||సుందరకాండ ||

||పదమూడవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

||ఓమ్ తత్ సత్||
శ్లో|| విమానుత్తు సుసంక్రమ్య ప్రాకారం హరియూథపః|
హనుమాన్వేగవానాసీత్ యథా విద్యుద్ఘనాంతరే||1||
స|| హరియూథపః విమానాత్ సుసంక్రమ్య ప్రాకారం వేగవాన్ యథా విద్యుత్ ఘనాంతరే ఆసీత్||
తా|| ఆ వానరోత్తముడు విమానము నుంచి దిగి ప్రాకారము మీదకి మెఱుపు మెరిసినట్లు దూకెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ త్రయోదశస్సర్గః

ఆ వానరోత్తముడు విమానము నుంచి దిగి ప్రాకారము మీదకి మెఱుపు మెరిసినట్లు దూకెను.

సీత ఎక్కడా కనిపించకపోవడముతో రావణ భవనము బయట తిరుగుతూ ఇట్లా అనుకొనెను. 'రాముని కార్యము చేయుటకు సంచరిస్తూ లంక అంతా తిరిగితిని. కాని సర్వాంగములు శోభాయమానముగావుండు సీత మాత్రం కనపడలేదు".

కొండలూ తటాకములు సరస్సులు నదులూ అలాగే ఎక్కలేని పర్వతములు, దుర్గములు ఇక్కడ వున్న అన్ని ప్రదేశములను వెతికితిని. కాని జానకి కనపడలేదు. సీతా రావణుని భవనములో నున్నది అని గృథరాజు సంపాతి చెప్పాడు. కాని ఆ సీత ఇక్కడ కనపడుట లేదు.

జనకాత్మజ వైదేహి అయిన మైథిలి దుష్టకర్మలు చేయు రావణునికి వశమయ్యనా ఏమి? సీతను తీసుకువస్తూ రామబాణములకు భయపడి తోందరగా ఎగిరిపోతున్న రాక్షసుని నుంచి సీత పడిపోయి ఉండవచ్చు. లేక సిద్ధులు సేవించి మార్గములో తీసుకుపోబడుతున్న ఆ ఆర్యురాలైన సీత హృదయము సాగరమును చూచి పతించినదా ?

రావణుని వేగమునకు, అతడి భుజముల ఒత్తిడికి తట్టుకోలేక ఆ విశాలాక్షి జీవితము త్యజించినదా ? అలా సాగరము పైకి పైకి పోవుచున్న రావణుని నించి విడివడానికి యత్నిస్తున్న సీత సముద్రములో బహుశ పడిపోయి ఉండవచ్చు.

అయ్యో ! తన శీలము రక్షించుకుంటూ తనబంధువులనుంచి దూరమైన ఆ తపస్విని ఆ దుష్టునుచేత తినబడినదా? లేక ఆ అసితేక్షణ సజ్జనురాలైన సీత, దుష్టభావములు కల రాక్షసేంద్రుని పత్నులచేత తినబడి ఉండవచ్చు

దీనురాలు పూర్ణచంద్రుని వంటి వదనము కల పద్మపత్రములవంటి కనురేకులు గల సీత రాముని ధ్యానిస్తూ పంచత్వము పొందినదేమో. వైదేహి అగు మైథిలి, 'ఓ రామా ఓ లక్ష్మణా ఓ అయోధ్యా', అని బహువిధములుగా విలపిస్తూ దేహమును త్యజించనేమో.

లేక రావణుని భవనములో బంధించబడిన సీతా పంజరములోని శారీకము వలె విలపిస్తున్నదేమో. జనకుని సుత రామపత్నిసన్నని నడుముకల కమలరేకులవంటి కన్నుకుగల సీతా రావణుని వశము ఏట్లు అగును?

'రాముని ప్రియమైన భార్య చంపబడినను,చిత్రవధచేయబడినను , మరణించిననూ ఆ విషయము చెప్పుట భావ్యము కాదు. చెప్పుటచే దోషము కలుగును. చెప్పకపోయిననూ కూడా దోషమే. ఇప్పుడు కర్తవ్యము ఏమిటో నాకు విషమము గా కానవస్తున్నది. ఈ కార్యములో ఏది శ్రేయస్కరము', అని మళ్ళీ హనుమంతుడు విచారణలో పడెను.

నేను సీతను చూడకుండా ఇక్కడనుంచి వానరేంద్ర పురికి పోయినచో అప్పుడు నేను చేసిన పుషకార్యము ఏమిటి? నా సాగరలంఘనము , లంకాప్రవేశము రాక్షసుల దర్శనము ఇవన్నీ వృధా అవుతాయి.

