||భగవద్గీత ||

||ఐదవ అధ్యాయము ||

||కర్మ సన్న్యాస యోగము- వచన వ్యాఖ్యానము ||


|| ఓమ్ తత్ సత్||
అర్జున ఉవాచ:
సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి|
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్||
" హే కృష్ణ ! కర్మలయొక్క సన్న్యాసము మఱల కర్మయోగమును ప్రశంసించుచున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమైనదో బాగుగ నిశ్చయింపబడిన అట్టి ఒక్క దానిని నాకు చెప్పుము"

భగవద్గీత
ఇదవ అధ్యాయము
కర్మ సన్యాస యోగము:
శ్రీకృష్ణపరబ్రహ్మనే నమః

కృష్ణుడు రెండు మూడవ నాలుగొవ అధ్యాయాలలో సాంఖ్యయోగము బుద్ధియోగము అంటూ జ్ఞాన యోగమును బోధించాడు. సాంఖ్యయోగములోనే నిష్కామకర్మగురించి చెపుతూ కర్మయోగమును కూడా ప్రతిపాదించాడు. మూడవ అధ్యాయము అంటే కర్మయోగము మొదటి శ్లోకములో అర్జునుడు - "జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిః జనార్దన "!(3.01) - అంటూ కర్మకన్నా జ్ఞానము శ్రేష్ఠమా అన్నట్లుగా అడుగుతాడు. అప్పుడు కర్మలేకుండా ఏమీ అవదు ( న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠతి అకర్మకృత్ :3.05) అంటూ నిష్కామకర్మ విశిష్ఠత, అలాగే కర్మయోగము అనుసరించే "జనకాదయః.." జనకులు మొదలగు వారు మోక్షముపొందారు, అలాగే నీవు కూడా నీ ధర్మమును అనుసరించి యుద్ధము చేయుము అని చెప్పుతాడు. చివరికి ఇదే ( నిష్కామకర్మయే) నా మతము అంటూ( యే మే మత మిదం..3.31) ఇది ఎవరు అనుసరిస్తారో వాళ్ళకి కర్మబంధము ఉండదూ అని కూడా చెపుతాడు.

ఆంటే కర్మయోగమే శ్రేష్ఠమని.

అప్పుడు అర్జునుడు అన్నీ తెలిసి కూడా జనులు పాపములు ఎందుకు చేస్తారు (3.36) అని అడిగితే , కృష్ణుడు మనుష్యుని ప్రకృతి , ఆ ప్రకృతి వలన కలిగే కోరికలు , ఆ కోరికలను అణగదొక్కడానికి కావలసినది బుద్ధి అంటూ బుద్ధి యోగము గురించి అంటే జ్ఞానయోగము గురించి చెపుతాడు. ఇక్కడ జ్ఞానయోగముయొక్క విశిష్ఠత కూడా చెపుతాడు.

నాలుగొవ అధ్యాయములో అంటే జ్ఞానయోగములో కర్మయోగము ( నిష్కామకర్మ) చాలా పురాతనమైనది అది కాలప్రవాహములోఅందరూ మరచిపోయారు కనక తను మళ్ళీ బోధిస్తున్నట్లు కూడాచెప్పుతాడు. ఆ కర్మనే జ్ఞానావస్థలో ఉండి యజ్ఞములా చేస్తే ఆ కర్మ బంధములు కలిగించదు అని చెప్పి అప్పుడు యజ్ఞములగురించి అర్జునిడికి విశదీకరిస్తాడు. ఆ విశదీకరణలో సామాన్య మానవులు చేయగల పన్నెండు యజ్ఞములను గురించి చెప్పి మళ్ళీ వాటిలో జ్ఞాన యజ్ఞము అన్నింటిలో ఉత్తమమైనది ( నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే) అని చెపుతాడు. జ్ఞానముగురించి అధికముగా చెప్పడము వలన ఈ అధ్యాయానికి జ్ఞాన యోగమని పేరు వచ్చినది

ఇదంతా వినిన తరువాత అర్జునిడికి సందేహము వస్తుంది మళ్ళీ కర్మయోగమా జ్ఞానయోగామా అని!

