోకార్థములు||

వరాననే అథవా - ఓ వరాననా
అద్యైవ త్వాం అస్మాత్ దుఃఖాత్ మోచయిష్యామి -
ఈ దినమే నిన్ను ఈ దుఃఖమునుంచి విడుదల చేయగలను
అనిందితే మమ పృష్టం ఉపారోహ-
పూజ్యురాలా నా వీపును అధిరోహించుము

||శ్లోకతాత్పర్యము

"ఓ వరాననా, ఈ దినమే నిన్ను ఈ దుఃఖమునుంచి విడుదల చేయగలను. పూజ్యురాలా నా వీపును అధిరోహించుము ." ||37.19||

||శ్లోకము 37.20||

త్వాం హి పృష్ఠగతాం కృత్వా సంతరిష్యామి సాగరమ్|
శక్తి రస్తిహి మే వోఢుం లంకా మపి స రావణమ్||37.20||

స|| త్వాం పృష్ఠగతాం కృత్వా సాగరం సంతరిష్యామి | మే సరావణం లంకాం అపి వోఢుం శక్తిః అస్తి హి||

|| శ్లోకార్థములు||

త్వాం పృష్ఠగతాం కృత్వా -
నిన్ను నా వీపుపై కూర్చోబెట్టుకొని
సాగరం సంతరిష్యామి -
సాగరమును దాటెదను
మే సరావణం లంకాం అపి -
నాకు రావణునితో కూడిన లంకనుకూడా
వోఢుం శక్తిః అస్తి హి -
తీసుకుపోగల శక్తి వున్నది

||శ్లోకతాత్పర్యము||

"నిన్ను నా వీపుపై కూర్చోబెట్టుకొని సాగరమును దాటెదను. నాకు రావణునితో కూడిన లంకనుకూడా పెకలించి తీసుకుపోగల శక్తి వున్నది." ||37.20||

||శ్లోకము 37.21||

అహం ప్రస్రవణ స్థాయ రాఘవాయాద్య మైథిలి|
ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుత మివానలః||37.21||

స|| మైథిలి అనలః హుతం హవ్యం శక్రాయ అహం ప్రస్రవణస్థాయ అద్యైవ ప్రాపయిష్యామి ||

|| శ్లోకార్థములు||

మైథిలి - ఓ మైథిలీ
అనలః హుతం హవ్యం శక్రాయ -
అగ్ని ఇంద్రునకు హవ్యము (తీసుకుపోవునట్లు)
అహం ప్రస్రవణస్థాయ -
నేను ప్రశ్రవణ పర్వతముపై నున్నవాని వద్దకు
అద్యైవ ప్రాపయిష్యామి - ఈ దినమే చేర్చగలను

||శ్లోకతాత్పర్యము||

"ఓ మైథిలీ అగ్ని ఇంద్రునకు హవ్యము తీసుకుపోవునట్లు నేను నిన్ను ప్రశ్రవణ పర్వతముపై నున్నవాని వద్దకు ఈ దినమే చేర్చగలను." ||37.21||

||శ్లోకము 37.22||

ద్రక్ష స్యద్యైవ వైదేహి రాఘవం సహ లక్ష్మణమ్|
వ్యవసాయ సమాయుక్తం విష్ణుం దైత్యవథే యథా||37.22||

స|| వైదేహి దైత్య వధే వ్యవసాయ సమాయుక్తం విష్ణుం యథా సహలక్ష్మణం రాఘవం అద్యైవ ద్రక్ష్యసి ||

రామ టీకాలో - దైత్య వధే వ్యవసాయసగాయుక్తం ఉత్సాహ సహితం విష్ణుం ఇవ తవ దర్శనే కృతః ఉత్సాహో యేన తం గిరిరాజస్య మూర్ధని ఆసీనం పురన్దరమివ ఆశ్రమస్థం రాఘవం అద్యైవ ద్రక్ష్యసి।

|| శ్లోకార్థములు||

వైదేహి - ఓ వైదేహీ
దైత్య వధే వ్యవసాయ సమాయుక్తం-
దైత్యులవధకు అన్నివిధములుగా సంసిద్ధుడైన
విష్ణుం యథా - విష్ణువు వలె
సహలక్ష్మణం రాఘవం అద్యైవ ద్రక్ష్యసి -
లక్ష్మణునితో కూడిన రాముని ఈ దినమే చూచెదవు.

||శ్లోకతాత్పర్యము||

" ఓ వైదేహీ దైత్యులవధకు సంసిద్ధుడైన విష్ణువు వలె లక్ష్మణునితో కూడిన రాముని ఈ దినమే చూచెదవు." ||37.22||

||శ్లోకము 37.23||

త్వద్దర్శనకృతోత్సాహమాశ్రమస్థం మహాబలమ్|
పురందర మివాసీనం నాగరాజస్య మూర్థని||37.23||

స|| త్వద్దర్శన కృతోత్సాహం ఆశ్రమస్థం మహాబలం నాగరాజస్య మూర్ధని ఆసీనం పురందరమ్ ఇవ ||

|| శ్లోకార్థములు||

నాగరాజస్య మూర్ధని ఆసీనం పురందరమ్ ఇవ -
ఐరావతము పై నున్న పురందరుని వలె
ఆశ్రమస్థం మహాబలం -
ఆశ్రమములో నున్న మహాబలవంతులు
త్వద్దర్శన కృతోత్సాహం -
నీదర్శనముకై ఉత్సాహముతో (వున్నవారు)
(అద్యైవ ద్రక్ష్యసి - ఈ దినమే చూచెదవు)

||శ్లోకతాత్పర్యము||

" ఐరావతము పై నున్న పురందరుని వలె నీదర్శనముకై ఉత్సాహముతో వారు ఆశ్రమములో నున్న వారు ( అట్టి వారిని ఈ దినమే చూచెదవు) ".||37.23||

||శ్లోకము 37.24||

పృష్ఠమారోహ మేదేవీ మా వికాంక్షస్వ శోభనే|
యోగమన్విచ్ఛ రామేణ శశాంకే నేవ రోహిణీ||37.24||

స|| దేవీ మమ పృష్టం ఆరోహ| శోభనే మా వికాంక్షస్వ | రోహిణీ శశాంకేనైవ (త్వం) రామేణ యోగం అన్విచ్ఛ||

|| శ్లోకార్థములు||

దేవీ మమ పృష్టం ఆరోహ -
ఓ దేవీ నా పృష్ఠము ఆరోహించుము
శోభనే మా వికాంక్షస్వ -
ఓ శోభనే సంకోచము వలదు
రోహిణీ శశాంకేనైవ (త్వం)
రామేణ యోగం అన్విచ్ఛ-
రోహిణి శశాంకుని పొందినట్లు నీవు రామునిపొందుటకు కృతనిశ్చయురాలివి కమ్ము

||శ్లోకతాత్పర్యము||

"ఓ దేవీ నా పృష్ఠము ఆరోహించుము. ఓ శోభనే సంకోచము వలదు. రోహిణి శశాంకుని పొందినట్లు నీవు రాముని పొందుటకు కృతనిశ్చయురాలివి కమ్ము." ||37.24||

||శ్లోకము 37.25||

కథయంతీవ చంద్రేణ సూర్యేణ చ మహార్చిషా|
మత్పృష్ఠమధిరుహ్య త్వం తరాఽఽకాశమహార్ణవౌ||37.25||

