భగవద్గీత !!

ద్వితీయోధ్యాయః!

 

 


|| ఓమ్ తత్ సత్ ||
సంజయ ఉవాచ:
తం తథా కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదంత మిదం వాక్యం ఉవాచ మథుసూదనః ||1||

"ఆవిధముగా కనికరముచే కూడినవాడును ,కన్నీరుతో నిండిన వ్యాకుఅలమైన కళ్ళు కనవాడునూ, దుఃఖించుచున్నావాడును అగు అర్జునినితో మధుసూదనుడు ఈ వాక్యములు చెప్పెను"

శ్రీమద్భగవద్గీత
సాంఖ్య యోగము
ద్వితీయోధ్యాయః
శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః

భగవద్గీత సాంఖ్యయోగము ఆత్మతత్వం

(ప్రథమోధ్యాయములో అర్జునుడు విషాదములో మునిగి పోయి" నాకు ఈ రాజ్యము వద్దు, ఈ విజయము వద్దు" అంటాడు. ఇంకా తను కౌరవులందరిని చంపి రాజ్యము అనుభవించే బదులు " నిరాయుధుడైన తనని ఆయుధులైన కౌరవులు చంపినా" అది క్షేమకరము అని కూడా అంటాడు. అలా అని శస్త్రములను పడవేసి రథములో చతికిలబడతాడు అర్జునుడు. రెండవ సర్గ సంజయుని మాటలతో మొదలవుతుంది . ముందు సంజయుడు అర్జునుని మానసిక స్థితిని వర్ణిస్తాడు.తరువాత కృష్ణార్జున సంవాదము మొదలవుతుంది ).

ఇక రెండవ అధ్యాయము

సంజయుడు అర్జుని గురించి చెపుతూ
" శోకసంవిగ్న మానసం" - అంటే దుఃఖముతో చలించిన మనస్సు కలవాడు అని
"అశ్రుపూర్ణాకులేక్షణమ్" - కన్నీటితో నిండిన నేత్రములు కలవాడు అని
" విషీదంతం" - దుఃఖములో వున్నవాడు అని .

ఇవన్నీ అర్జునిని మానసిక స్థితిని వర్ణిస్తాయి.

అట్టి స్థితిలోనున్న అర్జునితో మధుసూదనుడు ఇట్లు పలికెను

శ్రీ భగవానువాచ:
కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున ||2||

"అర్జునా ? ఈ కష్టసమయమున పామరులు అవలంబించు నదియు అపకీర్తిని కలుగ జేయునదియు స్వర్గమును నిరోధించునదియు అగు ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది ? .

ఇంకా అర్జునిడికి ధైర్యము చెప్పిపురికొలుపుతూ కృష్ణుడు,ఇలా చెపుతాడు.
"ఓ పరంతపా" అంటే శతృవులను తపింపచేయగలవాడా అని
"నీ హృదయ దౌర్బల్యమును" వదిలి
"ఉత్తిష్ఠ" , లెమ్ము ! లేచి యుద్ధము చెయ్యి అని.

అంత శోకములో వున్న అర్జునిడికి "పరంతప" అన్నమాట తో సరిపోలేదు.
తన శోకము గురించి ఇంకా చెపుతాడు.
భీష్మద్రోణులు పూజింపతగినవారు.

" గురూన్ హత్వా..." గురువులను చంపి భోగాలను అనుభవించే కన్నా,
"భైక్ష్యం అపి ఇహలోకే.." ఈ లోకములో బిక్షము ఎత్తుకోవడము ..మేలు !

"న చ ఏతత్ విద్మః" ఇది కూడా తెలియదు
"ఏది" అంటే - " మనము గెలవడము మంచిదా వాళ్ళు గెలవడము మంచిదా" అన్నది !
అది కూడా తెలియటల్లేదన్నమాట !!

ఇది ఒక "కృపణుడి" గుణము. అదే కృపణత్వము -
అంటే ఒక పిసినిగొట్టు. ఏదీ వదలలేని వాడి కథ.
ఇంత వ్యథ లోనూ అర్జునిడికి తన వ్యథకి కారణము తెలుసును.

అదే అర్జునుడు అంటాడు.
"కృష్ణా , కార్పణ్య దోషములచే ధర్మాధర్మములు తెలియక,
ఏది నిశ్చయముగా చేయవలెనో తెలియని సందిగ్ధములో నున్నవాడను" అని చెప్పి,
ఇలా అంటాడు. -

యత్ శ్రేయస్స్యాన్నిశ్చితం బ్రూహితన్మే
శిష్యస్తే అహం శాధి మాం ప్రపన్నమ్||7||

"నేను నిన్ను శరణు బొందిన శిష్యుడను" .
'"యత్ శ్రేయసం" అంటే "ఏది శ్రేయస్కరమో దానిని నిశ్చయముగా నాకు చెప్పుము.
నా ఇంద్రియములను శోషింపజేయుచున్న నా దుఃఖమును పోగొట్టుము" మని అర్జునుడు ప్రార్ధించెను.

"శాధి మాం" - నన్ను శాసించు అంటూ పూర్తిగా కృష్ణుడి మీద భారము వేసి
"నయోత్స్య ఇతి " యుద్ధము చెయ్యను అంటూ కృష్ణుడికి చెప్పి
" తూష్ణీం బభువ హ" ఇంక మాట్లాడకుండా కూర్చుంటాడు.

"దృష్ట్వాతు పాండవానీకమ్.." (1.2) అన్న మాటనుంచి
"నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభువ హ" (2.09) అని,
అర్జునుడు రథము మీద మాటలాడకుండా చతికిలబడడము వఱకు
మనము విన్నది శోకము మోహము .

ఈ శోకమోహాలు పుట్టడానికి కారణము మమత్వమే.
అర్జునుడు "వీరు నావారు" "నేను వీళ్ళవాడను" అన్నభావన వలన భ్రాంతిలో పడ్డాడు.
దీనిలోంచి బయట పడడానికి అంటే
ఈ శోకమోహాల ను అధిగమించడానికి ఆత్మ జ్ఞానమే ముఖ్యము.

అర్జునిని ఉదాహరణగా ఉంచుకొని భవంతుడు లోకసంగ్రహార్థము
ఆత్మ గురించి తన దివ్యమైన ఉపదేశమును మొదలెడతాడు".

శ్రీభగవానువాచ:
"ఆశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే"|
గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||

"అర్జునా ! నువ్వు శోకింప దగని విషయము గూర్చి శోకించు చున్నావు.
పెద్ద పెద్ద మాటలు కూడా చెపుతున్నావు .
జ్ఞానులు మరణించిన వారి గురించి గాని జీవించి యున్న వారిని గురించి గాని దుఃఖింపరు"

ఎందువలన శోకింపరాదు అన్న ప్రశ్నరావచ్చు.

