||సుందరకాండ ||

||ఏభై ఇదవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 55 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ పంచపంచాశస్సర్గః||

'దగ్ధేయం నగరీ సర్వా!' - అంటే 'ఆ ( లంకా) నగరమంతా దగ్ధమైంది' అని; అంతే కాదు 'సాట్టప్రాకార తోరణాత్' - అంటే ప్రాకారాలు తోరణాలతో సహా అని.

ఇది ఎవరు చెపుతున్నారు? ఆకాశ మార్గములో పోయే చారణులు. అయితే ఇక్కడ ఆశ్చర్యజనకమైన విశేషము ఏమిటి? లంక అంతా దగ్ధమైనా సీతామ్మవారు క్షేమముగా ఉన్నారుట.

ఇది విన్న హనుమ కి మనస్సు కుదుటపడుతుంది.

ఇంతకు ముందు దగ్ధమౌతున్నలంకానగరము చూస్తూ హనుమకు కంగారుపుడుతుంది. సీతమ్మవారు ఈ అగ్నికి ఆహుతి అయిందేమో అని. ఆ పనికి తనని తాను నిందించికొని తనకోపమె తనశత్రువు అన్న మాట గుర్తు చేసికొని- 'సవై పురుష ఉచ్యతే', అంటూఒక జీవిత రహస్యము చెపుతాడు.

'సవై పురుష ఉచ్యతే', అంటే 'వాడే పురుషుడు' అని ; ఎవడు ? - 'ఎవడైతే పాము తన కుబసము విడిచినట్లు, తనలో లేచిన తన క్రోధమును క్షమతో విడవగలడో వాడే పురుషోత్తముడు'. అదే మనము గీతలో వింటాము.

"క్రోధాత్ భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతి విభ్రమః|
స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో
బుద్ధి నాశాత్ ప్రణస్యతి ||" అని

అంటే అదే మాట, హనుమ తన మాటలలో మనకి చెపుతాడు.
అదే ఇక్కడ జరిగిన కథ

ఇక ఏభైఐదవ సర్గ శ్లోకాలు అర్థతాత్పర్యాలతో.

||శ్లోకము 55.01||

లంకాం సమస్తాం సందీప్య లాంగులాగ్నిం మహాబలః |
నిర్వాపయామాస తదా సముద్రే హరిసత్తమః ||55.01||

స|| మహాబలః హరిసత్తమః లంకాం సమస్తాం సందీప్య తదా సముద్రే లాంగూలాగ్నిం నిర్వాపయామాస ||

||శ్లోకార్థములు||

మహాబలః హరిసత్తమః -
మహాబలుడు హరి సత్తముడు
లంకాం సమస్తాం సందీప్య -
లంకానగరము అంతయూ అగ్నిజ్వాలలతో నింపి
తదా సముద్రే లాంగూలాగ్నిం -
తన లాంగూలము చివరలోనున్న అగ్ని ని సముద్రములో
నిర్వాపయామాస-
ముంచి చల్లార్చుచుండెను.

||శ్లోకతాత్పర్యము||

ఆ మహాబలుడు హరి సత్తముడు అయిన హనుమంతుడు లంకానగరము అంతయూ అగ్నిజ్వాలలతో నింపి తన లాంగూలము చివరలోనున్న అగ్ని ని సముద్రములో ముంచి చల్లార్చుచుండెను. ||55.01||

'న వానరోఽయం స్వయమేవ కాలః' ; అంటే 'వీడు వానరుడుకాదు స్వయముగా కాలుడే', అని అనిపించుకున్న హనుమ, లంకానగరము అంతయూ అగ్నిజ్వాలలతో నింపి, తన లాంగూలము చివరలోనున్న అగ్నిని సముద్రములో ముంచి చల్లార్చి, ఆ అగ్నిజ్వాలలో మండుతున్న లంకానగరము చూచుచూ ఆలోచించ సాగెను.

||శ్లోకము 55.02||

సందీప్యమానాం విధ్వస్తాం త్రస్తరక్షోగణాం పురీమ్ |
అవేక్ష్య హనుమాన్ లంకాం చింతయామాస వానరః ||55.02||

స|| సందీప్యమానాం విధ్వస్తాం త్రస్త రక్షోగణాం లంకా పురీం ఆవేక్ష్య వానరః చింతయామాస ||

||శ్లోకార్థములు||

సందీప్యమానాం విధ్వస్తాం -
అగ్నిజ్వాలలో మండుతున్న ధ్వంశము చేయబడిన
త్రస్త రక్షోగణాం -
భయపడుతున్న రాక్షస గణములతో కూడిన
లంకా పురీం ఆవేక్ష్య -
లంకానగరము చూచుచూ
వానరః చింతయామాస-
హనుమంతుడు అలోచించ సాగెను

||శ్లోకతాత్పర్యము||

ఆ అగ్నిజ్వాలలో మండుతున్న ధ్వంశము చేయబడిన లంకానగరము చూచుచూ హనుమంతుడు అలోచించ సాగెను. ||55.02||

||శ్లోకము 55.03||

తస్యాభూత్ సుమహాంస్త్రాసః కుత్సా చాఽత్మన్యజాయత |
లంకాం ప్రదహతా కర్మకింస్విత్కృతమిదం మయా ||55.03||

స|| తస్య మహాన్ త్రాసః అభూత్ | ఆత్మని కుత్సా చ అజాయత| లంకాం ప్రదహతా మయా ఇదం కింస్విత్ కర్మ కృతం ||

||శ్లోకార్థములు||

తస్య మహాన్ త్రాసః అభూత్ -
అప్పుడు ఆయనకి మహత్తరమైన భయము కలిగెను
ఆత్మని కుత్సా చ అజాయత -
తనపై తనకే ఏవగింపు కలిగెను
లంకాం ప్రదహతా మయా -
లంకను దహించిన నా చేత
ఇదం కింస్విత్ కర్మ కృతం-
ఎట్టి పని చేసితిని

