||భగవద్గీత ||

|| పదునేడవ అధ్యాయము ||

|| శ్రద్ధాత్రయ విభాగ యోగము- శ్లోకతాత్పర్యాలతో ||

|| om tat sat||

||ఓమ్ తత్ సత్||

అర్జున ఉవాచ
యే శాస్త్రవిధిముత్సృజ్య యజన్తే శ్రద్ధయాఽన్వితాః|
తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్త్వమాహోరజస్తమః||

"ఓ కృష్ణా! మరి శాస్త్ర విధిని వదలి శ్రద్ధతో పూజించేవారి నిష్ఠ ఎటువంటిది ? సత్త్వమా, రజస్సా, తమస్సా?"

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీమద్భగవద్గీత
సప్తదశోఽధ్యాయః
శ్రద్ధాత్రయవిభాగయోగః

శ్రీ భగవానుడు పదహారవ అధ్యాయములోఆఖరిలో చెప్పిన మాట - శాస్త్రములో చెప్పిన ఆదేశములకు భిన్నముగ ప్రవర్తించరాదని, ఇంకా శాస్త్రము ఉల్లంఘించి విచ్చల విడిగా ప్రవర్తించినచో మోక్షసిద్ధి లభించదు అని. దాని వలన అర్జునుడికి మళ్ళీ సందేహము వస్తుంది.

అర్జునిడి సందేహము, శాస్త్రము తెలియనివారి గురించి. అంటే శాస్త్రములో చెప్పినమాట తెలియక, శాస్త్రవిధిని వదిలేసి, శ్రద్ధతోకూడిన వారై, పూజయజ్ఞాదులు ఆచరించినచో వారి నిష్ఠ సాత్వికమా, రాజసమా లేక తామసమా అని .

కృష్ణుడు ఎవరైతే 'శాస్త్ర విధి ముత్సృజ్య', అంటే శాస్త్రవిధిని వదిలేసి, 'వర్తతే కామకారతః' తమ కామమును అనుసరించి ప్రవర్తిస్తారో, అట్టివాడికి సుఖములేదు మోక్షము లేదు అని దైవాసుర సంపద్విభాగయోగములో చెప్పాడు( 16.23). అయితే ఇక్కడ అర్జుని ప్రశ్న, 'కామకారతు'ల గురించికాదు. అర్జునిని ప్రశ్న శ్రద్ధతో పూజ చేసేవారిగురించి.

ఇక్కడ శ్రద్ధ అన్నది ముఖ్యము. ఈ అధ్యాయము ఆ శ్రద్ధ గురించే.

ఇక ఆర్జునిడి ప్రశ్న, కృష్ణుడి సమాధానము చూద్దాము.

||శ్లోకము 1||

అర్జున వాచ:
యే శాస్త్రవిధి ముత్సృజ్య యజన్తే శ్రద్ధయాఽన్వితాః|
తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః||1||

స|| హే కృష్ణ ! యే శాస్త్ర విధమ్ ఉత్సృజ్య శ్రద్ధయా అన్వితాః యజన్తే తేషాం నిష్టాతు కా ? సత్త్వం అహో రజః అథవా తమః |

||శ్లోకార్థములు||

యే శాస్త్ర విధమ్ ఉత్సృజ్య - ఎవరైతే శాస్తోక్త్ర విధానమును విడిచి
శ్రద్ధయా అన్వితాః యజన్తే - శ్రద్ధతో కూడినవారై పూజాదులు చేయుచున్నారో
తేషాం నిష్టాతు కా ? - వారి ప్రవృత్తి ఎలాంటిది?
సత్త్వం అహో రజః అథవా తమః - సాత్వికమా లేక రాజసమా లేక తామసమా ?

||శ్లోక తాత్పర్యము||

" ఓ కృష్ణా, ఎవరైతే శాస్తోక్త్ర విధానమును విడిచి, శ్రద్ధతో కూడినవారై పూజాదులు చేయుచున్నారో వారి ప్రవృత్తి ఎలాంటిది? అది సాత్వికమా లేక రాజసమా లేక తామసమా?" ||1||

ఇక్కడ అడిగిన ప్రశ్న శ్రద్ధతో పూజ చేస్తున్నవారి గురించి. గుణత్రయ విభాగయోగములో గుణములు మూడు విధములుగా విభజింపబడినవి. అది మనస్సులో వుంచుకొన్న అర్జునుడి ఇక్కడ ఆ శ్రద్ధ కూడా సాత్వికమా, రాజసికమా, తామసికమా అని అడుగుతాడు.

||శ్లోకము 2||

శ్రీభగవానువాచ:

త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా|
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు||2||

స|| దేహినాం స్వభావజా సా శ్రద్ధా త్రివిథా భవతి | సాత్వికీ రాజసీ చ ఏవ తామసీ చ ఇతి | తాం శృణు||2||

||శ్లోకార్థములు||
దేహినాం స్వభావజా సా శ్రద్ధా - ప్రాణుల యొక్క స్వభావము చే కలిగిన ఆ శ్రద్ధ
త్రివిథా భవతి - మూడు విధములుగా వుండును
సాత్వికీ రాజసీ చ ఏవ తామసీ చ ఇతి-
సాత్విక సంబంధమైనది, రాజసిక సంబంధమైనది, తామసిక సంబంధమైనది గావుండును.
తాం శృణు- దానిని వినుము


||శ్లోక తాత్పర్యము||
"ప్రాణుల యొక్క స్వభావము చే కలిగిన ఆ శ్రద్ధ మూడు విధములుగా వుండును. సాత్విక సంబంధమైనది, రాజసిక సంబంధమైనది, అలాగే తామసిక సంబంధమైనది గా వుండును."||2||

ప్రాణులలో స్వభావము పూర్వజన్మ సంస్కారము వలన వచ్చినది. అది రజో తమో సాత్విక గుణములతో కూడినది. ప్రాణుల శ్రద్ధకూడా అదే స్వభావము మీద అధారపడినది. అంటే శ్రద్ధకూడా మూడు విధములు. అదే సాత్వికము రాజసికము తామసికము

||శ్లోకము 3||

సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత|
శ్రద్ధామయోఽయంపురుషో యో యత్ శ్రద్ధస్య ఏవ సః||3||

స|| హే భారత సర్వస్య సత్త్వానురూపా శ్రద్ధా భవతి| అయమ్ పురుషః శ్రద్ధామయః | యః యత్ శ్రద్ధః సః స ఏవ (భవతు) ||3||

||శ్లోకార్థములు||

సర్వస్య సత్త్వానురూపా శ్రద్ధా భవతి- ప్రతివారికి వారివారి అంతః కరణను అనుసరించి
శ్రద్ధా భవతి- శ్రద్ధ కలుగును
అయమ్ పురుషః శ్రద్ధామయః - ఈ పురుషుడు శ్రద్ధయే స్వరూపముగా గలవాడు
యః యత్ శ్రద్ధః ఎవరికి ఎట్టి శ్రద్ధ కలదో
సః స ఏవ (భవతు) - అతడు అట్టి శ్రద్ధ కలవాడే అగును ||3||

||శ్లోక తాత్పర్యము||

"ఓ భారత, ప్రతివారికి వారివారి అంతః కరణను అనుసరించి శ్రద్ధ కలుగును.ఈ పురుషుడు శ్రద్ధయే స్వరూపముగా గలవాడు. ఎవరికి ఎట్టి శ్రద్ధ కలదో అతడు అట్టి శ్రద్ధ కలవాడే అగును".||3||