స|| త్వం మత్ పృష్ఠం అధిరుహ్య చంద్రేణ మహార్చిషా సూర్యేణ కథయంతీవ ఆకాశ మహార్ణవౌ తర||

|| శ్లోకార్థములు||

మత్ పృష్ఠం అధిరుహ్య -
నీవు నా పృష్ఠము ఆరోహించి
చంద్రేణ మహార్చిషా సూర్యేణ కథయంతీవ -
చంద్రుడు సూర్యులతో సంభాషించునట్లు
ఆకాశ త్వం మహార్ణవౌ తర -
ఆకాశమార్గములో పయనిస్తూ మహాసముద్రమును దాటుము

||శ్లోకతాత్పర్యము||

"నీవు నా పృష్ఠము ఆరోహించి చంద్రుడు సూర్యులతో సంభాషించునట్లు ఆకాశమార్గములో పయనిస్తూ మహాసముద్రమును దాటుము." ||37.25||

||శ్లోకము 37.26||

న హి మే సంప్రయాతస్య త్వా మితో నయతో అంగనే|
అనుగంతుం గతిం శక్తా స్సర్వే లంకానివాసినః ||37.26||

స|| అంగనే త్వాం ఇతః నయతః సంప్రయాతస్య మే గతిం అనుగంతుం సర్వే లంకానివాసినః న శక్తాః ||

|| శ్లోకార్థములు||

అంగనే త్వాం ఇతః నయతః -
ఓ దేవీ నిన్ను ఇచటి నుంచి తీసుకుపోవునప్పుడు
సంప్రయాతస్య మే గతిం అనుగంతుం -
పోవుచున్న నా వేగమును అనుసరించగల
సర్వే లంకానివాసినః న శక్తాః-
లంకావాసులకు శక్తి లేదు

||శ్లోకతాత్పర్యము||

"ఓ దేవీ నిన్ను ఇచటి నుంచి తీసుకు పోవునప్పుడు అనుసరించి రాగల శక్తి కలవారు ఈ లంకానగరములో లేరు." ||37.6||

||శ్లోకము 37.27||

యథైవాహ మిహ ప్రాప్తః తథైవాహమసంశయః|
యాస్యామి పశ్య వైదేహీ త్వాముద్యమ విహాయసమ్||37.27||

స|| వైదేహి యథైవ అహం ఇహ ప్రాప్తస్థః ఏవ అహం త్వాం ఉద్యమ్య యాస్యామి విహాయసం న సంశయమ్||

|| శ్లోకార్థములు||

వైదేహి - వైదేహి
యథైవ అహం ఇహ ప్రాప్తస్థః ఏవ -
నేను ఇక్కడికి వచ్చిన విధముగనే
అహం త్వాం విహాయసం ఉద్యమ్య -
నేను నిన్నుఆకాశమార్గములో తోడ్కొని
యాస్యామి న సంశయమ్ -
అసంశయముగా తీసుకు పోవగలను

||శ్లోకతాత్పర్యము||

"ఓ వైదేహీ నేను ఇక్కడికి వచ్చిన విధముగనే నిన్ను ఆకాశమార్గములో తోడ్కొని అసంశయముగా తీసుకు పోవగలను ". ||37.27||

||శ్లోకము 37.28||

మైథిలీ తు హరిశ్రేష్ఠాత్ శ్రుత్వా వచనమద్భుతమ్|
హర్షవిస్మిత సర్వాంగీ హనుమంత మథాబ్రవీత్||37.28||'

స|| మైథిలీ హరిశ్రేష్ఠాత్ అద్భుతం వచనం శ్రుత్వా హర్ష విస్మిత సర్వాంగీ అథ హనుమంతం అబ్రవీత్ ||

|| శ్లోకార్థములు||

మైథిలీ హరిశ్రేష్ఠాత్ -
మైథిలి వానరశ్రేష్ఠుని
అద్భుతం వచనం శ్రుత్వా -
ఆ అద్భుత వచనములను విని
హర్ష విస్మిత సర్వాంగీ -
సంతోషముతో పులకితురాలై
అథ హనుమంతం అబ్రవీత్ -
హనుమంతునితో ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

"మైథిలి వానరశ్రేష్ఠుని ఆ అద్భుత వచనములను విని సంతోషముతో పులకితురాలై హనుమంతునితో ఇట్లు పలికెను." ||37.28||

||శ్లోకము 37.29||

హనుమన్ దూర మధ్వానం కథం మాం వోఢుమిచ్ఛసి|
తదేవ ఖలు తే మన్యే కపిత్వం హరియూథప||37.29||

స|| హనుమాన్ దూరం అధ్వానం మాం వోఢుం కథం ఇచ్ఛసి | హరియూథప తే కపిత్వం తదేవ ఖలు మన్యే||

|| శ్లోకార్థములు||

హనుమాన్ దూరం అధ్వానం -
ఓ హనుమా నన్ను అంత దూరము
మాం వోఢుం కథం ఇచ్ఛసి -
నన్ను ఎట్లు తీసుకుపోగలవు
హరియూథప తే కపిత్వం -
ఓ వానర సేనానీ నీ వానర లక్షనమునకు
తదేవ ఖలు మన్యే - ఇదే నిదర్శనము

||శ్లోకతాత్పర్యము||

"ఓ హనుమా నన్ను అంత దూరము ఎట్లు తీసుకుపోగలవు. ఓ వానర సేనానీ ఇదే నీ వానర లక్షనమునకు నిదర్శనము." ||37.29||

||శ్లోకము 37.30||

కథం వాల్పశరీరస్త్వం మామితో నేతు మిచ్ఛసి|
సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ||37.30||

స||వానరర్షభ అల్పశరీరః త్వం ఇతః మే భర్తుః మానవేంద్రస్య నేతుం కథం వా ఇచ్ఛసి||

|| శ్లోకార్థములు||

వానరర్షభ అల్పశరీరః త్వం -
ఓ వానరర్షభ ఇంత చిన్న శరీరము కల నీవు
ఇతః మే భర్తుః మానవేంద్రస్య సకాశం -
ఇక్కడినుంచి నా భర్త మానవేంద్రుడు అగు రాముని వద్దకు
నేతుం కథం వా ఇచ్ఛసి - ఎట్లు తీసుకుపోయెదవు?

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరర్షభ ఇంత చిన్న శరీరము కల నీవు నన్ను ఇక్కడినుంచి నా భర్త మానవేంద్రుడు అగు రాముని వద్దకు ఎట్లు తీసుకుపోయెదవు?" ||37.30||

||శ్లోకము 37.31||

సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః|
చింతయామాస లక్ష్మీవాన్నవం పరిభవం కృతమ్||37.31||

స|| హనుమాన్ లక్ష్మీవాన్ మారుతాత్మజః సీతాయాః వచనం శ్రుత్వా నవం పరిభవం కృతం చింతయామాస||

|| శ్లోకార్థములు||

హనుమాన్ లక్ష్మీవాన్ మారుతాత్మజః -
అపరిమిత బలసంపన్నుడూ మారుతాత్మజుడూ అగు హనుమంతుడు
సీతాయాః వచనం శ్రుత్వా -
సీతాదేవి యొక్క మాటలను విని
నవం పరిభవం కృతం -
తనకు ఇది కొత్త పరాభవమని
చింతయామాస - చింతించెను

||శ్లోకతాత్పర్యము||

అపరిమిత బలసంపన్నుడూ మారుతాత్మజుడూ అగు హనుమంతుడు సీతాదేవి యొక్క మాటలను విని తనకు ఇది కొత్త పరాభవమని చింతించెను.

||శ్లోకము 37.32||

న మే జానాతి సత్త్వం వా ప్రభావం వాఽసితేక్షణా|
తస్మాత్ పశ్యతు వైదేహీ యద్రూపం మమ కామతః||37.32||