ఆ సందేహమే ఇదవ అధ్యాయానికి మొదలు !
అర్జున ఉవాచ:
సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి|
యత్ శ్రేయః ఏతయోః ఏకం తన్మే బ్రూహి సునిశ్చితమ్||1||
అంటే -
"ఓ కృష్ణా ! కర్మణాం సన్న్యాసం" కర్మలను త్యాగము చేయుట, మళ్ళీ
" యోగం చ" అంటే కర్మ యోగమును ఆచరించుట
"శంససి" ప్రశంసించుచున్నావు
- "ఈ రెండిటిలో నాకు ఏది మంచిదో అది ఓకటి చెప్పు!" అది అర్జునుడు అడిగిన ప్రశ్న.

ఇక్కడ కర్మ సన్న్యాసము అంటే జ్ఞానముతో కూడిన కర్మ సంన్యాసము అంటే జ్ఞాన యోగము అని అర్థము. జ్ఞానయోగము పొగడుతూ జ్ఞానయోగములో నిష్ఠ కలిగిన అత్మజ్ఞానికి కర్మలతో అవశ్యకత లేదని కృష్ణుడు చెప్పాడు (" నైవ తస్య కృతేనార్థో నాకృతే నేహ కశ్చన" 3.18) . మళ్ళీ నిష్కామ కర్మను పొగడు తూ నిష్కామకర్మ తన సిద్ధాంతమని ( యేమే మతం ఇదం.. 3.31 ) అని కూడా చెప్పడము తో అర్జునిడికి అ సందేహము వస్తుంది.

అప్పుడు కృష్ణుడు "సన్న్యాసః కర్మయోగః చ " అంటే రెండూ విధానాలు కూడా "నిశ్శ్రేయసకరౌ " శ్రేయస్సును కలిగించునవి. అంటే మోక్షమును కలుగ చేయును అని . ఆవిధముగా రెండు మార్గములూ ఒక చోటకే దారితీస్తాయి అన్నమాట . అయితే ఈ రెండిటిలో అంటే ’కర్మ సంన్యాసాత్’ కేవలము కర్మ సంన్యాసముకన్నా ’కర్మయోగో విశిష్యతే’ కర్మ యోగము ఉత్తమమైనది అని చెపుతాడు. అంటే జ్ఞానరహితమైన కర్మ సంన్యాసము కన్నా కర్మయోగమే మేలు అని అంతున్నాడన్నమాట.

అయితే కర్మయోగి కూడా , ఎవరైతే దేనినీ కోరడో దేనినీ ద్వేషించడో అటువంటి వాడు కర్మలను చేస్తున్నా అతడు నిత్య సన్న్యాసి అని తెలిసికో అంటే కర్మయోగి ( ఎవరైతే దేనినీ కోరడో ..) కూడా సన్న్యాసి యే అని అన్నమాట.

కాని ఈ రెండూ వేరుకాదు అని చెప్పడానికి కృష్ణుడు ఇంకా ఇలా అంటాడూ:

"సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదన్తి న పణ్డితాః|" (5.04)
ఈ రెండూ వేరు అని " బాలాః" అంటే ఏమీ తెలియని వారు అంటారు.
"న పణ్డితాః " - పండితులు అనరు.
ఎందుకంటే రెండింటి గమ్య స్థానము ఒకటే.
సాంఖ్యులు పొందే స్థానము కర్మయోగముద్వారా పొందబడే స్థానము ఒకటే.

మరి ఇంకోమాట:-
"ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి స పశ్యతి" (5.05)
"జ్ఞానయోగమునూ కర్మయోగమునూ ఎవడు ఒకటిగా చూచుచున్నాడో వాడే నిజముగా తెలిసికొనిన వాడు ( స పశ్యతి !)

నిజానికి కర్మ యోగముతో చిత్తశుద్ధి పొంది తద్వారా జ్ఞానయోగము పొందవచ్చు. కర్మయోగము యొక్క సహాయము లేకుండా జ్ఞానయోగము పొందుట కష్టము.

