||సుందరకాండ ||

|| ఆఱవ సర్గ శ్లోకార్థ తాత్పర్యముతో||

|| Sarga 6 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ షష్టస్సర్గః

ఆరవ సర్గలో కథ ఇలా చెప్పవచ్చు.

సీత కనపడక పోవడముతో అతి దుఃఖముకలవాడై, హనుమంతుడు మళ్ళీ సీతాన్వేషి అయి మహావేగముతో లంకానగరములో తిరుగుతూ - "అససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనమ్" , అంటే రాక్షసేంద్రుని నివాసము చేరెను.

ఆ భవనము "రక్షితం రాక్షసైః ఘోరైః". అంటే ఘోరమైన రాక్షసులచేత, మహత్తరమైన వనమును సింహములు రక్షించినట్లు రక్షింపబడుతున్నదట. ఆ భవనము "ముఖ్యాభిశ్చ వరస్త్రీభిః" ముఖ్యులు వరస్త్రీలతో నిండియున్నదట. ఐశ్వర్యములతో విరాజిల్లుచున్న ఆ భవనము, "లంకాభరణం ఇతి" లంకకే ఆభరణము అని మహాకపి అనుకున్నాడు. అంటే లంకలో ఐశ్వర్యము చూస్తాము అన్నమాట. లక్ష్మీవాన్ అని సంబోధించబడే హనుమద్వారా చూసేది లంకలో ఐశ్వర్యమైనా, అంతరార్థములో వినపడేది లక్ష్మీవాన్ అనబడే హనుమ ఐశ్వర్యము.

ఇక ఆఱవ సర్గలో శ్లోకార్థములు.

||శ్లోకము 6.01||

స నికామం విమానేషు విషణ్ణః కామరూపధృత్|
విచచార పునర్లఙ్కాం లాఘవేన సమన్వితః||6.01||

స|| ( సీతాం అదృష్ట్వా) విషణ్ణః సః కామరూపధృత్ హనుమాన్ పునః సమన్వితః విమానేషు లాఘవేన నికామం లఙ్కాం విచచార ||

ఇదే రామటీకాలో- లాఘవేన అతివేగేన సమన్వితః కపిర్హనుమాన్ విమానేషు సప్తభూమికా ప్రసాదేషు విచరన్ సన్ నికామం యథేఛ్చం విచచార। అని రాశారు.

||శ్లోకార్థములు||

విషణ్ణః సః కామరూపధృత్ -
అప్పుడు విషణ్ణవదనముతో కామరూపి అగు అతడు
హనుమాన్ పునః సమన్వితః -
హనుమంతుడు మళ్ళీసీతాన్వేషి అయి
లఙ్కాం విమానేషు లాఘవేన -
లంకలోని భవనములలో మహావేగముతో
నికామం లఙ్కాం విచచార -
అడ్డంకులు లేని వాడై లంకలో వెదకసాగెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు విషణ్ణవదనముకల, కామరూపి అగు హనుమంతుడు మళ్ళీసీతాన్వేషి అయి మహావేగముతో మరల లంకానగరములో తిరగసాగెను."॥6.01॥

||శ్లోకము 6.02||

అససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేన్ద్ర నివేశనమ్|
ప్రాకారేణార్కవర్ణేన భాస్వరేణాభిసంవృతమ్||2||

స|| అథ లక్ష్మీవాన్ ( అతివీర్యసంపన్నః) భాస్వరేణ అర్కవర్ణేన ప్రాకారేణ సంవృతం రాక్షసేన్ద్ర నివేశనమ్ అససాద ||

రామ తీకా లో - లక్ష్మీవాన్ అతి వీర్య సంపత్తివిశిష్ఠో హనుమాన్ ప్రాకారేణాభి సంవృతం రాక్షసేన్ద్ర నివాసం అససాద॥

||శ్లోకార్థములు||

అథ లక్ష్మీవాన్ - అప్పుడు లక్ష్మీ సంపన్నుడగు హనుమంతుడు
భాస్వరేణ అర్కవర్ణేన ప్రాకారేణ సంవృతం-
సూర్యుని వలే ప్రకాశిస్తున్న ఎఱ్ఱని రంగుతో ప్రకాశిస్తున్న ప్రాకారముతో చుట్టబడిన
రాక్షసేన్ద్ర నివేశనమ్ అససాద - రాక్షసేన్ద్రుని నివాసము చేరెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు లక్ష్మీ సంపన్నుడగు హనుమంతుడు మధ్యాహ్నపు సూర్యుని వలే ప్రకాశిస్తున్న, ఎఱ్ఱని రంగుతో ప్రకాశిస్తున్న ప్రాకారము గల రాక్షసాధిపతి భవనము చేరెను".॥6.02॥

ఇక్కడ లక్ష్మీవాన్ అంటే అతివీర్యసంపత్తి విశిష్ఠః అని, అంటే మహాపరాక్రమే సంపత్తిగా కలవాడు అని

||శ్లోకము 6.03||

రక్షితం రాక్షసైర్ఘోరైః సింహైరివమహద్వనమ్|
సమీక్షమాణో భవనం చకాశే కపికుఞ్జరః||6.03||

స||సింహైః రక్షితం మహావనమివ భీమైః రాక్షసైః రక్షితమ్ భవనమ్ సమీక్షమాణో కపికుఞ్జరః చకాశే||

||శ్లోకార్థములు||

సింహైః రక్షితం మహావనమివ - సింహములచే రక్షింపబడిన వనము వలె
భీమైః రాక్షసైః రక్షితమ్ భవనమ్ - రాక్షసుల చేత రక్షింపబడిన భవనమును
సమీక్షమాణో కపికుఞ్జరః చకాశే - చూస్తున్న హనుమంతుడు చకితుడాయెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ కపికుంజరుడు సింహములచే రక్షింపబడిన వనము వలె భయంకరమైన రాక్షసుల చేత రక్షింపబడిన భవనమును చూచి చకితుడాయెను".||6.03||

||శ్లోకము 6.04||

రూప్యకోపహితైశ్చిత్రైః తోరణైర్హేమభూషితైః|
విచిత్రాభిశ్చ కక్షాభిః ద్వారైశ్చరుచిరైర్వృతమ్ ||6.04||

స|| విచిత్రాభిః కక్ష్యాభిః రుచిరైః ద్వారైశ్చ రూప్యకోపహితైః చిత్రైః హేమభూషితైః తోరణైః వృతం ( భవనం దదర్శ)||

రామ టీకాలో - రూప్యకేణ రజతేన ఉపహితైః లిఖితైః చిత్రైః హేమభూషితైః తోరణైః బహిః ద్వారైశ్చ రుచిరైః ద్వారైH అన్తర్ద్వారైః కక్ష్యాభిః చ।

||శ్లోకార్థములు||

విచిత్రాభిః కక్ష్యాభిః - విచిత్రమైన వాకిళ్ళతో
రుచిరైః ద్వారైశ్చ - అందమైన ముఖ ద్వారములతో
రూప్యకోపహితైః చిత్రైః హేమభూషితైః తోరణైః -
బంగారము వెండితో చేయబడిన సింహద్వారములతో
వృతం (భవనం దదర్శ) - నిండియున్న ( భవనమును చూచెను)

||శ్లోకతాత్పర్యము||

"విచిత్రమైన వాకిళ్ళతో అందమైన ముఖ ద్వారములతో చుట్టబడి, బంగారము వెండితో చేయబడిన సింహద్వారములతో నిండియున్న ( భవనమును చూచెను)". ||6.04||

||శ్లోకము 6.05||

గజాస్థితైర్మహామాత్రైః శూరైశ్చవిగతశ్రమైః|
ఉపస్థితం అసంహార్యైః హరయై స్యందనయాయిభిః||6.05||