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు ఆయనకి మహత్తరమైన భయము కలిగెను. తనపై తనకే ఏవగింపు కలిగెను. 'లంకను దహించి నేను ఏమి చేసితిని', అని. ||55.03||

||శ్లోకము 55.04||

ధన్యాస్తే పురుషశ్రేష్ఠా యే బుధ్యా కోపముత్థితమ్ |
నిరున్థన్తి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా ||55.04||

స|| తే పురుషశ్రేష్ఠాః మహాత్మనః ధన్యాః యే ఉత్థితం కోపం బుద్ధ్యా నిరున్ధన్తి దీపం అగ్నిం అంభసా ఇవ||

రామ టీకాలో- యే మహాత్మనః అతి ప్రయత్న శీలాః ఉత్థితం కోపం అంభసా బుద్ధ్యా నిరున్ధన్తీ తే మహాత్మనః పురుషశ్రేష్ఠాః అపి అత ఏవ ధన్యాః।

||శ్లోకార్థములు||

యే ఉత్థితం కోపం బుద్ధ్యా-
ఎవరైతే పైకి లేచిన క్రోధమును తమ బుద్ధితో
నిరున్ధన్తి దీపం అగ్నిం అంభసా ఇవ -
పైకి లేచిన అగ్నిని నీటితో చల్లార్చినట్లు
తే పురుషశ్రేష్ఠాః మహాత్మనః ధన్యాః -
వారు మహత్ములు, పురుషులలో శ్రేష్టుಲು, ధన్యులు

||శ్లోకతాత్పర్యము||

'ఎవరైతే పైకి లేచిన అగ్నిని నీటితో చల్లార్చినట్లు పైకి లేచిన క్రోధమును తమ బుద్ధితో అదుపులోకి తీసుకు రాగలరో వారు మహత్ములు, పురుషులలో శ్రేష్టుಲು ధన్యులు'. ||55.04||

ఇది నిజము అని మనము చాలాచోట్ల వింటాము. కాని ఈ మాట అన్నిట్లోకి ఆదికావ్యమైన రామాయణములో ముందు వచ్చినదన్నమాట.

హనుమ ఆలోచన ఇంకా ముందుకు సాగుతుంది

||శ్లోకము 55.05||

క్రుద్ధః పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి |
క్రుద్ధః పరుషయావాచా నరః సాధూనధిక్షిపేత్ ||55.05||

స|| కృద్ధః కః పాపం న కుర్యాత్ | కృద్ధః గురూన్ అపి హన్యాత్ | కృద్ధః నరః పరుషయావాచా సాధూన్ అధిక్షిపేత్ ||

రామ టీకాలో - ప్రకుపితో జనః వాచ్యా అవాచ్యం విజానాతి ।

||శ్లోకార్థములు||

కృద్ధః కః పాపం న కుర్యాత్ -
కోపముకలవాడు ఏమి చేయడు?
కృద్ధః గురూన్ అపి హన్యాత్ -
కృద్ధుడు గురువులను కూడా హతమార్చకలడు
కృద్ధః నరః పరుషయావాచా -
కృద్ధనరుడు పరుషవాచములతో
సాధూన్ అధిక్షిపేత్ -
సాధువులను కూడా ఆక్షేపించును

||శ్లోకతాత్పర్యము||

'కోపముకలవాడు ఏమి చేయడు? కృద్ధుడు గురువులను కూడా హతమార్చకలడు. కృద్ధనరుడు పరుషవాచములతో సాధువులను కూడా ఆక్షేపించును'. ||55.05||

రామ టీకాలో - కోపము వచ్చిన వాడికి మంచి చెడు తెలియదు.

||శ్లోకము 55.06||

వాచ్యా వాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్ |
నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విద్యతే క్వచిత్ ||55.06||

స|| ప్రకుపితః కర్హిచేత్ వాచ్యావాచ్యం న విజానాతి | కృద్ధస్య అకార్యం న అస్తి|అవాచ్యం న విద్యతే ||

||శ్లోకార్థములు||

ప్రకుపితః కర్హిచేత్ వాచ్యా -
ప్రకోపించినవాడు మాట్లాడతగిని
అవాచ్యం న విజానాతి -
మాట్లాడకూడని మాటల విచక్షణాజ్ఞానము కోల్పోతాడు
కృద్ధస్య అకార్యం న అస్తి -
వానికి చేయతగని పని వుండదు
అవాచ్యం న విద్యతే -
వానికి మాట్లాడతగని మాట వుండదు

||శ్లోకతాత్పర్యము||

'ప్రకోపించినవాడు మాట్లాడని మాట్లాడకూడని మాటల విచక్షణాజ్ఞానము కోల్పోతాడు. వానికి వానికి మాట్లాడకూడని మాట వుండదు. చేయతగని పని వుండదు'. ||55.06||

||శ్లోకము 55.07||

యః సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి |
యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే ||55.07||

స|| ఉరగః జీర్ణాం త్వచం యథా యః సముత్పతితం క్రోధం క్షమయా ఏవ నిరస్యతి సః వై పురుషః ఉచ్యతే ||

గోవిన్దరాజ టీకాలో- ఉరగో జీర్ణాం త్వచమేవ, సముత్పతితం కోపం యః నిరస్యతి స ఏవ పురుష ఉచ్యతే।

||శ్లోకార్థములు||

ఉరగః జీర్ణాం త్వచం యథా -
పాము తన కుబసము విడిచినట్లు
యః సముత్పతితం క్రోధం -
ఎవరైతే లేచిన తన క్రోధమును
క్షమయా ఏవ నిరస్యతి -
క్షమతో విడవగలడో
సః వై పురుషః ఉచ్యతే -
వాడే పురుషుడు అని చెప్పబడును

||శ్లోకతాత్పర్యము||

'పాము తన కుబసము విడిచినట్లు, ఎవరైతే లేచిన తన క్రోధమును క్షమతో విడవగలడో వాడే పురుషోత్తముడు'. ||55.07||

||శ్లోకము 55.08||

ధిగస్తు మాం సుదుర్బుద్ధిం నిర్లజ్జం పాపకృత్తమమ్ |
అచిన్తయిత్వా తాం సీతాం అగ్నిదం స్వామిఘాతుకమ్ ||55.08||