స|| అసితేక్షణా మే సత్త్వం వా ప్రభవం న జానాతి | తస్మాత్ కామతః మమ యద్రూపం (తత్) వైదేహి పశ్యతు ||

|| శ్లోకార్థములు||

అసితేక్షణా మే సత్త్వం వా -
ఈ అసితేక్షణకి నా శక్తి గాని
ప్రభవం న జానాతి -
ప్రభావము గాని తెలియదు
తస్మాత్ కామతః మమ యద్రూపం -
అందువలన నేను పోందగల రూపము
(తత్) వైదేహి పశ్యతు - ఈ వైదేహికి చూపెదను.

||శ్లోకతాత్పర్యము||

" ఈ అసితేక్షణకి నా ప్రభావము శక్తి తెలియదు. అందువలన నేను పోందగల రూపము ఈ వైదేహికి చూపెదను." ||37.32||

||శ్లోకము 37.33||

ఇతి సంచిత్య హనుమాంస్తదా ప్లవగసత్తమః|
దర్శయామాస వైదేహ్యాః స్వరూప మరిమర్దనః||37.33||

స|| ఇతి సంచిత్య తదా ప్లవగసత్తమః హనుమాన్ అరిమర్దనః వైదేహ్యాః స్వరూపం దర్శయామాస||

|| శ్లోకార్థములు||

ఇతి సంచిత్య తదా అరిమర్దనః -
ఈ విధముగా అలోచించి అప్పుడు శత్రువులను మర్దించగల
ప్లవగసత్తమః హనుమాన్ -
ప్లవగోత్తముడు హనుమ
వైదేహ్యాః స్వరూపం దర్శయామాస -
వైదేహికి తన నిజ స్వరూపము చూపసాగెను

||శ్లోకతాత్పర్యము||

"ఈ విధముగా అలోచించి అప్పుడు శత్రువులను మర్దించగల ప్లవగోత్తముడు వైదేహికి తన నిజ స్వరూపము చూపసాగెను." ||37.33||

ఇక్కడ సీతమ్మకి హనుమంతుడు తన నిజస్వరూపము చూపిస్తున్నప్పుడు, మనము కూడా హనుమంతుని నిజస్వరూపము చూస్తాము. సీతమాటలతో హనుమ పరాభవించబడినట్లు అనుకుంటాడు. ఆ మాటలకి హనుమ అహంకారపూరితుడై క్రోధావేశముతో అనేక మాటలు చెప్పివుండవచ్చు. కాని మనము చూచినది హనుమంతుని నిరహంకార స్వరూపము. అది ఆచార్య స్వరూపము. ఆచార్యుడి గుణములలో నిరహంకార స్వరూపము ఒక ముఖ్య గుణము

||శ్లోకము 37.34||

స తస్మాత్పాదపాద్ధీమానాప్లుత్య ప్లవగర్షభః|
తతో వర్థితు మారేభే సీతాప్రత్యయకారణాత్||37.34||'

స|| ధీమాన్ ప్లవగర్షభః సః తస్మాత్ పాదపాత్ ఆప్లుత్య తతః సీతాప్రత్యయకారణాత్ వర్ధితుం ఆరేభే||

|| శ్లోకార్థములు||

ధీమాన్ ప్లవగర్షభః సః -
ధీమంతుడైన వానరుడు
తస్మాత్ పాదపాత్ ఆప్లుత్య -
ఆ వృక్షమునుండి పక్కకు జరిగి
తతః సీతాప్రత్యయకారణాత్ -
సీత యొక్క నమ్మకము పెంపొందించుటకై
వర్ధితుం ఆరేభే -
శరీర ప్రమాణము పెంచసాగెను

||శ్లోకతాత్పర్యము||

"ధీమంతుడైన వానరుడు ఆ వృక్షమునుండి పక్కకు జరిగి సీత యొక్క నమ్మకము పెంపొందించుటకై తన శరీర ప్రమాణము పెంచసాగెను" ||37.34||

||శ్లోకము 37.35||

మేరుమందర సంకాశో బభౌ దీప్తానలప్రభః|
అగ్రతో వ్యవతస్థే చ సీతాయా వానరోత్తమః||37.35||

స|| వానరోత్తమః మేరుమందరసంకాసః దీప్తానలప్రభః బభౌ | సీతాయాః అగ్రత్ః వ్యవతస్థే||

|| శ్లోకార్థములు||

వానరోత్తమః మేరుమందర సంకాసః -
ఆవానరుడు మేరు మందరపర్వత సమానముగా
దీప్తానలప్రభః బభౌ -
ప్రజ్వలిస్తున్న అగ్నితో సమానమైన తేజస్సు కలవాడై
సీతాయాః అగ్రత్ః వ్యవతస్థే -
సీతా దేవి ముందర నిలచెను

||శ్లోకతాత్పర్యము||

"ఆవానరుడు మేరు మందరపర్వత సమానముగా ప్రజ్వలిస్తున్న అగ్నితో సమానమైన తేజస్సు కలవాడయ్యెను. అప్పుడు సీతా దేవి ముందర నిలచెను." ||37.35||

||శ్లోకము 37.36||

హరిః పర్వత సంకాశః తామ్ర వక్త్రో మహాబలః|
వజ్రదంష్ట్రో నఖో భీమో వైదేహీం ఇదమబ్రవీత్||37.36||

స|| పర్వత సంకాశః తామ్రవక్త్రః మహాబలః వజ్రదంష్ట్ర నఖః భీమః హరిః వైదేహీం ఇదం అబ్రవీత్ ||

|| శ్లోకార్థములు||

పర్వత సంకాశః -
అప్పుడు పర్వతముతో సమానమైన రూపము గల
తామ్రవక్త్రః మహాబలః -
ఎర్రని ముఖముకల మహాబలవంతుడు
వజ్రదంష్ట్ర నఖః భీమః హరిః -
వజ్రమువంటి దంతములు నఖములు కల భయము కలగించు రూపము గల వానరుడు
వైదేహీం ఇదం అబ్రవీత్ -
వైదేహి తో ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు పర్వతముతో సమానమైన రూపము గల ఎర్రని ముఖముకల వజ్రమువంటి దంతములు నఖములు కల భయము కలగించు రూపము గల మహాబలుడు అగు ఆ హనుమానుడు వైదేహి తో ఇట్లు పలికెను."||37.36||

||శ్లోకము 37.37||

సపర్వతవనోద్దేశాం సాట్టప్రాకార తోరణామ్|
లంకా మిమాం స నాధాం వా నయితుం శక్తి రస్తి మే||37.37||

స|| సపర్వతవనోద్దేశాం సాట్టప్రాకారతోరణామ్ సనాథం ఇమామ్ లంకాం నయితుం మే శక్తిః అస్తి ||

|| శ్లోకార్థములు||

సపర్వతవనోద్దేశాం -
ఈ పర్వతములు వనములు కల
సాట్టప్రాకారతోరణామ్ -
కోటబురుజులు ప్రాకారములు గల
సనాథం ఇమామ్ లంకాం -
ఈ లంకను దాని ప్రభువుతో సహా పెకలించి
నయితుం మే శక్తిః అస్తి -
తీసుకు పోవు శక్తి నాలో కలదు

||శ్లోకతాత్పర్యము||

"ఈ పర్వతములు వనములు కల కోటబురుజులు ప్రాకారములు గల ఈ లంకను దాని ప్రభువుతో సహా పెకలించి తీసుకు పోవు శక్తి నాలో కలదు." ||37.37||

||శ్లోకము 37.38||

తదవస్థాప్యతాం బుద్ధి రలం దేవి వికాంక్షయా|
విశోకం కురు వైదేహి రాఘవం సహ లక్ష్మణమ్||37.38||