స|| (హనుమాన్) గజస్థితైః మహామాత్రైః హయైః స్యందనయాయిభిః ఉపస్థితం విగతశ్రమైః అసంహార్యైః వీరైశ్చ ( దదర్శ)||

గజస్థితైః -
గజములమీద కూర్చుని
హయైః స్యందనయాయిభిః ఉపస్థితం-
గుఱ్ఱములుపూన్చిన రథము పై కూర్చునివున్న
అసంహార్యైః విగతశ్రమైః వీరైశ్చ- అజేయులైన శ్రమ ఎరుగని వీరులను
( చూచెను)

||శ్లోకతాత్పర్యము||

"గజములమీద కూర్చుని ఉన్న గజపాలకులను, గుఱ్ఱములుపూన్చిన రథము పై సంచరిస్తున్న అజేయులైన శ్రమ ఎరగని వీరులను చూచెను." ||6.05||

||శ్లోకము 6.06||

సింహవ్యాఘ్రతనుత్రాణైః దాంతకాఞ్చనరాజతైః|
ఘోషవద్భిః విచిత్రైశ్చ సదా విచరితం రథైః||6.06||

స|| సింహ వ్యాఘ్ర తనుత్రాణైః దాన్తకాఞ్చన రాజతైః విచిత్రైః ఘోషవద్భిః రథైః సదా విచరితం ( తం భవనం దదర్శ) ||

రామ టీకాలో- సింహవ్యాఘ్రాః సింహవ్యాఘ్ర చర్మ నిర్మితాని తనుత్రాణాని వర్మాణీ ఏషు తైః దాన్తకాంచన రాజతీః దాన్తాదిమయీః ప్రతిమాః సంధారయద్భిరితి శేషః- ఘోషవద్భిః చిత్రైః రథైః సదా విచరితం - ఘోషవత్త్వం కింకిణీభిః।

||శ్లోకార్థములు||

సింహ వ్యాఘ్ర తనుత్రాణైః - సింహము పులుల చర్మములతో చేయబడిన
దాన్తకాఞ్చన రాజతైః - బంగారు వెండి దంతాలతో అలంకరింప బడిన
విచిత్రైః ఘోషవద్భిః - చిత్రమైన ధ్వనులతో
రథైః సదా విచరితం - రథములు సంచరిస్తూ ఉన్నవి

||శ్లోకతాత్పర్యము||

"సింహము పులుల చర్మములతో చేయబడిన , బంగారు వెండి దంతాలతో అలంకరింప బడిన కవచములు తో నిండిన విచిత్రమైన రథములు వాటి ధ్వనులతో అచట సంచరిస్తూ ఉన్నవి."||6.06||

||శ్లోకము 6.07||

బహురత్న సమాకీర్ణం పరార్ధ్యాసనభాజనమ్|
మహారథసమావాసమ్ మహారథమహాస్వనమ్||6.07||

స|| పరార్థ్యాసన భాజనమ్ బహురత్న సమాకీర్ణం మహారథ సమావాసమ్ మహారథ మహాస్వనమ్ (భవనమ్ దదర్శ)||

||శ్లోకార్థములు||

బహురత్న సమాకీర్ణం - అమూల్యమైన రత్నములతో అలంకరింపబడిన
పరార్థ్యాసన భాజనమ్ - మంచి ఆసనములతో, పాత్రలతో,
మహారథ సమావాసమ్ - మహారథులకు ఆవాసముగా వున్న
మహారథ మహాస్వనమ్ - మహారథుల ఘోషలతో నిండియున్న
(భవనము చూచెను.)

||శ్లోకతాత్పర్యము||

"అమూల్యమైన రత్నములతో అలంకరింపబడిన, మంచి ఆసనములతో, పాత్రలతో వున్న, మహారథులకు ఆవాసముగా వున్న, మహారథుల ఘోషలతో నిండియున్న ఆ భవనము చూచెను."||6.07||

రామ టీకాలో - మహారథానామ్ 'ఏకోదశసహస్రాణి యోధయేద్యస్తు ధన్వినాం। శస్త్రశాస్త్రప్రవీణశ్చ స మహారథ ఉచ్యతే', ఇత్యుక్త లక్షణ మహారథానాం మహాసనం సదా వాసస్థానమ।

||శ్లోకము 6.08||

దృశ్యైశ్చ పరమోదారైః తైః తైశ్చ మృగపక్షిభిః|
వివిధైర్బహుసాహస్రైః పరిపూర్ణం సమంతతః||6.08||

స|| పరమోదారైః దృశ్యైః వివిధైః బహు సాహస్రైః తైశ్చ మృగపక్షిభిః తైః పరిపూర్ణం సమన్తతః ( భవనమ్ దదర్శ) ||

||శ్లోకార్థములు||

పరమోదారైః దృశ్యైః - అతి సంతోషము కలిగించు చూడతగిన
వివిధైః బహు సాహస్రైః - వివిధరకములైన వేలకొలదీ
మృగపక్షిభిః - మృగములతో పక్షులతో
తైః పరిపూర్ణం సమన్తతః - వాటిచేత పూర్తిగా నింపబడిన
( భవనమ్ దదర్శ - భవనము చూచెను)

||శ్లోకతాత్పర్యము||

"ఆ భవనము చూచుటకు అందముగానున్న అనేకరకముల వేలకొలది అందమైన పక్షులు మృగముల తో నిండియుండెను".||6.08||

||శ్లోకము 6.09||

వినీతైరంతపాలైశ్చ రక్షోభిశ్చ సురక్షితమ్|
ముఖ్యాభిశ్చ వరస్త్రీభిః పరిపూర్ణం సమంతతః||6.09||

స|| వినీతైః అన్తపాలైః చ రక్షోభిః సురక్షితం ముఖ్యాభిః వరస్త్రీభిః పరిపూర్ణం సమంతతః (భవనమ్ దదర్శ)||

||శ్లోకార్థములు||

వినీతైః అన్తపాలైః చ - సుశిక్షులూ వినీతులూ అయిన
రక్షోభిశ్చ సురక్షితమ్ - రాక్షసులచేత రక్షింపబడుతున్న
ముఖ్యాభిః వరస్త్రీభిః - ముఖ్యమైన వరస్త్రీలతో
పరిపూర్ణం సమంతతః - పరిపూర్ణముగా నిండి యున్న
(భవనమ్ దదర్శ - భవనము చూసెను)

||శ్లోకతాత్పర్యము||

"సుశిక్షులూ వినీతులూ అయిన రాక్షసులచేత రక్షింపబడుతూ ఆ భవనము ముఖ్యమైన వరస్త్రీలతో నిండి ఉండెను".||6.09||

||శ్లోకము 6.10||

శ్లో|| ముదిత ప్రమదారత్నం రాక్షసేన్ద్ర నివేశనమ్|
వరాభరణ సంహ్రాద్రైః సముద్రస్స్వననిస్స్వనమ్||6.10||

