సుబ్బలక్ష్మిగారి కలం నుంచి

రాజ విద్యా రాజగుహ్య యోగము

భగవద్గీత
తొమ్మిదవ అధ్యాయము
రాజ విద్యా రాజగుహ్య యోగము

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
భగవానుడు అర్జునునకు బ్రహ్మజ్ఞానమును గూర్చి చెప్పుచున్నాడు . ఇది విద్యలలోకెల్ల శ్రేష్టమైనది అతి రహస్యమైనది అతి పవిత్రమైనది ధర్మయుక్తమైనది సులభముగా అచరించ తగినది. ఇది నాశరహితమైనది ప్రత్య క్షరమైనది . ఇది వినుటకు చిత్తశుద్ధికలిగిన అసూయలేనివారే అర్హులు.

కనుక విజ్ఞులు స్వల్ప భౌతిక శక్తులు సముపార్జనమందే జీవితము ధార పొయ్యక దైవశక్తి సముపార్జించవలెను. మాయాధీనమగు పరమాత్మ యడల అనన్య భక్తి కలిగి మనస్సును జయించుకొనవలయును. గీతాద్యయనము చేయువారిచేత జ్ఞానయజ్ఞముద్వారా నే పర మాత్మను తెలిసికొనవలెను. సర్వమూ ఒకే భగవత్స్వరూపమనీ అదితన ఆత్మకన్నవేరు కాదని తెలిసికొనవలెను ఇదియే జ్ఞానయజ్ఞము .. ఇదియే అద్వైతభావన ..తత్వమసి మహావాక్య చింతన ...సోహం భావన .. సర్వతోముఖం అన్ని చోట్ల భగవానుని రూపము అస్తిత్వము కలదు అతడు వీక్షించు చున్నాడు కనుక దుష్కార్యములనుండి విరమించుకొనవలెను.
శ్లో|| జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతోమాముపాసతే |
ఏకత్వేన పృధక్త్వేనబహుధావిస్వతోముఖం ||

అనే శ్లోకము లో జ్ఞానయజ్ఞముముయొక్క మహాత్మ్యమును చాటి చెప్పెను

ప్రపంచమందు సమస్త పదార్ధములు భగవద్రూపలే యని క్రమముగాసర్వాత్మ భావమును అలవరచుకొనవలెను క్రతువు నేనే యజ్ఞము నేనే పిత్రుదేవతలకిచ్చు హవ్యము నేనే ఔషధము నేనే అగ్ని నేనే హోమకర్మ నేనే జగత్తుకి తల్లి తండ్రి సంర క్షకుడు తాతను నేనే తెలుసుకొనవలసిన పదార్ధము ఓంకారము ఋక్ యజు స్సామవేదములు పరమగతి భర్త ప్రభు సాక్షి నివాసః పరమశరణ్యుడు ప్రాణమిత్రుడు జగత్తు కి సృష్టి స్థితి లయకారకుడు బీజము పరమాత్మయే తనజన్మ స్థానము తనగోత్రము పుట్టిల్లు పరమాత్మయే తను అల్పుడైనను మూలస్థానము పరమాత్మయే యని తలచుకొని ధైర్యముగాయుండవలెను.

శ్లో|| అనన్యాశ్చింతయంతో మాంయేజనాః పర్యుపాసతే
తేషాంనిత్యాభి యుక్తానాం యోగక్షేమంవహామ్యహమ్||

ఏవరు ఇతర భావములు లేనివారై నన్ను గురించి ధ్యానించు చున్నారో ఎల్లప్పుడూ నాయందే నిష్టకలిగి యుందురో అట్తివారి యోగము అనగా కావలసిన పదార్ధము సమకూర్చుట క్షేమము అనగా దానిని సంరక్షించుట నేనే వహించు చున్నాను అని భగవంతుడు ప్రతిజ్ఞ చేయు చున్నాడు. ఆత్మ జ్ఞానమును అనగా బుద్ధి యోగమును కలుగజేయుచున్నాడు. ఇది గీతలో ముఖ్యమైన శ్లోకము గీతరత్నమాలలో మణి్యై హృదయస్థానము నలంకరించినది

