||సుందరకాండ. ||

||తత్త్వదీపిక - పదనొకండవ సర్గ ||

||సీతాన్వేషణ||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ఏకాదశస్సర్గః

తత్త్వదీపిక
సీతాన్వేషణ

పదనొకండవసర్గలో కథ ఇలా చెప్పవచ్చు.

మండోదరిని చూచి మహదానందము పొందిన హనుమంతుడు ,
ఒక క్షణము ఆగి తను చూచినది సీత కాదని,
ఆ అలోచనను తిరస్కరించి మళ్ళీ ఆలోచించసాగాడు.
సీతా దేవి రాముని విరహముతో
"న స్వప్తుం"అంటే నిద్రపోలేదు.
"నభోక్తుం" అంటే భుజింపలేదు.
"నాప్యలంకర్తుమ్" తనను తాను సింగారించుకోలేదు.
తను చూచినది "అన్యేయం ఇతి నిశ్చిత్య" అంటే తను చూచినది ఇంకెవరో అని నిశ్చయించుకొని,
హనుమంతుడు తన అన్వేషణ మరల సాగించాడు

ఇంకా వెదికినా హనుమంతునికి కనపడినది,
"రూపసల్లాప శీలేన" రూపసల్లాపములు గలవారిచేత,
"యుక్తగీతార్థభాషిణా" తగినట్లు పాటలు మాటలు చెప్పగలిగినవారిచేత,
"అంగనానాం సహస్రేణ" వేలకోలదీ స్త్రీలతో
రతి అనుభవించి నిద్రపోతున్నరావణుడే.

ఆ పానశాలలో తిరుగుతూ వుంటే కనపడినది
అనేకరకములైన "మృగాణాం మహిషీణాంచ వరాహాణాం చ" మృగముల భోజ్యములే.
ఇంకా కనపడినవి అనేకరకములైన పానీయములే.

అక్కడ వున్న నారీమణులు నిద్రావశులై
"ఒకరినొకరు కౌగలించుకొని", లేక "ఇతర స్త్రీల వస్త్రములను లాగుకొని",
రతి రమించిన భంగిమలలో గాఢనిద్రలో ఉన్నారు.

అక్కడ వాతావరణములో సువాసనలతో కూడిన వాయువు
అన్ని చోట్ల మూర్ఛింప చేస్తూ వీచుతో వుందిట.

ఆ మహాతేజోవంతుడైన వానరుడు రావణాంతఃపురములో అంతా శేషములేకుండా చూస్తాడు.

కాని రామపత్ని అగు సతీ జానకి మాత్రము కనపడలేదు.

అలాగ స్త్రీలను నిరీక్షించిన ఆ మహాకపికి,
గొప్ప శంక వస్తుంది.
ఆ శంక ఆ పరస్త్రీలను చూడడములో ధర్మలోపము జరిగెనా అని.
ఆ శంకతో గొప్ప ఆలోచనలో పడతాడు.

కాని మనోబలసంపన్నుడు ,
నిశ్చయముగా ఏకాగ్ర చిత్తము కలవాడు,
కార్యనిర్ణయము చక్కగా తెలిసినవాడు అయిన హనుమంతుడు,
"శుభ అశుభ అవస్థలలో అన్ని ఇంద్రియముల ప్రవర్తనకి మనసే కారణము.
ఇక్కడ నా మనస్సు స్థిరముగా నున్నది",
అని సమాధానపరచుకొని తన అన్వేషణ సాగించును.

అది పదకొండవ సర్గ లో జరిగిన కథ .
ఇక దీనిలో తత్వార్థము చూద్దాము.

హనుమంతుడు తన అన్వేషణ కొనసాగిస్తూ
అనేక భంగిమలలో ఉన్న వేలకొలదీ రావణ కాంతలను చూస్తాడు.
ఎన్నో భోగాలు , భోజ్యాలు , ఇంకా పానీయములు చూస్తాడు.
కాని అతని మనస్సు చలించలేదు.
మనస్సు చలించే అలోచనలు కూడా రాలేదు.
హనుమంతుని మనస్సు సీతాన్వేషణలో నే ఉన్నది.

కాని హనుమకి ఒక శంక చస్తుంది.
ఆలా ఆ స్త్రీలను చూడడములో ధర్మలోపము ఏమైనా కలిగినదా అని.
పరస్త్రీలని చూడాలని చూడలేదు.
సీతాన్వేషణలో చూడవలసిన పరిస్థితిలో చూచెను.

అప్పుడు హనుమ మనస్సులో ఇంకో భావన వస్తుంది.

"మనోహి హేతుః సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తనే|
శుభాశుభః అవస్థాసు తచ్చ మే సువ్యవస్థితం"||

"మనస్సే కదా సర్వేంద్రియములను ప్రవర్తింపచేయుటలో కారణమైనది.
శుభమైననూ అశుభమైననూ మనస్సు వలనే కలుగును.
నా మనస్సు నిలకడగనే ఉన్నది" అని.

ఇందు మనో వికారము కలిగించెడి స్త్రీలను చూచిననూ,
హనుమయొక్క మనస్సులో ఏమి కామ వికారములేకుండుట వర్ణింపబడి యున్నది.

ఇట్టి స్థితి ఆత్మ దర్శనమునకు ముందు అవశ్యము

స్థితప్రజ్ఞావస్థలో విషయములను చూచు చున్ననూ,
విషయములు మనస్సుకి కలిగించెడి వికారములు కలిగింపలేకుండుట ఉత్తమస్థితి.

స్త్రీలను చూచినపుడు
పానభక్ష్యాదులు చూచినపుడు
అవి భోగములు భోజ్యములు అనెడి బుద్ధి హనుమకు కలుగలేదు.

సీతయే హనుమంతుని మనస్సులో మెదలుచున్నది.
సీతనే ధ్యానించుచూ, అన్నిచోటలా అమెనే అన్వేషించుచూ,
అమె కంటే ఇతర వస్తువులు చూచినా వాని వలన కలుగవలసిన వికారము పొందక,
ఇంద్రియములను మనస్సును వశములో నుంచికొని,
అంటే మనస్సు విషయముల వేపు పోకుండా అన్వేషణలోనే నిలపిన హనుమంతుని దశ ఇందు కనపడును.

ఆత్మాన్వేషణలో ఉన్నవారు ఇదే స్థితిని పొంది స్థితప్రజ్ఞావస్థలో ఉండాలి అన్నమాట.

స్థితప్రజ్ఞుడు అంటే భగవద్గీతలో అర్జునుడు అడిగితే కృష్ణుడు చెప్పిన మాట గుర్తుకు వస్తుంది.

"దుఖేష్వనుదిగ్ధమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగభయక్రోధః స్థితధీః మునిరుచ్యతే"

సుఖదుఃఖములలో చలించని మనస్సు కలవాడై ,
బంధనములకు భయ క్రోధములకు అతీతముగా వున్నవాడే స్థితప్రజ్ఞుడు.

ఇక్కడ సీతాన్వేషణలో హనుమంతుని స్థితి అదే అన్నమాట

||ఓమ్ తత్ సత్||
|| ఇది భాష్యమ్ అప్పలాచార్యులవారి తత్త్వదీపికలో మాకు తెలిసిన మాట||
||ఓమ్ తత్ సత్||