"నత్వేవాహం జాతు నాశం
నత్వం నేమే జనాధిప " (2.12)

అంటే "ముందు నేను లేను అన్నది ,
నువ్వు లేవు అన్నది - లేనే లేదు" - అంటే నిజము కాదు.
"భవిష్యత్తులో కూడా నువ్వు వుంటావు .
మనమందరము కూడా ఉంటాము".

వాళ్ళు నిత్యులు కనక .
వాళ్ళు ఎలానిత్యులు ?

దేహినోఽస్మిన్ యథా దేహే
కౌమారం యౌవ్వనం జరా|
తథా దేహాన్తర ప్రాప్తిః
ధీరం తత్త్ర న ముహ్యతి||(2.13)||

జీవునకు శరీరమందు బాల్య యవ్వన వార్ధక్యములు అను అవస్థలలాగా
మరణానంతరము కూడా వేరొక అవస్థ అనగా వేరొక శరీరము కలుగు చున్నది". .

ఇక్కడ "దేహీ", అంటే దేహములో ఉన్నది అని.
అది జీవుడు అనవచ్చు . అదే ఆత్మ.
ఆత్మ బాల్యావస్థనుంచి యవ్వన యవ్వన వార్థక్యములు దాటి
మరణానంతరము తరువాత మరొక దేహము పొందుతుంది.
అంటే ఆత్మ కి మరణ జననములు లేవు అన్నమాట.

అంటే "దేహీ" అదే ఆత్మ నిత్యము.

ఈ విధముగా ఆత్మ గురించి మొదలుపెట్టి
కృష్ణుడు అర్జునునికి అత్మ యొక్క తత్త్వము గురించి బోధింప సాగెను.

ఆత్మ నిత్యమే అనుకుందాము.
అయితే ఆత్మ పోయింది అనే శోకము లేకపోయినా
ఈ చలి వేడి సుఖ దుఃఖాలవలన దేహమునకు శోకము ఉండవచ్చుకదా అనిపించవచ్చు.

దానికి కృష్ణుడు వాటిని అంటే ఆ శీతోష్ణ సుఖదుఃఖాలను
"తితిక్షస్వ" భరించు అంటాడు ( 2.14)

అయితే భరిస్తే ఏమి ప్రయోజనము అన్న ప్రశ్న మళ్ళీ వెంటనే వస్తుంది
దానికి కృష్ణుడు ఇలా సమాధానము ఇస్తాడు:

శ్రీభగవానువాచ
యం హి న వ్యధయన్త్యేతే పురుషం పురుషషభ|
సమ దుఃఖ సుఖం ధీరం సోsమృతత్వాయ కల్పతే||(2.15)||

"యం హి న వ్యధయన్త్యేతే"
ఇది ముఖ్యమైన మాట.

ఏవరిని అయితే-
"ఏతే" అంటే ఈ శీతోష్ణ సుఖదుఃఖాలు
"న వ్యధయన్తి" - భాధించవో ,
ఇంకా ఎవరు "సమ దుఃఖ సుఖం"-
సుఖాలు దుఃఖాలమీద సమము గా ఉంటాడో
అట్టి వాడు , అంటే అట్టి వివేకము గలవాడు -
మోక్షమున కు అర్హుడవుతాడు.
అది కృష్ణుడు అన్నమాట.

అందుకని కృష్ణుడు అర్జునినికి ఇలా చెపుతాడు

" అర్జునా శబ్ద స్పర్శాది విషయ సంయోగములు అ స్థిరములయి యున్నవి.
కాబట్టి వాటి సుఖ దుఃఖముల యందు సమ భావము కలిగి యుండుము."

అసత్యములైన దేహాదులకు ఉనికి లేదు.
ఎందుకు అంటే పుట్టుకముందు ఆ దేహము లేదు.
అదే దేహము మరణాంతరము లేదు.
అది శాశ్వతము కాదు.
ఆత్మ ఒక్కటి యే శాశ్వతమైనది.

ఈ సమస్త ప్రపంచము పరమాత్మ చే వ్యాపించబడి నాశ రహితమై యున్నది.
ఈ దేహము నకు అంతము కలదు.
కాని ఆత్మకి అంతము లేదు.
అందుకని,
"తస్మాత్ యుధ్యస్వ భారత"(2.18)
అందుకని ఓ అర్జునా శోకము వీడి యుద్ధము చేయుము.

ఆత్మస్వరూపాన్ని ఇంకా విశదీకరిస్తూ కృష్ణుడు ఇంకో మాట చెపుతాడు.

య ఏనం వేత్తి హన్తారం
యశ్చైనం మన్యతే హతమ్ |
ఉభౌ తౌన విజానీతే
నాయం హన్తి న హన్యతే

య ఏనం వేత్తి హన్తారం - ఎవరు ఈ ఆత్మ చంపుతుంది అనుకుంటారో
యశ్చైనం మన్యతే హతమ్ |- ఎవరు ఈ అత్మ చంపబడుతుంది అనుకుంటారో
ఉభౌ తౌన విజానీతే - ఇద్దరికి నిజము తెలియదు.
నాయం హన్తి న హన్యతే - ఆత్మ చంపదు, చంపబడదు.!

యదార్ధముగా ఈ ఆత్మ దేని చేతను చంపబడుట లేదు.
ఆత్మకు చావు పుట్టుకలు లేవు.
ఇది అనాది .
ఆత్మ ఒక శరీరము వదిలి ఇంకో శరీరము చేరును.
ఏలాగ?

"వాసాంసి జీర్ణాని యథావిహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి"||2.22||

"మనుజుడు చిరిగి పోయిన పాత బట్టలను విడచి నూతన వస్త్రములను ధరించు నట్లు
దేహి యగు ఆత్మ శిధిల మైన పాత శరీరము వదలి క్రొత్త శరీరము ధరించు చున్నది".

ఇప్పుడు కృష్ణుడు ఆత్మయొక్క ప్రత్యేకత చెపుతాడు.

"న ఏనం ఛిన్దన్తి అస్త్రాణి" - దీనిని అస్త్రములతో చేదించలేము
"న ఏనం దహతి పావకః" - దీనిని నిప్పు కాల్చలేదు
"న చ ఏనం క్లేదయన్తి ఆపః" - దీనిని నీరుకూడా తడపలేదు
"న శోషయతి మారుతః" - దీనిని మారుతి శోషింపచెయ్యలేడు.
"అయం అవ్యక్తః" - ఇది (అంటే ఈ ఆత్మ) ఇంద్రియములకు గోచరింపనివాడు
"అచిన్త్యః - చింతింప శక్యము కానివాడు
" అవికారః" - వికారము లేని వాడు.

అంటే కృష్ణుడు అన్నమాట
"ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానిది
మనసు చే చింతింప శక్యము కానిది
నిర్వికారముకలది .
అది తెలిసికొని నీవు చింతింప తగదు" అని.

