||భగవద్గీత ||

|| పదమూడవ అధ్యాయము ||

||క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము -వచన వ్యాఖ్యానము ||

|| om tat sat||

||ఓం తత సత్||
అర్జున ఉవాచ:
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవచ |
ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ ||
"ఓ కృష్ణా ప్రకృతిని పురుషుని క్షేత్రమును క్షేత్రజ్ఞునుని జ్ఞానమును జ్ఞేయమును వీటినన్నిటిని తెలియగోరుచున్నాను"

శ్రీ కృష్ణ పరబ్రహ్మణేనమః
శ్రీమద్భగవద్గీత
పదమూడవ అధ్యాయము
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము

క్షేత్రమనగా శరీరము క్షేత్రజ్ఞుడనగా క్షేత్రము యొక్క జ్ఞానము కలవాడు అంటే జీవాత్మ. జీవుడు క్షేత్రజ్ఞుడేగాని క్షేత్రముకాదు. ఈ అధ్యాయము ముఖ్యముగా ఈ రెండిటి గురించే.

సగుణ బ్రహ్మము యొక్క ఉపాసన, ఆ ఉపాసన చేయు భక్తుల లక్షణములు పన్నెండవ అధ్యాయము లో అంటే భక్తి యోగము లో విపులముగా తెలిసికొనిన తర్వాత అర్జునుడు నిర్గుణ బ్రహ్మ తత్వము జ్ఞానము సంబధించిన విచారణను అట్టి పరమాత్మను పొందుటకు ఉపాయము గురించి తెలిసుకొనగోరి కృష్ణుని అడుగుతాడు. అదే మొదటి శ్లోకము :

అర్జున ఉవాచ:
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవచ |
ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ ||1||

అంటే "ఓ కృష్ణా ప్రకృతిని పురుషుని క్షేత్రమును క్షేత్రజ్ఞునుని జ్ఞానమును జ్ఞేయమును వీటినన్నిటిని తెలియగోరుచున్నాను" అని అర్జునుడు అడిగెను.

కనుక ఈ అధ్యాయము జ్ఞానసంబంధమైన విచారణకు ముఖ్యమైనది అని కూడా అనవచ్చు.

భగవద్గీత లో ఆఱవ అధ్యాయమువరకు కర్మషట్కమనీ అంటే కర్మకి సంబంధించిన ఆఱు సర్గలు అని,
ఏడవ అధ్యాయము నుంచి పన్నెండవ అధ్యాయము వరకు భక్తిషట్కమని అంటే భక్తికి సంబంధించిన ఆఱు సర్గలు అని, పదమూడవ అధ్యాయము నుంచి పదునెనిమిదవ అధ్యాయము వఱకు జ్ఞానషట్కమని అంటే జ్ఞానమునకు సంబంధించిన ఆఱు సర్గలు అని పండితులు చెప్పుతారు..

అంటే ఈ పదమూడవ అధ్యాయము జ్ఞానషట్కములో మొదటి సోపానము అన్నమాట.

చాలా మంది చెప్పుకునే భగవద్గీతలో ఈ అర్జునిని ప్రశ్నరూపములో ఉన్న శ్లోకము వుంది . ఆ అర్జునిని ప్రశ్నవలన పాఠకులకు ఈ అధ్యాయములోని ముఖ్యవిషయాలు తెలుస్తాయి. కాని కొన్ని భగవద్గీత సంచికలలో అర్జునుని ప్రశ్నరూపమైన శ్లోకము లేదు. శ్రీ శంకరాచార్యులవారి భగవద్గీతలో కూడా అర్జునిని ప్రశ్నరూపమైన శ్లోకము లేదు. శంకరభగవత్పాదుల భగవద్గీతలో పదమూడవ అధ్యాయములో మొదటి శ్లోకము శ్రీకృష్ణుని ప్రవచనము( అదే అర్జునిని ప్రార్థనకి సమాధానము కూడా ). అంటే కృష్ణుని ప్రవచనము తో అధ్యాయము మొదలవుతుంది అన్నమాట.
శ్రీ భగవానువాచ:
శ్లో|| ఇదంశరీరంకౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే|
ఏతద్యోవేత్తితంప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ||2||