స|| రాక్షసేన్ద్ర నివేశనం ముదిత ప్రమదారత్నం వరాభరణ సంహ్రాద్రైః సముద్రస్స్వనన్నిస్వనమ్ ||

రామ టీకాలో- ముదితాని ప్రమాద రత్నాని శ్రేష్ఠ ప్రమదా యస్మిన్ తత్ రాక్షసేన్ద్రనివేశనం ప్రవేశో యస్మిన్ వరాభరణ ఉత్తమ భూషణనిఃశ్వనైః సముద్ర సదృశః నిస్వనీఒ తయస్మిన్ తత్।

||శ్లోకార్థములు||

రాక్షసేన్ద్ర నివేశనమ్ - రాక్షసేంద్రుని నివాసము
వరాభరణ సంహ్రాద్రైః - మంచి ఆభరణముల ధ్వనులతో
ముదిత ప్రమదారత్నం - సంతోషముగావున్న స్త్రీరత్నములు
సముద్రస్స్వననిస్స్వనమ్ - సముద్రపు ధ్వనితో యున్నట్లు ఉండెను.

||శ్లోకతాత్పర్యము||

"ఆ రాక్షసేంద్రుని నివాసము సంతోషముగావున్న స్త్రీరత్నములు ధరించిన మంచి ఆభరణముల ధ్వనులతో సముద్రపు ధ్వనితో నిండియున్నట్లు ఉండెను."||6.10||

||శ్లోకము 6.11||

తద్రాజగుణసంపన్నం ముఖ్యైశ్చాగరుచందనైః|
మహాజనైః సమాకీర్ణం సింహైరివ మహద్వనమ్||6.11||

స|| తత్ (భవనం) అగరుచన్దనైః రాజగుణసంపన్నం ముఖ్యైః మహాజనైః సమాకీర్ణం భవనం సింహైః సమాకీర్ణం మహత్ వనమివ (అస్తి)||

||శ్లోకార్థములు||

అగరుచన్దనైః - అగరు చందనాది సుగంధ ద్రవ్యములతో
రాజగుణసంపన్నం - రాజగుణములు కల
ముఖ్యైః మహాజనైః సమాకీర్ణం -
ముఖ్యులు మహాజనులతో నిండి
సింహైః సమాకీర్ణం మహత్ వనమివ (అస్తి) -
సింహములతో నిండిన వనము వలె నుండెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ భవనము అగరు చందనాది సుగంధ ద్రవ్యములతో రాజగుణములు కల ముఖ్యులు మహాజనులతో నిండి సింహములతో కూడిన వనము వలెనుండెను.'' ||6.11||

||శ్లోకము 6.12||

భేరీమృదఙ్గాభిరుతం శంఖఘోషనినాదితమ్|
నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసైస్సదా||6.12||

స|| (తత్ భవనం) భేరీమృదఙ్గాభిరుతం శంఖఘోషనినాదితం (అస్తి) నిత్యార్చితం పర్వహుతం రాక్షసైః సదా పూజితం (అపి చ)||

||శ్లోకార్థములు||

భేరీమృదఙ్గాభిరుతం - భేరీమృదంగముల ధ్వనులతో
శంఖఘోషనినాదితం - శంఖారావములతో
నిత్యార్చితం పర్వహుతం - నిత్యము పర్వదినములలోను చేయబడిన అర్చనలతో
రాక్షసైః సదా పూజితం - రాక్షసులచేత ఎల్లప్పుడు పూజింపబడుతూ వున్నది.

||శ్లోకతాత్పర్యము||

"ఆ భవనము భేరీమృదంగముల ధ్వనులతో, శంఖారావములతో, నిత్యము చేయబడు అర్చనలతో, పర్వదినములలో చేయబడిన ఆహుతులతో, రాక్షసులచేత ఎల్లప్పుడు పూజింపబడుతూ వున్నది." ||6.12||

||శ్లోకము 6.13||

సముద్రమివ గమ్భీరం సముద్రమివ నిస్స్వనమ్|
మహాత్మనోమహద్వేశ్మ మహారత్న పరిఛ్ఛదమ్||6.13||
మహారత్న సమాకీర్ణం దదర్శ స మహాకపిః|

స|| సముద్రమివ గమ్భీరం నిస్స్వనమ్ సముద్రమివ మహారత్నపరిచ్ఛదమ్ మహారత్న సమాకీర్ణం మహాత్మనస్య మహత్ వేశ్మ తత్ మహకపిః దదర్శ||

||శ్లోకార్థములు||

సముద్రమివ గమ్భీరం - సముద్రములాగ గంభీరముగా
నిస్స్వనమ్ సముద్రమివ - సముద్రము లాగా నిశ్శబ్దముగా వున్న
మహాత్మనస్య మహారత్నపరిచ్ఛదమ్ మహారత్న సమాకీర్ణం -
మహాత్ముని యొక్క మహా రత్నములతో కూడిన కప్పు గల, రత్నములతో కూడిన
మహత్ వేశ్మ తత్ మహకపిః దదర్శ-
మహత్తరమైన ఆ భవనమును మహాకపి చూచెను

||శ్లోకతాత్పర్యము||

"సముద్రములాగ గంభీరముగా సముద్రము లాగా నిశ్శబ్దముగా వున్న ఆ మహాత్ముని యొక్క మహా రత్నములతో, రత్నములతో కూడిన నగలతో వున్న పైకప్పుగల ఆ మహత్తరమైన భవనమును, ఆ మహాకపి చూచెను" ||6.13||.

తిలక టీకాలో,- సముద్రమివ గమ్భీరం మహారత్నాని మహారత్నమయాః పరిచ్ఛదాః అలంకారాదయో యస్మిన్

గోవిన్దరాజ టికాలో - సముద్రమివ నిఃశ్వనమ్ నిఃశబ్దం।రావణభీత్యా జనకోలహలరహితం ఇత్యర్థః అత ఏవ నిఃశబ్దం।

||శ్లోకము 6.14, 15||

విరాజమానం వపుషాగజాశ్వరథసంకులమ్||6.14||
లంకాభరణమిత్యేవ సోఽమన్యత మహాకపిః|
చచార హనుమాంస్తత్ర రావణస్య సమీపతః||6.15||

స|| ఏవం గజాశ్వరథ సంకులం విరాజమానం ( భవనం) వపుషా లంకాభరణం ఇతి సః మహాకపిః అమన్యత|| తత్ర హనుమతః రావణస్య( భవనం) సమీపతః చచార||

||శ్లోకార్థములు||

ఏవం గజాశ్వరథ సంకులం - గజాశ్వరథసంకులముతో
విరాజమానం ( భవనం) - విరాజిల్లుచున్న (ఆ భవనము)
వపుషా లంకాభరణం ఇతి - చూడడానికి లంకకే ఆభరణము అని
సః మహాకపిః అమన్యత - ఆ మహాకపి అనుకొనెను
తత్ర హనుమతః రావణస్య( భవనం) సమీపతః చచార -
అప్పుడు ఆ హనుమంతుడు రావణునియొక్క భవనము సంచరించసాగెను.

||శ్లోకతాత్పర్యము||

"ఆ మహాకపి గజాశ్వరథసంకులముతో విరాజిల్లుచున్న ఆ భవనము లంకకే ఆభరణము అని తలచెను. అక్కడ ఆరావణుని భవనము దగ్గరే అ హనుమంతుడు సంచరించసాగెను." ||6.14,15||

||శ్లోకము 6.16||

గృహాద్గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః|
వీక్షమాణో హ్యసంత్రస్తః ప్రాసాదాంశ్చ చచార సః||6.16||