స|| తాం సీతాం అచిన్తయిత్వా అగ్నిదం స్వామిఘాతుకం సుదుర్బుద్ధిం ఇవ నిర్లజ్జం పాపకృత్తమం మామ్ ధిక్ అస్తు ||

రామ టీకాలో - సీతామ్ అచిన్తయిత్వా విస్మృత్య అన్యత్రానీత్వే ఇత్యర్థః। అగ్నిదమ్ అగ్నయే దదాతి అగ్నిం దదాతి వస్తుమాత్రే క్షిపతి వా , అత ఏవ స్వామి ఘాతకం అతఏవ పాపకృత్తమమ్ పాపిశ్రేష్ఠం మాం ధిగ్ అస్తు।

||శ్లోకార్థములు||

తాం సీతాం అచిన్తయిత్వా అగ్నిదం -
ఆ సీతను గురించి అలోచించకుండా అగ్నికి ఆహుతి చేసి
నిర్లజ్జం సుదుర్బుద్ధిం ఇవ -
సిగ్గులేకుండా దుర్బుద్ధి కలవాని లాగ
స్వామిఘాతుకం - స్వామి ఘాతకము
పాపకృత్తమం మామ్ ధిక్ అస్తు -
పాపకార్యము చేసిన నాకు ఛీ అగుగాక

||శ్లోకతాత్పర్యము||

'ఆ సీతను గురించి అలోచించకుండా లంకను అగ్నికి ఆహుతి చేసి సిగ్గులేకుండా దుర్బుద్ధి కలవాని లాగ స్వామి ఘాతకము చేసినవాడనైతిని'. ||55.08||

||శ్లోకము 55.09||

యది దగ్ధ్వాత్ ఇయం లంకా నూనమార్యాఽపి జానకీ |
దగ్ధా తేన మయా భర్తుర్హతం కార్యమజానతా ||55.09||

స|| ఇయం లంకా దగ్ధా యది ఆర్యా జానక్యాపి దగ్ధా | అజానతా మయా భర్తుః కార్యం హతం ||

||శ్లోకార్థములు||

ఇయం లంకా దగ్ధా యది -
ఈ లంకా పూర్తి గా దహనమైతే
ఆర్యా జానక్యాపి దగ్ధా -
అర్యురాలగు జానకి కూడా దగ్ధమైపోయి ఉండును
అజానతా మయా -
అనాలోచనతో నా చేత
భర్తుః కార్యం హతం-
స్వామి కార్యము భంగపరిచితిని

||శ్లోకతాత్పర్యము||

ఈ లంకా పూర్తి గా దహనమైతే అర్యురాలగు జానకి కూడా దగ్ధమైపోయి ఉండును. అనాలోచనతో స్వామి కార్యము భంగపరిచితిని. ||55.09||

||శ్లోకము 55.10||

యదర్థమయమారంభః తత్కార్యమవసాదితమ్ |
మయా హి దహతా లంకాం న సీతా పరిరక్షితా ||55.10||

స|| యదర్థం అయం (కార్యం) ఆరంభః తత్ కార్యం అవసాదితం| లంకాం దహతా మయా సీతా న పరిరక్షితా ||

||శ్లోకార్థములు||

యదర్థం అయం (కార్యం) ఆరంభః -
దేని కోసమై ఈ కార్యము ఆరంభింపబడెనో
తత్ కార్యం అవసాదితం -
ఆకార్యమును భంగపరిచితిని.
లంకాం దహతా మయా -
లంక నా చేత దహింపబడెను
సీతా న పరిరక్షితా -
కాని సీతను రక్షింపలేదు

||శ్లోకతాత్పర్యము||

'దేని కోసమై ఈ కార్యము ఆరంభింపబడెనో ఆకార్యమును భంగపరిచితిని. లంక నా చేత దహింపబడెను. కాని సీతను రక్షింపలేదు'.||55.10||

||శ్లోకము 55.11||

ఈషత్కార్య మిదం కార్యం కృతమాసీన్నసంశయః |
తస్య క్రోదాభిభూతేన మయా మూలక్షయః కృతః ||55.11||

స|| ఇదం కార్యం ఈషత్కార్యం కృతం ఆసీన్న క్రోదాభిభూతేన మయా తస్య మూలక్షయః కృతః సంశయః న ||

గోవిన్దరాజ టీకాలో - ఈషత్ కార్యం ఇతి। ఇదం కార్యం అన్వేషణ పూర్వక రావణ నిలయ పరిజ్ఞాన సీతాదర్శనతన్నివేదనరూపం మహత్ కార్యం ఈషత్ కార్యం ఈషద్ అవశిష్ఠకార్యం అసమగ్ర ప్రాయమేవ కృతం ఆసీత్ రామ నివేదమాత్రావశేషం కృతం ఆసీత్ ఇత్యర్థః। కిం క్రోధాభిభూతేన క్రోధాన్ధేన మయా తస్య మూలక్షయః కృతః న సంశయః విఫలీకృతం ఇత్యర్థః॥

||శ్లోకార్థములు||

ఇదం కార్యం ఈషత్కార్యం కృతం -
ఈ కార్యము చిన్న కార్యము సఫలము అయినది
ఆసీన్న క్రోదాభిభూతేన -
ఆ సమయములో క్రోధముతో
మయా తస్య మూలక్షయః కృతః -
నా చేత మూల కార్యమునకే ముప్పుతే బడినది
సంశయః న -
సంశయము లేదు

||శ్లోకతాత్పర్యము||

'ఏ కార్యముకొఱకై వచ్చితినో ఆ కార్యము సఫలము అగు సమయములో క్రోధములో మూల కార్యమునకే ముప్పు తెచ్చితిని'. ||55.11||

||శ్లోకము 55.12||

వినష్టా జానకీ న్యూనం న హ్యదగ్దః ప్రదృశ్యతే |
లంకాయాం కశ్చిదుద్దేశః సర్వా భస్మీకృతా పురీ ||55.12||

