||భగవద్గీత ||

|| పదునెనిమిదవ అధ్యాయము ||

|| మోక్షసన్న్యాస యోగము - శ్లోకతాత్పర్యాలతో||


||ఓమ్ తత్ సత్||
అర్జున ఉవాచ:
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్|
త్యాగస్య చ హృషీ కేశ పృథక్కేసి నిషూదన ||1||
"హే మహాబాహో ! ఇంద్రియ నిగ్రహముగల ఓ కృష్ణా ! సన్యాసము యొక్కయు త్యాగము యొక్కయు యదార్ధమును తెలియగోరుచున్నాను."
-----

శ్రీమద్భగవద్గీత
అష్టాదశోఽధ్యాయః
మోక్షసన్యాసయోగము

||శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః||

శంకరభగవత్పాదులు పదునెనిమిదవ అధ్యాయము మోక్షసన్న్యాస యోగము గురించి ఇలాగ రాశారు.
"సర్వేషు హి అతీత్యేషు అధ్యాయేషు" అంటే ఇంతకముందు దాటిన అన్ని అధ్యాయాలలో, 'ఉక్తః అర్థః' అంటే చెప్పడిన అర్థము, 'అస్మిన్ అధ్యాయే అవగమ్యత"- ఈ అధ్యాయములో కనిపిస్తుంది అని.

అంటే అన్ని అధ్యాయాల సారము ఈ అధ్యాయములో వస్తుంది అన్నమాట.

ఇంతవరకు జ్ఞానముచే మోక్షము, భక్తి చే మోక్షము, అలాగే కర్మచే మోక్షము పొందగల పద్ధతులను తెలుపు అధ్యాయములు అనగా జ్ఞాన యోగము భక్తి యోగము కర్మయోగము గురించి విన్నాము.

ఈ అధ్యాయము - అంటే మోక్షసన్న్యా స యోగము - మోక్షప్రదమగు సన్యాసము ద్వారా లేక త్యాగముద్వారా లేక భగవదర్పణము ద్వారా లేక సర్వసంగరాహిత్యము ద్వారా యోగము భగవదైక్యము అంటే మోక్షము సిద్ధించునని తెలుపు అధ్యాయము. అందువలన ఈ అధ్యాయమునకు మోక్షసన్యాసమని పేరు కలిగి యుండవచ్చును.

మోక్షమనగా విడుదల. బంధమునుండి విడుదల. అట్టి బంధమోచన రూపమగు ముక్తి , లేక కైవల్యము త్యాగమువలననే లభించును. త్యాగమనినా సన్యాసమనినను ఒకటియే. ప్రపంచము, దేహము, మనస్సు ఇత్యాది సమస్త దృశ్యపదార్ధముల యొక్క సంగము పరిత్యజించి మోక్ష రూపుడగు భగవంతునే శరణు పొందవలెను. ఆ క్షణముననే ఇంద్రియగోచరమైన వస్తువులవేపు పరుగెత్తే మనస్సు ఆత్మగా శేషించును. అదియే మోక్ష స్థితి.

మోక్షసన్న్యాసమునకు మరియొక అర్ధము.

మోక్షమనగా దైవము, సన్యాసమనగా సమస్త కర్మల ఫలమును అర్పించుట. అంటే మోక్షమును సన్యాసము అనగా వదలుట. అప్పుడు మోక్షముకూడా సన్న్యసించగలవారు ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానము ఆత్మను ఎరిగిన వానికి, ఎట్టి బంధము ఉండదు. అట్టి బంధమే లేనివానికి మోక్షము గురించిన ప్రశ్నేలేదు. ముక్త స్థితి లో జీవుడు మోక్షభావన కూడ త్యజించును. పదిహేడు అధ్యాయములలో అధ్యాత్మ బోధ వినిన తరువాత ఇక బంధము ఎక్కడ? అంటే ఈ అధ్యాయములో మోక్షమును కూడా సన్యసించు యోగము, కాబట్టి మోక్షసన్న్యాస యోగమని చెప్పబడినది అని అనవచ్చు.

అదే మాట - " అజోనిత్య శాశ్వతోయమ్ పురాణో"- అను నిత్య సత్యము ద్వారా మనకు తెలియుచున్నది. సనాతనమగు ఆత్మను ఎరిగిన వానికి బంధము ఉండదు. అట్టి బంధమే లేనివానికి మోక్షము గురించిన ప్రశ్నేలేదు.

ఈ అధ్యాయము అర్జుని ప్రశ్నతో మొదలగుతుంది. అర్జునుడు సన్యాసము త్యాగము అన్నమాటలలో భేదము తెలిసికోనగోరి అడుగుతున్నాడు.

||శ్లోకము 1||
అర్జున ఉవాచ:
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్|
త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశి నిషూదన ||1||

స|| హే మహాబాహో !హే హృషీకేశ ! హే కేశి నిషూదన! సన్న్యాసస్య త్యాగస్య తత్త్వం పృథక్ వేదితుం ఇచ్ఛామి||1||

||శ్లోకార్థములు||
సన్న్యాసస్య త్యాగస్య తత్త్వం - సన్యాసము యొక్క త్యాగము యొక్క తత్త్వము
పృథక్ వేదితుం ఇచ్ఛామి - వేఱు వేఱుగా తెలిసికొనుటకు కోరుచున్నాను

||శ్లోక తాత్పర్యము||
అర్జునుడు పలుకుచున్నాడు:
"ఓ మహాబాహువులు కలవాడా, ఓ హృషీకేశ, ఓ కేసిని సంహరించినవాడా , కృష్ణా, సన్యాసము యొక్క త్యాగము యొక్క తత్త్వము, వేఱు వేఱుగా తెలిసికొనుటకు కోరుచున్నాను."||1||

సన్న్యాసము, త్యాగము అనే ఈ రెండు మాటలు చాలా సార్లు వింటాము. ఈ వీటిలో భేదము ఏమిటి అని అర్జునిడి ప్రశ్న

||శ్లోకము 2||
శ్రీభగవానువాచ:
కామ్యానాం కర్మణం న్యాసం సన్న్యాసం కవయో విదుః|
సర్వకర్మఫలత్యాగం ప్రాహుః త్యాగం విచక్షణాః ||2||

స|| కామ్యానామ్ కర్మణామ్ న్యాసం సన్న్యాసం కవయః విదుః| సర్వకర్మఫలత్యాగమ్ త్యాగమ్ విచక్షణాః ప్రాహుః||2||

||శ్లోకార్థములు||
కామ్యానామ్ కర్మణామ్ న్యాసం - ఫలప్రాప్తికై చేయబడు కర్మలను వదలుట
సన్న్యాసం కవయః విదుః - సన్న్యాసమని పండితులు తెలిసికొను చున్నారు
సర్వకర్మఫలత్యాగమ్ - సమస్త కర్మల ఫలము త్యాగము చేయుట
త్యాగమ్ విచక్షణాః ప్రాహుః - త్యాగము అని కొందఱు పండితులు చెప్పుచున్నారు.

||శ్లోక తాత్పర్యము||
"ఫలప్రాప్తికై చేయబడు కర్మలను వదలుట సన్న్యాసమని పండితులు తెలిసికొనుచున్నారు. సమస్త కర్మల ఫలము త్యాగము చేయుట
త్యాగము అని కొందఱు పండితులు చెప్పుచున్నారు"||2||.

సమస్త కర్మలకి, అంటే నిత్యనైమిత్తిక కర్మలకు ఫలము వుండును. సంధ్యావందనము లాంటి కర్మలు శాస్త్రము ప్రకారము చేయదగినవే, చేయ వలసినవే. ఆ సంధ్యావందనము వలన వచ్చే ఫలము వదలుట త్యాగము అని కొందరి పండితుల భావము.

||శ్లోకము 3||
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుః మనీషిణః|
యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే ||3||

స|| ఏకే మనీషిణః దోషవత్ కర్మ త్యాజ్యమ్ ఇతి ప్రాహుః|అపరే యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యం ఇతి చ||3||

||శ్లోకార్థములు||
ఏకే మనీషిణః - కొందరు మనుష్యులు
దోషవత్ కర్మ - దోషము వలె కర్మ
త్యాజ్యమ్ ఇతి ప్రాహుః - త్యజింపతగినది అని చెప్పుచున్నారు.
అపరే యజ్ఞ దాన తపః కర్మ - మరికొందరు యజ్ఞ తపోదాన కర్మలు
న త్యాజ్యం ఇతి చ - త్యజింపతగినవి కావు అని

||శ్లోక తాత్పర్యము||
"కొందరు మనుష్యులు, దోషము వలె కర్మ త్యజింపతగినది అని చెప్పుచున్నారు.
మరికొందరు యజ్ఞ తపోదాన కర్మలు త్యజింపతగినవి కావు అని చెప్పుచున్నారు".

కర్మలు బంధనములు కలిగిస్తాయి కాబట్టి దోషములు త్యజించి నట్లు కర్మలు కూడా త్యజించవలెను అని కొందరి భావము. సాంఖ్యయోగములో అలాగే జ్ఞానయోగములో ఈ మాట వస్తుంది. యజ్ఞములు దానములు తపములు వేదములలో చెప్పబడిన కర్మలు కనుక అట్టి కర్మలు త్యజింపరాదు అని కొందరి భావన. కర్మ త్యాగము, కర్మ సన్న్యాసము అన్నవి కర్మలలో వున్నవారికే. సన్యాసులకు జ్ఞానమార్గములో వున్నవారికి ఈ ప్రశ్న లేనేలేదు అని అంటారు శంకరభగవానులు తమ భాష్యములో. ఇక్కడ కృష్ణుడు అందరి భావనలు చెపుతున్నాడు. తన ఆలోచన ముందు వస్తుంది.

||శ్లోకము 4||
నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరతసత్తమ|
త్యాగోహి పురుషవ్యాఘ్ర త్రివిధః సమ్ప్రకీర్తితః ||4||

స|| హే భరత సత్తమ! తత్ర త్యాగే మే నిశ్చయమ్ శృణు | హే పురుషవ్యాఘ్ర త్యాగః త్రివిధః సంప్రకీర్తితః ||4||

||శ్లోకార్థములు||
తత్ర త్యాగే - ఆ కర్మ త్యాగము గురించి
మే నిశ్చయమ్ శృణు - నా నిశ్చయమును వినుము.
త్యాగః త్రివిధః సంప్రకీర్తితః -
త్యాగము మూడు విధములుగా చెప్పబడియున్నది

||శ్లోక తాత్పర్యము||
"భరతవంశములో ఉత్తముడా, ఆ కర్మ త్యాగము గురించి నా నిశ్చయమును వినుము.
పురుషులలో శ్రేష్ఠుడగువాడా, త్యాగము మూడు విధములుగా చెప్పబడియున్నది."||4||

ఇక్కడ కృష్ణుడు అంటున్నది త్యాగము సన్యాసము అనే మాటలు ముఖ్యముగా ఒకటే అని. కాని ఆ త్యాగము/సన్న్యాసము మూడు విధములు అని. గుణత్రయ విభాగ యోగములో చెప్పినట్లు, గుణభేధములవలన త్యాగము మూడు రకములు. అవి సాత్విక, రాజసిక తామసిక త్యాగములు అన్నమాట.

||శ్లోకము 5||
యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవతత్ |
యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ||5||

స|| యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యం | (సా) కార్యం ఏవ చ| యజ్ఞః తపః దానం ( అఫలాభిసక్త) మనీషిణామ్ పావనాని ( భవన్తి)||5||

||శ్లోకార్థములు||
యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యం -
యజ్ఞదాన తపో కర్మలు విడిచిపెట్టతగినవికావు.
(సా) కార్యం ఏవ చ - అవి చేయతగినవే
యజ్ఞః తపః దానం - యజ్ఞదాన తపో కర్మలు
మనీషిణామ్ పావనాని ఏవ - మనుష్యులకు పవిత్రతను కలుగచేయునవి.

||శ్లోక తాత్పర్యము||
"యజ్ఞదాన తపో కర్మలు విడిచిపెట్టతగినవికావు. అవి చేయతగినవే.
యజ్ఞదాన తపో కర్మలు మనుష్యులకు పవిత్రతను కలుగచేయునవి కదా".||5||

ఇక్కడ యజ్ఞదాన తపో కర్మలమీద కృష్ణుడు తన భావన చెపుతాడు. యజ్ఞదాన తపో కర్మలు, చేసేవారికి పవిత్రతను కలగచేస్తాయి. మనస్సును నిలకడ చేస్తాయి. శుద్ధపరుస్తాయి. అందుకని అవి సందేహము లేకుండా చేయతగినవే. ఆ కర్మలు ఎలా చెయ్యాలి అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆ కర్మలు కూడా చేయవలసిన విధముగా చెయ్యాలి. ఫలాకాంక్షతో భేద భావములతో చేసే కర్మలు అవి యజ్ఞదాన తపోకర్మలైనా అవి ఫలించవు. ఇది ముందు శ్లోకములో వింటాము.

||శ్లోకము 6||
ఏతాన్యపి తు కర్మాణి సఙ్గం త్యక్త్వా ఫలాని చ|
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ||6||

స|| హే పార్థ! ఏతాని కర్మాణి అపి సఙ్గమ్ త్యక్త్వా ఫలాని చ త్యక్త్వా కర్తవ్యాని ఇతి మే నిశ్చితమ్ ఉత్తమమ్ మతమ్||6||

||శ్లోకార్థములు||
ఏతాని కర్మాణి అపి - ఈ కర్మలు కూడా
అపి సఙ్గమ్ త్యక్త్వా ఫలాని చ త్యక్త్వా - ఆసక్తిని విడిచి, ఫలములు విడిచి
కర్తవ్యాని ఇతి - చేయతగినవే అని
మే నిశ్చితమ్ ఉత్తమమ్ మతమ్- నా యొక్క నిశ్చితమైన శ్రేష్ఠమైన అభిప్రాయము

||శ్లోక తాత్పర్యము||
"ఓ పార్థా, ఈ కర్మలు కూడా ఆసక్తిని విడిచి, ఫలములు విడిచి చేయతగినవే అని
నా యొక్క నిశ్చితమైన శ్రేష్ఠమైన అభిప్రాయము".||6||

యజ్ఞ తపో దాన కర్మలు విడిచిపెట్టతగినవి కావు. చేయతగినవే. అయితే వాటి ఫలముల మీద కోరికలేకుండా, తనే కర్త అనే భావము లేకుండాచేయవలెను అన్నమాట. ఇక్కడ కృష్ణుడు నిశ్చయముగా సందేహముకు తావు లేకుండా చెపుతున్నాడు.

||శ్లోకము 7||
నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే|
మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః ||7||

స|| నియతస్య ( వేదోక్త) కర్మణః సన్న్యసః తు న ఉపపద్యతే| మోహాత్ తస్య పరిగ్రహః తామసః ( తామసత్యాగః) ఇతి పరికీర్తితః||7||

||శ్లోకార్థములు||
నియతస్య ( వేదోక్త) కర్మణః - వేదములలో విధింపబడిన కర్మలు
సన్న్యసః తు న ఉపపద్యతే - పరిత్యాగము తగినది కాదు.
మోహాత్ తస్య పరిగ్రహః - అజ్ఞానము వలన వాని పరిత్యాగము
తామసత్యాగః ఇతి పరికీర్తితః - తామస త్యాగమని చెప్పబడుచున్నది.

||శ్లోక తాత్పర్యము||
"వేదములలో విధింపబడిన కర్మల పరిత్యాగము తగినది కాదు.
అజ్ఞానముతో వాటిని త్యాగము చేసినచో, అది తామస త్యాగమని చెప్పబడుచున్నది."||7||

యజ్ఞ దాన తపో కర్మలమీద నిశ్చయముగా చెప్పబడినది. అయితే మరి నిత్య కర్మల గురించి ఏమిటి అన్నప్రశ్న వస్తుంది. కొందరు నిత్యకర్మలకి ఫలము లేదు, అందుకని వాటి త్యాగము అనవసరము అని. మరికొందరు నిత్యకర్మలకి కూడా ఫలము వుంది. దాని త్యాగము అవరము అని కొందరు అంటారు. నిత్యకర్మల గురించి విచారణ సన్యాసమార్గము లో వున్నవాళ్ళకి కాదు. ఇది కర్మసిద్ధాంతములో వున్నవారికే. ఇక్కడ కృష్ణుడు తన నిశ్చయము చెపుతున్నాడు.

