||భగవద్గీత ||

|| పదునాఱవ అధ్యాయము ||

||దైవాసుర సంపద్విభాగ యోగము-వచన వ్యాఖ్యానము ||

|| om tat sat||


||ఓమ్ తత్ సత్||
శ్రీభగవానువాచ:
అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః|
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్||1||

" భయము లేకుండుట, అంతః కరణ శుద్ధి, జ్ఞానయోగమునందు ఉండుట, దానము, ఇంద్రియనిగ్రహము, యజ్ఞము, అధ్యయనము చేయుట, తపస్సు , కపటము లేకుండుట ( మొదలగు నవి దైవసంబంధమగు ఇశ్వర్యములు)"

శ్రీమద్భగవద్గీత
దైవాసురసంపద్విభాగయోగము
షోడషోధ్యాయః
శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

ఫురుషోత్తమ ప్రాప్తి యోగములో అశ్వత్థవృక్షము గురించి చెపుతో రెండవ శ్లోకములో దాని కొమ్మలు "గుణప్రవృద్ధాః" అంటే గుణములచే వృద్ధి పొందింపబడినవి . ఆ కోమ్మలు "ఊర్ధ్వం చ" పైకి బ్రహ్మలోకమువైపు "అథః చ" క్రిందకి అంటే అధోగతికి వ్యాపించి వున్నాయి. కొమ్మలు పైకి పోతాయా క్రిందకు పోతాయా అన్నది వారి వారి ప్రకృతిని అనుసరించి ఉంటుంది. సంసారము నుంచి పైకి తీసుకు వెళ్ళే ప్రకృతి , సంసారమునుంచి క్రిందకి లాగే ప్రకృతి గురించి కృష్ణుడు ఏడో అధ్యాయములో తొమ్మిదవ అధ్యాయములో చెప్పాడు.

ఏడో అధ్యాయములో "అసురం భావమాశ్రితాః" అంటూ అసుర ప్రకృతి కలవారు " మాం న ప్రపద్యన్తే" అంటూ నన్నుపొందరు అని చెపుతాడు. అదే మళ్ళీ తొమ్మిదవ అధ్యాయములో "మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞాన విచేతసః" అంటే " వ్యర్థమైన ఆశలు కలవారు , వ్యర్థమైన కర్మలు చేయువారు, వ్యర్థమైన జ్ఞానము కలవారు , బుద్ధిహీనులు " మొదలగు వారు అసురసంబంధమైన ప్రకృతిని ఆశ్రయించినవారగు చున్నారు అని చెపుతాడు..

మళ్ళీ తొమ్మిదవ అధ్యాయములో కృష్ణుడు "దైవీం ప్రకృతి మాశ్రితాః" అంటూ దైవ ప్రకృతి ఆశ్రయించినవారి గురించి చెపుతాడు.

దైవ ప్రకృతిని ఆశ్రయించినవారు - "భజన్తి అనన్య మనసో" అంటే "ఇంకొక ఆలోచనలేకుండానన్ను సేవిస్తున్నారు" అని అంటాడు. అంటే దైవ ప్రకృతి నాశ్రయించినవారు మోక్షమార్గములో ఉంటారు అన్నమాట.

మళ్ళీ పురుషోత్తమప్రాప్తి యోగములో -" నిర్మానమోహా జితసంగ దోషాః అధ్యాత్మ నిత్యా విని వృత్తకామాః" అంటూ ఇటువంటి మంచి ప్రకృతి కలవారు - "అవ్యయం పదం గచ్ఛన్తి" అంటే "నాశనము లేని స్థానమును పొందుచున్నారు" అంటాడు.

అంటే అసుర ప్రకృతితో అథోగతి, దైవ ప్రకృతితో మోక్షమార్గము పొందుతారు అనే మాట కృష్ణుడు చెప్పాడు.

ఈ ప్రకృతినే విడమరుస్తూ దైవ అసుర సంపత్తి గురించి విశదీకరించడము వలన ఈ అధ్యాయానికి దైవాసుర సంపద్విభాగయోగము అని పేరువచ్చినది.

కృష్ణుడు తన ఉపదేశముతోనే ఈ అధ్యాయము మొదలు పెడుతాడు. అందులో దైవ సంపత్తితో ఈ అధ్యాయము మొదలగుతుంది.

