||భగవద్గీత ||

|| ఏకాదశోధ్యాయము||

||విశ్వరూపసందర్శనయోగము -వచన వ్యాఖ్యానము ||


|| ఓమ్ తత్ సత్||

|| ఓమ్ తత్ సత్||
అర్జున ఉవాచ:
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితమ్|
యత్వయోక్తం వచస్తేన మోహోsయం విగతో మమ||1||

"నన్ను అనుగ్రహించుటకై ఉత్తమమైన రహస్యమైన అధ్యాత్మమను పేరుగల ఏ వాక్యమును నీచేత చెప్పబడినదో దాని చేత నా అజ్ఞానము తొలగి పోయినది".

ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః
శ్రీమద్ భగవద్గీత
విశ్వరూపసందర్శనయోగము
ఏకాదశోధ్యాయః

జ్ఞాన విజ్ఞానసహితమైన అతి గుహ్యమైన అంటే అతి రహస్యమైన బ్రహ్మజ్ఞానమును గురించి శ్రద్ధగా రాజవిద్యా రాజగుహ్య యోగములో వినిన అర్జునినితో, "ప్రీయామాణాయ తే" అంటే " ప్రీతిచెందిన నీకు" (అర్జునునికి)- "వక్ష్యామి హితకామ్యయా" అంటే "నీ హితముకోరి చెప్పుచున్నాను ” అంటూ తన విభూతి అంటే మహాత్మ్యము గురించి శ్రీకృష్ణ భగవంతుడు విభూతి యోగములో ప్రీతిచెందిన అర్జునునికి చెపుతాడు.

శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు చేసిన అధ్యాత్మ బోధతో అర్జునుని మోహము తొలగి పోయినది. అలాగ మోహము తొలగి పోయిన అర్జునుని భాషణతో ఈ విశ్వరూప సందర్శన యోగము మొదలవుతుంది. ప్రతిసారి ఏదో శంకతో ప్రశ్నలతో మొదలుపెట్టే అర్జునుడు ఈ సారి మోహము తొలిగిపోయింది అన్న అర్జునిని మాటతో అధ్యాయము మొదలవుతుంది.

అర్జున ఉవాచ:
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితమ్|
యత్వయోక్తం వచస్తేన మోహోsయం విగతో మమ||1||

అంటే అర్జునుడు "నన్ను అనుగ్రహించుటకై ఉత్తమమైన రహస్యమైన అధ్యాత్మమను పేరుగల ఏ వాక్యమును నీచేత చెప్పబడినదో దాని చేత నా అజ్ఞానము తొలగి పోయినది" అంటాడు.

ఏ అవివేకమువలన మొట్టమొదట ఈ జగత్తు నిత్యమని బంధువులు నావారనీ దేహమునాదనీ దుఃఖము నొందుచుండెనో అన్నమాట ' మోహోయం విగతోమమ ' అన్నమాటతో నిస్సందేహముగా ఆ మోహము పోయింది అని మనకి తెలుస్తుంది.

భగవానుడు ఇచ్చిన ఔషధము గీతామృతమనెడిది. అది శ్రేష్టమైనది . దాని వలన అంధకారము తోలగిపోయినది అర్జునినికి. ప్రపంచములో ఎన్నో విద్యలు ఉన్నాయి. అంధకార వినాశానికి అవి అన్నీ ఉపయోగము కావు. రహస్యమైనది శ్రేష్టమైనదీ బ్రహ్మవిద్య . గురువులు అందరికి అట్టి విద్య చెప్పరు. ఎవరియందు వారికి అనుగ్రహము కలదో వారికే చెప్పుతారు. కృష్ణభగవానుడు ఆ విద్య తన ప్రియతమ సఖుడగు అర్జునుని ద్వారా సమస్త ప్రజానీకానికీ అందిస్తాడు.

