||సుందరకాండ ||
||ఇరువది రెండవ సర్గ తెలుగులో||
|| Om tat sat ||
||ఓం తత్ సత్||
సీతాయావచనం శ్రుత్వా పరుషం రాక్షసాధిపః|
ప్రత్యువాచ తతః సీతాం విప్రియం ప్రియదర్శనామ్|| 1||
స|| సీతాయాః తత్ పరుషం వచనం శ్రుత్వా ప్రియదర్శనాం తం సీతాం రాక్షసాధిపః విప్రియం ప్రత్యువాచ||
తా|| సీతాదేవి యొక్క ఆ పరుషవచనములను విని ప్రియదర్శనస్వరూపము గల సీతకు అప్రియవచనములతో ఆ రాక్షసాధిపుడు ప్రత్యుత్తరము ఇచ్చెను
||ఓం తత్ సత్||
సుందరకాండ.
అథ ద్వావింశస్సర్గః
సీతాదేవి యొక్క ఆ పరుషవచనములను విని ప్రియదర్శనస్వరూపము గల సీతకు అప్రియవచనములతో ఆ రాక్షసాధిపుడు ప్రత్యుత్తరము ఇచ్చెను.
" ఓ సీతా ! స్త్రీలకు ప్రేమికుడు ఎక్కువ గౌరవ స్థానము ఇచ్చి ప్రియమైన మాటలు చెప్పినకొలదీ ఆ స్త్రీ చేత పరాభవింపబడతాడు అది నిజము. నీ పై రేగిన కామము నా క్రోధమును మంచి సారథి అడ్దదిడ్డముగా పయనిస్తున్న గుఱ్ఱములను అదుపులో పెట్టినట్లు అదుపులోపెట్టినది. మనుష్యులలో కామము ఏ జనులపై ఉండునో వారు శిక్షింపతగిననూ వారిపై స్నేహము జాలి కలగచేయును".
"అందువలన ఓ వరాననా ! వధింపతగిన దానవైననూ అవమానింపతగిన దానవైననూ మిధ్యాప్రేమలో మునిగియున్న నిన్నుచంపుట లేదు. ఓ మైథిలీ ఏ ఏ పరుషవాక్యాలు నాకు చెప్పావో అవన్నీ నిన్ను వధింప తగిన మాటలే." వైదేహి అయిన సీతతో ఇట్లు చెప్పి ఆ రాక్షసాధిపుడు క్రోధముతో కూడిన మాటలతో మరల ఇట్లు పలికెను.
" నేను నీకు ఈ అవధి ఇస్తున్నాను. ఓ వరవర్ణినీ ! రెండు నెలలు దాకా నా చేత రక్షింపబడగలవు. ఆ తరువాత నా శయనము అరోహింపుము. రెండు నెలలు దాటిన తరువాత నన్ను భర్తగా కోరకపోతే నిన్ను ప్రాతఃకాలపు ఆహారముగా వంటశాలలో ఉపయోగింతురు."
రాక్షసేంద్రుని చేత ఆవిధముగా భయపెట్ట బడుతున్న ఆ జానకిని చూచి దేవ గంధర్వ కన్యలు దుఃఖము కలిగిన కళ్ళతో విలపించసాగిరి. ఆ సీతాదేవిని కొందరు పెదవులతో మరికొందరు కనుసైగలతో ఊరడించిరి. వారిచేత ఆవిధముగా ఊరడింపబడిన సీత తనపాతివ్రత్యబలముతో గర్వముగల హితకరమైన మాటలతో ఆ రాక్షసాధిపుడగు రావణుని తో ఇట్లు పలికెను.