భగవంతుడు చెప్పుచున్నాడు:
అభయం సత్వసంశుద్ధిర్ జ్ఞానయోగవ్యవస్థితిః
దానందమశ్చయజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్.||1||
అహింసా సత్యమక్రోధః త్యాగశ్శాన్తిరపైశునమ్
దయాభూతేష్వ లోలత్వం మార్దవం హ్రీరచాపలమ్||2 ||
తేజస్సమాదృతిశ్శౌచమద్రోహోనాతిమానితా
భవంతిసంపదందైవిమభిజాతస్యభారత ||3||

ఈ మూడు శ్లోకాలలో చెప్పినది దైవ సంపత్తి మనను ముందుకు తీసుకుపోగల ప్రవృత్తి:
-భయములేకుండుట
-అంత్ఃకరణశుద్ధి
-జ్ఞానయోగమునందుండుట
-దానము
-బాహ్యేంద్రియనిగ్రహము
- జ్ఞాన యజ్ఞము
- శాస్త్రాధ్యయనము
- తపస్సు
- ఋజుత్వము
- అహింస
- సత్యము
- క్రోధము లేకుండుట ,
- త్యాగము, - శాంతి ,
- ఇతరులయందు దోషములను చూడకుండుట,
- భూత దయ
- విషయ లోలత్వము లేకుండుట
- మృదుత్వము
- సిగ్గు
- చపలత్వము లేకుండుట
- ప్రతిభ
-ఓర్పు,
-ధైర్యము,
-బాహ్యాంతరశుచిత్వము,
-ఎవనికిని ద్రోహము చేయకుండుట,
-స్వాతిశయము లేకుండుట

ఇవన్ని సద్గుణములు. సాధకుడు ఈ ఇరువది ఆరు సద్గుణములను అలవరచుకొవాలి.

అంతే కాదు. కొన్ని గుణములు దంబము దర్పము అభిమానము అహంకారము పౌరుషము క్రోధము మున్నగు నవి అసురసంబంధమైన గుణములు. ఆ అసుర సంపదతో పుట్టినవారికి ఆ గుణములు గర్వకారణములు కూడా.(16.4)

దైవసంబంధమైన సంపద "విమోక్షాయ" అంటే మోక్షముపొందుటకు , అసుర సంపద "నిబంధాయ" సంసారబంధనముకు హేతువులు అని చెప్పబడినది ( 16.5)

భగవానుని సందేశము - ’అస్థిరమగు ప్రాపంచిక ధనముతో క్రీడించుచు వానితో అమూల్యమైన కాలమంతయు వినియోగించుచు దుఃఖపరంపర జన్మపరంపర పొందకూడదు’.

దైవధనము ముందు ప్రాపంచిక సంపదలు ఏపాటి విలువ కలవి? అందుకని దైవీ గుణములు పొంది బ్రహ్మసాయుజ్యము పొందెదరుగాక అని భగవానుడు చెపుతాడు.

ఈ దేవ సంపదగురించి ఇంకొంచెము విచారిద్దాము.

అభయము ప్రముఖముగ బ్రహ్మ పదముగనె వర్ణించిరి. చిత్తము అత్యంత నిర్మలముగా యుండవలెను. జ్ఞానమందు ధృఢ స్థితిని సంపాదించవలెను దానములలో విద్యాదానము జ్ఞానదానము ముఖ్యమైనవి.

శమము అనగా అంతరింద్రయ నిగ్రహహము. దమము అనగా బాహ్యేంద్రియ నిగ్రహము కలిగియుండవలెను. ఈ రెండు ముఖ్యము.

ఆధ్యాత్మిక గ్రంధములను పఠించుట, సారము మననము చేయుట స్వాధ్యాయము అని అందురు. తపస్సు అనగా శారీరక మానసిక వాచిక తపస్సు అనబడును. మహనీయులగు గురువులను పూజించుట శారీరక తపస్సు అనబడును. మనస్సును నిర్మలముగా నుంచుకొనుట మానసిక తపస్సు అనబడును. సత్యముగ ప్రియముగ మాట్లాడుట వాచక తపస్సు అనబడును.

ఆర్జవము అనగా శారీరము మనస్సు వాక్కు త్రికరణశుద్ధిగా ప్రవర్తించ వలెను.

అహింస అనగా శరీరముతో మనస్సుతో వాక్కుతో ఏప్రాణికి హింసచేయకుండ యుండుట.

ఎల్లవేళలా సత్యమునే మాట్లాడవలెను. క్రోధము చాలా చెడ్డది. క్రోధము వచ్చినపుడు మనిషి రాక్షసుడిగా మారిపోవును .

త్యాగము అనగా విషయ వస్తువుయందు అసక్తి వదలివేయుట. ప్రతివారు త్యాగ బుద్ధిని కలిగియుండవలెను. మనస్సులో శాంతిగ నుండవలెను.