మోహము పోయిన అర్జునుడు ఇంకా ఇలా అంటాడు. ' నీ మహిమలన్నిటినీ వింటిని. చూచుటకు సాధ్యమైన నీ రూపము చూడవలెనని యున్నది' అని(11.02,03).

ఇంతకు ముందే అర్జునుడు కృష్ణునితో 'శిష్యస్తేహం' అంటే 'నీ శిష్యుడను నేను' అని అన్నాడు. దానికి తగిన వినయ విధేయలతో ఇప్పుడు విశ్వరూపము గురించి అడుగుతూ - 'యది మన్యసే తత్ శక్యం' (11.04) అంటే ఆ స్వరూపము చూచుటకు ( 'నాకు') సాధ్యము అని తలిస్తే చూపుము అని కూడా అంటాడు.

కృష్ణుడు దానికి సమాధానముగా ఇలా అంటాడు
శ్రీభగవానువాచ:
న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుసా(11.08)

అంటే ’ నీ నేత్రములతో నా స్వరూపము చూడలేవు’.
ఎందుకు?
అంటే ఆ స్వరూపము అంతటిది అని (11.05).
'నానావిధాని దివ్యాని' అనేక విధములైన దివ్యరూపములు
'నానా వర్ణాకృతీని చ' - అనేక మైన రంగులు ఆకృతులు గలవి
'శతసోధ సహస్రశః రూపాణీ' - వందలకొలది వేలకొలదీ రూపములు

ఆ వేలకొలదీ రూపములు ఏమిటీ అంటే

'అదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా'-
- సూర్యులు వసువులు రుద్రులు అశ్వనీ దేవతలు మరుత్తులు
'అదృష్ట పూర్వాణి'- ముందు చూడబడనివి
'అశ్చర్యాణి' - ఆశ్చర్యకరమైనవి
'స చరాచరమ్ జగత్ కృత్స్నమ్'- చరచారాత్మకమగు సమస్తమైన ప్రపంచము (11.06)
అంతేకాదు
'యచ్చాన్యత్ ద్రష్టుమిచ్ఛసి' - ఏదైతో చూడగోరుచున్నవో
(తత్) 'చ' - అది కూడా (11.07)

అంటే ఇంత సమస్త చరచరాత్మకముల స్థావర జంగమగు సమస్త ప్రపంచము తో కూడిన ఆశ్చర్యకరమైన అద్భుతమైన స్వరూపము - అట్టి స్వరూపమును

అర్జునా ! 'న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుసా'|
అంటే అర్జునా ' నీ నేత్రములతో నా స్వరూపము చూడలేవు'(11.08)
అందుకని

'దివ్యం దదామి తే చక్షుఃపశ్యమే యోగ మైశ్వరమ్|

'నీకు దివ్యమైన నేత్రములను ప్రసాదించుచున్నాను- నా ఈశ్వరసంబంధమగు యోగము చూడుము'

అలాచెప్పి దివ్యదృష్టిని ప్రసాదించి కృష్ణభగవానుడు తన విశ్వరూపమును అర్జునునికి చూపిస్తాడు. ముందుగా తన రూపమును వర్ణించి అట్టి రూపము చూడడము మనకు ఉన్న సహజనేత్రములు చాలవు అని , దివ్యనేత్రములను ప్రసాదించి తరువాత తన విశ్వరూపము చూపిస్తాడు. ఆ దివ్యరూపమునే సంజయుడు మళ్ళీ అదేవిధముగా వర్ణిస్తాడు. ఆ దివ్యరూపమును వర్ణించిన శ్లోకాలు చదవడానికి అద్బుతముగా వుంటాయి
సంజయ ఉవాచ:
అనేకవక్రనయనం అనేకాద్భుతదర్శనమ్|
అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుథమ్||10||
దివ్యమాల్యాంబరధరం దివ్యగన్ధానులేపనమ్|
సర్వాశ్చర్యమయం దేవం అనన్తం విశ్వతో ముఖమ్||11||
దివిసూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా|
యది భాస్సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః||12||

అట్టి రూపము చూచిన అర్జునుడు ఆశ్చర్యముతో గగుర్పాటుతో నమస్కరించి వినయవిధేయలతో కృష్ణభగవానుని స్తుతిస్తాడు.