"ఇదం శరీరం కౌన్తేయ ".. "అర్జునా ఈ శరీరము.. క్షేత్రము అనబడును". జీవునకు శరీరము హృదయాంతరమున జ్ఞానబీజము అభివృద్ది నొంది కాలాంతరమున మోక్షఫలము నొసగుటకు ఆధారముగా నున్నది. క్షేత్రమనగా పొలము , భూమి. సస్యము అభివృద్ధియగుటకు క్షేత్రము లేక భూమి ఆధార భూతముగ సహాయముగ నున్నది. అలాగే శరీరము . అందుకే శరీరమును క్షేత్రము అన్నారు.

క్షేత్రమగు శరీరమును తెలిసికొను ప్రజ్ఞ కలిగిన వాడే క్షేత్రజ్ఞుడు. అతడే ప్రత్యగాత్మ (ఆత్మ).

మొదటి శ్లోకములోని అర్జునిని ప్రశ్నలేకపోతే ఇదంతా, అంటే క్షేత్ర క్షేత్రజ్ఞుల గురించి, కృష్ణుడు ఎందుకు మొదలెట్టాడు అని మనకు ప్రశ్నరావచ్చు. అర్జునుని ప్రశ్నలేకపోయినా కృష్ణుని క్షేత్ర క్షేత్రజ్ఞుల గురించి ప్రవచనము సందర్భానుసారమే ! ఎలా అంటే ఈ ప్రవచనము పన్నెండవ అధ్యాయముతో కలిసి వున్నట్లుగా చదవాలి.

పన్నెండవ అధ్యాయములో అంటే భక్తి యోగములో మొదటి శ్లోకము అర్జునిని ప్రశ్న సతతయుక్తులై నిన్ను ఉపాశించే భక్తులు, ఇంద్రియగోచరముకాని అక్షరపరబ్రహ్మము ను ఉపాశించేవారు - వీరిద్దరిలో యోగము ఎక్కువ తెలిసినవారు ఎవరు అని . ఆ ప్రశ్నకు సమాధానముగా కృష్ణుడు కోరికలు వదలి అక్షరోపాసకులని పక్కన పెట్టి భక్తిని యందు నిత్యయుక్తులై పరమశ్రద్ధతో ఉపాశించేవారు యోగులు అని వారిగురించి చెపుతాడు. భక్తియోగమంతా అదే. ఈ శ్లోకముతో మళ్ళీ కృష్ణుడు అక్కడ పక్కన పెట్టిన అక్షరోపాసకుల తత్త్వజ్ఞానముగురించి చెప్పడము మొదలెడతాడు. పన్నెండవ అధ్యాయములో " అద్వేష్టా సర్వభూతానాం" (12.13) అంటే "సర్వభూతములను ద్వేషించనివాడు " అంటూ అక్షరోపాసకుల నిష్ఠ వారి గుణములగురించి అంటే ఆ అక్షరోపాసకుల గుణాలగురించి ఆ అధ్యాయము చివరివరకు చెప్పడము అయినది.

ఇక మిగిలినది ఆ అక్షరోపాసకుల తత్త్వజ్ఞానముగురించి.ఆ తత్త్వజ్ఞానానికి క్షేత్ర క్షేత్రజ్ఞుల కి సంబంధము ఏమిటి అని అనిపించవచ్చు.

ఆ తత్వ జ్ఞానము గురించి అంటే ఈశ్వరుని యొక్కప్రకృతి గురించి ఏడవ అధ్యాయములో చెప్పడమైనది. ఈశ్వరుని ప్రకృతి రెండు విధములు అని. ఆ రెండు ప్రకృతులు అంటే పరా అపరా అని చెప్పడమైనది. అ రెండు ప్రకృతులే క్షేత్ర క్షేత్రజ్ఞులు. ఈ రెండు ప్రకృతులద్వారా ఈశ్వరుడు జగదుత్పత్తి స్థితి లయములకు కారకుడవుతున్నాడు. క్షేత్ర క్షేత్రజ్ఞులనే ఈ రెండు ప్రకృతులనుగురించే ఈ అధ్యాయము. అందుకని అర్జుని ప్రశ్న లేకపోయినా ఈ అధ్యాయములో కృష్ణభగవానుని మొదటి శ్లోకము పన్నెండవ సర్గలోని అర్జునిని ప్రశ్నకి ఇచ్చే సమాధానము లో మిళితమౌతుంది.

