||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ఇరవై ఓకటవ సర్గ ||

||సీతారావణ సంవాదము||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ఏకవింశస్సర్గః

సుందరకాండ.
అథ ఏకవింశస్సర్గః

తత్త్వదీపిక
సీతమ్మవారి ఉపదేశము

రావణుని ప్రగల్భాలతో కూడిన భాషణకి సీత సమాధానమే ఇరవై ఓకటవ సర్గలో విషయము.

ఈ సర్గలో వాల్మీకి,
సీత "తృణమంతరః కృత్వా" అంటే,
గడ్డిపోచ మధ్యలో పెట్టి,
రావణుడికి సమాధానము చెప్పినది అంటాడు.

తృణము అంటే గడ్డిపోచ.

గడ్డిపోచ మధ్య లో పెట్టడములో,
రావణుడు గడ్డిపోచ తో సమానము అని ఒక ధ్వని వినిపిస్తుంది.
గడ్డిపోచకైనా తనతో మాట్లాడే అర్హతకలదు,
కాని రావణునికి ఆ అర్హతకూడాలేదు అని ఇంకోధ్వని

గడ్డిపోచచే వెంటాడిబడిన వాయసము ,
మూడులోకములు తిరిగి రాముని శరణాగతి కోరడము వలననే తన ప్రాణము కాపాడుకోగలిగింది .
అంటే రావణుడి గతి కూడా అదే అవుతుంది అని మరింకో ధ్వని వినిపిస్తుంది.

ఆ కాలానుసారముగా ఒక పతివ్రత పరపురుషులతో మాట్లాడదు.
దానికి అనుగుణముగా గడ్డిపోచ మధ్యలో ఉంచి మాట్లాడినది అనడము సామాన్య న్యాయము.
అది కూడా ఒక ధ్వని.

సీత కోపముతో "వేపమానా", అంటే వణికి పోతూ,
ఒక గడ్డిపోచను మధ్యలోపెట్టి ప్రత్యుత్తరమిస్తుంది.

మాట్లాడిన సీత "శుచిస్మిత".
అంటే మందహాసముతో సీత మాట్లాడినది అన్నమాట.
అంతదుఃఖములోనూ, "తృణమంతరః కృత్వా" గడ్డుపోచను మధ్యలో నిలిపి, మాట్లాడిన సీత,
సాక్షాత్తు జగన్మాత.

కుమారుడు అనరాని మాటలాడిననూ ,
వాత్సల్యముచే తల్లి ఎలాగ కోపము రాదో,
అలాగే సీతమ్మకు కూడా కోపము రాలేదు.
మోయలేని బరువును, తినలేని పదార్థమును పసివాడు కోరినపుడు
తల్లి ఎట్లుచిరువ్వు నవ్వునో అలాగ,
పాపము తెలివితక్కువవాడు కోరకూడనది కోరుచున్నాడని
జాలితో మందహాసము చేసిన తల్లి సీత.

ఆ నవ్వులో పవిత్రతయే గాని, కాలుష్యము లేదు.
క్రోధము లేదు. ద్వేషము లేదు.
అప్పుడు సీత చెప్పిన మాట.

"నివర్తయమనో మత్తః
స్వజనే క్రియతాం మనః|"
" నా మీద నుంచి నీ మనస్సు మళ్ళించికో.
నీ వారిపై మనస్సు మళ్ళించుకో"

"సాధుధర్మం అవేక్షస్మ
సాధు సాధు వ్రతం చర|"
"రావణా ! సాధు ధర్మముల ను పాటించుము "

ఇది ఒక ఉపదేశము.
సీత రావణునికి ఇచ్చిన ఉపదేశము.
పరస్త్రీలను కాక్షించే పురుషులకి ఇది మహోపదేశము.
పరమాత్మకు చెందిన ఆత్మని ,
తనదిగా భావించెడి జీవులకు చేయబడు జ్ఞానోపదేశము ఇది.

భగవంతునికి చెందిన సీతమ్మయే ఆత్మ.
ఆ సీతమ్మను తనది గా చేసుకొనవలెనని రావణుని ప్రయత్నము.
అది కాదు అని సీతమ్మ ఉపదేశము.