స||గృహాత్ గృహం రాక్షసానాం చ ఉద్యానాని ప్రాశాదాంశ్చ వీక్షమాణః అసంత్రస్తః హనుమాన్ చచార||

||శ్లోకార్థములు||

గృహాత్ గృహం రాక్షసానాం చ -
రాక్షసుల యొక్క ఒక గృహమునుంచి ఇంకో గృహమునకు
ఉద్యానాని ప్రాశాదాంశ్చ వీక్షమాణః - ఉద్యానములు ప్రాసాదములు చూస్తూ
అసంత్రస్తః హనుమాన్ చచార- జంకులేకుండా ఆ హనుమంతుడు తిరుగసాగెను.

||శ్లోకతాత్పర్యము||

"ఒక గృహమునుంచి ఇంకో గృహము చూస్తూ రాక్షసుల ప్రతి గృహము ఉద్యానములు ప్రాసాదములు చూస్తూ జంకులేకుండా ఆ హనుమంతుడు తిరుగసాగెను". ||6.16||

||శ్లోకము 6.17||

అవప్లుత్య మహావేగః ప్రహస్తస్య నివేశనమ్|
తతోఽన్యత్ పుప్లువే వేశ్మ మహాపార్శ్వస్య వీర్యవాన్||6.17||

స|| మహావీర్యః మహావేగః ప్రహస్తస్య నివేశనమ్ అవప్లుత్య మహాపార్శ్వస్య (భవనం) తతః అన్యత్ ( భవనం) పుప్లువే||

||శ్లోకార్థములు||

మహావీర్యః మహావేగః -
మహావీరుడు మహావేగముతో
ప్రహస్తస్య నివేశనమ్ అవప్లుత్య -
ప్రహస్తుని గృహము లోకి దూకి
తతః మహాపార్శ్వస్య అన్యత్ పుప్లువే -
తరువాత మహపార్స్వుని భవనములో కి దూకెను.

||శ్లోకతాత్పర్యము||

"మహావీరుడు మహావేగముతో ప్రహస్తుని గృహము లోకి దూకి తరువాత మహపార్స్వుని భవనములో కి దూకెను".||6.17||

||శ్లోకము 6.18||

అథ మేఘ ప్రతీకాశం కుంభకర్ణనివేశనమ్|
విభీషణస్య చ తథాపుప్లువే స మహాకపిః||6.18||

స|| అథ సః మహాకపిః మేఘప్రతీకాశం కుంభకర్ణస్య నివేశనం తదా విభీషణస్య( భవనం) పుప్లువే||

||శ్లోకార్థములు||

అథ సః మహాకపిః - అప్పుడు ఆ మహాకపి
మేఘప్రతీకాశం కుంభకర్ణస్య నివేశనం -
మేఘములతో సమానముగా ప్రకాశించు కుంభకర్ణుని గృహము
తదా విభీషణస్య( భవనం) పుప్లువే -
అలాగే విభీషణుని గృహములో కి దూకెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ మహాకపి మేఘములతో సమానముగా ప్రకాశించు కుంభకర్ణుని గృహము అలాగే విభీషణుని గృహములో కి దూకెను." ||6.18||

||శ్లోకము 6.19||

మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవ హి|
విద్యుజ్జిహ్వస్య భవనం విద్యున్మాలేస్తధైవచ ||6.19||
వజ్రదంష్ట్రస్య చ తథా పుప్లువే స మహాకపిః|

స|| సః మహాకపిః మహోదరస్య గృహం చ విరూపాక్షస్య చ ఏవ హి విద్యుజ్జిహ్వస్య తథైవ చ విద్యుమాలేః తథైవ వజ్రదంష్ట్రస్య భవనం పుప్లువే||

||శ్లోకార్థములు||

సః మహాకపిః మహోదరస్య గృహం -ఆ వానరుడు మహోదరుని గృహము
విరూపాక్షస్య చ ఏవ హి - అలాగే విరూపాక్షుని గృహము
విద్యుజ్జిహ్వస్య తథైవ చ విద్యుమాలేః -
అలాగే విద్యుజ్జిహ్వుని గృహము, విద్యుమాలి గృహము
తథైవ వజ్రదంష్ట్రస్య భవనం పుప్లువే -
అలాగే వజ్రదంష్ట్రుని గృహములోకి దూకెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ వానరుడు మహోదరుని గృహము, విరూపాక్షుని గృహము , అలాగే విద్యుజ్జిహ్వుని గృహము విద్యుమాలి గృహము, అలాగే వజ్రదంష్ట్రుని గృహములోకి దూకెను." ||6.19||

||శ్లోకము 6.20||

శుకస్య చ మహాతేజాః సారణస్య చ ధీమతః||6.20||
తథా చేన్ద్రజితోవేశ్మ జగామ హరియూధపః|

స|| మహాతేజాః హరియూథపః శుకస్య ధీమతః సారణస్య తథా ఇంద్రజితః వేశ్మ జగామ||

||శ్లోకార్థములు||

మహాతేజాః హరియూథపః - మహాతేజోవంతుడైన ఆ వానరోత్తముడు
శుకస్య ధీమతః సారణస్య- ధీమంతులైన శుకుడు, సారణుడు
తథా ఇంద్రజితః వేశ్మ జగామ - అలాగే ఇంద్రజిత్తు భవనములకు వెళ్ళెను

||శ్లోకతాత్పర్యము||

"మహాతేజోవంతుడైన ఆ వానరోత్తముడు ధీమంతులైన శుకుడు, సారణుడు, అలాగే ఇంద్రజిత్తు భవనములకు వెళ్ళెను". ||6.20||

||శ్లోకము 6.21,22||

జంబుమాలే స్సుమాలేశ్చ జగామ హరిసత్తమః||6.21||
రశ్మి కేతోశ్చ భవనం సూర్య శత్రోస్తథైవచ |
వజ్రకాయస్య చ తథా పుప్లువే స మహాకపిః ||6.22||

స|| హరిసత్తమః జమ్బుమాలేః సుమాలేః చ జగామ|| సః మహాకపిః రశ్మికేతోః తథైవ చ సూర్యశత్రోః చ తథా వజ్రకాయస్య భవనం పుప్లువే||

||శ్లోకార్థములు||

హరిసత్తమః జమ్బుమాలేః - ఆ హరిసత్తముడు జంబుమాలి
సుమాలేః చ జగామ - సుమాలి గృహములకు వెళ్ళెను
సః మహాకపిః రశ్మికేతోః - ఆ మహాకపి రశ్మికేతుడు
తథైవ చ సూర్యశత్రోః చ - అలాగే సూర్యశత్రుడు
తథా వజ్రకాయస్య భవనం పుప్లువే - ఇంకా వజ్రకాయుడి భవనములలో దూకెను.

||శ్లోకతాత్పర్యము||

"ఆ హరిసత్తముడు జంబుమాలి, సుమాలి గృహములు వెదెకెను. ఆ మహాకపి రశ్మికేతుడు అలాగే సూర్యశత్రుడు , వజ్రకాయుడు భవనములను వెదెకెను". ||6.21,22||

||శ్లోకము 6.23||

ధూమ్రాక్షస్య చ సంపాతేః భవనం మారుతాత్మజః|
విద్యుద్రూపస్య భీమస్య ఘనస్య విఘనస్య చ||6.23||
శుకనాసస్య వక్రస్య శఠస్య వికటస్య చ|