ఇంక క్షేత్ర క్షేత్రజ్ఞుల గురించి.

కృష్ణుడు తన మొదటి శ్లోకములోనే క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అని ఒక్కమాటలోఅని చెప్పాడు.
కాని క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే శరీరముగురించి క్షుణ్ణము గా తెలిసికొనినవాడు అంటే చాలదు.
ఇంకా తెలిసికొనవలసినది చాలావుంది.

జీవాత్మ యే క్షేత్రజ్ఞుడు అని చెప్పిన కృష్ణుడు ఇప్పుడు ఇంకో మాట చెపుతాడు.

’క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి’- నన్నే క్షేత్రజ్ఞుడని కూడా తెలిసికొనుము.
ఏ క్షేత్రానికి అనుకోవచ్చు - దానిని కూడా కృష్ణభగవానుడు విశదీకరిస్తాడు.
’సర్వక్షేత్రేషు భారత !’ - ఒక క్షేత్రము కాదు . ’సమస్త క్షేత్రములందు’ - "నేనే క్షేత్రజ్ఞుడను" !
అంటే పరమాత్మ యే క్షేత్రజ్ఞుడు అని.
అన్నిభూతములలోనూ పరమాత్మయే క్షేత్రజ్ఞుని రూపములో ఉన్నాడన్నమాట.
దీని భావము జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అని.
ఇదే బ్రహ్మసూత్రాలలో మహావాక్యము.
ఇది భగవంతుని ద్వారా వచ్చిన వాక్యము.

ఇంకోమాట.
క్షేత్ర క్షేత్రజ్ఞయోః జ్ఞానం- క్షేత్ర క్షేత్రజ్ఞుల జ్ఞానము ఏది వుందో
తత్ జ్ఞానమ్ - అది నిజమైన జ్ఞానము
అంటే కృష్ణభగవానుడు తన అభిప్రాయము చెపుతున్నాడు.
క్షేత్ర క్షేత్రజ్ఞుల జ్ఞానమే నిజమైన జ్ఞానము అని.

క్షేత్ర క్షేత్రజ్ఞుల జ్ఞానమే నిజమైన జ్ఞానము అన్నప్పుడు ఆ క్షేత్రము ఏమిటి? ఎటువంటిది? ఏ మార్పులు చెందుతుంది? ఏ కారణము చేత ఏ విధముగా మారుతుంది అన్నప్రశలు వస్తాయి. అంతేకాదు క్షేత్రజ్ఞుడు ఎవరు ? అతని ప్రభావము ఎటువంటిది అన్నవి కూడా సహజమే. వాటికి సమాధానాలే ఈ అధ్యాయములోని కృష్ణుని ప్రవచనము (13.3)

క్షేత్ర క్షేత్రజ్ఞుల జ్ఞానము చాలా పురాతనమైనది. ఋషులు వేదాలలో అనేకవిధములుగా ఈ జ్ఞానముగురించి గానము చేశారు. హేతుయుక్తముగా బ్రహ్మమును సూచించే పదాల చేత దీనిని నిశ్చయించి చెప్పారు.

’ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇతి ’ ( 13.2)అంటూ ఈ శరీరమే క్షేత్రమనబడుచున్నది అంటూ మొదలెట్టినా దానిని ఇంకా విశదీకరిస్తూ కృష్ణుడు ఇలాచెపుతాడు. క్షేత్రమనగా ఒక స్థూలదేహమే కాదు. స్థూల సూక్ష్మ పంచమహాభుతములు మూలప్రకృతి (మాయ), అహంకారము , మనస్సు , బుద్ధి , ఇచ్ఛా ద్వేషాది దుర్వృత్తులు, ధృత్యాది సద్వృత్తులు ఇవన్నీ క్షేత్రము క్రిందకే వచ్చును.(13.5,6)

