||భగవద్గీత ||

||ఎనిమిదవ అధ్యాయము ||

||అక్షరపరబ్రహ్మ యోగము- వచన వ్యాఖ్యానము ||

|| ఓమ్ తత్ సత్ ||
భగవద్గీత
ఎనిమిదవ అధ్యాయము
అక్షరపరబ్రహ్మ యోగము
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

విజ్ఞాన యోగములో " సాదిభూతాధి దైవం మాం సాధియజ్ఞం చ యేవిదుః " అంటూ అధిభూత అధిదైవము అధియజ్ఞములతో కూడిన నన్ను ( బ్రహ్మమును) ఎవరు తెలిసికొనుచున్నారో వారు నన్ను చివరి క్షణాలలో కూడా తెలిసికొని వుంటారు అని చెపుతాడు. అది విన్న తరువాత అర్జునుడికి సందేహము వస్తుంది. అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము ఇవన్నీ ఏమిటీ అని. ఆ ప్రశ్నతోనే ఈ అక్షర పరబ్రహ్మ యోగము మొదలగుతుంది. అక్షరము అంటే నాశనములేనిది. అక్షరపరబ్రహ్మము అంటే నాశనములేని బ్రహ్మము గురించి అని.

అర్జున ఉవాచ:
కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ |
అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే ||1||
అధియజ్ఞః కథం కో అత్ర దేహే అస్మిన్ మధుసూదన|
ప్రాయాణకాలే చ కథం జ్ఞేయోsసి నియతాత్మభిః ||2||

అంటే
తత్ బ్రహ్మ కిం?- ఆ బ్రహ్మము అంటే ఏమిటి?
అధ్యాత్మం కిం?- అధ్యాత్మము అంటే ఏమిటి
కర్మ కిం? - కర్మ అంటే ఏమిటి?
అధిభూతం చ కిం ?- అధిభూతమని దేనిని చెప్పబడినది ?
అధిదైవం కిముచ్యతే ?- అధిదైవమని దేనిని చెపుతారు ?
అధియజ్ఞః కః? - అధి యజ్ఞుడు ఎవరు ?
కథం జ్ఞేయః అసి ? - నీవు ఏట్లు తెలియబడు వాడవు? అంటే నిన్ను ఎట్లు తెలిసికొనగలము !

అర్జునుడు భగవానుని ఏడు ప్రశ్నలు అడుగుతాడు. 1 బ్రహ్మము ఏది ? 2 అధ్యాత్మమేది 3 కర్మ మనగా ఏది ? 4 అధిభూతమని ఏది చెప్పబడినది 5 అధిదైవమని ఏది చెప్పుదురు 6 ఈ దేహమందు అధియజ్ఞు డెవరు 7 ఇవన్నీ నీవే అన్నావు గదా అట్టి నిన్నుతెలుసుకొనుట ఎట్లు?

ఆప్రశ్నలన్నిటికీ భగవానుడు సమాధానము చెపుతాడు.

శ్రీ భగవానువాచ:
అక్షరం బ్రహ్మ పరం స్వభావో అధ్యాత్మముచ్యతే|
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ||3||

అక్షరం - క్షయములేనిది లేక నాశరహితమైనది అదియే బ్రహ్మము.
స్వభావం - తన స్వభావమే తన ఆత్మరూపమే అధ్యాత్మము.
కర్మ- సమస్త భూతములకు ఉత్పత్తి హేతువగు క్రియలు, అట్టి నిష్కామకర్మయే కర్మ అనబడును.
అధిభూతం- నశించునట్టి పదార్థము.
అధిదైవం - పురుషః చ - పురుషుడే అంటే మామూలు పురుషుడు అని కాదు విరాటపురుషుడు అని.
అధియజ్ఞః - దేహమందు వశించు పరమాత్మయే.
అని శ్రీకృష్ణుడు చెపుతాడు.

అధియజ్ఞుడు ఎవరు అన్నది విశదీకరుస్తూ దేహములో వశించు పరమాత్మ అని చెపుతూ, తద్వారా దేహములో వశించు ఆత్మ యే పరమాత్మ అని చెప్పడమైనది. (8.04)

చాలామందికి ఆత్మ అన్నది తెలుసు. కాని ఆత్మ వేరు పరమాత్మవేరు అనే విచారణలో ఉంటాము. మనందరికి అతికష్టముతో అత్మానుభూతి తద్వారా పరమాత్మానుభూతి, జన్మ జన్మలతరువాత అవుతాయని విన్నదే. ఇక్కడ కృష్ణుడు సందేహము లేకుండా ఆత్మ పరమాత్మ ఒక్కటే అని మనకి చెపుతున్నాడు.

