||సుందరకాండ ||

||తత్త్వదీపిక ||

||మొదటి సర్గ - సముద్ర లంఘనము ||


|| Om tat sat ||

సుందరకాండ
ప్రథమ సర్గః

తత్త్వదీపిక
సముద్ర లంఘనం:

( చిన్న ఉపోద్ఘాతము:
ఈ సంచికలలో ముందు సంక్షిప్త సుందరకాండ రాశాము. తరువాత సుందరకాండ పారాయణ కోసము అన్ని శ్లోకాలు రాశాము. అంతటితో ఆగక సుందరకాండలో శ్లోకాలకి తాత్పర్యాలు, ఆ తాత్పర్యాలద్వారా సుందరకాండ వచనరూపములో కూడా తీసుకు వచ్చాము. అయినాగాని ఇంకా ఏదో మిగిలి పోయినట్లనిపించింది. దానికి కారణము ఇంకేదో కాదు మాగురువుగారి మాటలే. మేము సంక్షిప్త సుందరకాండ తీసుకు వచ్చినప్పుడు ఆ పుస్తకములో నాకు కాలేజిలో సంస్కృతము చెప్పిన గురువుగారు దగ్గరకు వారి ఆశీర్వాదముల కోసము వెళ్ళి , వారిని ఒక చిన్న ముక్క చెప్పమని, వీలైతే రాయమని అడిగాను. ముప్పై ఏళ్ళక్రితము మాకు కాలేజిలో అభిజ్ఞాన శాకుంతలములో దుష్యంతుడు వేటాడుతుంటే, ఆయన రథము పరిగెడుతూ వుంటే లేచిన రజోధూళికి ఆయన చెప్పిన అంతరార్థము ఎప్పుడూ మరచిపోలేదు. ఆ అంతరార్థము వలననే పరిక్షలలో ఎక్కువ మార్కులు వచ్చిన మాట నిజము. అప్పటినుంచీ గురుశిష్య బంధుత్వము ఉంచుకో గలిగాము. అప్పుడు అలా అడిగితే ఆయన నేను అంతరార్థము చెపుతాను నువ్వు రాసుకోవయ్యా అని వారు స్వయముగా ఒక గంట సేపు నాకు ధారాళముగా చెప్పారు. అది అంతా చేతిరాతతో ఒక నోటుబుక్కులో ఇరికించాను. అదే మా కాలేజిలో సంస్కృతము గురువుగారు శ్రీభాష్యము అప్పలాచార్యులుగారు చెప్పిన అంతరార్థము అని మా పుస్తకములో ప్రచిరించుకున్నాము. ఇప్పుడు సుందరకాండలో ప్రతిపదార్థము తాత్పర్యము వచనము రాయడములో మునిగి ఆయన చెప్పిన అంతారార్థము అర్థవంతముగా తీసుకురావడానికి వీలు పడలేదు. అది కూడా తీసుకురావాలి అని భాష్యము అప్పలాచార్యులవారి తత్త్వదీపికని అనుసరిస్తూ ఇప్పుడు తత్త్వదీపిక పేరుతోనే ఇది తీసుకు రావడమైనది. దీంట్లో సుందరకాండలో ప్రతిశ్లోకముయొక్క అర్థము తాత్పర్యము లేదు. అంతరార్థము కు తగిన మాటలనే తీసుకురావడమైనది. ఇలామొదలు పెట్టినప్పుడే ఇంకో సంస్కృతములో రచింపబడిన 'రామాయణ టీకా త్రయము" అనబడు పుస్తకము కూడా దొరికింది. తీకా త్రయములో మూడు గ్రంధములు వున్నాయి. అవి, రామ రచిత "రామాయణ తిలక", శివ సహాయ్‍ల వారిచే రచింపబడిన "రామాయణ శిరోమణి", గోవిందరాజులవారి "రామాయణ భూషణ. అవి సంస్కృతములో రాయబడిన గ్రంథములు. వాటి ప్రాధాన్యత ఏమిటి అంటే ప్రతిశ్లోకములో ముఖ్యమైన పదాలకి ఉత్పత్తి రాసి ఆ శ్లోకము మీద విశ్లేషణ చేయబడినది. దానిలో అప్పలాచార్యులవారి అంతరార్థము కు అనుగుణముగా వున్న మాటలను ఈ తత్వార్థములో కొంచెము ఇమిడ్చాము. ఇక ఆ సుందరకాండ అంతరార్థము. )