స|| నూనం జానకీ వినష్టా | లంకాయాం కశ్చిత్ ఉద్దేశః అదగ్దః న ప్రదృశ్యతే హి | సర్వాః పురీ భస్మీ కృతా ||

||శ్లోకార్థములు||

నూనం జానకీ వినష్టా -
తప్పక సీత నాశనమై ఉండును
లంకాయాం కశ్చిత్ ఉద్దేశః అదగ్దః -
లంకలో దగ్ధము కాని ప్రదేశము
న ప్రదృశ్యతే హి - కనపడుట లేదు.
సర్వాః పురీ భస్మీ కృతా -
నగరమంతయూ దగ్దమై నది

||శ్లోకతాత్పర్యము||

'తప్పక సీత నాశనమై ఉండును. లంకలో దగ్ధము కాని ప్రదేశము కనపడుట లేదు. నగరమంతయూ దగ్దమై నది'. ||55.12||

||శ్లోకము 55.13||

యది తద్విహతం కార్యం మమప్రజ్ఞా విపర్యయాత్|
ఇహైవ ప్రాణసన్న్యాసో మమాపి హ్యద్య రోచతే||55.13||

స|| మమ ప్రజ్ఞా విపర్యయాత్ తత్ కార్యం విహతం యది మమాపి ఇహైవ ప్రాణసన్యాసః అద్య రోచతే||

||శ్లోకార్థములు||

మమ ప్రజ్ఞా విపర్యయాత్ -
నా ప్రజ్ఞ విఫలమగుటచే
తత్ కార్యం విహతం యది -
ప్రభు కార్యము చెడిపోయినచో
మమాపి ఇహైవ ప్రాణసన్యాసః -
నేను ఇక్కడే ప్రాణత్యాగము చేయుట
అద్య రోచతే-
సముచితమని తోచుచున్నది

||శ్లోకతాత్పర్యము||

'నా ప్రజ్ఞ విఫలమై అందువలన ప్రభు కార్యము చెడిపోయినచో నేను ఇక్కడే ప్రాణత్యాగము చేయుట సముచితమని తోచుచున్నది'. ||55.13||

||శ్లోకము 55.14||

కిమగ్నౌ నిపతా మ్యద్య అహోస్విద్బడబాముఖే|
శరీరమాహో సత్త్వానాం దద్మి సాగరవాసినామ్||55.14||

స|| అద్య అగ్నౌ నిపతామి | అహోస్విత్ బడబాముఖే అహో శరీరం సాగరవాసినాం సత్త్వానాం దద్మి ||

||శ్లోకార్థములు||

అద్య అగ్నౌ నిపతామి -
నేను ఇప్పుడే అగ్నిలో దూకెదను
అహోస్విత్ బడబాముఖే -
ఈ బడబాగ్నిలో దూకనా
అహో శరీరం సాగరవాసినాం -
ఈ శరీరమును సాగరవాసినలైన
సత్త్వానాం దద్మి- జలచరములకు (ఆహారముగా) సమర్పించెదను

అద్య అగ్నౌ నిపతామి -
||శ్లోకతాత్పర్యము||

'నేను ఇప్పుడే అగ్నిలో దూకి ప్రాణత్యాగము చేయనా ఏమి? ఈ బడబాగ్నిలో దూకనా? ఈ శరీరమును సాగరవాసినలైన జలచరములకు ఆహారముగా సమర్పించెదను'. ||55.14||

||శ్లోకము 55.15||

కథం హి జీవతా శక్యో మయా ద్రష్ఠుం హరీశ్వరః |
తౌ వా పురుషశార్దూలౌ కార్యసర్వస్వఘాతినా ||55.15||

స|| కార్యసర్వస్వఘాతినా మయా జీవితా హరీశ్వరః ద్రష్ఠుం కథం వా శక్యః | పురుషశార్దూలౌ తౌ వా ( కథం వా శక్యః) ||

||శ్లోకార్థములు||

కార్యసర్వస్వఘాతినా మయా -
కార్యమునంతయూ నాశనము చేసిన నాచేత
జీవితా హరీశ్వరః ద్రష్ఠుం -
జీవిస్తూ హరీశ్వరుడగు సుగ్రీవుని చూచుట
కథం వా శక్యః - ఎట్లు సాధ్యమగును ?
పురుషశార్దూలౌ తౌ వా-
పురుష శార్దూలురగు వారిద్దరిని (ఎట్లు చూచెదను?)

||శ్లోకతాత్పర్యము||

'కార్యమునంతయూ నాశనము చేసిన నేను జీవిస్తూ హరీశ్వరుడగు సుగ్రీవుని చూచుట ఎట్లు? పురుష శార్దూలురగు వారిద్దరిని ఎట్లు చూచెదను?' ||55.15||

||శ్లోకము 55.16||

మయా ఖలు తదే వేదం రోషదోషాత్ప్రదర్శితమ్ |
ప్రథితం త్రిషు లోకేషు కపిత్వమనవస్థితమ్ ||55.16||

స|| మయా రోషదోషాత్ త్రిషు లోకేషు ప్రథితం అనవస్థితం తత్ ఇదం కపిత్వం ప్రదర్శితం ఖలు||

||శ్లోకార్థములు||

మయా రోషదోషాత్ -
నా రోషదోషముతో
త్రిషు లోకేషు ప్రథితం అనవస్థితం -
మూడు లోకములలో ప్రసిద్ధమైన చపలత్వమును
తత్ ఇదం కపిత్వం ప్రదర్శితం ఖలు -
ఆ ఈ వానరస్వభావమును ప్రదర్శించితిని కదా

||శ్లోకతాత్పర్యము||

'నా రోషదోషముతో మూడు లోకములలో ప్రసిద్ధమైన వానరుల చపలత్వమును ఋజువు చేశాను కదా.' ||55.16||

||శ్లోకము 55.17||

ధి గస్తు రాజసం భావం అనీశమనవస్థితమ్ |
ఈశ్వరేణాపి యద్రాగాన్ మయా సీతా నరక్షితా ||55.17||

