||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ఇరువదియవ సర్గ||

||సీతారావణ సంవాదము||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ వింశస్సర్గః

తత్త్వదీపిక
సీతారావణ సంవాదము

ఇరువదియవ సర్గలో మొదటిశ్లోకముతరువాత మనము వినేది రావణుని మాటలే.
రావణుడు తనమనస్సులోని మాటలు జంకులేకుండా చెపుతాడు.
ఆ రావణుని మాటలు, అధీనములేని మన మనస్సులోని మాటల లానే ఉంటాయి

" ఓ విశాలాక్షీ సర్వలోక మనోహరి నిన్ను నేను వాంచిస్తున్నాను".

"ఓ ప్రియా నన్ను కోరుకో".

"ఇక్కడ మనుష్యులుకాని కామరూపులైన రాక్షసులుకాని లేరు.
ఓ సీతా నా గురించి కలిగిన భయమును వదిలుము.
ఓ భయస్థురాలా ! పరస్త్రీలను అపహరించడము,
వారితో రమించడము అన్ని విధములుగా రాక్షసుల స్వధర్మము.
అందులో సంశయము లేదు".

"ఓ మైథిలీ! అయినాగాని, నన్ను కోరని నిన్ను నేను తాకను.
ఓదేవి ! ప్రియురాలా ! నన్ను విశ్వశించు.
ఇక్కడ భయమునకు తావులేదు.
నిజముగా ప్రేమించుము.
ఈ విధముగా శోకలాలసవు కావద్దు.
ఓక జడతో భూమియే శయ్యగాచేసుకొని
మలినమైన వస్త్రములతో ఉపవాసము చేయుట,
ఇవన్నీ నీకు తగని పనులు.
ఓ మైథిలీ నన్ను పొంది మాలలు అగరు చందనము
వివిధరకములైన వస్త్రములు దివ్యమైన ఆభరణములను పొందుము.
శ్రేష్టములైన పానీయములను, ఆసనములను, గీత నృత్య వాద్యములను పొందుము".

"ఓ దేవీ! నీవు స్త్రీలలో రత్నము.
ఈ విధముగా నువ్వు ఉండకూడదు.
నీ గాత్రములలో ఆభరణములను ధరించుము".

"మంచి విగ్రహము కలదానా ! నన్ను పొంది నీవు ఏమి పొందకుండా వుండగలవు ?
ఈ సుందరమైన నీ యౌవ్వనము గడిచిపోవును.
ఇది శీఘ్రముగా పారుచున్న నీరు వలె మరల వెనుకకు రాదు".

"ఓ అద్భుతమైన రూపము కలదానా !
నిన్ను చేసిన తరువాత సృష్టికర్త సౌందర్యము సృజించడాన్ని విరమించాడు కాబోలు.
నీతో సమానమైన సౌందర్యవతి లేదు".

" ఓ వైదేహీ రూపయౌవ్వనశాలియగు నిన్ను చూసిన తరువాత
ఏ పురుషుడు ముందుకు పోగలడు?
సాక్షాత్తు బ్రహ్మకూడా పోలేడు. ".

" ఓ మైథిలీ ! నా భార్య అవుము.
నీ మోహమును వదులుము.
బాహుబలముతో తీసుకురాబడిన అనేక ఉత్తమస్త్రీలందరికి పెద్ద పట్టపురాణివి అగుము.
నీకు మంగళము కూరును.
ఓ భయస్థులారా లోకములో జయించి తీసుకువచ్చిన రత్నములన్నీ ,
వస్తువులన్నీ , నా రాజ్యము కూడా నీవే .
నేనూ కూడా నీ వాడనే".

"అనేక నగరములతో కూడిన పృథివీ మండలము అంతా జయించి
నీ కొఱకు జనకునకు సమర్పిస్తాను.
ఈ లోకములో నాతో సమానమైన బలము కలవాడులేడు.
యుద్ధరంగములో కూడా నాకు ప్రతిద్వంది లేని వీర్యమును చూడుము.
నాతో అసమానులైన సురాసురులు యుద్ధములో విరిగిన ధ్వజములతో భగ్నులైనారు.
నాముందు నిలబడడానికి అశక్తులు అయ్యారు".

"నా యొక్క కోరిక నీవు ఉత్తమమైన అలంకరణలు చేసికొనుము.
నీ అంగములలో కాంతి గల ఆభరణలు ధరించబడుగాక.
ఆ విధముగా అలంకరింపబడిన నీ సాధురూపము చూచెదను.
ఓ భీరు సుందరాంగీ ! నీకు ఇష్టమైనట్లు అలంకరించుకొని భోగములు అనుభవించు
మధుపానము సేవించు రమింఛు.
నువ్వు పృథివినీ ధనమును ఈ కోరికప్రకారము దానము చేయుము
భయము లేకుండా లాతో రమించు.
ధైర్యముగా నన్ను ఆజ్ఞాపించు.
ఓ మంగళస్వరూపిణీ ! నన్ను ప్రసాదించి సుఖసంతోషములు పొంది,
నీ బంధువులను కూడా సంతోషపెట్టు.
నా బుద్ధినీ యశస్సును చూడు".

