||సుందరకాండ ||

||పదహేడవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

||ఓమ్ తత్ సత్||
శ్లో|| తతః కుముదషణ్డాబో నిర్మలో నిర్మలం స్వయం|
ప్రజగామ నభశ్చన్ద్రో హంసో నీలమివోదకమ్||1||
స|| తతః కుముదషణ్డాభః స్వయం నిర్మలః చన్ద్రః నిర్మలం నభః జగామ యథా హంసః నీలం ఉదకం ఇవ||
తా|| అప్పుడు స్వయముగా నిర్మలమైన , కుముదముల సమూహములాగ కాంతివిరజొల్లుచున్న చంద్రుడు నిర్మలమైన ఆకాశములో నీలమైన ఉదకములో ఈదుచున్న హంసవలె ఉదయించెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ సప్తదశస్సర్గః

అప్పుడు స్వయముగా నిర్మలమైన , కుముదముల సమూహములాగ కాంతివిరజొల్లుచున్న చంద్రుడు నిర్మలమైన ఆకాశములో నీలమైన ఉదకములో ఈదుచున్న హంసవలె ఉదయించెను.

నిర్మలమైన కాంతిగల చంద్రుడు తన చల్లని కిరణములు, వాటి కాంతులతో పవనాత్మజునికి సహాయము చేస్తున్నాడా అన్నట్లు సేవించసాగెను.

అప్పుడు ఆ పూర్ణచంద్రునుబోలి ముఖము కల హనుమంతుడు భారముగా వుండి నీటిలో మునిగిపోతున్న నావ వలె శోకభారమును మోయుచున్న సీతను చూచెను.

వైదేహిని చూచుచున్న ఆ హనుమంతుడు పక్కనే వున్న ఘోరరూపముకల రాక్షస స్త్రీలను చూచెను.

ఒకే కన్ను కలదానిని, ఒకే చెవి కలదానిని, వళ్ళంతాచెవి కలదానిని, చెవి లేనిదానిని ,శంకువు వంటి చెవి కలదానిని, మస్తకముపై లేచిన ముక్కు కలదానిని, శరీరము నకు మించిన తలగలదానిని, అతికాయము కలదానిని , ఉత్తమమైన అంగములు కలదానిని, ధ్వంసమైన కేశములు కలదానిని, కేశములు లేనిదానిని, శరీరము అంతా కంబళి వలె కేశములు కలదానిని, పోడువైన చెవులు కలదానిని, పొడువైన ఉదరము స్తనములు కలదానిని, పొడువైల పెదవులు కలదానిని, చుబుకముపై పెదవులు కలదానిని, పొడువైనదానిని ,పొడువైన జానువులు కలదానిని చూచెను.

పొట్టిదానిని, పొడువుగావున్నదానిని, మరుగుజ్జును,వికటమైన రూపముకలదానిని, వామనరూపము కలదానిని, అలాగే ఎత్తుపళ్ళుకలదానిని, వికృతమైన ముఖముకలదానిని, ఎఱ్ఱనికళ్ళు కలదానిని చూచెను. వికృతమైన దానిని, ఎఱ్ఱగావున్నదానిని, నల్లగా వున్నదానిని, మంచి క్రోధములో ఉన్నదానిని, కలహముచేయుటలో కోరికగలదానిని, శూలములు పట్టుకువున్నదానిని, గూటములు ముద్గరములు పట్టుకు ఉన్నదానిని చూసెను. వరాహము, లేళ్ళ, శార్దూల, మహిషముల, ఆడనక్కల ముఖముల లాంటి ముఖములుకల వారిని, గజము, ఉష్ట్రము, హయముల పాదములవంటి పాదములు కలవారిని , మేడలేకుండా శిరస్సు వున్నవారిని చూచెను.

ఒకే హస్తము కలదానిని, ఒకే పాదము కలదానిని, ఖరము యొక్క చెవి కలదానిని, గుఱ్ఱముయొక్క చెవి కలదానిని, గోవు యొక్క చెవి కలదానిని, గజముయొక్క చెవి కలదానిని, అలాగే ఇంకొక కోతి చెవి కలదానిని, చూచెను. అలాగే ముక్కు లేని దానిని, పెద్దముక్కు కలదానిని, వంకరముక్కు కలదానిని, వికృతమైన నాసిక కలదానిని, గజము యొక్క తొండములాంటి నాసికకలదానిని, లలాటముదాకాసాగివున్న ముక్కు కలదానిని కూడా చూచెను.