ఈ విధమైన తప్పుడు ఆలోచనలకు కారణము మనస్సు.
ఆలా బంధము కలిగించేది మనస్సు.
ఇది ( అంటే ఆత్మ) భగవానునిది.
అనుభవింపచేయువాడు, అనిభవించువాడు భగవంతుడే.
అటువంటి భావముతో వెళ్ళువారికి మనస్సు బంధముకాదు.
అందుకే సీత రావణుని "నివర్తయ మనో బుద్ధి" అంటుంది.
'నీ మనస్సును నివర్తించుకో', అని.

అదే ఉపదేశ ధోరణిలో ఇంకో మాటచెపుతుంది.
పరుని భార్యను అనుభవింపకోరిక కలిగినపుడు,
"నాభార్యను ను వేరొకడు బలాత్కరించినచో ఏట్లువుండును" అని ఆలోచించుకొనవలెను.
"తన భార్యను ఇతరుల వశముకాకుండా రక్షించుకొనవలెనని తాను ఎట్లు ప్రయత్నించునో ,
అట్లే ఇతరుల భార్యలు కూడా రక్షింపతగుదురు అని తలచి, నీవు నీ భార్యలతో రమించుము" ఆని.
అదే సీతచెప్పిన మాట.

"పరదారాః పరాభవం" అంటూ ,
పరస్త్రీలను కాక్షించువాడు ఆ పరస్త్రీలచే తప్పక పరాభవము పొందును అని కూడా,
సీత ఉపదేశము.

ఇక్కడ మాతృమూర్తివలె ఎంత ఉదారముగా సీత ప్రవర్తించుచున్నదో చూడతగిన విషయము.
"ఇక్కడ సద్బుద్ధి కలవారు లేరా ?.
సత్పురుషులున్నా వారిని నీవు అనుసరించవేమో.
అందువలనే నీ బుద్ధి శిష్టాచారములను వదిలి విపరీతముగా వ్యవహరిస్తున్నది."

రాజు శిష్టాచారము పాలించకపోతే కలిగే నష్టముకూడా సీత చెపుతుంది.
"చేయకూడని పనులపై ఆసక్తి కల రాజుల పరిపాలనలో,
సమృద్ధమైన రాష్ట్రములు, నగరములు కూడా నశించిపోతాయి.
అలాగే రత్న సంకులములతో వున్నఈ లంక,
నీ అపరాధము వలన త్వరలో నే నశించిపోవును.
ఈ విధముగా పాపకర్మలు చేసిన నీవు నశించినప్పుడు,
నీ వలన కష్టపడినవారందరూ 'ఈ రౌద్రుడి వినాశము కలిగినది' అని సంతోషిస్తారు".

"శక్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా"
అంటూ "ధనము ఐశ్వర్యములతో నన్ను ప్రలోభము చేయడానికి శక్యముకాదు" అని చెపుతున్నప్పుడు,
అలాగే "భాస్కరేణ ప్రభా యథా" అంటే "సూర్యుని తో కాంతి లాగా",
తను రాఘవునితో వుండునని చెపుతున్నప్పుడు,
తాను భగవంతునితో కలిసిఉండే లక్ష్మిని అని ధ్వని వినిపిస్తుంది.

రాముడే పరమాత్మ, తను(సీతయే) ఆయనతో కలిసివుండే లక్ష్మి అని ధ్వని.

ఇలాగ ఉపదేశ ధోరణిలో సీత రావణుడికి చెపుతున్న మాటలలో,
మనకి వినిపించేది ఇంకోమాట.

భగవత్ ప్రాప్తిని కాంక్షించు జీవుడు,
విషయభోగములు లాంటి లాటరీలు ఎదురుగా వచ్చి లోభ పెట్టుచున్నప్పుడు వాటికి వశపడక,
తలచదగిన భావనలను ఇక్కడ సీత ఉపదేశించుచున్నది అన్నమాట.

పరమాత్మకే చెంది ,
పరమాత్మచేతనే రక్షింపబడి,
పరమాత్మచేతనే అనుభవింపబడతగిన ఆత్మ ,
ఐశ్వర్యమునకు ధనమునకు వశపడి,
భగవానునికి దూరమై మనస్సుకి వశము అగుటకన్నా అవివేకము లేదు అని వినిపించేది ఇంకొమాట.