' ఓ దేవా మీ శరీరమందు సమస్త దేవతలను అట్లే చరాచర ప్రాణికోట్లను సృష్టికర్తయగు బ్రహ్మదేవుని అలాగే సమస్త ఋషులను దేవసంబంధముగల సర్పములను చూచుచున్నాను. ఓ విశ్వరూపా మిమ్ములను అనేక హస్తములు, ఉదరములు, ముఖములు , నేత్రములు గలవానిగా చూచుచున్నాను. కాని నీయొక్క మొదలును మధ్యమును అంతమును చూడలేకున్నాను'.

అర్జున ఉవాచ:
త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|
త్వా వ్యయశ్శాశ్వత ధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే||18||

'నీవు తెలియదగిన నాశరహితమగు పరబ్రహ్మము. జగత్తునకు ఆధారభూతుడవు. శాశ్వతముగా ధర్మము రక్షింపువాడవు. పురాణ పురుషుడవు అని నా అభిప్రాయము'.

'భూమి ఆకాశముల యొక్క మధ్యప్రదేశమంతయూ నీ యొక్కని చేతనే వ్యాపింప బడినది. భయంకరము ఆశ్చర్యకరము అగు నీ రూపము చూసి మూడు లోకములు మిక్కిలి భయపడుచున్నవి. మహర్షుల సిద్ధుల సంఘములు లోకమునకు క్షేమమగుగాక అని నిన్ను స్తుతించుచున్నవి. ఓ కృష్ణా అనేక ముఖములు నేత్రములు హస్తములు ఉదరములు తొడలు పాదములు కలిగి ఉన్నట్టి అనేక కోరలచే భయంకరమైనట్టి ఆ రూపమును చూచి జనులందరూ మిగుల భయపడుచున్నారు. అలాగే నేను భయపడుచున్నాను.'

'ధృతరాష్ట్రుని కుమారులందరూ అలాగే భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ఇతరరాజుల సమూహముతో కోరలచే భయంకరముగా నున్న మీ నోళ్లయందు ప్రవేశించుచున్నారు. ఓ దేవోత్తమా భయంకరాకారముగల నీవెవరో నాకు చెప్పుము'.(11.26)

అలా భయపడిన అర్జునిని కి కృష్ణుడు చెపుతాడు:
శ్రీ భగవానువాచ:
కాలోsస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః||32||

'లోకసంహారకుడనై విజృంభించిన కాలుడను. ప్రాణులను సంహరించుటకు ఈ ప్రపంచమున ప్రవర్తించినవాడను'.

భగవంతుడికి కాలబేధము లేదు అందుకని భూతభవిష్యత్వర్తమానములు అర్జునికి విశ్వరూపమున గోచరించును. భీష్మ ద్రోణకర్ణాదులు సైనికులు భగవానుడి నోటి యందు ప్రవేశించుచుండుట అర్జునుడు ప్రత్యక్షముగ చూసెను. దీనివలన ఈ బంధుమిత్రాదులు ధన ధాన్యాలు భవనములు సంపదలు నశించి పోయేవే అని జీవుడు భావించవలెను.

శ్రీకృష్ణుడు ఇంకా ఇలాగ చెపుతాడు:
"శత్రుసైన్యములందు ఏ వీరులు ఉన్నారో వారందరో నీవు లేకపోయిననూమృతి చెందడి వారే. కాబట్టి లెమ్ము. శత్రువులను జయించి కీర్తిని బడయుము."