స|| దేవి తత్ వికాంక్షస్వ అలం బుద్ధిః అవస్థాప్యతామ్ | వైదేహి సహలక్ష్మణం రాఘవం విశోకం కురు ||

|| శ్లోకార్థములు||

దేవి తత్ వికాంక్షస్వ -
ఓ దేవీ! నీ శంకలను వీడుము
అలం బుద్ధిః అవస్థాప్యతామ్ -
నీ మనస్సును కుదుటపరచుకొనుము
వైదేహి సహలక్ష్మణం రాఘవం విశోకం కురు -
ఓ వైదేహీ! లక్ష్మణుని తో కూడిన రాముని శోకములేని వాడిగా చేయుము

||శ్లోకతాత్పర్యము||

"ఓ దేవీ! నీ శంకలను వీడుము. నీ మనస్సును కుదుటపరచుకొనుము. ఓ వైదేహీ! లక్ష్మణుని తో కూడిన రాముని శోకములేని వాడిగా చేయుము". ||37.38||

||శ్లోకము 37.39||

తం దృష్ట్వా భీమసంకాశం ఉవాచ జనకాత్మజా|
పద్మపత్రవిశాలాక్షీ మారుత స్యౌరసం సుతం||37.39||

స|| పద్మపత్రవిశాలాక్షి జనకాత్మజా తం భీమసంకాసం మారుతస్య ఔరసం సుతం దృష్ట్వా ఉవాచ||

|| శ్లోకార్థములు||

పద్మపత్రవిశాలాక్షి జనకాత్మజా -
పద్మపత్రములవంటి విశాలమైన కన్నులు గల జనకాత్మజ
తం భీమసంకాసం -
ఆ భయంకరమైన రూపము గల
మారుతస్య ఔరసం సుతం దృష్ట్వా -
మారుతియొక్క ఔరసపుత్రుని చూచి
ఉవాచ - ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

"పద్మపత్రములవంటి విశాలమైన కన్నులు గల జనకాత్మజ సీత ఆ భయంకరమైన రూపము గల మారుతియొక్క ఔరసపుత్రుని చూచి ఇట్లు పలికెను." ||37.39||

||శ్లోకము 37.40||

తవసత్వం బలం చైవ విజానామి మహాకపే|
వాయోరివ గతిం చైవ తేజశ్చాగ్నేరివాద్భుతమ్||37.40||

స|| మహాకపే తవ సత్త్వం బలం చైవ వాయోరివ గతిం ఆగ్నేరివ అద్భుతం తేజః చ విజానామి ||

|| శ్లోకార్థములు||

మహాకపే తవ సత్త్వం బలం -
ఓ మహాకపి నీ బలము సత్త్వము
చైవ వాయోరివ గతిం -
వాయువు వలె కల నీ వేగము
ఆగ్నేరివ అద్భుతం తేజః చ -
అగ్నివలె కల నీ అద్భుత తేజము
విజానామి - తెలిసికొనుచున్నాను

||శ్లోకతాత్పర్యము||

"ఓ మహాకపి నీ బలము సత్త్వము వాయువు వలె కల నీ వేగము అగ్నివలె కల నీ అద్భుత తేజము తెలిసికొనుచున్నాను." ||37.40||

||శ్లోకము 37.41||

ప్రాకృతోఽన్యః కథం చేమాం భూమి మాగంతు మర్హతి|
ఉదధే రప్రమేయస్య పారం వానరపుంగవ||37.41||

స || వానరపుంగవ ప్రాకృతః అన్యః అప్రమేయస్య ఉదధేః పారం ఇమాం భూమిం ఆగంతుం కథం అర్హతి|

|| శ్లోకార్థములు||

వానరపుంగవ - ఓ వానరపుంగవ
ప్రాకృతః అప్రమేయస్య ఉదధేః పారం -
ఈ ఊహకు అందని అప్రమేయమైన సాగరమును దాటి
ఇమాం భూమిం ఆగంతుం - ఈ భూమికి రాగల
అన్యః కథం అర్హతి - శక్తి ఏవరికి ఉండును

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరపుంగవ !ఈ ఊహకు అందని అప్రమేయమైన సాగరమును దాటి ఈ భూమికి రాగల శక్తి ఏవరికి ఉండును." ||37.41||

||శ్లోకము 37.42||

జానామి గమనే శక్తిం నయనే చాపి తే మమ|
అవశ్యం సంప్రధా ర్యాశు కార్యసిద్ధి ర్మహాత్మనః||37.42||

స|| గమనే మమ నయనే చ అపి శక్తిం జానామి | మహాత్మనః కార్యసిద్ధి అవశ్యం ఆశు సంప్రధార్యా ||

|| శ్లోకార్థములు||

గమనే మమ నయనే చ అపి -
నన్ను తీసుకు వెళ్ళగల
శక్తిం జానామి -
శక్తి (వున్నదని) తెలిసికొనుచున్నాను
మహాత్మనః - మహాత్ములు
కార్యసిద్ధి అవశ్యం ఆశు సంప్రధార్యా -
అలోచించి తప్పక కార్యసిద్ధిని పొందెదరు.

||శ్లోకతాత్పర్యము||

"నన్ను తీసుకు వెళ్ళగల శక్తి నీకు వున్నదని తెలిసికొనుచున్నాను. మహాత్ములు అలోచించి తప్పక కార్యసిద్ధిని పొందెదరు." ||37.42||

||శ్లోకము 37.43||

అయుక్తం తు కపిశ్రేష్ఠ మమ గంతుం త్వయాఽనఘ|
వాయువేగ సవేగస్య వేగో మాం మోహయేత్తవ||37.43||'

స|| అనఘ కపిశ్రేష్ఠ త్వయా మమ గంతుం అయుక్తం | వాయువేగ సవేగస్య తవ వేగః మామ్ మోహయేత్ ||

|| శ్లోకార్థములు||

అనఘ కపిశ్రేష్ఠ - ఓ కపిశ్రేష్ఠా అనఘా
త్వయా మమ గంతుం అయుక్తం -
నీతో వెళ్ళుట యుక్తము కాదు
వాయువేగ సవేగస్య తవ వేగః -
వాయువేగము కల నీ వేగముతో
మామ్ మోహయేత్ -
నాకు స్పృహ పోవచ్చును

||శ్లోకతాత్పర్యము||

"ఓ కపిశ్రేష్ఠా అనఘా! నీతో వెళ్ళుట యుక్తము కాదు. వాయువేగము కల నీ వేగముతో నాకు స్పృహ పోవచ్చును." ||37.43||

||శ్లోకము 37.44||

అహమాకాశ మాపన్నా హ్యుపర్యుపరి సాగరమ్|
ప్రపతేయం హి తే పృష్ఠాద్భయాద్వేగేన గచ్ఛతః||37.44||

స|| సాగరస్య ఉపరి ఆకాశం అహం వేగేన గచ్ఛతః తే పృష్టాత్ భయాత్ ఆపన్నా ప్రపతేయం||

|| శ్లోకార్థములు||

సాగరస్య ఉపరి ఆకాశం -
సాగరము పై ఆకాశములో
అహం వేగేన గచ్ఛతః -
నేను వేగముగా పోవుచూ
తే పృష్టాత్ భయాత్ -
నీ పృష్ఠమునుంచి భయముతో
ఆపన్నా ప్రపతేయం -
పడిపోవచ్చును.