కృషుని మాట. వేదములో చెప్పబడిన నిత్య నైమిత్తిక కర్మలు విడిచిపెట్టకూడదు. అజ్ఞానముతో వాటిని పరిత్యాగము చేసితే, దానిని తామస త్యాగము అని చెప్పబడుతున్నది. అట్టి త్యాగమునకు త్యాగఫలము వుండదు.

||శ్లోకము 8||
దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్|
సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ||8||

స|| యః యత్ కర్మ కాయ క్లేశ భయాత్ దుఃఖం ఇతి ఏవ ( మత్వా) త్యజేత్ , సః రాజసమ్ త్యాగం కృత్వా త్యాగఫలమ్ న లభేత్ ఏవ||8||

||శ్లోకార్థములు||
యత్ కర్మ కాయ క్లేశ భయాత్ - ఏ కర్మను శరీర ప్రయాసవలన భయముతో
దుఃఖం ఇతి ఏవ ( మత్వా) త్యజేత్ - దుఃఖము కలుగ చేయునది అని త్యజించునో
సః రాజసమ్ త్యాగం కృత్వా - అతడు రజోగుణ సంబంధమైన త్యాగమును చేసి
త్యాగఫలమ్ న లభేత్ ఏవ - త్యాగఫలము పొందలేకున్నాడు

||శ్లోక తాత్పర్యము||
"ఎవడు కర్మను శరీర ప్రయాసవలని భయముతో, దుఃఖము కలుగ చేయునది అని త్యజించునో,
అతడు రజోగుణ సంబంధమైన త్యాగమును చేసి త్యాగఫలము పొందలేకున్నాడు".||8||

కర్మ చేయుట ప్రయాస, కష్ఠమని తలచి త్యాగము చెయ్యడము రాజసిక త్యాగము. దానికి త్యాగ ఫలము వుండదు. ఇక్కడ త్యాగ ఫలము అంటే మోక్షము. అది లభించదు. కర్మలు ఆరంభములో కష్ఠముగా వుండవచ్చు. ఆ ప్రయాస కి భయపడి చేసిన త్యాగము రాజసికము. ఇక్కడ గ్రహించవలసిన విషయము త్యాగములో, త్యాగము చేయవలసినది కర్మ కాదు. కర్మ చేయవలసినదే. చేయవలసినది కర్మఫలత్యాగము, కర్మసంగ త్యాగము.

||శ్లోకము 9||
కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేఽర్జున|
సఙ్గం త్యక్త్వా ఫలం చైవ త్యాగః సాత్త్వికోమతః ||9||

స|| హే అర్జున! నియతమ్ యత్ కర్మ కార్యం ఇతి ఏవ సఙ్గం త్యక్త్వా ఫలం ఏవ చ త్యక్త్వా క్రియతే సః త్యాగః సాత్త్వికః ఇతి మతః||9||

||శ్లోకార్థములు||
నియతమ్ - శాస్త్రముచే నియమించబడిన
యత్ కర్మ కార్యం ఇతి - ఏ కర్మము చేయతగినది అని తలచి
సఙ్గం త్యక్త్వా ఫలం ఏవ చ త్యక్త్వా క్రియతే -
ఆసక్తిని ఫలమును త్యజించి చేయునో
సః త్యాగః సాత్త్వికః ఇతి మతః-
ఆ త్యాగము సాత్త్వికము అని నిశ్చయింపబడినది.

||శ్లోక తాత్పర్యము||
"శాస్త్రముచే నియమించబడిన ఏ కర్మము చేయతగినది అని తలచి,
ఆసక్తిని, ఫలమును త్యజించి చేయునో, ఆ త్యాగము సాత్త్వికము అని నిశ్చయింపబడినది".||9||

ఫలము ఆసక్తి విడిచి చేసిన త్యాగము సాత్విక త్యాగము అని చెప్పబడుతున్నది. చేయవలసిన కర్మ ఆసక్తి ఫలము విడిచి చేసినచో అట్టి వాని మనస్సు పరిశుద్ధము అవుతుంది.

నిత్య కర్మలు నియతకర్మలు. అంటే చేయవలసిన కర్మలు. నిత్యకర్మలు మనస్సును పరిశుద్ధము చేస్తాయి. అవి చేయతగినవే. కాని అవి ఫలాసక్తి , ఫలము విడిచి చేయవలెను. అలా చేసిన త్యాగము సాత్విక త్యాగము. ఆ త్యాగము మోక్ష ప్రదాయకము.
||శ్లోకము 10||
న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలేనానుసజ్జతే|
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛ్చిన్నసంశయః ||10||

స|| సత్త్వ సమావిష్టః మేధావీ ఛిన్న సంశయః త్యాగీ అకుశలమ్ కర్మ నద్వేష్టి | కుశలే (కర్మే) న అనుషజ్జతే ( అనాసక్తః భవతి)||10||

||శ్లోకార్థములు||
సత్త్వ సమావిష్టః మేధావీ - సత్త్వగుణముతో కూడిన వాడు, మేధావి,
ఛిన్న సంశయః త్యాగీ - సంశయములను ఛేదించినవాడును, త్యాగశీలుడు
అకుశలమ్ కర్మ నద్వేష్టి - దుఃఖకరమైన కర్మమును ద్వేషింపడు.
కుశలే (కర్మే) న అనుషజ్జతే - నిష్కామకర్మమునందు అభిమానము కలిగివుండడు.

||శ్లోక తాత్పర్యము||
"సత్త్వగుణముతో కూడిన వాడు, మేధావి, సంశయములను ఛేదించినవాడును, త్యాగశీలుడు, దుఃఖకరమైన కర్మమును ద్వేషింపడు. నిష్కామకర్మమునందు అభిమానము కలిగివుండడు".||10||

'సత్త్వ సమావిష్ఠ" అంటే సత్త్వ గుణముతో కూడినవాడు. ఆ సత్త్వగుణము జ్ఞానోదయానికి మార్గము చూపిస్తుంది. అంటే వాడికి కావలిసిన తెలివి తేటలు వున్నాయి. అతడు మేధావి.

ఇంకొక మాట. సత్త్వగుణము కలిగిన కర్మఫలత్యాగి, ద్వంద్వాలకి అతీతుడు.

ఈ మూడు శ్లోకాలలో కర్మానుష్ఠానములో తామసిక రాజసిక సాత్విక భావన మనకి తెలుస్తుంది. తామసికుడు శాస్త్రవిధి తెలియక కర్మను ఆచరించకుండును. రాజసుడు చేయవలసిన కర్మ కష్ఠమని చేయకుండును. సాత్వికుడు తెలిసియు కష్ఠములకు జంకక ఫలములకు అతీతుడై తనే కర్త అనే భావన లేకుండా చేయును. సాత్వికునిదే సరి అయినమార్గము అని, అతని త్యాగమే ఉత్తమ త్యాగమని, మనకి ఈ శ్లోకము ద్వారా విదితమౌతుంది.

||శ్లోకము 11||
నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః|
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిదీయతే ||11||

స|| కర్మాణి అశేషతః ( సంపూర్ణరూపేణ) త్యక్తుమ్ దేహభృతా న శక్యం హి | యః తు కర్మ ఫల త్యాగీ ( భవతి) సః త్యాగీ ఇతి అభిదీయతే||11||

||శ్లోకార్థములు||
కర్మాణి అశేషతః త్యక్తుమ్ - కర్మలను నిశ్శేషముగా వదలుట
దేహభృతా న శక్యం హి - దేహధారి అగు జీవునకు శక్యము కాదు.
యః తు కర్మ ఫల త్యాగీ - ఎవరు కర్మల ఫలము త్యాగము చేయగలరో ( వారు)
స త్యాగీత్యభిదీయతే - అట్టివాడు త్యాగి అనబడుచున్నాడు.

||శ్లోకతాత్పర్యము||
"కర్మలను నిశ్శేషముగా వదలుట, దేహధారి అగు జీవునకు శక్యము కాదు.
ఎవడు కర్మల ఫలము త్యాగము చేయగలడో అట్టివాడు త్యాగి అనబడుచున్నాడు".||11||

దేహధారికి కర్మలు వదలడము శక్యము కాదు అన్నమాటలో తెలిసికొనవలసిన మాట, కర్మలు వదలడము కష్టము అయినా, అవి ముఖ్యము అని.

దేహధారికి కర్మలు వదలడము శక్యము కాదు అన్నమాట, మూడవ అధ్యాయములో, 'న హి కశ్చిత్ క్షణమపి'(3.05) అన్నమాటని గుర్తు చేస్తుంది. దేహధారికి ఆ కర్మలు చేస్తూ వాటి ఫలములను విడుచుటయే సర్వోత్తమమైన మార్గము. అప్పుడు వాడే త్యాగి.

||శ్లోకము 12||
అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధః కర్మణః ఫలమ్|
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ ||12||

స|| అనిష్టం ఇష్టమ్ మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ అత్యాగినామ్ ప్రేత్య భవతి |( కర్మఫలత్యాగినాం) సన్న్యాసినాం తు క్వచిత్ న||12||

||శ్లోకార్థములు||
అనిష్టం ఇష్టమ్ మిశ్రం చ - దుఃఖకరమైనది, సుఖకరమైనది, మిశ్రమ మైనది
త్రివిధం కర్మణః ఫలమ్ - మూడువిధములైన కర్మ ఫలము
అత్యాగినామ్ - కర్మ ఫలము త్యాగము చేయనివారికి
ప్రేత్య భవతి - మరణానంతరము కలుగుచున్నది.
సన్న్యాసినాం తు క్వచిత్ న - సన్న్యసించినవారికి ఎప్పుడును కలగవు

||శ్లోకతాత్పర్యము||
"దుఃఖకరమైనది, సుఖకరమైనది, మిశ్రమ మైనది మూడువిధములైన కర్మ ఫలములు. కర్మ ఫలము త్యాగము చేయనివారికి మరణానంతరము కలుగుచున్నది. కర్మఫలము సన్న్యసించినవారికి అట్టి ఫలములు ఎప్పుడును కలగవు".||12||

కర్మఫల త్యాగి, త్యాగి అనబడతాడు. కర్మఫలములు త్యజించినవానికి కర్మఫలములు వుండవు. అంటే ఇక్కడ చెప్పిన ఫలితములు కర్మ త్యాగికి కాదు అన్నమాట.

అయితే అసలు కర్మఫలములు ఏమిటి? అది ఇక్కడ కృష్ణుడు చెపుతున్నాడు. కర్మ ఫలములు మూడు. దుఃఖకరము, సుఖకరము , సుఖదుఃఖ మిశ్రమము.

ఇక్కడ దుఃఖకరమైన ఫలము నరకము, నీచ జన్మములు, ఇత్యాది. సుఖకరమైనవి స్వర్గము, దైవత్వము, ఇత్యాది. మిశ్రమము సుఖదుఃఖములు రెండు కల మానజన్మ. ఇవి మరణానంతరము కలిగే ఫలితములు. కర్మఫలము త్యజించినవారు మోక్షము పొంది, మరణానంతరము పునర్జన్మ వుండదు. అందువలన ఇక్కడ చెప్పబడిన కర్మ ఫలితములు పొందరు.

కర్మకి కారణములు ఐదు. వాటిగురించి కూడా కృష్ణుడు చెపుతాడు.

||శ్లోకము 13||
పఞ్చైతాని మహాబాహో కారణాని నిబోధమే|
సాఙ్ఖ్యే కృతాన్తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ||13||

స|| హే మహాబాహో ! సర్వకర్మణాం సిద్ధయే కృతాన్తే సాంఖ్యే ప్రోక్తాని ఏతాని పఞ్చకారణాని మే వచనాత్ నిబోధ||13||

||శ్లోకార్థములు||
సర్వకర్మణాం సిద్ధయే - సమస్త కర్మల సంపూర్తి కి
సాంఖ్యే కృతాన్తే ప్రోక్తాని - కర్మబంధములు నశింపచేయు సాంఖ్యయోగము లో చెప్పబడిన
ఏతాని పఞ్చకారణాని - ఈ ఐదు కారణములు
మే వచనాత్ నిబోధ - నా వచనములద్వారా తెలిసికొనుము

||శ్లోకతాత్పర్యము||
"సమస్త కర్మల సంపూర్తి కి కర్మబంధములు నశింపచేయు సాంఖ్యయోగము లో చెప్పబడిన
ఈ ఐదు కారణములు నా వచనములద్వారా తెలిసికొనుము".||13||

'కృతాంతే' అంటే,'కృత అంతే' - అంటే కర్మకాండ యొక్క అంతము బోధించు వేదాంత శాస్త్రమందు అని. కర్మ అంతా ఆత్మ జ్ఞానముతో సమాప్తము అవుతుంది అని భగవద్గీత లోనే విన్నాము. రెండవ అధ్యాయములో "యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే "(2.46) అంటూ, "సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే"(4.33) అంటూ కర్మయొక్క అంతము జ్ఞానములో సమాప్తము అని చెప్ప బడుతుంది.

వేదాంత శాస్త్రములో కర్మ నెరవేరుటకు ఐదు కారణములు చెప్పబడినవి ( సాంఖ్య యోగములో).

||శ్లోకము 14||
అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ |
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పఞ్చమమ్ ||14||

స|| అత్ర అధిష్టానమ్ తథా కర్తా పృథక్ విధం కరణం చ వివిధాః చేష్టాః( క్రియాః) చ పఞ్చమమ్ దైవం చ ( కారణాని భవన్తి)||14||

||శ్లోకార్థములు||
అత్ర - ఈ కర్మాచరణ విషయములో
అధిష్టానమ్ - శరీరము
తథా కర్తా - అలాగే కర్త
పృథక్ విధం కరణం చ - వేఱువేఱు విధములగు కర్మసాధనములు
చ వివిధాః చేష్టాఃచ - వివిధ రకములైన క్రియలు
పఞ్చమమ్ దైవం చ - ఐదవది దైవము

||శ్లోకతాత్పర్యము||
"ఈ కర్మాచరణ విషయములో, శరీరము, అలాగే కర్త, వేఱువేఱు విధములగు కర్మసాధనములు, వివిధ రకములైన క్రియలు, ఐదవది దైవము కారణములు అగుచున్నవి".||15||

అధిష్టానం - అంటే సుఖదుఃఖాలు అభివ్యక్తమవడానికి అధారము. సుఖదుఃఖాలు అభివ్యక్తమవడానికి ఆధారమే శరీరము. కర్మసాధనములు పన్నెండు. అవి ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, మనస్సు, మరియు బుద్ధి. కర్మలకి కారణములలో దైవము కూడా చెప్పబడినది. అంటే అవి పూర్వజన్మ పాపపుణ్యములు అని చెప్పుకోవచ్చు.

||శ్లోకము 15||
శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః|
న్యాయం వా విపరీతం వా పఞ్చైతే తస్య హేతవః ||15||

స|| నరః శరీరవాఙ్మనోభిః న్యాయం వా విపరీతం వా యత్ కర్మ ప్రారభతే తస్య ఏతే పఞ్చ హేతవః (అస్తి)||15||

||శ్లోకార్థములు||
నరః శరీరవాఙ్మనోభిః - మనుజుడు శరీరము, వాక్కు, మనస్సులచేత
న్యాయం వా విపరీతం వా - న్యాయమైనట్టిదికాని అన్యాయమైనట్టిది కాని
యత్ కర్మ ప్రారభతే - ఏ కర్మను ప్రారంభించుచున్నాడో ( అట్టి కర్మకి)
ఏతే పఞ్చ హేతవః - ఈ ఐదు కారణములైయున్నవి

||శ్లోకతాత్పర్యము||
"మనుజుడు శరీరము, వాక్కు, మనస్సులచేత న్యాయమైనట్టిదికాని అన్యాయమైనట్టిది కాని
ఏ కర్మను ప్రాంభించుచున్నాడో అట్టి కర్మకి ఈ ఐదు కారణములైయున్నవి"

ఏ పని చేసినా, మంచి అయినా, చెడు అయినా వాటికి కారణములు పైన చెప్పబడిన ఐదు మాత్రమే.

||శ్లోకము 15||
తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః|
పశ్యత్యకృత బుద్ధిత్వాన్ న స పశ్యతి దుర్మతిః ||16||

స|| తత్ర ఏవం సతి యః అకృత బుద్ధిత్వాత్ కేవలం ఆత్మానం తు కర్తారమ్ పశ్యతి సః దుర్మతిః ( ఆత్మ స్వరూపం వా కర్మ స్వరూపం) న పశ్యతి||16||

||శ్లోకార్థములు||
తత్ర ఏవం సతి - ఇక్కడ ఇలా వుండగా
యః అకృత బుద్ధిత్వాత్ - ఎవడు సంస్కరింపని బుద్ధి కలవాడగుటచే
కేవలం ఆత్మానం తు కర్తారమ్ పశ్యతి - కేవలము తననే కర్తనుగా చూచుచున్నాడో
సః దుర్మతిః - అట్టి అవివేకి
న పశ్యతి - ( ఆత్మస్వరూపమును) చూడకున్నాడు.

||శ్లోకతాత్పర్యము||
"కర్మవిషయములందు ఐదు కారణహేతువులు వుండగా, సంస్కరింపని బుద్ధి కలవాడగుటచే ఎవడు, తననే కర్తగా తలచుచున్నాడో, అట్టి అవివేకి ఆత్మస్వరూపమును చూడకున్నాడు". ||16||