ఇక్కడ వారి వారి అంతః కరణ అనుసరించి అని చెప్పబడినది. అయితే వారి అంతః కరణ, వారి సంస్కారముపై అధారపడి వుంటుంది. వారి స్వభావము అంతః కరణ, వారి సంస్కారముపై ఆధార పడినా, మనుజుడు తన కృషితో వాటిని అధిగమించకలడు అని కూడా చెప్పబడినది. అంటే తన మనస్సుని శుద్ధపరచుకొని సాధన సాగించినచో మనుజుడు సాత్విక శ్రద్ధ సంపాదించకలడు.

||శ్లోకము 4||

యజన్తే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః|
ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః||4||

స||సాత్త్వికాః దేవాన్ యజన్తే| రాజసాః యక్ష రక్షాంసి (యజన్తే) | అన్యే తామసాః జనాః ప్రేతాన్ భూతగణాన్ చ యజన్తే||4||

||శ్లోకార్థములు||

సాత్త్వికాః దేవాన్ యజన్తే- సాత్వికులు దేవతలను పూజించుచున్నారు
రాజసాః యక్ష రక్షాంసి (యజన్తే) - రజో గుణము కలవారు యక్షులను రాక్షసులను( పూజించుచున్నారు)
అన్యే తామసాః జనాః - ఇతర తామసిక జనులు
ప్రేతాన్ భూతగణాన్ చ యజన్తే- భూత ప్రేత గణములను పూజించుచున్నారు.

||శ్లోక తాత్పర్యము||

"సాత్వికులు దేవతలను పూజించుచున్నారు. రజో గుణము కలవారు యక్షులను రాక్షసులను( పూజించుచున్నారు.) ఇతర తామసిక జనులు భూత ప్రేత గణములను పూజించుచున్నారు".||4||

దైవాసుర సంపద్విభాగ యోగములో రెండు విధములైన మనుజులు దైవ సంపద కలవారు అసుర సంపద కలవారు అని చెప్పబడినది. ఇక్కడ శ్రద్ధ దైవ సంపదకలవారికి సాత్విక శ్రద్ధ, అసుర సంపద కలవారికి రాజసిక తామసిక శ్రద్ధ కలుగును. అదే మాట ఐదవ ఆరవ శ్లోకములలో వింటాము.

||శ్లోకము 5-6||

అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపోజనాః|
దమ్భాహంకారసంయుక్తాః కామరాగ బలాన్వితాః||5||
కర్శయన్తః శరీరస్థం భూతగ్రామచేతసః|
మాం చైవాన్తః శరీరస్థం తాన్విధ్యాసుర నిశ్చయాన్||6||

స|| యేజనాః శరీస్థమ్ భూతగ్రామమ్ కర్శయన్తః అన్తః శరీరస్థమ్ మామ్ చ ఏవ కర్శయన్తః దమ్బాహాంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః అచేతసః అశాస్త్ర విహితమ్ ఘోరమ్ తపః తప్యన్తే తాన్ అసురనిశ్చయాన్ విద్ధి||5-6||

||శ్లోకార్థములు||

యేజనాః - ఏ జనులు
శరీస్థమ్ భూతగ్రామమ్ కర్శయన్తః - శరీరములో వున్న ఇంద్రియసమూహములను శుష్కింప చేయువారు
అన్తః శరీరస్థమ్ మామ్ - శరీరమందు అంతర్యామి గా వున్న నన్ను
ఏవ కర్శయన్తః - శుష్కింపచేయుచున్నారో ( వారును)
దమ్బాహాంకార సంయుక్తాః - దంభము అహంకారము లతో గూడిన వారు,
కామరాగబలాన్వితాః - కామ బలము రాగ బలము కలవారును
అచేతసః - అవివేకులు అయి,
అశాస్త్ర విహితమ్ ఘోరమ్ తపః తప్యన్తే - శాస్త్రవిహితమైన ఘోరమైన తపస్సును ఆచరించుచున్నారో,
తాన్ అసురనిశ్చయాన్ విద్ధి- వారిని అసురస్వభావము కలవారినిగా తెలిసికొనుము.

||శ్లోక తాత్పర్యము||

"ఏ జనులు శరీరములో వున్న ఇంద్రియసమూహములను శుష్కింప చేయుచున్నారో, శరీరమందు అంతర్యామిగా వున్న నన్నుశుష్కింపచేయుచున్నారో (వారును), దంభము అహంకారము లతో గూడిన వారు, కామ బలము రాగ బలము కలవారును, అవివేకముతో శాస్త్రవిహితమైన ఘోరమైన తపస్సును ఆచరించుచున్నారో, అట్టి వారిని అసురస్వభావము కలవారినిగా తెలిసికొనుము".||5-6||

దంభము అహంకారము కామము రాగము ఇవన్ని అసుర సంపదలు. అట్టివారు అసుర స్వభావము కలవారు. అట్టి వారి శ్రద్ధ రాజసికమి తామసికము. మనుజులు అసురులు కారు. కాని వారి కర్మలచే వారు అసుర స్వభావము కలవారగుచున్నారు. అసుర స్వభావము యొక్క గుణములు త్యజింపదగిన గుణములు. ఆ త్యజించుటలోనే ఇమిడి యున్నది పురోగతికి మార్గము.

||శ్లోకము 7||

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః|
యజ్ఞస్తపః తథా దానం తేషాం భేదం ఇమం శృణు||7||

స||ఆహారః తు అపి సర్వస్య త్రివిధః ప్రియః భవతి| తథా యజ్ఞః తపః దానమ్ త్రివిధః ప్రియః భవతి | తేషామ్ ఇమమ భేదమ్ శృణు||

||శ్లోకార్థములు||

ఆహారః తు అపి - ఆహారము కూడా
సర్వస్య త్రివిధః ప్రియః భవతి - అందరికి మూడు విధములుగా ప్రియమగుచున్నది
తథా యజ్ఞః తపః దానమ్ - అలాగే యజ్ఞము తపము దానము కూడా
త్రివిధః ప్రియః భవతి - మూడు విధములుగా ప్రియమగుచున్నది
తేషామ్ ఇమమ భేదమ్ శృణు- వానియొక్క భేదము వినుము.

|| శ్లోక తాత్పర్యము||

"ఆహారము కూడా అందరికి మూడు విధములుగా ప్రియమగుచున్నది. అలాగే యజ్ఞము తపము దానము కూడా మూడు విధములుగా ప్రియమగుచున్నది. వానియొక్క భేదము వినుము".||7||

ఈ మూడు గుణముల అనుసారముగా అంటే సాత్విక, రాజసిక తామసిక గుణముల అనుసారముగా, ఆహారము తపస్సు దానము కూడా చూడవచ్చు. ఆహరము దాని విభజన గురించి ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ శ్లోకాలలో వింటాము.