అలాగే క్షేత్రజ్ఞుడు ఏవరు అన్నమాట కూడా కృష్ణుడు తన మొదటిశ్లోకము(13.2) లో చెప్పినా ఆ క్షేత్రజ్ఞుని లక్షణాలని ’ అమానిత్వం అదమ్భిత్వం ’ - అంటే గర్వములేకపోవడము డాంబికము లేకపోవడము అంటూ కృష్ణుడు చెపుతాడు(13.7). ఆ లక్షణాల ప్రయోజనము ఏమిటి . ఆ లక్షణాలే జ్ఞానసాధనములు అన్నమాట. ఈ లక్షణాలు ఉన్నవాడు వాటిని జ్ఞాన సంపాదనకు సాధనాలుగా ఉపయోగించి తెలిసికొనతగినదానిని తెలిసికొన గల యోగ్యుడు అవుతాడు.

ఈ జ్ఞానసాధనములు ఏమిటి? అవి,-

గర్వములేకపోవడము, డాంబికము లేకపోవడము, అహింసా, క్షాన్తి, ఆర్జవము, ఆచార్యోపాసనము, శౌచము, స్థైర్యము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థములందు వైరాగ్యము, అహంకారము లేకపోవడము ఇవన్నీ జ్ఞానసాధనములే. జన్మమృత్యుజరావ్యాధులయందు గల దుఃఖమునే దోషముగా చూడకలగడము వలన దేహేంద్రియ విషయభోగాలపై విరక్తి అంటే వైరాగ్యము పుడుతుంది. అంటే అది కూడా అంటే జన్మమృత్యుజరావ్యాధుల యందుకల దుఃఖమునే దోషముగా చూడకలగడము కూడా జ్ఞానసాధనమే అన్నమాట.

అంతేకాదు విషయాలవేపు దృష్టి మళ్లక పోవడము, పుత్రదారా గృహాదులయందు మమకారము లేకపోవడము , ఇష్టము అనిష్టములయందు సమభావము కలిగియుండడము, భగవంతునియందు చెదరని భక్తి అనబడు అనన్యయోగము, ఏకాంతప్రదేశ వాసము, అజ్ఞానులగు జనసమూహములయందు కోరికలేకపోవడము, అధ్యాత్మజ్ఞానమందు ప్రీతి కలిగియుండుట, తత్వజ్ఞానము యొక్క ప్రయోజనము తెలిసికొనియుండుట, ఇవన్నీ జ్ఞానసాధనాలే.

అదే జ్ఞానము కూడా .

ఆ జ్ఞానముచేత తెలిసికొనతగినది ’జ్ఞేయము’.

జ్ఞేయము అంటే సాధ్యము అంటే సాధింపతగినది. జ్ఞేయము అంటే తెలిసికొనతగినది అని కూడా అనవచ్చు. అదే పరమాత్మ. పరమాత్మ అనే లక్ష్యము చేరుటకు కావలసిన ఆధ్యాత్మిక సంపత్తియే జ్ఞానమని చెప్పబడినది. పెక్కు సుగుణములు ఎపుడు చిత్తమందు విరాజిల్లునో అపుడే ఆత్మ వ్యక్తము కాగలదు. కుటుంబము బంధువులు ధనము వేటితో మోహము లేకుండుటయే జ్ఞానము.

జ్ఞేయము యొక్క స్వరూపము కూడా కృష్ణ భగవానుడు చెపుతాడు

సర్వతఃపాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖమ్ |
సర్వతఃశ్రుతిమర్లోకేసర్వమావృత్యతిష్టతి || (13.14)

పరమాత్మ స్వరూపము గురించి చెపుతూ జ్ఞేయమగు పరమాత్మరూపము అంతట కన్నులు తలలు ముఖములు కలది అయి ప్రపంచము నందు సమస్తమునూ ఆవరించి యున్నది. జ్ఞేయ రూపమగు పరమాత్మ సమస్తములైన గుణములను భరించునది సమస్త ఇంద్రియములు లేనిది, దేనినీ అంటనిది ప్రాణులయొక్క లోపల బయట యుండునది, కదలనిదీ కదులునది, అతిసూక్ష్మమయి యుండుటవలన తెలియబడనిదీ, దూరముగానుండునదీ దగ్గరగానుండునదీ అని చెప్పబడినది. పరమాత్మ స్వరూపము "అవిభక్తం విభక్తేషు" అంటే విభజింపబడని దైననూ విభజింపబడినదానివలె నున్నది. ఆ స్వరూపము ప్రాణులను సృష్టించునది పోషించునదీ లయించునది.