స|| ధూమ్రాక్షస్య తథా సంపాతేః భవనం తథైవ విద్యుద్రూపస్య భీమస్య ఘనస్య విఘనస్య చ|| తథా శుకనాసస్య వక్రస్య వికటస్య చ ( భవనం పుప్లువే)||

||శ్లోకార్థములు||

ధూమ్రాక్షస్య తథా సంపాతేః భవనం - ధూమ్రాక్షుడు అలాగే సంపాతి భవనములు
తథైవ విద్యుద్రూపస్య భీమస్య - అలాగే విద్యుద్రూపుడు, భీముడు
ఘనస్య విఘనస్య చ - అల్లగే ఘనుడు, విఘనుడు
తథా శుకనాసస్య వక్రస్య వికటస్య చ - అలాగే శుకనాసుడు, వక్రుడు వికటుడు,
( మున్నగు వారి గృహములలో వెదకెను)

||శ్లోకతాత్పర్యము||

"అలాగే ధూమ్రాక్షుడు అలాగే సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు మున్నగు వారి భవనములు వెదెకెను. అలాగే శుకనాసుడు, వక్రుడు వికటుడు (మున్నగు వారి భవనములలో వెదకెను)" ||6.23||

|| శ్లోకములు 6.24,25||

బ్రహ్మకర్ణస్య దంష్ట్రస్య రోమశస్య చ రక్షసః||6.24||
యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య నాదినః|
విద్యుజ్జిహ్వేన్ద్రజిహ్వానాం తథా హస్తిముఖస్య చ||6.25||

స|| బ్రహ్మకర్ణస్య దంష్ట్రస్య రోమశస్య చ (భవనం పుప్లువే)|| యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య నాదినః (భవనం చ) విదుజ్జిహ్వస్య ఇన్ద్రజిహ్వస్య తథా హస్తిముఖస్య (భనం పుప్లువే)||

||శ్లోకార్థములు||

బ్రహ్మకర్ణస్య దంష్ట్రస్య రోమశస్య చ -
అలాగే బ్రహ్మకర్ణుడు దంష్ట్రుడు, రోమశుడు
యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య నాదినః -
యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది
విదుజ్జిహ్వస్య ఇన్ద్రజిహ్వస్య తథా హస్తిముఖస్య - విధ్యుజ్జిహ్వుడు,ఇన్ద్రజిహ్వుడు,హస్తిముఖుడు

||శ్లోకతాత్పర్యము||

"అలాగే బ్రహ్మకర్ణుడు, దంష్ట్రుడు, రోమశుడు మున్నగు రాక్షసుల భవనములు చూచెను. అలాగే యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, నాది, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు మున్నగు వారి భవనములు చూచెను" ||6.24,25||.

||శ్లోకము 6.26||

కరాళస్య పిశాచస్య శోణితాక్షస్య చైవ హి|
క్రమమాణం క్రమేణైవ హనుమాన్మారుతాత్మజః||6.26||

స||హనుమామ్మారుతాత్మజః కరాళస్య పిశాచస్య శోణితాక్షస్య చ (భవనం అపి) క్రమమాణం క్రమేనైవ (పుప్లువే)||

||శ్లోకార్థములు||

హనుమామ్మారుతాత్మజః -
మారుతాత్మజుడైన హనుమ
కరాళస్య పిశాచస్య శోణితాక్షస్య చ -
కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడుల ( భవనములను)
క్రమమాణం క్రమేనైవ - క్రమముగా వరుసలో ( వెదకెను)

||శ్లోకతాత్పర్యము||

"అలాగే వరుసగా కరాళుడు, పిశాచుడు శోణితాక్షుడు మున్నగు వారి భవనములను ఆ మారుతాత్మజుడు వెదెకెను." ||6.26||

||శ్లోకము 6.27||

తేషు తేషు మహార్హేషు భవనేషు మహాయశాః|
తేషాం వృద్ధిమతాం వృద్ధిం దదర్శ స మహాకపిః||6.27||

స|| మహాయశాః మహార్హేషు తేషు భవనేషు ఋద్ధిమతాం తేషాం ఋద్ధిం సః మహాకపిః దదర్శ||

||శ్లోకార్థములు||

మహాయశాః మహార్హేషు తేషు భవనేషు -
ఆ మహాయశోవంతుడు మహత్తరమైన ఆ భవనములలో
ఋద్ధిమతాం తేషాం ఋద్ధిం - ఐశ్వర్యవంతుల ఐశ్వర్యమును
సః మహాకపిః దదర్శ - ఆ మహాకపి చూచెను

॥శ్లోక తాత్పర్యములు॥

"ఆ మహాయశోవంతుడు వారి వారి భవనములలో ఐశ్వర్యవంతులగు వారి ఐశ్వర్యము చూసెను." ||6.27||

||శ్లోకము 6.28||

సర్వేషాం సమతిక్రమ్య భవనాని సమంతతః |
అససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేన్ద్రనివేశనమ్|| 6.28||

స|| సః లక్ష్మీవాన్ సర్వేషాం భవనాని సమన్తతః రాక్షసేన్ద్ర నివేశనం ఆససాద||

||శ్లోకార్థములు||

సః లక్ష్మీవాన్ - ఆ లక్ష్మీవంతుడు
సర్వేషాం భవనాని సమన్తతః - అందరి భవనములు దాటి
రాక్షసేన్ద్ర నివేశనం ఆససాద - రాక్షస రాజు భవనమును చేరెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ ఐశ్వర్యవంతుడైన హనుమంతుడు అందరి భవనములు దాటి రాక్షసేంద్రుని నివాసము చేరెను." ||6.28||

ఇక్కడ - "అససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేన్ద్రనివేశనమ్" - అంటూ లక్ష్మీ సంపన్నుడైన హనుమ రాక్షస రాజు నివాసము చేరెను అని అంటాడు వాల్మీకి. అయితే ఇక్కడ వర్ణన హనుమంతునికి కూడా రావణాసురుడి లంక ఓక ఆభరణములా వుంది అనిపించేటట్లు వున్న వర్ణన. అలా లంకను లంకలో ఐశ్వ ర్యాన్ని వర్ణిస్తూ , వాల్మీకి హనుమని లక్ష్మీసంపన్నుడు అనడములో అంతరార్థము ఏమిటి అని అనిపించవచ్చు. అది సర్గ చివరిలో విశ్లేషిస్తాము.

||శ్లోకము 6.29||

రావణస్యోపశాయిన్యో దదర్శ హరిసత్తమః|
విచరన్ హరిశార్దూలో రాక్షసీర్వికృతేక్షణః||6.29||
శూలముద్గరహస్తాశ్చ శక్తితోమరధారిణీః|

