||సుందరకాండ ||

|| ఎభైయ్యొకటవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

|| ఓమ్ తత్ సత్||
తం సమీక్ష్య మహాసత్త్వం సత్త్వవాన్ హరిసత్తమః|
వాక్య మర్థవదవ్యగ్రః తం ఉవాచ దశాననమ్||1||

స|| సత్త్వవాన్ హరిసత్తమః మహాసత్త్వం తం దశాననమ్ అవ్యగ్రః అర్థవత్ వాక్యం తం ఉవాచ||

తా|| బలవంతుడూ వానరోత్తముడు అయిన హనుమంతుడు అ మహాబలపరాక్రము గలవాడు అయిన దశాననునితో అర్థవంతముగా ఇట్లు పలికెను.
|| ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ఏకపంచాశస్సర్గః||

బలవంతుడు వానరోత్తముడు అయిన హనుమంతుడు, అ మహాబలపరాక్రము గలవాడు అయిన దశాననునితో అర్థవంతముగా ఇట్లు పలికెను.

' ఓ రాక్షసేంద్రా నేను సుగ్రీవుని సందేశముతో నీ ఆలయమునకు వచ్చితిని. వానరాధిపతి, సోదరసమానుడు, నీ కుశలములను అడుగుచున్నాడు. సోదర సమానుడు మహాత్ముడు అయిన సుగ్రీవుని వద్దనుంచి వచ్చిన సందేశము నీకు ఇహ పరములలో శ్రేయస్సు కలిగించునది ధర్మము తో కూడినది. అది వినుము'.

"దశరథుడనే పేరుగల రాజు, రథములు ఏనుగులు సమృద్ధిగాగలవాడు. లోకబంధువు. ప్రజలకు తండ్రిలాంటి వాడు. ఇంద్రునితో సమానమైన తేజము కలవాడు. ఆయన జ్యేష్ఠపుత్రుడు ప్రియము చేయువాడు నా ప్రభువు రాముడనే పేరుగలవాడు. మహాతేజము కలవాడు. ఆ రాముడు ధర్మమార్గమును అనుసరిస్తూ తండ్రి ఆదేశముతో వనవాసమున కు తన తమ్ముడైన లక్ష్మణునితో, తన భార్య సీతతో దండకావనము ప్రవేశించెను".

"ఆయన భార్య మహాత్ముడైన విదేహమహరాజుయొక్క కూతురు. పతివ్రత. ఆ పతివ్రత సీత వనములో కనిపించకుండా పోయినది. ఆ దేవిని వెతుకుతూ ఆ రాజపుత్రులు ఋష్యమూక పర్వతప్రాంతమునకి వచ్చి సుగ్రీవునితో కలిసిరి. ఆ సుగ్రీవుడు వారి సీతాన్వేషణకు ప్రతిజ్ఞాబద్ధుడయ్యెను. రాముడు కూడా సుగ్రీవునకు వానరరాజ్యము కట్ట బెట్టుటకు ప్రతిజ్ఞాబద్ధుడయ్యెను".

"అప్పుడు ఆ రాజపుత్రుడు వాలిని యుద్ధములో హతమార్చి సుగ్రీవుని వానరగణములకు అధిపతిగా స్థాపించెను. వానరపుంగ వుడైన వాలి గురించి నీకు విదితమే. ఆ వానరుడు రాముని చేత ఒకే బాణముతో హతమార్చబడెను. వానరాధిపుడు మాటతప్పని వాడు సుగ్రీవుడు సీతాన్వేషణకు అన్ని దిక్కులలో వానరులను పంపెను".

"వందల వేలకొలదీ వానరులు సీతాన్వేషణము కై అన్ని దిశలలో నూ ఆకాశములో పాతాళములోనూ వెదుకుచున్నారు. ఆ వానర వీరులు కొందరు మహాబలులు ఏమీ ఆటంకములులేకుండా శీఘ్రముగా వెళ్ళువారు. కొందరు గరుత్మంతునితోసమానులు. కొందరు వాయుదేవునితో సమానులు".