అట్టి పరమాత్మ ప్రకాశించెడి సూర్యచంద్రాగ్నులను కూడా ప్రకాశింపజేయునది. సమస్త ప్రాణుల హృదయములో విషేషించియున్నదానివలె కనపడుచున్నది. జీవుల పాప పుణ్యములను అతిసమీపమునుండి చూచున్నది . ఒకే వస్తువు కదలకయూ కదలుచును యున్నది. స్థూలాకాశము చిదాకాశము చిత్తాకాశము అని మూడు యున్నవి. వీనిలో చిదాకాశమే జ్ఞేయమగుపరమాత్మని కనుగొనెను.

అలాగ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు , జ్ఞానము జ్ఞేయము గురించి క్లుప్తముగా విశదీకరించి కృష్ణభగవానుడు ఇంకా ఇలా అంటాడు.
ఏతత్ విజ్ఞాయ - ఇదితెలిసికొనినవాడు
మద్భావాయోపపద్యతే - నా భావము ( మోక్షము) పొందుటకు అర్హుడు అవుతాడు.

అయితే మొదటిలో ఈ రెండు ప్రకృతులద్వారా ఈశ్వరుడు జగదుత్పత్తి స్థితి లయములకు కారకుడవుతున్నాడు అని ఏడవ ధ్యాయములో విన్నాము. ఈ రెండూ సమస్త భూతములకు ఉత్పత్తి స్థానము ఎట్లాయింది అన్నది కూడా కృష్ణుడు ఇప్పుడు అర్జునుని కి బోధిస్తాడు.

కార్యకారణములను కలుగ చేయునది ప్రకృతి.
కార్యమనగా శరీరము కారణమనగా ఇంద్రియమనోబుద్ధిహంకారములు పంచభూతములు శబ్దాదివిషయములు. వీటన్నిటిని కలుగజేయునది ప్రకృతి.
"కామక్రోధసుఖదుఃఖ" మోహాములు ప్రకృతివలననే కలిగినవి.

కార్యకారణముల వలన కలిగే సుఖదుఃఖములను అనుభవించేది పురుషుడు.

పురుషుడు వీటన్నిటిచేత అంటే ఇంద్రియమనోబుద్ధిహంకారముల సంయోగముచే అయాసుఖదుఃఖాదులు అనుభవిస్తున్నాడు. మంచిజన్మలు చేడు జన్మలు ఎత్తడానికి కారణము కూడా ఆ గుణముల సంయోగము వలనే. కాని నిజానికి అతనికి కర్తృత్వ భోక్తృత్వము లేదు. జీవుడు తన ఉపాధులతోనూ గుణములతోను ఆశక్తి వదలినవాడై మమకారము అహంకారము లేనివాడై అసంగ నిర్గుణ చిద్రూపమే తానని భావించిన అది ముక్తికి హేతువగును.

అంటే పురుషుడు (ఆత్మ) నిత్యశుద్ధుడు ఎవైనా దుఃఖాది వికారములు కలిగినపుడు ఇవి నాస్వరూపముకాదు నేను వాటన్నిటికి సాక్షిని అని స్థిర చిత్తుడయి యుండవలెను.

శుద్ధమైన మనస్సుద్వారా కొందరు ధ్యానయోగముననుసరించి కొందరు సాంఖ్యయోగము (జ్ఞానయోగము) అనుసరించి. కొందరు కర్మయోగమును అనుసరించి ఆత్మను సాక్షాత్కరించుకొనగలరు.

ఆవిధముగా తెలుసుకో లేని వారు ఇతరులు బోధింపగావిని శ్రవణ తత్పరులై శ్రద్ధకలిగినవారై మృత్యురూపక సంసారమును తప్పకదాటగలరు.