కర్మయోగమును అనుసరించే వాడికి ముందు అంతః కరణ శుద్ధి అవుతుంది.దేహము ఇంద్రియాలు వశము అవుతాయి. వాడికి సమస్త భూతములలో బ్రహ్మనే చూస్తాడు.

అంటే్ కర్మయోగి కూడా
- నిర్మలహృదయముకలవాడు ( విశుద్ధాత్మ)
- మనస్సును జయించినవాడు ( విజితాత్మ)
- ఇంద్రియములనుజయించినవాడు ( జితేంద్రియః)
- సర్వభూతములయందు అత్మయూ తనయందున్న ఆత్మయూ ఒకటే అని భావించువాడు (సర్వభూతాత్మ భూతాత్మా) .

అలాంటి వానికి కర్మలు చేసినా కూడా కర్మబంధము కలుగదు.(5.07)

నిష్కామకర్మ చేస్తే చాలుగదా ఇంకా ఇవన్నీ ఏమిటీ అని అనుమానము రావచ్చు.

నిష్కామకర్మ ప్రథమ సోపానము. నిష్కామ కర్మచేస్తూ సుఖ దుఖములను సమానముగా చూచుటకు నిర్మలహృదయము కావాలి. ఆ కర్మ ఫలములందు ఆసక్తి వుండకుండా వుండడము కోసము విజితాత్మ అంటే మనస్సు ను జయించినవాడు అవ్వాలి. జితేంద్రియుడు అన్నీ ఇంద్రియములను జయించినవాడు అవ్వాలి. అంటే ఇవి కొత్తమాటలు కావు. సర్వభూతములయందున్న ఆత్మ తన ఆత్మ ఒకటే అన్నదే ఆత్మజ్ఞానము.

ఈ లక్షణములు ఉంటే అట్టివాడు ఆత్మజ్ఞానము పొందిన వాడు.

అటువంటి వాడు దైహిక కర్మలు అన్నీ అంటే చూస్తూ వింటూ తాకుతూ వాసన చూస్తూ తింటూ, నడుస్తూ, నిదెరిస్తూ , గాలిపీలుతూ,మాట్లాడుతూ కళ్ళు త్రుస్తూ మూస్తూ తదితర దేహ కర్మలు చేస్తూ , అవి చేస్తున్నా వాటికి తనే కారణమనే కర్తృత్వము లేకుండా భగవదర్పణమే చేసి కర్మలకి అతీతుడుగానుండును(5.08, 5.09)

వాడు ఆత్మజ్ఞాని కనుక వాడు కర్మలకి అతీతుడు.
మరి అటువంటి ఆత్మ జ్ఞానము అందరికి ఉండకపోవచ్చు. అప్పుడు కర్మ యోగము అనుసరించే వాడి కథ ఏమిటీ అన్నప్రశ్న రావచ్చు.
కర్మమయోగాను సారముగా ఎవడు ఫలాపేక్షలేకుండా తాను చేయు కర్మలను పరమాత్మకర్పించి ఆచరణ చేస్తున్నాడో వానికి పాపము అంటదు. , ఉదాహరణ తామరాకు నీటిచే అంటబడనట్లు పాపము వానిని అంటదు.

ఈ యోగములో ఉన్నవాడు ( యుక్తుడు) కర్మఫలమును విడిచిపెట్టి నిష్ఠతో చేసిన కర్మలవలన శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. నిష్ఠతో చేసిన కర్మలవలన శాఅశ్వతమైన శాంతి పొందుతున్నాడు అంటే ఆ కర్మలద్వారా సత్త్వ శుద్ధి, జ్ఞానప్రాప్తి, సర్వకర్మ సన్న్యాసము జ్ఞాన నిష్ఠ కలిగి శాశ్వతమైన శాంతి పొందుతున్నాడు అన్నమాట.

అయితే అలాంటి వాడు కానివాడికి ఏమౌతుంది? అంటే అయుక్తుడికి ఏమిటి అవుతుంది.
అయుక్తుడు అంటే ఫలముల వెనకే పరిగెత్తేవాడు. అట్టివాడు ఫలముల మీద ఆసక్తి తో అలాగే పరుగిడుతోనే వుంటాడు (5.12).
అందుకని మనము యుక్తుడి మార్గములోనే పోవలెను.