స|| అనీశం అనవస్థితం రాజసం భావం ధిక్ అస్తు | యత్ ఈశ్వరేణ అపి మయా రాగాత్ సీతా న రక్షితా ||

||శ్లోకార్థములు||

అనీశం అనవస్థితం -
అదుపులేని చపలత్వమును
రాజసం భావం ధిక్ అస్తు -
ఛీ ! ఈ రజోగుణము వలన
యత్ ఈశ్వరేణ అపి -
నిగ్రహించుకోగలనప్పటికీ
మయా రాగాత్ సీతా న రక్షితా -
నా క్రోధముతో సీతను రక్షించుకో లేకపోయాను

||శ్లోకతాత్పర్యము||

'ఛీ ! ఈ రజోగుణము అదుపులేని చపలత్వమును కలిగించును. నిగ్రహించు కోగలనప్పటికీ నేను నా క్రోధముతో సీతను రక్షించుకో లేకపోయాను'. ||55.17||

||శ్లోకము 55.18||

వినష్టాయాంతు సీతాయాం తావుభౌ వినశిష్యతః |
తయోర్వినాశే సుగ్రీవః సబంధుర్వినశిష్యతి ||55.18||

స|| సీతాయాం వినష్టాయాం తౌ వుభౌ వినశిష్యతః | తయోః వినాశే సబన్ధుః సుగ్రీవః వినశిష్యతి |

||శ్లోకార్థములు||

సీతాయాం వినష్టాయాం -
సీత నష్టపోయినచో
తౌ వుభౌ వినశిష్యతః -
వారు ఇద్దరూ మరణించెదరు
తయోః వినాశే -
వారు ఇద్దరి మరణముతో
సబన్ధుః సుగ్రీవః వినశిష్యతి -
బంధువులతో కూడా సుగ్రీవుడు మరణించును

||శ్లోకతాత్పర్యము||

'సీత నష్టపోయినచో వారు ఇద్దరూ మరణించెదరు. వారు ఇద్దరి మరణముతో బంధువులతో కూడా సుగ్రీవుడు మరణించును'. ||55.18||

||శ్లోకము 55.19||

ఏతదేవ వచః శ్రుత్వా భరతో భ్రాతువత్సలః |
ధర్మాత్మా సహశతృఘ్నః కథం శక్ష్యతి జీవితుమ్ ||55.19||

స|| ఏతత్ ఏవ వచః శ్రుత్వా భ్రాత్రువత్సలః ధర్మాత్మా సహశత్రుఘ్నః జీవితుం కథం శక్ష్యతి ||

||శ్లోకార్థములు||

ఏతత్ ఏవ వచః శ్రుత్వా -
అలాంటి ఈ మాటలను విని
భ్రాత్రువత్సలః ధర్మాత్మా -
భ్రాతువత్సలుడగు భరతుడు ధర్మాత్ముడైన
సహశత్రుఘ్నః -
శతృఘ్నునితో
జీవితుం కథం శక్ష్యతి -
సహా ఎట్లు జీవించును?

||శ్లోకతాత్పర్యము||

'ఈ మాటలను విని భ్రాతువత్సలుడగు భరతుడు ధర్మాత్ముడైన శతృఘ్నునితో సహా ఎట్లు జీవించును?' ||55.19||

||శ్లోకము 55.20||

ఇక్ష్వాకు వంశే ధర్మిష్ఠే గతే నాశమసంశయమ్ |
భవిష్యన్తి ప్రజాః సర్వాః శోకసన్తాపపీడితాః ||55.20||

స|| ధర్మిష్టే ఇక్ష్వాకువంశే నాశం గతే సర్వాః ప్రజాః అసంశయం శోకసంతాపపీడితాః భవిష్యంతి ||

||శ్లోకార్థములు||

ధర్మిష్టే ఇక్ష్వాకువంశే నాశం గతే -
ధర్మాచరణబద్ధులైన ఇక్ష్వాకు వంశము నశించితే
సర్వాః ప్రజాః అసంశయం -
అసంశయముగా ప్రజలందరూ
శోకసంతాపపీడితాః భవిష్యంతి-
శోకసంతాపములతో పీడింపబడుదురు

||శ్లోకతాత్పర్యము||

'ధర్మాచరణబద్ధులైన ఇక్ష్వాకు వంశము నశించితే, అసంశయముగా ప్రజలందరూ శోకసంతాపములతో పీడింపబడుదురు'. ||55.20||

||శ్లోకము 55.21||

తదహం భాగ్య రహితో లుప్త ధర్మార్థ సంగ్రహః |
రోషదోషపరీతాత్మా వ్యక్తం లోకవినాశనః ||55.21||

స|| తత్ భాగ్యరహితః లుప్తధర్మార్థసంగ్రహః రోషదోషపరీతాత్మా అహం వ్యక్తం లోకనాశనః ||

||శ్లోకార్థములు||

తదహం భాగ్య రహితో -
అందువలన నేనుభాగ్యరహితుడనై
లుప్త ధర్మార్థ సంగ్రహః -
ధర్మార్థములను కోల్పోయి నేను
రోషదోషపరీతాత్మా -
రోషముతో నిండిన వాడనై
వ్యక్తం లోకవినాశనః-
లోకనాశనమునకు కారణమైనవాడనగుదును

||శ్లోకతాత్పర్యము||

'భాగ్యరహితుడనై ధర్మార్థములను కోల్పోయి నేను ఈ లోకనాశనమునకు కారణమైనవాడనగుదును'. ||55.21||

||శ్లోకము 55.22||

ఇతి చిన్తయతః తస్య నిమిత్తాన్యుపపేదిరే |
పూర్వమప్యుపలబ్దాని సాక్షాత్ పునరచిన్తయత్ ||55.22||

స|| తస్య ఇతి చిన్తయితః సాక్షాత్ పూర్వం అపి ఉపలబ్ధాని నిమిత్తాని ఉపపేదిరే పునః | సః అచిన్తయత్ ||