ఏనుగు పాదములు, పెద్దపాదములు, గోవు పాదములు కలవారిని, పాదములమీద జుట్టు కలవారిని, అతిమాత్రమైన మెడలు కలవారిని, అతిమాత్రకుచములు ఉదరములు కలవారిని, కూడా చూచెను. అలాగే పొడవైన కళ్ళు కలవారిని, పొడువైన నాలుక కలవాదానిని, పొడువైన గోళ్ళుకలదానిని, అలాగే అజాముఖము, హస్తిముఖము, గోముఖము, సూకరీ ముఖము కలవారిని చూచెను.

గుఱ్ఱము, ఒంటె, గాడిదలముఖము కలవారిని, చూడడానికి ఘోరముగా వున్నరాక్షస స్త్రీలను, శూలము ఉద్గరము చేతిలో పట్తుకొని ఉన్నవారిని, కోపస్వభావము కలవారిని , కలహప్రియులను కూడా చూచెను.

పెద్ద నోరు కలవారిని, పొగరంగుకేశములు కలవారిని, వికృతమైన కళ్ళు కలవారిని, ఎల్లప్పుడు తాగుచూ ఉన్నరాక్షసస్త్రీ లను , మాంసము మద్యము పై మోహము లో ఉన్నవారిని చూచెను. రక్తమాసములతో తడిసిన అంగములుకలవారిని, రక్తమాంసములు భోజనము చేయువారిని, చూచుటకుగగుర్పాటుకలగించు రాక్షస స్త్రీలను, విశాలమైన బోదెకల ఆ మహావృక్షము చుట్టూ ఉపాసీనులైన రాక్షస స్త్రీలను అ వానరశ్రేష్ఠుడు చూచెను.

లక్ష్మీ వంతుడైన హనుమంతుడు ఆ చెట్తుకింద శోకములో ఉన్న రాజపుత్రీ జనకాత్మజ ఆగు ఆ దేవిని చూసెను. ప్రభలేని, శోకములో మునిగియున్న, మాలిన్యముతో కూడిన కేశములు కల ఆమె, క్షీణించిపోయిన పుణ్యములతో భూమి యందు రాలిన నక్షత్రము వలె నున్నది. పాతివ్రత్యదర్మముతొ సంపన్నురాలైన, భర్త దర్శనములేని దుర్గతిలో ఉత్తమమైన భూషణములు లేకుండా వున్న ఆమె , భర్తపై వాత్సల్యము అనే ఆభరణముతో అలంకరింపబడినది.

బంధువులు లేక, రాక్షసాధిపుని ఆధిపత్యములో ఉన్న ఆమె తన సమూహమునుకోలుపోయి సింహముచే అడ్డగింపబడిన ఆడఏనుగు వలె నున్నది. వర్షాకాలము చివరిలో శరత్కాలమేఘములచే కప్పబడిన చంద్ర రేఖవలె నున్న, క్లిష్టమైన రూపములో ఉన్నఆమె, ఉపయోగించబడని తీగెలు సారించని వీణలా వున్నది.

భర్తవశములో ఉండతగిన, రాక్షస్త్రీల వశములో ఉండకూడని ఆమె, అశోకవనిక మధ్యలో శోకసాగరములో మునిగి ఉన్నది. అక్కడ గ్రహములచేత పీడింపబడిన రోహిణి వలె ఆ రాక్షస్త్రీలచేత చుట్టబడి ఉన్న, కుసుమమైన లతలా వున్న ఆ దేవిని హనుమంతుడు దర్శించెను.

మాలిన్యముతో కూడిన అంగములు కలదైనప్పటికీ అలంకరింపడియున్నట్లు వున్న ఆమె ఒకవిధముగా ప్రకాశము కల ఇంకోవిధముగా ప్రకాశములేని బురదలో ఉన్న తామర పువ్వు వలె నున్నది. ఆ హనుమంతుడు మలిన రహితమైన వస్త్రములతో చుట్టబడియున్న లేడి కన్నుల వంటి కన్నులుకల అమెను చూచెను. దీనవదనము కల, భర్తతేజసముతో ధైర్యమువహించిన, నల్లని కళ్ళు కల, తన శీలము తో తననే రక్షించుకొనుచున్నఆ సీతను హనుమంతుడు చూచెను.