మరి ఆత్మజ్ఞానము కలవాడు మనసా కర్మలు అన్నిటినీ సంన్యసించి తన ఇంద్రియాలన్నీ వశములో ఉంచుకొని ఆ దేహి తన శరీరములో ఏమీ చేయకుండా చేయించకుండా సుఖముగా ఉంటాడు.

ఇక్కడ కృష్ణ భగవానుడు ఇంకో సత్యము చెపుతాడు.

శ్రీభగవానువాచ
"నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |
న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే ||"(5.14)

అంటే - "కర్తృత్వముగాని ,కర్మలతో గాని , కర్మఫలములతో సంబంధము గాని భగవంతుడు కలుగచేయుటలేదు. అవన్నీ మనుష్యుని ప్రకృతి వలన నే ఆ సంబంధములు కలుగుతాయి".

శ్రీభగవానువాచ
నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః | (5.15)
అంటే - " పరమాత్మ ఎవరియొక్క పాపము గాని పుణ్యముగాని స్వీకరింపడు "

అంటే కృష్ణభగవానుడు చెప్పినది మన పాపపుణ్యాలు మనచేతిలోనే ఉన్నాయి. మన పాప పుణ్యాలకి భాధ్యత మనదే. జితేంద్రియులమై విజితాత్ములమై నిష్కామకర్మ చేస్తే "శాంతిమాప్నోతి నైష్ఠికీం" అన్నట్లు మనకు దొరికేది శాంతి !!

శాంతి తో లభించేది మోక్షము . కృష్ణుడు మళ్ళీఆ మోక్షానికి ముఖ్యము ఎమిటి అని చెపుతాడు: -
శ్రీభగవానువాచ
"తద్బుద్ధయ స్తదాత్మాన స్తన్నిష్ఠా స్తత్పరాయణాః |
గచ్ఛన్త్యపునారావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః "||17||
తత్ బుద్ధయః - ఆ పరమాత్మయందే బుద్ధి కలవారు
తత్ ఆత్మానః - అ పరమాత్మయందే మనస్సుగలవారు
తత్ నిష్ఠాః - ఆ పరమాత్మయందే నిష్ఠ గలవారు
తత్ పరాయణః - ఆ పరమాత్మయందే శ్రద్ధ గలవారు

అట్టివారు జ్ఞానముచే తనలోని కల్మషమును నాశనము చేసినవారై -
"అపునరావృత్తిం" పునర్జన్మ లేని స్థితిని
అంటే మోక్షమును పొందుచున్నారు ( 5.17).

పరమాత్మ ఆత్మ రెండూ ఒకటే అయినప్పుడు మనకి తెలిసేది ఆత్మయందే బుద్ధి నుంచి , ఆత్మను గురించే చింతన చేయుచు, ఆత్మయందే మనసును సంలగ్నమొనర్చి, ఆత్మయందే నిష్టగలిగి, ఆత్మ పరాయణుడై యుండుట ద్వారా ఆత్మజ్ఞానము లభించును. అదియే జ్ఞానయోగము.

అయితే జ్ఞానులలో ముఖ్య అంశము సమత్వము.

విద్య, వినయము గలిగియున్న బ్రాహ్మణునియందును, గోవు నందును ఏనుగు కుక్క యందును, కుక్క మాంసము వండుకొని తిను ఛండాలుని యందును సమ దృష్టి కలిగినవారే జ్ఞానులు( 5.18).

విద్య కలవారైనా అవిద్యకలవారైన, గోవు అయినా కుక్క అయినా, బ్రాహ్మణూడైన చండాలుడు అయినా - ఆత్మ జ్ఞానముకల జ్ఞానులకు కనపడేది వారిలో నున్న ఆత్మయే.