||శ్లోకము 8||

ఆయుః సత్త్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః|
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః||8||

స|| ఆయుః సత్త్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వర్థనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాః సాత్త్విక ప్రియాః||8||

||శ్లోకార్థములు||

ఆయుః సత్త్వ బల ఆరోగ్య - ఆయుస్సును మనో బలము , శరీర బలము, ఆరోగ్యము,
సుఖ ప్రీతి వర్థనాః - సుఖము, ప్రీతియు వృద్ధి చెందించునట్టి
రస్యాః స్నిగ్ధాః స్థిరాః - రసము చమురు కలవి దేహములో చాలాకాలము వుండునవి
హృద్యాః ఆహారాః - మనోహరములగు ఆహారములు
సాత్త్విక ప్రియాః- సత్త్వగుణము కలవారికి ఇష్ఠమైనవి.

|| శ్లోక తాత్పర్యము||

"ఆయుస్సు, మనో బలము , శరీర బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతియు వృద్ధి చెందించునట్టి, రసము, చమురు కలవి, దేహములో చాలాకాలము వుండునవి మనోహరములగు ఆహారములు, సత్త్వగుణము కలవారికి ఇష్ఠమైనవి".||8||

||శ్లోకము 9||

కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్షవిదాహినః|
అహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః||9||

స||కటు ఆమ్ల లవణ అత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః దుఃఖశోకామయప్రదాః ఆహారాః రాజసస్య ఇష్టాః||

||శ్లోకార్థములు||

కటు ఆమ్ల లవణ - చేదుగాను , పులుపుగాను, ఉప్పుగాను
అత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః - మిక్కిలి వేడిగాను, కారముగాను , చమురు లేనివిగను
దుఃఖశోకామయప్రదాః -దుఃఖము శోకము ఇచ్చునట్టి
ఆహారాః రాజసస్య ఇష్టాః - ఆహారములు రజో గుణము కలవారికి ఇష్ఠము.

|| శ్లోక తాత్పర్యము||

"చేదుగాను , పులుపుగాను, ఉప్పుగాను, మిక్కిలి వేడిగను, కారముగను , చమురు లేనివిగను, దుఃఖము శోకము ఇచ్చునట్టి ఆహారములు రజో గుణము కలవారికి ఇష్ఠము"||9||

ఇక్కడ "అతి" అంటే "మిక్కిలి" అన్నమాట అన్నిటికి ఉపయోగించడము తగును అంటారు శంకరాచార్యులవారు తమ భాష్యములో. "ఇత్యత్ర అతి శబ్దః కట్‍వాదిషు సర్వత్ర యోజ్యః" -అంటే ఇక్కడ 'అతి' శబ్దము కటు మొదలగు వాటితో అన్నిచోట్ల తగును" అని.

||శ్లోకము 10||

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్|
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్||10||

స|| యాతాయామమ్ గతరసమ్ పూతి పర్యుషితం చ ఉచ్ఛిష్టం అపి అమేధ్యం చ యత్ భోజనమ్ అస్తి తత్ తామస ప్రియమ్||

||శ్లోకార్థములు||

యాతాయామమ్- వండిన పిమ్మట జాము గడచిన,
గతరసమ్- సారము పోయినవియు
పూతి పర్యుషితం చ - దుర్గంధము కలవి, పాచిపోయినవియు,
ఉచ్ఛిష్టం అపి - తినగా మిగిలివినవియు
అమేధ్యం చ యత్ భోజనమ్ - అశుద్ధముగా ఉన్నట్టి ఏ భోజనము కలదో
తత్ తామస ప్రియమ్- అది తమో గుణముకలవారికి ఇష్ఠమైనది అగును.

|| శ్లోక తాత్పర్యము||

"వండిన పిమ్మట జాము గడచినదియు, సారము పోయినవియు, దుర్గంధము కలవి, పాచిపోయినవియు,
తినగా మిగిలివినవియు, అశుద్ధముగా ఉన్నట్టి ఏ భోజనము కలదో, అది తమో గుణముకలవారికి ఇష్ఠమైనది అగును".||10||

||శ్లోకము 11||

అఫలాకాంక్షీభిర్యజ్ఞో విధి దృష్టో య ఇజ్యతే|
యష్టవ్యమేతి మనః సమాధాయ స సాత్వికః||11||

స|| యష్టవ్యం ఏవ ఇతి మనః సమాధాయ విధిదృష్టః యః యజ్ఞః అఫలాకాంక్షిభిః ఇజ్యతే సః ( యజ్ఞః) సాత్త్వికః||11||

||శ్లోకార్థములు||

యష్టవ్యం ఏవ ఇతి - ఇది చేయతగినదే అని
మనః సమాధాయ - మనస్సును సమాధానపఱచుకొని
విధిదృష్టః యః యజ్ఞః - శాస్త్ర సమ్మతమగు ఏ యజ్ఞము
అఫలాకాంక్షిభిః ఇజ్యతే - ఫలాపేక్ష లేకుండా చేయబడుచుచున్నదో
సః ( యజ్ఞః) సాత్త్వికః- అది సాత్వికము

|| శ్లోక తాత్పర్యము||

"ఇది చేయతగినదే అని మనస్సును సమాధానపఱచుకొని, శాస్త్ర సమ్మతమగు ఏ యజ్ఞము
ఫలాపేక్ష లేకుండా చేయబడుచుచున్నదో అది సాత్వికము".||11||

ఫలాపేక్షలేకుండా చేయు కర్మలు సాత్వికము. అది ముఖ్యమైన మాట.

||శ్లోకము 12||

అభిసన్ధాయ తు ఫలం దమ్భార్థమపి చైవయత్|
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్||12||

స|| హే భరతశ్రేష్ట ! ఫలం అభిసన్ధాయ తు దమ్బార్థం అపి చ ఏవ యత్ (యజ్ఞః) ఇజ్యతే తం యజ్ఞం రాజసమ్ విద్ధి||12||

||శ్లోకార్థములు||
ఫలం అభిసన్ధాయ తు - ఫలము అపేక్షించి
దమ్బార్థం అపి చ ఏవ - డంబము కొఱకు
యత్ (యజ్ఞః) ఇజ్యతే - యే యజ్ఞము చేయబడుచున్నదో
తం యజ్ఞం రాజసమ్ విద్ధి- ఆ యజ్ఞము రాజసమైనదానినిగా తెలిసికొనుము.

|| శ్లోక తాత్పర్యము||
"ఓ భారత, ఫలము అపేక్షించి డంబము కొఱకు యే యజ్ఞము చేయబడుచున్నదో
ఆ యజ్ఞము రాజసమైనదానినిగా తెలిసికొనుము'.||12||

ఫలాపేక్షతో చేసే కర్మలు బంధములు కలిగించును అని ముందు విన్నమాట. ముముక్షువు అంటే మోక్షము కోరువాడు నిష్కామ కర్మలతో ముందుకు బంధములకు అతీతుడుగా ముందుకు పోతాడు. రాజస కర్మలు చేయువారు మోక్షమార్గములో పోలేరు. వారు చేయు కర్మలు డంబము కొఱకు చేయబడు కర్మలు.