కర్మ ప్రారంభమునకు ఐదు కారణములు వున్నాయి అని విన్నాము. అవి శరీరము, అలాగే కర్త, వేఱువేఱు విధములగు కర్మసాధనములు, వివిధ రకములైన క్రియలు, దైవము. అది గ్రహించక శాస్త్రాదులచే సంస్కరింపబడని బుద్ధి కలవాడు , తనే శరీరము అని, తనే సమస్త కర్మలకు కర్త అని అనుకుంటాడో, అటువంటి దుర్మతికి, అవివేకి ఆత్మ స్వరూపముచూడలేకున్నాడు. అంటే వానికి ఆత్మ గురించి తెలియదు అన్నమాట.

||శ్లోకము 17||
యస్య నాహఙ్కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే|
హత్వాఽపి స ఇమాంల్లోకాన్ న హన్తి న నిబధ్యతే ||17||

స|| యస్య అహం కృతః భావః న ( భవతి) , యస్య బుద్ధిః ( కర్మణాం) న లిప్యతే సః ఇమాన్ లోకాన్ హత్వా అపి న హన్తి | సః (కర్మాత్ ) న నిబధ్యతే ||17||

||శ్లోకార్థములు||
యస్య అహం కృతః భావః న - ఎవరికి నేనే కర్తను అను భావము లేదో
యస్య బుద్ధిః ( కర్మణాం) న లిప్యతే - ఎవరి బుద్ధి కర్మలను అంటదో
సః ఇమాన్ లోకాన్ హత్వా అపి న హన్తి -
అట్టి వాడు ఈ లోకములను చంపినను చంపుటలేదు
సః (కర్మాత్ ) న నిబధ్యతే - అతడు కర్మలచే బంధింపబడుటలేదు.

||శ్లోకతాత్పర్యము||
"ఎవరికి నేనే కర్తను అను భావము లేదో, ఎవరి బుద్ధి కర్మలను అంటదో,
అట్టి వాడు ఈ లోకములను చంపినను చంపుటలేదు. అతడు కర్మలచే బంధింపబడుటలేదు."||17||

ఇక్కడ కృష్ణుడు సాంఖ్యయోగము మళ్ళీ బోధిస్తున్నాడు. అహంకారము తనే కర్త అని భావించడము అజ్ఞానము. తనే కర్త అని భావము లేనివానికి, కర్మలు బంధింపవు. అట్టివాడు ఆ కర్మ వలన కలిగే సుఖదుఃఖములకు పుణ్యపాపములకు అతీతుడు. అవి వానిని అంటవు అంటారు. పుణ్యపాపములకు కారణము కర్తుత్వమే. ఆ కర్తుత్వము లేనివాడు సమస్త ప్రాణులలోను తన ఆత్మనే చూచును. అట్టివాడు చంపడము అనుమాట రాదు. అట్టివాడు చేసిన కర్మల ఫలములకు అతీతుడు. ఇది ( 'కర్మఫలము సన్న్యసించినవారికి కర్మ ఫలములు ఎప్పుడును కలగవు' అని) పన్నెండవ శ్లోకములో కూడా విన్నాము.

||శ్లోకము 18||
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మ చోదనా|
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసఙ్గ్రహః ||18||

స|| కర్మ చోదనా జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా ఇతి త్రివిధా | కర్మ సంగ్రహః కరణమ్ కర్మ కర్త ఇతి త్రివిధః||18||

||శ్లోకార్థములు||
కర్మ చోదనా - కర్మమునకు హేతువు
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా - తెలివి, తెలివితో తెలిసికొనబడతగినది, తెలిసుకొనువాడు
ఇతి త్రివిధా - అని మూడు విధములు
కర్మ సంగ్రహః - కర్మ కి ఆధారము
కరణమ్ కర్మ కర్త - కర్మసాధనము, క్రియ , క్రియ చేయువాడు
ఇతి త్రివిధః - అని మూడు విధములు

||శ్లోకతాత్పర్యము||
కర్మమునకు హేతువు తెలివి, తెలివితో తెలిసికొనబడతగినది, తెలిసుకొనువాడు అని మూడు విధములు.
కర్మ కి ఆధారము, కర్మసాధనము, క్రియ, క్రియ చేయువాడు అని మూడు విధములు.

కర్మ నడిపించడానికి కావలసినవి మూడు - తెలివికావాలి ( జ్ఞానము), ఆ తెలివితో తెలిసికొనబడతగినది కావాలి, తెలిసికొనేవాడు కావాలి.

కర్మ జరగడానికి అధారము కావాలి. ఆ అధారములు కర్మ సాధనము, జరగవలసిన పని ( క్రియ), ఆ పని చేసేవాడు ( కర్త)

||శ్లోకము 19||
జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః|
ప్రోచ్యతే గుణసఙ్ఖ్యానే యథావత్ శృణుతాన్యపి ||19||

స|| గుణసంఖ్యానే జ్ఞానమ్ కర్మ చ కర్తా చ గుణభేదతః త్రిధా ఏవ ప్రోచ్యతే | తాని అపి యథావత్ శృణు||19||

||శ్లోకార్థములు||
గుణసంఖ్యానే - గుణముల గురించి చెప్పబడు సాంఖ్య శాస్త్రము లో
జ్ఞానమ్ కర్మ చ కర్తా చ - జ్ఞానము , కర్మయు, కర్తయు
గుణభేదతః త్రిధా ఏవ ప్రోచ్యతే - గుణములను అనుసరించి మూడు విధములుగా చెప్పబడుచున్నది
తాని అపి యథావత్ శృణు - వానిని కూడా యథారీతి చెప్పెదను వినుము.

||శ్లోకతాత్పర్యము||
"గుణముల గురించి చెప్పబడు సాంఖ్య శాస్త్రము లో జ్ఞానము, కర్మయు, కర్తయు గుణముల భేదమును అనుసరించి మూడు విధములుగా చెప్పబడుచున్నది. వానిని కూడా యథారీతి చెప్పెదను వినుము."||19||

సాత్విక రాజసిక,తామసిక గుణములను అనుసరించి కర్త కర్మ జ్ఞానము కూడా మూడు విధములు.

||శ్లోకము 20||
సర్వభూతేషు యైనైకం భావమవ్యయమీక్షతే|
అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ ||20||

స|| విభక్తేషు సర్వభూతేషు ఏకమ్ అవ్యయమ్ భావమ్ యేన అవిభక్తమ్ ఈక్షతే తత్ జ్ఞానమ్ సాత్వికమ్ విద్ధి||20||

||శ్లోకార్థములు||
విభక్తేషు సర్వభూతేషు ఏకమ్ - విభజింపబడి వేరుగనున్న సమస్త ప్రాణులయందు ఒకటైన
అవ్యయమ్ భావమ్ - నాశరహితమగు ఆత్మ వస్తువును
యేన అవిభక్తమ్ ఈక్షతే - యే జ్ఞానము తో విభజింపబడనిదానిగా చూచుచున్నాడో
తత్ జ్ఞానమ్ సాత్వికమ్ విద్ధి - ఆ జ్ఞానము సాత్వికము అని తెలిసికొనుము.

||శ్లోకతాత్పర్యము||
"విభజింపబడి వేరుగనున్న సమస్త ప్రాణులయందు ఒకటైన, నాశరహితమగు ఆత్మ వస్తువును
యే జ్ఞానముతో విభజింపబడనిదానిగా చూచుచున్నాడో, ఆ జ్ఞానము సాత్వికము అని తెలిసికొనుము".||20||

అజ్ఞానులకు ఈ ప్రపంచము సమస్త ప్రాణులు, సమస్త పదార్థములు వేరు వేరుగా కనిపిస్తాయి. జ్ఞాని సర్వత్ర వ్యాపించియున్న పరబ్రహ్మమే గుర్తించి, సమస్త ప్రాణులలో ఏకత్వము చూడగలుగుతాడు. విభజింపబడినట్లు కనిపించె వాటిని విభజింపబడని వానిగా చూడకలవాడు జ్ఞాని. అజ్ఞానికి సమస్తము నాశనము కాగలవిగా కనిపించే వానిలో, నాశన రహితమైన పరమాత్మ కనపడదు. అది చూడగలిగినవాడు జ్ఞాని మాత్రమే.

అట్టి జ్ఞానము సాత్వికము అని చెప్పబడుతుంది.

సాత్విక జ్ఞానములో ముఖ్యమైనమాట. సాత్త్విక జ్ఞానముతో జ్ఞాని విభజింపబడి వేరుగనున్న సమస్త ప్రాణులయందు ఒకటైన నాశరహితమగు ఆత్మ వస్తువును, విభజింపబడినట్లు వున్న వానిని విభజింపబడనిదానిగా చూచుచున్నాడు. అంటే తెలిసికొనతగిన పరమాత్మను తెలిసికొనగలుగుతున్నాడు అన్నమాట. అదే జ్ఞానము యొక్క ముఖ్య లక్షణము.

||శ్లోకము 21||
పృథక్త్వేనతు యజ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్|
వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసమ్ ||21||

స|| యత్ జ్ఞానం సర్వేషు భూతేషు పృథక్ విధాన్ నానాభావాన్ పృథక్త్వేనతు వేత్తి తత్ జ్ఞానం రాజసమ్ విద్ధి||21||

||శ్లోకార్థములు||
యత్ జ్ఞానం - యే జ్ఞానము ( వలన)
సర్వేషు భూతేషు - సమస్త ప్రాణులలో
పృథక్ విధాన్ నానాభావాన్ - వేరు వేరుగా వున్న జీవులను
పృథక్త్వేనతు వేత్తి - వేరు వేరు గా ఎరుంగుచున్నాడో
తత్ జ్ఞానం రాజసమ్ విద్ధి - ఆ జ్ఞానము రాజసికము అని తెలిసికొనుము.

||శ్లోకతాత్పర్యము||
"యే జ్ఞానము వలన సమస్త ప్రాణులలో వేరు వేరుగా వున్న జీవులను వేరు వేరు గా ఎరుంగుచున్నాడో
ఆ జ్ఞానము రాజసికము అని తెలిసికొనుము".||21||

సమత్వము చూడలేని జ్ఞానము, సమస్త భూతముల భిన్నత్వములో వున్న ఏకత్వము గ్రహించలేని జ్ఞానము, అది రాజసిక జ్ఞానము. రాజసిక జ్ఞానము ఆత్మ స్వరూపము గాని, పరమాత్మ స్వరూపముగాని తెలిసికొనలేదు. అంటే రాజసిక జ్ఞానము కూడా తెసికొనతగిన పరమాత్మను తెలిసికొనలేదు. అంటే అది మోక్ష ప్రదాయకము కాదు.

||శ్లోకము 22||
యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యేసక్తమహైతుకమ్|
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ||22||

స|| యత్ తు ఏకస్మిన్ కార్యే కృత్స్నవత్ సక్తమ్ అహైతుకమ్ అతత్త్వార్థవత్ అల్పం చ తత్ జ్ఞానం తామసం ఉదాహృతమ్|| 22||

||శ్లోకార్థములు||
యత్ తు - ఏ జ్ఞానము వలన
ఏకస్మిన్ కార్యే కృత్స్నవత్ సక్తమ్ - ఒక పనియందు సమస్తము అదే నని వుండునో
అహైతుకమ్ - హేతువు లేకుండా
అతత్త్వార్థవత్ - దాని తత్త్వము తెసికొనకుండా
అల్పం చ - అల్ప మైనదానిని
తత్ జ్ఞానం తామసం ఉదాహృతమ్ -
అట్టి జ్ఞానము తామసిక జ్ఞానము అని చెప్పబడినది.

||శ్లోకతాత్పర్యము||
"ఏ జ్ఞానము వలన ఒక పనియందు, హేతువు లేకుండా, దాని తత్త్వము తెసికొనకుండా, అల్ప మైనదానిని
సమస్తము అదే అని వుండునో, అట్టి జ్ఞానము తామసిక జ్ఞానము అని చెప్పబడినది".||22||

పరమాత్ముడు అంటే రాతి విగ్రహమే అని, లేక ఆత్మ అంటే ఇదే శరీరము అని, అలాగే తము అనుకున్నదే నిజము అని భావించువారు తామసికులు. వాళ్ళ ఆలోచనలకు కారణము హేతువులు వుండవు. ఆ ఆలోచనకి నిజానికి సంబంధము కూడా వుండదు. అట్టిది తామసిక జ్ఞానము అనబడినది. తామసిక జ్ఞానము కూడా తెసికొనతగిన పరమాత్మను తెలిసికొనలేదు. అంటే అది మోక్ష ప్రదాయకము కాదు.

||శ్లోకము 23||
నియతం సఙ్గరహితమ్ అరాగద్వేషతః కృతమ్|
అఫలప్రేప్సునా కర్మయత్ తత్ సాత్త్వికముచ్యతే ||23||

స|| నియతమ్ యత్ కర్మ అఫలప్రేప్సునా సఙ్గరహితమ్ అరాగద్వేషతః కృతమ్ తత్ సాత్వికమ్ కర్మ ఇతి ఉచ్యతే||23||

||శ్లోకార్థములు||
నియతమ్ యత్ కర్మ - శాస్త్రములో చెప్పబడిన ఏ కర్మ కలదో
అఫలప్రేప్సునా - ఫలాపేక్షలేనివాని చేత
సఙ్గరహితమ్ - తనదే అనే భావము లేకుండా
అరాగద్వేషతః కృతమ్ - రాగద్వేషములు లేకుండా చేయబడినదో
తత్ సాత్వికమ్ కర్మ ఇతి ఉచ్యతే -
అట్టి కర్మ సాత్వికము అని చెప్పబడుచున్నది.

||శ్లోకతాత్పర్యము||
"శాస్త్రములో చెప్పబడిన కర్మ, ఫలాపేక్షలేనివాని చేత తనదే అనే భావము లేకుండా, రాగద్వేషములు లేకుండా చేయబడినదో, అట్టి కర్మ సాత్వికము అని చెప్పబడుచున్నది".||23||

చేయవలసిన కర్మ, చేయతగిన కర్మ ఫలాపేక్షలేకుండా, రాగ ద్వేషములు లేకుండా , తనే కర్త , తనదే ఈ కర్మ అనేభావము లేకుండా చేసిన కర్మ సాత్విక కర్మ అనబడును. సాత్త్విక కర్మ వలన లభించేది సాత్త్విక త్యాగము (18.09)

||శ్లోకము 24||
యత్తుకామేప్సునా కర్మ సాహఙ్కారేణ వా పునః|
క్రియతే బహుళాయాసం తత్ రాజసముదాహృతమ్ ||24||

స|| కామేప్సునా పునః సాహంకారేణ వా బహుళాయాసం యత్ కర్మ తు క్రియతే తత్ కర్మ రాజసమ్ ఉదాహృతమ్||24||

||శ్లోకార్థములు||
కామేప్సునా - ఫలాపేక్షగలవాని చేత
పునః సాహంకారేణ వా - మరియు అహంకారము గలవాని చేతయు
బహుళాయాసం - అధిక శ్రమతో
యత్ కర్మ తు క్రియతే - యే కర్మ చేయబడినదో
తత్ కర్మ రాజసమ్ ఉదాహృతమ్ -
ఆ కర్మ రాజసమని చెప్పబడుచున్నది.

||శ్లోకతాత్పర్యము||
"ఫలాపేక్షగలవాని చేత, మరియు అహంకారము గలవాని చేతయు, అధిక శ్రమతో యే కర్మ చేయబడినదో,
ఆ కర్మ రాజసమని చెప్పబడుచున్నది".||24||

ఫలాపేక్షతో, అహంకారముతో చేయబడిన కర్మ వలన బంధనివృత్తి కాదు. కర్మ చేయడానికి ప్రయాస పడవచ్చు. చివరికి మిగిలేది ఆ శ్రమయే.

||శ్లోకము 25||
అనుబన్ధం క్షయం హింసా మనపేక్ష్య చ పౌరుషమ్|
మోహాదారభ్యతే కర్మ యత్ తత్ తామసముచ్యతే ||25||

స|| అనుబన్ధమ్ క్షయమ్ హింసాం పౌరుషం అనపేక్ష్య మోహాత్ యత్ కర్మ ఆరభ్యతే
తత్ తామసం ఉచ్యతే||25||

||శ్లోకార్థములు||
యత్ కర్మ మోహాత్ - ఏ కర్మ అజ్ఞానముతో
అనుబన్ధమ్ క్షయమ్ - ముందు కలుగు బోవు దుఃఖాదులను, నాశనమును
హింసాం పౌరుషం అనపేక్ష్య - బాధలను, సామర్థ్యము అలోచించక
ఆరభ్యతే - ఆరంభించునో
తత్ తామసం ఉచ్యతే - అట్టి కర్మ తామసమని చెప్పబడుచున్నది.

||శ్లోకతాత్పర్యము||
"ఏ కర్మ అజ్ఞానముతో ముందు కలుగు బోవు దుఃఖాదులను, నాశనమును, బాధలను, సామర్థ్యము అలోచించక
ఆరంభించునో అట్టి కర్మ తామసమని చెప్పబడుచున్నది."||25||