అయితే అర్జునుని చివరి ప్రశ్నఅంతిమ ఘడియలలో "కథం జ్ఞేయసి" నీవు ఎట్లు తెలిసికొనబడగలవు అన్నది మళ్ళీ కృష్ణుడు విశదీకరిస్తాడు.

అసంశయః - నిస్సందేహముగా !
అన్తకాలే మామేవ - చివరి ఘడియలలో నన్నే
స్మరన్ - స్మరించుచూ

"చివరి ఘడియలో నన్నే స్మరించుచూ ఎవరైతే శరీరము వదలుచున్నారో వారు నా స్వరూపము నిస్సంశయముగా పొందుచున్నారు" ! ( 8.03)

అంతేకాదు
" మరణకాలమున ఏభావమును గురించి చింతించుచూ దేహము వదులుదురో అదే భావముతో ఆ రూపమును పొందుచున్నాడు"( 8.06) అని. అంటే అంత్య కాలములో ఎవరు ఏ దేవతని స్మరిస్తారో వారు ఆ దేవత స్వరూపమే పొందుతారు అని.

అంత్యకాలములో వచ్చే భావన నిరంతర స్మరణచేత అభ్యాసమైన భావన. అంటే మనస్సు అటు ఇటుపోకుండా చివరి ఘడియలలో కూడా అధ్యాత్మ చింతనలో ఉండాలి అంటే అది జీవితమంతా అధ్యాత్మ చింతన ఉండాలి అని కూడా కృష్ణుడు చెపుతున్నాడు. ఇదే మాట కృష్ణుడి ద్వారా వింటాము.

శ్రీభగవానువాచ
తస్మాత్ సర్వేషుకాలేషు మామనుస్మరయుధ్య చ |
మయ్యర్పిత మనోబుద్ధిః మామేవైష్యస్యసంశయః ||7||

తా|| "కాబట్టి అన్ని కాలములలో నన్ను స్మరించుచూ యుద్ధముచేయుము. నాయందు సమర్పింపబడిన మనో బుద్ధి కలవాడివై నన్ను పొందగలవు"

"కథం జ్ఞేయసి" " నీవుఎట్లు తెలిసికొనబడగలవు" అన్నప్రశ్నకి "నన్ను స్మరిస్తూ ఉంటే పొందగలవు" అని చెపుతాడు.

ఇది పూర్తి సమాధానము కాదు. అందుకనే కృష్ణుడు మళ్ళీ విశదీకరిస్తాడు.

దీనికి కూడా అభ్యాసమనేయోగముద్వారా, సర్వోత్తమమైన పరమపురుషుని స్మరించుచూ, మనుష్యుడు ఆ పరబ్రహ్మమును పొందుచున్నాడు.(8.08). ఇంకా అదే విశదీకరిస్తూ

" (ప్రయాణకాలే) స తం పరం పురుషముపైతి దివ్యం" అంటాడు
( అంత్యదశలో) అతడు "దివ్యం పరం" దివ్యమైన సర్వోత్తముడగు - "తం ఏవ" ఆ పరమాత్మనే - "ఉపైతి" పొందును !(8.10)

"తం ఏవ" అంటే - ఆ భగవంతుడు .
భగవంతుడు ఏట్లాంటివాడు? అది చాలా విశదముగా చెపుతాడు కృష్ణుడు.
కవిం : అన్నీ తెలిసినవాడు
పురాణమ్: పురాతనుడు
అనుశాసితారమ్: అందరినీ శాసించువాడు
అణోః అణీయాంశం : అణువులలోకన్న పరమాణువు అగు వాడు
సర్వస్వ ధాతారమ్: అన్నిటికి ఆధారమైనవాడు
అచిన్త్యరూపం: చింతింప శక్యముకాని రూపము కలవాడు
ఆదిత్యవర్ణమ్: సూర్యునివంటి కాంతి గలవాడు
తమసః పరస్తాత్ : తమస్సు అంటే అజ్ఞానమనే అంధకారమునకు అవతలవున్నవాడు
అంటే అటువంటి బ్రహ్మస్వరూపమును, భక్తుడు యోగముద్వారా పొందుచున్నాడన్నమాట.(8.09)