||శ్లోకతాత్పర్యము||

"సాగరము పై ఆకాశములో వేగముగా పోవుచూ నీ పృష్ఠమునుంచి భయముతో పడిపోవచ్చును. " ||37.44||

||శ్లోకము 37.45||

పతితా సాగరే చాహం తిమినక్రఝుషాకులే|
భవేయ మాశు వివశా యాదసామన్నముత్తమమ్||37.45||

స|| తిమినక్రఝషాకులే సాగరే పతితా అహం వివశా ఆశు యాదసాం ఉత్తమం అన్నం భవేయం||

|| శ్లోకార్థములు||

తిమినక్రఝషాకులే సాగరే పతితా -
తిమిరములు మొసళ్ళతో నుండు సాగరములోపడి
అహం వివశా ఆశు -
నేను వివశురాలనై వెంటనే
యాదసాం ఉత్తమం అన్నం భవేయం -
ఆ జలచరములకు ఉత్తమమైన అన్నము అయిపోదును

||శ్లోకతాత్పర్యము||

"తిమిరములు మొసళ్ళతో నుండు సాగరములోపడి ఆ జలచరములకు ఉత్తమమైన అన్నము అయిపోదును". ||37.45||

||శ్లోకము 37.46||

న చ శక్ష్యే త్వయా సార్థం గంతుం శత్రువినాశన|
కళత్రవతి సందేహః త్వయ్యపి స్యాదసంశయః||37.46||

స|| హే శత్రువినాశన త్వయా సార్థం గంతుం న శక్ష్యే చ కళత్రవతి త్వయ్యపి సందేహః స్యాత్ అసంశయః||

గోవిన్దరాజులవారి టీకాలో- కళత్రవతీ రక్ష్యవతి త్వయి సన్దేహః స్యాత్। మమ రక్ష్యాయాం త్వయి విపత్ సన్దేహః స్యాత్ ఇత్యర్థః॥

|| శ్లోకార్థములు||

హే శత్రువినాశన -
ఓ శత్రువులను వినాశనము చేయువాడా
త్వయా సార్థం గంతుం న శక్ష్యే చ -
నీతో కూడా వచ్చుట మంచిది కాదు
కళత్రవతి త్వయ్యపి సందేహః స్యాత్ -
కళత్రవతిని అగు నన్నుతీసుకుపోవుటలో నీకు మొప్పు కలగవచ్చు
అసంశయః - అసంశయముగా

||శ్లోకతాత్పర్యము||

"ఓ శత్రువులను వినాశనము చేయువాడా! నీతో వచ్చుట మంచిది కాదు. కళత్రవతిని అగు నన్నుతీసుకుపోవుటలో నీకు మొప్పు కలగవచ్చు." ||37.46||

||శ్లోకము 37.47||

హ్రియమాణాం తు మాం దృష్ట్వా రాక్షసా భీమవిక్రమాః|
అనుగచ్ఛేయు రాదిష్టా రావణేన దురాత్మనా||37.47||

స|| హ్రియమాణాం మాం దృష్ట్వా భీమవిక్రమాః రాక్షసాః దురాత్మనా రావణేన ఆదిష్టాః అనుగచ్ఛేయుః ||

|| శ్లోకార్థములు||

హ్రియమాణాం మాం దృష్ట్వా -
తీసుకుపోబడుతున్న నన్ను చూచి
భీమవిక్రమాః రాక్షసాః -
భయంకరమైన పరాక్రమము కల రాక్షసులు
దురాత్మనా రావణేన ఆదిష్టాః -
దురాత్ముడైన రావణునిచేత ఆజ్ఞాపింపబడిన వారై
అనుగచ్ఛేయుః -
నిన్ను అనుసరించెదరు

||శ్లోకతాత్పర్యము||

"తీసుకుపోబడుతున్న నన్ను చూచి భయంకరమైన పరాక్రమము కల రాక్షసులు దురాత్ముడైన రావణునిచేత ఆజ్ఞాపింపబడిన వారై నిన్ను అనుసరించెదరు." ||37.47||

||శ్లోకము 37.48||

తైస్త్వం పరివృత శ్శూరైః శూల ముద్గర పాణిభిః|
భవేస్త్వం సంశయం ప్రాప్తో మయా వీర కళత్రవాన్||37.48||

స|| త్వం శూలముద్గరపాణిభిః తైః శూరైః పరివృతః వీర మయా కళత్రవాన్ త్వం సంశయం ప్రాప్తః భవేః||

|| శ్లోకార్థములు||

శూలముద్గరపాణిభిః తైః శూరైః పరివృతః -
శూలములు ముద్గరములు చేతిలో పట్టుకొని వున్న ఆశూరులచేత చుట్టబడి
వీర కళత్రవాన్ మయా -
ఓ వీరుడా స్త్రీ నైన నా రక్షణలొ
త్వం సంశయం ప్రాప్తః భవేః -
నీవు సంశయములో పడెదెవు

||శ్లోకతాత్పర్యము||

"ఓ వీరుడా శూలములు ముద్గరములు చేతిలో పట్టుకొని వున్న ఆశూరులచేత చుట్టబడి నువ్వు నా రక్షణలో సంశయములో పడెదెవు." ||37.48||

||శ్లోకము 37.49||

సాయుధో బహవో వ్యోమ్ని రాక్షాసాస్త్వం నిరాయుధః|
కథం శక్ష్యసి సంయాతుం మాం చైవ పరిరక్షితుమ్||37.49||

స|| వ్యోమ్ని సాయుధాః రాక్షసాః బహవః త్వం నిరాయుథః సంయాతుం మాం పరిరక్షితుం చ కథం శక్ష్యసి ||

|| శ్లోకార్థములు||

వ్యోమ్ని సాయుధాః రాక్షసాః బహవః -
ఆ ఆకాశములో సాయుధులైన అనేకమంది రాక్షసులతో
త్వం నిరాయుథః -
నువ్వు నిరాయుధవుడుగా
సంయాతుం మాం పరిరక్షితుం చ -
పోరాడుతూ నన్ను రక్షించడము కూడా
కథం శక్ష్యసి - ఎట్లు చేయగలవు

||శ్లోకతాత్పర్యము||

"ఆ ఆకాశములో సాయుధులైన అనేకమంది రాక్షసులతో నువ్వు నిరాయుధవుడుగా వారితో పోరాడుతూ నన్ను రక్షించడము ఎట్లు చేయగలవు." ||37.49||

||శ్లోకము 37.50||

యుధ్యమానస్య రక్షోభిః తవ తైః క్రూరకర్మభిః|
ప్రపతేయం హి తే పృష్ఠాత్ భయార్తా కపిసత్తమ||37.50||

స|| కపిసత్తమః తవ క్రూరకర్మభిః తైః యుధ్యమానస్య భయార్తా తే పృష్ఠాత్ ప్రపతేయం హి ||

|| శ్లోకార్థములు||

కపిసత్తమః -ఓ కపిసత్తమ
క్రూరకర్మభిః తైః యుధ్యమానస్య తవ -
కౄరకర్మలు చేయు రాక్షసులు నీతో యుద్ధము చేయునపుడు
భయార్తా తే పృష్ఠాత్ ప్రపతేయం హి -
భయముతో నేను నీ పృష్ఠమునుంచి పడిపోవచ్చును.

||శ్లోకతాత్పర్యము||

"ఓ కపిసత్తమ కౄరకర్మలు చేయు రాక్షసులు నీతో యుద్ధము చేయునపుడు భయముతో నేను నీ పృష్ఠమునుంచి పడిపోవచ్చును." ||37.50||

||శ్లోకము 37.51||

అథ రక్షాంసి భీమాని మహంతి బలవంతి చ|
కథంచిత్ సాంపరాయే త్వాం జయేయుః కపిసత్తమ||37.51||

