||సుందరకాండ ||

||ఏబది ఏడవ సర్గ తెలుగులో||


||ఓమ్ తత్ సత్||

||ఓం తత్ సత్||
శ్లో|| స చంద్ర కుసుమం రమ్యం సార్క కారణ్డవం శుభం|
తిష్యశ్రవణకాదమ్బ మభ్రశైవాలశాద్వలమ్||1||
స|| స చంద్ర కుసుమం రమ్యం | సార్కకారండవమ్ శుభం| తిష్యశ్రవణ కాదమ్బం| అభ్రశైవాలశాద్వలమ్
తా||చంద్రుడు తెల్ల కలువలాగాను , సూర్యుడు కారండవ పక్షి లాగాను , పుష్య శ్రవణ నక్షత్రములు కలహంసలుగానూ,మేఘాలు పచ్చి బీళ్ళవలె వుండెను.
||ఓం తత్ సత్||

సుందరకాండ.
అథ సప్తపంచాశస్సర్గః||

సీత కు నమస్కరించి హనుమ తిరుగు ప్రయాణము నకై అరిష్ట పర్వతముఎక్కి ఆకాశములోకి ఎగిరెను.

అలా ఆకాశములో వాయువేగము తో ఎగురుచున్న హనుమంతుడు ఒక పెద్ద ఓడ సముద్రాన్ని దాటినట్లు, అవధి లేని సముద్రాన్ని అనాయాసముగా దాటుచుండెను.

ఆ అకాశములాంటి సముద్రములో చంద్రుడు తెల్ల కలువలాగాను , సూర్యుడు కారండవ పక్షి లాగాను మేఘాలు పచ్చి బీళ్ళవలెను, పుష్య శ్రవణ నక్షత్రములు కలహంసలుగానూ, పునర్వసూ నక్షత్రము మహామీనము గానూ, కుజగ్రహము పెద్ద మొసలిగానూ ,ఐరావతమే మహాద్వీపముగానూ, స్వాతీ నక్షత్రము హంసగానూ , వాయుతరంగములు జలతరంగములుగానూ , చంద్రకిరణాలే చల్లని ఉదకముగనూ యక్ష గంధర్వ ఉరగములు కలువలూ తామరలలాగానూ విరాజిల్లుతున్నారు.

మారుతియొక్క ఆత్మజుడు, శ్రీమాన్ మహాకపి, వినువీధిలో తిరుగుచున్నవాడు అయిన హనుమంతుడు, ఆకాశమును మింగుతున్నాడా అన్నట్లు, తారాధిపుని స్పర్శితూ పోతున్నాడా అన్నట్లు, నక్షత్ర సూర్యమండలములతో కూడిన ఆకాశాన్ని హరిస్తున్నాడా అన్నట్లు కానవచ్చెను. ఆ హనుమ మేఘసమూహాలను తనతో ఈడ్చుకుపోతున్నాడా అన్నట్లు కానవచ్చెను. ఆ మేఘములు తెలుపు ఎఱుపు నీలం పసుపు ఆకుపచ్చ రంగులతో వెలుగుతూ ప్రకాశించినవి. ఆ మేఘసమూహాలలోకి ప్రవేసిస్తూ బయటికి వస్తున్న హనుమంతుడు మబ్బుల తో కప్పబడి మరల కనపడే చంద్రుని వలె ప్రకాశించెను. ధవళవస్త్ర ధారి అయిన హనుమంతుడు దట్టమైన మేఘములలో దూసుకు పోతూ అప్పుడప్పుడు కనపడీ కనపడకుండా మబ్బులచాటునుండు చంద్రుని వలె ప్రకాశించుచుండెను.

ఆ మహాతేజోమయుడైన హనుమంతుడు పలువురు రాక్షసముఖ్యులను హతమార్చి, తనపేరుని చాటించుకొని, లంకానగరమును అస్తవ్యస్తము చేసి, ఘోరమైన బలముతో రావణునికి వ్యధకల్పించి వైదేహికి నమస్కరించి మరల సాగరమధ్యము మీద ఎగురుతున్నాడు. వీరుడు హనుమంతుడు సముద్రమధ్యములో మైనాకుని స్పృశించి, ధనస్సునుండి విడువబడిన బాణమువలె మాహావేగముకలవాడై పోసాగెను. ఆ హరిపుంగవుడు మేఘములతీ సదృశమైన మహేంద్ర పర్వతము సమీపిస్తూ మహానాదము చేసెను.