రామ టీకాలో- ఇతి చిన్తయతః తస్య హనూమతః పూర్వమప్ ఉపలబ్ధాని అనుభూతాని నిమిత్తాని శుభసూచక దక్షిణ నేత్రత్రస్ఫురాణాదీని ఉపపేదిరే ప్రాపుః అతః పునః అచిన్తయత్॥

|శ్లోకార్థములు||

తస్య ఇతి చిన్తయితః -
ఈ విధముగా ఆలోచించుచున్న ( హనుమంతునికి)
సాక్షాత్ పూర్వం అపి ఉపలబ్ధాని -
సాక్షాత్తు పూర్వములో కూడా కనపడిన
నిమిత్తాని ఉపపేదిరే పునః -
శకునములు మరల కనపించెను
సః అచిన్తయత్-
ఆ వానరుడు మరల ఆలోచనలో పడెను

||శ్లోకతాత్పర్యము||

'ఈ విధముగా ఆలోచించుచున్న ఆ వానరునకు, పూర్వములో జరిగినట్లు శుభసూచనలు మరల కానవచ్చాయి. అప్పుడు ఆ వానరుడు మరల ఆలోచనలో పడెను'. ||55.22||

||శ్లోకము 55.23||

అథవా చారు సర్వాంగీ రక్షితా తేన తేజసా |
న నశిష్యతి కల్యాణీ నాగ్ని రగ్నౌ ప్రవర్తతే ||55.23||

స|| అథవా చారు సర్వాంగీ స్వేన తేజసా రక్షితా | కల్యాణీ న నశిష్యతి | అగ్నిః అగ్నౌ న ప్రవర్తతే ||

||శ్లోకార్థములు||

అథవా చారు సర్వాంగీ -
లేక ఆ అందమైన అంగములు కల ఆమె
స్వేన తేజసా రక్షితా -
తన తేజసముతో రక్షింపబడెనేమో
కల్యాణీ న నశిష్యతి -
ఆ కల్యాణి దహింపబడదు
అగ్నిః అగ్నౌ న ప్రవర్తతే -
అగ్ని అగ్నిని దహించలేదు కదా

||శ్లోకతాత్పర్యము||

'లేక ఆ మంగళప్రదురాలైన ఆమె తన తేజసముతో రక్షింపబడెనేమో. ఆ కల్యాణి దహింపబడదు. అగ్ని అగ్నిని దహించలేదు కదా'. ||55.23||

||శ్లోకము 55.24||

న హి ధర్మాత్మనః తస్య భార్యా మమిత తేజసః |
స్వ చారిత్రాభిగుప్తాం తాం స్ప్రష్టుమర్హతి పావకః ||55.24||

స|| ధర్మాత్మనః అమిత తేజసః తస్య భార్యాం స్వచారిత్రాభిగుప్తాం తాం పావకః స్ప్రష్టం న అర్హతి హి ||

||శ్లోకార్థములు||

ధర్మాత్మనః అమిత తేజసః -
ధర్మాత్ముడు, అమిత తేజసము కలవాడు
తస్య భార్యాం - వాని భార్యను,
స్వచారిత్రాభిగుప్తాం-
తన పాతివ్రత్యముచే రక్షింపబడు
తాం పావకః స్ప్రష్టం -
ఆమెను ముట్టుకొనుటకు కూడా పావకుడు
న అర్హతి హి - అర్హుడుకాడు

||శ్లోకతాత్పర్యము||

'ధర్మాత్ముడు, అమిత తేజసము కలవాడు అగు వాని భార్యను, తన పాతివ్రత్యముచే రక్షింపబడు ఆమెను దహించుటకు పావకుడు అర్హుడుకాడు'. ||55.24||

||శ్లోకము 55.25||

నూనం రామ ప్రభావేన వైదేహ్యాః సుకృతేన చ |
యన్మాం దహనకర్మాఽయం నాదహాద్దవ్యవాహనః ||55.25||

స|| దహనకర్మా అయం హన్యవాహనః మామ్ నా దహత్ | ఇతి యత్ నూనం రామప్రభావేణ । వైదేహ్యాః సుకృతేన చ ||

గోవిన్దరాజ టీకాలో - దహనకర్మా భస్మీకరణ స్వభావః యత్ ప్రభావత్ అయం మాం నాదహత్ స తామేవ కథం దహతి ఇత్యర్థః॥

||శ్లోకార్థములు||

దహనకర్మా అయం హన్యవాహనః -
సర్వము దహించు ఈ హవ్యవాహనుడు
మామ్ నా దహత్ -
నన్ను దహించలేదు
ఇతి యత్ నూనం రామప్రభావేణ -
అది తప్పక రామప్రభావము వలననే
వైదేహ్యాః సుకృతేన చ -
వైదేహి సుకృతము వలననే

||శ్లోకతాత్పర్యము||

'సర్వము దహించు ఈ హవ్యవాహనుడు నన్ను దహించలేదు. అది తప్పక రామప్రభావము వలననే. వైదేహి సుకృతము వలననే'. ||55.25||

||శ్లోకము 55.26||

త్రయాణాం భరతాదీనాం భ్రాతౄణాం దేవతా చ యా |
రామస్య చ మనః కాన్తా సా కథం వినశిష్యతి ||55.26||

స|| యా భరతాదీనాం త్రయాణాం దేవతాః చ రామస్య మనః కాన్తా సా కథం వినశిష్యతి ||

||శ్లోకార్థములు||

యా భరతాదీనాం -
ఎవరైతే లక్ష్మణ భరతశతృఘ్నులకు
త్రయాణాం దేవతాః- ముగ్గురికి దేవతో
చ రామస్య మనః కాన్తా -
రామునికి ప్రియురాలైన
సా కథం వినశిష్యతి -
ఆమె (సీత) ఎట్లు దహింపబడును?

||శ్లోకతాత్పర్యము||

'లక్ష్మణ భరత శతృఘ్నులకు దేవత అయినట్టి రామునికి ప్రియమైన సీత ఎట్లు దహింపబడును?' ||55.26||

||శ్లోకము 55.27||

యద్వా దహనకర్మాఽయం సర్వత్ర ప్రభురవ్యయః |
నమే దహతి లాంగూలం కథ మార్యాం ప్రదక్ష్యతి ||55.27||

