||భగవద్గీత ||

||ద్వాదశోధ్యాయః||

|| భక్తి యోగము - భక్తులు ఎవరు ? ||

|| om tat sat||

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
భక్తియోగము
ద్వాదశోధ్యాయము

భక్తులు ఎవరు ?

ఈ భక్తి యోగము మొదటి శ్లోకములోని అర్జుని ప్రశ్న అంటే సకారత్మక బ్రహ్మము అరాధించుట శ్రేష్టమా లేక నిరాకార బ్రహ్మము ఆరాధించడము శ్రేష్ఠమా అన్న మాటకి కృష్ణుడు ఇచ్చిన సమాధానము - "నన్ను ఎవరైతే శ్రద్ధతో ఉపాసనచేస్తారో వారే ఉత్తములు" అని.

అంటే భక్తికి శ్రద్ధకు ఏకాగ్రతకు ప్రాధాన్యము కాని ఒక మార్గమునకు కాని సాంప్రదాయమునకు కాదు అని అన్నమాట. అలా చెప్పి భక్తి యొక్క ఫలము కూడా కృష్ణుడు వివరిస్తాడు.

భక్తులు అంటే ఎవరు అని వివరిస్తూ భక్తుల గుణాలు చెపుతాడు.

భక్తులు అంటే:

(1) అద్వేష్టా సర్వభూతానాం - ఏప్రాణినీ ద్వేషించకుండుట.
(2) మైత్రః ( సర్వభూతానాం) - మిత్ర భావము కలవాడు
(3) కరుణ ఏవ చ - కరుణాభావము కలవాడు
(4) నిర్మః - మమకారము లేనివాడు
(5) నిరహంకారః - అహంకారము లేనివాడు
(6) సమదుఃఖసుఖః - సుఖదుఃఖములందు సమ భావము కలవాడు
(7) క్షమః - ఓర్పు గలవాడు
(8) సతతం సంతుష్టః - ఎల్లప్పుడూ సంతృప్తి కలవాడు
(9) యతాత్మ- మనోనిగ్రహము కలవాడు
(10) ధృఢనిశ్చయః - ధృఢ నిశ్చయము కలవాడు
(11) మయ్యర్పిత మనోబుద్ధిః - మనోబుద్ధులను భగవంతుని కి సమర్పించినవాడు
(12) యస్మాత్ లోకః న ఉద్విజతే- ఎవనివలన జనులు భయమును పొందరో
(13) యః లోకాత్ న ఉద్విజతే - ఎవరు లోకమువలన భయము పొందడో
(14) హర్ష అమర్ష భయ ఉద్వేగైః ముక్తః -
హర్షము క్రోధము భయము మనోవ్యాకులత లనుంచి ముక్తిపొందినవాడు
(15) అనపేక్షః - కోరికలు లేనివాడు
(16) శుచిః - బాహ్య అంతర శుచిత్వము కలవాడు
(17) దక్షః- కార్యసమర్థుడు
(18) ఉదాశీనః -ఉదాసీనుడు
(19) గతవ్యథః- దుఃఖము లేనివాడు
(20) సర్వారంభ పరిత్యాగీ - సమస్త కార్యములందు కర్తృత్వము లేని వాడు
(21) నహృష్యతి - ఉప్పోంగని వాడు
(22) నద్వేష్టీ - ద్వేషించని వాడు
(23) నశోచతి- శోకించని వాడు
(24) నకాంక్షతి- కాంక్షలు లేనివాడు
(25) శుభాశుభ పరిత్యాగీ- శుభాశుభములను వదిలినవాడు
(26) శత్రౌ మిత్రే చ సమః- శత్రువులు మిత్రులయందు సమత్వము కలవాడు
(27) మానావమాయోః సమః- మానావమానములందు సమత్వము కలవాడు
(28) శీతోష్ణేషు సమః- శీతము ఉష్ణము లయందు సమత్వము కలవాడు
(29) సుఖదుఃఖేషు సమః -సుఖము దుఃఖము లయందు సమత్వము కలవాడు
(30) సంగవివర్జితః - ఇతరవిషయములపై ఆసక్తి లేనివాడు
(31) తుల్యనిందాస్తుతిః- నిందాస్తుతుల యందు సమత్వము కలవాడు
(32) మౌని- మౌనము కలవాడు
(33) యేనకేనచిత్ సంతుష్ఠః - దొరికినదానితో సంతుష్టి కలవాడు
(34) అనికేతః - నివాసమునందు అభిమానము లేని వాడు
(35) స్థిరమతిః - నిశ్చయమైన బుద్ధి కలవాడు
దేవునియందు భక్తి కలవాడు - అట్టివాడు భక్తుడు అని.

భక్తుడు అంటే ఏప్రాణినీ ద్వేషించకుండువాడు , మిత్ర భావము కలవాడు , కరుణాభావము కలవాడు, మమకారము లేనివాడు , అహంకారము లేనివాడు, సుఖదుఃఖములందు సమ భావము కలవాడు, ఓర్పు గలవాడు, ఎల్లప్పుడూ సంతృప్తి కలవాడు, మనోనిగ్రహము కలవాడు, ధృఢ నిశ్చయము కలవాడు, మనోబుద్ధులను భగవంతుని కి సమర్పించినవాడు, ఎవరిని భయపెట్టని వాడు, లోకమువలన భయము పడనివాడు, హర్షము క్రోధము భయము మనోవ్యాకులత లనుంచి ముక్తిపొందినవాడు, కోరికలు లేనివాడు, బాహ్య అంతర శుచిత్వము కలవాడు, కార్యసమర్థుడు, ఉదాసీనుడు, దుఃఖము లేనివాడు, సమస్త కార్యములందు కర్తృత్వము లేని వాడు, ఉప్పోంగని వాడు, ద్వేషము లేని వాడు ,శోకము లేని వాడు, కాంక్షలు లేనివాడు ,శుభాశుభములను వదిలినవాడు, శత్రువులు మిత్రులయందు సమత్వము కలవాడు, మానావమానములందు సమత్వము కలవాడు, శీతము ఉష్ణము లయందు సమత్వము కలవాడు , సుఖము దుఃఖము లయందు సమత్వము కలవాడు, ఇతరవిషయములపై ఆసక్తి లేనివాడు, నిందాస్తుతలయందు సమత్వము కలవాడు, మౌనము కలవాడు, దొరికినదానితో సంతుష్టి కలవాడు, నివాసమునందు అభిమానము లేని వాడు,నిశ్చయమైన బుద్ధి కలవాడు భగవంతునిపై భక్తి కలవాడు.

అట్టివాడు భక్తుడు అన్నమాట

అయితే ఇవన్నీ ఒకరిలోనే ఉంటాయా , అన్ని గుణాలు వున్నవాడికి ఎలాగు మోక్షము వస్తుంది కదా మరి ఈ భక్తి యోగము ఎందుకు అన్న ఆలోచనరావచ్చు.

భగవంతునిపై భక్తి వుండి ఈ ముప్పైఇదు గుణములలో ఏ ఒక్కటి వున్నా , భగవదోపాసనలో భక్తి లో ములిగినవానికి మిగతా వన్నీ తేన పుట్టమీద తుమ్మెదలు చేరినట్లు దరి చేరతాయి. ఆ గుణాలు చేరినకొద్దీ భక్తి పరాకాష్టచేరుతుంది.

అట్టి భక్తుడు కృష్ణుడు చెప్పినట్లు - "స మే ప్రియః" - "నాకు ప్రియమైనవాడు" అంటే భగవంతుని కి ప్రీతిపాత్రుడు.

|| ఓమ్ తత్ సత్ ||