మేఘగర్జనలాంటి నాదము కల ఆ మహాకపి ఆనాదముతో అన్ని దిశలనూ నింపివేసెను. ఆ మహేంద్రగిరి ప్రదేశమును సమీపించి మిత్రుల దర్శన లాలసుడైన హనుమంతుడు నాదము చేసెను. తనలాంగూలము అటూ ఇటూ తిప్పెను. సుపర్ణ పథములో పోవుచున్న నాదము చేయుచున్న ఆ హనుమంతుని నాదముతో ఆకాశము బద్దలవుతున్నదా అన్నట్లు వుండెను.

ఆ సముద్రముయొక్క ఉత్తరతీరములో ముందునుంచే యున్న మహాబలులూ శూరులూ వాయుపుత్రుని రాకకై ఎదురు చూచుచున్నవారూ అపుడు మహత్తరమైన మేఘగర్జనలాంటి ఊరువేగముల శబ్దమునూ వినిరి. అప్పుడు దీనమైన మనస్థితో లో వున్న ఆ వానరులు వారు వానరేంద్రుని మేఘగర్జననలాంటి నాదము వినిరి. అప్పుడు గుమిగూడి యున్న ఆ వానరులు అందరూ ఆ హనుమంతుని నాదము విని హనుమద్దర్శన కాంక్షతో ఉత్సాహముకలవారు అయిరి.

హరిశ్రేష్ఠుడైన ఆ జాంబవంతుడు ప్రీతితో నిండిన మనస్సు కలవాడై అక్కడి వానరులందరిని దగ్గిర చేసికొని ఈ విధముగా పలికెను. "ఈ హనుమంతుడు అన్ని విధములుగా కృతకృత్యుడైనవాడు. కృతకృత్యుడు కాని వాడి నాదము ఇలాగ వుండదు". ఆ మహాత్ముని బాహువుల ఊరువుల వేగములతో జనించిన శబ్దము విని సంతోషపడిన అ వానరులు అక్కడే గంతులు వేయసాగిరి. ఆ సంతోషముతో హనుమంతుని చూడకోరినవారై ఒక పర్వతమునుండి ఇంకో పర్వతముకు ఒక శిఖరమునుండి ఇంకో శిఖరమునకు ఎగరసాగిరి. ఆ వానరులు వృక్షముల పైన కొమ్మలను పట్టుకొని ఊగుతూ , ఆ కొమ్మలను వస్త్రములవలే ఊపి తమ సంతోషము ప్రదర్శించిరి.

ఆ మారుతి గర్జన పర్వత గుహలలో గాలితో ప్రతిధ్వనించు శబ్దము వలెనుండెను. మహామేఘమువలె నున్న ఆకాశమునుండి దిగుతున్నఆ మహాకపిని చూసి ఆ వానరులందరూ అందెలు మోడ్చి నిలబడిరు. అప్పుడు పర్వతసమానమైన వేగముగాపోగల ఆ వానరుడు వృక్షములతో నిండిన మహేంద్రగిరి శిఖరములో దిగెను. అమిత ఆనందముతో నిండిన, రెక్కలులేని మహాపర్వతమువలె నున్న ఆ హనుమంతుడు అప్పుడు ఆ పర్వతముపై నున్న రమ్యమైన సెలయేరులో దిగెను.

అప్పుడు ఆనందభరితులైన ఆ వానరులందరూ మహాత్ముడైన హనుమంతుని సమీపించి అతని చుట్టూ చేరిరి. అలా చుట్టుముట్టి వారందరూ పరమానందభరితులైరి. ఆ వానరులందరూ అతిసంతోషముతో హనుమంతుని పూవులూ ఫలములూ తీసుకు వచ్చి సౌఖ్యముగా తిరిగివచ్చిన హనుమంతుని సమర్పించిరి.

అప్పుడు ఆ మహాకపి అయిన హనుమంతుడు గురువులు వృద్ధులైన జాంబవదాది ప్రముఖులకు అంగదకుమారునకు వందనము చేసెను. ఆ విక్రాంతుడు పూజనీయుడు. పూజింపబడినవాడై వారిని పూజించి సంక్షిప్తముగా సీతమ్మను చూచితిని అని నివేదించెను. అప్పుడు హనుమంతుడు వాలిపుత్రుని చేయి పట్టుకొని ఆ మహేంద్రహిరి మీద రమణీయమైన ప్రదేశములో కూర్చొనెను.