స||| హరిశార్దూలః హరిసత్తమః విచరన్ రావణస్య ఉపశాయిన్యః వికృతేక్షణాః శూలముద్గరహస్తాశ్చ శక్తితోమర ధారిణః రాక్షసీః దదర్శ ||

||శ్లోకార్థములు||

హరిశార్దూలః హరిసత్తమః విచరన్ -
శార్దూలము వంటి హరిసత్తముడున్వేషణలో
రావణస్య ఉపశాయిన్యః - రావణ ఉపశయనాగారమును రక్షించు
వికృతేక్షణాః శూలముద్గరహస్తాశ్చ -
వికృతమైన కళ్ళు గల, శూలములుముద్గరములు చేతిలో గల
శక్తితోమర ధారిణః రాక్షసీః దదర్శ -
శక్తులు తోమరాలు మున్నగు ఆయుధములను ధరించిన రాక్షస స్త్రీలను చూచెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ హరి శార్దూలము వంటి వానరసత్తముడు రావణుని భవనములో సంచరిస్తూ రావణ ఉపశయనాగారమును రక్షించు వికృతమైన కళ్ళుగల శూలములు ముద్గరాలు చేతిలో పట్టుకుని ఉన్న, శక్తులు, తోమరాలు మున్నగు ఆయుధములను ధరించిన రాక్షసస్త్రీలను చూచెను." ||6.29||

||శ్లోకము 6.30||

దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షఃపతేర్గృహే||6.30||
రాక్షాసాంశ్చ మహాకాయాన్ నానా ప్రహరణోద్యతాన్|

స|| తస్య రక్షః పతే గృహే వివిధాన్ గుల్మాన్ మహాకాయాన్ నానాప్రహరోద్యతాన్ రాక్షసాంశ్చ దదర్శ||

||శ్లోకార్థములు||

తస్య రక్షః పతే గృహే - ఆ రాక్షసాధిపతి గృహములో
నానాప్రహరోద్యతాన్ - అనేక అయుధములతో తయారుగావున్న
గుల్మాన్ మహాకాయాన్ - మహాకాయములు గల సైనికులు
రాక్షసాంశ్చ దదర్శ - రాక్షసులను చూచెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ రాక్షసాధిపతి గృహములో మహాకాయము గలవారు అనేక రకముల ఆయుధములను ప్రయోగించు వారితో కల సైనిక విభాగములను రాక్షసులను చూచెను".||6.30||

||శ్లోకము 6.31-32||

రక్తాన్ శ్వేతాన్ సితాంశ్ఛైవ హరీంశ్చాపి మహాజవాన్||6.31||
కులీనాన్ రూపసంపన్నాన్ గజాన్పరగజారుజాన్|
నిష్టితాన్ గజశిక్షయాం ఐరావతసమాన్యుధి||6.32||

స|| సః తస్మిన్ గృహే రక్తామ్ శ్వేతాన్ సితాంశ్చైవ మహాజవాన్ హరీంశ్చాపి ( దదర్శ)॥ కులీనాన్ రూపసంపన్నాన్ పరగజారుజాన్ గజాన్ నిష్టితాన్ గజశిక్షయాం ఐరావతసమాన్ యుధి (దదర్శ)॥

॥శ్లోకార్థములు॥

రక్తాన్ శ్వేతాన్ సితాంశ్ఛైవ - ఎఱుపు తెలుపు చామచాయ రంగుల
మహాజవాన్ హరీంశ్చాపి - వేగముగా పోగల గుఱ్ఱములను ( చూచెను)
కులీనాన్ రూపసంపన్నాన్ పరగజారుజాన్ గజాన్ - మంచికులములో పుట్టిన, రూపసంపన్నముగల, శత్రుగజములను పీడించగల గజములను
నిష్టితాన్ గజశిక్షయాం - గజశిక్షణలో నిష్ణాతులైనవారిచే శిక్షింపబడిన
ఐరావతసమాన్ యుధి - ఐరవాతముతో సమానమైన..

॥శ్లోకతాత్పర్యము॥

"ఆ భవనములో ఎఱుపు తెలుపు చామచాయ రంగుల వేగముగా పోగల గుఱ్ఱములను చూచెను. మంచికులములో పుట్టిన, రూపసంపన్నముగల, శత్రుగజములను పీడించగల గజములను,గజశిక్షణలో నిష్ణాతులైనవారిచే శిక్షింపబడిన ఐరావతముతో సమానమైన గజములను (చూచెను)" ||6.31,32||

॥శ్లోకము 6.33॥

నిహంతౄన్పరశైన్యానాం గృహే తస్మిన్ దదర్శ సః|
క్షరతశ్చ యథామేఘాన్ స్రవతశ్చ యథా గిరీన్||6.33||
మేఘస్తనిత నిర్ఘోషాన్ దుర్ధర్షాన్ సమరే పరైః|

స|| సః తస్మిన్ గృహే రక్తామ్ శ్వేతాన్ సితాంశ్చైవ మహాజవాన్ హరీంశ్చాపి ( దదర్శ)॥ కులీనాన్ రూపసంపన్నాన్ పరగజారుజాన్ గజాన్ నిష్టితాన్ గజశిక్షయాం ఐరావతసమాన్ యుధి (దదర్శ)॥ పరశైన్యానాం నిహన్తౄన్ క్షరతః యథా మేఘాన్ స్రవతః చ యథా గిరీన్, సమరే పరైః దుర్ధర్షాన్ గజాన్ తస్మిన్ గృహే దదర్శ ||

||శ్లోకార్థములు||

నిహంతౄన్పరశైన్యానాం -
(యుద్ధములో) those which can destroy enemies in the battle
క్షరతః స్రవతః యథా మేఘాన్ చ యథా గిరీన్ -
shedding rut like the clouds pouring water on the mountains
మేఘస్తనిత నిర్ఘోషాన్ -
trumpeting like a group of clouds
సమరే పరైః దుర్ధర్షాన్ గజాన్ -
unassailable by enemies in the war
తస్మిన్ గృహే దదర్శ -
saw in his house

||శ్లోకతాత్పర్యము||

"యుద్ధములో పరసైన్యమును హతమార్చగలిగిన, పర్వతములమీద వర్షించు మేఘములవలె మదోదకాన్ని స్రవిస్తూ ఉన్న, మేఘములవలె ఘీంకరిస్తున్న, యుద్ధములో ఎవరూ ఎదురుకోనలేని గజములను, ఆ రావణుని గృహములో చూచెను" ||6.33||.

||శ్లోకము 6.34,35||

సహస్రం వాహినీస్తత్ర జాంబూనదపరిష్కృతాః||6.34||
హేమజాలపరిచ్చన్నాః తరుణాదిత్యసన్నిభాః|
దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే||6.35||

స|| తత్ర రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే జామ్బూనదపరిష్కృతాః హేమజాలపరిఛ్చన్నాః తరుణాదిత్యసన్నిభాః సహస్రం వాహినీం దదర్శ||

||శ్లోకార్థములు||

తత్ర రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే -
ఆ రాక్షస రాజు అయిన రావణుని భవనములో
జామ్బూనదపరిష్కృతాః - బంగారముతో అలంకరింపబడి
హేమజాలపరిఛ్చన్నాః - బంగారు కవచములతో నున్న
తరుణాదిత్యసన్నిభాః - ఉదయము సూర్యభానునివలె ప్రకాశిస్తున్న
సహస్రం వాహినీం దదర్శ - వేలకొలదీ సేనావాహినులను చూచెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ రాక్షస రాజు అయిన రావణుని భవనములో బంగారముతో అలంకరింపబడి బంగారు కవచములతో నున్న, ఉదయము సూర్యభానునివలె ప్రకాశిస్తున్న, వేలకొలదీ సేనావాహినులను చూచెను." ||6.34,35||.