అదే సమత్వము

ఆ సమత్వము వుంటే -
"ఇహైవ తైర్జితః స్సర్గో యేషాం సామ్యే స్థితం మనః "(5.19)
వాళ్ళు ఇక్కడే (జితః సర్గః) సంసారమును జయించిన వారు అవుతారు !

బ్రహ్మము అన్నది - "నిర్దోషమ్ హి సమం బ్రహ్మ" - దోషములేకుండా వుండడము సమత్వము కలిగి ఉండడము. మనుష్యుడు ఏప్పుడైతే సమత్వము కలిగివుంటాడో అప్పుడు ఆ మనుష్యుడు బ్రహ్మముతో సమానమైన స్థితిలో ఉంటాడన్న మాట.

ఆత్మ జ్ఞానముకలిగి సమత్వముతో వున్నవాడు బ్రహ్మజ్ఞాని.

బ్రహ్మజ్ఞాని స్థిరమైన బుద్ధి గల వాడై, శబ్దాది విషయములందాసక్తి లేని వాడై, శరీరమును విడుచుటకు పూర్వమే కామ క్రోధాదుల వేగమునరికట్టి, బ్రహ్మ స్వరూపుడై అనంతమైన సుఖమును బొందుచున్నాడు (5.23).

పాప రాహిత్యము, సంశయరాహిత్యము, ఇంద్రియ మనో నిగ్రహము, సర్వభూతదయ అను లక్షణములు గలిగిన వారు ఋషులు. ఆ ఋషులు ఆత్మజ్ఞానముతో సమత్వముతో బ్రహ్మము యొక్క స్థితి అంటే మోక్షము బడయుచున్నాడు.(5.25)

ఎవడు ఇంద్రియములను శబ్దాది విషయముల పైకి పోనీయక, చూపును భ్రూ మధ్యమున నిలిపి, నాసికయందు సంచరించు ప్రాణాపాన వాయువులను సమముగా జేసి, ఇంద్రియ మనో బుధ్ధులను నిగ్రహించి, ఇఛ్ఛా, భయ క్రోధములు లేని వాడై మోక్షమునందాసక్తి కలవాడై, మన శీలుడై, యుండునో అట్టివాడెప్పుడును మోక్షకుడేయగును (5.27;28).

కృష్ణుడు ఈ విథముగా సమత్వముతో మొదలుపెట్టి ఆత్మజ్ఞానము కలవారు , ఋషులు , జితాత్ములు జితేంద్రియులు అగు యత్నశీలురు కూడా మోక్షము పొందెదరు అని చెప్పి ఆఖరి శ్లోకములో దైవ అరాధనాయజ్ఞము చేసినా మోక్షము కలుగుతుంది అని చెపుతాడు.

శ్రీభగవానువాచ
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం|
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి ||5.29||

అంటే భగవంతుడు సమస్త యజ్ఞములకు భోక్త, సమస్త లోకములకు ప్రభువు, నియంత, సర్వజీవులకు ఆప్త మిత్రుడు, హితకారియని తెలినికొని, భక్తితో అతనిని ఆరాధించి, ధ్యానించుటయే శాంతికి మార్గము. ఆంటే కర్మయోగము జ్ఞానయోగమే కాకుండా భక్తితో గూడా శాంతికి మోక్షమునకు మార్గము అని.

కర్మ చేయకుంటే బంధముండదు కదాయని కర్మ చేయక ఊరకుండుట అవివేకము. కర్మమును వదలరాదు కర్మయొక్క ఫలితమందు ఆశను వదలవలెను. కొన్ని సమయములందు మన కష్టములను, బాధలను తలచుకొని, భగవంతుడికి నా మీద దయ లేదు, నాకే ఇన్ని బాధలనిచ్చినాడని భగవంతుని దూషించుదుము. అది సరి కాదు. మన పాప, పుణ్యములతో ఆయనకెటువంటి బాధ్యత, సంబంధములేదు. ఈ విషయమును స్పష్టముగా అవగాహన చేసుకొనవలెను.