ఇతరులకి కలుగు తాపములు ఆలోచించకుండా అవివేకముతో గ్రుడ్డిగా కర్మలు చేయడము, తామసికము.

||శ్లోకము 26||
ముక్తసఙ్గోఽనహం వాదీ ధృత్సాహసమన్వితః|
సిద్ధ్యసిద్ధ్యోర్నివికారః కర్తా సాత్త్విక ముచ్యతే ||26||

స|| ముక్త సఙ్గః అనహం వాదీ ధృతి ఉత్సాహ సమన్వితః సిద్ధ్యసిద్ధోః నిర్వికారః కర్తా సాత్వికః కర్తా ఇతి ఉచ్యతే||26||

||శ్లోకార్థములు||
ముక్త సఙ్గః - సంగము విడిచినవాడు
అనహం వాదీ - అహంకార భావములు లేనివాడు
ధృతి ఉత్సాహ సమన్వితః - ధైర్యము ఉత్సాహము తో కూడియున్నవాడు
సిద్ధ్యసిద్ధోః నిర్వికారః - సిద్ధించినా సిద్ధించకపోయినా వికారము చెందని వాడు
కర్తా సాత్వికః కర్తా ఇతి ఉచ్యతే - అట్టి కర్త సాత్త్విక కర్త అని చెప్పబడుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||
"సంగము విడిచినవాడు, అహంకార భావములు లేనివాడు, ధైర్యము ఉత్సాహము తో కూడియున్నవాడు
కార్యము సిద్ధించినా సిద్ధించకపోయినా వికారము చెందని వాడు, అగు కర్త సాత్త్విక కర్త అని చెప్పబడుచున్నాడు".||26||

సాత్త్విక కర్త యే సాత్త్విక త్యాగము నకు అర్హుడు అవుతాడు.

||శ్లోకము 27||
రాగీ కర్మ ఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకోఽశుచిః|
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ||27||

స|| రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధః హింసాత్మకః అశుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః కర్తా ఇతి పరికీర్తితః||27||

||శ్లోకార్థములు||
రాగీ కర్మఫలప్రేప్సుః - అనురాగము కలవాడు, కర్మఫలములను ఆశ్రయించువాడు,
లుబ్ధః హింసాత్మకః అశుచిః - లోభి , హింసాత్ముడు, శుచి సుభ్రము లేనివాడు
హర్షశోకాన్వితః - సిద్దించడము సిద్ధించకపోడము వలన సంతోషము దుఃఖములతో కూడియున్నవాడు
కర్తా రాజసః కర్తా ఇతి పరికీర్తితః -
అట్టి కర్త రాజస కర్త అని అనబడుచున్నాడు.

||శ్లోకతాత్పర్యము||
"అనురాగము కలవాడు, కర్మఫలములను ఆశ్రయించువాడు, లోభి, హింసాత్ముడు, శుచి సుభ్రము లేనివాడు
సిద్దించడము సిద్ధించకపోడము వలన సంతోషము దుఃఖములతో కూడియున్నవాడు
అట్టి కర్త, రాజస కర్త అని అనబడుచున్నాడు."||27||

బంధు ప్రీతి , ఫలాపేక్ష కలవాడు , ఆ కర్మల వలన సుఖ దుఃఖములను అనుభవించువాడు రాజసిక కర్త. సంసారములో చాలామందికి బంధు ప్రీతి ఉంటుంది. బంధుప్రీతితో చేయకూడని పనులు చేయరాదు. బంధుప్రీతి నిలపడానికి మాత్రమే చేసే కర్మలు రాజసిక కర్మలు. ఆ కర్త రాజసిక కర్త. రాజసిక కర్త త్యాగము రాజసిక త్యాగమే. బంధువులకు ఇతరులకు నిష్కామముతో చేసే సేవలు, కర్మలు సాత్విక కర్మలు. అవి బంధములు కలిగించవు. .

||శ్లోకము 28||
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః|
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ||28||

స|| అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠః నైష్కృతికః ఆలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస కర్తా ఇతి ఉచ్యతే||28||

||శ్లోకార్థములు||
అయుక్తః ప్రాకృతః స్తబ్ధః - నిగ్రహము లేనివాడు,పామరుడు, వినయము లేనివాడు
శఠః నైష్కృతికః ఆలసః - మోసగాడు, ఇతరుల కార్యము భంగపరచువాడు, సోమరి,
విషాదీ దీర్ఘసూత్రీ చ - ఎల్లప్పుడు దిగులుగా వుండువాడు,ప్రతి కార్యము అలసతతో చేయువాడు
కర్తా తామస కర్తా ఇతి ఉచ్యతే - అట్టి కర్త తామస కర్త అని చెప్పబడుచున్నాడు.

||శ్లోకతాత్పర్యము||
"నిగ్రహము లేనివాడు,పామరుడు, వినయము లేనివాడు, మోసగాడు, ఇతరుల కార్యము భంగపరచువాడు, సోమరి, ఎల్లప్పుడు దిగులుగా వుండువాడు,ప్రతి కార్యము అలసతతో చేయువాడు, అట్టి కర్త తామస కర్త అని చెప్పబడుచున్నాడు".||28||

తామసకర్త చేసే త్యాగము తామసిక త్యాగము.

||శ్లోకము 29||
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతః త్రివిధం శృణు|
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనఞ్జయ ||29||

స||హే ధనంజయ ! బుద్ధేః ధృతేః చ ఏవ భేదమ్ గుణతః త్రివిధమ్ పృథక్త్వేన అశేషేణ ( సంపూర్ణ స్వరూపేన) ప్రోచ్యమానమ్ శృణు||29||

||శ్లోకార్థములు||
బుద్ధేః ధృతేః చ ఏవ భేదమ్ - బుద్ధియొక్కయు, ధైర్యము యొక్కయు భేదములను
గుణతః త్రివిధమ్ - గుణముల బట్టి మూడువిధములుగా
పృథక్త్వేన అశేషేణ ప్రోచ్యమానమ్ - వేఱు వేఱుగా సంపూర్ణముగా చెప్పెదను.

||శ్లోకతాత్పర్యము||
"ఓ ధనంజయ, బుద్ధియొక్కయు, ధైర్యము యొక్కయు భేదములను గుణముల బట్టి మూడువిధములుగా వేఱు వేఱుగా సంపూర్ణముగా చెప్పెదను వినుము."||29||

గుణముల బట్టి అనడముతో బుద్ధి, అలాగే ధైర్యములలో సాత్విక , రాజసిక అలాగే తామసిక తారతమ్యాలు వున్నాయి అన్నమాట. అది కృష్ణుడు వివరిస్తున్నాడు.

||శ్లోకము 30||
ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే|
బన్ధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ||30||

స||హే పార్థ| యా బుద్ధేః ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యా కార్యే భయా భయే బంధమ్ మోక్షం చ వేత్తి సా బుద్ధి సాత్వికీ ||30||

||శ్లోకార్థములు||
యా బుద్ధేః ప్రవృత్తిం చ నివృత్తిం - యే బుద్ధి ప్రవృత్తిని నివృత్తిని
కార్యా కార్యే - చేయతగినది, చేయతగనిది
భయా భయే - భయమును, నిర్భయమును
బంధమ్ మోక్షం చ వేత్తి - బంధమును, మోక్షమును తెలుసికొనుచున్నదో
సా బుద్ధి సాత్వికీ - అ బుద్ధి సాత్వికమైన బుద్ధి.

||శ్లోకతాత్పర్యము||
"ఓ పార్థా, యే బుద్ధి ప్రవృత్తిని నివృత్తిని, అలాగే చేయతగినది చేయతగనిది, ఇంకా భయమును నిర్భయమును, బంధమును, మోక్షమును తెలుసికొనుచున్నదో, అ బుద్ధి సాత్వికమైన బుద్ధి".||30||

ప్రవృత్తి అంటే ధర్మమార్గములో పోగలగడము, నివృత్తి అంటే అధర్మ మార్గమునుంచి తిరుగుమార్గము పట్టకలగడము అని. చేయతగినది చేయతగనిది అంటే మంచి చెడ్డలను గ్రహించి, చెడ్డని వదలివేయగలి శక్తి వున్న బుద్ధి అన్నమాట. అట్టి బుద్ధి సాత్విక బుద్ధి. సంసారసాగరము భయంకరము అని గ్రహించగలగడము , దానికి ప్రత్యాయముగా అభయరూపమైన పరమాత్మని అశ్రయించగల శక్తి వున్న ఆ బుద్ధి సాత్విక బుద్ధి.
ఆ సాత్త్విక బుద్ధితో సాత్త్విక కర్త, సాత్త్విక కర్మ చేయకలుగుతాడు. తద్ద్వారా సాత్త్విక త్యాగ ఫలితము పొందుతాడు.

||శ్లోకము 31||
యయా ధర్మమధర్మం చ కార్యం చ అకార్యమేవ చ|
అయథావత్ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ||31||

స||హే పార్థ ! యయా ధర్మం అధర్మం చ కార్యం చ అకార్యమేవ చ అ యథావత్ ప్రజానాతి సాబుద్ధిః రాజసీ||31||

||శ్లోకార్థములు||
యయా ధర్మం అధర్మం చ - ఏ బుద్ధి చేత ధర్మము అధర్మము అలాగే
కార్యం చ అకార్యమేవ - చేయతగిన కార్యము చేయతగని కార్యము
అ యథావత్ ప్రజానాతి - ఉన్నది ఉన్నట్లుగా కాకుండా తెలిసికొనుచున్నాడో
సాబుద్ధిః రాజసీ - ఆ బుద్ధి రాజసిక బుద్ధి

||శ్లోకతాత్పర్యము||
"ఓ పార్థా, ఏ బుద్ధి చేత ధర్మము అధర్మము, అలాగే చేయతగిన కార్యము చేయతగని కార్యము,
ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మరో విధముగా తెలిసికొనుచున్నాడో ఆ బుద్ధి రాజసిక బుద్ధి".||31||

ధర్మము అధర్మము, చేయతగినది చేయతగనిది న్యాయరీత్యా విచారించకుండా తనకి తోచినవిధముగా తెలిసికొనువాని బుద్ధి రాజసిక బుద్ధి అని.

ఇక్కడ 'అయథావత్' అనే పదము ప్రయోగించబడినది. 'అయథావత్' అంటే ఉన్నదిఉన్నట్లుగా కాకుండా అని. అంటే ధర్మము ధర్మము లాగా అధర్మము అధర్మము లాగా కాక అని. ఆ నిర్ణయము పొరపాటుగా చేయవచ్చు లేక తనే రాజు( తెలిసినవాడు) అనే ధీమా తో చేయవచ్చు. ఏలా చేసినా అది వర్జనీయము. శంకరాచార్యులవారు దీనిని పూర్తిగా పరిశీలకుంచకుండా చేసిన నిర్ణయము అంటారు. అది రాజసికము.

||శ్లోకము 32||
అధర్మం ధర్మమితి యా మన్యతే తమసాఽఽవృతా|
సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ||32||

స|| హే పార్థ ! యా బుద్ధి తమసా ఆవృతా అధర్మం ధర్మం ఇతి సర్వార్థాన్ విపరీతాన్ చ మన్యతే సా బుద్ధిః తామసీ ||32||

||శ్లోకార్థములు||
యా బుద్ధి తమసా ఆవృతా - ఏ బుద్ధి అజ్ఞానము చే ఆవరించబడినదై
అధర్మం ధర్మం ఇతి - అధర్మమును ధర్మము గా
సర్వార్థాన్ విపరీతాన్ చ మన్యతే - సమస్త విషయములను విరుద్ధముగా తెలిసికొనునో
సా బుద్ధిః తామసీ - ఆ బుద్ధి తామసిక బుద్ధి

||శ్లోకతాత్పర్యము||
"ఓ పార్థా, ఏ బుద్ధి అజ్ఞానము చే ఆవరించబడినదై, అధర్మమును ధర్మము గనూ,
సమస్త విషయములను విరుద్ధముగా తెలిసికొనునో ఆ బుద్ధి తామసిక బుద్ధి అని తెలిసికొనుము." ||32||

తామసిక బుద్ధి తామసిక కర్మలకు దారి తీస్తుంది.

||శ్లోకము 33||
ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేన్ద్రియక్రియాః|
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ||33||

స|| హే పార్థ! అవ్యభిచారిణ్యా యయా ధృత్యా (యుక్తః) మనః ప్రాణేన్ద్రియ క్రియాః యోగేనధారయతే సాధృతిః సాత్వికీ ధృతిః||33||

||శ్లోకార్థములు||
అవ్యభిచారిణ్యా యయా ధృత్యా - చలించని ఏ ధైర్యముతో కూడినవాడై
మనః ప్రాణేన్ద్రియ క్రియాః - మనస్సు యొక్క ప్రాణులయొక్క, ఇన్ద్రియములయొక్క క్రియలను
యోగేన ధారయతే - యోగసాధనచేత ధరించుచున్నాడో
సాధృతిః సాత్వికీ ధృతిః - ఆ ధైర్యము సాత్త్విక ధైర్యము.

||శ్లోకతాత్పర్యము||
"ఓ పార్థా, చలించని ఏ ధైర్యముతో కూడినవాడై, మనస్సు యొక్క ప్రాణులయొక్క, ఇన్ద్రియములయొక్క క్రియలను, యోగసాధనచేత ధరించుచున్నాడో ఆ ధైర్యము సాత్త్విక ధైర్యము".||33||

"యోగేన" అంటే యోగ సాధనతో, లేక చిత్తైకాగ్రతో అని. అంటే తన మనస్సు ఏకాగ్రతలో ఉంచి చేసిన పని. ఇక్కడ మనస్సుని ఇంద్రియములను తన మనస్సుతో అధీనములో ఉంచుకొనిన వాని ధైర్యము గురించి చెప్పబడుతోంది. అట్టి ధైర్యము సాత్త్విక ధైర్యము. గాంధీ గారి సత్యాగ్రహములో, సత్యాగ్రాహులు చేయి ఎత్తకుండా నిలబడగల ధైర్యము ఉపరి స్థానమున ఉన్న ధైర్యము. అదే సాత్విక ధైర్యము.

||శ్లోకము 34||
యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేఽర్జున|
ప్రసఙ్గేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ ||34||

స|| హే పార్థ యయా ధృత్యా తు ఫలాకాంక్షీ ధర్మ కామార్థాన్ ప్రసఙ్గేన ధారయతే సా ధృతిః (విద్ధి) రాజసీ||34||

||శ్లోకార్థములు||
యయా ధృత్యా తు ఫలాకాంక్షీ - యే ధైర్యముతో ఫలాపేక్ష గలవాడై
ధర్మ కామార్థాన్ - ధర్మార్థకామములను
ప్రసఙ్గేన ధారయతే - అతి ఆసక్తితో అనుష్ఠించుచున్నాడో
సా ధృతిః (విద్ధి) రాజసీ - అట్టి వాడి ధైర్యము రాజసికము అని తెలిసికొనుము.

||శ్లోకతాత్పర్యము||
"ఓ పార్థా, యే ధైర్యముతో ఫలాపేక్ష గలవాడై, ధర్మార్థకామములను అతి ఆసక్తితో అనుష్ఠించుచున్నాడో
అట్టి వాడి ధైర్యము రాజసికము అని తెలిసికొనుము". ||34||

సంసార సాగరములో సామాన్య గృహస్థుడు చతుర్విధ పురుషార్థములు, అంటే ధర్మార్థ కామ మోక్షముల కోసము ప్రయత్నము చేయకుండా, ధర్మ అర్థ కామముల సంపాదనలోనే తన ప్రయత్నము వుంచును. అట్టి వారు మోక్ష కాంక్ష లేని వారు. అట్టి వారు అతి ఆసక్తితో ధర్మార్థ కామములను అనుష్థించుచున్నచో అట్టివారి ధైర్యము రాజసికము అని చెప్పబడినది.

||శ్లోకము 35||
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ|
న విముఞ్చతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ ||35||

స|| హే పార్థ యయా దుర్మేధాః స్వప్నం భయమ్ శోకమ్ విషాదమ్ మదం ఏవ చ న విముఞ్చతి సాధృతిః (విద్ధి ) తామసీ||35||

||శ్లోకార్థములు||
యయా దుర్మేధాః - యే బుద్ధి చేత దుర్బుద్ధి కలవాడు
స్వప్నం భయమ్ శోకమ్ - స్వప్నము భయము శోకము
విషాదమ్ మదం ఏవ చ - విషాదము అలాగే మదమును
న విముఞ్చతి - విడువక యుండునో
సాధృతిః (విద్ధి ) తామసీ - అట్టివాని ధైర్యము తామసిక ధైర్యము

||శ్లోకతాత్పర్యము||
" ఓ పార్థ, యే బుద్ధి చేత దుర్బుద్ధి కలవాడు, స్వప్నము, భయము, శోకము, విషాదము అలాగే మదమును
విడువక యుండునో, అట్టివాని ధైర్యము తామసిక ధైర్యము." ||35||