||శ్లోకము 6.36,37||

శిబికా వివిధాకారాః సకపిర్మారుతాత్మజః|
లతాగృహాణి చిత్రాణి చిత్రశాలాగృహాణిచ||6.36||
క్రీడాగృహాణి చాన్యాని దారుపర్వతకానపి|
కామస్య గృహకం రమ్యం దివాగృహకమేవచ ||6.37||
దదర్శ రాక్షసేన్ద్రస్య రావణస్య నివేశనే|

స|| సః కపిః మారుతాత్మజః రాక్షసేన్ద్రస్య రావణస్య నివేశనే వివిధాకారాః శిబికాః చిత్రాణి లతాగృహాణి క్రీడాగృహాణి దారుపర్వతకానపి కామస్య గృహకమ్ రమ్యం దివాగృహకమేవ చ దదర్శ||

||శ్లోకార్థములు||

సః కపిః మారుతాత్మజః - ఆ మారుతాత్మజుడైన హనుమ
రాక్షసేన్ద్రస్య రావణస్య నివేశనే - రాక్షసరాజైన రావణుని గృహములో
వివిధాకారాః శిబికాః - అనేక రకము లైన పల్లకీలను
చిత్రాణి లతాగృహాణి క్రీడాగృహాణి దారుపర్వతకానపి - విచిత్రమైన లతా గృహములను, క్రీడా గృహములను, కొయ్యతో చేయబడిన పర్వతములను
కామస్య గృహకమ్ - కామ క్రీడలకు అనువైన గృహములను
రమ్యం దివాగృహకమేవ చ దదర్శ -
పగటివేళ సుఖముగా గడపడానికి అనువైన గృహములను చూచెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ మారుతాత్మజుడు ఆ రాక్షసరాజు భవనములో వివిధాకారములు గల పల్లకీలు, చిత్రవిచిత్రములైన లతాగృహములు క్రీడాగృహములు , కొయ్యతో నిర్మించబడిన పర్వతములు, కామక్రీడలకు తగు భనములు, అందమైన పగటి వేళ సుఖముగా గడపడానికి అనువైన గృహములు చూచెను." ||6.36,37||.

రామ తిలక లో - చిత్రాణి లతా గృహాణి విచిత్ర శాలా రూప వేశ్మాని చ దారునిర్మితాః పర్వతాః యేషు తాని క్రీడా గృహానిచ, కామస్య గృహకం రతివేశ్మ, దివా గృహకం దివస విహార గృహం చ రావణస్య నివేశనే దదర్శ।

||శ్లోకము 6.38,39||

స మన్దరగ్రిప్రఖ్యం మయూరస్థానసంకులమ్||6.38||
ధ్వజయష్టిభి రాకీర్ణం దదర్శ భవనోత్తమమ్|
అనేకరత్నసంకీర్ణం నిధిజాలం సమంతతః||6.39||
ధీరనిష్టితకర్మాంతం గృహం భూతపతేరివ|

స|| సః మన్దరగిరిప్రఖ్యం మయూరస్థాన సంకులమ్ ధ్వజయష్టిభిః ఆకీర్ణన్ ధీరనిష్ఠిత కర్మాన్తమ్ భూతపతేః గృహమివ భవనోత్తమమ్ సమన్తతః అనేకరత్న సంకీర్ణమ్ నిధిజాలమ్ దదర్శ ||

||శ్లోకార్థములు||

మన్దరగిరిప్రఖ్యం - మందరపర్వతముతో సమానమైన
మయూరస్థాన సంకులమ్ - మయూరములుగలస్థానములతో
ధ్వజయష్టిభిః ఆకీర్ణన్ - ధ్వజములు కట్టబడు దండములతో నిండియుండెను
ధీరనిష్ఠిత కర్మాన్తమ్ - ధీరుల పర్యవేక్షణలో కట్టబడిన
భూతపతేః గృహమివ - భూతపతి గృహములాగా వున్న
భవనోత్తమమ్ సమన్తతః అనేకరత్న సంకీర్ణమ్ నిధిజాలమ్ -
భవనోత్తమము లో అనేక రత్నములను, రత్నముల నిధులను చూచెను

||శ్లోకతాత్పర్యము||

"మందరపర్వతముతో సమానమైన ఆభవనము , మయూరములుగల స్థానములతో , ధ్వజములు కట్టబడు దండములతో నిండియుండెను. ధీరుల పర్యవేక్షణలో భూతపతి గృహములాగా వున్న ఆ భవనోత్తమములో అనేక రత్నముల నిధులను చూచెను." ||6.38,39||.

||శ్లోకము 6.40||

అర్చిర్భిశ్చాపి రత్నానాం తేజసా రావణస్య చ||6.40||
విరరాజాథ తద్వేశ్మ రశ్మిమానివ రశ్మిభిః|

స|| తత్ వేశ్మ రత్నానామ్ అర్చిర్భిశ్చాపి రావణస్య తేజసా చ అథ రశ్మిభిః రశ్మిమానివ విరరాజ ||

||శ్లోకార్థములు||

తత్ వేశ్మ రత్నానామ్ అర్చిర్భిశ్చాపి -
ఆ భవనము అనేక రకములైన వజ్రములు రత్నములతో నిండియున్ననూ
రశ్మిభిః రశ్మిమానివ - సూర్యకిరణముల తేజస్సులాగ వున్న
రావణస్య తేజసా విరరాజ చ - రావణుని తేజస్సుతో విరాజిల్లెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ భవనము అనేక రకములైన వజ్రములు రత్నములతో నిండియున్ననూ సూర్యకిరణముల తేజస్సులాగావున్న రావణుని తేజస్సుతో విరాజిల్లెను." ||6.40||.

రామ తిలకలో/ రత్నానాం అర్చిభిః రావణస్య తేజసా చ ఉపలక్షితం తత్ వేశ్మ రశ్మిభిః కిఅరణైః రశ్మిమామ్ సూర్య ఇవ విరరాజ।- శ్లోకతాత్పర్యానుగుణముగా

||శ్లోకము 6.41||

జాంబూనదమయాన్యేన శయనాన్ ఆసనానిచ||6.41||
భాజనాని చ ముఖ్యాని దదర్శ హరియూథపః|

స|| హరియూథపః జామ్బూనదమయాన్యేవ శయనాని ఆసనాని చ ముఖ్యాని భాజనాని దదర్శ||

||శ్లోకార్థములు||

జామ్బూనదమయాన్యేవ శయనాని ఆసనాని -
బంగారము తో చేయించబడిన శయనములు ఆసనములు
ముఖ్యాని భాజనాని చ దదర్శ - ఇంకా ముఖ్యమైన పాత్రలు చూచెను.

||శ్లోకతాత్పర్యము||

"ఆ వానరోత్తముడు చూసిన భవనములో అక్కడ బంగారముతో చేయించబడిన శయనములు ఆసనములు , ఇంకా బంగారపు ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి." ||6.41||.

||శ్లోకము 6.42||

మధ్వాసవకృతక్లేదం మణిభాజనసంకులమ్||6.42||
మనోరమ మసంబాధం కుబేరభవనం యథా|

స|| మధ్వాసకృతక్లేదం మణిభాజనసంకులం మనోరమమ్ అసమ్భాధమ్ కుబేర భవనం యథా

||శ్లోకార్థములు||

మధ్వాసకృతక్లేదం - పానములతో నిండిన
మణిభాజనసంకులం -మణులతో చేయబడిన పాత్రలతో గల
మనోరమమ్ అసమ్భాధమ్ - మనోహరమైన విశాలమైన
కుబేర భవనం యథా - కుబేర భవనములాంటి
(మహా గృహమును ప్రవేశించెను)

||శ్లోకతాత్పర్యము||

"హనుమంతుడు అప్పుడు పానములతో నిండిన మణులతో చేయబడిన పాత్రలతో గల,మలోహరమైన విశాలమైన కుబేర భవనములాంటి మహా గృహమును ప్రవేశించెను." ||6.42||.

