||సుందరకాండ ||

||ఇరువది ఎనిమిదవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

|| ఓమ్ తత్ సత్||
శ్లో|| సా రాక్షసేంద్రస్య వచో నిశమ్య
తద్రావణ స్యా ప్రియ మప్రియార్తా|
సీతా వితత్రాస యథా వనాంతే
సింహాభిపన్నా గజరాజకన్యా||1||
స|| సా సీతా రాక్షసేంద్రస్య అప్రియం తత్ వచః నిశమ్య అప్రియార్తా వనాంతే సింహాభిపన్న గజరాజకన్యా ఇవ వితత్రాస||
తా|| ఆ సీత, రాక్షసేంద్రుని అప్రియ వచనములను వినుట వలన కలిగిన దుఃఖము వలన, సింహము ముందు వున్న గజరాజ కన్య వలె విలవిలలాడెను.
|| ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ అష్టావింశస్సర్గః


రాక్షసేంద్రుని అప్రియ వచనములను వినుట వలన కలిగిన దుఃఖము వలన, ఆ సీత, సింహము ముందు వున్న జగరాజ కన్య వలె, విలవిల లాడెను. అలాగ రావణుని మాటలచే భయపెట్టబడిన, భయపడిన, రాక్షస స్త్రీల మధ్యనున్న ఆ సీత జనులులేని అరణ్యమధ్యములో వదిలివేయబడిన బాలకన్యలాగ విలపించెను.

అలా విలపిస్తూ సీత ఇట్లు అనుకొనెను.

" ఎంతో భయపెట్టబడినా పుణ్యములేని నేను ఒక క్షణము కూడా జీవిస్తున్నాను అంటే లోకములో అకాలమృత్యువు సంభవము కాదని సంతులు చెప్పిన మాట సత్యము. సుఖము లేక, అనేక దుఃఖముల తో నిండియున్న నా హృదయము వజ్రాయుధముతో కొట్టబడి వేయ్యముక్కలుగా విరిగిన పర్వత శిఖరములలా కాకుండా, స్థిరముగా వున్నది. నేను దుష్టస్వరూపుడగు ఈ రావణుని చే వధింపబడెడిదానిని. నేను ఇక చనిపోయినచో దోషములేదు. బ్రాహ్మణుడు ఇతరులకు మంత్రములు ఎట్లు ప్రదానము చేయడో, అట్లే ఆ రాక్షసుని భావమునకు అనుగుణముగా ఉండలేను'.

'లోకనాధుడు ఇక్కడి కి రాకపోతే ఆ రాక్షసేంద్రుడు గర్భస్థములో నున్న పిండమును ఛేదించినట్లు నన్ను ముక్కలు ముక్కలుగా చేయును. రాజాపరాధము వలన బంధింపబడి, రాత్రిదాటిన తరువాత చంపబడు దొంగకు ఆ రాత్రి గడచుట కష్టము అయినట్లు, ఈ దుఃఖములోనున్న నాకు ఈ రెండుమాసముముల గడువు కూడా చాలా కష్టము'.

" ఓ రామా, ఓ లక్ష్మణా, ఓ సుమిత్రాదేవీ, ఓ రామమాతవైన కౌసల్యా దేవీ, ఓ జననీ భూమాతా ! అల్పభాగ్యముకల నేను సముద్రము మధ్యలో సుడిగాలికి గురి అయిన ఓడవలె విపత్కర పరిస్థితిలో ఉన్నాను. మృగరూపములో వచ్చిన ఆ రాక్షసునిచే మోసగించబడి, ఆ మానవేంద్రులిద్దరూ పిడుగుపడి నశించిన రెండు సింహములు లాగా నా కారణమువలన మరణించిరేమో. తప్పక ఆ కాలపురుషుడే మృగరూపముధరించి, అల్పభాగ్యముకల నన్ను మభ్యపెట్టి లక్ష్మణాగ్రజుడగు అర్యపుత్రుని, రామానుజుని కూడా కోల్పోవునట్లు చేసెను'.