ధైర్యము సుగుణమే. ఆ ధైర్యము మంచి కర్మల అనుష్ఠానములో ఉపయోగించిన ఆది సాత్విక ధైర్యము. అత్యుత్తమ ధైర్యము. కాని అదే ధైర్యము మొండిగా ఆజ్ఞానమార్గములలో ఉపయోగించినచో అది నిష్ఫలము అగును. అదే తామసిక ధైర్యము కూడా.

||శ్లోకము 36||
సుఖం త్విదానీం త్రివిధం శృణుమే భరతర్షభ|
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి ||36||

స|| హే భరతర్షభ ! యత్ర అభ్యాసాత్ రమతే దుఃఖాన్తం చ నిగచ్ఛతి సుఖమ్ తు ఇదానీమ్ త్రివిధమ్ మే వచనాత్ శృణు||36||

||శ్లోకార్థములు||
యత్ర అభ్యాసాత్ రమతే - దేనియందు అభ్యాసముచే రమించుచున్నాడో
దుఃఖాన్తం చ నిగచ్ఛతి - దుఃఖనాశనము కూడా పొందుచున్నాడో
సుఖమ్ తు - ఆ సుఖము
ఇదానీమ్ త్రివిధమ్ - ఇప్పుడు మూడు విధములుగా
మే వచనాత్ శృణు - నావచనముల ద్వారా వినుము

||శ్లోకతాత్పర్యము||
"ఓ భరతవంశములో శ్రేష్ఠుడా, అర్జునా, దేనియందు అభ్యాసముచే రమించుచున్నాడో, దుఃఖనాశనము కూడా పొందుచున్నాడో, ఆ సుఖము గురించి మూడు విధములుగా నా వచనముల ద్వారా వినుము".||36||

సుఖము కూడా గుణభేదములతో మూడు విధములుగా వివరింపబడుతోంది.

||శ్లోకము 37||
యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్|
తత్ సుఖం సాత్త్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజమ్ ||37||

స|| యత్ తత్ అగ్రే విషమివ పరిణామే అమృతోపమమ్ ఆత్మబుద్ధి ప్రసాదజమ్ తత్ సుఖం సాత్త్వికంప్రోక్తమ్||37||

||శ్లోకార్థములు||
యత్ తత్ అగ్రే విషమివ - ఏ సుఖము ముందు విషము వలె
పరిణామే అమృతోపమమ్ - చివరిలో అమృతము వలె నుండునో
ఆత్మబుద్ధి ప్రసాదజమ్ - తన బుద్ధి యొక్క నిర్మలత్వముతో కలిగిన
తత్ సుఖం సాత్త్వికంప్రోక్తమ్ - ఆ సుఖము సాత్వికము అని చెప్పబడినది.

||శ్లోకతాత్పర్యము||
"ఏ సుఖము ముందు విషము వలె చివరిలో అమృతము వలె నుండునో,
తన బుద్ధి యొక్క నిర్మలత్వముతో కలిగిన ఆ సుఖము సాత్వికము అని చెప్పబడినది".||37||

అధ్యాత్మిక చింతన , ఆధ్యాత్మిక విచారణ ప్రప్రథమములో చాలా కష్ఠముగా వున్నట్లు అనిపిస్తుంది. తరువాత తరువాత అదే అమృత తుల్యముగా వుంటుంది. ఇది ప్రతిరంగములోను నిజము. ముందు కనపడే కష్ఠములను అధిగమించి, ముందుకు పోయినవాని సుఖము నిజముగనే అమృత తుల్యము. అధ్యాత్మిక చింతన యే కాక, విద్యా రంగములో, క్రీడారంగములో కూడా ఇది నిజమే. అట్టి సుఖము సాత్విక సుఖము.

||శ్లోకము 38||
విషయేన్ద్రియ సంయోగాత్ యత్త దగ్రేఽమృతోపమమ్|
పరిణామే విషమివ తత్ సుఖం రాజసం స్మృతం ||38||

స|| యత్ తత్ విషయేన్ద్రియ సంయోగాత్ అగ్రే అమృతోపమమ్ పరిణామే విషమ్ ఇవ భవతి తత్ సుఖమ్ రాజసమ్ స్మృతమ్||38||

||శ్లోకార్థములు||
యత్ తత్ విషయేన్ద్రియ సంయోగాత్ - ఏ సుఖము ఇన్ద్రియములు విషయముల సంయోగము వలన
అగ్రే అమృతోపమమ్ పరిణామే విషమ్ - ముందు అమృతము వలెను చివరిలో విషము వలెను వుండునో
తత్ సుఖమ్ రాజసమ్ స్మృతమ్ - అట్టి సుఖము రాజసిక మనబడినది

||శ్లోకతాత్పర్యము||
"ఏ సుఖము ఇన్ద్రియములు విషయముల సంయోగము వలన, ముందు అమృతము వలెను చివరిలో విషము వలెను వుండునో, అట్టి సుఖము రాజసిక మనబడినది."||38||

విషయ సుఖములు తాత్కాలికము. ఒక విజయముపై ఆకాశానికి ఎగిరిన ఆనందము అదే జయము అపజయముగా మారినపుడు దుఃఖభరితము అవుతుంది. విషయ సుఖములు అమృతములాంటిది. ఆ అమృతములో విష బీజములు వుంటాయి. వాటిని నాశనము చేయనిచో చివరిలో ఆ సుఖము విషముగామారును. ఆ విష బీజములను నాశనము చేయడానికి విషయ సుఖములవలన జనించిన అమృతమును త్యజించవలెను.

||శ్లోకము 39||
యదగ్రే చానుబన్దే చ సుఖం మోహనమాత్మనః|
నిద్రాలస్య ప్రమాదోత్థం తత్ తామసముదాహృతమ్ ||39||

స|| నిద్ర ఆలస్య పరామాదోత్థమ్ యత్ సుఖమ్ అగ్రేచ అనుబన్ధే చ ఆత్మనః మోహనమ్ ( కరోతి) తత్ తామసమ్ ఉదాహృతమ్||39||

||శ్లోకార్థములు||
నిద్ర ఆలస్య పరామాదోత్థమ్ - నిద్ర సోమరితనము,ప్రమత్తత అనువానివలన పుట్టినదై
యత్ సుఖమ్ అగ్రేచ అనుబన్ధే చ - ఏ సుఖము ఆరంభమందు చివరిలోను
ఆత్మనః మోహనమ్ - తనకు మోహము కలిగించునో
తత్ తామసమ్ ఉదాహృతమ్ - అట్టి సుఖము తామసమై చెప్పబడుచున్నది.

||శ్లోకతాత్పర్యము||
"నిద్ర సోమరితనము,ప్రమత్తత అనువానివలన పుట్టినదై, ఏ సుఖము ఆరంభమందు చివరిలోను,
తనకు మోహము కలిగించునో, అట్టి సుఖము తామసమై చెప్పబడుచున్నది."||39||

తామస సుఖము ఆరంభమున, మధ్యమునను, అంతమునందు కూడా మోహము కలుగ చేయునది. తామస సుఖము లో మునిగియున్నవాడు తామసకర్మలతో తామసకర్తగా విరాజిల్లుచూ తామస త్యాగి అగును. అంటే మోక్షమార్గమునకు అతి దూరములో వుండును.

||శ్లోకము 40||
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వాపునః|
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్స్యాత్రిభిర్గుణైః ||40||

స|| ప్రకృతిజైః ఏభిః త్రిభిః గుణైః ముక్తమ్ సత్త్వమ్ యత్ స్యాత్ తత పృథివ్యాం వా పునః దివి దేవేషు న అస్తి|| 40||

||శ్లోకార్థములు||
ప్రకృతిజైః ఏభిః త్రిభిః గుణైః ముక్తమ్ -
ప్రకృతిలో ఈ మూడు గుణములచేత విడువబడినది
సత్త్వమ్ యత్ స్యాత్ తత్ - వస్తువు ఏది కలదో అది
పృథివ్యాం వా పునః దివి దేవేషు న అస్తి -
భూలోకమందుగాని మళ్ళీ స్వర్గమున కాని, దేవతలయందు కాని లేదు.

||శ్లోకతాత్పర్యము||
"ప్రకృతిలో ఈ మూడు గుణములచేత విడువబడిన వస్తువు ఏది కలదో అది భూలోకమందుగాని మళ్ళీ స్వర్గమున కాని, దేవతల యందు కాని లేదు."||40||

త్యాగము తో మొదలుపెట్టి , జ్ఞానము, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, సుఖములను గుణభేదములతో విభజింపబడినవి. గుణములు వీటినే కాక అనేక వస్తువులను ఆవరించి భేదముల తో విభజించుతాయి. గుణములచే విడువబడిన వస్తువు లేదు అని ఇక్కడ చెప్పడమైనది.

||శ్లోకము 41||
బ్రాహ్మణ క్షత్రియవిశాం శూద్రాణాం చ పరన్తప|
కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః ||41||

స|| హే పరన్తప! బ్రాహ్మణ క్షత్రియ శూద్రాణాం చ కర్మాణి స్వభావప్రభవైః గుణైః ప్రవిభక్తాని||

||శ్లోకార్థములు||
బ్రాహ్మణ క్షత్రియ శూద్రాణాం చ - బ్రాహ్మణ క్షత్రియ శూద్రులు
కర్మాణి - ( వారి) కర్మలు
స్వభావప్రభవైః గుణైః ప్రవిభక్తాని -
వారి వారి స్వభావము వలన పుట్టిన గుణముల బట్టి విభజింపబడినవి

||శ్లోకతాత్పర్యము||
'ఓ పరంతప, బ్రాహ్మణ క్షత్రియ శూద్రుల కర్మలు, వారి వారి స్వభావము వలన పుట్టిన గుణముల బట్టి విభజింపబడినవి".||41||

బ్రాహ్మణ క్షత్రియ శూద్రులకు వారి వారి స్వభావములను అనుసరించి వారి కర్మలు విభజింపబడినవి. ఇక్కడ వారి పుట్టుకతో సంబంధము లేదు. స్వభావము మార్చుకోగల మనుజుడు తన కర్మలు గూడా మర్చుకొనును.

||శ్లోకము 42||
శమో దమః తపః శౌచం క్షాన్తిరార్జవమేవ చ |
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజమ్ ||42||

స|| శమః దమః తపః శౌచమ్ క్షాన్తిః ఆర్జవమ్ ఏవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం స్వభావజమ్ బ్రాహ్మం కర్మ ||42||

||శ్లోకార్థములు||
శమః దమః తపః - మనోనిగ్రహము, బాహ్యేన్ద్రియనిగ్రహము, తపము
శౌచమ్ క్షాన్తిః ఆర్జవమ్ ఏవ చ - శుచిత్వము, ఓర్పు, కపటము లేకుండుట అలాగే
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం - శాస్త్రీయ జ్ఞానము, అనుభవ జ్ఞానము
స్వభావజమ్ బ్రాహ్మం కర్మ - స్వభావము వలన పుట్టిన బ్రాహ్మణ కర్మ అయివున్నది.

||శ్లోకతాత్పర్యము||
"మనోనిగ్రహము, బాహ్యేన్ద్రియనిగ్రహము, తపము, శుచిత్వము, ఓర్పు, కపటము లేకుండుట అలాగే శాస్త్రీయ జ్ఞానము, అనుభవ జ్ఞానము
స్వభావము వలన పుట్టిన బ్రాహ్మణ కర్మ అయివున్నది".||42||

||శ్లోకము 43||
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధేచాప్య పలాయనమ్|
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ||43||

స|| శౌర్యం తేజః ధృతిః దాక్ష్యమ్ యుద్ధే అపలాయనమ్ అపి చ దానం ఈశ్వరభావః చ స్వభావజమ్ క్షాత్ర కర్మ||43||

||శ్లోకార్థములు||
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం - శౌర్యము, తేజస్సు, ధైర్యము, సామర్థ్యము
యుద్ధే అపలాయనమ్ అపి చ - యుద్ధమునందు పారిపోకుండుట అలాగే
దానం ఈశ్వరభావః చ - దానము ధర్మ పూర్వక పరిపాలనాశక్తి
స్వభావజమ్ క్షాత్ర కర్మ - స్వభావము వలన పుట్టిన క్షత్రియ కర్మ అయివున్నది.

||శ్లోకతాత్పర్యము||
"శౌర్యము, తేజస్సు, ధైర్యము, సామర్థ్యము, యుద్ధమునందు పారిపోకుండుట అలాగే దానము ధర్మ పూర్వక పరిపాలనాశక్తి, స్వభావము వలన పుట్టిన క్షత్రియ కర్మ అయివున్నది". ||43||

||శ్లోకము 44||
కృషి గోరక్షవాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజమ్|
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ||44||

స|| కృషి గోరక్ష వాణిజ్యం స్వభావజమ్ వైశ్య కర్మ ( భవతి)| అపి పరిచర్యాత్మకం కర్మ శూద్రస్య స్వభావజమ్ ||44||

||శ్లోకార్థములు||
కృషి గోరక్షవాణిజ్యం - వ్యవసాయము, గోసంరక్షణము, వాణిజ్యము
స్వభావజమ్ వైశ్య కర్మ - స్వభావము వలన పుట్టిన వైశ్య కర్మ
అపి పరిచర్యాత్మకం - సేవారూపమైన కర్మ శూద్రునకు స్వభావసిద్ధమైనది.

||శ్లోకతాత్పర్యము||
"వ్యవసాయము, గోసంరక్షణము, వాణిజ్యము స్వభావము వలన పుట్టిన వైశ్య కర్మ.
సేవారూపమైన కర్మ శూద్రునకు స్వభావసిద్ధమైనది."||44||

||శ్లోకము 45||
స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః|
స్వకర్మ నిరతః సిద్ధిం యథా విన్దతి తత్ శృణు ||45||

స|| స్వే స్వే కర్మణి అభిరతః నరః సంసిద్ధిం లభతే స్వకర్మనిరతః యథా సిద్ధిం విన్దతి తత్ శృణు||45||

||శ్లోకార్థములు||
స్వే స్వే కర్మణి అభిరతః నరః - తమ తమ స్వభావములపై ఆసక్తి కల నరుడు
సంసిద్ధిం లభతే స్వకర్మనిరతః - తనయొక్క కర్మమీద ఆసక్తితోనే సిద్ధిని పొందుతున్నాడు
యథా సిద్ధిం విన్దతి తత్ శృణు - ఏ విధముగా సిద్ధిని పొందగలడో అది వినుము.

||శ్లోకతాత్పర్యము||
"తమ తమ స్వభావములపై ఆసక్తి కల నరుడు తనయొక్క కర్మమీద ఆసక్తితోనే సిద్ధిని పొందుతున్నాడు. ఏ విధముగా సిద్ధిని పొందగలడో అది వినుము".||45||

ఏ జాతి వర్ణానికి సంబంధించినవాడైనా, తమతమ స్వభావములను అనుసరించి సిద్ధి పొందగలడు. అంటే బ్రాహ్మణుడు తన వేదాధ్యయన జ్ఞానముతో మోక్షము పొందగలుగుచున్నాడు అనే భ్రమతో, వైశ్యులు శూద్రులు మోక్షమునకు వేదాధ్యయనము చేసి జ్ఞానమార్గములో పోనక్కరలేదు. తమ కార్యక్రమములోనే భగవదర్పితము చేసి చేయబడిన కర్మలతో మోక్షము పొందగలరు అన్నమాట. ఏ విధముగా సిద్ధి పొందగలరు అన్నమాట కృష్ణుడు ముందు శ్లోకములో చెపుతాడు.

||శ్లోకము 46||
యతః ప్రవృతిర్భూతానాం యేన సర్వమిదం తతమ్|
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః ||46||

స|| యతః భూతానాం ప్రవృత్తిః యేన ఇదమ్ సర్వం తతమ్ తం మానవః స్వకర్మణా అభ్యర్చ్య సిద్ధిం విన్దతి||46||

||శ్లోకార్థములు||
యతః భూతానాం ప్రవృత్తిః - ఎవనివల భూతములకు ప్రవృత్తి కలుగుచున్నదో
యేన ఇదమ్ సర్వం తతమ్ - ఎవని చేత ఈ జగమంతయు వ్యాపించియున్నదో
తం మానవః స్వకర్మణా అభ్యర్చ్య - అట్టివానిని మానవుడు తనకర్మముచే ఆరాధించి
సిద్ధిం విన్దతి - సిద్ధిని పొందుతున్నాడు.

||శ్లోకతాత్పర్యము||
"ఎవనివల భూతములకు ప్రవృత్తి కలుగుచున్నదో, ఎవని చేత ఈ జగమంతయు వ్యాపించియున్నదో , అట్టివానిని మానవుడు తనకర్మముచే ఆరాధించి సిద్ధిని పొందుతున్నాడు". ||46||

మానవుడు ఎలా సిద్ధి పొందుతాడో చెపుతాను వినుము అంటూ , కృష్ణుడు ఒక ముఖ్యమైన మాట చెప్పాడు. ఏమిటి అది? "ఎవనివల భూతములకు ప్రవృత్తి కలుగుచున్నదో, ఎవని చేత ఈ జగమంతయు వ్యాపించియున్నదో , అట్టివానిని, మానవుడు తనకర్మముచే ఆరాధించి సిద్ధిని పొందుతున్నాడు" అని. ఈ మాట వినిన వెంటనే మనకి ఒక పోతన భాగవతములో ఒక పద్యము స్పురించుతుంది.