" ఓ సుందరీ చీరవస్త్రములు ధరించే రామునితో ఏమి చేస్తావు.
విజయము ఐశ్వర్యము లేని వనములో చరించు రాముడు,
తాపసిక వ్రతములను అనుసరించుభూమిపై నిద్రించు రాముడు
జీవిస్తున్నాడో లేదో అన్నది శంకయే".

"ఓ వైదేహీ నిన్ను ఎగురుతూ వెనకవున్న మేఘములతో కప్పివేయబడిన చంద్రుని ఏలాచూడలేవో
అలాగే రాముడు నిన్ను చూడలేడు.
హిరణ్యకశిపుడు ఇంద్రునిచే అపహరింపబడిన కీర్తినిపొందగలగాడు.
కాని నాహస్తమునుంచి రాముడు నిన్ను పొందలేడు.
ఓ చారుస్మితి చారుదతి చారునేత్రీ ! విలాసినీ !
నీవు గరుత్మంతుడు సర్పమును హరించినట్లుగా నామనస్సుని అపహరించినావు".

"ఓ తన్వీ ! నలిగిపోయిన పట్టువస్త్రము ధరించిన,
అలంకారములతో లేకపోయినా కాని నిన్ను చూచిన తరువాత
నా భార్యలతో రతి పొందలేకపోతున్నాను.
ఓ జానకీ నా అంతః పురములో ఉన్న స్త్రీలు సర్వగుణ సంపన్నులు.
నీవు వారిపై ఆధిపత్యము వహించుము".

"ఓ నల్లని కేశములు కలదానా! నా యొక్క ముల్లోకములలో శ్రేష్టులైన స్త్రీలు,
అప్సరస స్త్రీలు లక్ష్మి ని సేవించినట్లు నీకు పరిచర్యలు చేస్తారు.
ఓ చక్కని కనుబొమ్మలు, చక్కని కటి ప్రదేశము కలదానా !
నేను కుబేరుని జయించి తీసుకువచ్చిన రత్నములు ధనములు ఆన్నీ నీవే.
వాటితో పాటు నన్నుకూడా యథాసుఖముగా అనుభవింపుము".

"ఓ దేవీ రాముడు తపస్సులో నాతో సమానుడు కాడు.
బలములో సమానుడు కాడు.
ధనములో తేజస్సులో యశస్సులో కూడా సమానుడుకాడు".

"ఓ లలనా ! కుప్పలుగా ధనము బంగారము నీకు ప్రసాదిస్తాను.
తిని తాగి విహరించి రమించు.
భోగములను నీకు తోచినట్లు నాతో అనుభవించు.
నీ బంధవులు తో కలిసి అనుభవించు".

"ఓ భీరు ! బంగారు కుసుమముల హారములతో అలంకరించుకో.
బాగుగాపుష్పించిన చెట్లు కల,
భ్రమరములు కల
సముద్ర తీర ఉద్యానవనములలో నాతో కలిసి విహరించు".

ఇది రావణుని ప్రలోభము.

రావణుడు అంటే మనస్సు అని మొదటి సర్గలోనే విన్నాము

ఆ మనస్సు ఎన్ని ప్రలోభములు చూపిస్తుందో
అవి అన్నీ రావణుని ఉపన్యాసములో మనకు కనపడతాయి..

భగవంతునికంటె వేరు విషయాలపై కోరిక ఉన్నప్పుడు,
అంటే కోరుకోతగని విషయాలు కోరవలెనని అనిపించినపుడు
ఎవరైన చూస్తారేమో అని జంకెదము.
ఎవరూ చూడనప్పుడు తప్పుడు పని చేయుటకు మనస్సు జంకదు.

అందుచే భగవద్భావన లేని వారికి " ఇచట ఎవరూ లేరుగదా !
ఆ (పనికిరాని) పని చేసిననేమి?" అనిపించును.
అదే సూచిస్తూ రావణుడు తనసంభాషణ
"ఇక్కడ ఎవరూ లేరు" భయపడనక్కరలేదు అంటూ ప్రారంభిస్తాడు.

పరుడగు సర్వేశ్వరుని స్త్రీలగు, ఆత్మలని
బలాత్కరముగా హరించుట
వానిని తనవిగా చేసుకొని రమించుట మనస్సుయొక్క ధర్మము.
ఆత్మ సహజముగా శుద్ధ స్వభావము కలదైననూ,
కర్మవశమున ఏర్పడిన ప్రకృతి వికారమగు శరీరములో ని మనస్సుకు వశము అగును.
జీవులందరూ పరమాత్మచే భరింపబడి పరమాత్మకే చెందెడివారు.
కనక వారు పరస్త్రీలు.
వారిని తనవశముగా చేసుకొని రమించుట స్వధర్మమని ,
మనస్సుకి ప్రతిరూపము అగు రావణుడు చెప్పెను.

