||భగవద్గీత ||

||తొమ్మిదవ అధ్యాయము||

||రాజ విద్యా రాజగుహ్య యోగము- వచన వ్యాఖ్యానము ||

||ఓమ్ తత్ సత్||


 

||ఓమ్ తత్ సత్||
శ్రీ భగవానువాచ:
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే|
జ్ఞానం విజ్ఞానసహితం యత్ జ్ఞాత్వా మోక్ష్యసేsశుభాత్||
"ఏది తెలిసికొంటే అశుభమునుంచి విముక్తుడవు కాగలవో అట్టి అతి రహస్యమైన విజ్ఞానముతో కూడిన ఈ జ్ఞానమును అసూయలేని వాడగు నీకు చెప్పుచున్నాను"

భగవద్గీత
తొమ్మిదవ అధ్యాయము
రాజ విద్యా రాజగుహ్య యోగము
శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః

కృష్ణుడు తొమ్మిదవ అధ్యాయము అసూయ లేనివాడగు అర్జునికి అశుభమునుంచి విముక్తికాగల విజ్ఞానముతో కూడిన జ్ఞానమును చెప్పుతాను అంటు మొదలెడతాడు.

ఇది విన్నమాటేనా అని్పించవచ్చు,

శ్రీకృష్ణుడు ఏడవ అధ్యాయములో కూడా, అంటే విజ్ఞాన యోగములోకూడా, అర్జునితో నాయందు ఆశక్తి కలవాడవు కనక -"అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు" అంటే "నిస్సందేహముగా పూర్తిగా నన్ను ఏట్లు తెలిసికొనగలవో అది వినుము"అంటూ మొదలెట్టి , "యత్ జ్ఞాత్వా న ఇహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే" -అంటే ఏది తెలిసికోంటే ఈ ప్రపంచములో ఇంకో తెలిసికొనతగినది ఉండదో అట్టి జ్ఞానమును చేపుతాను అంటాడు.

అప్పుడు తన "అపరా" ప్రకృతి ( భూమి రాపో నలో వాయు..) " దానికన్నా మించిన జీవ రూపమైనట్టి "పరా" ప్రకృతి గురించి చెపుతాడు. ఆ "పరా" ప్రకృతే జీవభూతములన్నిటికీ ఆధారమని , పరా అపరా ప్రకృతులే సమస్త జడ చైతన్య భూతములకు కారణమని చెపుతాడు.

తన( బ్రహ్మము) సర్వవ్యాపకత్వము విశదీకరిస్తూ అన్ని భూతములలో తనే బీజమని కూడా చెపుతాడు.

అట్టి తనస్వరూపమును అజ్ఞానము మాయ వలన అందరూ తెలిసికోనలేకపోతున్నారు, ఏవెరైతే ఆ మాయను దాట కలుగుతున్నారో వాళ్ళు తరించుచున్నారు , ఎవరైతే భవంతుని ఆశ్రయించెదరో వారు తమ ఆత్మస్వరూపమును , సమస్త నిష్కామ కర్మలను బ్రహ్మమే అని తెలిసికొనెదరు అని కృష్ణుడు చెపుతాడు.

అధ్యాయము చివరిలో ఏవరైతే అధిభూత అధిదైవ అధియజ్ఞముతో కూడిన నన్ను తెలిసికొనుచున్నారో వారు అంతిమఘడియలలో కూడా నిలుకడ కల మనస్సు కలవారై నన్ను తెలిసికొందురు అని అంటే, అర్జునుడికి మళ్ళీ అధిభూతము, అధిదైవము , అధ్యాత్మము అంటే ఏమిటీ అని సందేహము వస్తుంది. ఆసందేహాలు అన్ని ఎనిమిదవ అధ్యాయములో కృష్ణుడు విశదీకరిస్తాడు. అలా విశదీకరిస్తూ కృష్ణుడు అంత్యదశలో యోగధారణచేసి బ్రహ్మరంధ్రములో ప్రాణవాయువునునుంచి ఓం అంటూ దేహమును వదులు తాడో అట్టివారు మోక్షముపొందుతారు అని చెపుతాడు.అది చాలా మందికి కష్టమైన పని అని మోక్షమును సులభముగా పోందగల మార్గము తనని అరాధించడమే అని కూడా చెపుతాడు.