"ఎవ్వనే చే జనించు జగమెవ్వని లోపలయుండు;
ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు
మూలకారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు
వాని నాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్."

ఇది చిన్నప్పుడు వినిన గజేంద్రుని ఆర్తి. దాని తరువాత జరిగింది మనకు తెలుసు. గజేంద్రుడికి మోక్షము లభిస్తుంది. కృష్ణుడు చెపుతున్నమాట అదే. ఏ వర్ణానికి చెందినా, ఏ జాతికి చెందినా, ఏ అంతస్తుకి చెందినా, ఆ భగవంతునే నిష్కామము గా ప్రార్థిస్తే మోక్షము ఖాయమే .

||శ్లోకము 47||
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్|
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ||47||

స|| స్వధర్మః విగుణః అపి అనుష్ఠితాత్ పరధర్మాత్ శ్రేయాన్ | స్వభావ నియతమ్ కర్మ కుర్వన్ కిల్బిషమ్( పాపమ్) న ఆప్నోతి||47||

||శ్లోకార్థములు||
స్వధర్మః విగుణః అపి - తన యొక్క ధర్మము గుణము లేనిదిగా కనపడిననూ
అనుష్ఠితాత్ పరధర్మాత్ శ్రేయాన్ - అనుష్ఠింపబడిన పరధర్మము కన్ననూ శ్రేయము.
స్వభావ నియతమ్ కర్మ కుర్వన్ - తన స్వభావముచే ఏర్పడిన కర్మ చేయుచూ
కిల్బిషమ్( పాపమ్) న ఆప్నోతి - పాపము పొందడు.

||శ్లోకతాత్పర్యము||
"తన యొక్క ధర్మము గుణము లేనిదిగా కనపడిననూ, అనుష్ఠింపబడిన పరధర్మము కన్ననూ శ్రేయము.
తన స్వభావముచే ఏర్పడిన కర్మ చేయుచూ పాపము పొందడు."||47||

మోక్షముకోసము తన ధర్మము మార్చుకొనవలసిన అవసరము లేదు అని ముఖ్యమైన భావము. "తమ గుణము గుణము లేనిదిగా కనపడిననూ" అనడములో, ఇది వైశ్య శూద్రులను ఉద్దేశించి చెప్పబడిన మాట. వైశ్యుడు వర్తకము చేయుటలోనూ, శూద్రుడు సేవ చేయటము లోను తమ ధర్మము ఆధ్యాత్మిక గుణము లేనిదిగా భ్రమపడవచ్చు. ఆ భ్రమతో వేదాధ్యయనము మొదలెట్టవచ్చు. కృష్ణుడి సందేశము, "నీ ధర్మములో అనుష్టింపబడిన కర్మ, పరధర్మము కన్ననూ శ్రేయము" అని; ధర్మార్థకామ ఆర్జనలో, తమ స్వధర్మము చాలదు అని ఇతరుల ధర్మము నేర్చుకొని పాటించవచ్చు. కాని మోక్షానికి సంబంధించినవరకు స్వధర్మమే శ్రేయము. మానవుని ముఖ్యధ్యేయము మోక్షము. మోక్షమే ముఖ్యము అనుకున్నప్పుడు తమ స్వధర్మము గురించి చింత అవసరము లేదు. మోక్షము ముఖ్యముకాదు అనుకునేవారు చార్వాకులు. వారి గురించి ఆలోచన మనకు తగదు.

||శ్లోకము 48||
సహజం కర్మ కౌన్తేయ సదోషమపి న త్యజేత్|
సర్వారమ్భహి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ||48||

స|| కౌన్తేయ ! సహజమ్ కర్మ సదోషమపి న త్యజేత్ | ధూమేన అగ్నిః ఇవ ||48||

||శ్లోకార్థములు||
సహజమ్ కర్మ - స్వభావసిద్ధమైన కర్మ
సదోషమపి న త్యజేత్ - దోషయుక్తమైననూ త్యజింపబడరాదు.
ధూమేన అగ్నిః ఇవ - పొగతో అగ్ని లాగా
సర్వారమ్భాః దోషేణ ఆవృతాః హి - ఆరంభింపబడినవన్నీ దోషముతో కప్ప బడియున్నవి

||శ్లోకతాత్పర్యము||
"ఓ కౌన్తేయ, స్వభావసిద్ధమైన కర్మ దోషయుక్తమైననూ త్యజింపబడరాదు.
ఆరంభింపబడినవన్నీ, పొగతో అగ్ని లాగా, దోషముతో కప్ప బడియున్నవి".||48||

||శ్లోకము 49||
అసక్తి బుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః|
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధి గచ్ఛతి ||49||

స|| సర్వత్ర అసక్త బుద్ధిః జితాత్మ విగతస్పృహః సన్న్యాసేన పరమామ్ నైష్కర్మ్య సిద్ధిం అధిగచ్ఛతి||49||

||శ్లోకార్థములు||
సర్వత్ర అసక్త బుద్ధిః - సమస్త విషయములందు తగులుకొనని బుద్ధి కలవాడు
జితాత్మ విగతస్పృహః - మనస్సు జయించినవాడు ఆశలు లేనివాడు,
సన్న్యాసేన పరమామ్ నైష్కర్మ్య సిద్ధిం -
సన్న్యాసముతో సర్వోత్తమమైన ఆత్మస్థ్తిని పొందుచున్నాడు.

||శ్లోకతాత్పర్యము||
"సమస్త విషయములందు తగులుకొనని బుద్ధి కలవాడు, మనస్సు జయించినవాడు, ఆశలు లేనివాడు,
సన్న్యాసముతో సర్వోత్తమమైన ఆత్మస్థితిని పొందుచున్నాడు".||49||

||శ్లోకము 50||
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాఽఽప్నోతి నిబోధమే|
సమాసేనైవ కౌన్తేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా || 50||

స|| హే కౌన్తేయ! సిద్ధిం ప్రాప్తః యథా బ్రహ్మమాప్నోతి తథా జ్ఞానస్య పరా నిష్ఠాయా యద్ అస్తి తత్ సమాసేన ఏవ మే నిబోధ||50||

||శ్లోకార్థములు||
సిద్ధిం ప్రాప్తః - సిద్ధిని పొందినవాడు
యథా బ్రహ్మమాప్నోతి తథా - ఏ విధముగా బ్రహ్మము పోందుచున్నాడో ఆ మార్గమును,
జ్ఞానస్య పరా నిష్ఠాయా యద్ అస్తి - జ్ఞానముయొక్క పరాకాష్ఠఏది వున్నదో అది
తత్ సమాసేన ఏవ మే నిబోధ - అది సంక్షేపముగా తెలిసికొనుము.

||శ్లోకతాత్పర్యము||
"సిద్ధిని పొందినవాడు ఏ విధముగా బ్రహ్మము పోందుచున్నాడో ఆ మార్గమును, జ్ఞానముయొక్క పరాకాష్ఠ ఏది వున్నదో అది, సంక్షేపముగా తెలిసికొనుము".||50||

సిద్ధి పొందినవాడు - అంటే పరమాత్మను ధర్మమును అనుసరించి ఉపాసనచేసి, 'యథా బ్రహం ఆప్నోతి తథా", అంటే ఏ విధముగా బ్రహ్మమును పొందుచున్నాడో ఆ విధమును, అలాగే జ్ఞానము యొక్క పరాకాష్ఠ ఏమిటి అని, ఈ రెండు సంక్షిప్తముగా చెపుతాను అంటాడు కృష్ణుడు.

బ్రహ్మమును ఎలా పొందుచున్నాడో ఇప్పటి దాకా పదహారు అధ్యాయములలో చెప్పబడినది. అది ఇక్కడ , 'సమాసేన' అంటే సంక్షిప్తముగా చెపుతాను అంటున్నాడు. అంటే భగవద్గీతా సారమంతా మూడుశ్లోకాలలో వస్తుంది అన్నమాట.

||శ్లోకము 51||
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాఽఽత్మానం నియమ్య చ|
శబ్దాదీన్ విషయాం స్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ||51||

స|| విశుద్ధయా బుద్ధ్యా యుక్తః ధృత్యా ఆత్మానమ్ నియమ్యచ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ||51||

||శ్లోకార్థములు||
విశుద్ధయా బుద్ధ్యా యుక్తః - శుద్ధమైన బుద్ధితో కూడినవాడును
ధృత్యా ఆత్మానమ్ నియమ్యచ - ధైర్యముతో తన మనస్సుని నిగ్రహించి
శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా - శబ్దాది విషయములను త్యజించి
రాగద్వేషౌ వ్యుదస్య చ - రాగ ద్వేషములను పరిత్యజించి

||శ్లోకతాత్పర్యము||
శుద్ధమైన బుద్ధితో కూడినవాడును, ధైర్యముతో తన మనస్సుని నిగ్రహించి
శబ్దాది విషయములను త్యజించి, రాగ ద్వేషములను పరిత్యజించి;
( బ్రహ్మ సాక్షాత్కరమునకు తగి వున్నాడు)

ఇక్కడ సిద్ధిపొందినవాడు అన్నమాటకి విశదీకరణ. మనస్సు నిగ్రహించి, శబ్దాది విషయములను త్యజించి, రాగ ద్వేషములను పరిత్యజించినవాడు అని. ఇది మూడు శ్లోకాలలో చెప్పబడుతోంది.

||శ్లోకము 52||
వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః|
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ||52||

స|| వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః నిత్యం ధ్యాన యోగ పరః వైరాగ్యం సముపాశ్రితః||

||శ్లోకార్థములు||
వివిక్తసేవీ లఘ్వాశీ - ఏకాంత ప్రదేశమునందు నివశించు వాడును, మితాహారము తినువాడు
యతవాక్కాయమానసః - వాక్కును శరీరమును మనస్సును నిగ్రహించినవాడు
నిత్యం ధ్యాన యోగ పరః - ఎల్లప్పుడు ధ్యానముద్రలో వున్నవాడును
వైరాగ్యం సముపాశ్రితః - వైరాగ్యముతో కూడినవాడును.

||శ్లోకతాత్పర్యము||
"ఏకాంత ప్రదేశమునందు నివశించు వాడును, మితాహారము తినువాడు, వాక్కును శరీరమును మనస్సును నిగ్రహించినవాడు, ఎల్లప్పుడు ధ్యానముద్రలో వున్నవాడును, వైరాగ్యముతో కూడినవాడును ( బ్రహ్మ సాక్షాత్కరమునకు తగి వున్నాడు)".||52||

||శ్లోకము 53||
అహఙ్కారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్|
విముచ్య నిర్మమః శాన్తో బ్రహ్మభూయాయ కల్పతే ||53||

స|| అహంకారం బలం దర్పం కామమ్ క్రోధమ్ పరిగ్రహమ్ విముచ్య నిర్ మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే||

||శ్లోకార్థములు||
అహంకారం బలం దర్పం - అహంకారము , బలము, దర్పము
కామమ్ క్రోధమ్ పరిగ్రహమ్ విముచ్య - కామము, క్రోధము , వస్తు పరిగ్రహము బాగుగా వదలి
నిర్ మమః శాంతః - మమత్వము వదిలినవాడు, శాంతుడు
బ్రహ్మభూయాయ కల్పతే - బ్రహ్మస్వరూపుడగుటకు సమర్థుడగుచున్నాడు.

||శ్లోకతాత్పర్యము||
"అహంకారము , బలము, దర్పము, కామము, క్రోధము , వస్తు పరిగ్రహము బాగుగా వదలి
మమత్వము వదిలినవాడు, శాంతుడు బ్రహ్మస్వరూపుడగుటకు సమర్థుడగుచున్నాడు".||53||

అంటే ఈ మూడు శ్లోకాలలో చెప్పిన మాట:
"శుద్ధమైన బుద్ధితో కూడినవాడును, ధైర్యముతో తన మనస్సుని నిగ్రహించి శబ్దాది విషయములను త్యజించి, రాగ ద్వేషములను పరిత్యజించి, ఏకాంత ప్రదేశమునందు నివశించు వాడును, మితాహారము తినువాడు, వాక్కును శరీరమును మనస్సును నిగ్రహించి, ఎల్లప్పుడు ధ్యానయోగములో వున్నవాడును, వైరాగ్యముతో కూడినవాడును; అహంకారము , బలము, దర్పము, కామము, క్రోధము , వస్తు పరిగ్రహముమున్నగు అసుర గుణములను వదిలినవాడు, మమత్వము వదిలినవాడు, శాంతుడు బ్రహ్మస్వరూపుడగుటకు సమర్థుడగుచున్నాడు".

ఇక్కడ చెప్పబడినవన్నీ మోక్షసాధనములు కూడా. వీటిలో ఆరితేరినవాడు, "బ్రహ్మభూయాయ కల్పతే", అంటే బ్రహ్మ స్వరూపుడగుటకు సమర్ధుడగుచున్నాడు.

దీనిలో గ్రహించవలసిన లక్షణములు, త్యజింపవలసినవి రెండూ వున్నాయి.

||శ్లోకము 54||
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి నాకాంక్షతి|
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ||54||

స|| బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి | సర్వేషు భూతేషు సమః పరాం మద్భక్తిం లభతే||54||

||శ్లోకార్థములు||
బ్రహ్మభూతః - బ్రహ్మత్వము పొందినవాడు
ప్రసన్నాత్మా - ప్రశాంతమైన మనస్సు కలవారు
న శోచతి న కాంక్షతి - శోకించడు కోరడు
సర్వేషు భూతేషు సమః - సమస్త ప్రాణులయందు సమభావము కలవాడు
పరాం మద్భక్తిం - అత్యుత్తమమైన నాయందు భక్తిని
లభతే - పొందుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||
" బ్రహ్మత్వము పొందినవాడు, ప్రశాంతమైన మనస్సు కలవాడు, దేనిని గురించి శోకించడు, కోరడు.
సమస్త ప్రాణులయందు సమభావము కలవాడై, అత్యుత్తమమైన నాయందు భక్తిని పొందుచున్నాడు."||54||

బ్రహ్మత్వము పొందినవాడు జీవన్ముక్తుడు. చలించని మనస్సు కలవాడు. అంటే నిర్మలమైన మనస్సుకలవాడు. సమత్వము కలవాడు. అట్టివానికి శోకము వుండదు, కోరిక వుండదు.

ఇదే మాట ఈశావాశ్యోపనిషత్తులో చెప్పబడినది. బ్రహ్మానుభవము అత్మానుభూతి కలిగినవాని గుర్తు సమస్త ప్రాణికోట్లయందు సమభావము కలిగియుండుట. వానిని తనతో సమానముగా చూడకలుగుట. జ్ఞానప్రాప్తికి చిహ్నము సర్వభూత దయ. సమభావము, సర్వభూత దయ లేనిచో, పూర్ణజ్ఞానము అత్మానుభవము ఇంకను కలగలేదనియే అర్థము.

సమత్వము సర్వభూత దయ కలిగినవాడు పరమాత్మయందు అనన్యభక్తిని పొందుతున్నాడు.

||శ్లోకము 55||
భక్త్యామామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః|
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనన్తరమ్ ||55||

స|| భక్త్యా మామ్ తత్త్వతః యావాన్ యః చ అస్మి అభిజానాతి || తతః మామ్ తత్త్వతః జ్ఞాత్వా తదన్తరమ్ విశతే||55||

||శ్లోకార్థములు||
భక్త్యా మామ్ తత్త్వతః - భక్తితో నన్ను యదార్థముగా
యావాన్ యః చ అస్మి - ఎంతటివాడనో ఎట్టివాడనో
అభిజానాతి - తెలిసికొనుచున్నాడు.
తతః మామ్ తత్త్వతః జ్ఞాత్వా - తద్వారా నన్ను యదార్థముగా తెలిసికొని
తదన్తరమ్ విశతే - పిమ్మట నాయందు ప్రవేశించుచున్నాడు.

||శ్లోకతాత్పర్యము||
"భక్తితో నన్ను యదార్థముగా, ఎంతటివాడనో ఎట్టివాడనో తెలిసికొనుచున్నాడు.
తద్వారా నన్ను యదార్థముగా తెలిసికొని పిమ్మట నాయందు ప్రవేశించుచున్నాడు"||55||

భక్తితో నన్ను యదార్థముగా తెలిసికొనుచున్నాడు అంటే జ్ఞేయమును తెలిసికొనుచున్నాడు అన్నమాట. జ్ఞేయము తెలిసికొనడములో జ్ఞానము కూడా అంతర్గతమైవుంది. అంటే జ్ఞానోదయము అయినట్లే. ఇది ఒకసారి మననం చేస్తే మనకి తెలిసేది, భక్తి ద్వారా "నన్ను తెలిసుకుంటున్నాడు" అనడములో భక్తి ద్వారా జ్ఞానో దయము అవుతుంది. వచ్చినది భక్తి మార్గమే అయినా, భక్తి పరాకాష్ఠలో అది జ్ఞానముగా మారుతుంది.