శ్రీభగవానువాచ
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణమ్ తథాsనాన్యపి యోధవీరాన్|
మయాహతాం స్త్వం జహి మావ్యధిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్||34||

ఆంటే - 'నా చేత చంపబడిన ద్రోణుడు , భీష్ముడు ,కర్ణుడు అలాగే ఇతర వీరులను నీవు చంపుము.'
'మావ్యధిష్టాః' - భయపడకుము !
'రణే సపత్నాన్ జేతాసి' - యుద్ధములో శత్రువులను గెలువ గలవు.

ఇక్కడ భగవంతుని సందేశము ఏమిటి అంటే - భయపడకుండా సర్వేశ్వరుని శరణు పోంది కర్తవ్యమును ధర్మపూర్వకముగా చేయుము అని . " మావ్యధిష్టాః " అంటే భయపడవలదని. జీవిత రంగమున తమ నిత్యవ్వవహారములందు అనేకవొడుదుడుకులు క్లేశములును ఎదుర్కొనవలసి యున్ననూ అపుడు ఈ వాక్యమును స్మరించుకొనీ ధైర్యము తెచ్చుకొనవలెను. అర్జునునివలె సమస్తము భగవదర్పణము చేసి నిర్మల చిత్తముతో 'జేతాసి' అంటే జయించగలవు అన్నమాట. ఉత్తమ ఫలితమును తప్పకబొందగలము. ఎక్కడ భగవత్ భావనయుండునో అక్కడ విజయము తధ్యము.

అది వినిన అర్జునుడు మళ్ళీ చేతులు జోడించి నమస్కరించి భగవంతుని స్తుతిస్తాడు.

'మీరే వాయువు యముడు అగ్నియు చంద్రుడు బహ్మదేవుడు అయి వున్నారు. మీకు అనేక వేల నమస్కారము. మళ్ళీ మీకు నమస్కారము. సర్వరూపుడవగు సర్వాంతర్యామి అగు నీకు ఎదుటను వెనుకను కూడా నమస్కారము'(11.39)

'అజానతా మహిమానం తవేదం' - 'నీ ఈ మహిమ తెలియక - నా అజ్ఞానములో ఓ కృష్ణా ఓ యాదవా ఓ సఖా అని అలక్ష్యముగా మిమ్ములను గురించి చెప్పితినో అది క్షమింప వేడు చున్నాను'.(11.41)

అర్జునఉవాచ
అదృష్ట పూర్వం హృషితోsస్మి దృష్ట్వాభయేన చ ప్రవ్యథితం మనో మే|
తదేవ మే దర్శయ దేవ రూపం ప్రశీద దేవేశ జగన్నివాస||45||

" ఇదివరకు ఎన్నడునూ చూడనట్టి ఈ విశ్వరూపమును చూచి అనందము పొందితిని. కాని భయముతో మనస్సు మిక్కిలి బాధపొందుచున్నాను. ఓ దేవా నీ ముందు స్వరూపమునే చూపుడు ! ఓ జగన్నివాస నన్ను అనుగ్రహించుము"

అర్జునిని ప్రార్థన విని శ్రీకృష్ణుడు (ప్రసన్నేన మయా) ప్రసన్నుడనైన నాచేత ఇదివరకు ఏవరి చేతనూ ( అదృష్టపూర్వం) చూడబడని సర్వోత్తమమైన విశ్వరూపము నీకు చూపబడినది అని చెప్పి ఇంకా ఇలా అంటాడు.
శ్రీభగవానువాచ:
న వేదయజ్ఞాధ్యయనైర్నదానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః
ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర||48||

అంటే
'న వేదయజ్ఞాధ్యనైః' - వేదాధ్యయనము చేత యజ్ఞాధ్యయనముచేత కాని
'న దానైః' - దానములచేతకాని
'న చ క్రియాభిః' - కర్మలచేత గాని
ఉగ్రైః తపొభిః - ఉగ్రమైన తపస్సు చేత కాని
మనుష్యలోకములో నన్ను చూచూటకు శక్యకాదు.

అటువంటి దుర్లభమైన ఎవరి చేతనూ చూడబడని విశ్వరూపమును అర్జునుడు భగవంతుడిచ్చిన దివ్యదృష్టి ద్వారా చూడగలిగాడనమాట.