స|| యద్వా సర్వత్ర ప్రభుః అవ్యయః అయం దహనకర్మా మే లాంగూలం న దహతి అర్యాం సీతాం కథం ప్రదక్ష్యతి ||

||శ్లోకార్థములు||

యద్వా సర్వత్ర ప్రభుః -
సమస్త దహనకర్మలకు ప్రభువు
అవ్యయః అయం దహనకర్మా -
నాశనము లేని వాడు అగు ఈ అగ్ని
మే లాంగూలం న దహతి -
నా తోకను కాల్చలేదు
అర్యాం సీతాం కథం ప్రదక్ష్యతి-
ఈ ఆర్యురాలగు సీతను ఎట్లు దహించును

||శ్లోకతాత్పర్యము||

'సమస్త దహనకర్మలకు ప్రభువు , నాశనము లేని వాడు అగు ఈ అగ్ని నా తోకను కాల్చనిచో ఈ ఆర్యురాలగు సీతను ఎట్లు దహించును'. ||55.27||

||శ్లోకము 55.28||

పునశ్చాచిన్తయత్తత్ర హనుమాన్విస్మితస్తదా |
హిరణ్యనాభస్య గిరేర్జలమధ్యే ప్రదర్శనమ్ ||55.28||

స|| తదా హనుమాన్ విస్మితః జలమధ్యే హిరణ్యనాభస్య గిరేః ప్రదర్శనం తత్ర పునః అచిన్తయత్ ||

||శ్లోకార్థములు||

తదా హనుమాన్ విస్మితః -
అప్పుడు విస్మయుడైన హనుమంతుడు
జలమధ్యే హిరణ్యనాభస్య గిరేః ప్రదర్శనం -
సాగరమధ్యములో బంగారు శిఖరములు గల పర్వత దర్శనమును
తత్ర పునః అచిన్తయత్ -
అప్పుడు మరల గుర్తు చేసుకొనెను

||శ్లోకతాత్పర్యము||

'అప్పుడు విస్మయుడైన హనుమంతుడు సాగరమధ్యములో బంగారు శిఖరములు గల పర్వత దర్శనమును అప్పుడు మరల గుర్తు చేసుకొనెను'. ||55.28||

||శ్లోకము 55.29||

తపసా సత్యవాక్యేన అనన్యత్వాచ్చ భర్తరి |
అపి సా నిర్దహేదగ్నిం నతా మగ్నిః ప్రదక్ష్యతే ||55.29||

స|| తపసా సత్యవాక్యేన భర్తరి అనన్యత్వాచ్చ సా అగ్నిం నిర్దహేత్ అపి తాం అగ్నిః నప్రదక్ష్యతి ||

||శ్లోకార్థములు||

తపసా సత్యవాక్యేన -
తపస్సుచేత సత్యవాక్కులచేత
భర్తరి అనన్యత్వాచ్చ -
భర్త తప్ప వేరొక భావనలేని
సా అగ్నిం నిర్దహేత్ అపి -
అగ్నినే దహించకలశక్తి కల ఆమె
తాం అగ్నిః నప్రదక్ష్యతి -
ఆమెను అగ్ని దహించదు

||శ్లోకతాత్పర్యము||

'తన తపస్సుచేత , భర్త తప్ప వేరొక భావనలేని , ఆ అగ్నినే దహించకలశక్తి కల ఆమెను అగ్ని దహించదు'. ||55.29||

||శ్లోకము 55.30||

స తథా చిన్తయం స్తత్ర దేవ్యా ధర్మపరిగ్రహమ్ |
శుశ్రావ హనుమాన్ వాక్యం చారణానాం మహాత్మనామ్ ||55.30||

స|| తత్ర తథా దేవ్యాః ధర్మపరిగ్రహం చిన్తయన్ సః హనుమాన్ మహాత్మనాం చారణానాం వాక్యం శుశ్రావ ||

||శ్లోకార్థములు||

తత్ర తథా దేవ్యాః -
అప్పుడు అలాగ ఆ దేవి యొక్క
ధర్మపరిగ్రహం చిన్తయన్ -
ధర్మాచరణమును గురించి అలోచనలో ఉన్న
సః హనుమాన్ - ఆ హనుమంతుడు
మహాత్మనాం చారణానాం వాక్యం శుశ్రావ -
మహాత్ములగు చారణులవాక్యములను వినెను

||శ్లోకతాత్పర్యము||

'అప్పుడు అలాగ ఆ దేవి యొక్క ధర్మాచరణమును గురించి అలోచనలో ఉన్న ఆ హనుమంతుడు మహాత్ములగు చారణులవాక్యములను వినెను'. ||55.30||

||శ్లోకము 55.31||

అహో ఖలు కృతం కర్మ దుష్కరం హి హనూమతా |
అగ్నిం విశ్రుజతాఽభీక్ష్‍ణం భీమం రాక్షసవేశ్మని ||55.31||

స|| రాక్షసవేశ్మని ఆభీక్ష్నం భీమం అగ్నిం విసృజతా హనుమతా దుష్కరం కర్మ కృతం ఖలు అహో||

||శ్లోకార్థములు||

రాక్షసవేశ్మని ఆభీక్ష్నం భీమం -
రాక్షస భనములలో దుస్సహము భయంకరము అయిన
అగ్నిం విసృజతా హనుమతా -
అగ్నిని రగిల్చిహనుమ చేత
దుష్కరం కర్మ కృతం ఖలు అహో-
దుష్కరమైన కార్యమును సాధింపబడెను

||శ్లోకతాత్పర్యము||

'రాక్షస భనములలో దుస్సహము భయంకరము అయిన అగ్నిని రగిల్చి దుష్కరమైన కార్యమును సాధించెను. అహో ఎంత ఆశ్చర్యము'. ||55.31||

||శ్లోకము 55.32||

ప్రపలాయిత రక్షః స్త్రీబాలవృద్ధసమాకులా |
జనకోలాహలాధ్మాతా క్రన్దన్తీవాద్రికన్దరే ||55.32||