'నేను హనుమంతుడను పేరుగలవాడను మారుతియొక్క ఔరసపుత్రుడను. సీతాదేవి కొఱకై వందయోజనములు విస్తీర్ణముగల సముద్రమును దాటి ఇచటికి వచ్చితిని. తిరుగుతూ ఉన్న నాచేత నీ గృహములో జనకాత్మజ చూడబడినది. నీకు ధర్మము తెలిసినదే. తపస్సు కూడా చేసినవాడవు. ఓ బుద్ధిశాలీ నీకు పరస్త్రీలను నిర్బంధించుట తగని పని'.

'బుద్ధిమంతుడైన నీలాంటి వారిచేత ధర్మవిరుద్ధమైన కార్యములు, నాశనమునకు మూలకారణములగు కార్యములు చేబట్టరు కదా. దేవతలూ అసురులు ఎవరూ రాముని కోఫమును అసురించి లక్ష్మణునిచే వదిలిన శరపరంపరధాటికి నిలబడలేరు. ఓ రాక్షసేంద్రా రామునికి అపకారము చేసి సుఖము పొందగలవాడు ఈ ముల్లోకములలో ఎవరూ లేరు'.

'అందుకని త్రికాలహితమైన ధర్మమును అనుసరించు నా ఈ మాటలను వినుము. ఆ నరదేవునకు సీతను అప్పగించుము. ఎవరికీ సాధ్యముకాని ఈ దేవిని చూడడమనే కార్యమును నేను సాధించితిని. ఇక పై చేయవలసిన కర్మ రాఘవునిపై వుండును'.

'ఈ శోకసముద్రములో మునిగియున్న నా చేత చూడబడిన సీత , నీ చేత నిర్బంధించబడిన ఈమె ఐదు తలల పాము వంటిది అని నీవు గ్రహించకుండా ఉన్నావు. విషముతో కూడిన అన్నము తిని జీర్ణించుకొనుట ఎలా సాధ్యముకాదో, అలాగ సురాసురులకు కూడా ఆమెను బంధములో ఉంచుట సాధ్యము కాదు.

తపోబలముచే ధర్మకార్యముల పరిపాలనచే పోందబడిన ప్రాణరక్షణ వరములను నాశనము చేసికొనుట నీకు భావ్యము కాదు. నీ తపోబలముచేత నీవు అవధ్యుడవు అని కల ధైర్యము సరికాదు . దానికో కారణము ఉంది.
ఈ సుగ్రీవుడు దేవుడు కాదు. అసురుడుకాదు. రాక్షసుడు కాదు, దానవుడు కాదు. గంధర్వుడు కాదు. యక్షుడు కాదు. పన్నగుడు కాదు. ఓ రాజా అందువలన నీ ప్రాణము ఎలా కాపాడుకుందువు?
' ధర్మమును సంహరించుటవలనే కలిగేది అధర్మము తో కూడిన ఫలము. ఆ ఫలముపొందినచో ధర్మము నాశనము అగును. నీచేత ధర్మఫలము పొందబడినది అందులో సందేహము లేదు. ఈ అధర్మముయొక్క ఫలము కూడా త్వరలో పొందెదవు'.

' జనస్థానములో రాక్షస సంహారము తెలిసికొని, వాలి వధ గురించి తెలిసికొని, రామ సుగ్రీవుల సఖ్యము గురించి తెలిసికొని నీవు జయించబడినట్లే అని తెలిసికొనుము. నేను ఒక్కడినే రథ తురగ గజముల సేనలతో కూడిన ఈ లంకను నాశనము చేయగల శక్తి కలవాడను. అందులో సందేహము లేదు'.

