||సుందరకాండ ||

||నలభై ఇదవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

సుందరకాండ.
అథ పంచచత్త్వారింశస్సర్గః||

అప్పుడు రాక్షసేంద్రునిచే అదేశించబడిన ఏడుగురు మంత్రికుమారులు అగ్నితో సమానమైన తేజస్సుతో విరాజిల్లుచూఆ భవనము నుండి బయలుదేరిరి.

ఆ అమాత్యపుత్రులు మహాబలముతో వెళ్ళిరి. ఆ అమాత్యపుత్రులు శ్రేష్టులు. మహాబలము కలవారు. ధనుష్మంతులు. అశ్త్రవిద్యను నేర్చుకున్నవారు, తోటివారికన్నమిన్నగాఉండవలెనని కోరికగలవారు. బంగారపు జాలీలు కల, ధ్వజములు పతాకములు గల, రథముల కదలికతో మేఘముల ధ్వనులను పోలిన ధ్వనులను చేస్తూ వున్న రథములలో వెళ్ళిరి. మేలిమి బంగారపు పూతగల ధనస్సులతో టంకారము చేయుచూ , మెరుపులతో కూడిన మేఘములవలె విరాజిల్లుచూ అమితోత్సాహముతో వెళ్ళిరి.

అప్పుడు వారి బంధువులు మిత్రులు , అమాత్య సుతుల తల్లులు కింకరులు హనుమంతునిచేత హతమార్చబడిరి అన్నవిషయము తెలిసినవారై చింతాక్రాంతులైరి.

మేలిమి బంగారపు ఆభూషణములు ధరించిన ఆ మంత్రిపుత్రులు ఒకరిపై ఒకరు పోటీపడుతూ అశోకవనద్వార తోరణము మీద కూర్చునియున్న హనుమంతుని ఎదురుకొనిరి. రథముల గతితో మేఘ గర్జన చేయుచూ, వర్షిస్తున్న మేఘములవలె బాణ వృష్టి కురిపిస్తూ సంచరించిరి. అప్పుడు ఆ శరపరంపరతో కప్పబడిన హనుమంతుడు పర్వతరాజము వలె నుండెను. ప్రచండవేగముతో వెళ్లగల ఆ వానరుడు ఆ నిర్మలాకాశములో తిరుగుచూ ఆ వీరుల శరములను రథవేగమును నిర్వీర్యము చేసెను. ఆకాశములో వుండి ఆ ధనుర్ధారులను ఆటలాడిస్తూ మేఘముల ప్రభువు మారుతి వలె శోభించెను. ఈ వీరుడు ఘోరమైన గర్జనచేయుచూ ఆ మహాసేనకి భీతి కలిగించునట్లు తిరిగెను. ఆ శత్రుమర్దనడు కొందరి చేతితో కొట్టి హతమార్చెను. కొందరిని పాదములతో, కొందరిని పిడికిలితో, కోదరిని గోళ్లతో సంహరించెను.

ఆ వానరుడు కొందరిని తన రొమ్ముతో, మరికొందరిని తొడలతో మధించి వధించెను. కొందరు అతని సింహనాదమునకే భయపడి భూమిపై పడిరి. అప్పుడు ఆ సైన్యము అంతా భయపడినవారై పది దిక్కులలో పారిపోయిరి. అప్పుడు ఏనుగులు వికృతముగాఘీంకరించెను .గుఱ్ఱములు నేలపై పడెను. భూమికూడా రథమునుంచి విరిగి ముక్కలై పడిన రథముల పైకప్పులు, ధ్వజములు, చత్రముల తో నిండిపోయెను . మార్గములన్నీ స్రవించుచున్న రక్తముతో నిండినవై ఆ లంక అంతా అనేక వికృతమైన నాదములతో మారుమోగెను.

ఆ వీరుడు మహాబలుడు చండపరాక్రమము గల వానరుడు వీరాగ్రేసరులైన ఆ రాక్షసులను హతమార్చి ఇంకా ఇతరులతో యుద్ధము చేయవలెననే ఉత్సాహముతో మళ్ళీ ఆ అశోక వనద్వార తోరణముఫైకి ఎక్కెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభై ఇదవ సర్గ సమాప్తము

||ఓమ్ తత్ సత్||