అంతా విని ఎనిమిదవ అద్యాయము చివరికి మోక్షసాధన కష్టమా అన్న సందేహము రావచ్చు

అది తీర్చడము కోసమా అన్నట్లు విజ్ఞానయోగములో మొదటి శ్లోకములో చెప్పిన లాగానే - అంటే ఏది తెలిసికోంటే ఈ ప్రపంచములో ఇంకో తెలిసికొనతగినది ఉండదో అట్టి జ్ఞానమును గురించి - మళ్ళీ తొమ్మిదవ అధ్యాయములో ప్రస్తావిస్తాడు.

అదే రాజవిద్యా రాజగుహ్య యోగము.

రాజవిద్యా అంటే ఉన్నతమైన లేక శ్రేష్ఠమైన విద్య . అదే అధ్యాత్మ విద్య
గుహ్యము అంటే రహస్యము అందులో రాజగుహ్యము అంటే పరమ రహస్యము అన్నమాట.
అధ్యాత్మవిద్య అందరికీ తెలియని విషయము.

దాని గురించి చెప్పడమే ఈ అధ్యాయము యొక్క ముఖ్య విషయము.

శ్రీ భగవానువాచ:
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే|
జ్ఞానం విజ్ఞానసహితం యత్ జ్ఞాత్వా మోక్ష్యసేsశుభాత్||1||

భగవానుడు అర్జునునకు బ్రహ్మజ్ఞానమును గూర్చి చెప్పుచున్నాడు
ఇది విద్యలలో కెల్ల శ్రేష్ఠమైనది అతి రహస్యమైనది అతి పవిత్రమైనది ధర్మయుక్తమైనది సులభముగా అచరించ తగినది. నాశరహితమైనది ప్రత్యక్షరమైనది. ఇది వినుటకు చిత్తశుద్ధికలిగిన అసూయలేనివారే అర్హులు (9.02).

శ్రద్ధలేని మనుష్యులు ఈ ఆత్మజ్ఞానము పొందక సంసారమార్గములో తిరుగుచున్నారు (9.03).

మళ్ళీ భగవంతుని స్వరూపము గురించి చెపుతూ..

ప్రపంచమంతయూ ఇంద్రియములకు కనపడని బ్రహ్మ స్వరూపము చే వ్యాపింపబడినది. అంటే సమస్త ప్రాణులకి ఆధారముగా వున్నదే బ్రహ్మము. ఆ ప్రాణులు బ్రహ్మమునకు ఆధారము కావు ( మత్థ్సాని సర్వ భూతాని న చాహం తేష్వవస్థితః) - (9.04)

సర్వభూతములు వాయువు ఆకాశములో ఇమిడియున్నట్లు పరమాత్మలో ఉన్నాయి ( 9.06)

సర్వభూతములు ప్రళయకాలములో ప్రకృతిలో విలీనమై మరల సృష్ఠికాలములో అవి సృష్టించబడతాయి (9.07)

ప్రకృతి మాయజాలములో ( సంసారబంధనలో కర్మబంధములో చిక్కుబడిన) ప్రాణసముదాయము స్వతంత్రములేనిదై ( కర్మబంధములో ఉండుటవలన) మరల మరల సృష్టించబడుచున్నవి అంటే పునర్జన్మము పొందుచున్నవి.( 9.08)

"మానుషీం తను మాశ్రితమ్ మాం మూఢాః అవజానంతి"( 9.11)- మానుష దేహమును అశ్రయించిన నన్ను( ఆత్మని) మూఢులు అలక్ష్యము చేయుచున్నారు -

ఆమూఢులు ఏలాంటివారు ?.
"పరం భావం అజానంతో.." సర్వోత్తమముగు పరమ తత్వమును ఎరుగని వారు.
మూఢులు జీవాత్మ పరమాత్మల ఏకత్వము తెలిసికొనక దేహమును ఆశ్రయించిన ఆత్మని అలక్ష్యము చేయుచున్నారు.