ఇక్కడ యదార్థముగా తెలిసికొనడము లోనే భగవంతుని లో ప్రవేశించడము.

పదకొండవ సర్గలో వింటాము, "జ్ఞాతుం ద్రష్ఠుం చ తత్త్వేన ప్రవేష్ఠుం చ పరన్తప". అక్కడ భగవంతుడు చెప్పినమాట." ఈ విధమగు ( విరాట) స్వరూపము గల నేను అనన్య భక్తిచే మాత్రమే యదార్థముగా తెలిసికొనుటకు, చూచుటకు, ప్రవేశించుటకు సాధ్యమైనవాడను అగుచున్నాను". అంటే అనన్య భక్తి ద్వారానే భగవంతుని యదార్థముగా తెలిసికొనగలము అని. అదే మాట ఇక్కడ మళ్ళీ సంక్షేపము గా చెప్పబడినది.

||శ్లోకము 56||
సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః|
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ||56||

స||సర్వకర్మాణి సదా కుర్వాణః అపి మద్వ్యాపాశ్రయః మత్ప్రాసాదాత్ అవ్యయమ్ శాశ్వతమ్ పదమ్ ఆప్నోతి|| 56||

||శ్లోకార్థములు||
సర్వకర్మాణి - సమస్త కర్మలను
సదా కుర్వాణః అపి - ఎల్లప్పుడు చేయుచున్నవాడైనను
మద్వ్యాపాశ్రయః- నన్ను ఆశ్రయించినవాడు
మత్ప్రాసాదాత్ - నా ప్రసాదము వలన
అవ్యయమ్ శాశ్వతమ్ పదమ్ ఆప్నోతి - నాశరహితమైన శాశ్వతమైన పదమును పొందుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||
"సమస్త కర్మలను ఎల్లప్పుడు చేయుచున్నవాడైనను, నన్ను ఆశ్రయించినవాడు
నా ప్రసాదము వలన నాశరహితమైన శాశ్వతమైన పదమును పొందుచున్నాడు".||56||

సమస్తకర్మలూ చేయుచున్ననూ, సదా భగవంతుని స్మరించుచూ భగవంతునికే ఆయా కర్మ ఫలములను అర్పణము చేయువాడు, భగవదనుగ్రహమునకు పాత్రుడు కాగలడు. ఆవిధముగా భగవదనుగ్రహమునకు పాత్రుడైనవాడు, భగవంతుని ప్రసాదము వలన మోక్షము పొందుతున్నాడు.

||శ్లోకము 57||
చేతసా సర్వ కర్మాణి మయి సన్న్యస్య మత్పరః|
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ||57||

స|| సర్వకర్మాణి చేతసా మయి సన్న్యస్య మత్పరః బుద్ధియోగమ్ ఉపాశ్రిత్య సతతమ్ మచ్చిత్తః భవ||57||

||శ్లోకార్థములు||
సర్వకర్మాణి చేతసా - సమస్త కర్మలు మనస్సుచేత
మయి సన్న్యస్య - నా యందు సమర్పించి
మత్పరః బుద్ధియోగమ్ ఉపాశ్రిత్య - నన్నే పరమగతిగా ఎంచి ధ్యానయోగము ఆశ్రయించి
సతతమ్ మచ్చిత్తః భవ - ఎల్లప్పుడు నాయందే మనస్సు కలవాడవు అగుము

||శ్లోకతాత్పర్యము||
"సమస్త కర్మలు మనస్సుచేత నా యందు సమర్పించి, నన్నే పరమగతిగా ఎంచి ధ్యానయోగము ఆశ్రయించి
ఎల్లప్పుడు నాయందే మనస్సు కలవాడవు అగుము"||57||

పదోఅధ్యాయములో (శ్లో 10.10) ప్రీతితో నన్ను భజించువారికి 'బుద్ధి యోగము ఒసంగెదను అని భగవానుడు చెప్పెను. అంటే చిత్తేకాగ్రత, తత్త్వ విచారణాశక్తి లభిస్తాయి అన్నమాట.

ఇక్కడ సమస్త కర్మలు మనస్సుచేత నాయందు సమర్పించి ఆ బుద్ధియోగము ఆశ్రయించి, లభించిన చిత్తేకాగ్రతతో, ఎల్లపుడు నాయందే మనస్సు కలవాడవు అగుము అంటున్నాడు కృష్ణుడు. ఎందుకు "నాయందే మనస్సు కలవాడవు కమ్ము" అని చెపుతున్నాడు? భగవంతుని యందే మనస్సు కలవాడు, అన్ని కష్టములను దాటగలడు. అందుకని.

||శ్లోకము 58||
మచ్చిత్తసర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి|
అథ చేత్త్వమహఙ్కారాన్ న శ్రోష్యసి వినంక్ష్యసి ||58||

స|| మచ్చిత్తః మత్ప్రసాదాత్ సర్వదుర్గాణి తరిష్యసి| అథ త్వమ్ అహంకారాత్ న సొష్యసి చేత్ వినంక్ష్యసి||58||

||శ్లోకార్థములు||
మచ్చిత్తః మత్ప్రసాదాత్ - నాయందు మనస్సు కలవాడవై నా ప్రసాదము వలన
సర్వదుర్గాణి తరిష్యసి - సమస్త దుఃఖములను దాటెదవు
అథ త్వమ్ అహంకారాత్ న సొష్యసి - ఒకవేళ అహంకారముతో వినకపోతే
వినంక్ష్యసి - చెడిపోవుదువు

||శ్లోకతాత్పర్యము||
"నాయందు మనస్సు కలవాడవై నా ప్రసాదము వలన సమస్త దుఃఖములను దాటెదవు.
ఒకవేళ అహంకారముతో నా ఈ మాటలు వినకపోతే చెడి పోవుదువు".||58||

అంటే భవసాగరము దాటడానికి మార్గము చెప్పాడు కృష్ణుడు. ఆ మాట వినకపోతే ఆ సాగరములో నే వుండి పోతాము.

||శ్లోకము 59||
యద్యహఙ్కారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే|
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్షయతి ||59||

స|| యది అహంకారమ్ ఆశ్రిత్య న యోత్స్యే ఇతి మన్యసే చేత్ ఏషః తే వ్యవసాయః మిథ్యా ప్రకృతిః త్వామ్ నియోక్ష్యతి ||59||

||శ్లోకార్థములు||
యది అహంకారమ్ ఆశ్రిత్య - ఒకవేళ అహంకారముతో
న యోత్స్యే ఇతి మన్యసే చేత్ - యుద్ధము చేయనని తలంచుదువేని
ఏషః తే వ్యవసాయః మిథ్యా - ఈ నీ ప్రయత్నము వ్యర్థమైనది అగును
ప్రకృతిః త్వామ్ నియోక్ష్యతి - నీ స్వభావము నిన్ను నియోగింపకలదు

||శ్లోకతాత్పర్యము||
"ఒకవేళ అహంకరముతో యుద్ధము చేయనని తలంచుదువేని, ఈ నీ ప్రయత్నము వ్యర్థమైనది అగును
నీ స్వభావము నిన్ను నియోగింపకలదు".||59||

ఎప్పుడు అహంకారముతో , నేను స్వతంత్రుడను ఇతరులమాట నాకు అఖ్ఖర్లేదు అనుకోవలదు. నీ స్వభావము నిన్నుఆపుతుంది అని. అహంకారము వదలి విచారణ చేయగల శక్తి వుండాలి.
.
||శ్లోకము 60||
స్వభావజేన కౌన్తేయ నిబద్ధస్స్వేన కర్మణా|
కర్తుం నేచ్ఛసి మన్మోహాత్ కరిష్యస్యవశోఽపి తత్ ||60||

స|| కౌన్తేయ స్వభావజేన స్వేన కర్మణా నిబద్ధః మోహాత్ యత్ కర్తుమ్ న ఇచ్ఛసి తత్ అపి అవశః అపి కరిష్యసి||

||శ్లోకార్థములు||
స్వభావజేన స్వేన కర్మణా నిబద్ధః -
స్వభావముచే కలిగిన నీ కర్మ చేత బంధింపబడినవాడవై
మోహాత్ - అవివేకము వలన
యత్ కర్తుమ్ న ఇచ్ఛసి - ఏది చేయుటకు ఇష్ఠ పడవో
తత్ అపి అవశః అపి కరిష్యసి - అది పరాధీనుడవై చెసెదవు.

||శ్లోకతాత్పర్యము||
"ఓ కౌన్తేయ, స్వభావముచే కలిగిన నీ కర్మ చేత బంధింపబడినవాడవై అవివేకము వలన
ఏది చేయుటకు ఇష్ఠ పడవో అది, పరాధీనుడవై చేసెదవు".||60||

ఇది అర్జునికి చెప్పిన మాట. మనము మనస్వభావముచే బంధింపబడినవారము. నిబద్ధః అనడంలో బాగుగా బంధింపబడినవారము అన్నమాట. పూర్వజన్మ సంస్కారము అంతబలమైతే పురుషుడు చేయగలిగినది ఏమిటి? అది ఇహ జన్మ పురుష ప్రయత్నము. ఈ జన్మలో చేసే పురుషప్రయత్నము, పూర్వజన్మ సంస్కారమును అధిగమించవచ్చు.

||శ్లోకము 61||
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్టతి|
భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా ||61||

స|| హే అర్జున! ఈశ్వరః మాయయా సర్వభూతాని యన్త్రారూఢాని ఇవ భ్రామయన్ సర్వభూతానాం హృద్దేశే తిష్ఠతి||61||

||శ్లోకార్థములు||
ఈశ్వరః మాయయా - ఈశ్వరుడు మాయ చేత
సర్వభూతాని యన్త్రారూఢాని ఇవ -
సమస్త ప్రాణులను యంత్రమునారోహించినవాని వలె
భ్రామయన్ - తిప్పుచూ
సర్వభూతానాం హృద్దేశే తిష్ఠతి - సమస్త ప్రాణులయొక్క హృదయములో వెలయుచున్నాడు.

||శ్లోక తాత్పర్యము||
"ఓ అర్జునా, ఈశ్వరుడు మాయ చేత సమస్త ప్రాణులను యంత్రమునారోహించినవాని వలె తిప్పుచూ, సమస్త ప్రాణులయొక్క హృదయములో వెలయుచున్నాడు".||61||

ఈ మూడు శ్లోకాలలో కృష్ణుడు భవసాగరము గురించి చెపుతున్నాడు. భవద్గీతా సారము అంతా దీనిని అధిగమించడము కోసమే. అదే మనము ముందు మూడు శ్లోకాలలో మళ్ళీ వింటాము.

||శ్లోకము 62||
తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత|
తత్ ప్రాసాదాత్పరాం శాన్తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ||62||

స|| హే భారత! సర్వభావేన తమ్ ( హృదయత్స్థం ) ఏవ శరణం గచ్ఛ | తత్ ప్రసాదాత్ పరామ్ శాన్తిమ్ శాశ్వతమ్ స్థానమ్ ప్రాప్స్యసి||62||

||శ్లోకార్థములు||
సర్వభావేన తమ్ - సర్వవిధములా
తమ్ ఏవ శరణం గచ్ఛ - నీవు ఆయననే శరణుపొందుము
తత్ ప్రసాదాత్ - ఆయన అనుగ్రహముతో
పరామ్ శాన్తిమ్ - అపరిమితమైన శాంతిని
శాశ్వతమ్ స్థానమ్ ప్రాప్స్యసి- శాశ్వతమైన స్థానము పొందెదవు.

||శ్లోక తాత్పర్యము||
"సర్వవిధములా నీవు ఆయననే శరణుపొందుము. ఆయన అనుగ్రహముతో అపరిమితమైన శాంతిని శాశ్వతమైన స్థానము పొందెదవు".||62||

యంత్రమునారోహించిన వాని వలె తిప్పుబడుచున్న, స్వభావముచే కలిగిన కర్మ చేత బంధింపబడిన వాడు సర్వవిధముల పరమాత్ముని శరణు పొందినచో, ఆయన అనుగ్రహముతో అపరమితమైన శాంతిని పొందగలడు అని భావము.

||శ్లోకము 63||
ఇతి తే జ్ఞానమాఖ్యాతంగుహ్యాద్గుహ్యతరం మయా|
విమృశ్యైతత్ అశేషేణ యథేచ్ఛసి తథా కురు ||63||

స||ఇతి గుహ్యాత్ గుహ్యతరమ్ జ్ఞానమ్ మయా తే ఆఖ్యాతమ్ | ఏతత్ అశేషేణ విమృశ్య యథా ఇచ్ఛసి తథా కురు||63||

||శ్లోకార్థములు||
ఇతి గుహ్యాత్ గుహ్యతరమ్ జ్ఞానమ్ - ఈ విధముగ అతి రహస్యమైన జ్ఞానము
మయా తే ఆఖ్యాతమ్ - నాచేత నీకు చెప్పబడినది
ఏతత్ అశేషేణ విమృశ్య - ఇది సంపూర్ణముగా విమర్శించి
యథా ఇచ్ఛసి తథా కురు - ఏప్రకారముగా నీవు చేయుటకు కోరుకున్నావో ఆ విధముగా చేయుము.

||శ్లోక తాత్పర్యము||
"ఈ విధముగ అతి రహస్యమైన జ్ఞానము నాచేత నీకు చెప్పబడినది. ఇది సంపూర్ణముగా విమర్శించి
ఏప్రకారముగా నీవు చేయుటకు కోరుకున్నావో, ఆ విధముగా చేయుము".||63||

||శ్లోకము 64||
సర్వగుహ్యతమం భూయః శృణుమే పరమం వచః|
ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామితే హితమ్ ||64||

స|| సర్వగుహ్యతమమ్ పరమమ్ మే వచః భూయః శృణు| (త్వం) మే దృఢం ఇష్టః అసి ఇతి | తతః తే హితమ్ వక్ష్యామి||64||

||శ్లోకార్థములు||
సర్వగుహ్యతమమ్ పరమమ్ - అతి రహస్యమైన శ్రేష్థమైన
మే వచః భూయః శృణు - నా వచనములను మరల వినుము.
మే దృఢం ఇష్టః అసి ఇతి - నాకు మిక్కిలి ఇష్ఠసఖుడవు
తతః తే హితమ్ వక్ష్యామి - అందువలన నీ హితము కోరి చెప్పుచున్నాను.

||శ్లోక తాత్పర్యము||
"అతి రహస్యమైన శ్రేష్థమైన నా వచనములను మరల వినుము. నాకు మిక్కిలి ఇష్ఠ సఖుడవు
కాబట్టి నీ హితము కోరి చెప్పుచున్నాను".||64||

కృష్ణుడు మరల ఏమి చెపుతాడు ? అది చివరిమాట. వినతగినది.

||శ్లోకము 65||
మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు|
మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే ||65||

స|| మన్ మనాః మద్భక్తః మద్యాజీ భవ| మామ్ నమస్కురు| మామ్ ఏవ ఏష్యసి |(త్వం) మే ప్రియః అసి| తే సత్యం ప్రతిజానే ||65||

||శ్లోకార్థములు||
మన్ మనాః మద్భక్తః - నాయందు మనస్సుకలవాడవు
మద్భక్తః - నాయందు భక్తి కలవాడవు
మద్యాజీ భవ - నన్ను ఆరాధించువాడవు కమ్ము.
మామ్ నమస్కురు - నాకు నమస్కరించుము
మామ్ ఏవ ఏష్యసి - నన్నే పొందగలవు.
మే ప్రియః అసి - నాకు ప్రియసఖుడవు
తే సత్యం ప్రతిజానే - నీకు యదార్థముగా ప్రతిజ్ఞ చేయుచున్నాను

||శ్లోక తాత్పర్యము||
"నాయందు మనస్సుకలవాడవు, నాయందు భక్తి కలవాడవు, నన్ను ఆరాధించువాడవు కమ్ము.
నాకు నమస్కరించుము. నన్నే పొందగలవు. నాకు ప్రియసఖుడవు, నీకు యదార్థముగా ప్రతిజ్ఞ చేయుచున్నాను".||65||

ఇది ప్రతిజ్ఞ చేసి చెప్పినమాట. తెలిసికొనవలసినమాట; అనన్యభక్తితో భగవంతుని ఆరాధన ఫలము మోక్షము అని. అంటే మానవుడు భగవంతుడే పరమ గతిగా భావించి భగవంతుని సేవలోనే నిమగ్నుడై వుండాలి అన్నమాట. ఇలా చేయడము వలన ఏమి లభిస్తుంది కూడా మళ్ళీ వింటాము.

||శ్లోకము 66||
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ|
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||66||

స|| సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్ ఏకం శరణం వ్రజ || అహమ్ త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి | మాశుచః||66||

||శ్లోకార్థములు||
సర్వధర్మాన్ పరిత్యజ్య - సమస్త ధర్మములను పరిత్యజించి
మామ్ ఏకం శరణం వ్రజ - నన్నే శరణు వేడుకొనుము
అహమ్ త్వాం సర్వపాపేభ్యో - నేను నిన్ను సమస్త పాపములనుంచి
మోక్షయిష్యామి మాశుచః - విముక్తి చేసెదను. శోకింపకుము.

||శ్లోక తాత్పర్యము||
" సమస్త ధర్మములను పరిత్యజించి నన్నే శరణు వేడుకొనుము.
నేను నిన్ను సమస్త పాపములనుంచి విముక్తి చేసెదను. శోకింపకుము".||66||

సమస్త ధర్మములను పరిత్యజించి నన్నే శరణు పొందుము.ఎవరు సమస్త వాంఛలను, కర్మలను ధర్మములను వదిలి భగవానుని శరణు పొందుదురో, మనసా వాచా భవంతునినే ఆశ్రయించెదరో, అట్టివాడు, అలా శరణు పొందినవాడు సమస్త పాపములనుంచి విముక్తి పొందుతాడు. అట్టి వాడికి శోకము కూడా వలదు అని చెపుతాడు కృష్ణుడు.