స|| కపిసత్తమ అథ భీమాని మహంతి బలవంతి చ రక్షాంసి సాంపరాయే కథంచిత్ త్వం జయేయుః||

|| శ్లోకార్థములు||

కపిసత్తమ - ఓ కపిసత్తమ
అథ భీమాని మహంతి బలవంతి చ రక్షాంసి -
భయంకరులు మహత్తరమైన బలముకల రాక్షసులు
సాంపరాయే కథంచిత్ త్వం జయేయుః -
ఎదో విధముగా నిన్ను జయించవచ్చు

||శ్లోకతాత్పర్యము||

"ఓ కపిసత్తమ ! భయంకరులు మహత్తరమైన బలముకల రాక్షసులు ఎదో విధముగా నిన్ను జయించవచ్చు". ||37.51||

||శ్లోకము 37.52||

అథవా యుధ్యమానస్య పతేయం విముఖస్య తే|
పతితాం చ గృహీత్వా మాం నయేయుః పాపరాక్షసాః||37.52||

స|| అథవా యుధ్యమానస్య తే విముఖస్య పతేయుం పతితాం మామ్ గృహీత్వా పాప రాక్షసాః నయేయుః||

|| శ్లోకార్థములు||

అథవా యుధ్యమానస్య -
లేక యుద్ధములో మునిగియున్న
తే విముఖస్య పతేయుం -
నీకు తెలియకుండా పడిపోవచ్చు
పతితాం మామ్ గృహీత్వా -
పడిపోయిన నన్ను తీసుకొని
పాప రాక్షసాః నయేయుః -
పాపులైన రాక్షసులు పోవచ్చు

||శ్లోకతాత్పర్యము||

"లేక యుద్ధములో మునిగియున్న నీకు తెలియకుండా పడిపోయిన నన్ను పాపులైన రాక్షసులు తీసుకొని పోవచ్చు." ||37.52||

||శ్లోకము 37.53||

మాం వా హరేయు స్త్వద్దస్తాద్విశసేయురథాపి వా|
అవ్యవస్థౌ హి దృశ్యేతే యుద్ధే జయాపరాజయౌ||37.53||

స|| త్వత్ హస్తాత్ మామ్ హరేయుః అథాపి వా విశసేయుః | యుద్ధే జయాపరాజయౌ అవ్యవస్థౌ దృశ్యతే హి||

|| శ్లోకార్థములు||

త్వత్ హస్తాత్ మామ్ -
నీ హస్తములనుంచి నన్ను
హరేయుః అథాపి వా విశసేయుః -
తీసుకొనిపొవచ్చు లేక నన్ను హతమార్చవచ్చు
యుద్ధే జయాపరాజయౌ -
యుద్ధములో జయాపజయములు
అవ్యవస్థౌ దృశ్యతే హి - పరాధీనము కదా.

||శ్లోకతాత్పర్యము||

" నీ హస్తములనుంచి నన్నుతీసుకొనిపొవచ్చు లేక నన్ను హతమార్చవచ్చు. యుద్ధములో జయాపజయములు పరాధీనము కదా. " ||37.53||

||శ్లోకము 37.54||

అహం వాపి విపద్యేయం రక్షోభి రభితర్జితా|
త్వత్ప్రయత్నో హరిశ్రేష్ఠ భవే న్నిష్ఫల ఏవ తు||37.54||

స|| హరిశ్రేష్ఠ రక్షోభిః అభితర్జితా అహం విపద్యేయం వాపి త్వత్ప్రయత్నః నిష్ఫలః ఏవ తు భవేత్ ||

|| శ్లోకార్థములు||

హరిశ్రేష్ఠ రక్షోభిః అభితర్జితా -
ఓ హరిశ్రేష్ఠ! రాక్షసులచేత అవమానమునకు గురి అయి
అహం విపద్యేయం వాపి -
నేను ప్రాణత్యాగము చేసినచో
త్వత్ప్రయత్నః - నీ ప్రయత్నము
నిష్ఫలః ఏవ తు భవేత్ - విఫలము అగును కదా

||శ్లోకతాత్పర్యము||

"ఓ హరిశ్రేష్ఠ! రాక్షసులచేత అవమానమునకు గురి అయి నేను ప్రాణత్యాగము చేసినచో నీ ప్రయత్నము విఫలము అగును కదా". ||37.54||

||శ్లోకము 37.55||

కామం త్వమసి పర్యాప్తో నిహంతుం సర్వరాక్షసాన్ |
రాఘవస్య యశో హీయేత్త్వయా శస్తైస్తు రాక్షసైః||37.55||

స|| త్వం సర్వరక్షసాన్ నిహంతుం పర్యాప్తః అపి కామం త్వయా శస్తై రాక్షసైః రాఘవస్య యశః హీయేత్ ||

|| శ్లోకార్థములు||

త్వం సర్వరక్షసాన్ -
నీవు రాక్షసులనందరినీ
నిహంతుం పర్యాప్తః అపి -
హతమార్చుటకు శక్తి కలవాడివి అయిననూ
కామం త్వయా శస్తై రాక్షసైః -
రాక్షసులు నీచే హతమార్చబడినచో
రాఘవస్య యశః హీయేత్ -
రాముని కీర్తికి భంగము కలుగును

||శ్లోకతాత్పర్యము||

"నీవు రాక్షసులనందరినీ హతమార్చుటకు శక్తి కలవాడివి అయిననూ రాక్షసులు నీచే హతమార్చబడినచో రాముని కీర్తికి భంగము కలుగును. ||37.55||

||శ్లోకము 37.56||

అథవాఽఽదాయా రక్షాంసి న్యసేయు స్సంవృతే హి మామ్|
యత్ర తే నాభిజానీయుర్హరయో నాపి రాఘవౌ||37.56||

స||అథవా రక్షాంసి మాం ఆదాయ యత్ర తే హరయః రాఘవౌ అపి నాభిజానీయుః సంవృతే న్యసేయుః ||

|| శ్లోకార్థములు||

అథవా రక్షాంసి మాం ఆదాయ -
లేక రాక్షసులు నన్ను మరల తీసుకొనిపోయి
యత్ర తే హరయః రాఘవౌ అపి -
ఎక్కడైతే వానరులు రామలక్ష్మణు లకు కూడా
నాభిజానీయుః సంవృతే న్యసేయుః -
తెలియని ప్రదేశములో అక్కడ దాచవచ్చు

||శ్లోకతాత్పర్యము||

"లేక రాక్షసులు నన్ను మరల తీసుకొనిపోయి వానరులు రామలక్ష్మణులకు తెలియని ప్రదేశములో దాచిఉంచవచ్చు." ||37.56||

||శ్లోకము 37.57||

అరంభస్తు మదర్థో యం తతస్తవ నిరర్థకః|
త్వయా హి సహ రామస్య మహానాగమనే గుణః||37.57||

స|| తతః మదర్థః తవ ఆరంభస్తు నిరర్థకః త్వయా సహ రామస్య ఆగమనే మహాన్ గుణః||

|| శ్లోకార్థములు||

తతః మదర్థః తవ ఆరంభస్తు నిరర్థకః -
అప్పుడు నా కోసమై మొదలిడిన కార్యక్రమము భంగపడును
త్వయా సహ రామస్య ఆగమనే -
నీతో కలిసి రాముడు ఇక్కడికి వచ్చుటయే
మహాన్ గుణః -
మహత్తరమైన గుణములు కల పని