కిష్కింధ చేరగానే నన్ను సుగ్రీవుడు , తోడ వున్న వానరులు , దశరధాత్మజులు నన్ను ఏమి అంటారు ? వెళ్ళి కాకుస్థునకు సీత కనపడలేదు అన్న అప్రియమైన మాట చెప్పినచో అప్పుడు తప్పక ( ఆ రాముడు) జీవితము త్యజించును. పరుషమైన దారుణమైన కౄరమైన ఇంద్రియములను తపించు ఈ దుర్వాక్యములను విని ఆ రాముడు ఇక బ్రతికి ఉండడు.

పంచత్వము పొందిన ఆయనను చూచి భ్రాతానురక్తుడైన మేధావి లక్ష్మణుడు కూడా ఉండడు. అన్నదమ్ములిద్దరూ పోయిరి అన్నమాట విన్న భరతుడు కూడా ఉండడు. భరతుడు మరణించుట చూసిన శతృఘ్నుడు ఉండడు. ఆ విధముగా పుత్రుల స్థితిని చూచి తల్లులు కౌసల్య సుమిత్ర కైకేయి కూడా ఉండరు. ఇందులో సందేహము లేదు

కృతజ్ఞుడు సత్యసంధుడు వానరులరాజు అయిన సుగ్రీవుడు ఆ విధముగా పోయిన రాముని చూచి తన జీవితము వదులును. భర్తుశోకము చే పీడింపబడు అనందములేని తపస్విని రుమా తన జీవితము త్యజించును. వాలిశోకముతో కృశించిపోయిన తార, వానర రాజు పంచత్వము పొందగా నిస్సందేహముగా ప్రాణములు త్యజించును.

అంగద కుమారుడు తన తల్లితండ్రుల మరణాలతో, సుగ్రీవుని మరణముతో ఎట్లు జీవించును ? వానరులు రాజుయొక్క మరణముతో దుఃఖితులై తలలను పిడికలతో కొట్టుకొని బలవన్మరణము పొందెదరు. యశోవంతుడు అగు కపిరాజుచే గౌరవముతో సాంత్వముతో కానుకలతో లాలింపబడిన వానరులు ప్రాణములను త్యజించెదరు.

కపికుంజరులు కలిసి వనములలో, కోండలలో , గృహములలో మళ్ళీ క్రీడలు అనుభవించలేరు. పుత్రులతో భార్యలతో అమాత్యులు రాజుపోయిన శోకముతో పీడింపబడి శైలాగ్రములనుంచి సమప్రదేశములలో పడి మరణించెదరు. వానరులు విషము తాగికాని ఉరిపోసికొని కాని అగ్నిప్రవేశము చేసి కాని శస్త్రములతో కాని ప్రాణములు విడిచెదరు

నేను వెళ్ళితే ఇక్ష్వాకుకులనాశనము వానరులనాశము అయి భయంకరమైన రోదనములు అగును. నేను కిష్కింధనగరము వెళ్ల కూడదు. నేను మైథిలి చూడకుండా సుగ్రీవుని చూడను.

నేను వెళ్ళక ఇక్కడే ఉంటే ధర్మాత్ములు మహారథులగు రామలక్ష్మణులు మానవంతులు అగు వానరులు ఆశతో ఉండెదరు. జనకాత్మజను చూడక చేతికి దొరికినది నోటికి దొరికినది అనేక మూలఫలములతో చెట్లకింద నివసిస్తూ వానప్రస్థ జీవనము గడిపెదను.

అరణిలచేత మండింపబడిన చితిని చేసి ప్రవేశించెదను . లేక ఇక్కడే కూర్చుని ఉపవాసము చేస్తున్న నా శరీరము వాయసములు కుక్కలు భక్షించుగాక. మహర్షులు చెప్పిన నిర్యాణ మార్గము ఇదే అని నాకు అనిపిస్తుంది.

సీతను చూడకపోవడముతో ఈ దీర్ఘమైన రాత్రి శుభముగా సానుకూల ఘటనలతో మొదలై నిరర్థకముగా పరిణమిస్తున్నది. ఆ సీతను కను గొనకుండా ఇక్కడనుంచి నేను వెళ్ళను . ఆ సీతను కనుగొనకుండా ఇక్కడనుంచి వెళ్ళినచో అంగదునితో కూడి వానరులందరూ మరణించెదరు.

'మరణము అనేక దోషములకు కారణము. బ్రతికి జీవి అనేక శుభములు చూడవచ్చు. అందువలన ప్రాణములను తప్పక ధరించెదను'.ఆ కపికుంజరుడు ఇలాగ అనేక విధములుగా ఆలోచించి మనస్సులో దుఃఖపడిననవాడై శోకసముద్రానికి అవతలి తీరము చేరలేక పోయెను.