అయితే ( అంత్య దశలో) ఏట్లా పోందుతాడూ అంటే,
యోగబలేన- అభ్యాసయోగముతో
ప్రాణం - ప్రాణవాయువును
భ్రువోః మధ్యే - కనుబొమ్మల మధ్యలో
సమ్యక్ ఆవేశ్యచ - బాగుగా నిలిపి
అచలేన మనసా - చలనములేని మనస్సుతో
అనుస్మరేత్ - అనుక్షణమూ స్మరించునో
అట్టి ఉపాసన చేయువాడు బ్రహ్మము ను పొందుతాడన్నమాట !!(8.10)

అటువంటి ఉపాసనను ఇంకా విశదీకరిస్తూ కృష్ణుడు ఇలా అంటాడు

శ్రీభగవానువాచ:
సర్వద్వారాణి సంయమ్య మనో హృదినిరుధ్యచ |
మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్||12||
ఓమ్ ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ |
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్||13||

"ఎవరు ఇంద్రియద్వారములను అన్నిటినీ ( సర్వద్వారాణి) అరిక ట్టి మనస్సును హృదయమందు స్థాపించి ( మనోహృది నిరుధ్య చ) ప్రాణవాయువును శిరస్సునందుంచి ఆత్మచింతనా రూపయోగధారణ చేయుచూ ఓంకార ముచ్చరించుచూ బ్రహ్మమును భావించుచు ఈ దేహమును వదులుదురో వారు మోక్షమును పొందుదురని " అని.

"ఓమ్" అనే ఒక అక్షరము బ్రహ్మమునకు పర్యాయపదము

ఈ నాలుగు శ్లోకాలలో కృష్ణుడు బ్రహ్మ ఐకత్యము ఎలా అని చెపుతూ, అంత్యదశలో( ప్రయాణకాలే) ఇంద్రియనిగ్రహము ( సర్వద్వారాణీ సంయమ్య), ప్రణవనాదము చేస్తూ, యోగసమాధిలో నన్నే స్మరిస్తూ దేహము వదులుతారో - అట్టివారు పరమోత్కృష్టమైన గతిని ,అంటే మోక్షము పోందుతారు. " స యాతి పరమాంగతిమ్", అని చెపుతాడు.

అయితే ఇది అందరికీ సాధ్యముకాని పని గదా అనిపించవచ్చు.
అలా 'ఓం' అంటూ దేహము త్యజించనివారికి మోక్షము ఏలాగ అన్న ప్రశ్నకూడా వస్తుంది.

దానికే సమాధానము లాగా కృష్ణుడు మళ్ళీ చెపుతాడు.

శ్రీభగవానువాచ
అనన్యచేతాః సతతం యోమాం స్మరతి నిత్యశః|
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః ||14||

అనన్యచేతాః - అంటే ఇంకో దానిమీద మనస్సు లేనివారై
సతతమ్ మాం స్మరతి - నన్నే ఎల్లప్పుడు స్మరిస్తాడో
తస్యాహం సులభః - వానికి నేను సులభముగా దొరుకుతాను !!

అంటే అన్ని విషయములు వదిలేసి బ్రహ్మము మీద నిరంతర ధ్యానపరులకు సులభముగా దొరుకుతాను అని . ఇక్కడ సులభము అని చెప్పడములో, ముందు చెప్పినది ( సర్వద్వారాణీ సంయమ్య అన్నది) చాలామందికి కష్టము అవవచ్చు అన్నవిషయము స్ఫురిస్తుంది.

వారికి పరమాత్మపొందితే ఏమి లాభము ?
అలా పరమాత్మ పొందినవారు మహాత్ములు.
వారు పరమాత్మ నే పొంది తిరిగి దుఃఖాలయమైన జన్మమునకు మళ్ళీ రారు.
లోకాలన్నిటిలోనూ, అంటే స్వర్గలోకము బ్రహ్మ లోకము లాంటివి అన్నిటి్లో, తిరిగిరావడము అన్నది ఖాయమే.
కాని నన్నుపొందినవారు తిరిగి దుఃఖాలయమైన జన్మమునకు మళ్ళీ రారు.(8.15,16).
అదే మోక్షము.

