||సుందరకాండ ||

||ఇరువది ఆరవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

|| ఓమ్ తత్ సత్||
శ్లో|| ప్రసక్తాశ్రుముఖీ త్యేవం బ్రువన్తీ జనకాత్మజా|
అధోముఖముఖీ బాలా విలప్తుముపచక్రమే||1||
స|| ప్రసక్తాశ్రుముఖీ బాలా జనకాత్మజా ఏవం బ్రువన్తీఅధోగతముఖీ విలప్తుం ఉపచక్రమే||
తా|| తలవంచుకొని కన్నీళ్ళతో నిండిన ముఖముతో జనకాత్మజ అయిన సీత ఈ విధముగా పలుకుతూ విలపించ సాగెను.
|| ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ షడ్వింశస్సర్గః

తలవంచుకొని కన్నీళ్ళతో నిండిన ముఖముతో జనకాత్మజ అయిన సీత ఈ విధముగా పలుకుతూ విలపించ సాగెను. ఆ సీత పిచ్చిదానిలా, మత్తెక్కినదానిలా, భ్రాంతిలోనున్న మనస్సు కలదానిలా, పడుకున్న గుఱ్ఱములాగ భూమిమీద కూర్చుని విలపింపసాగెను.

'రామునియొక్క ఏమరపాటుసమయములో కామరూపుడగు రాక్షసుడు రావణుడు ఆక్రోశిస్తున్న నేను బలాత్కారముగా తీసుకురాబడితిని. రాక్షస్త్రీల వశములో సుదరుణమైన విధముగా భయపెట్టబడితూ అత్యంత దుఃఖములో అలోచనలో ఉన్న నేను జీవించుటకు ఉత్సాహములేకుండాఉన్నాను. మహారథుడైన రాముడుకి దూరముగా రాక్షసులమధ్యలో నివసిస్తున్ననా జీవితమునకు అర్థములేదు. సంపదలు ఆభరణములకు కూడా అర్థములేదు'.

'ఈ దుఃఖముతో ముక్కలు కాని నా హృదయము, తప్పక ఇనుపరాతితో చేయబడినదై ఉండాలి లేక, నాశనము లేనిదై ఉండాలి. ఆయనలేకుండా ఒక క్షణము కూడా జీవిసున్నాను అంటే అనార్యురాలగు నేను దుష్టురాలినే. నేను పాపిని. పాతివ్రత్యములేని స్త్రీని. సాగరముల చివరి దాకా కల భూమి అంతకూ రాజు , ప్రియంవదుడు అయిన రాముడు లేకుండా నేను జీవించడములో సుఖములమీద మమకారము మీద శ్రద్ధలేదు'.

'నేను ఈ శరీరము వదిలెదను. ముక్కలు చేయబడినా తినబడినా కాని ప్రియుని కి దూరముగా ఉన్న నేను ఈ దుఃఖమును నేను సహించలేను. ఈ నిశాచరుడు గర్హింపతగిన రావణుని ఎడమ కాలితో కూడా తాకను. అట్టివాడిని ప్రేమించడమనే మాటలేదు. నన్ను ప్రార్థిస్తున్న ఈ కౄరకర్ముడుకి తన మర్యాదపోవుచున్నదని కాని తనవంశప్రతిష్ఠలు పోతాయి అనిగాని తెలియదు. చిన్నాభిన్నము చేసిన అగ్నిలో పడవేసినా రావణునికి వశముకాను. మీ ప్రలాపములు వ్యర్థము'.

'రాముడు ప్రఖ్యాతి గలవాడు. జ్ఞానము కలవాడు. కృతజ్ఞుడు. సద్వృత్తి కలవాడు. అట్టి జాలికలవాడు నా భాగ్య సంపద క్షీణించడముతో నాపై జాలిలేనివాడు అయ్యెను కాబోలు. ఎవరైతే జనస్థానములో పదునాలుగు వేల రాక్షసులను ఒక్కడే సంహరిరించెనో అట్టి రాముడునన్ను ఎందుకు రక్షించుటలేదు?ఎవరైతే దండకారణ్యములో రాక్షసపుంగవులైన విరాధుని చంపాడో, అట్టి వాడునన్ను ఎందుకు రక్షించుటలేదు?'