కృష్ణుడు ఆత్మ గురించి ఇంతాచెప్పి,
మళ్ళీ పొనీ ఈ ఆత్మ నిత్యము కాదు అనిత్యమే అనుకుందాము.
అలా అయినాగాని నీవు దుఃఖించడానికి తగదు (2.26).

అథచైనం నిత్య జాతం
నిత్యం వా మన్యసే మృతమ్|
తథాపి త్వం మహాబాహో
నైవం శోచితుమర్హసి||(2.26). ||

ఎందుకు దుఃఖించడానికి తగదు అంటే

"జాతస్య హి ధ్రువో మృత్యుః
ధ్రువం జన్మ మృతస్య చ " ||2.27||

"అర్జునా. పుట్టిన వానికి చావు,
మరణించిన వానికి పుట్టుక తప్పదు".
జననమరణములు తప్పించలేనివి కనుక దుఃఖించ పనిలేదు.

అదేకాదు ఈ ప్రాణులు పుట్టుక పూర్వము మనకు తెలియదు
పుట్టినతరువాత మధ్యలో మనకి కనిపిస్తాయి.
మళ్ళీ మరణము తరువాత మళ్ళీ అగోచరము అవుతాయి.

అంటే దేహము కనపడని స్థితిలోనుంచి వచ్చి
మళ్ళీ కనపడని స్థితిలోకి వెళ్ళాడన్నమాట .
అలాంటి దానిగురించి దుఃఖము ఎందుకు అని.(2.28)

ఈ ఆత్మ అన్నది సులభముగా అందరికీ అర్థము అవ్వదు.
ఈ ఆత్మ కనపడనిది కనుక అందరికీ ఆశ్చర్యమే అవుతుంది (2.29)

"దేహీ" అంటే దేహములో ఉండే ఈ ఆత్మ.
అట్టి ఆత్మ నిత్యము. చంపబడనిది.
దేహమును వధించినా దేహి వధింపబడదు.
అందుకని కూడా దుఃఖము వలదు అని.

అంటే ఇప్పుటి దాకా చెప్పినది అంతా పారమార్థికముగా దుఃఖము వలదు అని.

అయితే ఈ పరమార్థతత్త్వము సంగతి వదిలేసి
ఇంకో విధముగా కూడా ఆలోచించతగును.
ఇప్పుడు కృష్ణుడు అదే చెపుతాడు.

అప్పుడు కృష్ణుడు పారమార్థికముగా కాక
తన స్వధర్మమును అనుసరించి చూచినా
అర్జునుడు తన ధర్మము నుంచి చలించరాదని మళ్ళీ ఇంకో విధముగా చెపుతాడు.

యుద్ధము క్షత్రియ ధర్మము .
యుద్ధము చేసి స్వర్గమును పొందే అవకాశము అదృష్టవంతులకే దొరుకుతుంది.
స్వధర్మము విడిచి యుద్ధము చేయకపోతే అపకీర్తిపొందుతావు.
యుద్ధములో హతమైతే స్వర్గము పొందుతావు.
యుద్ధములో గెలిస్తే ఈ భూమిని అనుభవిస్తావుఅని.
అదే ఈ శ్లోకములో చెపుతాడు.

హతోవా ప్రాప్యసే స్వర్గమ్
జిత్వా వా భోక్ష్యసే మహీం|
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ
యుద్ధాయ కృతనిశ్చయః||2.37||

అంటే స్వధర్మము అయిన క్షత్రియ ధర్మము అనుసరించడమే మంచిది అన్నమాట.
అలాగ స్వధర్మము అనుసరించేవారికి కృష్ణుని ఉపదేశము ఇది-

శ్రీభగవానువాచ:
సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ|
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి ||2.38||

"సుఖ దుఃఖ ములందును జయాపజయము లందును సమ బుద్ధి కలిగి
యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము.
అట్లైన నీవు ఎటు వంటి పాపమును పొందవు " అని చెపుతాడు.

ఈ విధముగా ఆత్మస్వరూప జ్ఞానము చెప్పి,
ఎందుకు శోకించరాదు అన్నమాట సాంఖ్యయోగము ఉపదేశము ద్వారా అర్జునినికి బోధిస్తాడు.

అయితే కృష్ణుడు సాంఖ్యయోగము బోధించి ఆగిపోలేదు.
సాంఖ్యములో బోధించిన ఆత్త్మజ్ఞానము కలగాలి.
ఈ ఆత్మ జ్ఞానము చెపితే లేక వింటే వచ్చే జ్ఞానము కాదు.
వేలకొలది మనుష్యులలో ఒకడికే ఆత్మ సాక్షాత్కారమౌతుంది .
అలా అయితే ఈ జ్ఞానము ఎలా కలుగుతుంది అన్న ప్రశ్న వస్తుంది.

ఆ జ్ఞానము కర్మబంధనములనుంచి బయటపడితే
యోగబుద్ధి ద్వారా కలుగుతుంది.

అందుకే కృష్ణభగవానుడు కర్మ యోగముగురించి అంటే
కర్మ బంధనములనుంచి విడివడగల యోగాన్ని విశదీకరిస్తాడు.

దేనిమీద అయినా ప్రేరణ కలగడానికి ముందు దాని గొప్పదనము తెలియాలి .
అందుకని కర్మయోగము ఎట్లా అనుష్ఠానము చేయ్యాలి అన్నది వదిలేసి,
కృష్ణ భగవానుడు కర్మయోగము యొక్క మహిమ గురించి ఇట్లు చెప్పెను.

అదిమహత్తరమైన విషయము.

శ్రీభగవానువాచ
నేహాభి క్రమనాశోsస్తి ప్రత్యవాయో న విద్యతే|
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ||40 ||

ఈ కర్మయోగములో
అభిక్రమనాశః - ప్రారంభించినది నాశనమగుట ( నిష్ఫలమగుట) లేదు.
ప్రత్యవాయో - దోషము
న విద్యతే - లేదు

అంటే నిష్కామ కర్మ మొదలేట్టితే నిష్ఫలమవ్వడము లేదు.
అస్య ధర్మస్య స్వల్పమపి - ఈ నిష్కామ కర్మ కొంచెము చేసిననూ
త్రాయతే భయాత్ - భయము నుంచి రక్షించును.

ఎంత చిన్నపని నిష్కామము గా చెసినా అది జీవుని సంసారభయమునుంచి రక్షించును.
అంటే నిష్కామ కర్మ చేయునివానికి సంసార బంధనముల గురించి భయము తొలగుట ఒక మహత్తర భాగ్యము.

ఈ కర్మయోగానుష్ఠానమునకు అంటే అనుసరించడానికి నిశ్చయముతో కూడిన బుద్ధి ఒక్కటే కావాలి.