'రాముడు వానర భల్లూక గణముల సమక్షములో సీతను అపహరించిన శత్రువులను నాశనము చేసెదనని ప్రతిజ్ఞ చేశెను. రాముని కి అపకారము చేసి సాక్షాత్తు పురందరుడు కూడా సుఖముపొందలేడు. అప్పుడు నీలాంటి వారిగురించి చెప్పనవసరము లేద".

' నీవు సీత అని ఎవరిని తెలిసికున్నావో , ఏ సీత నీ నిర్బంధములో ఉన్నదో, ఆమెను సర్వలంకా వినాశినిగా కాళరాత్రిగా తెలిసికొనుము. ఆ సీతా రూపములో నున్న కాలపాశమును నీ మెడకు కట్టుకోకు. నీ క్షేమము గురించి ఆలోచించుకొనుము' .

' సీత యొక్క తేజస్సుతో, రాముని కోపముతో దగ్ధమగు సాట్టప్రాకారములతో కూడిన ఈ నగరము చూడుము. నీ మిత్రులు మంత్రులు బంధువులు తమ్ములు పిల్లలూ హితులు భార్యలు భోగములతో కూడిన ఈ లంకా నాశనమునకు కారణము కాకుము'.

' ఓ రాక్షస రాజేంద్ర దూతను, వానరుడను. ప్రత్యేకముగా రాముని దాసుడను అగు నా సత్యమైన మాటలను వినుము. మహాయశస్సుగల రాముడు సమస్త చరాచర భూతములతో కూడిన లోకములను నశింపచేసి మరల సృష్టించ గల శక్తి కలవాడు'.

' విష్ణువుతో సమానమైన పరాక్రమము గల రాముని తో యుద్ధము చేయుగల దేవతలూ అసురులు యక్షరాక్షస గణములు విద్యాధరులు గంధర్వులు సిద్ధులలోనూ కిన్నరులలో అన్ని భూతములలోనూ అన్నిచోటలా అన్ని కాలములలో ఎవరూ ఎక్కడా లేరు'.

' సర్వలోకములకు ఈశ్వరుడైన రాజసింహుడు రామునితో ఈవిధముగా అప్రియమని పని చేసిన నీ జీవితము దుర్లభము'.

' ఓ నిశాచరేంద్రా ! దేవులలో దైత్యులలో గంధర్వ విధ్యాధరనాగ యక్షులు అందరిలో ముల్లోకములకు నాయకుడగు రాముని ముందర యుద్ధములో నిలబడు శక్తి లేదు. యుద్ధములో రాముడు వధించువానిని రక్షించుటకు చతురాననుడు అయిన బ్రహ్మ కాని, త్రినేత్రుడు త్రిపురాంతకుడు అయిన రుద్రునకు గాని, సురనాయకుడు మహేంద్రుడు అయిన ఇంద్రునకు కాని శక్యము కాదు'.

అప్రియమైన హేతుబద్ధమైన అ వానరుని నిర్భయమైన మాటలు వినిన సాటిలేని దశకంఠుడుఆ మహాకపి యొక్క వధకు ఆజ్ఞ ఇచ్చెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఎభైయ్యొకటవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||

స సౌష్టవో పేత మదీనవాదినః
కపేర్నిశమ్యాప్రతిమోఽప్రియం చ|
దశాననః కోపవివృత్తలోచనః
సమాదిశత్ తస్య వధం మహాకపేః||46||

స|| అప్రతిమః సః దశాననః అదీనవాదినః కపేః సౌష్టవోపేతం అప్రియం వచః నిశమ్య కోపవివృతలోచనః తస్య మహాకపేః వధం సమాదిశత్ ||

తా|| అప్రియమైన హేతుబద్ధమైన అ వానరుని నిర్భయమైన మాటలు వినిన సాటిలేని దశకంఠుడుఆ మహాకపి యొక్క వధకు ఆజ్ఞ ఇచ్చెను.
|| ఓమ్ తత్ సత్||