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు నా కోసమై మొదలిడిన కార్యక్రమము భంగపడును. నీతో కలిసి రాముడు ఇక్కడికి వచ్చుటయే మహత్తరమైన గుణములు కల పని." ||37.57||

||శ్లోకము 37.58||

మయి జీవిత మాయత్తం రాఘవస్య మహాత్మనః|
భాతౄణాం చ మహాబాహో తవ రాజ కులస్య చ||37.58||

స|| మహాబలే మహాత్మనః రామస్య భ్రాత్రూణాం తవ రాజకులస్య జీవితం మయి ఆయత్తం||

|| శ్లోకార్థములు||

మహాబలే - ఓ మహాబలుడా
మహాత్మనః రామస్య భ్రాత్రూణాం -
మహాత్ముడైన రాముడు ఆయన సోదరులు
తవ రాజకులస్య జీవితం - నీ రాజుల జీవితము
మయి ఆయత్తం - నా జీవితముపై నిలబడి వున్నవి

||శ్లోకతాత్పర్యము||

"ఓ మహాబలుడా ! మహాత్ముడైన రాముడు ఆయన సోదరులు నీ రాజుల జీవితము నా జీవితముపై నిలబడి వున్నవి." ||37.58||

||శ్లోకము 37.59||

తౌ నిరాశౌ మదర్థం తు శోకసంతాపకర్శితౌ|
సహ సర్వర్క్షహరిభిస్త్యక్షతః ప్రాణ సంగ్రహమ్||37.59||

స|| మదర్థం శోకసంతాపకర్శితౌ తౌ నిరాశౌ సర్వర్క్ష హరిభిః ప్రాణసంగ్రహం త్యక్షతః||

|| శ్లోకార్థములు||

మదర్థం శోకసంతాపకర్శితౌ -
నా కోసము శోకసంతాపములలో నున్న
తౌ నిరాశౌ సర్వర్క్ష హరిభిః -
రామలక్ష్మణులు వానరగణములు
ప్రాణసంగ్రహం త్యక్షతః -
నిరాశపడి ప్రాణములు త్యజించవచ్చు

||శ్లోకతాత్పర్యము||

"నా కోసము శోకసంతాపములలో నున్న రామలక్ష్మణులు వానర గణములు నిరాశపడి ప్రాణములు త్యజించవచ్చు".||37.59||

||శ్లోకము 37.60||

భర్తృ భక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానర|
న స్పృశామి శరీరం తు పుంసో వానర పుంగవ||37.60||

స|| వానరపుంగవ భర్తుః భక్తిం పురస్కృత్య రామాత్ అన్యస్య శరీరం తు న స్ప్రుశామి |

|| శ్లోకార్థములు||

వానరపుంగవ - వానరపుంగవా
భర్తుః భక్తిం పురస్కృత్య - భర్తపై భక్తితో
రామాత్ అన్యస్య శరీరం తు -
రాముని తప్ప వేరొకని శరీరమును
న స్పృశామి - స్పృశించను

||శ్లోకతాత్పర్యము||

"వానరపుంగవా! భర్తపై భక్తితో రాముని తప్ప వేరొకని శరీరము స్పృశించను." ||37.60||

||శ్లోకము 37.61||

యదహం గాత్ర సంస్పర్శం రావణస్య బలాద్గతా|
అనీశా కిం కరిష్యామి వినాథా వివశా సతీ ||37.61||

స|| అహం బలాత్ రావణస్య గాత్రసంస్పర్శం గతా యత్ అనీశా వివశా సతీ | వినాథా కిం కరిష్యామి ||

|| శ్లోకార్థములు||

అహం బలాత్ - నేను బలాత్కారముగా
రావణస్య గాత్ర సంస్పర్శం గతా -
రావణుని చే అవయవములు తాకబడినవి.
యత్ అనీశా వివశా సతీ -
అప్పుడు వివశురాలైనప్పుడు
వినాథా కిం కరిష్యామి -
నాధుడులేని నేను ఏమి చేయగలను

||శ్లోకతాత్పర్యము||

" నేను బలాత్కారముగా తీసుకురాబడి వివశురాలైనప్పుడు నా అవయవములు తాకబడినవి. అప్పుడు నాధుడులేని నేను ఏమి చేయగలను." ||37.61||

||శ్లోకము 37.62||

యది రామో దశగ్రీవమిహ హత్వా స బాంధవమ్|
మామితో గృహ్య గచ్ఛేత్తత్తస్య సదృశం భవేత్||37.62||

స|| రామః సబాంధవం దశగ్రీవం ఇహ హత్వా మాం ఇతః గృహ్య గచ్ఛేత్ యది తత్ తస్య సదృశం భవేత్ ||

|| శ్లోకార్థములు||

రామః సబాంధవం దశగ్రీవం ఇహ హత్వా -
రాముడు దశగ్రీవుని బాంధవులతో సహా హతమార్
మాం ఇతః గృహ్య గచ్ఛేత్ యది -
నన్ను ఇక్కడనుంచి తీసుకొని పోవుటయే
తత్ తస్య సదృశం భవేత్ -
రామునకు సముచితముగా నుండును

||శ్లోకతాత్పర్యము||

"రాముడు దశగ్రీవుని బాంధవులతో సహా హతమార్చి నన్ను ఇక్కడనుంచి తీసుకొని పోవుటయే రామునకు సముచితముగా నుండును".||37.62||

ఇక్కడ సీత అన్న మాట - 'తత్ తస్య సదృశం భవేత్'. ఏ విధముగా చూచినా ఈ మాట సీతకే చెల్లు. ఎందుకు ? సీతను రాముడితో క్షణములో హనుమంతుడు చేర్చవచ్చు. కాని భర్తగా రాముడే రావణసంహారము చేసి సీతను బంధములనుంచి విముక్తురాలను చేసి తీసుకుపోవడమే ఆయనకి తగినపని. అది సీత భావన.

రాముడే తీసుకుపోవడము ఉచితమనే భావనలో, తన కష్టకాలము రాముడు వచ్చేదాకా పెరుగుతుంది అనేది చిన్న మాట. సీత భావనలో రాముని కీర్తి ముందర తన కష్టము చిన్నదే .

||శ్లోకము 37.63||

శ్రుతా హి దృష్టా శ్చ మయా పరాక్రమా
మహత్మనస్తస్య రణావిమర్దినః|
స దేవగంధర్వభుజంగరాక్షసా
భవంతి రామేణ సమా హి సంయుగే||37.63||

స|| రణావమర్దినః మహాత్మనః తస్య పరాక్రమాః మయా శ్రుతాః దృష్టాశ్చ సంయుగే| దేవగంధర్వభుజంగరాక్షసాః రామేన సమాః న హి||

|| శ్లోకార్థములు||

రణావమర్దినః మహాత్మనః -
రణములో శత్రువులను మర్దించు మహాత్ముడు
తస్య పరాక్రమాః మయా -
ఆయన పరాక్రమము నా చేత
శ్రుతాః దృష్టాశ్చ సంయుగే -
వినటమే కాక యుద్ధములో చూడడముకూడా అయినది
దేవగంధర్వభుజంగరాక్షసాః -
దేవ గంధర్వ భుజంగ రాక్షసులలో
రామేణ సమాః న హి - ఎవరూ రామునితో సమానులు కారు

||శ్లోకతాత్పర్యము||

"రణములో శత్రువులను మర్దించు మహాత్ముడు రాముని పరాక్రమము వినటమే కాక చూడడముకూడా అయినది. దేవ గంధర్వ భుజంగ రాక్షసులలో ఎవరూ రామునితో సమానులు కారు." ||37.63||

||శ్లోకము 37.64||

సమీక్ష్య తం సంయతి చిత్రకార్ముకమ్
మహాబలం వాసవతుల్యవిక్రమమ్|
స లక్ష్మణం కో విషహేత రాఘవమ్
హూతాశనం దీప్త మివానిలేరితమ్||37.64||