రావణుని మాటలలో,
మనస్సు మనను బంధించుటలో గల రహస్యము ఇక్కడ చెప్పబడెను.

మనస్సు నకు బంధింపగలశక్తియున్ననూ,
బంధించుట తన స్వభావమే అయిననూ,
కామములు లేని జీవుని మనస్సు బంధింపలేదు.

అలాగే రావణుడు "అకామము గల"
అంటే కామము లేని " నిన్ను(సీతను) నేను స్పృశించను" అంటాడు.
కామమే బంధహేతువు.
భగవంతుని కన్న ఇతరపదార్థము కోరినది సీత.
అనగా బంగారులేడిని కోరినది సీత.
కనకే రావణుడు ఆమెను బంధింపగలిగెను.
ఇప్పుడు రాముని తప్ప ఇతర మైన దానిని కోరకుండుటచే
రావణుడు ఆమెను స్పృశించలేకుండా వున్నాడు.

"అకామ" అంటే కోరికలేనిది అని.
" అకామ" అంటే విష్ణువునందే కోరిక గలది అని కూడా అర్థము వుంది.
విష్ణువునే కోరి,
విష్ణువు కంటే ఇతరముగు విషయములపై ధ్యానము లేని వారిని మనస్సు బంధింపదు.

రావణుడు చెప్పిన మాటలన్నీ
అంటే "ఒకే జడ", భూమి పైశయనము",
"అలంకారము చేసుకొనకపోవుట", యౌవ్వనము తరిగిపోవును" అని అన్నమాటలు,
మనస్సు చెప్పే మాటలు.
మనస్సు ఎప్పుడూ జీవుడు భగవత్ప్రాప్తి అనేకోరికతో సాధన చేయునప్పుడు,
ఆ జీవుని కోరికనుంచి వెనుకకు లాగుటకు మనస్సు అట్టి మాటలు చెపుతూనే యుండును.

ఇక్కడ రావణుడు విషయోపభోగములను అనుభవింపగల
బాహ్యమైన శరీరసంబంధమగు యౌవనము గురించి విలపించును.
శరీరమే ఆత్మ అనుకొనెడివారు,
"జన్మనెత్తుట- విషయములను అనుభవించుటకొఱకే " అని భావింతురు.
అట్టివారికి వయస్సుగడిచిపోతున్నదని రావణుని వలె బెంగగానుండును.

కాని ఆత్మ శరీరము కన్న భిన్నమైనది.
అది శరీరములో ప్రవేశించినది భగవదనుభవము పొందుటకే.
భగవదనుభవమునకు యోగ్యమైనది మానవజన్మ యొక్కటే.
మానవ జన్మ యౌవ్వనము లాంటిది.
ఆజన్మ గడిచిపోవకముందు భగవదుగ్రహము పొందవలెను.
పురుషుని అనుభవించక గడిచిపోయిన స్త్రీయౌవ్వనము వలె మానవ జన్మ వ్యర్థమగును.

దేవతలు నిత్య యౌవ్వనము కలవారు అనడములో రహస్యము ఇదే.
నిత్యము భగవదనుభవశీలురగువారే దేవతలు.
దానినే యౌవ్వనము అందురు.

మానవజన్మపొందియూ,
భగవదనుభవముకోసము యత్నింపక
కర్మఫలములను అనుభవించుటలో నే మునిగి వున్నవారిపై భగవంతుడు విచారించుచుండును.

ఇక్కడ రావణుడు ,
సీతను రామునియందు మనస్సు విడిచి భోగములందు ప్రవర్తించమని అడుగుతాడు".
వైదేహీ ! నిన్ను చూచి సాక్షాత్తు బ్రహ్మ అయినా వదలి వెళ్ళగలడా !"
అంటూ అనేకమైన ప్రలోభములు చూపిస్తాడు.
రాముని నిందిస్తాడు.

రావణుడు రామునిపై చెప్పిన మాటలు
దేహాత్మాభిమానముచే అహంకరించిన మానవుడు
భగవంతునిపై చెప్పుమాటలు వలెనుండును.
ఇది అంతయూ మనస్సు ప్రభావము.
మనస్సు ఎఫ్ఫుడూ "నేనే గొప్ప" అనిపించును.

మనస్సు ఐశ్వర్యములు, భోగములు, భాగ్యములను చూపి
భగవంతునికి దూరము చేయ యత్నించును.

చివర రావణుని మాటలు
" త్రాగుము తిరుగుము రమించుము అనుభవించుము,
భోగములను ధనమును భూమిని నేను ఒసంగెదను.
నాయందు నీవు హాయిగా రమింపుము.
నిన్ను చేరి నీబంధువులు హాయిగా రమింతురుగాక" -
ఈ మాటలలో త్రాగి భోగలాలసుడై హేలగా తిరిగెడి మానవుని ఊపు కనపడును.

అదే ఇక్కడ ముఖ్యమైన విషయము.

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||