అలా ఆనందభరితుడైన వనుమంతుడు ఆ వానరపుంగవులతో ఇట్లు పలికెను. "అశోకవనములో నున్న అనేకమంది రాక్షస స్త్రీల కాపలాలో ఉన్న, ఒకే జడవేసికొని రామదర్శన లాలసతో వున్న , ఉపవాసదీక్షలతో కృశించిఉన్న, మలినమై వున్న నిందతగని జనకాత్మజను చూచితిని" అని.

అప్పుడు సీతను చూచితిని అన్న మారుతియొక్క మహత్తరమైన అమృతోపము అయిన ఆ మాటను విని ఆ వానరులందరూ ఆనందభరితులైరి. కొందరు మహాబలురు గర్జించిరి. మరికొందరు నాదము చేసిరి. మరికొందరు సింహనాదము చేసిరి. కోందరు కిలకిలారావములు చేసిరి. మరికోందరు గర్జనలను తమ గర్జనలతో ప్రతిధ్వనించిరు. సంతోషపడిన కొందరు తమలాంగూలములను పైకెత్తారు. కొందరు తమతోకలతో నేలమీద కొట్టి సంతోషము వ్యక్తము చేశారు. ఇంకొందరు వానరులు సంతోషముతో శిఖరాగ్రములనుంచి దూకి హనుమంతుని స్పృశించిరి.

అప్పుడు ఆ వానరులందరి మధ్యలో హనుమంతునితో సముచితమైన మాటలతో అంగదుడు ఇట్లు పలికెను. " ఓ వానరా ఈ విస్తీర్ణమైన సాగరముని దాటి మళ్ళీ వచ్చిన నీలాంటి వీరుడు ఎవడూ వుండడు. అహా ఏమి నీ స్వామి భక్తి . ఏమి నీ సాహసము. అదృష్టముకొలదీ నీచేత యశస్విని అగు రామపత్ని చూడబడినది. అదృ ష్టముకొలదీ కాకుత్‍స్థుని సీతావియోగ దుఃఖము తొలగిపోవును" అని.

అప్పుడు ఆనందభరితులైన వానరులందరూ అంగదుని హనుమంతుని జామ్బవంతుని చుట్టూచేరి పెద్ద పెద్ద శిలలపై కూర్చొనిరి. ఆ వానరోత్తముని సముద్ర లంఘనము సీతా దర్శనము రావణుని దర్శనము గురించి హనుమంతుని ద్వారా వినకోరినవారై చేతులు జోడించి కూర్చుండిరి.

ఆ వానరులచేత చుట్టబడి వారి సేవలు అందుకుంటున్న ఆ అంగదుడు అప్పుడు ఇంద్రునివలె కనిపించెను.

కీర్తిమంతుడైన హనుమంతుడు అలాగే యశస్సు గల భుజకీర్తులు దాల్చిన అంగదుడు, ఆసీనులైన ఆ పర్వతము అతి శోభాయమానము గా అలరారుచుండెను.

ఈ విధముగా వాల్మీకి చే రచించబడిన ఆది కావ్యమైన శ్రీమద్రామాయణములో సుందరకాండలో ఏబది ఏడవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
శ్లో||హనూమతా కీర్తిమతా యశస్వినా
తథాఽఙ్గదే నాఙ్గదబద్ధబాహునా|
ముదా తదాఽధ్యాసితమున్నతం మహాన్
మహీధరాగ్రం జ్వలితం శ్రియాఽభవత్||51||
స|| కీర్తిమతా హనూమతా తథా యశస్వినా అంగదబద్ధబాహునా అంగదేన తదా ముదా అధ్యాసితం ఉన్నతం మహత్ మహీధరాగ్రం తదా శ్రియా జ్వలితం అభవత్ ||
తా||కీర్తిమంతుడైన హనుమంతుడు అలాగే యశస్సు గల భుజకీర్తులు దాల్చిన అంగదుడు, ఆసీనులైన ఆ పర్వతము అతి శోభాయమానము గా అలరారుచుండెను.
||ఓం తత్ సత్||