సుబ్బలక్ష్మిగారి కలం నుంచి

సాంఖ్య యోగములో.... !!!

సాంఖ్య యోగములో చాలా విషయాలు ఉన్నాయి.

ఒకచోట అత్మ గురించి చెప్పుతూ మోక్షము అంటే ఏమిటి అది ఎవరికి సాధ్యము అన్న మాట కృష్ణ భగవానుడు చెపుతాడు ( 2:15)

ముందుగా విశదీకరించినది సమత్వము. ముఖ్యముగా ఇంద్రియములద్వారా కలుగు సుఖదుఃఖములను ఏవరు సమదృష్ఠితో చూడగలరో వారిని ఏమీ బాధపెట్టవు,ఆ బాధలేనప్పుడే మిగిలిన విషయాలు వస్తాయి.

ఇప్పుడు ఆ శ్లోకము చూద్దాము:

శ్లో|| యం హి న వ్యధయం త్యేతే పురుషం పురుషర్షభ|
సమ దుఃఖ సుఖం ధీరం సః అమృతత్వాయ కల్పతే ||15||

స|| హే పురుషర్షభ ! ఏతే సమ దుఃఖం సుఖం ధీరం యం పురుషం న వ్యధయంతి సః ( పురుషః ) అమృతత్వాయ ( మోక్షాయ) కల్పతే |

ఏతే - అంటే ఈ ఇంద్రియములచే కలిగింపబడు
సమ దుఃఖం సుఖం ధీరం - సుఖ దుఃఖములయందు సమానముగా చూడగల గల ధైర్యము కలవాడు ,
యం పురుషం న వ్యధయంతి - ఏ మనుష్యుని అవి( సుఖ దుఃఖములు) బాధింపవో
సః - అట్టి పురుషుడు
అమృతత్వాయ కల్పతే - మోక్షమునకు తగియున్నాడు

అలా సుఖదుఃఖములచే బాధింపబడని వ్యక్తి మోక్షమునకు తగియున్నాడు.
మోక్షమంటే ఏమిటీ
- మరణరహితమగు శాశ్వత ఆనంద పదవి
దానిని ఏవరు పొందగలరు
- ఇంద్రియములచే కలిగింపబడువిషయములచే చలించని వారు;
- విషయములవలన కలిగిన సుఖదుఃఖములందు సమత్వము గలవారు

ఈ శ్లోకములో ముందు ధీరులు ఎవరో చెప్పి ఆ ధీరులు మోక్షమునకు తగిన వారి అని చెపుతారు.

ఇది అద్వైత సిద్ధాంతం.
మోక్షమంటే ఏదో చని పొయినతర్వాత కలిగే సుఖము కాదు
మోక్షము ఈ లోకములోనే పొందవచ్చు.
మోక్షసాధనకి కావలసినది నిష్కామ కర్మ.
విషయములందు ఆశక్తి లేకుండా నిష్కామ కర్మ చెయ్యడము,
నిష్కామకర్మ చేసినప్పుడు కూడా ఆ కర్మ ఫలితముగా
సుఖాలు దుఃఖాలు రెండూ వస్తాయి.
సుఖ దుఖం సమేకృత్వా - అన్నట్లుగా
వాటిని సమానముగా చూస్తూ
వాటి మీద చలించకుండా నిష్కామకర్మ చేయడమే ప్రథానము
అ సుఖ దుఃఖాలు ఎవరిని బాధించవో వారు వారే ధీరులు.
ఆ ధీరులు మోక్షము నకు తగిన వారు.

సుఖ దుఃఖాలు ఎవరిని బాధించవో వారు శాశ్వత ఆనందములో ఉన్నవారు
కోరికలు లేకుండా నిష్కామ కర్మచేస్తూ పొందిన శాశ్వత ఆనందమే మోక్షము.

ఇది ఈ శ్లోకానికి తాత్పర్యము.
ఇది యే శ్రీకృష్ణ భగవానుడు అందరికి చెప్పిన మాట.
వేదపరాయణులకే మోక్షము అన్నమాట లేదు
దీనిలో అడవాళ్ళా మగవాళ్ళా అన్న మాటలేదు.
రాజులా రంకులా అన్నమాట కూడా లేదు.
బ్రాహ్మణుడా శూద్రుడా అన్నమాటకూడా లేదు.
ఇది ఆ నిష్కామ కర్మ చేసి అనందము పొందగల ధీరుల కే

|| ఓమ్ తత్ సత్ ||


 


.