||శ్లోకము 13||

విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్|
శ్రద్ధారహితం యజ్ఞం తామసం పరిచక్షతే||13||

స||విధిహీనమ్ అసృష్టాన్నమ్ మన్త్రహీనం అదక్షిణమ్ శ్రద్ధావిరహితమ్ యజ్ఞమ్ తామసమ్ పరిచక్షతే||13||

||శ్లోకార్థములు||
విధిహీనమ్ అసృష్టాన్నమ్ - శాస్త్ర విధిని అనుసరించనదియు, అన్నదానము లేనిదియు,
మన్త్రహీనం అదక్షిణమ్ - మన్త్రహీనమైనదియు, దక్షిణలేనిదియు,
శ్రద్ధావిరహితమ్ యజ్ఞమ్ - శ్రద్ధలేకుండా చేయబడిన యజ్ఞము,
తామసమ్ పరిచక్షతే- తామసమని చెప్పుచున్నారు.

|| శ్లోక తాత్పర్యము||
"శాస్త్ర విధిని అనుసరించనదియు, అన్నదానము లేనిదియు, మన్త్రహీనమైనదియు, దక్షిణలేనిదియు
శ్రద్ధలేకుండా చేయబడిన యజ్ఞము, తామసమని చెప్పుచున్నారు".||13||

అన్నదానము లేని , మంత్రములులేని యజ్ఞములు వుండవచ్చు, అయితే శ్రద్ధలేని యజ్ఞము యజ్ఞము కాదు. దానినే తామస యజ్ఞము అంటారు.

||శ్లోకము 14||

దేవద్విజ గురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవమ్|
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే||14||

స||దేవ ద్విజ ప్రాజ్ఞ పూజనం శౌచమ్ ఆర్జవమ్ బ్రహ్మచర్యమ్ అహింశా చ శారీరమ్ తప ఉచ్యతే||14||

||శ్లోకార్థములు||
దేవ ద్విజ ప్రాజ్ఞ పూజనం- దేవతలను బ్రాహ్మలను,గురువులను జ్ఞానులను పూజించుట
శౌచమ్ - బాహ్యాభ్యంతర శుద్ధి కలిగి యుండుట
ఆర్జవమ్- మనోవాక్కాయ కర్మలతో ఒకే రీతిగా ప్రవర్తించుట
బ్రహ్మచర్యమ్ అహింసా చ - బ్రహ్మచర్యము అహింస
శారీరమ్ తప ఉచ్యతే- శారీరక తపస్సు అని చెప్పబడుచున్నది.

|| శ్లోక తాత్పర్యము||
"దేవతలను బ్రాహ్మలను,గురువులను జ్ఞానులను పూజించుట, బాహ్యాభ్యంతర శుద్ధి కలిగి యుండుట,
మనోవాక్కాయ కర్మలతో ఒకే రీతిగా ప్రవర్తించుట, బ్రహ్మచర్యము, హింస చేయకుండుట,
శారీరక తపస్సు అని చెప్పబడుచున్నది".||14||

ఇక్కడ మూడు విధములగు తపస్సు గురించి చెప్పబడుతోంది. శారీరక తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సు అని. మూడు విధములైన తపస్సు. ఈ తపస్సులు సాత్వికమా రాజసికమా లేక తామసికమా అన్నది ఆ తపస్సు చేసే విధానముపై ఆధారపడివుంటుంది. శ్రద్ధతో చేసినవి సాత్వికము అని మనకు తెలుసు. ఈ తపస్సులు శ్రద్ధతో చేస్తే అవి సాత్వికము అని తరువాత వింటాము.

||శ్లోకము 15||

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్|
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే||15||

స|| అనుద్వేగకరమ్ సత్యం ప్రియహితం చ వాక్యం స్వాధ్యాయాభ్యసనమ్ చ ఏవ యత్ తత్ వాఙ్మయం తపః||

||శ్లోకార్థములు||
అనుద్వేగకరమ్ సత్యం - ఇతరులకు ఉద్వేగము కలిగించనిది, సత్యమైనది,
ప్రియహితం చ వాక్యం - ప్రియమైన మేలు చేయు వాక్యము
స్వాధ్యాయాభ్యసనమ్ చ ఏవ - వేదాదులను అభ్యసించుట
యత్ తత్ - యేది కలదో అది
వాఙ్మయం తపః- వాక్కుకి సంబంధించిన తపస్సు అని చెప్పబడుచున్నది.

|| శ్లోక తాత్పర్యము||
"ఇతరులకు ఉద్వేగము కలిగించనిది, సత్యమైనది, ప్రియమైన మేలు చేయు వాక్యము,
వేదాదుల అభ్యసించుట, అలాంటివి యేవి కలదో అది వాక్కుకి సంబంధించిన తపస్సు అని చెప్పబడుచున్నది.".||15||

||శ్లోకము 16||

మనః ప్రసాదస్సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః|
భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే||16||

స|| మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమ్ ఆత్మవినిగ్రహః భావసంశుద్ధిః ఇతి ఏతత్ మానసమ్ తపః ఉచ్యతే||16||

||శ్లోకార్థములు||
మనః ప్రసాదః - మనస్సునిర్మలముగా వుంచడము
సౌమ్యత్వం మౌనమ్ - సౌమ్యత, మౌనము
ఆత్మవినిగ్రహః భావసంశుద్ధిః - మనస్సును నిగ్రహించుట, పరిశుద్ధమగు భావనలు కలిగియుండుట
ఇతి ఏతత్ - ఇవన్ని
మానసమ్ తపః ఉచ్యతే - మానసిక తపస్సు అని చెప్పబడుచున్నది.

||శ్లోక తాత్పర్యము||
"మనస్సునిర్మలముగా వుంచడము, సౌమ్యత, మౌనము, మనస్సును నిగ్రహించుట, పరిశుద్ధమగు భావనలు కలిగియుండుట, ఇవన్ని మానసిక తపస్సు అని చెప్పబడుచున్నది". ||16||

||శ్లోకము 17||

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః|
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే||17||

స|| అఫలాకాంక్షిభిః యుక్తైః నరైః పరయా శ్రద్ధయా తప్తమ్ తత్ త్రివిధం ( శారీరక, మానసిక వాచిక) తపః సాత్త్వికం పరిచక్షతే||

||శ్లోకార్థములు||
అఫలాకాంక్షిభిః యుక్తైః నరైః - ఫలాకాంక్షలేని వారు నిశ్చలచిత్తులు అగు మనుష్యులచేత
పరయా శ్రద్ధయా తప్తమ్ - పరమ శ్రద్ధతో ఆచరింపబడిన
త్రివిధం ( శారీరక, మానసిక వాచిక) తపః - మూడు విధములైన తపస్సు
సాత్త్వికం పరిచక్షతే- సాత్వికమని చెప్పబడుచున్నది.

||శ్లోక తాత్పర్యము||
"ఫలాకాంక్షలేని వారు నిశ్చలచిత్తులు అగు మనుష్యులచేత, పరమ శ్రద్ధతో ఆచరింపబడిన మూడు విధములైన తపస్సు సాత్వికమని చెప్పబడుచున్నది".||17||