లౌకిక విషయములందాసక్తి తగ్గించుకొనుచు ఇంద్రియ నిగ్రహమును పొందవలయును. ఒక వస్తువు గురించిగాని విషయము గురించిగాని మోహనమునకు గురియగునపుడు ఆ విషయమంత ఆవశ్యకమా? అని యోచించవలెను. ఈ విధముగ ఇంద్రియ నిగ్రహమును సాధన చేయువలెను.

వస్తుసేకరణకు, లౌకిక విషయ సేకరణకు మనసు తొందరపడునపుడు, మెల్లగ బుజ్జగించి ఆ బాహ్య వస్తువులో ఆనందము లేదనియు, ఆనందమనునది మనసుకు సంబందించిన విషయమనియు గ్రహింపవలెను. ఉదా: ఒక వ్యక్తికి మామిడి పండు చాలా ఇష్టము కనుక దానిని తినుట వలన తనకు ఆనందము, తృప్తి కలుగునని భావించును. అందుచే కొన్ని రుచిగల మామిడి పండ్లు కొనెను. ఒక పండు తినెను. బాగున్నదని సంతోషించెను. రెండవ పండు తినెను, మొదటి పండు తిన్నప్పుడు కలిగినంత సంతోషము కలుగలేదు. మూడవ పండు తినెను అసలు సంతోషమే కలుగలేదు. నాల్గవ పండు తినగ కొంచెము వికారము కలుగుట మొదలయ్యెను. మరియొక పండు తినుటకతడు పూర్తిగ నిరాకరించెను.

పై విషయములను బట్టి మనము తెలిసికొనవలసిన దేమనగా, ఆనందము, తృప్తి, సంతోషము యనునది బాహ్య వస్తువునందు, విషయమునందు లేదు. ఆనందమనునది నిజముగ మామిడి పండుయందున్న యెడల నాలుగు పళ్ళు తినిన తరువాత ఆనందము నాలుగింతలుగ పెరగవలెను. కానీ, అట్లు జరుగక దానికి వ్యతిరేకముగా జరుగుచున్నది. కనుక మన జీవితములో వస్తువుల నుండి గాని, విషయముల నుండి గాని, కొంత సుఖమును పొందినను అది అత్యల్పము, అతి స్వల్పకాల ముండునది మాత్రమేయని మనము బాగుగా గ్రహించవలెను.

మోక్ష ప్రాప్తికి ఉపాయములు సబ్దాదివిషయత్యాగము ఏకాగ్రతతో ధ్యానము ప్రాణాయామము ఇంద్రియమనోబుద్ధుల నిగ్రహము మననశీలత్వము మోక్షపరాయణత్వము కామక్రోధభయరాహిత్యము మొదలయినవి కావలయును .

బ్రహ్మ సాయుజ్యరూపక మోక్షము ఋషులు పొంద గలరు . ఋషియనగా అది ఒక మహోన్నత పదవి. ఒక డిగ్రీ . కొంతకాలము అనవరత సాధన చేసి ఆరితేరిన మానవుడు సామాన్యముగా నుండడు భగవంతుడే అయిపొవును. కావున పాపరాహిత్యము సంశయములు ద్వంద్వములు లేనివారు, ఇంద్రియనిగ్రహము కలిగినవారు సర్వ భూతహితము ఆచరించు వారు, ఋషులు బ్రహ్మసాయుజ్యమును పొందుదురు. మానవుడు శాంతిని పొందవలెనన్న భగవంతుని చక్కగా తెలుసు కొని భక్తి తో ఆరాధించుట ధ్యానించుట చేయ వలెను. సమస్త లోకములకు నియంత, తపస్సునకు యజ్ఞమునకు భోక్త, సర్వజీవులకు ఆప్త మిత్రుడు హితకారి అగు భగవంతుని ధ్యానించవలయును.

||ఓం తత్ సత్||
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం|
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి ||5.29||
"యజ్ఞములయొక్కయూ తపస్సులయొక్కయూ ఫలములను అనుభవించువాడిగనూ సమస్త లోకములయొక్క ఈశ్వరుడిగనూ సమస్త ప్రాణుల హితకారిగనూ నన్నెఱిగి మనుజుడు శాంతిని పొందుచున్నాడు "
|| ఓమ్ తత్ సత్ ||