వ్యవసాయాత్మికా బుద్ధి
ఏకేహ కురునన్దన |
బహుశాఖా అనన్తాశ్చ
బుద్ధయో వ్యవసాయినామ్ ||(2.41)||

నిశ్చయముతో కూడిన బుద్ది

అందరికీ ఆ బుద్ధి ఉండకపోవచ్చు అంటూ ఉదాహరణ చెపుతాడు .

"వేదవాదరతాః పార్థ" ! -
"ఓ పార్థా !వేదము లోని కర్మకాండే తప్ప ఇంకో మార్గము లేదు అనేవారికి
కర్మయోగము అనుసరించడానికి కావలసిన "నిశ్చిత" బుద్ధి ఉండదు".
నిశ్చిత బుద్ధి లేనివారి మనస్సు అనంత మార్గాలలో పోతుంది.

యామిమాం పుష్పితాం వాచం
ప్రవదన్త్యవిపశ్చితః
వేదవాదరతాః పార్థ
నాన్యదస్తీతి వాదినః||2.42||

ఫలప్రదముకాని వినుటకు ఇంపైన మాటలు చెప్ప గల అవివేకులు,
వేదములలో ఫలప్రదకర్మలే ముఖ్యము ఇంకోకటి లేదు అనే వారు
- అట్టివారికి యోగమునకు కావలసిన నిశ్చితమైన బుద్ధి వుండదు

కామాత్మనః స్వర్గపరా
జన్మకర్మ ఫలప్రదామ్|
క్రియా విశేషబహుళామ్
భోగైశ్వర్య గతిం ప్రతి|| 2.43||

కామాత్మనః - కోరికలతో నిండిన మనస్సు కలవాళ్ళూ
స్వర్గపరా - స్వర్గమే అత్యుత్తమము అన్న అభిప్రాయము కలవాళ్ళు
భోగైశ్వర్యాల కోసము అనేక కర్మలను చేసేవారు
- అట్టివారికి యోగమునకు కావలసిన నిశ్చితమైన బుద్ధి వుండదు

భోగ ఐశ్వర్యముల ప్రాప్తికోసము అనేక మార్గములు చెపుతారు.
వారు చెప్పే కర్మలు పునర్జన్మలకు కారణం

భోగైశ్వర్య ప్రసక్తానాం
తయాఽపహృత చేతసాం
వ్యవసాయాత్మికా బుద్ధిః
ఏకేహ కురునన్దన||(2.44)||

అలాగ భోగ ఐశ్వర్యములకు ఆకర్షింపబడినవారు
వారి కోరికలతో, తమ బుద్ధి అపహరించ బడిన వారు అవుతారు.
- అట్టివారికి యోగమునకు కావలసిన నిశ్చితమైన బుద్ధి వుండదు. (2.44)

ఇక్కడ వేదవాదరతాః అంటూ వేదములో కర్మ ముఖ్యమనే మాటని విశదీకరిస్తూ
కృష్ణ భగవానుడు ఫలప్రదమైన కర్మలని ఖండిస్తాడు.

వేదముల గురించి తలచి నప్పుడు,
వేదము ఒక మహాసాగరము లాంటిది అని గ్రహించాలి.

వేదాలలో సంహిత, బ్రాహ్మణ, అరణ్యక ,ఉపనిషద అనే భాగములున్నాయి.
ఫలప్రదమైన మాటలు కర్మలు సంహిత బ్రాహ్మణాలలో వింటాము.

అరణ్యకాలు అరణ్యములలో వున్న వానప్రస్థ ఆశ్రమబద్ధులు చేయవలసిన రీతులను విశదీకరిస్తాయి.
ఉపనిషత్తులు వేదాలలో సారము ఆధ్యాత్మిక చింతన కి కావలసిన విధముగా విశదీకరిస్తాయి.
ఇక్కడే ఆత్మ , బ్రహ్మము మోక్షము అన్నమాటలకి అర్థము ఇక్కడే చెప్పబడుతుంది.

పైన చెప్పిన మూడు శ్లోకాలలో వేదాలలోని మొదటి భాగములలోని
కృష్ణుడు ఫలప్రదమైన కర్మలను పూర్తిగా నిరాకరిస్తాడు.

ఇది కొత్తమాట అని పించవచ్చు
వేదాలలో అంతములో అంటే ఉపనిషత్తులలో కూడా ఇలాంటి మాటలు వింటాము.
బృహదారణ్యక ఉపనిషత్తులో బ్రహ్మజ్ఞానము పొందినవాడికి ,
"వేదో అవేదో భవతి" - వాళ్ళకి వేదము అవసరము లేదు అని.
ఆత్మజ్ఞానము పొందినవానికి వేదముల ప్రమేయమే లేదు అని.

శంకరభగవానులు గీత ఉపనిషత్తుల సారము అంటారు.
కృష్ణుడు ఇక్కడ చెప్పినమాటలు ఉపనిషత్తులను అనుసరించే మాటలే.

వేదముల పూర్వ భాగము త్రిగుణాత్మకమైన విషయముల గురించి.
కృష్ణుడు అర్జునునికి అదే మాట చెపుతాడు.

త్రైగుణ్యవిషయా వేదా వేదా
నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వన్ద్వో నిత్య సత్త్వస్థః
నిర్యోగక్షేమ ఆత్మవాన్ || 2.45||

ఇక్కడ కృష్ణుడు
త్రైగుణ్యవిషయా వేదా వేదా - అంటే వేదములు త్రిగుణాత్మకములు

ఓ అర్జునా " నిస్త్రైగుణ్యో భవ"
అంటే నీవు త్రిగుణములను వదలిన వాడవు కమ్ము.
అంతే కాదు.

నిర్ద్వన్ద్వో నిత్య సత్త్వస్థః
నిర్యోగక్షేమ ఆత్మవాన్ || 2.45||

"నిర్ద్వన్ద్వో"- ద్వంద్వములు లేక,
"నిత్య సత్త్వస్థః - ఎల్లప్పుడు సత్త్వ స్థితిలో వుంటూ ,
"నిర్యోగక్షేమ"- యోగక్షేమముల మీద దృష్టిలేకుండా ,
"ఆత్మవాన్"- అత్మ యందే నిలిచిన వాడవు అగుము.

యోగ క్షేమముల మీద దృష్టి వుంటే ఆధ్యాత్మిక చింతన కుదరదు.

"నిర్ద్వన్ద్వో"- "నిత్య సత్త్వస్థః" అలాంటి వాడికి వేదముల విషయాలు అక్కరలేదు.

అదే మాట మళ్ళీ వస్తుంది.

యావానర్థ ఉదపానే
సర్వతః సంప్లుతోదకే |
తావాన్సర్వేషు వేదేషు
బ్రాహ్మణస్య విజానతః||2.46||

ఇక్కడ
సర్వతః సంప్లుతోదకే - సర్వత్ర జలములు నిండి వున్నప్పుడు
యావానర్థ ఉదపానే - నీళ్ళబావితో ఎంత ప్రయోజనమో
బ్రాహ్మణస్య విజానతః - బ్రహ్మజ్ఞానము పొందిన బ్రాహ్మణునికి
తావాన్ సర్వేషు వేదేషు - అన్ని వేదములతో అంతే ప్రయోజనము.