ఆమూఢులు ఏవరు?
మోఘాశా - మోహముతో కూడిన ఆశలు గలవారు
మోఘకర్మాణో - మోహముతో కూడిన కర్మలు చేయు వారు
మోఘజ్ఞానా - మోహముతో కూడిన జ్ఞానము కలవారు
విచేతసః - బుద్ధి హీనులు
అసురీం ప్రకృతిం శ్రితాః- అసుర ప్రకృతిని ఆశ్రయించినవారు

వీళ్లందరూ ( అంటే అసుర ప్రకృతి ని ఆశ్రయించినవారు తదితరులు) - అవజానన్తి - ఆత్మని అలక్ష్యము చేయు చున్నారు (9.12).
అలా కాకుండా దైవ ప్రకృతిని ఆశ్రయించినవారు "నన్ను నాశరహితునిగా సృష్ఠికర్తగా తెలిసికొని ఇంకోకటి మీద ధ్యానముపోకుండా నన్నే ఉపాసించుచున్నారు"(9.13)

అలా అలక్ష్యము చేయని వారు దైవసంబంధమైన ప్రకృతిని ఆశ్రయించి "ఎలా ఉపాసిస్తారు" అన్న ప్రశ్నకి కూడా కృష్ణుడు సమాధానమిస్తాడు.

శ్రీభగవానువాచ
సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతాః |
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే||14||
జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే|
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖమ్||15||

దైవసంబంధమైన ప్రకృతిని ఆశ్రయించినవారు - "ఎల్లప్పుడు(సతతమ్) నన్ను కీర్తించుచూ , చలించని వ్రతము ( మనస్సు) కలవారై , భక్తితో నమస్కరించుచూ, ఏకాగ్రచిత్తులై నన్ను సేవించుచున్నారు"

కొందరు జ్ఞానయజ్ఞముతో అద్వైతభావముతో( ఏకత్వేన) మరికొందరు ద్వైత భావముతో( పృథక్త్వేన) సర్వాత్మకుడనగు ( విశ్వముఖమ్) బ్రహ్మమును సేవించుచున్నారు.

కృష్ణభగవానుడు " నన్ను సేవించుచున్నారు" అని చెప్పి ఆ " మయా తతమిదం సర్వం "(9.04) సర్వాతర్యామి అయిన బ్రహ్మము యొక్క స్వరూపమును నాలుగు శ్లోకాలలో మళ్ళీ చెపుతాడు.

శ్రీభగవానువాచ
అహం క్రతుః అహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్|
మన్త్రోsహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతమ్||16||
పితాsహమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్రమోంకార ఋక్సామయజురేవచ ||17||
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్|
ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయమ్||18||
తపామ్యహమహం వర్షం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ|
అమృతం చైవ మ్త్యుశ్చ సదసచ్చాహమర్జున||19||

అంటే "నేనే యజ్ఞము నేనే పిత్రుదేవతలకిచ్చు హవ్యము నేనే ఔషధము నేనే అగ్ని నేనే హోమకర్మ నేనే జగత్తుకి తల్లి తండ్రి సంర క్షకుడు తాతను నేనే అని. తెలుసుకొనవలసిన పదార్ధము , ఓంకారము ఋక్ యజు స్సామవేదములు పరమగతి భర్త ప్రభు సాక్షి పరమశరణ్యుడు ప్రాణమిత్రుడు జగత్తు కి సృష్టి స్థితి లయకారకుడుబీజము పరమాత్మయే. తపింపచేయువాడు , వర్షమును కురుపించువాడు నిలుపువాడు, పరమాత్మయే" అని.

ఇదంతా పరమాత్మ స్వరూపమైనప్పటికీ అజ్ఞానము వలన మనుష్యులు ఇది తెలిసికొనలేకపోతున్నారు.

మూడు వేదములు అధ్యయనము చేసినవారు, సోమపానము చేసినవారు,పాపకల్మషము తొలగినవారు కూడా యజ్ఞములతో భగవంతుని పూజించి పుణ్యఫలము గా స్వర్గప్రాప్తిని కోరుకొని అది పొంది దేవభోగములను అనుభవించి, మళ్ళీ చేసిన పుణ్యము క్షీణించినపుడు మరల మనుష్య జన్మము పొందుచున్నారు. వారు కోరిన స్వర్గ ప్రాప్తి మాత్రమే వారికి దొరికిందన్నమాట. (9.20/21)

అయితే జన్మరాహిత్యము పోందడము ఏలాగ అంటే, మళ్ళీ కృష్ణుడు చెపుతాడు:

శ్రీభగవానువాచ:
అనన్యాశ్చిన్తయన్తో మాం ఏ జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్||22||

ఇది ఒక అభయ వాక్యము. పూర్తిగా మళ్ళీ మళ్ళీ వినతగ్గ వాక్యము.