'దశగ్రీవుడైన మహాబలుడు అగు రావణుని వధించెదను. చనిపోయిన సీత కోరిక తీరును. ప్రతిక్రియకూడా అగును. లేక పశుపతికి ఇవ్వబడు పశువు వలె రావణుని సాగరముపై తీసుకొని పోయి రాముని కి సమర్పించెదను'. వానరుడు సీతజాడను కనుగొనలేక చింతాశోకపరాయణుడై మరింక ఆలోచించ సాగెను.

' రామపత్నీ యసస్వినీ అగు సీతజాడ కనపడువరకు ఈ లంకానగరమును మళ్ళీ మళ్ళీ వెదకెదను. సంపాతి వచనములను నమ్మి రాముని ఇక్కడకు తీసుకు వచ్చినచో రాఘవుడు తన భార్య కనపడక వానరులందరినీ దహించివేసెడివాడు. ఇక్కడే నియమిత ఆహారముతో ఇంద్రియ నిగ్రహముతో ఉండిపోయెదను. నా కారణముగా నరవానరులు నశింపరాదు'.

' ఈ మహావృక్షములతో నున్న అశోకవనము కనపడు చున్నది. ఇంతవరకు ఈ వనము లో వెదకలేదు. దానిలోకి వెళ్ళెదను. వసువులకు రుద్రులకు అలాగే అదిత్యులకు అశ్వినీ దేవతలకు నమస్కరించి రాక్షసుల శోకము అధికము చేయుటకు వెళ్ళెదను. రాక్షసులందరినీ జయించి తపస్వికి సిద్ధి చేరినట్లు ఇక్ష్వాకుకులనందినీ ని రామునికి చేర్చెదను'. మహాతేజోవంతుడు మారుతాత్మజుడు అగు హనుమంతుడు కాసేపు ధ్యానము చేసి దుఃఖమనే బంధమును తెంచుకొని నిలబడెను.

' లక్ష్మణునితో కూడిన రామునకు నమస్కారము. దేవి అయిన జనకాత్మజకు నమస్కారము. రుద్రుడు ఇంద్రుడుయముడు అనిలిడు వీరందరికీ నమస్కారములు.చంద్రుడుసూర్యునకు మరుత్ గణములకు నమస్కారము'.

ఆ మారుతి వారందరికీ ప్రణమములు అర్పించి సుగ్రీవునకు కూడా నమస్కరించి, నలువంకలాచూచి అశోకవనముపై తన దృష్టి సారించెను. మారుతాత్మజుడగు ఆ వానరుని మనస్సు ముందరే అశోకవనిక చేరి, తదనంతర కర్తవ్యము గురించి ఆలోచింపసాగెను. 'అనేకమైన వృక్షములతో సర్వసంస్కారములతో సుందరమైన ఆ అశోకవనికా తప్పక రాక్షసులతో వుండును'.

'ఇక్కడ వృక్షములు తప్పక రాక్షసులు చేత రక్షింపబడివుండును. సర్వాత్ముడైన వాయుదేవుడు కూడా మెల్లగా వీచుచున్నాడు. నేను కూడా రామకార్యముకొఱకు రావణునికి కనపడకుండా ఉండుటకు నా రూపము చిన్నదిగా చేసుకొంటిని".

'ఇక్కడ ఋషిగణములతో కూడిన దేవులు నాకు సిద్ధి కలిగించుగాక. స్వయంభు బ్రహ్మ దేవతలందరూ అగ్ని వాయువు ఇంద్రుడు , పాశము చేతులో కలవాడు, వరుణుడు, చంద్రుడు , సూర్యుడు,అశ్వినులు , మరుత్గణములు అందరూ నాకు సిద్ధిని కలుగించుదురు గాక. సమస్త భూతములు , ఆ భూతముల ప్రభువు , ఇంకా కనపడని దేవతలూ కూడా నాకు సిద్ధి కలిగించుగాక'.


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సున్దరకాండే త్రయోదశస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో పదమూడవ సర్గ సమాప్తము

||ఓమ్ తత్ సత్||
శ్లో||క్షుద్రేణ పాపేన నృశంసకర్మణా
సుదారుణాలంకృత వేషధారిణా|
బలాభిభూతా హ్యబలా తపస్వినీ
కథం ను మే దృష్టిపథేఽద్య సా భవేత్ ||69||
స|| క్షుద్రేణ పాపేన నృశంసకర్మణా సుదారుణాలంకృతవేషధారిణా బలాభిభూతా తపస్వినీ సా అబలా అద్య మే దృష్టిపథే కథం భవేత్ ను||
తా|| క్షుద్రుడు పాపి దుష్టకర్మలు చేయు అలంకారములచే ప్రసన్న వేషధారణలో ఉండెడి రావణుని చేత బలాత్కారముగా ఎత్తుకుపోబడిన అబలా తపస్విని నా దృష్టిపథములో ఎప్పుడు ఎలా వచ్చునో '||
||ఓమ్ తత్ సత్||