అలా చెప్పి అర్జునుడి కోరికప్రకారము కృష్ణభగవానుడు తన మొదటి స్వరూపమును చూపించును.

మళ్ళీ వేదములచే త తపస్సు చేత దానములచేత సంభవించని ఈ దర్శనము ఎలాగ సంభవిస్తుంది అని కూడా కృష్ణ భగవానుడు అర్జునినికి చెపుతాడు.

శ్రీభగవానువాచ:
భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోsర్జున|
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప||54||

అంటే
’అనన్యయా భక్త్యా’ -అనన్యమైన భక్తితో
’తు’ - మాత్రమే
’జ్ఞాతుమ్’- తెలిసికొనుటకు
’ద్రష్టుం చ’ - చూచుటకు
’ప్రవేష్టుంచ’ - లీనమగుటకు
’శక్యః’ - శక్యము అగుచున్నాను

అనన్యభక్తి చేతనే భగవానుని 1 తెలిసికొనుటకు 2 చూచుట కు 3 ప్రవేశించుటకు- "జ్ఞాతుం, ద్రష్టుం , ప్రవేష్టుం", అన్నవి మూడు సోపానాలు. అనగా భగవంతుడు ఇట్టివాడని పరిజ్ఞానము కలుగుట మొదటి అంతస్తు. భగవంతుడిదగ్గరకు వచ్చి భక్తుడు అతి సమీపముగా దర్శింపగలుగును. ఇది రెండవ అంతస్తు. కరమునందలి అమలకముగా ప్రత్యక్షముగా జూచునట్లు చూడగలుగును. విశిష్టాద్వైత స్థితిలో భగవంతు చూసి ప్రవేసించి అతనిలో ఐక్యమైపోవును. అదే పూర్ణ అద్వైత స్థితి.

మొదటిది సామీప్యము రెండవది సారూప్యము మూడవది సాయుజ్యము

ఇదియే మోక్షము.

అంతేకాదు-
శ్రీభగవానువాచ:
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తసంగవర్జితః|
నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాణ్డవ||55||
అంటే
’మత్ కర్మకృత్’ - నాకొరకే కర్మలను చేయువాడు ( కర్మయోగము)
’మత్ పరమో’ - నన్నే పురుషార్థముగా నమ్మిన వాడు ( ధ్యానయోగము)
’మత్ భక్తః’ - నాయందే భక్తి కలవాడు ( భక్తి యోగము)
’సర్వభూతేషు నిర్వైరః’ - సమస్త ప్రాణులయందు ద్వేషము లేని వాడు
’సంగవర్జితః’ - మమత్వము వదిలిన వాడూ ( జ్ఞానయోగము)
’సః’ - అట్టివాడు !
అట్టి వాడు ’నన్ను’ పొందుతాడు అన్న మాట:

ఇది ముందు చెప్పిన మాటే.

విశ్వరూపసందర్శనము తరువాత పూర్తిగా నమ్మకము కలిగించి మళ్ళీ అదే మాట చెప్పడముతో
ఆ మాట మీద మనకి ధృఢ నమ్మకము కలగడము కోసమే అన్న మాట.

|| ఓమ్ తత్ సత్||
శ్రీభగవానువాచ:
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తసంగవర్జితః|
నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాణ్డవ||55||
"ఓ అర్జునా! ఎవడు నాకొఱకే కర్మలను చేయునో నన్నే పరమప్రాప్యముగా నమ్మి యుండునో నాయందే భక్తి కలిగియుండునో సమస్త విశయములందు ఆసక్తి మమత్వమును విడిచివేయునో , సమస్త ప్రాణులయందు ద్వేషములేకయుండునో అట్టివాడు నన్ను పొందుచున్నాడు".
||ఓమ్ తత్ సత్||

 

|| ఓమ్ తత్ సత్||