ఇక్కడ, 'పరయా శ్రద్ధయా తప్తం", అంటే పరమ శ్రద్ధతో చేయబడిన తపస్సు అని. అది సాత్వికము.

||శ్లోకము 18||

సత్కారపూజమానార్థం తపో దమ్బేన చైవ యత్|
క్రియతే తదిహప్రోక్తం రాజసం చలమధ్రువమ్||18||

స||సత్కారమాన పూజార్థమ్ దమ్భేన చ ఏవ యత్ తపః క్రియతే తత్ చలమ్ అధ్రువమ్ రాజసమ్ (తపః) ఇహ ప్రోక్తమ్||

||శ్లోకార్థములు||
సత్కారమాన పూజార్థమ్ - ఇతరులచే సత్కరింపబడుటకై పూజింపబడుటకై,
దమ్భేన చ ఏవ - డంబముతో మాత్రమే
యత్ తపః క్రియతే - ఏ తపస్సు చేయబడుతున్నదో
తత్ చలమ్ అధ్రువమ్ - అది అస్థిరమై అనిశ్చితమైనటి ఫలము కలదై
రాజసమ్ (తపః) ఇహ ప్రోక్తమ్ - రాజసిక తపస్సు అని చెప్పబడుచున్నది.

||శ్లోక తాత్పర్యము||
"ఇతరులచే సత్కరింపబడుటకై, పూజింపబడుటకై, డంబముతో మాత్రమే ఏ తపస్సు చేయబడుతున్నదో,
అది అస్థిరమై అనిశ్చితమైనట్టి ఫలము కలదై, రాజసిక తపస్సు అని చెప్పబడుచున్నది".||18||

భగవంతునుమీదా ధ్యాస లేకుండా , డంబము కొఱకు చేసే తప్పసు ఏదైనా అది రాజసికము. దానికి ఫలము లేదు.

||శ్లోకము 19||

మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః|
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్||19||

స|| యత్ తపః మూఢగ్రాహేణ ఆత్మనః పీడయా పరస్య ఉత్సాదనార్థమ్ వా క్రియతే తత్ ( తపః) తామసమ్ ఉదాహృతే||

||శ్లోకార్థములు||
యత్ తపః మూఢగ్రాహేణ - ఏ తపస్సు మూర్ఖపు పట్టుదలతో
ఆత్మనః పీడయా - తనను బాధించుకొనుటకై గాని
పరస్య ఉత్సాదనార్థమ్ వా క్రియతే- ఇతరుల నాశనము కొఱకైగాని చేయబడినదో
తత్ ( తపః) తామసమ్ ఉదాహృతే- అట్టి తపస్సు తామసిక తపస్సు అని చెప్పబడుచున్నది.

||శ్లోక తాత్పర్యము||
"ఏ తపస్సు మూర్ఖపు పట్టుదలతో తనను బాధించుకొనుటకై గాని, ఇతరుల నాశనము కొఱకైగాని చేయబడినదో, అట్టి తపస్సు తామసిక తపస్సు అని చెప్పబడుచున్నది".||19||

||శ్లోకము 20||

దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే|
దేశేకాలేచ పాత్రేచ తద్దానం సాత్త్వికం స్మృతమ్||20||

స|| దాతవ్యం ఇతి యత్ దానమ్ దేశే కాలే చ పాత్రే చ అనుపకారిణే దీయతే తత్ దానం సాత్త్వికమ్ స్మృతమ్||

||శ్లోకార్థములు||
దాతవ్యం ఇతి యత్ దానమ్ - ఇవ్వతగినది అని ఏ దానము
దేశే కాలే చ పాత్రే చ - దేశమందును, కాలమందును, యోగ్యునియందును
అనుపకారిణే దీయతే - ప్రత్యుపకారము చేయలేని వారికి ఇవ్వబడుచున్నదో,
తత్ దానం సాత్త్వికమ్ స్మృతమ్- ఆ దానము సాత్వికమని చెప్పబడుచున్నది.

||శ్లోక తాత్పర్యము||
"ఇవ్వతగినది అని ఏ దానము, దేశమందును, కాలమందును, యోగ్యునియందును
ప్రత్యుపకారము చేయలేని వారికి ఇవ్వబడుచున్నదో, ఆ దానము సాత్వికమని చెప్పబడుచున్నది".||21||

దానము చేస్తున్నప్పుడు, ప్రత్యుపకారము చేయగలడో లేదో అని మనకి నిష్కర్షగా తెలియపోవచ్చు. ఇక్కడ అర్థము, వాడు ప్రత్యుపకారము చేయగలడాలేదా అన్న ఆలోచనలేకుండా దానము చేయడమే ప్రాధాన్యము అంటారు శంకరాచార్యులవారు తమ భాష్యములో.

||శ్లోకము 21||

యత్తుప్రత్యుపకారార్థం ఫలముద్దిస్య వా పునః|
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసస్మృతమ్||21||

స|| ప్రత్యుపకారార్థమ్ పునః ఫలమ్ ఉద్ధిశ్య వా పరిక్లిష్టం చ యత్ తు దీయతే తత్ దానమ్ రాజసమ్ స్మృతమ్||21||

|| శ్లోకార్థములు||
ప్రత్యుపకారార్థమ్ పునః ఫలమ్ ఉద్ధిశ్య - ప్రత్యుపకారముకొఱకు గాని,ఫలము ఉద్దేశించి గాని,
పరిక్లిష్టం చ - మనః క్లేశముతో గాని
యత్ తు దీయతే - ఏది ఇవ్వబడునో ( అట్టి దానము)
తత్ దానమ్ రాజసమ్ స్మృతమ్ - అట్టి దానము రాజసమని చెప్పబడుచున్నది.||21||

|| శ్లోకతాత్పర్యము||
"ప్రత్యుపకారముకొఱకు గాని,ఫలము ఉద్దేశించి గాని, మనః క్లేశముతో గాని ఏ దానము ఇవ్వబడునో అట్టి దానము రాజసమని చెప్పబడుచున్నది". ||21||

అట్తి దానములు బంధములు కలిగించు దానములు.

||శ్లోకము 22||

అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే|
అసత్కృత మవజ్ఞాతం తత్ తామసముదాహృతమ్||22||

స|| అదేశకాలే అపాత్రేభ్యః చ అసత్కృతమ్ అవజ్ఞాతమ్ యత్ దానమ్ దీయతే తత్ దానమ్ తామసమ్ ఇతి ఉదాహృతమ్||22||

|| శ్లోకార్థములు||
అదేశకాలే అపాత్రేభ్యః చ - దానముకు ఇవ్వతగని దేశమందు కాలమందు , అపాత్రులకు
అసత్కృతమ్ అవజ్ఞాతమ్ - సత్కారము లేకుండా, అమర్యాదతోను,
యత్ దానమ్ దీయతే - ఏ దానము ఇవ్వబడుచున్నదో
తత్ దానమ్ తామసమ్ ఇతి ఉదాహృతమ్ - ఆ దానము తామసమని చెప్పబడుచున్నది||22||

|| శ్లోకతాత్పర్యము||
"దానముకు ఇవ్వతగని దేశమందు కాలమందు , అపాత్రులకు, సత్కారము లేకుండా, అమర్యాదతోను, ఏ దానము ఇవ్వబడుచున్నదో, ఆ దానము తామసమని చెప్పబడుచున్నది".||22||

ఇక్కడ దాకా మూడు విధములగు యజ్ఞము తపస్సు దానము గురించి విన్నాము.