ఈ పునర్జన్మ లేని మోక్షము యొక్క విశేషము గురించి వివరించడముకోసము, పునర్జన్మతో కూడిన స్వర్గాది బ్రహ్మలోకముల గురించి కృష్ణుడు మళ్ళీ మనకి విశదీకరిస్తాడు.

స్వర్గాది బ్రహ్మలోకము లు పొందిన వారు దుఃఖాలయమైన ఈ జీవితానికి తిరిగివస్తారు. " ఇంకో విషయములపై మనస్సులేకుండా ( అనన్య చేతాః) నన్ను ఎల్లప్పుడూ స్మరిస్తూ ( యో మాంస్మరతి నిత్యశః) ఉండే వారికి ( సులభః) సులభముగా పునర్జన్మ లేని మోక్షమును పోందుతారు "అని.

బ్రహ్మతత్వము గురించి విశదీకరిస్తూ, బ్రహ్మదేవుని పగలు ప్రారంభమగునపుడు అవ్యక్తమునుండి సకలచరాచర వస్తువులు పుట్టు చున్నవి. మరలరాత్రి ప్రారంభమగునపుడు ఆ అవ్యక్తమునందే లీనమగు చున్నవి (8.17). అంటే వేలకొలదీ యుగములు గడిచినా జీవులకు జన్మరాహిత్యములేదు. బ్రహ్మలోకము కూడా క్షరమే నశించేదే.

అలా అన్నీ నశించినాకాని, సనాతనమైనది సర్వభూతములూ నశించినాకాని నశించనిది, అదే అవ్యక్తము అక్షరము. దానినే పరమగతి అంటారు. ఆ గతిని పొందినవారు తిరిగి రారు. అదే మోక్షము (8.20).

ఆ మోక్షము ఎలాపొందుతారు అన్న ప్రశ్నకి సమాధానమే ఈ ఉపాయము
అదే విషయము ఉద్ఘాటిస్తూ కృష్ణుడు అంటాడు.

శ్రీభగవానువాచ:
పురుషః స పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా |
యస్యాన్తఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్||22||

ఎవని యందు ప్రాణికోట్లు నివసిస్తున్నాయో ( యస్య అంతఃస్థాని భూతాని)
ఎవని చేత ఈ లోకమంతయూ నిండియున్నదో ( యేన సర్వమ్ ఇదం తతమ్)
అట్టి (విరాట) పురుషుడు ( స పురుషః)
భక్త్యా లభ్యః - అనన్యమైన భక్తితో పొందబడుచున్నాడు.
ఇదే సులభమైన మార్గము అని.

పునర్జన్మ రాకుండా వుండడము కోసము చిత్త శుద్ధి ద్వారా బ్రహ్మానుభూతి అత్మ సాక్షాత్కారము పొందవచ్చు.అంటే మోక్షము పొందవచ్చు. అదే నిత్యమూ, అంటే ఎల్లప్పుడూ, భగవంతునిపై ధ్యానముతో కూడా మోక్షము పొందవచ్చు.

ఇంకా:

శ్రీభగవానువాచ
యత్రకాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః |
ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ ||23||

అంటే " ఓ భరతర్షభ ! ఏ కాలమందు శరీరము విడిచిన యోగులు పునర్జన్మలేని మోక్షము పొందెదరో, ఏ కాలమందు శరీరము విడిచిన యోగులు పునర్జన్మ పొందెదరో చెప్పెదను ( వినుము)" అని.

అంటే ప్రయాణకాలము లో ఏమి చెయ్యవలెనో చెప్పిన కృష్ణుడు, పునర్జన్మలేని మోక్షమునకు తగిన కాలము ఏటువంటిది అన్నది కూడా ఇక్కడ విశదీకరిస్తాడు.