అనన్యాః చిన్తయన్తో - ఇంకొక చింతన లేకుండా
మాం ఏ జనాః - నన్ను ఏ జనులు
పర్యుపాసతే - ధ్యానము చేస్తున్నారో
నిత్యాభియుక్తానాం- నాయందే నిష్ఠకలవారో
యోగక్షేమం - (వారి) యోగక్షేమములు
వహామి - వహించుచున్నాను !

అంటే "ఏవరు ఇంకో భావన లేకుండా నన్నే ఆశ్రయించి నిరంతరముగా ధ్యానించెదరో వారి యోగక్షేమములను నేనే వహించుచున్నాను"

అక్షరపర బ్రహ్మయోగములో చెప్పిన కఠినమైన యోగధారణకి అవసరము లేదు అన్నమాట. తనని ఆశ్రయించినవారు తనని సులభముగా పోందుతారు అని అప్పుడే విశదీకరించినా ఈ అభయ వాక్యము మిగిలిన సందేహములు ఆన్నిటిని తొలగించుతుంది.

కృష్ణుడు ఇంకోమాటకూడా చెపుతాడు.

శ్రీభగవానువాచ:
యేsప్యన్న్య దేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితః |
తేsపి మామేవ కౌన్తేయ యజన్త్య విధిపూర్వకమ్||23||
అంటే
" ఓ అర్జునా ఏవరైతే ఇతర దేవతలపై భక్తిగలవారై ఆదేవతలను ఆరాధించుచున్నారో వారుకూడా క్రమము తప్పి నన్నే అరాధించుచున్నారు". వాళ్ళు ఇంకో దేవతని పూజించినా అజ్ఞానంలో "నన్నే" భగవంతునేఅరాధిస్తున్నారన్నమాట. అన్య దేవతలయందు భక్తితో అజ్ఞానపూర్వకముగా ఉపాసించే వారికి కూడా వారి యాగఫలము తప్పక లభిస్తుంది. ఆఫలము ఎలాంటిది అంటే దేవతలను ఉపాసించేవారు దేవతలను పొందుతారు. అలాగే పితృవ్రతులు పిత్రులను భూతములను ఉపాసించేవారు భూతములను పొందుతారు.

"అహం క్రతుః అహం యజ్ఞః" అన్నట్లు ఇతరదేవతలను ఆరాధించినప్పటికీ తననే అరాధించుచున్నారు అన్నమాట. అయితే అలా బ్రహ్మమును ఎరగని వారు , వారు అరాధించిన దైవమే పొందుచున్నారు. అంటే దేవతలను ఉపాసించేవారు దేవతలను పొందుతారు. అలాగే పితృవ్రతులు పిత్రులను భూతములను ఉపాసించేవారు భూతములను పొందుతారు. కాని వారు జన్మ రాహిత్యము పొందుట లేదు అన్నమాట. అలాగే భగవంతుని ఉపాసించేవారు భగవంతునే పొందుతారు (9.25)

అంటే మళ్ళీ భగవన్నామ శరణమే ముఖ్యమని విశదీకరిస్తాడు.

ఇంకా భగవానుని పూజించడానికి యజ్ఞయాగాదులు అనవసరము అని మళ్ళీ చెపుతూ:

శ్రీభగవానువాచ
పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి|
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః||26||

"ఎవరైతే భక్తితో ఆకునుకాని పువ్వును కాని పండునికాని సమర్పించుచున్నాడో అట్టి భక్తిపూర్వకముగా ఇవ్వబడిన పత్రపుష్పాదులను నేను ప్రీతితో అనుభవించుచున్నాను"

అంతే కాదు భగవంతుడు అర్జునుని ద్వారా భక్తజనానికి ఇంకొక ఉపదేశమిస్తున్నాడు.