తత్త్వదీపిక
మొదటి సర్గ
సముద్ర లంఘనం

సుందరకాండలో మొదటి సర్గలో సీతాన్వేషణకై హనుమంతుడు లంక చేరుటకై సంకల్పించి మహేంద్ర పర్వతమునుంచి ఎగిరి ఎదురుగా వచ్చిన అడ్డంకులను అవలీలగా దాటి లంకచేరడమే బాహ్యముగా మనము విను కథ. ఇది రెండు వందలశ్లోకాల సర్గ. ఇందులో హనుమంతుడు లంక చేరడానికి సముద్రలంఘనము, సాగరుడు మైనాకుల ఆతిథ్యము తీసుకోకుండా తన కార్యముపై సాగిపోడము, సురసను జయించడము, సింహిక ని హతమార్చడము చేస్తాడు. ఇవన్నీ హనుమంతుడు చేసిన దుష్కరమైన కార్యములు. వీటన్నిటిని చూసి ఋషులు దేవతలు గంధర్వులు అందరు హనుమంతుని ప్రశంసిస్తారు. అలాగ అన్ని అడ్డంకులు దాటి లంక తీరములో హనుమంతుడు చేరతాడు.

ఈ సముద్రలంఘనములో అంటే సుందరకాండ ప్రథమ సర్గలో మనము తెలిసికోగనగల మాటలు చాలా వున్నాయి. అదే సుందరకాండలో అంతరార్థము .

అన్నిట్లోనూ మొదటిది సుందరకాండలో మొదటి సర్గలో మొదటి శ్లోకము.

తతో రావణ నీతాయాః సీతాయాః శతృకర్షణః|
ఇయేష పదం అన్వేష్ఠుమ్ చారణా చరితే పథిః"||1||

సుందరకాండలో మొదటి శ్లోకానికి చాలా ప్రాముఖ్యత ఉంది.

మొదటి శ్లోకములో వాల్మీకి చెప్పినమాట హనుమంతుడు అన్వేషణకై బయలు దేరుతాడు అని.

ఎలాంటి హనుమంతుడు బయలు దేరాడు?

ఆ హనుమంతుడు రాముని అనుజ్ఞను పొంది , రామునిచే ఇవ్వబడిన అంగుళీయకమును తీసుకొని బయలు దేరినవాడు .

అంటే భగవదనుజ్ఞను పొంది భగవద్దత్తమైన అంగుళీయకముతో సీతాన్వేషణకు బయలుదేరినవాడు అన్నమాట.

సీత అంటే నాగటిచే దువ్వబడుతున్న క్షేత్రములో , నాగటి చాలులో దొరికినది అని.
సీత జనకునకు అలాగే దొరికినది అందుకే సీత అనబడినది.

అలాగే శరీరమనబడు కర్మక్షేత్రములో సూక్ష్మణమగు బుద్ధిచేత త్రవ్వబడితే దొరికే సీత, అదే ఆత్మ.

అంటే హనుమంతుడు భవంతుని నుంచి వేరుపడిన జీవుని ( సీత ) అన్వేషణకై బయలుదేరాడు. అన్వేషణ ఎందుకు? అన్వేషించి ఆ జీవుని పరమాత్మతో కలపడానికే

అంటే సీతాన్వేషణలో అంతర్గతముగా వున్నది ఆత్మాన్వేషణ యే.

అత్మాన్వేషణకి ముఖ్యము గురువు.
ఆ గురువే హనుమంతుడు.

గోవిందరాజుల వారి సంస్కృత టీకా లో గురువు అన్నమాటకి సంస్కృతములో విశ్లేషము వుంది .
"గు శబ్దస్త్వత్ అంధకారః స్యాత్ రుశబ్దత్వాత్ తన్ నిరోధకః | అంధకారనిరోధిత్వాత్ గురుః ఇత్యభిధీయతే|"
అంటే గు శబ్దము అంధకారమును సూచిస్తుంది. 'రు" శబ్దము దానిని నిరోధించుట సూచిస్తుంది. అంధకారము అజ్ఞాన్నము నిరోధించువాడు కనక గురువు ఆనబడతాడు. అలా సంస్కృతములో ప్రతి శబ్దానికి అర్థము ఆ శబ్దము ఎలా ఉత్పత్తి అయినదో ఉంటుంది.