'సముద్రము మధ్యలోవున్న ఈ లంక భేధించుటకు కష్టమే అయినా రాఘవుని బాణములకు గతిరోధము ఏమీలేదు. ఏమిటాకారణము దానిచేత ధృఢపరాక్రముడైనరాముడు రాక్షసులచే అపహరింపబడిన తన ప్రియమైన భార్యను రక్షించి తీసుకొనిపోవుటలేదు?'

'లక్ష్మణుని అగ్రజునికి నేను ఇక్కడ ఉన్నానని తెలియదేమో అని నా శంక. తెలిసివుంటే ఆ తేజస్వి ఈ దుశ్చర్యను సహిస్తాడా? అపహరింపబడి నేను ఎవరినినైతే దాటి వచ్చితినో, ఎవరైతే రాఘవునకు అవిషయము చెప్పగలరో అట్టి గృధరాజు రావణుని చేత యుద్ధములో చంపబడెను. తీసుకొని పోబడుతున్న నన్నురక్షించుటకు ముసలివాడైన రావణుని తో ద్వంద్వయుద్దములో నిలబడిన జటాయువు నిజముగా మహత్తరమైన పని చేసెను.'

'ఆ రాఘవుడు నేను ఇక్కడ ఉన్నాని తెలిస్తే అప్పుడు క్రోధముతో లోకమును రాక్షసులందరినుంచి తనబాణములతో విముక్తి చేయును, లంకాపురిని నాశనము చేయును, సాగరములోని జలమును క్షీణింపచేయును, నీచుడైన రావణుని కీర్తిని నామరూపములు లేకుండా చేయును'.

'ఇప్పుడు నేను ఎలాగ విలపిస్తున్నానో అలాగే ఇక్కడ చనిపోయిన నాథులకోసము ప్రతిగృహములో విలపిస్తున్న స్త్రీలు ఉండెదరు అందులో సంశయములేదు. లక్ష్మణసమేతుడైన రాముడు రాక్షసుల లంకను కనుగొనినచో వారిచేత చూడబడిన శత్రువులు ఒక క్షణము కూడా నివశింపలేరు.'

'ఈ లంక అచిరకాలములో శ్మశానములో మండుతున్న చితుల పొగతో సమానమైన పొగతో నిండి ఉండును. అచిరకాలములో నా మనోరథము తీరును. మీ దుష్ఠ ప్రవర్తనే మీ నాశనమును గురించి చెప్పుచున్నది'.

'ఈ లంకలో ఎలాంటి దుశ్శకునములు కనపడుచున్నవో, వాటితో ఈ లంకయొక్క శోభ అచిరకాలములోనే పోవును అని తెలియుచున్నది. పాపాత్ముడు అధముడు అయిన రావణుడు చనిపోగా ఈ అజేయమైన లంక కూడా వైధవ్యము కలిగిన స్త్రీవలె శోషించిపోవును. పుణ్యోత్సవములతో నిండిన లంక భర్తపోయిన స్త్రీవలె అగును'.

'అతికొద్దికాలములో నే ఇక్కడ ప్రతి గృహములో విలపించుచున్న రాక్షసకన్యలను తప్పక వినెదను. రాముని బాణములతో రాక్షస వీరులందరూ చంపబడగా లంకానగరము దగ్ధమైపోయి తన శోభనుకోలుపోయి చీకట్లలో అంధకారమయమైపోతుంది'.

'ఎఱ్రని కళ్ళుగల రామునికి నేను రావణుని అంతఃపురములో ఉన్నాననితెలిసినచో , ఈ అధముడు నాకు పెట్టిన గడువు అదే అతనికి పెట్టబడిన కాలము అగును. నాకు విధించిన ఆ మృత్యువు ఆ దుష్ఠునకు వర్తించును.'

'ఈ పాపాత్ములకు చేయకూడని పనులు తెలియవు. అధర్మమైన పనుల వలన మహత్తరమైన పాతకము కలుగును. పిశితాశనులైన ఈ రాక్షసులకు ధర్మము తెలియదు'.