అందులో యజ్ఞదానతపాదులు మూడువిధములుగా విభజించి సాత్త్విక విధానమే అనుసరించవలసిన విధానము అని గ్రహించవలసిన విషయము. ఇవి ఫలా పేక్షలేకుండా బ్రహ్మమునకు సమర్పించి చేయాలి అన్నది అంతర్గత భావము . బ్రహ్మమునకు ఎలా అర్పించాలి, తపోదాన యజ్ఞాలు ఎలా ఆచరించాలి అనే విషయము చెప్పడానికి కృష్ణభగవానుడు "ఓమ్ తత్ సత్" అన్న మాటకి భావము చెపుతాడు

"ఓమ్ తత్ సత్" అన్న మూడు పదములు బ్రహ్మ వాచకములు. వీటి గురించి ఐదు శ్లోకాలలో చెప్పబడుతుంది.

ఈ బ్రహ్మవాచకముల మీద ఎందుకు ఇక్కడ చెప్పడమైనది అన్నఒక ప్రశ్న. ఆ ప్రశ్నకి శంకరాచార్యులవారు చెప్పినమాట ఇది; "యజ్ఞదాన ప్రభృతీనాం సాద్గుణ్యకారణాయ అయం ఉపదేశం ఉచ్యతే". అంటే యజ్ఞము దానము తపస్సు మున్నగు వాటికి మంచి కలిగించుటకు బ్రహ్మ వాచకముల మీద ఈ ఉపదేశము చెప్పబడినది అని.

అంటే సాత్విక తపో దాన యజ్ఞముల ఫలములు ఇక్కడే ప్రత్యక్షరూపముగా తెలియకపోవచ్చు, అలాగ తెలియకపోవడానికి కారణము ఆ సాత్విక తపో దాన యజ్ఞములలో జరిగిన తెలియక చేసిన లోపములు అవచ్చు. అలాగ తెలియక చేసే లోపములను సరిదిద్దడానికి ఈ బ్రహ్మ వాచకముల మీద ఇవ్వబడిన ఉపదేశము ఇది అన్నమాట. .

||శ్లోకము 23||

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః|
బ్రాహ్మణాః తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా||23||

స||బ్రహ్మణః ఓమ్ ఇతి తత్ ఇతి సత్ ఇతి త్రివిధః నిర్దేశః స్మృతః | తేన బ్రాహ్మణాః వేదాః చ యజ్ఞాః చ పురా విహితాః ||23||

|| శ్లోకార్థములు||
బ్రహ్మణః- పరబ్రహ్మము
ఓమ్ ఇతి తత్ ఇతి సత్ ఇతి - 'ఓమ్' అని, 'తత్' అని, 'సత్' అని
త్రివిధః నిర్దేశః స్మృతః - మూడు విధములగు నామములు చెప్పబడినది
తేన బ్రాహ్మణాః వేదాః చ యజ్ఞాః చ -
దానిచేత బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములును పూర్వము నియమించబడినవి

|| శ్లోకతాత్పర్యము||
"పరబ్రహ్మము, 'ఓమ్' అని, 'తత్' అని, 'సత్' అనిమూడు విధములగు నామములు చెప్పబడినది.
దానిచేత బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములును పూర్వము నియమించబడినవి ".||23||

"ఓమ్ తత్ సత్" అనే మూడు పదములు బ్రహ్మ వాచకములు అని వేదములలో విన్నమాట.

తైత్తరీయోపనిషత్తులో ( తై.1.8.1) "ఓమ్ ఇతి బ్రహ్మ", అంటే "ఓమ్ అనగా బ్రహ్మము" అని చెప్పబడినది. ఓమ్ అంటే బ్రహ్మ వాచకము.

తత్ అనే పదము ఉపనిషత్తుల మహావాక్యములలో వస్తుంది. మహావాక్యాలలో, "తత్ త్వం అసి", అంటే " నీవు బ్రహ్మస్వరూపమే', అన్నవాక్యములో 'తత్' అన్న పదము బ్రహ్మవాచకముగా వుపయోగింపబడినది. ఇది ఛందోగ్యోపనిషత్తులో చెప్పబడిన మాట.

అలాగే 'సత్' అనే పదము కూడా ఛందోగ్యోపనిషత్తులో వస్తుంది. ' సత్ ఏవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్". అంటే ' ఓ సౌమ్యుడా, ముందుగా 'సత్' ఒక్కటే వున్నది. అంటే ముందుగా వున్నది సత్ ఒక్కటే. అంటే ప్రప్రధమముగా వున్నది పరబ్రహ్మమే అని.

"ఓమ్ తత్ సత్" అన్నమాటలో పర బ్రహ్మము సద్రూపమైనది అని, ఆ సద్వస్తువు పరబ్రహ్మము అని అర్థము వచ్చును. అనగా ఆ పరబ్రహ్మము ఒక్కటియే సత్ లేక సద్వస్తువు. తక్కినవన్నిమిధ్యావస్తువులు. అంటే 'బ్రహ్మసత్యం జగన్మిధ్య'. దానిలోనే సర్వవేదాంతసారము ప్రస్ఫుటమగుచున్నది

ఇక్కడ శ్లోకము రెండవ పాదములో 'తేన' ఆబ్రహ్మముచేత 'పురా' అంటే పురాతనకాలములో అంటూ చెప్పబడినది. అది మూడవ అధ్యాయములో కూడా చెప్పబడిన మాట. మూడవ అధ్యాయములో ,"సహ యజ్ఞాః ప్రజా సృష్ఠ్వాపురోవాచ ప్రజాపతిః"( 3.09) వస్తుంది. ప్రజాపతి " యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించి .." అంటూ వస్తుంది. పరబ్రహ్మమే ప్రజలను వారికి అనుకూలముగా యజ్ఞములను సృష్టించాడు అన్నమాట.