అది అగ్ని, జ్యోతి, పగలు , శుక్లపక్షము, సూర్యుడు ఊర్ధ్వాభిముఖముగా ఆరునెలల పోవు ఉత్తరాయణము - ఈ కాలములో పయనించు యోగి పునర్జన్మ పొందడు(8.24)

ధూమము, చీకటి, రాత్రి, కృష్ణ పక్షము, సూర్యుడు అధోముఖముగా పోవు ఆరునెలల దక్షిణాయణము - ఈ కాలములో పయనించు యోగి మరల జన్మము పొందును.(8.25)

ఈ రెండు మార్గములను తెలిసికొన్న యోగి పునర్జన్మ పొందని మోక్ష మార్గమే తీసుకొనును.

అందువలన అర్జునా ఎల్లకాలమందు
"యోగయుక్తో భవ !"
అంటే "యోగమునే అనుసరించుము"(8.27)

ఇదం విదిత్వా - అంటే - ఇదంతా తెలిసికొని(న) యోగి
తత్ సర్వం పుణ్యఫలమ్ అత్యేతి- అ పుణ్యముచే వచ్చు ఫలములను దాటి
పరం స్థానమ్ ఉపైతి - ఉత్కృష్టమైన బ్రహ్మము పొందును.

అంటే వేదములు తపస్సు యజ్ఞములు నిరూపించు ఫలములకన్న మించినది మోక్షము.
అది కృష్ణభగవానుడు భోధించినట్లు, ఇతర విషయములపై మనస్సు నిలపక, నిరంతర భగవధ్యానము ద్వారా పొందగలిగిన స్థానము.

ఇదే నాశనములేని అక్షరపరబ్రహ్మ యోగము.(8.28)

ఈ అధ్యాయములో ముఖ్యమైన మాట ఇతర విషయములపై మనస్సు నిలపక నిరంతర భగవధ్యానముద్వారా మోక్షము పొందగలిగిన స్థానము.

ఇంకా మరణకాలమందు ఏ విషయమున మనస్సు తిరుగు చుండునో దానికి సంభంధించిన శరీరము రాబోవు జన్మమున లభించును. కనుక అంత్య కాలమందు భగవంతుని యందు మనసు నుంచి ఓంకారము ఉచ్చరించిన యడల, మరు జన్మమున భగవంతుని తో లయమగునని చెప్పబడినది.

ఈ విషయమున సాధకులు నిరంతరమూ భగవంతుని యందే మనసు నుంచి జీవిత కార్యములు చక్క బెట్టుకొనవలయును

ముకుందమాలలో కుల శేఖ రాళ్వారు చెప్పినట్లు:
కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాన్త
మద్వైవ మేవిశతు మానస రాజహంసః ..
ప్రాణప్రయాణ సమయే కఫవాతపిత్తైః..
కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే ?

"కృష్ణా నీ పాదమనే పంజరములో నామనసనే రాజహంస ను ముందుగానె బంధించనీ. ఎందుకంటె మరణానికి ముందు జీవదశలో సత్వగుణం ఆవిర్భవిస్తే మనసు భగవత్స్మరణం చేయగలదు. మరణానంతరము శరీరము ఏదో ఒక శరీరములో ఉంటుంది కనుక, అక్కడ కూడా భగవత్ స్మరణానికి అవకాశ ముంటుంది. కానీ ప్రాణాలు బయట పడే వేళ కఫవాతపిత్తాదులతో కంఠము బిగపట్టినపుడు, ప్రాణమాడక పోవడముచే మనసు గిజగిజ లాడుతుంది. మనసు పనిచేయకుంటె మరి స్మరణా ఎక్కడ. అందుకే మానసరాజహంసని ముందుగానే ముకుంద పాదారవిందాలనే పంజరములో జాగర్తగా బంధించబడుగాక".

ఇదే ఏకాంతిక భక్తి. ఇదే కులశేఖరుల కోరిక.

అదే కృష్ణభగవానుడు చెప్పినది కూడా!

|| ఓమ్ తత్ సత్ ||
శ్రీభగవానువాచ
వేదేషుయజ్ఞేషు తపస్సు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్ఠం|
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్||28||

"వేదములు యజ్ఞములు తపస్సు దానములచే ఎట్టి పుణ్యఫలము చెప్పబడినదో దానిని అధిగమించి ఇదంతా ( అక్షరపరబ్రహ్మ యోగము) తెలిసికొనిన యోగి అనాదియు పరమోత్కృష్టమైన స్థానమును పొందుచున్నాడు"
|| ఓమ్ తత్ సత్ ||