ఈ శ్లోకానికి అనేక రకములుగా చిత్రీకరణ చేయబడినది.
కాని తాత్పర్యము ఇదే అనుకోవచ్చు.

అలా కర్మయోగముగురించి చెపుతూ
కర్మ యోగము యొక్క ముఖ్య సూత్రము సూక్ష్మము గా చెపుతాడు కృష్ణుడు.

శ్రీభగవానువాచ
కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన ||47||

"నీకు కర్మ చేయుట యందే అధికారము కలదు .
కర్మఫలము లందు ఆసక్తి ఉండకూడదు". ఇది చాలా ముఖ్యమైన మాట.

అయితే కర్మఫలములమీదా ఆసక్తి ఉండకోడదు అంటే
మరి కష్టపడి కర్మ చేయడమెందుకూ అని కర్మలే మానకోకూడదు.

కర్మఫలముమీద కోరికతో కర్మ చేయకూడదు.
అయితే కర్మ ఎలాచెయ్యాలి అన్న ప్రశ్న వస్తుంది.
దానికే సమాధానముగా కృష్ణుడు ఇలాచెపుతాడు.

యోగస్థః కురు కర్మాణి
సఙ్గం త్యక్త్వా ధ్నంజయ|
సిధ్యసిధ్యోః సమే భూత్వా
సమత్వం యోగముచ్యతే|

"యోగస్థః - యోగావస్థలో ఉండి( కర్మచెయ్యి)
"సంగం త్యక్త్వా"- కర్మఫలముల పై ఆసక్తిలేకుండా
"సిద్ధ్య అసిద్ధ్యో సమోభూత్వా"- ఫలము సిద్ధించినా సిద్ధించకపోయినా సమముగా భావించి
"కురు కర్మాణి"- కర్మ చెయ్యి !

అంటే కృష్ణుడు అర్జునిడికి ఇలాబోధిస్తాడు
"సమత్వ బుద్ధితో కూడి నీవు నిష్కామ కర్మను చేయుము"అని

ఇంకోమాట చెపుతాడు.
ఫలాపేక్షతో చేసిన కర్మకన్నా
ఫలాపేక్షలేకుండా చేసే కర్మ మహత్తరమైనది.
అందుకని ఫలాపేక్షలేకుండా కర్మచేయగల బుద్ధిని ఆశ్రయింపుము అని.
అంటే సమత్వ బుద్ధి ని శరణు కోరుము అని(2.49)

అయితే సమత్వ బుద్ధితో చేయడము వలన ఫలము ఏమిటి?

బుద్ధి యుక్తో జహాతీహ
ఉభే సుకృత దుష్కృతే |
తస్మాద్యోగాయ యుజ్యస్వ
యోగః కర్మసు కౌశలమ్|| (2.50).||

బుద్ధి యుక్తో జహాతి ఇహ - సమత్వ బుద్ధి కలవాడు పుణ్యపాపములను రెండిటినీ ఈ జన్మలోనే విడుచుచున్నాడు(2.50).
తస్మాత్ - అందువలన
యోగాయ యుజ్యస్వ- అ యోగము కొరకు సిద్ధపడుము !

పుణ్యపాపములను రెండిటినీ ఈ జన్మలోనే విడుచుచున్నాడు
అంటే మోక్షము పొందుచున్నాడు అన్నమాట.

అది ఎలా గ అన్న ప్రశ్న వస్తుంది. దానికి సమాధానము
సమత్వ బుద్ధితో కర్మచేడమువలన సత్త్వశుద్ధి పొందుతాడు.
సత్త్వ శుద్ధి పొంది పరమాత్మ ధ్యానము చేస్తే అప్పుడు ఆత్మ సాక్షాత్కారము.

యదాతే మోహకలిలం
బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గన్తాసి నిర్వేదం
శ్రోతవ్యస్య చ శ్రుతస్య చ||2.52||

యదా తే మోహకలిలం- ఎప్పుడు అజ్ఞాన అంధకారము దాటగలవో ( అప్పుడు)
- అంటే ఎప్పుడు ఆత్మజ్ఞానము పొందెదవో అప్పుడు-
శ్రోతవ్యస్య చ శ్రుతస్య చ - వినతగిన వినిన బోధలయందు -
నిర్వేదము పొందెదవు,

ఇది కూడా వేదో అవేదో భవతి అన్నమాటతో సమానము
ఆత్మజ్ఞానము పోందినవానికి వినతగిన విన్న మాటలతో సంబంధములేదు అన్నమాట.

అదే కృష్ణుడు చెప్పిన మాట
శ్రీభగవానువాచ
యథా స్థాస్యతి నిశ్చలాతదా యోగమవాప్యసి||2. 53||

అంటే
"బుద్ధి ఎపుడూ చలించనిదై
పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నిలచి యుండి సమాధిపొందు నో
అపుడు నీవు ఆత్మ సాక్షాత్కారము నొందగలవు" అని చెప్పును.

అంటే ఇప్పటిదాకా చెప్పినది
త్రిగుణములను దాటి
ద్వంద్వములకి అతీతుడై
అంటే సుఖదుఃఖాలు శీతోష్ణములు సిద్ధి అసిద్ధులకు అతీతుడై
యోగక్షేమాలకి అతీతుడై
ఆత్మలోనే సంతుష్టి పొందుతూ
అన్నిటిలోనూ సమత్వము పొందితే ఆ సమత్వము యోగమనబడును

ఆ సమత్వము పొంది ఆ సమత్వలో శరణు పొందితే
అంటే ఆ సమత్వబుద్ధినే ఆశ్రయిస్తే
పాపపుణ్యములను ఇక్కడే వదిలేసి
ఈ జన్మములోనే యోగము పొందగలవు.

అపుడు అర్జునునికి అట్టి యోగము పొందినవాడు
అంటే ఆ యోగ సమాధిలో నున్నవాని లక్షణములు ఏమి అని సందేహము వచ్చెను.
అదే ప్రశ్నరూపములో వస్తుంది.

అర్జున ఉవాచ:
స్థితప్రజ్ఞస్య కాభాషా
సమాధిస్తస్య కేశవ
స్థితధీః కిం ప్రభాషేత
కిమాసీత వ్రజేత కిమ్||54||

అంటే సమాధియందుండు స్థితప్రజ్ఞు డగు జీవన్ముక్తుని యొక్క లక్షణములు ఏమిటి?
ఎలా మాట్లాడతాడు ? ఏ రీతిగా వుంటాడు ? ఎలాకూర్చుంటాడు ?
అని అర్జునుడు అడుగును

అపుడు శ్రీకృష్ణుడు స్థిత ప్రజ్ఞుని లక్షణములను పద్దెనిమిది శ్లోకాలలో వివరిస్తాడు.