"అపైసునమ్" అనగా ఇతరులలో దోషములను లెక్కించకుండుట. తమతమ హృదయమందున్న కోటానుకోట్ల దోషములను వదలివేయవలెను. పరుల గుణములతో పనియేగాని పరుల దోషములతోకాదు.

భూత దయ యుండవలెను. మాటలందు చేష్టలందు మృదుత్వము ఉండవలెను.

పాప కార్యములు చేయుట యందు సిగ్గుకలిగి యుండవలెను ..

ప్రతివారు "నేను ఇంతవరకు ఆధ్యాత్మిక క్షేత్రమున ఏమి యున్నతిని పొందితిని" అని ప్రశ్నించుకొని సాధు మహాత్ముల భక్తిలను చూసి వారివలె యున్నతిని పొందుటకు పట్టుదలతో ప్రయత్నము చేయవలెను

చంచలత్వము లేకుండా మనస్సును ఆత్మయందు లీనము చేయవలెను. ఓర్పుసహనము కలిగియుండవలెను.

"నాతిమానిత" అనగా తానుపూజ్యుడననీ విర్రవీగడము. అది కూడని పని. ఆంజనేయునివలె వినయ విఢేయతలను కలిగియుండవలెను .

పరమార్ధ రంగమున కపటము మోసము పనికిరాదు. వారి హృదయ గుహ యందుదాగి వారి సంకల్పములను పరమాత్మ కనిపెట్టుచునె యున్నాడు. తనకు ఏదైన గొప్పవిద్య అధికారము లభించినచో గర్వపడక అది అంతయు ఈశ్వరుని దయవలననే లభించినదని భావించి వినయముతో నుండవలెను.

ప్రపంచమున రెండేజాతులు కలవు 1 దైవీజాతి 2 ఆసురీజాతి.(16.6). ప్రతీవారు తమలోని అసురజాతి గుణములను సరిదిద్దుకొనవలెను.

అసురస్వభావులు ధర్మ ప్రవృత్తిని గాని పాప నివృత్తినిగాని ఎరుగరు. శుచిత్వముగాని ఆచారముగాని సత్యముగాని వారియందు ఉండదు. జగత్తు వేదాది ప్రమాణములులేనిదనియు ధర్మాధర్మ వ్యవస్థలు లేనిదనీ ఈశ్వరుడు లేడని అంటారు. (16.7,8)

అసుర స్వభావులు చార్వాక సిద్ధాంతములను అనుసరించి ప్రపంచము కేవలము స్త్రీ పురుష సంబంధమువలననే ఏర్పడినదనీ వారు నాస్తిక స్వభావము కలిగి అవివేకులుగ నుందురు. వారు లోక కంటకులై క్రూర కర్మలు చేయుచుందురు, అన్యాయమార్గము మోసపద్ధతుల ద్వారా అధికధనము వాంఛించి సంపాదించుదురు.(16.9-12)

అసురీసంపదగలవారి మనస్తత్వము వివరిస్తూ భగవంతుడు ఇలా చెపుతాడు:
శ్రీభగవానువాచ
ఇదమద్య మయాలబ్ధమిమం ప్రాప్స్యేమనోరథమ్|
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్||13||
అసౌ మయాహతశ్శత్రుః హనిష్యే చాపరానపి|
ఈశ్వరోsహమహం భోగీ సిద్ధోsహం బలవాన్సుఖీ||14||

ఆసురీ సంపద కలవారు గర్వముతో
"ఇదం అద్య మయా లబ్ధం"- ఈ కొరిక ఇపుడు పొందితిని !.
"ఇదం ప్రాప్స్యే మనోరథమ్" - ఈ మనోరథము ను పొందగలను !
"ఇదం( ధనం) అస్తి" - ఈ ధనము కలదు.
"ఇదం( ధనం) అపి మే పునః భవిష్యతి" - ఈ ధనము కూడా భవిష్యత్తులో నాకు మళ్ళీ దొరకకలదు !
"అసౌ శతృః మయా హతం"- ఈ శత్రువు నాచే చంపబడెను.
"అపరాన్ అపి హనిష్యే చ"- ఇతర శత్రువులు కూడా నాచే చంపబడగలరు.
"అహం ఈశ్వరః"- నేను ఈశ్వరుడను,
"అహం భోగీ" - నేను భోగీ
"అహం సిద్ధః" నేను అనుకున్నపనిని చేయగలవాడను