"నీ శ్రేయస్సుకోరుతూ నిన్ను ఈ గర్హించతగిన కార్యము నుంచి నివారింపగల వారు ఎవరూ ఇక్కడ లేరుఅని తెలిస్తున్నది. శచీపతి యొక్క శచిదేవి లాగా ధర్మాత్ముడైన రామునకు భార్యనైన నన్ను ముల్లోకములో నీవు తప్ప ఇంకెవరూ మనస్సులో కూడా వాంఛించరు. ఓ రాక్షసాధమ ! అమిత తేజసుడైన రాముని భార్యకి ఇట్టి పాపపు మాటలు చెప్పిన నీవు ఏటువంటి గతి పొందెదవో"
" మదించిన ఏనుగును యుద్ధములో ఎదిరించిన కుందేలు లాగా ఏనుగువంటి రాముని ముందు నీచమైన నీవు కుందేలు వంటి వాడవు. ఇక్ష్వాకువంశ రాజైన రాముని నిందించుటకు నీకు సిగ్గులేదా? ఆయన కళ్ళముందర నిలబడగల శక్తిలేని వాడవు. ఓ దుర్మార్గుడా నన్ను ఎఱ్ఱని కళ్ళతో చూస్తూవున్ననీ క్రూరనయనములు ఎందుకు భూమిపై పడుటలేదు?"
"ఆ ధర్మాత్ముడైన రాముని యొక్క పత్నిని, దశరథుని కోడలిని అగు నన్ను దుర్భాషలాడుతున్న నీ నాలుక ఎందుకు తెగి క్రిందపడకున్నది? భస్మార్హుడవైన దశకంఠుడా ! రాముని ఆనతి గల సందేశములేక నిన్ను నా తేజస్సుతో భస్మము చేయటలేదు. ధీమంతుడైన రాముని దగ్గరనుంచి నన్ను అపహరించుటకు శక్యము కాదు. నీ వధకోసమే ఈ విధముగా జరిగినది సందేహము లేదు. శూరుడు కుబేరుని సోదరుడు, బలముగలవాడిని అని చెప్పకోగల నీవు రాముని మోసగిచ్చి దొంగలుచేయునట్లు నన్ను అపహరింఛావు".
రాక్షసాధిపుడైన రావణుడు సీతయొక్క ఆ మాటలను విని జానకిని తన క్రూర నయనములతో చూడ సాగెను.
ఆ రావణుడు నల్లని మేఘముల వలె ఉన్నాడు. మహోత్తరమైన భుజములపై తల గలవాడు. సింహము యొక్క గతి కలవాడు. అతని జిహ్వాగ్రము కళ్ళూ ఎఱ్ఱగావున్నాయి. ఎత్తైన తలపైగల కిరీటము చలిస్తున్నది. చిత్రమైనలేపములతో ఎఱ్ఱని పూలమాలలతో వస్త్రములతో అంగములపై ఆభరణములతో ఉన్నాడు. అమృతోత్పాదనసమయములో భుజంగముతో చుట్టబడిన మందరపర్వతము వలె నల్లని మొలత్రాడుతో వున్నాడు.
మందరపర్వతపు శిఖరములవలే నున్న ఆ పరిపూర్ణమైన భుజములతో పర్వతముతో సమానమైన రూపుతో ఆ రాక్షసాధిపుడు శోభించుచుండెను. ఉదయభాను వర్ణముగల కుండలములములను ధరించిన ఆ రావణుడు ఎర్రని చిగుళ్ళు కల అశోకవృక్షములతో నిండిన పర్వతము వలె శోభించుచున్నాడు. కల్పవృక్షములా వున్న వసంతఋతువులా శోభిల్లుతున్న ఆ రావణుడు శ్మశాన మండపములో ని ప్రతిమ వలె భయంకరముగా ఉండెను.
కోపముతో నిండిన కనులతో రావణుడు సీతాదేవిని చూస్తూ పాముబుసలుకొడుతున్నట్లు ఉచ్చ్వాసనిశ్వాసములు చేస్తూ ఆ సీతాదేవి తో ఇట్లు పలికెను. "ఓ సీతా నీతిమాలినవాడు నిర్ధనుడు అయిన ఆ రామునే అనుసరించే నిన్ను ఇప్పుడు సూర్యుడు తన తేజస్సుతో సంధ్యని రూపుమాపిన రీతి రూపుమాపెదను."
శత్రువులను పీడించు రావణుడు మైథిలికి ఇట్లు చెప్పి అప్పుడు ఘోరమైన రూపముగల ఆ రాక్షస స్త్రీలకు ఇలా అదేశించెను.