చాలామందికి ఈ శ్లోకాలమీద చాలా భక్తి , ధ్యాస.
వినోబా భావే తన గీతోపన్యాసాలలో
ఈ పద్దెనిమిది శ్లోకాలలో పద్దెనిమిది అధ్యాయాల సారము వున్నది అంటారు.
అందుకని ఆ కాలపు సత్యాగ్రహులు అందరూ ప్రతిరోజూ ఈ పద్యాల పఠించేవారుట.
అదేమాట స్వామీ రంగనాధానందకూడా తమ భగవద్గీత వ్యాఖ్యానములో ప్రస్తావిస్తారు.
గాంధీ గారి ఆశ్రమములో ప్రతిదినము పఠించేవారని.
సత్యాగ్రహులందరూ స్థితప్రజ్ఞుని లాగ నిష్ఠలో వుండాలి అని ఉద్దేశ్యము అన్నమాట.

స్థిత ప్రజ్ఞుని లక్షణములలాగా,
జీవన్ముక్తుని గురించి ఐదవ అధ్యాయములో
భక్తుని గురించి పన్నెండవ అధ్యాయములో
గుణాతీతుని గురించి పద్నాలుగొవ అధ్యాయములో
కృష్ణుని ద్వారా వింటాము.

ఇక స్థితప్రజ్ఞుని లక్షణములు.

శ్రీ భగవానువాచ:
ప్రజహాతి యదా కామాన్
సర్వాన్ పార్థ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్ఠః
స్థితప్రఙః తదోచ్యతే|| ప్రజ్ఞ ప్రజ్ఞ

" ఓ పార్థా !
ప్రజహాతి యదాకామాన్ - కోరికలను వదిలేసిన వాడై ,
ఇక్కడ కోరికలు అంటే మనస్సులో వున్న ఆనీ కోరికలూ అని
అత్మయందే నిర్మల చిత్తముతో సంతృప్తి పొందునో
అట్టివాడు స్థిత ప్రజ్ఞు డు అనబడును.

ఆత్మన్యే వాత్మనా తుష్టః అంటే ఆత్మయందే తృప్తి చెందినవాడు అని.
అట్టివాడికి సుఖదుఃఖాలతో పనిలేదు.
భోగైశ్వర్యాలతో పని లేదు.
పరివారాలతో అసలు పనిలేదు
తన స్థాయిలో లేకపోయినా అందరినీ తనతోనే సమానము గా చూడగలిగినవాడు.
తృప్తిచెందినవాడు అంటే సచ్చిదానంద స్వరూపుడు.
అత్మానుభవము ఇచ్చే ఆనందమే ఆ ఆనందము.

ఆకోరికలు వదిలేసినవాడి గురించి ఇంకా చెపుతాడు.

దుఃఖేషు అనుద్విగ్నమనాః
సుఖేషు విగతస్పృహః |
వీతరాగ భయక్రోధః
స్థితధిః మునిరుచ్యతే|| 2.56||

దుఃఖేషు అనుద్విగ్నమనాః దుఃఖములో వాని మనస్సు చలించదు.
సుఖేషు విగతస్పృహః - సుఖాలలో ఆసక్తిలేవాడు
వీతరాగ భయక్రోధః - అనురాగ బంధములు క్రోధము భయము త్యజించినవాడు
స్థిత ధీః స్థిరమైన మనస్సు కలవాడు - అట్టివాడు స్థితప్రజ్ఞుడు అనబడును.

యః సర్వత్రానభిస్నేహః
తత్తత్ప్రాప్య శుభాశుభం
నాభినన్దతి నద్వేష్ఠి
తస్య ప్రజ్ఙా ప్రతిష్ఠితా|| 2.57||

యః - అంటే ఎవరైతే
సర్వత్రానభిస్నేహః- అన్నిట్లోనూ అభిమానము లేనివాడై
తత్తత్ప్రాప్య శుభాశుభం - శుభాశుభములను పొందిననూ
నాభినన్దతి నద్వేష్ఠి - అనందముపొందడు ద్వేషమునూ పొందడు.
అట్టివాడి ప్రజ్ఞ స్థిరమైనది.

ఇక్కడ భగవానుడు చెప్పినది,
" ( ఎవరైతే) మనస్సునందలి నందలి కొరికలను సంపూర్ణముగా వదలి
నిరంతరము ఆత్మయందే సంతుష్టిని పొందు చుండునో
దుఃఖమునందు కలత సుఖమునందు ఆసక్తి లేనివాడై,
కోరికలు లేని వాడై, ఆ
ప్రియము కలిగినప్పుడు ఆనందము
అప్రియము కలిగి నప్పుడు ద్వేషము లేనివాడు స్థిత ప్రజ్ఞుడు" (2.55-57).

ఆ స్థిత ప్రజ్ఞుని ప్రతిభ ఏమిటి ?

యదాసంహరతే చాయం
కూర్మోఙ్గానీవ సర్వశః|
ఇన్ద్రియాణి ఇన్ద్రియేభ్యః
తస్య ప్రజ్ఞా ప్రతిష్థితా||2.58||

అట్టివాడు తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకోనునట్లు
ఇంద్రియములను విషయములందు ఆశక్తి తొలగించి
ఆ ఇంద్రియములను వెనుకకు మరలుచేయగల వాడు అన్నమాట ( 2.58).
అందుకే వానిని స్థితప్రజ్ఞుడు అందురు.

విషయా వినివర్తన్తే
నిరాహారస్య దేహినః |
రసవర్జ రసోఽప్యస్య
పరం దృష్ట్వా నివర్తతే||2.59||

నిరాహారస్య దేహినః - నిరాహారములో వున్న జీవునకు.
విషయా వినివర్తన్తే - ఆహారము పై కోరికలు నివర్తించును - అయితే రుచి వాసన పోకపోవచ్చు
పరం దృష్ట్వా - బ్రహ్మజ్ఞానము పొందినవాడికి
రసోఽప్యస్య నివర్తతే - ఆ రుచివాసనమీద కూడా కోరికలు వుండవు.

యతతో హ్యపి కౌన్తేయ
పురుషస్య విపశ్చితః|
ఇన్ద్రియాణి ప్రమాథీని
హరన్తి ప్రసభం మనః|| 2.60||

యతతోపి- అంటే యత్నము అంటే ప్రయత్నము చేయుచున్నవాడైన
పురుషస్య విపశ్చితః - అంటే విద్వాంసుడైన పురుషునియొక్క .. మనః మనస్సును
ఇన్ద్రియాణీ హరన్తి - ఇంద్రియములు హరించు చున్నాయి.
ఎలాగ?
ప్రసభం - బలాత్కారముగా

అంటే ఈ ఇంద్రియాలు మహాశక్తికలవి
ఎందుకు- విద్వాంసుడైన పురుషుని మనస్సును బలాత్కారముగా లాగుచున్నవి.
అలాంతి ఇంద్రియాలను వశపరుచుకోగల వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠమైనది.
అదే కృష్ణుడు చెప్పే మాట.