ఇక్కడ హనుమంతునిని శత్రుకర్షనుడు అని పిలుస్తారు. అంటే శతృవులను అణగదొక్కగలవాడు అని.

హనుమంతుడు సీతమ్మను బాధపెట్టు రాక్షస మూకలను అణగదొక్కగలవాడు అన్నమాట.

ఇంకో మాట.

సీత ఎవరిచే తీసుకు పోబడినది?

రావణునిచేత.

రావణుడు అంటే అర్థము - "రావయతి అసత్ ప్రలాపాన్ కారయతి ఇతి రావణః".
అసత్యమైన ప్రలాపములు కలిగించువాడు కనుక రావణుడు అని.
అంటే "నేను" "నాది" అనబడు అసత్ అంటే అసత్యమైన ప్రలాపములను కలిగించువాడు కనక రావణుడు అని.
వాడు అవివేకుడు.

"నేను" నాది" ఆనబడు అసత్ ప్రలాపములు కలిగించేది ఏమిటి?
అదే మన మనస్సు.

అంటే రావణు డు అంటే మనస్సు అన్నమాట
అంటే రావణుడు అనబడే మనస్సుచేత అపహరించి తీసుకో పోబడిన సీత లేక ఆత్మను వెదకడానికి హనుమంతుడు బయలు దేరాడు అన్నమాట.

అంటే మొదటి శ్లోకములో భగవదనుజ్ఞనుపొంది భగవద్దత్తమైన అంగుళీయకము తీసుకొని రావణుడు అనబడు మనస్సుచేత అపహరింపబడిన సీత అనబడు ఆత్మాన్వేషణకు బయలుదేరాడు అన్నమాట.

మన అధ్యాత్మిక చింతనలో ఆత్మను పరమాత్మతో చేర్చడమే లక్ష్యము.
సుందరకాండలో కూడా అదే లక్ష్యము.

చాలామందికి ఈ శ్లోకము పఠిస్తే బంధనము నుండి విముక్తి కలుగుతుంది అని నిలకడ.
చాలామందికి ఈ శ్లోకము చదివితే చికిత్సకు వీలుగాని రోగములు కూడా నయమగును అని రాస్తారు భాష్యం అప్పలాచార్యులు గారు.

అంటే ఈ ఒక్క శ్లోకము చదివితే చాలు ధ్యానరూపముగా అని.

ధ్యానములో నిమగ్నమౌటానికి ఒక మంత్రము కావాలి.
అనేక మందికి అనేక మంత్రములు ఉన్నాయి.
ఈ శ్లోకములో గాయత్రీ మంత్రపు పన్నెండవ అక్షరము కూడా వుంది
ఆవిధముగా ఈ మొదటి శ్లోకము కూడా ఒక మంత్రము.

గోవిందరాజులవారు రాస్తారు.
"అత్ర గాయత్ర్యాః ద్వాదశమక్షరం ప్రయుక్తమ్ తత్ అవలోకనీయం విద్వద్భిః"|
ఇక్కడ గాయత్రిలో పన్నెండవ అక్షరము ఉపయోగించబడినది అది పండితులు గమనించవలసినమాట అని. సుందరకాండ మొదటి శ్లోకము పన్నెండువేలలో మొదటి శ్లోకము అని.

ఓక ముఖ్యమైన అక్షరము - గాయత్రీ మంత్రములోని పన్నెండవ అక్షరము " వ" అన్నది 'రావణ' అన్న పదములో వుంది.

రామాయణములో మధ్యభాగములో వచ్చు సుందరకాండలో ఇరువది నాలుగు అక్షరముల గాయత్రీమంత్రములోని పన్నెండవ అక్షరము "వ" బీజాక్షరము లాగా వుంది అన్నమాట.

ఆవిధముగా కూడా ఈ మొదటి శ్లోకము ఒక మంత్రము.

||ఓం తత్ సత్||

|| పాఠకులకు మనవి - ఇంత విశదీకరింపకపోయినా చాలా మంది ప్రవచనములలో ఇదేమాట చెపుతారు. ఇది భాష్యము అప్పలాచార్యులవారు వారి తత్త్వ దీపిక ద్వారా చెప్పినమాట.||