దేహాది దృశ్యపదార్ధములు నశించినను ఆత్మ నశింపదు అనుట వివేకము జ్ఞానము. అట్టి జ్ఞానదృష్టికలవాడే వాస్తవముగా జ్ఞాన నేత్రము కలవాడు అంటే జ్ఞానము కలిగినవాడు. ఈ మాటనే కృష్ణభగవానుడు అద్భుతమైన వాక్యములో చెపుతాడు.
శ్రీభగవానువాచ
"వినశ్యత్స్వ వినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి"(13.28)
(శరీరము) నశించినననూ (అత్మ) నశింపదు అని ఎవరు చూస్తారో వారే (నిజమును) చూచినవారు !

ప్రపంచములో అన్నిపదవులలోను మోక్షపదవి శ్రేష్టమైనది. ఆత్మసాక్షాత్కార మోక్షపదవి గొప్పది. ప్రపంచమున సమస్తకర్మలు ప్రకృతిచే చేయబడుచున్నవని, ఆత్మఅకర్తయనీ అను జ్ఞానముకలవాడు వాస్తవముగా జ్ఞాన నేత్రము కలవాడు. ఈ మాటే కృష్ణ భగవానుడు మరొక అద్భుతమైన వాక్యములో చెపుతాడు.
శ్రీభగవానువాచ:
యః పశ్యతి తథాssత్మానం అకర్తారం సపశ్యతి ||(13.30)
ఎవరు ఆత్మని కర్తకాని వాని గా చూస్తారో ( గ్రహిస్తారో) వారే (నిజమును) చూసినవారు (గ్రహించినవారు)

భిన్న భిన్నరూపములతో నున్న సమస్త ప్రపంచము ప్రరమాత్మ నుండే విస్తరించిన దానిగా ఎవరు వీక్షింపగలుగునో వారే బ్రహ్మమును పొందగలుగును .

సర్వత్రవ్యాపించినను ఆకాశము సూక్ష్మమగుటవలన ఏ ప్రకారము దుమ్ము ధూళివాటిచే అంటబడదో ఆదే ప్రకారము శరీరమంతట వెలయుచున్నపరమాత్మశరీర గుణములదోషములచే అంటబడక యున్నాడు.

ఓ అర్జునా! సూర్యుడొక్కడే ఈసమస్త లోకములను ఎట్లు ప్రకాశింపజేస్తున్నడో అట్లే క్షేత్రజ్ఞుడగు పరమాత్మ సమస్త క్షేత్రమును ప్రకాశింపజేస్తున్నాడు.

మోక్షమనగా ప్రకృతి (అవిద్య) నుండి విడుదలయే.
క్షేత్ర క్షేత్రజ్ఞ విభేధము తెలిసినవాడే వివేకము చేత మోక్షమును పొందగలుగుచున్నాడు.
అదియే ఉపాయము.

ఆది శంకరుల నిర్వాణష ట్కమందు ఈశ్వరుడే నేనని తెలుపుటకు చివర చిదానందరూపా "శివోహం శివోహం" అని రచించిన శ్లోకములు సదా మననము చేసుకొనతగినవి. ఆభావమునే మననము చేస్తూ దేహాత్మభ్రాంతి విడనాడవలెను.

అనుభూతిపొందువరకూ ఆ భావమును కొనసాగించ వలెను. యద్భావం తద్భవతి యని కదా శాస్త్రము. అంటే ఆ భావము ఉంటే అట్లే జరుగును అని.
అహం నిర్వికల్పో నిరాకార రూపః
విభుత్వా చ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం
నచాసంగతంనైవముక్తిః నమేయః
చిదానందరూపా శివోహంశివోహం||

అను నిర్వాణ షట్కములో శ్లోకము మననము చేయతగిన మంత్రము.

||ఓమ్ తత్ సత్ ||
క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అన్తరం జ్ఞానచక్షుసా|
భూత ప్రకృతిమోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్||
"క్షేత్ర క్షేత్రజ్ఞుల ఈ అంతరాన్ని , ప్రకృతినుండి ముక్తి పొందగలిగే మార్గాన్ని జ్ఞానచక్షువుతో తెలిసిన వారు పరమగతిని పొందుతారు".
||ఓమ్ తత్ సత్||

|| om tat sat||