తాని సర్వాణి సంయమ్య
యుక్త ఆసీత మత్పరః|
వసేహి యస్యేన్ద్రియాణి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా||2.61||

తాని సర్వాణి సంయమ్య - ఆ ఇంద్రియములన్నీ వశపరచుకొని
యుక్త ఆసీత - మనస్సు స్థిరత్వము కలవాడై ఉండవలెను
వసేహి యస్యేన్ద్రియాణి - ఇంద్రియములన్నీ వశములో వుంచుకున్న
తస్య - వాని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠమైనది.

ఇప్పుడు స్థితప్రజ్ఞుడు కాని వాడు
అంటేమనస్సు స్థిరత్వము పొందకుండా వున్నవాడిగురించి కృష్ణుడు చెపుతాడు.

ధ్యాయతే విషయాన్ పుంసః
సఙ్గస్తేషూప జాయతే |
సఙ్గాత్ సఞ్జాయతే కామః
కామాత్ క్రోధోభిజాయతే|| ||2.62||

మనుష్యులలో కోరిక ఎలా జనిస్తుంది?
ముందు ఆ విషయము కళ్ళలో పడుతుంది

అది అప్పుడు అలోచనారూపములో మనస్సును ఆక్రమిస్తుంది.
అప్పుడు ఆ మనస్సు బాగుంది అని పించి కావాలని కోరిక పడుతుంది.

అప్పుడు దానికి అడ్డంకులు కలిగితే మనస్సు సహించదు.
ఆ తీర్చబడని కోరికనుంచి క్రోధము చెలరేగుతుంది.
అదే ఈ శ్లోకములో చెప్పబడిన మాట.

క్రోధము అంతటి తో ఆగదు - ఇంకా ముందుకు పోతుంది.

శ్రీభగవానువాచ
"క్రోధాత్ భవతి సమ్మోహః
సమ్మోహాత్ స్మృతి విభ్రమః|
స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో
బుద్ధి నాశాత్ ప్రణస్యతి"||63||

"ఆసక్తి యుండుట వలన జనించిన కొరిక ,
ఆసక్తి తీరకపోవడము వలన కొపము గా మారుతుంది,
కోపమువలన అవివేకము .
అవివేకము వలన మరపు,
మరపు వలన బుద్ధి నాశము .
బుద్ధినాసనము నుండి పూర్తి నాశనము కూడా క్రమముగా సంభ వించు చున్నది"

ఇది త్రిగుణాత్మకమ్ అంటే మూడు గుణముల వలన జరిగే విషయము.
ఇది మానవ ప్రకృతి.
దీనిని అధిగమించి ముందుకు పోవాలి అంటే
కృష్ణుడు అర్జునికి చెప్పినట్లు - "నిస్త్రైగుణ్యో భవ" అవ్వాలి

అలా త్రిగుణములను అధిగమించినప్పుడు
మనస్సుకు శాంతి లభిస్తుంది.
అదే మనము వింటాము కృష్ణుడి ద్వారా.

రాగద్వేషవియుక్తైస్తు
విషయానిన్ద్రియైశ్చరన్|
ఆత్మవస్యైః విధేయాత్మా
ప్రసాదమధిగచ్ఛతి|| 2.64||

విధేయాత్మా అంటే మనస్సు స్వాధీనములో వున్నవాడు
రాగద్వేషవియుక్తైస్తు - రాగద్వేషములను వదిలి ,
ఆత్మవస్యైః - తన వశములో వున్న ఇంద్రియములతో విషయములలో తిరుగుచున్నప్పటికీ
ప్రసాదమధిగచ్ఛతి- మనశ్శాంతి పొందుతున్నాడు..

ప్రసాదే సర్వ దుఃఖానాం
హాని రస్యోపజాయతే|
ప్రసన్న చేతసో హ్యాశు
బుద్ధిః పర్యవ తిష్ఠతే|| 2.65||

ప్రసాదే సర్వ దుఃఖానాం - మనశ్శాంతి వున్నప్పుడు అన్ని దుఃఖములు నాశనమైపోతాయి.
ప్రసన్న చేతసో హ్యాశు - ప్రసన్నమైన మనస్సుతో
బుద్ధిః పర్యవ తిష్ఠతే - బుద్ధి స్థిరముగా వుండును.

నాస్తి బుద్ధిరయుక్తస్య
నచా యుక్తస్య భావనా|
న చా భావయతః శాన్తిః
అశాన్తస్య కుతః సుఖమ్||2.66||

నాస్తి బుద్ధిః అయుక్తస్య - ఇంద్రియ నిగ్రహము లేని వానికి బుద్ది వుండదు
నచా యుక్తస్య భావనా - ఇంద్రియ నిగ్రహము లేని వాలికి ఆత్మ చింతన కలగదు.
న చా భావయతః శాన్తిః - ఆత్మ చింతన లేనివానికి శాంతి వుండదు.
అశాన్తస్య కుతః సుఖమ్ - శాంతి లేని వానికి సుఖము ఎక్కడ?

ఇన్ద్రియాణాం హి చరతాం
యన్మనోఽనువిధీయతే|
తదస్య హరతి ప్రజ్ఞాం
వాయుర్నావ మివామ్భసి||2.67||

ఇంద్రియములను అనుసరించి పోవు మనస్సు
తదస్య హరతి ప్రజ్ఞాం - వాని వివేకమును హరించును . ఎలాగ?
వాయుర్నావ మివామ్భసి- నీటిలో వున్న పడవను గాలి ఈడ్చుకుపోయినట్లు.

తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః |
ఇంద్రియాణీ న్ద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||2.68||

ఓ అర్జునా (మహాబాహో) ఎవరి ఇంద్రియములు విషయములనుంచి నిగ్రహింపబడినవో ;
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా - అట్టి వాడి ప్రజ్ఞ పటిష్ఠ మైనది.

ఇంద్రియములు వశములో లేనివాడు సుడిగాలిలో చిక్కుకున్న నీళ్ళలోని నావ తో పోల్చి,
ఇంద్రియములు వశములో వున్నవాడి ప్రజ్ఞ పటిష్ఠ మైనది అని చెప్పి,
కృష్ణుడు ఒక అలంకారిక భాషలో యోగులకు సామాన్య జనులకి భేదము చెపుతాడు.

