వాల్మీకి రామాయణములో బాలకాండ

బాలకాండ విశిష్ఠత

ఈ వారం లో 77వ సర్గ

 

 

 

రామాయణంలో
బాలకాండ !
( బాలకాండ విశిష్ఠత)

బాలకాండ గురించి విననివారు తెలియనివారు వుండరు . కాని బాలకాండ మహాత్మ్యము ఎక్కువగా తెలియకపోవడం అసహజము కాదు !

బాలకాండలో ముఖ్యమైన ఘట్టాలు చాలావున్నాయి.

ప్రథమ సర్గలో మొట్టమొదటి సంభాషణలో వాల్మీకి నారదుని అడిగిన ప్రశ్న " కోనశ్మిన్ సాంప్రతం లోకే.. " అంటే ఈ ముల్లోకాలలో అత్యంత శ్రేష్ఠుడైన నరుడు ఎవడు అని . దానికి సమాధానంగా నారదుడు " రామో నామ జనైః శ్రుతః " అంటూ రాముని కథ వివరిస్తాడు. ప్రథమసర్గలో వంద శ్లోకాలలో మనం పూర్తి రామాయణ కథ సంక్షిప్తముగా వింటాము. అందుకని బాలకాండలో ప్రథమసర్గ సంక్షిప్త రామాయణముగా ప్రబల పడింది ! ప్రథమ సర్గ పారాయణ చాలా కుటుంబాలలో ఆనవాయితీ . మా అమ్మ చాలాకాలం రామాయణ పారాయణ అంటే ప్రథమ సర్గ పారాయణ చేసేది.

బాలకాండలో రెండవసర్గలో బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు . అంటే ప్రథమ సర్గలో దేవ ఋషి వస్తే రెండవసర్గలో దేవుడే ప్రత్యక్షంగా వస్తాడన్నమాట.

ఎందుకు ?

అది క్రౌంచపక్షుల జంటలో ఒక పక్షి నిషాదునిచేతిలో వధింపబడడం , ఆ కారణముగా జనించిన కారుణ్యముతో ఇంకా శోకముతో "మా నిషాద ప్రతిష్ఠాం త్వం .." అంటూ చెప్పిన శ్లోకము గురించి మథన పడుతున్న వాల్మీకి మహాముని మనస్సు కుదుట పరచి, "రామస్య చరితం సర్వం కురు ఋషిసత్తమ" అని ఆదేశింఛి , రామాయణ రచనకి కావలసిన అనుభూతి ఇవ్వడం కోసము.

" మా నిషాద ప్రతిష్ఠాం త్వం .." ఆని వాల్మీకి నోటినుండి వెలువడిన శ్లోకమే మొదటి సంస్కృత శ్లోకముగా ప్రసిద్ధి పొందింది. సంస్కృతంఉ చదివిన ప్రతి విద్యార్థికి అది కంఠస్థమే

అప్పటి బ్రహ్మవాక్కు-
యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే|
తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి ||

"ఈ భూమిలో పర్వతాలూ నదులూ ఉన్నంతకాలము రామాయణ కథ కీర్తింపబడుతుంది "అని

బాలకాండలో శ్రీరాముని జననం శ్రీరాముని బాల్యావస్థలో జరిగిన ఘట్టాలు , విశ్వామిత్రుని ద్వారా సగరుడు , గంగావతరణం, సాగర మంథనము , అహల్యా విమోచనము తో కలిపి అనేక కథలు వస్తాయి. ఈ కథలలోనే భారతసంస్కృతి కి మూలపాదైన క్షమా గుణము గురించి వాల్మీకి ద్వారా ఒక శ్లోకము వస్తుంది.
క్షమా దానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికా |
క్షమా యశః క్షమా ధర్మః క్షమయా నిష్ఠితం జగత్ ||

అలాగే శతానందుని ద్వారా విశ్వామిత్రుడు వశిష్టునితో సమానంగా బ్రహ్మర్షి అయిన కథ , జనకుని ద్వారా సీత జన్మవృత్తాంతము - "క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా" - శ్రీరాముడు శివుని విల్లు భంగం చెయ్యడము , జానకీ పాణిగ్రహణము అన్నీ కూడా బాలకాండలో వస్తాయి.

ఆప్పుడు సీతాకల్యాణ ఘట్టములో జనకుడు చెప్పిన మాట ,

ఇయం సీతా మమ సుతా సహధర్మచారీతవ|
ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా ||

ఆ శ్లోకము ఇప్పటికీ చాలా ఇళ్ళలో వివాహ ఆహ్వాన పత్రికలో కనపడు తోనే ఉంటుంది !

బాలకాండ అంతిమ ఘట్టాలలో సీతారామ కల్యాణముతో పాటు లక్ష్మణ భరత శతృఘ్నుల కల్యాణము కూడా అవుతుంది.

చిట్ట చివరి ఘట్టము పరశురామావతార సమాప్తము - పరశురాముడు శ్రీరామునితో

అక్షయం మధు హంతారం
జానామి త్వం సురేశ్వరం

శ్రీరాముడే విష్ణు స్వరూపమని అని గ్రహించి అంటాడు.

అదే రామావతారానికి నాంది !

చాలా కుటుంబాలలో సుందరాకాండ వారి ఆత్మ వారి అత్మీయుల సుఖశాంతుల కోసము చదువుతారు. కాని పిల్లల పురోగతి కోసము అందరూ బాలకాండ పారాయణ చేస్తారు !

అదే బాలాకాండ విశిష్ఠత !!

!! ఓమ్ తత్ సత్ !!