నిజానికి ఆ గడ్డిపోచచే పరుగెత్తించబడి
చివరికి రామునే శరణు కోరిన వాయసము వలె,
రావణుడు కూడా రాముని శరణాగతి కోర వలసిన వాడు.

అట్టి దురభిమాని "శరణాగతి" కోరమంటే అహంకరించి తిరస్కరించునేమో అని ,
ఒక మాతృమూర్తి భావనతో తల్లి పిల్లవానికి నచ్చచెప్పినట్లు ,
"తేన మైత్రీ భవతు" అంటూ రామునితో మైత్రి చేసికొనమని సీత రావణునితో చెప్పును.

మైత్రి అంటే ఇద్దరూ సమానులే అన్నభావన వచ్చును.
కనక రావణునికి అంగీకారముగా వుండునని సీతమ్మభావన.
కాని అది కూడా కుదరని మాట రావణునికి.

"తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్చసి"
అంటే జీవించాలనే కోరిక ఉంటే రామునితో మైత్రి చేసుకొనుము" అని.

ఆ మాటలో ఇంకో విషయము వుంది.

మనము శరీరముతో ఉండి కదలుట మాత్రమే జీవించుట అనుకుంటాము.
అది జీవించడము కాదు.

శరీరము ఆత్మను వీడకుండా ఉండుట జీవనము.
ఈ బాహ్యశరీరము ఆత్మను వీడకుండా ఉండుట జీవనము.
శరీరమునకు ఆత్మ ఎట్లో, ఆత్మకు పరమాత్మ అట్లే ఆత్మయై వుండును.
ఆ పరమాత్మతో దూరముకాకుండా కలిసియుండుట యదార్థముగా జీవించుట.
అట్టి జీవనము కోరినచో పరమాత్మతో మైత్రితో యుండవలెనని సీత ఉపదేశము.

మరి ఇంతద్రోహము చేసిన వానితో మైత్రికి
రాముడు అంగీకరించునా అన్న విషయము కూడా సీత చెపుతుంది.
రాముడు "విదితః ధర్మజ్ఞః శరణాగత వత్సలః" అంటూ.
"ప్రసాదయస్వ త్వం చైనం శరణాగతవత్సలమ్" అంటుంది
అంటే దోషములున్నాకాని "శరణుకోరినవారిని అనుగ్రహించే రాముని ప్రసన్నుని చేసికో" అని.

దోషములను భోగ్యముగా అనుభవింపతగినవి అని తీసుకొనుటయే వాత్సల్యము.
కాస్త నలిగిన గడ్డిని కూడా విడిచిపెట్టే ఆవు,
తాను ఈనిన దూడ ఒడలిఅందలి మాలిన్యమును రుచ్యముగా భుజించును.
అదే వాత్సల్యము.
తల్లి బిడ్డల దోషములను పక్కకి తీసి బిడ్డలను చేరదీయటమే వాత్సల్యము.

మనము కూడా రావణుని వలే
భగవంతునికి ఆగ్రహము కలిగించు అపరాధములను ఎన్నో చేస్తాము.
వాటికి ప్రాయశ్చిత్తము లేదు.
ఆ భగవంతుడే ఉపాయమని భగవంతునినే ప్రేమించుట మనకర్తవ్యము.
అప్పుడు మనకి దొరికేది భగవత్ వాత్సల్యము.

రావణునికి సీతమ్మచేసిన ఈ ఉపదేశము సంసారులందరికి కూడా ఉపదేశమే.
భగవంతుని వస్తువును మనది గా చేసికొని అహంకరించు సంసారులు చేయవలసినది,
భగవంతుని వస్తువు భగవంతునికి సమర్పించుటయే,.

"గిరిం కుబేరస్య గతోsపధాయ వా
సభాం గతో వా వరుణస్య రాజ్ఞః |" అంటూ
అలాకాక తనతోవలోనే వెళ్ళితే
ఎక్కడున్నా తప్పించుకోలేవు అని చెప్పిన మాట, .
భగవంతుని వదిలి తమత్రోవలోనే పోయే సంసారులందరికి కూడా సీతమ్మ చెప్పిన ఉపదేశము.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో
సుందరకాండలో ఇరువది ఒకటవ సర్గ లో మనము వినేది చూసేది
ఒక మాతృమూర్తి స్వరూపము.

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||