'సత్యవ్రతుడు దీర్ఘబాహువులు కలవాడు అయిన ఓ రామా ! పూర్ణచంద్రుని బోలి ముఖము కలవాడా సమస్త ప్రాణులకు హితుడవు ప్రియుడవు నీకు రాక్షసులు నన్ను చంపుతారని తెలియదా ? నీవే తప్ప ఇంకో దేముడు లేడు. ఎంతో ఓర్పుతో భూమిపై నిద్రిస్తూ , ధర్మములను నియమములను పాటిస్తూ పాతివ్రత్యము పాటిస్తున్నాను. అవి అన్నీ కృతఘ్నులకు చేసిన ఉపకారములవలే విఫలమౌతున్నాయి. నిన్ను చూడలేక నీతో కలయుట అనే ఆశలేనప్పుడు ఇలా కృశించి కళాకాంతులు నశిస్తూ చేసిన పాతివ్రత్యధర్మము అంతా నిరర్థకమే".

" నువ్వు పితృవాక్యపరిపాలన నియమముగా చేసి వనమునుంచి కృతకృత్యుడవై వెనకకి వెళ్ళి, భయములేనివాడవై, కృతార్థుడవై అందమైన స్త్రీలతో రమించెదవని తలచెదను. ఓ రామా నీపై అనురాగముతో చిరకాలము బద్ధురాలనైనదానిని. నా తపము వ్రతములు నిరర్థకము. ఇప్పుడు నా జీవితము త్యజించెదను. నేను దుర్భాగ్యురాలను. అట్టి నేను విషము తాగి కాని వాడి ఆయుధముతో కాని జీవితము త్యజించవలెను. కాని ఈ రాక్షస గృహములో విషముకాని ఆయుధముకాని ఇచ్చే దాతకూడా లేడు'.

ఈ విధముగా విలపిస్తూ అన్నివిధములుగా రామునే స్మరిస్తూ దుఃఖముతో వణుకుతూ వున్న ఆ దేవి, నోరు ఎండిపోయి, మంచి పుష్పములు కల ఆ వృక్షసమీపమునకు వెళ్ళెను. శోకములో మునిగి పోయి ఉన్న ఆ సీత అనేక విధములుగా ఆలోచించి, తన జడను పట్టుకోని " నేను ఈ జడతో ఉరిపోసుకొని యముని స్థానమునకు వెళ్ళెదను" అని అనుకొనెను.

అప్పుడు మృదువైన శరీరము కల ఆ సీత ఆ వృక్షముయొక్క శాఖలను పట్టుకొని నిలబడెను. రాముని రామానుజుని తన వంశమును తలచుకొనెను. అప్పుడు ఆమెకు శోకమును తొలగించు ధైర్యమును కలిగించు లోకములో ప్రసిద్ధమైనవి పూర్వము సత్ఫలితములను ఇచ్చినవి అయిన శుభ సూచకములు కనపడెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయనములో సుందరకాండలో ఇరువది ఎనిమిదవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
శ్లో|| శోకానిమిత్తాని తథా బహూని
ధైర్యార్జితాని ప్రవరాణి లోకే|
ప్రాదుర్నిమిత్తాని తదా బభూవుః
పురాపి సిద్ధా న్యుపలక్షితాని||20||
స|| అథ మృదుసర్వగాత్రీ సా తస్య నగస్య శాఖాం గృహీత్వా (ఉపస్థితా)| రామం రామానుజం స్వం కులం చ ప్రవిచింతయంత్యా శుభాంగ్యాః తస్యాః తు శోకానిమిత్తాని ధైర్యార్జితాని లోకే ప్రవరాణి తథా పురాపి సిద్ధాని ఉపలక్షితాని బహూని నిమిత్తాని ప్రాదుర్భభూవుః||
తా|| అప్పుడు మృదువైన శరీరము కల ఆ సీత, ఆ వృక్షముయొక్క శాఖలను పట్టుకొని నిలబడెను. రాముని రామానుజుని తన వంశమును తలచుకొనెను. అప్పుడు ఆమెకు శోకమును తొలగించు, ధైర్యమును కలిగించు, లోకములో ప్రసిద్ధమైనవి పూర్వము సత్ఫలితములను ఇచ్చినవి అయిన శుభ సూచకములు కనపడెను.
|| ఓమ్ తత్ సత్||