"అశోచానన్వశోచస్త్వం" అన్న మాటతో మొదలైన కృష్ణ భగవానుని గీతోపదేశము "మాశుచః" అన్నమాటతో ముగుస్తుంది. అంటే శోకరాహిత్యమే గీతాలక్ష్యము.

ఈ చివరిశ్లోకములో కష్టతరమైన జ్ఞానమార్గము గురించి ఏమీ లేదు. అతిసులభమైన భక్తిశరణాగతి మాత్రమే మోక్షమునకు హేతువులుగా చెప్పబడుచున్నది కాబట్టి ఈ సందేశము శాస్త్ర జ్ఞానము లేనివారికి కూడా అందుబాటులో వున్నది.

||శ్లోకము 67||
ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన|
న చాఽశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి ||67||

స||తే ( అభిహితమ్) ఇదం ( గీతాశాస్త్రమ్) కదాచన అ తపస్కాయ న వాచ్యమ్| అభక్తాయా అశుశ్రూషవే చ న వాచ్యమ్| యః మామ్ అభ్యసూయతి తస్మై చ న వాచ్యం||67||

||శ్లోకార్థములు||
తే ( అభిహితమ్) ఇదం ( గీతాశాస్త్రమ్) - నీకు చెప్పబడిన ఈ గీతా శాస్త్రము
కదాచన అ తపస్కాయ న వాచ్యమ్ - ఎప్పుడును తపస్సు లేనివానికి చెప్పదగినది కాదు
అభక్తాయా అశుశ్రూషవే చ న వాచ్యమ్ - భక్తుడు కానివానికి, వినుటకు కోరనివానికి చెప్పదగినది కాదు
యః మామ్ అభ్యసూయతి తస్మై చ న వాచ్యం -
ఎవడు నన్ను దూషించునో అట్టి వానికి కూడా చెప్పదగినది కాదు

||శ్లోక తాత్పర్యము||
"నీకు చెప్పబడిన ఈ గీతా శాస్త్రము ఎప్పుడును తపస్సు లేనివానికి చెప్పదగినది కాదు. భక్తుడు కానివానికి, వినుటకు కోరనివానికి చెప్పదగినది కాదు. ఎవడు నన్ను దూషించునో అట్టి వానికి కూడా చెప్పదగినది కాదు".||67||

||శ్లోకము 68||
య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి|
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ||68||

స||యః పరమం గుహ్యం ఇమమ్ గీతాశాస్త్రం మద్భక్తేషు అభిదాస్యతి మయి పరామ్ భక్తిం కృత్వా అశంసయః మామ్ ఏవ ఏష్యతి||68||

||శ్లోకార్థములు||
యః పరమం గుహ్యం - ఎవరు ఈ పరమ రహస్యమైన
ఇమమ్ గీతాశాస్త్రం - ఈ గీతాశాస్త్రము
మద్భక్తేషు అభిదాస్యతి - నా భక్తులకు చెప్పునో
మయి పరామ్ భక్తిం కృత్వా - నాయందు భక్తి కలిగి
అశంసయః మామ్ ఏవ ఏష్యతి - సందేహము లేకుండా నన్నే పొందును.

||శ్లోక తాత్పర్యము||
"ఎవరు ఈ పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రము నా భక్తులకు చెప్పునో,
అట్టివాడు నాయందు భక్తి కలిగి సందేహము లేకుండా నన్నే పొందును".||68||

||శ్లోకము 69||
న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః|
భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి ||69||

స||మనుష్యేషు తస్మాత్ మే ప్రియకృత్తమః కశ్చిత్ న చ |తస్మాత్ మే ప్రియతరః భువి భవితా న చ ||69||

||శ్లోకార్థములు||
మనుష్యేషు తస్మాత్ - మనుష్యులలో అట్టివానికంటే
మే ప్రియకృత్తమః కశ్చిత్ న చ - నాకు ప్రియమొనర్చు వాడు లేడు.
తస్మాత్ మే ప్రియతరః - అతనికంటె నాకు ప్రియతరమైనవాడు
భువి భవితా న చ - భూమిలో కలుగబోడు

||శ్లోక తాత్పర్యము||
"మనుష్యులలో అట్టివానికంటే నాకు ప్రియమొనర్చు వాడు లేడు. అతనికంటె నాకు ప్రియతరమైనవాడు భూమిలో కలుగబోడు".||69||

||శ్లోకము 70||
అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః|
జ్ఞానయజ్ఞేన తేనాహ మిష్టఃస్యామితి మే మతిః ||70||

స|| యః చ ధర్మ్యమ్ ఆవయోః ఇమం సంవాదమ్ అధ్వేష్యతే ( అధ్యయనం కరోతి ఇతి) తేన జ్ఞానయజ్ఞేన అహం ఇష్టః స్యామ్ ఇతి మే మతిః||70||

||శ్లోకార్థములు||
యః చ ధర్మ్యమ్ ఆవయోః - ఏవరైతే ఈ ధర్మయుక్తమైన మన
ఇమం సంవాదమ్ అధ్వేష్యతే - ఈ సంవాదమును అధ్యయనమొనర్చునో
తేన జ్ఞానయజ్ఞేన - అతనిచేత జ్ఞానయజ్ఞముతో
అహం ఇష్టః స్యామ్ - నేను ఆరాధింపబడినవాడను అగుదును
ఇతి మే మతిః - అని నా నిశ్చయము

||శ్లోక తాత్పర్యము||
"ఏవరైతే ఈ ధర్మయుక్తమైన మన ఈ సంవాదమును అధ్యయనమొనర్చునో, అతనిచేత జ్ఞానయజ్ఞముతో
నేను ఆరాధింపబడినవాడను అగుదును అని నా నిశ్చయము".||71||

||శ్లోకము 71||
శ్రద్ధవాన్ అనసూయశ్చ శృణుయాదపి యో నరః|
సోఽపి ముక్తః శుభాన్ లోకాన్ ఆప్నుయాత్పుణ్యకర్మణామ్ ||71||

స|| యః నరః శ్రద్ధవాన్ అనసూయః చ శృణుయాత్ అపి - సః అపి - ( పాపకర్మణాం)ముక్తః పుణ్యకర్మణాన్ లోకాన్ ఆప్నోతి||71||

||శ్లోకార్థములు||
యః నరః శ్రద్ధవాన్ - ఏ నరుడు శ్రద్ధతో
అనసూయః చ - అసూయలేని వాడును
శృణుయాత్ అపి- ఈ శాస్త్రమును వినినప్పటికి
సః అపి - ( పాపకర్మణాం)ముక్తః - అట్టివాడుకూడా పాపములనుంది విముక్తి పొంది
పుణ్యకర్మణాన్ లోకాన్ ఆప్నోతి - పుణ్యకర్మలు చేసినవారి లోకములను పొందును.

||శ్లోకతాత్పర్యము||
"ఏ నరుడు శ్రద్ధతో అసూయలేని వాడును ఈ శాస్త్రమును వినినప్పటికి,
అట్టివాడుకూడా పాపములనుంది విముక్తి పొంది పుణ్యకర్మలు చేసినవారి లోకములను పొందును".||71||

||శ్లోకము 72||
కచ్ఛిదేతత్ శ్రుతం పార్థ త్వయైకాగ్రేణచేతసా|
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనఞ్జయ ||72||

స|| హే పార్థ ఏతత్ త్వయా ఏకాగ్రేణ చేతసా శ్రుతం కశ్చిత్ | హే ధనంజయ తే అజ్ఞానసమ్మోహః ప్రణష్టః కశ్చిత్ ?||

||శ్లోకార్థములు||
ఏతత్ త్వయా ఏకాగ్రేణ చిత్తసా -
ఇది నీచేత ఏకాగ్రతతోకూడిన మనస్సుతో
శ్రుతం కశ్చిత్ - వినబడినది కదా
తే అజ్ఞానసమ్మోహః ప్రణష్టః కశ్చిత్ -
నీకు అజ్ఞానము వలన కలిగిన సమ్మోహము పూర్తిగా నశించినది కదా

||శ్లోకతాత్పర్యము||
"ఓ అర్జునా, ఇది నీచేత ఏకాగ్రతతోకూడిన మనస్సుతో వినబడినది కదా.
ఓ ధనంజయా, నీకు అజ్ఞానము వలన కలిగిన సమ్మోహము పూర్తిగా నశించినది కదా".||72||

||శ్లోకము 72||
అర్జున ఉవాచ:
నష్టోమోహః స్మృతిర్లబ్ధా త్వత్ ప్రాసాదాన్మయాఽచ్యుత|
స్థితోఽస్మి గతసన్దేహః కరిష్యే వచనం తవ ||73||

స|| హే అచ్యుత! త్వత్ప్రాసాదాత్ మోహః నష్టః| మయా స్మృతిః లబ్ధా |గతసందేహః స్థితః అస్మి| తవ వచనం కరిష్యే||73||

||శ్లోకార్థములు||
త్వత్ప్రాసాదాత్ మోహః నష్టః - నీ ప్రసాదము వలన నా అజ్ఞానము నశించినది.
మయా స్మృతిః లబ్ధా - నాచేత జ్ఞానము పొందబడెను
గతసందేహః స్థితః అస్మి - సందేహములు పోయినవాడను
తవ వచనం కరిష్యే - నీ వాక్యములను పరిపాలించెదను

||శ్లోకతాత్పర్యము||
"ఓ అచ్యుత, నీ ప్రసాదము వలన నా అజ్ఞానము నశించినది. నాచేత జ్ఞానము పొందబడెను. సందేహములు పోయినవాడను. నీ వాక్యములను నెరవేర్చెదను".||73||

||శ్లోకము 74||
సంజయ ఉవాచ:
ఇత్యాహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః|
సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణమ్ ||74||

స||ఇతి అహం వాసుదేవస్య మహాత్మనః పార్థస్య ఇమమ్ అద్భుతమ్ రోమహర్షనమ్ సంవాదమ్ అశ్రౌషమ్||74||

||శ్లోకార్థములు||
ఇతి అహం వాసుదేవస్య మహాత్మనః - ఈ విధముగా నేను వాసుదేవునియొక్క
మహాత్మనః పార్థస్య ఇమమ్ అద్భుతమ్ - మహాత్ముడైన అర్జునునియొక్క అద్భుతమైన
రోమహర్షనమ్ సంవాదమ్ అశ్రౌషమ్ - గగుర్పాటు కలిగించెడి సంవాదమును వింటిని

||శ్లోకతాత్పర్యము||
సంజయుడు పలికెను:
"ఈ విధముగా నేను వాసుదేవునియొక్క మహాత్ముడైన అర్జునునియొక్క అద్భుతమైన గగుర్పాటు కలిగించెడి సంవాదమును వింటిని". ||74||

||శ్లోకము 75||
వ్యాసప్రాసాదాత్ శ్రుతవానేతత్ గుహ్యతమం పరమ్|
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ ||75||

స|| వ్యాస ప్రసాదాత్ అహమ్ గుహ్యమ్ పరమ్ ఏతత్ యోగమ్ స్వయమ్ కథయతః యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ శ్రుతవాన్||75||

||శ్లోకార్థములు||
వ్యాస ప్రసాదాత్ అహమ్ - నేను వ్యాసమహాముని ప్రసాదము వలన
గుహ్యమ్ పరమ్ ఏతత్ యోగమ్ - అతి రహస్యమైన ఈ యోగమును
స్వయమ్ కథయతః - స్వయముగా చెప్పుచున్న
యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ శ్రుతవాన్ - యోగేశ్వరుడైన కృష్ణునినుంచి ప్రత్యక్షముగా వింటిని

||శ్లోకతాత్పర్యము||
"నేను వ్యాసమహాముని ప్రసాదము వలన అతి రహస్యమైన ఈ యోగమును
స్వయముగా చెప్పుచున్న యోగేశ్వరుడైన కృష్ణునినుంచి ప్రత్యక్షముగా వింటిని".||75||

||శ్లోకము 76||
రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్|
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ||76||

స|| హే రాజన్ ! అద్భుతం పుణ్యమ్ కేశవార్జునయోః ఇమం సంవాదం సంస్మృత్య సంస్మృత్య ముహుముహుః హృష్యామి||76||

||శ్లోకార్థములు||
అద్భుతం పుణ్యమ్ కేశవార్జునయోః - అద్భుతమైన పుణ్యకరమైన ఈ కేశవార్జునుల
ఇమం సంవాదం సంస్మృత్య సంస్మృత్య - ఈ సంవాదమును తలచి తలచి
ముహుముహుః హృష్యామి - మళ్ళీ మళ్ళీ ఆనందించుచున్నాను

||శ్లోకతాత్పర్యము||
"ఓ రాజా, అద్భుతమైన పుణ్యకరమైన ఈ కేశవార్జునుల ఈ సంవాదమును తలచి తలచి,
మళ్ళీ మళ్ళీ ఆనందించుచున్నాను".||76||

||శ్లోకము 77||
తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః|
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః ||77||

స|| రాజన్ హరేః అత్యద్భుతమ్ తత్ చ రూపమ్ సంస్మృత్య సంస్మృత్య మే మహాన్ విస్మయః భవతి | పునః పునః చ హృష్యామి||77||

||శ్లోకార్థములు||
హరేః అత్యద్భుతమ్ తత్ చ రూపమ్ - శ్రీహరియొక్క అత్యద్భుతమైన ఆ రూపము
సంస్మృత్య సంస్మృత్య మే - తలచుకొని తలచుకొని నాకు
మహాన్ విస్మయః భవతి - మహత్తరమైన అశ్చర్యము కలుగుచున్నది.
పునః పునః చ హృష్యామి - మరల మరల సంతోషము పొందుచున్నాను

||శ్లోకతాత్పర్యము||
" ఓ రాజా, శ్రీహరియొక్క అత్యద్భుతమైన ఆ రూపము తలచుకొని తలచుకొని నాకు మహత్తరమైన అశ్చర్యము కలుగుచున్నది. మరల మరల సంతోషము పొందుచున్నాను".||77||

||శ్లోకము 77||
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
తత్రశ్రీర్విజయో భూతిర్ధ్రువాన్ ఇతి మతిర్మమ ||78||

స|| యత్ర యోగేశ్వరః కృష్ణః (తిష్టతి) యత్ర ధనుర్ధరః పార్థః (తిష్టతి) తత్ర శ్రీః విజయః భూతిః ధ్రువా నీతిః సన్తి ఇతి మమ మతిః||

||శ్లోకార్థములు||
యత్ర యోగేశ్వరః కృష్ణః - ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు వుండునో
యత్ర ధనుర్ధరః పార్థః - ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు వుండునో
తత్ర శ్రీః విజయః భూతిః - అక్కడ లక్ష్మియు విజయమును ఐశ్వర్యమును.
ధ్రువా నీతిః సన్తి - ధృఢమైన నీతియు వుండును
ఇతి మమ మతిః - అని నా అభిప్రాయము

||శ్లోకతాత్పర్యము||
"ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు వుండునో, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు వుండునో,
అక్కడ లక్ష్మియు, విజయమును, ఐశ్వర్యమును, ధృఢమైన నీతియు వుండును అని నా అభిప్రాయము"

ఇతి శ్రీమన్మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైసిక్యాం
శ్రీమద్భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే మోక్షసన్న్యాస యోగో నామ
అష్టాదశోఽధ్యాయః
||ఓం తత్ సత్||