ఆ రాక్షస స్త్రీలు ఓకే కన్ను, ఒకే చెవు, అలాగే విస్తరించిన చెవి గలవారు. అవు ఏనుగల చెవులవంటి చెవులు గలవారు. పొడుగాటి చెవులు కలవారు. ఆ రాక్షస స్త్రీలు ఏనుగ పాదములు అశ్వపు పాదములు గోపాదములు , పాదములపై వెంట్రుకలు కలవారు. వారిలో ఒకే కన్ను, ఒకే పాదము , అనేక పాదములు , పాదములు లేని వారు కలరు. వారిలో పెద్దతలవున్నవారు, పెద్దస్తనములు గలవారు. పెద్దకళ్ళు పొడువైన నాలుక నలుక లేనివారు గలరు. వారిలో ముక్కు లేనివారు, సింహపు ముఖము గోముఖము సూకరీ ముఖము గలవారు కలరు.
"ఓ రాక్షస్త్రీలారా ! మీరందరూ కలిసి ఈ జానకీ సీత ఎలాగా నా వశము అగునో ఆ విధముగా చేయుడు. మంచిమాటలతో గాని సామదాన భేదములతో గాని దండముతో గాని ఈ వైదేహిని వశము చేసికొనుడు". ఆ రాక్షసరాజు ఇలా కామక్రోధములతో మరల మరల ఆదేశము ఇచ్చి జానకిని భయపెట్టెను.
అప్పుడు ధ్యానమాలినీ అనబడు రాక్షసి త్వరగా ముందుకువచ్చి ఆ దశగ్రీవుని కౌగలించుకొని ఈ మాటలు చెప్పెను." ఓ మహారాజా నాతో క్రీడించుము. ఓ రాక్షసేశ్వరా! శోభనుకోల్పోయి దీనస్థితిలోవున్న మానవకాంత అయిన ఈ సీతతో నీకేమి పని. ఓ మహారాజా అమరశ్రేష్ఠమైన నీ భాహు బలములతో సంపాదింప బడిన ఈ దివ్యమైన భోగములు ఈమెకు రాసిపెట్టి లేవు. ఓ మహారాజా ! ప్రేమించని దానిని ప్రేమించినచో శరీరతాపమే మిగులును. కోరినదానిని ప్రేమించినచో శోభనముగా శరీరమునకు ప్రీతి లభించును." ఆ రాక్షసిచేత ఈ విధముగా చెప్పబడిన బలవంతుడు మేఘము వలెనున్న ఆ రాక్షసుడు అప్పుడు నవ్వుకొనుచూ అచటినుండి వెళ్ళిపోయెను.
అప్పుడు ఆ దశగ్రీవుడు భూమిని కంపిస్తున్నట్లు నడుస్తూ మధ్యాహ్నపు సూర్యుని భాతి ప్రకాశిస్తున్న తన భవనమును ప్రవేశించెను. దేవ గంధర్వ కన్యలు నాగ కన్యలు కూడా ఆ దశగ్రీవునితో కూడి ఆ ఉత్తమమైన గృహములో ప్రవేశించిరి.
ధర్మపరాయణ అయిన భయముతో వణికి పోతున్న మైథిలిని వదిలి మదనకామముతో మోహితుడైన ఆ రావణుడు తన శోభాయమైన భవనమును ప్రవేశించెను.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ద్వావింశస్సర్గః||
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువది రెండవ సర్గ సమాప్తము.
|| ఓమ్ తత్ సత్||
శ్లో|| స మైథిలీం ధర్మపరాం అవస్థితామ్
ప్రవేపమానాం పరిభర్త్స్య రావణః|
విహాయసీతాం మదనేన మోహితః
స్వమేవ వేశ్మ ప్రవివేశ భాస్వరమ్||46||
స|| సః రావణః ధర్మపరాం అవస్థితాం ప్రవేపమానాం మైథిలీం పరిభర్త్స్య సీతాం విహాయ మదనేన మోహితః భాస్వరం స్వం వేశ్మేవప్రవివేశ||
తా|| ధర్మపరాయణ అయిన భయముతో వణికి పోతున్న మైథిలిని వదిలి మదనకామముతో మోహితుడైన ఆ రావణుడు తన శోభాయమైన భవనమును ప్రవేశించెను.
||ఓం తత్ సత్||