||శ్లోకము 6.43||

నూపురాణాం చ ఘోషేణ కాఞ్చీనాం నినదేన చ||6.43||
మృదఙ్గతలఘోషైశ్చ ఘోషవద్భిర్వినాదితమ్|

స|| నూపురాణాం కాఞ్చీనామ్ నినదేన ఘోషవద్భిః మృదఙ్గతలఘోషైశ్చ వినాదితమ్||

||శ్లోకార్థములు||

నూపురాణాం కాఞ్చీనామ్ ఘోషవద్భిః నినదేన-
బంగారపు నూపురముల నాదనినాదములతో నిండిన,
మృదఙ్గతలఘోషైశ్చ వినాదితమ్ - మృదంగముల ధ్వనులతో నిండిన
( మహాగృహమును హనుమ ప్రవేశించెను)

||శ్లోకతాత్పర్యము||

"బంగారపు నూపురముల నాదనినాదములతో నిండిన, మృదంగముల ధ్వనులతో నిండిన , ఆ ధ్వనులతో ప్రతిధ్వనిస్తున్న, (మహాగృహమును హనుమ ప్రవేశించెను)" ||6.43||.

||శ్లోకము 6.44||

ప్రాసాదసంఘాతయుతం స్త్రీరత్నశతసంకులమ్||
సువ్యూఢకక్ష్యం హనుమాన్ ప్రవివేశ మహాగృహమ్||6.44||

స|| ప్రాసాదసంఘాతయుతమ్ స్త్రీరత్నశతసంకులమ్ సువ్యూఢకక్ష్యం మహాగృహం హనుమాన్ ప్రావివేశ||

||శ్లోకార్థములు||

ప్రాసాదసంఘాతయుతమ్- ప్రాసాదముల సముదాయములో
స్త్రీరత్నశతసంకులమ్ - వందలాది స్త్రీరత్నములతో కూడిన
సువ్యూఢకక్ష్యం మహాగృహం - అందముగా అమర్చబడిన వాకిళ్ళతో గల మహాగృహమును
హనుమాన్ ప్రావివేశ - హనుమ ప్రవేశించెను.

||శ్లోకతాత్పర్యము||

"ప్రాసాదముల సముదాయములో, వందలాది స్త్రీరత్నములతో నిండిన, అందముగా అమర్చబడిన వాకిళ్ళతో గల (కుబేర భవనములాంటి) మహాగృహమును హనుమంతుడు ప్రవేశించెను". ||6.44||

ఈ శ్లోకముతో ఆఱవ సర్గ సమాప్తము అవుతుంది. కాని మధ్యలో అక్కడక్కడ విశ్లేషించవలసిన సందర్భాలలో అవి చివరికి వాయిదావేయబడ్డాయి. వాటిని మళ్ళీ పరిశీలిద్దాము.

29వ శ్లోకములో హనుమను వాల్మీకి - లక్ష్మీవాన్ - అని అంటాడు. అప్పటిదాకా వర్ణించినది లంకలో ఐశ్వర్యము.

అప్పుడు"దివి దేవపురీమ్ యథా", అంటే అమరావతిలా వెలుగుచున్న ఆ లంకానగరములో, "ఋద్ధిమతాం తేషాం ఋద్ధిం" ఐశ్వర్యవంతులగు వారి ఐశ్వర్యము చూస్తూ వెళ్ళుతున్న, "వృషదంశక" మాతృడైన హనుమంతుని
"లక్ష్మీవంతుడు" అని ఎందుకు అన్నాడు అన్న ప్రశ్న వస్తుంది. ఇంకా పైగా హనుమంతుని ఐశ్వర్యము ఏమిటి? అని మనకు తోచవచ్చు.

హనుమంతునిలో ఐశ్వర్యము, అతని సాధనలలో మనకి విదితమౌతుంది. అవి ఏవిటీ? ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము కలవాడై సముద్రలంఘనములో అన్ని అడ్డంకులను సునాయాసముగా దాటి లంకను చేరుట. అది ఒక ఐశ్వర్యము

త్రికూట పర్వతముపైన వుండి హనుమంతుడు, విశ్వకర్మచే బాహ్యముగా "మనసేవ కృతాం " మనస్సులోనే నిర్మింపబడిన లంకను, దేహము కన్న వేరైన ఆత్మ దేహమును చూడగలిగినట్లు చూడగలగడము, అది ఇంకో ఐశ్వర్యము.

ఆత్మాన్వేషణలో అహంకారమును చంపవలసినట్లు, లంకను చేరి అహంకార రూపి అయిన లంకిణిని చంపడము. అది ఇంకో ఐశ్వర్యము

అన్వేషణలో అనేక అపరూపమైన వస్తువులు కనబడుచున్నా, తన మార్గము విడవకుండా అన్వేషించుచూ రావణ భవనము చేరుట. అది కూడా ఇంకో ఐశ్వర్యము.

అత్మకంటే దేహము వేరు అను ఎరుగుట. అది ఒక ఐశ్వర్యము.

అట్టి ఆత్మను అన్వేషించుటకు శరీరములోనికి చూడ యత్నించుడము. అది కూడా ఐశ్వర్యము.

- మనస్సు దేహమునందు అదే ఆత్మ అని భ్రాంతి కలిగించుట యే దేహాత్మాభిమానమును. దానిని ఎదిరింపగలిగిన శక్తి ఉండడమే లంకిణి సంహారము. అది ఒక ఐశ్వర్యము.

- మనస్సును చూచి దానిని ఎరుంగుట.

అలాగ ఆత్మాన్వేషణలో అయా స్థితులను పొందిన వాడు ఐశ్వర్యవంతుడు అని అనబడును.

ఇవన్నీ హనుమంతుని సాధనలు. ఇవన్నీ హనుమంతుని ఐశ్వర్యములు.

బాహ్యమైన రావణుని ఐశ్వర్యమును చూపిస్తూ హనుమంతుని లక్ష్మీవాన్ అని, శ్రీమాన్ అని అనడంలో ఉద్దేశ్యము, బాహ్యమైన చూడబడే ఐశ్వర్యము ఐశ్వర్యము కాదని, అంతర్గతముగా వున్న ఐశ్వర్యమే ఐశ్వర్యము అని చెప్పడానికే.

ఇక్కడ హనుమంతుని " లక్ష్మీవంతుడు" అని అనడములో వున్న ఉద్దేశము అదే.

అంతే కాదు హనుమంతునిలాగ మనము ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము కలవారమైతే, అహంకారమును చంపగలిగినవారమైతే, ఆత్మ దేహము వేరు అనే భావము కలవారమైతే, మనకి కూడా ఆ ఐశ్వర్యములు ఉన్నట్లే |

అదే కవి వాల్మీకి భావము. అదే అప్పలాచార్యులవారు చెప్పిన భావము.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే షష్ఠస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఆఱవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

(uploaded 29092022)