ఇది నిజముగా మదాంధకారములో ఉన్న మనుష్యుడు అనుకునే మాటలే. . "నేను ప్రభువుని. నేను బలవంతుడను సుఖవంతుడను గొప్పకులమునందు జన్మించినవాడను. నాతో సమానుడు ఎవరు". ఇవన్నీ గర్వముతో పలుకు మాటలు. (16.15). తామే గొప్పవారని భావించుకొని శాస్త్రప్రకారము కాకుండా తమకు తోచినట్లు పూజలూ యజ్ఞాలు చేస్తారు.(16.17)

అట్టివారు తమకు తామే గొప్ప పండితులుగ తలచుకొనుచు ఇతరులను ద్వేషించు చుందురు. తమ దేహమందును ఇతరుల దేహమందును ఉన్న భగవంతుని తెలిసి కొనలేక పరులను దూషించు చుందురు. పరులను దూషించుట అనగా సాక్షాత్తు భగవంతుని దూషించినవాడే యగును. (16.18)

అసుర గుణములు కలవారు ఇతరులయందు అసూయకలిగి యుందురు

ఇట్టి దుర్గుణములు ఎవరి యందున్నవో వారు ఎంత విద్యావంతులైనప్పటికీ ధనికులైన అధికారవంతులైనా సౌందర్యవంతులైన రాక్షసులుగా జమకట్ట బడుదురు.

"ఆగమనార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసామ్" అనే శ్లోకములో దేవతలారా రండు రాక్షసులారా పొండు అను వాక్యమును అనుసరించి ప్రతీవారును హృదయమును ఒక దేవతానిలయముగ పరబ్రహ్మానుభూతిని పొందవలెను.

క్రూరులును అశుభకార్యములు చేయువారు క్రిమి కీటకాది రాక్షసాది అనేక జన్మలు పొందుదురు. కనుక దుర్గుణములు వదలి సద్గుణములను ఆశ్రయించవలెను.

ముఖ్యముగా కామ క్రోధ లోభములను విడవవలని చెపుతూ భగవంతుడు ఇలా చెపుతాడు:
శ్రీభగవానువాచ
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః|
కామః క్రోధస్తథా లోభస్తస్మా దేతత్రయం త్యజేత్||21||

"నరకానికి ఈ మూడు అంటే కామము క్రోధము లోభము అను మూడు ద్వారములు . అందువలన ఈ మూడింటినీ త్యజించ వలెను"

అంటే కామ క్రోధ లోభములు త్యజించినవారు ఊర్ధగతిని పొందెదరు అన్నమాట.(16.22)

ఇవరికి ఇష్టమువచ్చినట్లు వారు ప్రవర్తించరాదు.- శాస్త్రము ద్వారా చెప్పబడిన మార్గములు అనుసరించ వలెను అన్న మాట ఉద్ఘాటిస్తూ భగవంతుడు ఇలా చెపుతాడు.
శ్రీభగవానువాచ
యశ్సాస్త్రవిధిముత్సృజ్యవర్తతేకామకారతః
నససిద్ధిమవాప్నోతినసుఖంనపరాంగతిమ్ ||23||

’ఎవడు శాస్త్రోక్త విధిని విడచిపెట్టి తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్ధ సిద్ధినిగాని సుఖమునుగాని ఉత్తమగతియగు మోక్షమును గాని పొందలేడు’.

శాస్త్రవాక్యములు అనుభవజ్ఞులైన మహర్షుల నిర్ణయములు కనుక దానిని ఎవరు అతిక్రమించరాదు అని.

కృష్ణుడు తన చివరి మాటగా ఇలా అంటాడు " కావున చేయతగినదియూ చేయరానిదుయూ నిర్ణయించునపుడు నీకు శాస్త్రము ప్రమాణమైయున్నది. శాస్త్రమును చెప్పబడినది తెలిసికొని దానిని అనుసరించి నీవు ఈ ప్రపంచమున కర్మమును చేయ తగును" అని

దీనిని బట్టి సుఖము మోక్షము వాంచించువాడు శాస్త్రొక్త్వ విధి ప్రకారము నడచుకొనవలెను. తము చేయతగినది చేయరానిది నిర్ణయించునపుడు శాస్త్రము ప్రమాణముగ తీసుకొనవలెను. దానిని అనుసరించి కర్మలు చేయవలెను.

|| ఓం తత్ సత్||
భగవానువాచ:
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ|
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి||24||
తా|| కావున చేయతగినదియూ చేయరానిదుయూ నిర్ణయించునపుడు నీకు శాస్త్రము ప్రమాణమైయున్నది. శాస్త్రమును చెప్పబడినది తెలిసికొని దానిని అనుసరించి నీవిఉ ఈ ప్రపంచమున కర్మమును చేయ తగును
||ఓమ్ తత్ సత్||


|| om tat sat||