ప్రజలను, యజ్ఞమును సృష్ఠించగలిగిన పరబ్రహ్మము, ఆ యజ్ఞములలోని దోషములు కూడా నివారింపగలశక్తి కలది.

||శ్లోకము 24||

తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞాదానతపః క్రియాః|
ప్రవర్తన్తే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్||24||

స|| తస్మాత్ బ్రహ్మవాదినామ్ విధానోక్తాః యజ్ఞదాన తపః క్రియాః సతతమ్ ఓమ్ ఇతి ఉదాహృత్య ప్రవర్తన్తే||24||

|| శ్లోకార్థములు||
తస్మాత్ బ్రహ్మవాదినామ్ విధానోక్తాః - అందువలన బ్రహ్మజ్ఞానులు శాస్త్రములందు చెప్పబడిన
యజ్ఞదాన తపః క్రియాః - యజ్ఞ, తపో దాన క్రియలు
సతతమ్ ఓమ్ ఇతి ఉదాహృత్య - ఎల్లప్పుడు ఓమ్ అని చెప్పి
ప్రవర్తన్తే- ప్రవర్తించుచున్నారు.

|| శ్లోకతాత్పర్యము||
"అందువలన బ్రహ్మజ్ఞానులు శాస్త్రములందు చెప్పబడిన యజ్ఞ, తపో దాన క్రియలు
ఎల్లప్పుడు ఓమ్ అని చెప్పిప్రవర్తించుచున్నారు".||24||

"ఓమ్ ఇతి బ్రహ్మ" అనడములో ఓం అంటే బ్రహ్మమే అని అర్థము.
బ్రహ్మ జ్ఞానులు యజ్ఞతపో దాన క్రియలు 'ఓమ్' అన్నపద ప్రయోగముతో మొదలు పెడతారు.
అలాగ ఎందుకు చెపుతారు అంటే, ఆ విధముగా "ఓమ్" అని చెప్పడము వలన కర్మానుష్ఠానములో వున్న దోషములు తొలగి పోవును.

"తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా", అంటే పరబ్రహ్మమే ప్రజలను వారికి అనుకూలముగా యజ్ఞములను సృష్టించాడు అన్నమాట ముందు శ్లోకము (17.23) లో విన్నాము.

ప్రజలను , యజ్ఞమును సృష్ఠించగలిగిన పరబ్రహ్మము, ఆ యజ్ఞములలోని దోషములు కూడా నివారింపగలశక్తి కలది . అందుకని ఆ విధముగా "ఓమ్" అని చెప్పడము వలన కర్మానుష్ఠానములో వున్న దోషములు తొలగి పోవును అంటారు.

అందుకనే మన పూజలన్నీ ఓమ్ అనే వాచకముతోనే మొదలవుతాయి..

||శ్లోకము 25||

తదిత్య నభిసన్ధాయ ఫలం యజ్ఞతపః క్రియాః|
దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాంక్షిభిః||25||

స|| మోక్ష కాంక్షిభిః తత్ ఇతి (ఉదాహృత్య) ఫలమ్ అనభిసన్ధాయ వివిధాః యజ్ఞ తపః క్రియాః దాన క్రియాః చ క్రియన్తే ||25||

|| శ్లోకార్థములు||
మోక్ష కాంక్షిభిః తత్ ఇతి (ఉదాహృత్య) - మోక్షము కోఱువారు, 'తత్' అని చెప్పి
ఫలమ్ అనభిసన్ధాయ - ఫలము కోఱకుండా
వివిధాః యజ్ఞ తపః క్రియాః - వివిధరకములైన యజ్ఞములు తపములు
దాన క్రియాః చ క్రియన్తే - దాన క్రియలు కూడా చేయుచున్నారు ||25||

|| శ్లోకతాత్పర్యము||
"మోక్షము కోఱువారు, 'తత్' అని చెప్పి, ఫలము కోఱకుండా వివిధరకములైన యజ్ఞములు తపములు
దాన క్రియలు కూడా చేయుచున్నారు".||25||

ఈ శ్లోకములో 'తత్' అనే పదముగురించి చెప్పబడుతున్నది.

ఇక్కడ 'తత్' అనే పదము , ఫలము కోరకుండా చేయబడు యజ్ఞ తపోదాన కర్మలలో ప్రయోగించబడుతున్నది అని. ఫలాపేక్షలేకుండా చేయబడు యజ్ఞదాన తపో క్రియలే మోక్షప్రాప్తికి కారణము కూడా.

||శ్లోకము 26||

సద్భావే సాధుభావేచ సదిత్యేతత్ ప్రయుజ్యతే|
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే||26||

స|| హే పార్థ సత్ భావే సాధు భావే చ సత్ ఇతి ఏతత్ ప్రయుజ్యతే | తథా ప్రశస్తే కర్మణి సత్ శబ్దః యుజ్యతే||

|| శ్లోకార్థములు||
సత్ భావే సాధు భావే చ - "వున్నది" అనే భావములోనూ,"మంచిది" అనే భావములోను
సత్ ఇతి ఏతత్ ప్రయుజ్యతే - "సత్" అనే పరబ్రహ్మవాచకము ప్రయోగించబడుచున్నది
తథా ప్రశస్తే కర్మణి - అలాగే ప్రశంసనీయమైన కర్మలలో (కూడా)
సత్ శబ్దః యుజ్యతే- "సత్" పదము ప్రయోగించబడుచున్నది.

|| శ్లోకతాత్పర్యము||
"'వున్నది' అనే భావములోనూ, 'మంచిది' అనే భావములోను, 'సత్' అనే పరబ్రహ్మవాచకము ప్రయోగించబడుచున్నది. అలాగే ప్రశంసనీయమైన కర్మలలో (కూడా)
సత్ శబ్దః యుజ్యతే- 'సత్' పదము ప్రయోగించబడుచున్నది".||26||

ఇక్కడ సత్ అనే పదముగురించి చెప్పబడుతున్నది.

'సత్' అనే పదము కూడా ఛందోగ్యోపనిషత్తులో "వున్నది" అనే అర్థముతో వస్తుంది.
' సత్ ఏవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్". అంటే ' ఓ సౌమ్యుడా, ముందుగా 'సత్' అంటే వున్నది అది ఒక్కటే", అంటే ప్రప్రధమముగా వున్నది పరబ్రహ్మమే అని.

'సత్' అన్న పదము మంచిది అనే అర్ధముతో కూడా ప్రయోగించబడుతుంది. 'సత్' అనే పదము వాడడము వలన, 'సత్' అనే పదముతో కలపబడిన కర్మ మంచిది అవుతుంది అని కూడా అర్థము. అంటే చేయబడిన కర్మ మంచిది అని చెప్పడానికి 'సత్' అనే పదము ఉపయోగించవచ్చు.

||శ్లోకము 27||

యజ్ఞే తపసి దానేచ స్థితిస్సదితి చోచ్యతే|
కర్మచైవ తదర్థీయం సదిత్యేవాభిదీయతే||27||

స|| యజ్ఞే తపసి చ దానే చ స్థితిః సత్ ఇతి ఉచ్యతే | తదర్థీయం కర్మ చ ఏవ సత్ ఇతి ఏవ అభిదీయతే ||27||

|| శ్లోకార్థములు||
యజ్ఞే తపసి చ దానే చ - యజ్ఞములలోనూ, తపస్సులోనూ, దానములలోనూ
స్థితిః సత్ ఇతి ఉచ్యతే - స్థితికి 'సత్' అని చెప్పబడుచున్నది.
తదర్థీయం కర్మ చ ఏవ - దాని అర్థము ఆ కర్మకూడా
సత్ ఇతి ఏవ అభిదీయతే - 'సత్' అని చెప్పబడుచున్నది.

|| శ్లోకతాత్పర్యము||
"యజ్ఞములలోనూ, తపస్సులోనూ, దానములలోనూ స్థితికి 'సత్' అని చెప్పబడుచున్నది. దాని అర్థము ఆ కర్మకూడా'సత్' అని చెప్పబడుచున్నది".||27||

యజ్ఞములలోనూ, తపస్సులోనూ, దానములలోనూ వున్న స్థితి, అంటే భావన, 'సత్ అని చెప్పబడుచున్నది. ఆ కర్మ అంటే యజ్ఞము తపస్సు దానము కూడా సత్ అని చెప్పబడుచున్నవి.