ఆ లేడికన్నుల వంటి కన్నులగల ఆ సీతను చూచి హనుమంతుడు భీతి చెందిన లేడి వలె నున్నది అని అనుకొనెను. ఆమె ఉచ్చ్వాస నిఃశ్వాసములతో ఆచెట్టుపైనున్న చిగుర్లను దహించివేస్తున్నదా అన్నట్లు వున్నది. శోకముల సమూహము వలె నున్న, పైకి లేచిన దుఃఖతరంగములవలె నున్న ఆ సీతను హనుమంతుడు చూసెను.

ఆ క్షమారూపము కల, ఆభరణములేకపోయినప్పటికి అందముగాకల అంగముల తో శోభిస్తున్న ఆ మైథిలిని చూచి ఆ మారుతికి అత్యంత ఆనందము కలిగెను. ఆ ఆకర్షణీయమైన కళ్ళు కల అ సీతను చూచి హర్షముతో కన్నీళ్ళను విడచెను. రాఘవునకు నమస్కరించెను.

సీతాదర్శనముతో సంతోషపడిన ఆ హనుమంతుడు రామునకు లక్ష్మణునకు నమస్కరించి ఆ చెట్టుఆకులచాటున దాగి ఉండెను.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో పదహేడవ సర్గ సమాప్తము.

తత్త్వదీపిక:

ఈ సర్గలో చంద్రుని వర్ణనతో మొదలవుతుంది.

చీకటిలో వస్తువ్ దర్శింపచేయువాడు చంద్రుడు.
భగవంతుని దర్శించుటకు మననము ధ్యానము దర్శనము అని మూడు దశలుండును.

లంకలో సీతయున్నది అని సంపాతి ద్వారా వినినాడు హనుమ. అది శ్రవణ దశ.
అది కిష్కింఢకాండలో చెప్పబడినది.

కేవలము సుందరకాండలో మనన , ధ్యాన, దర్శన దశలు చూపబడినవి.

(౧) లంకలో ప్రవేశించి స్తమ్మను వెదకవలెనని నిశ్చయించుకొని హనుమ బయలుదేరెను. ఈ దశలో చంద్రుని వెన్నెలవంటి జ్ఞానము విశదముగా వుండును. ఇది మనన దశ

(౨) తరువాత హనుమ లంకను అన్వేషించ్ను. ఇతరమైనవానిని వేనినీ చూడక సీతమ్మనే తలచుచూ అంతట తిరుగును. ఇప్పుడు చంద్రుడు ఆకాస మధ్యములో నిలచెను ఆచారుడొసంగిన ఆత్మ యాథాత్మ్యజ్ఞానముచే దానిన్ ధ్యానించుచూ అన్వేషించెను . అది ధ్యాన దశ.

(౩) దాన్ తరువాత హనుమ అశోకవనమును ప్రవేశించి సీతమ్మను దర్శించును. ఇక్కడ చంద్రుడు ఆకాశమున సాగుతూ ఉన్నట్లు వర్ణింపబడినది. ఇది దర్శన దశ.

ఈ మూడు దశలలో జ్ఞానము విశదమై యుండును,తరువాత విశదతరమై యుండును. తరువాత విశదతమమై యుండును.

||ఓమ్ తత్ సత్||

శ్లో|| నమస్కృత్వాచ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్|
సీతాదర్శనసంహృష్టో హనుమాన్ సంవృతోఽభవత్||32||
స|| సీతా దర్శన సంహృష్టః వీర్యవాన్ రామాయ లక్ష్మణాయ చ నమస్కృత్వా హనుమాన్ సంవృతో అభవత్ ||
తా|| సీతాదర్శనముతో సంతోషపడిన ఆ హనుమంతుడు రామునకు లక్ష్మణునకు నమస్కరించి ఆ చెట్టుఆకులచాటున దాగి ఉండెను.
||ఓమ్ తత్ సత్||