స|| ప్రపలాయిత రక్షః స్త్రీబాలవృద్ధసమాకులా జనకోలాహద్మాతా ఆద్రికన్దరే క్రన్దన్తీ ఇవ ||

||శ్లోకార్థములు||

ప్రపలాయిత రక్షః-
అటూ ఇటూ పరుగెడుతున్న రాక్షసులతో
స్త్రీబాలవృద్ధసమాకులా -
బాలురు స్త్రీలు వృద్ధులతో కూడిన
జనకోలాహద్మాతా -
జనకోలాహముల ఆక్రందనలు
ఆద్రికన్దరే క్రన్దన్తీ ఇవ-
గుహలలో ఆక్రందనలు వలె ప్రతిధ్వనిస్తున్నాయి

||శ్లోకతాత్పర్యము||'

'అటూ ఇటూ పరుగెడుతున్న రాక్షసులతో బాలురు స్త్రీలు వృద్ధులతో కూడిన జనకోలాహముల ఆక్రందనలు పర్వత గుహలలోలాగ ప్రతిధ్వనిస్తున్నాయి.' |55.32||

||శ్లోకము 55.33||

దగ్ధేయం నగరీ సర్వా సాట్టప్రాకారతోరణా |
జానకీ న చ దగ్ధేతి విస్మయోఽద్భుత ఏవ నః ||55.33||

స|| (అయం ) నగరీ సర్వా సాట్టప్రాకారతోరణా దగ్ధా | జానకీ న దగ్ధా ఇతి | నః విస్మయః అద్భుత ఏవ ||

||శ్లోకార్థములు||

నగరీ సర్వా సాట్టప్రాకారతోరణా దగ్ధా -
నగరము ప్రాకార తోరణములతో సహా దగ్ధమైనది
జానకీ న దగ్ధా ఇతి - కాని జానకి దగ్ధముకాలేదు అని
నః విస్మయః అద్భుత ఏవ -
ఇది ఎంత ఆశ్చర్యకరము అద్భుతము

||శ్లోకతాత్పర్యము||

'ఈ నగరము ప్రాకార తోరణములతో సహా దగ్ధమైనది. కాని జానకి దగ్ధముకాలేదు. ఇది ఎంత ఆశ్చర్యకరము, అద్భుతము.' ||55.33||

||శ్లోకము 55.34||

స నిమిత్తైశ్చ దృష్టార్థైః కారణైశ్చ మహాగుణైః |
ఋషివాక్యైశ్చ హనుమాన్ అభవత్ప్రీతిమానసః ||55.34||

స|| సః హనుమాన్ దృష్తార్థైః నిమిత్తైః మహాగుణైః కరణేశ్చైవ ఋషివాక్యైశ్చ ప్రీతిమానసః అభవత్ ||

గోవిన్దరాజ టీకాలో- నిమిత్తైః దక్షిణాక్షి స్పన్దాదిభిః దృష్టార్థైః దృష్ఠఫలసంవాదైః కారణైః సీతాపాతివ్రత్య రామప్రభావాదిభిః ఋషివాక్యైః చారణవాక్యైః॥

||శ్లోకార్థములు||

సః హనుమాన్ దృష్తార్థైః నిమిత్తైః -
ఆ హనుమంతుడు కనపడిన శుభసూచనలతో
మహాగుణైః కరణేశ్చైవ -
రాముని మహాగుణములతో, జరిగిన కార్యములతో
ఋషివాక్యైశ్చ -
చారణుల వాక్యములతో
ప్రీతిమానసః అభవత్ -
ప్రీతిచెందిన మనస్సు కలవాడయ్యెను.

||శ్లోకతాత్పర్యము||

'ఆ హనుమంతుడు కనపడిన శుభసూచనలతో, రాముని మహాగుణములతో, జరిగిన కార్యములతో , చారణుల వాక్యములతో ప్రీతిచెందిన మనస్సు కలవాడయ్యెను'. ||55.34||

||శ్లోకము 55.35||

తతః కపిః ప్రాప్త మనోరథార్థః
తామక్షతాం రాజసుతాం విదిత్వా |
ప్రత్యక్షతః తాం పునరేవ దృష్ట్వా
ప్రతిప్రయాణాయ మతిం చకార ||55.35||

స|| తతః కపిః ప్రాప్తమనోరథార్థః తాం రాజసుతాం అక్షతాం విదిత్వా తాం పునరేవ ప్రత్యక్షతః దృష్ట్వా ప్రతిప్రయాణాయ మతిం చకార ||

గోవిన్దరాజ టీకాలో పూర్వం చారణవాక్యైః విదిత్వా పునః ప్రత్యక్షం దృష్ట్వా తతః ప్రతిప్రయాణాయ మతిం చకార ప్రతియాస్యాం ఇతి సంకల్పితవాన్ ఇత్యర్థః॥

||శ్లోకార్థములు||

తతః కపిః ప్రాప్తమనోరథార్థః -
అప్పుడు ఆ వానరుడు పొందిన మనోరథము కలవాడై
తాం రాజసుతాం అక్షతాం విదిత్వా -
ఆ రాజకన్య క్షేమముగా వున్నదని తెలిసికొని
తాం పునరేవ ప్రత్యక్షతః దృష్ట్వా -
ఆమెను ప్రత్యక్షముగా చూచి
ప్రతిప్రయాణాయ మతిం చకార-
తిరుగు ప్రయాణము చేయుటకు నిశ్చయించుకొనెను

||శ్లోకతాత్పర్యము||

'అప్పుడు ఆ వానరుడు పొందిన మనోరథము కలవాడై, ఆ రాజకన్య క్షేమముగా వున్నదని తెలిసికొని , ఆమెను ప్రత్యక్షముగా చూచి తిరుగు ప్రయాణము చేయుటకు నిశ్చయించుకొనెను'. ||55.35||

సీతమ్మ క్షేమముగా వున్నది అన్నమాటతో సుందరకాండలో ఏబది ఐదవ సర్గ సమాప్తము అవుతుంది.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే పంచపంచాశస్సర్గః ||

||ఓమ్ తత్ సత్||