"ఓ అర్జునా ( ఓ భక్తులారా) నీవేది చేసినను హోమము చేసిననూ దానము చేసిననూ తపస్సుచేసిననూ దానిని నాకు అర్పింపుము ".(9.27)
అలా భగవదర్పణము చేస్తే ఏమిటవుతుంది?
"ఆ విధముగా అన్నికర్మలూ భగవదర్పణము చేస్తే కర్మబంధమునుండి శుభాశుభ ఫలములనుండి ముక్తుడు అవుతాడు"(9.28).
అంటే అలా భగవదార్పణములో కర్మత్యాగము ఉన్నదన్నమాట.
కర్మ త్యాగముతో భవంతుని పొందడము ఒక మార్గము అని కర్మయోగము లో విశదీకరించినదే.

"యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్||"(9.29)

ఈ భగవంతుని సేవలో ఎక్కువ తక్కువలు లేవు ఏవరైతే భక్తితో భగవంతుని సేవిస్తారో వారు భగవంతుని యందు వారి యందు భగవంతుడు ఉండును.

"అనన్యాశ్చింతయంతో మాం" అన్నది అందరికీ వర్తిస్తుంది అని చెప్పడముకోసము - దురాచారులైనా గాని అనన్యభక్తితో నిరంతరము భగవంతునే ఆరాధిస్తే వారి పాపకర్మలు నశించి సాధువులు అంటే సత్పురుషుడు అవుతాడు అన్నమాట.

ఇది అందరికీ వర్తిస్తుంది అని మరీ ఉద్ఘాటిస్తో కృష్ణుడు అంటాడు:

" భక్తి కలిగినవెంటనే అతడు ధర్మాత్ముడై శాశ్వతశాంతిని పొందుతాడు. అర్జునా నాభక్తుడు నశించడు అని తెలిసికో."
అంతేకాదు "నన్ను ఆశ్రయించినవారు అందరూ ఉత్తమగతిపొందుతారు ".

"స్త్రియో వైశ్యాస్తథా శుద్రాస్తేsపి యాన్తి పరాంగతిమ్||"

"స్త్రీలు వైశ్యులు శూద్రులు కూడా సర్వోత్తమైన పదవిని అంటే మోక్షమును పొందెదరు"

అందుకని భక్తజనానికి కృష్ణుడు మళ్ళీ చెపుతాడు

శ్రీభగవానువాచ:
మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు|
మామేవైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః||34||

మన్మనాః - నాయందే మనస్సు కలవాడవు
మద్భక్తః - నా భక్తుడవు
మద్యాజీ - నన్నే పూజించువాడవు
మాం నమస్కురు - నాకు నమస్కరించుము
ఆత్మానం యుక్త్వైవ- మనస్సును నాయందే ఉంచి
మత్పరాయణః- నన్నే ఆరాధించుచూ
మామ్ ఏష్యసి - నన్నే పొందుదువు.

"నాయందే మనస్సు కలవాదవు నాభక్తుడవు నన్నే పూజించువాడవు అగుము. నన్నే నమస్కరింపుము. ఈ విధముగా మనస్సు నాయందే నిలిపి నన్నే శరణుకోరినవాడై నన్ను పొందగలవు"

ఇదే రాజవిద్య ఇదే పరమరహస్యము.

మోక్షము పొందే కఠినమైన మార్గములు ఉన్నాయి. అవి కూడా విశదీకరించబడ్డాయి. కాని ఆన్నిటికన్న సులభమైన మార్గము కృష్ణభగవానుడు " అనన్యాః చింతయంతో మాం " అంటూ మన్మనాభవ మద్భతో అంటూ ఉపదేశించిన మార్గమే.

అదే రాజవిద్య అదే పరమ రహస్యము.

||ఓమ్ తత్ సత్||
మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు|
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః||34||
"నాయందే మనస్సు కలవాడవును, నా భక్తుడవును, నన్నే పూజించువాడవు అగుము. నాకు నమస్కరింపుము. ఈ ప్రకారముగా మనస్సు నా యందే నిలిపి నన్నే పరమగతిగా ఎన్నుకొనిన వాడవై చివరికి నన్నే పొందగలవు".
|| ఓమ్ తత్ సత్ ||


||ఓమ్ తత్ సత్||