యజ్ఞములలోనూ, తపస్సులోనూ, దానములలోనూ వున్న భావన భక్తి .

||శ్లోకము 28||

అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్|
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ||28||

స|| హే పార్థ అశ్రద్ధయా హుతమ్ దత్తమ్ తప్తం తపః చ కృతం చ యత్ ( అస్తి) తత్ అసత్ ఇతి ఉచ్యతే | తత్ ప్రేత్య న | ఇహ చ న|| 28||

|| శ్లోకార్థములు||
అశ్రద్ధయా హుతమ్ దత్తమ్ - అశ్రద్ధతో (చేయబడిన) ఆహుతి, (చేయబడిన) దానము,
తప్తం తపః చ - (చేయబడిన) తపస్సు,
కృతం చ యత్ - చేయబడిన ఏ కర్మలు గలవో
తత్ అసత్ ఇతి ఉచ్యతే - అది 'అసత్' అని చెప్పబడుచున్నది.
తత్ ప్రేత్య న | ఇహ చ న|- అవి పరలోకములో ఫలము ఇవ్వవు
ఇహ చ న - ఇక్కడ కూడా.

|| శ్లోకతాత్పర్యము||
"అశ్రద్ధతో చేయబడిన ఆహుతి, చేయబడిన దానము, చేయబడిన తపస్సు,
చేయబడిన ఏ కర్మలు గలవో, అది 'అసత్' అని చెప్పబడుచున్నది.
అవి పరలోకములో ఫలము ఇవ్వవు, ఇక్కడ కూడా ఫలము ఇవ్వవు".||28||

ఏ కార్యము చేసినా అధ్యాత్మిక కార్యము వ్యవహార కార్యము కూడా శ్రద్ధ లేనిచో ఫలము ఇవ్వవు.
అంటే అన్ని రంగములలో శ్రద్ధ ప్రాధాన్యము. బడికి వెళ్ళే పిల్లలనుంచి ఇంటిని చూచే ఇల్లాలు దాకా అశ్రద్ధ తో చేసే పనులు తగిన ఫలము ఇవ్వవు. అలాంటప్పుడు అధ్యాత్మిక రంగము గురించి చెప్ప నక్కర లేదు.

అందుకని శ్రద్ధ ప్రధానము. శ్రద్ధతో చేయడము అంటే సాత్విక శ్రద్ధతో చేయడమే. రాజసిక శ్రద్ధ తామసిక శ్రద్ధలు కూడా ఫలములు ఇవ్వవు. మొదటి శ్లోకములో అర్జునుడు అడిగినది శాస్త్రము లు తెలియక శ్రద్ధతో ఉపాసన చేసినవాడి సంగతి ఏమిటి అన్న ప్రశ్నకి , కృష్ణుడు శ్రద్ధలో వున్న తారతమ్యములు చెప్పి , సాత్విక శ్రద్ధతో ఉపాసన అంటే తపము యజ్ఞము దానము చేసిన వానికి ఫలములు లభిస్తాయి అని. అంటే ఆధ్యాత్మిక విషయాలలో సాత్విక శ్రద్ధ ప్రధానము అని.

ఇక్కడ నాలుగు శ్లోకాలలో బీజమంత్రమైన "ఓమ్ తత్ సత్' గురించి విశ్లేషించబడినది. అది మరి ఒకసారి మననము చేద్దాము.

పరబ్రహ్మమునకు ఓం అని తత్ అని సత్ అని మూడుపేర్లు చెప్పబడినవి. వాని ఉచ్చారణచేతనే బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు నిర్మించబడినవి.

పరమాత్మనామము ఓంకారము చాలామహిమకలది. దాని ఉచ్చారణతోనే బ్రహ్మవాదులు శాస్త్రోక్తమైన యజ్ఞ దాన తపో క్రియలు ఆరంభిస్తారు. అంటే ఆరంభములో ఓంకారము. ఈ ఓంకారముతో కర్మానుష్టానమందు ఏమైనా దోషాలు లోపాలు విఘ్నాలు ఉన్నా ఆ సమస్తము నాశనమైపోతాయి. ప్రతి మంత్రము ఆదిలో కూడా ఓం అన్న శబ్దము చేర్చబడినది.

మోక్షకాంక్ష కలవారు ఫలమును కోరక 'తత్' అని పలికి యజ్ఞ దాన తపో క్రియలు ఆచరిస్తారు. తత్ అన్న శబ్దము ఆచరణలో ముఖ్యము.(17.25)

ఆచరణానంతరము కలగనిది కలిగినపుడు, అసాధువు సాధువు అయినపుడు, శుభకార్యములపుడు 'సత్' అన్న శబ్దము ఉపయోగించబడుతుంది (17.26) ఈశ్వరుని కోసము చేసే కర్మను కూడా సత్ అని అంటారు.

వేదములయొక్క మూలబీజము ఓంకారము.
ఓం- పరబ్రహ్మము.
తత్ - ఆ పరబ్రహ్మము.
సత్ - సద్రూపమైనది.
తత్ - ఆ , సత్ - సద్వస్తువు, ఓం--పరబ్రహ్మము.

అనగా ఆ పరబ్రహ్మము ఒక్కటియే సత్, అంటే సద్వస్తువు.

తక్కినవన్ని మిధ్యావస్తువులు.

అంటే బ్రహ్మసత్యం జగన్మిధ్య.
దానిలోనే సర్వవేదాంతసారము ప్రస్ఫుటమగుచున్నది.

" ఓం " చేర్చుటవలననే అన్నిమంత్రములు శక్తివంతములై ప్రభావితము చేయుచున్నవి.

" తత్" అనుపదము ఉచ్చరించుటచే మోక్షార్ధులు తపోదానయజ్ఞాది క్రియలు ఫలాపేక్షలేకుండా చేసి చిత్తశుద్ధిని పొందుచున్నారు. తద్వారా మోక్షమును పొందుచున్నారు ముక్తికొరకు అట్టిపుణ్యకార్యములు తప్పక ఆచరించవలెను అనియే భగవద్గీతలో బోధించబడినది.

ప్రతీవారు శ్రద్ధను ఆశ్రయించి ద్విగుణీకృతవిశ్వాశముతో వారి వారి ఆధ్యాత్మిక కార్యక్రమములను చేసుకొనవలెను అని భగవానుడు కర్మలో దైవత్వమును బోధించెను.

||ఓం తత్ సత్||

శ్రీభగవానువాచ
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్|
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ||
"పార్థా ! శ్రద్ధలేకుండా ఏ హ్మం చేసినా , ఏదానం చేసినా, ఏ తపమాచరించినా అది అసత్ అనబడుతుంది.దానివలన ఇహ పరాలలో కూడా ఫలము లేదు."
|| ఓమ్ తత్ సత్ ||