మేము నిరంతరమూ భగవంతుని ధ్యానించు చుండినచో మా సంసారము చూచు వారెవరు అనినచో వాని బాగోగులను నేనే చూచుకొందును జాతి కుల మతము భేధము లేక భగవత్ కృపకు పాత్రులు కాగలరు. వేదములను అభ్యసించిన కొందరు యజ్ఞములద్వారా స్వర్గాది లోకములు పొంది భోగములనుభవించి తిరిగి భూలోకమునజన్మించి చిత్త శుద్ధిద్వరా మోక్షమునకై ప్రయత్నించుచున్నారు

నామరూపసహిత ఇతరదేవతలను ఆరాధించు చున్ననూ సర్వవ్యాపక పరమాత్మను సేవించుట వలన సాక్షాత్తు పరమాత్మ మోక్షమునే ప్రసాదించును.

భగవానుడు చెప్పుచున్నాడు - ఎవరు నాకు పత్రము పుష్పము ఫలమును జలమునూ భక్తితో సమర్పించు చున్నాడొ అది మహాసంతుష్టితో స్వీకరించు చున్నాను అని . నీవు ఏది చేసినను తినిననూ హోమమొనర్చిననూ దానము తపస్సు చేసిననూ దానిని నాకు అర్పింపుము . కృష్ణార్పణమస్తు బ్రహ్మార్పణమస్తు అని చేయుట వలన భగవదనుగ్రహము సిద్ధించును. కర్మసమర్పణ యోగముతో పుణ్యపాపములు ఫలముగాగల కర్మ బంధము నుండి మనము విడి పోగలము.

"యద్యత్కర్మ కరోమి తత్తఖిలం శంభోతవారధనమ్"

అంటే ఓ పరమశివా నేను నడచినను కూర్చొనినను భుజించిననూ అది అంతయూ నీ ఆరాధనమే అని . ముఖ్యముగా పని పాటలు చేసుకునే గృహస్థునకు ఈ పద్ధతి ఎంతయొ సులువుగా యుండును అని ఒకభక్తుడు భగవంతుని గురించి పలికిన మాటలు ఈసందర్భముగా స్మరణీయములు .

భగవానునకు అందరియందు సమానమైన ప్రేమ యున్నది పాపాత్ము డైననూ భగవంతుడు శరణ్యమని నమ్మి ఆశ్రయించినచో శీ ఘ్రముగా పరమ శాంతిని పొందుచున్నాడు.

"న మేభక్తఃప్రణస్యతి ”, నాభక్తుడు ఎన్నటికీ చెడిపోడు అని భగవానుడు ప్రతిజ్ఞచేసెను. ఈ అష్టాక్షరి మంత్రమును ముముక్షువులు నిరంతరమూ గుర్తుంచుకొనవలెను
కల్పవృక్షమును ఆశ్రయించినవానికి దుస్థితి ఎట్లు కలుగును?

శ్లో||మన్మనాభవమద్భక్తో మద్యాజి మంనమస్కురు |
మామేవైష్యసి యుక్వైవమాత్మానంమత్పరాయణః ||”’

నాయందేమనస్సుకలవాడవు నాభక్తుడవు నన్నే పూజించుము నన్నే నమస్కరించుము. ఈ ప్రకారము చిత్తము నా యందేనిలిపి నన్నేపరమ గతిగా నెన్నుకొనిన వాడై నన్నే పొందగలవు. భగవకృపయను గాలి సర్వత్ర వీచుచున్ననూ వారి వారి హృదయమను తెరచాపలను విప్పి భగన్ముఖముగ ఉంచినచో గమ్య స్థానమునకు శీఘ్రముగ చేరగలరు.

||ఓమ్ తత్ సత్ ||

 

!

||ఓమ్ తత్ సత్||

 


.