యా నిశా సర్వభూతానాం
తస్యాం జాగర్తి సంయమీ|
యస్యాం జాగ్రతి భూతాని
సా నిశా పశ్యతే మునేః||2.69||

యా నిశా సర్వభూతానాం - ఏది సమస్తభూతములకు అంధకారమయమో
తస్యాం జాగర్తి సంయమీ - అది అన్నీ వశములో వున్నవాడికి (మునికి) పట్టపగలు
అంధకారము అజ్ఞానము ఒకటే

యస్యాం జాగ్రతి భూతాని -సమస్త భూతములకు ఏది పట్టపగలో - అంటే అది పట్టపగలులో జరిగే జనుల కార్యక్రమము
సా నిశా పశ్యతే మునేః - ఆ పట్టపగలులో జరిగే కార్యక్రమాలు మునికి ఆజ్ఞానమయముగా కనిపిస్తాయి.
ఆ పట్టపగలులో జరిగే కార్యక్రమాలు విషయ భోగాలు అవి మునికి ఆజ్ఞానమనే తెలుసు.

అపూర్వమాణం అచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్|
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే
స శాన్తిమాప్నోతి న కామ కామీ|| 2.70||

ఏ విధముగా
అపూర్వమాణం అచలప్రతిష్ఠం - జలములతో నిండిన స్థిరమైన
సముద్రమాపః ప్రవిశన్తి - సముద్రములో నదీజలములు ప్రవేశించునో ( ఆ విధముగా..)

ఇక్కడ తెలియవలసినమాట
అంటే ఆ స్థిరమైన సముద్ర జలములలో భీభత్సముచేసిన నదీ జలములు ప్రవేశించినా
సముద్రము స్థిరముగానే వుంటుంది.

ఆవిధముగా ఏ మనుజుని లో భోగవిషములన్నీ ప్రవేశించి
నదీ జలము లు సముద్రములో అణిగి పోయినట్లు వాడి మనస్సులో అణిగిపోతాయో
స శాన్తిమాప్నోతి - అట్టి మనుష్యుడు శాంతిని పొందును.
న కామకామీ - కామపూరితుడైనవాడు అలాంటి శాంతిని పొందడు.

విహాయ కామాన్ యః సర్వాన్
పుమాంచరతి నిస్పృహః|
నిర్మమో నిరహంకారః
సశాన్తిమధిగచ్ఛతి|| 2.71||

'విహాయ కామాన్ ' - కోరికలన్నిటినీ విడిచి,
'పుమాంచరతి నిస్పృహః'- ఏ మనుష్యుడు ఆసక్తి లేనివాడిగా తిరుగుచున్నాడో
'నిర్మమో నిరహంకారః' - అతడు మమత అహంకారములను విడిచి
'సశాన్తిమధిగచ్ఛతి'- శాంతి పొందుచున్నాడు. .

ఎవరైతే మమత అహంకారములను విడిచి కోరికలన్నీ విడిచి విషయములపై ఆసక్తి లేకుండా ఉంటాడో
ఆట్టి వాడు సాంతిని పొందుచున్నాడు.
" నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి.

కృష్ణుడు ఇంద్రియనిగ్రహము , విషయత్యాగము, ఆత్మచింతన వున్నవారికి అవి లేనివారికి కల భేదాలు ఇలా వివరిస్తాడు .

మనోనిర్మలత్వము కలిగిన మనుజునకు సమస్త దుఃఖములు ఉప శమించు చున్నవి
ఆత్మ చింతన లేని వానికి సుఖము లభించదు.
" నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి"
అనగా ఇంద్రియనిగ్రహము విషయనిత్యాగము
అహంకార మమకార రాహిత్యము తో శాంతిని పొందును.

మళ్ళీ ఇంద్రియ నిగ్రహము లేని వారిగురించి చెపుతూ-
ఇంద్రియాల వెంట పడే నిలకడలెని వారి మనస్సు బుద్ధిని వెనక్కి లాగుతూ ఉంటుంది.
ఇంద్రియ నిగ్రహము ఉన్నవారి ప్రజ్ఞ ప్రతిష్ఠ మౌతుంది.

ఎవరికి శాంతి లభిస్తుంది అన్న మాట చెపుతూ
కోరికలు ఎవరిలో చేరిపోతాయో వారు శాంతి పొందుతారు.
కోరికలు కోరుకునే వాడికి కాదు అని.

అలాగే అన్ని భోగాలను వదిలి దేనిని కోరక
అహంకారము మమకారములు లేక సంచరించే వాడు శాంతి పొందుతాడు అని.

"ఇంద్రియనిగ్రహము విషయనిత్యాగము
అహంకార మమకార రాహిత్యము మొదలైనవి సాధన చేయుచూ రాగా
జీవ బ్రహ్మైక్యము సిద్ధించును
కీటకము బ్రమరముగా మారు విధముగా జీవుడు బ్రహ్మస్వరూపుడై వెలయును"

ఈ విధముగా శ్రీకృష్ణుడు సాంఖ్యయోగము , కర్మయోగము
తరువాత సన్యాస యోగమును కూడా అర్జునినకు బొధించెను.

నిజ జీవితములో కూడా మనుజుడు ఒక్కొక్క సమయమున
తన ఎదురగు సమస్యలతొ పోరాడ లేక అధైర్యము పిరికితనము నకు లొనయి
చేతకాని వలె యగుట సహజము

ఆసమయమున నీరస మావహించి యుండును.
దిక్కుతోచని స్థితి ఏర్పడును.
ఏపని చేయ వలెనో నిశ్చయముగ తెలియని స్థితిలో నుండును.
అట్టిసమయమున శ్రీ కృష్ణుని బోధ ఎంతయో ఉపకరించును

ఈ సమస్యల గురించి మనము శోకించుట తగదు.
ఏ కార్యములకైననూ మనము నిమిత్తమాత్రులమే కనుక
ఫలితమును ఆశించక ధర్మము నిరవేర్చు దిశగా కార్యము సానుకూలపరచు కొనుట ఉత్తమము.

శరీరము యొక్క అశాశ్వతత్వమును మాటి మాటికి తలచుకొను చుండిన
సమస్య యొక్క తీవ్రత బలహిన పడును.
ఆత్మ ఒక్కటియే శాశ్వత మైనదని మననము చేసికొనవలెను.

సమస్యల వలయములో అంటే సమస్యలలో చిక్కు బడి నప్పుడు
పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నుండుటకు గట్టి ప్రయత్నము చేయ వలెను
అప్పుడు మనస్సు యొక్క చంచలము ఆగి ,
మనో నిర్మలత్వము కలిగి సమస్యలు పరిష్కరించుటకు కావలసిన ధైర్యము శాంతియు లభించును .

|| ఓమ్ తత్ సత్ ||
శ్రీభగవానువాచ:
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాsస్యా మన్తకాలేsపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి||72||
" ఇది అంతయూ బ్రహ్మసంబంధమైన స్థితి . దీనిని పొందివాడు మరల మోహపడడు.అంత్యకాలమందు కూడా ఇట్టి స్థితియందున్నవాడు బ్రహ్మానందమును పొందుచున్నాడు"
|| ఓమ్ తత్ సత్ ||

 


".

 

 

.