'ఈ రాక్షసులు తప్పక నన్ను ప్రాతఃకాల భోజనముగా వాడుకొందురు. ఆ ప్రియదర్శనుడగు రాముడు లేకుండా ఏమి చేయగలను. ఆ ఎఱ్ఱటి కళ్ళు గల రాముని చూడలేక మంచి దుఃఖములో ఉన్నదానను'.

'ఇవాళ నాకు విషము ప్రదానము చేయగలవాడు ఉన్నచో పతిలేకపోయిన నేను యముని చూచుటకు సిద్ధముగా నున్నాను. లక్ష్మణ అగ్రజుడగు రామునకు నేను జీవిస్తున్నాని తెలియకపోవచ్చు. తెలిసినచో నన్ను భూమండలము అంతా తప్పక వెదుకుచునే యుండును'.

'వీరుడు లక్ష్మణాగ్రజుడు నా శోకముతో ఈ మహీతలములో దేహమును వదిలి దేవలోకము తప్పక చేరివుండును. రాజీవలోచనుడగు నా రాముని చూచిన గంధర్వులు, సిద్ధులు, ఋషులతో కూడిన దేవులు ధన్యులు. లేక ధర్మాచరణబద్ధుడైన ధీమంతుడు పరమాత్ముడు అయిన రాముడు వైరాగ్యముపొంది నన్ను మరిచిపోయెనేమో'

'చూస్తూ ఉంటే ప్రేమ కలుగుతుంది. చూడకపోతే మిత్రత్వముకూడా పోతుంది. అది కృతఘ్నులకు. కాని రామునకు నాపై ప్రేమ నశించదు. స్త్రీనైన నేను నా భర్త ఎడబాటుతో జీవించుతున్నాను అంటే నాలోన ఏవో గుణములు లోపిస్తున్నయా? నా భాగ్యము క్షీణించిపోయినదా? శూరుడు శత్రువులను నిర్మూలించువాడు, మహాత్ముడు అయిన రాముని విడిచి ఉండడముకన్న మరణించడమే శ్రేయము'.

'లేక ఆ నరశ్రేష్ఠులిద్దరూ శస్త్రములను విసర్జించి వనములో ఫలములమీద వనగోచరులులాగా జీవిస్తున్నారేమో. లేక రామలక్ష్మణులు అన్నదములైన శూరులిద్దరూ దురాత్ముడైన రావణునిచేత కపటముగా చంపబడిరేమో. ఇలాంటి స్థితిలో అన్నివిధములుగా మరణించుటకు కోరుకొనుచున్నాను. ఈ దుఃఖములో కూడా మృత్యువు సంభవము కాదు'.

'మహాత్ములు పాపరహితులు జితేంద్రియులు అయిన మహాభాగులు ధర్మాత్ములు. వారికి ప్రియములు అప్రియములు ఉండవు. ప్రియమైన దానినుంచి దుఃఖము అప్రియమునుంచి అధిమైన భయము కలగదో ఎవరు వీటినుంచి అతీతులో ఆ మహాత్ములకు నా నమస్కారము'.

'ప్రియుడు ఆత్మను ఎరిగిన రాముని ఎడబాసి పాపి రావణుని వశమైన నేను నా ప్రాణములను వదిలెదను'.

ఈవిధముగా సీత ఆక్రందనతో శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువది ఆరవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
శ్లో|| సాఽహం త్యక్తా ప్రియార్హేణ రామేణ విదితాత్మనా |
ప్రాణాం స్త్యక్ష్యామి పాపస్య రావణస్య గతా వశమ్||51||
స|| ప్రియేణైవ విదితాత్మనా రామేణ త్యక్తా పాపస్య రావణస్య వశమ్ గతా సా అహం ప్రాణాం తక్ష్యామి ||
తా|| ప్రియుడు ఆత్మను ఎరిగిన రాముని ఎడబాసి పాపి రావణుని వశమైన నేను నా ప్రాణములను వదిలెదను.
|| ఓమ్ తత్ సత్||