స|| చిత్రకార్ముకం మహాబలం వాసవతుల్యవిక్రమం సలక్ష్మణం అనిలేరితం దీప్తం హుతాసనం ఇవ తం రాఘవం సంయతి సమీక్ష్య కః విషహేతః||

|| శ్లోకార్థములు||

చిత్రకార్ముకం మహాబలం -
చిత్రమైన ధనస్సు ధరించి
వాసవతుల్యవిక్రమం -
ఇంద్రునితో సమానమైన విక్రమము కల
మహాబలం - మహాబలుడు అయిన రాముడు
స లక్ష్మణం - లక్ష్మణునితో కలిసి
అనిలేరితం దీప్తం హుతాసనం ఇవ -
వాయువు తో కలిసి ప్రజ్వరిల్లు అగ్నివలే వుండు
తం రాఘవం సంయతి సమీక్ష్య కః విషహేతః -
రామునితో యుద్ధములో ఎవరు నిలబడగలరు

||శ్లోకతాత్పర్యము||

"వాయువు తో కలిసి ప్రజ్వరిల్లు అగ్నివలే ఉండు , లక్ష్మణునితో కలిసి చిత్రమైన ధనస్సు ధరించి ఇంద్రునితో సమానమైన విక్రమము కల రామునితో యుద్ధములో ఎవరు నిలబడగలరు? " ||37.64||

||శ్లోకము 37.65||

స లక్ష్మణం రాఘవ మాజిమర్దనమ్
దిశాగజం మత్తమివ వ్యవస్థితమ్|
స హేత కో వానరముఖ్య సంయుగే
యుగాంత సూర్యప్రతిమం శరార్చిషమ్||37.65||

స||వానరముఖ్య సలక్ష్మణం ఆజిమర్దనం మత్తం దిశగజం ఇవ వ్యవస్థితం శరార్చిషం యుగాంతసూర్యప్రతిమం రాఘవం సంయుగే కః సహేత్ ||

|| శ్లోకార్థములు||

వానరముఖ్య - ఓ వానరోత్తమా
స లక్ష్మణం ఆజిమర్దనం -
లక్ష్మణునితో కలిసి శత్రువులను మర్దించు
మత్తం దిశగజం ఇవ వ్యవస్థితం -
మత్తగజములా యుద్ధములో నిలబడియున్న
శరార్చిషం యుగాంత సూర్యప్రతిమం -
శరపరంపరలనే కిరణాలతో ప్రళయకాల సూర్యునిలా తేజరిల్లు
రాఘవం సంయుగే కః సహేత్ -
రాముని ఏ యోధుడు ఎదురుకొనగలడు

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరోత్తమా! లక్ష్మణునితో కూడి సూర్యకిరణములభాతి శరపరంపరలతో తేజరిల్లు మత్తగజములా యుద్ధములో నిలబడియున్నరాముని ఏ యోధుడు ఎదురుకొనగలడు?'" ||37.65||

||శ్లోకము 37.66||

స మే హరిశ్రేష్ఠ స లక్ష్మణం పతిం
సయూధపం క్షిప్ర మిహోపపాదయ|
చిరాయ రామం ప్రతి శోకకర్శితామ్
కురుష్వ మాం వానరముఖ్య హర్షితాం||37.66||

స|| హరిశ్రేష్ఠ సః సలక్ష్మణం సయూథపం పతిం క్షిప్రం ఇహ ఉపపాదయ | వానరముఖ్య రామం ప్రతి చిరాయ శోకకర్శితాం మాం హర్షితాం కురుష్వ||

|| శ్లోకార్థములు||

హరిశ్రేష్ఠ - ఓ వానరోత్తమా
సః సలక్ష్మణం సయూథపం పతిం -
లక్ష్మణునితో కూడి వానరసమూహముల సమేతముగా రాముని
క్షిప్రం ఇహ ఉపపాదయ - వెంటనే ఇక్కడ తీసుకు రమ్ము
వానరముఖ్య రామం ప్రతి చిరాయ శోకకర్శితాం -
ఓ వానర ముఖ్యుడా ! రాముని చూచుటకై శోకములో నున్న
మాం హర్షితాం కురుష్వ -
నాకు ఆనందము కూర్చుము

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరోత్తమా ! లక్ష్మణునితో కూడి వానరసమూహముల సమేతముగా రాముని ఇక్కడ తీసుకు రమ్ము. ఓ వానర ముఖ్యుడా ! రాముని చూచుటకై శోకములో నున్న నాకు ఆనందము కూర్చుము". ||37.66||

ఈ సర్గలో విన్నమాటలలో, 'తత్ తస్య సదృశం భవేత్", అన్నమాట మనము మళ్ళీ మళ్ళీ వింటాము. "తత్ తస్య సదృశం భవేత్", అంటే అది ఆయన గౌరవానికి తగినది. అది సందర్బానుసారముగా తగినపని లేక తగిన మాట తగిన కార్యక్రమము అవవచ్చు. అది చాలామంది తమ హృదాయస్పదులైనవారి విషయాలలో అనుకునే మాట. ఉదాహరణకి భార్యలు భర్తలవిషయములో , శిష్యులు తమ గురువుల విషయములో అనుకునే మాట. అలాగే భర్తలు భార్యవిషయములో గురువులు తమ శిష్యుల విషయములో కూడా అలాగే ఆలోచించే మాట, అనుకునే మాట కూడా. ఇదే మాట ఈ సర్గలో సీతమ్మ ద్వారా వింటాము.

రామాయణము సీతా చరితము అనడములో ఇలాంటి మాటలే సీత యొక్క గొప్పతనమును చాటుతాయి. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయములో భార్య భర్త యొక్క గౌరవము నిలబెట్టాలి అన్న మాట సీతమ్మ వలనే వచ్చిందనుకోవచ్చు అదే భావనతో చాలమంది స్త్రీలు , తమ జీవితాంతము భర్త కోసము ఎన్నో సార్లు ఏదో చేస్తోనే వుంటారు. 'తత్ తస్య సదృశం భవేత్' అని చాలామంది స్త్రీలు ఇప్పటికి కూడా వారి భర్త గురించి అనుకునే మాటే. భర్తలు కూడా తమ భార్యల గురించి 'తత్ తస్య సదృశం భవేత్' అనుకొతగిన మాట.

అదే భావనతో సీతమ్మ మళ్ళీ ఇంకోసారి హనుమకి చెపుతుంది ' ఓ వానరోత్తమా ! లక్ష్మణునితో కూడి వానరసమూహముల సమేతముగా రాముని ఇక్కడ తీసుకు రమ్ము. ఓ వానర ముఖ్యుడా ! రాముని చూచుటకై శోకములో నున్న నాకు ఆనందము కూర్చుము'.

ఈ విధముగా సీత తన మనో భావమును హనుమంతుడికి వెల్లడి చేస్తుంది

రామ తిలకలో , "చిరకాలం శోకకర్శితాం (మాం) రామస్య అత్ర ఆగమనే హర్షితాంకురుష్వ| సమూల సకల నాశనేతి భావః|". చిరకాలము శోకసముద్రములో వున్ననన్ను రాముని రాకతో సమ్తోషము కలదానిగా చేయుము అని. ఇక్కడ రాముడు వచ్చినచో తనకి దుఃఖ కారకులైన రాక్షసుల వినాశము తథ్యము అని.

గోవిన్దరాజులవారు తమ టీకాలో సీతమ్మ కోరికపై ఇలా రాస్తారు - ||అనయా భక్త్యా ఉపాయాన్తరం స్వరూపవిరుద్ధం భగవత్ప్రాప్తౌ స ఎవోపాయ ఇతి దర్శితః|| భగవద్దర్శనానికి సులభమైన మార్గము చెప్పబడినా ( హనుమంతుని పృష్టముపై ఎక్కి కిష్కింధ చేరడము ) సీతమ్మ ముముక్షువు పోవు మార్గమే తీసుకుంటుంది అని

ఈ విధముగా ముప్పది ఏడవ సర్గ సమాప్తము అవుతుంది.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే సప్తత్రింశస్సర్గః ||

||om tat sat||