||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ఇరువది ఇదవ సర్గ ||

||'న కరిష్యామి వో వచః"||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ పంచవింశస్సర్గః

తత్త్వదీపిక
'న కరిష్యామి వో వచః"
'మీ వచనములను నేను పాటించను'

 

".. రురోద జనకాత్మజా" ( 25.1)
".. జనకాత్మజ విలపించసాగెను"
ఆ మాటతో ఈ సర్గ ప్రారంభమౌతుంది.

ఈ సర్గలో సీత తన దుఖభరితమైన స్థితి గురించి విచారిస్తుంది.
తను ఎందుకు ఈ స్థితిలో వున్నాను, అని ఆ ఆలోచన.
సీతమ్మవారు లక్ష్మీ స్వరూపము.
సాక్షాత్తు విష్ణు మూర్తి భార్య.
అట్టి సీతమ్మ కి ఇలాంటి కష్టాలు ఏమిటి అని కూడా అనిపించవచ్చు..
దానికి సమాధానముగా రామాయణ తిలకలో ఇలారాస్తారు.

"అయం సర్వః సీతాప్రలాపో
గృహీత మనుష్య శరీరతయా
నటవదనుకరణరూప ఇతి బోద్ధవ్యం"||

"ఇక్కడ సీతమ్మవారు పలికిన పలుకులన్నీ
మనుష్య రూపము తీసుకున్నందువలన
నటానాను రూపముగా చెప్పబడిన మాటలని తెలిసికొనవలెను" అని.

సీతారాములు మానుష్య అవతారమే అని తెలిసిన మాటే.
రాములవారు మానుష్యవతారములో మనిషి రూపములోనే ప్రవర్తించి
మానవులు ధర్మాచరణబద్ధులై ఏవిధముగా తన కర్తవ్యము నిర్వహించగలరు
అన్నమాటకి ప్రతీకగా ప్రవర్తించారు అని కూడా విన్నమాటే.
అందువలనే రామాయణము యొక్క ప్రసిద్ధి.
సీతమ్మవారు కూడా మానవ జన్మలో పడవలసిన కష్టాలు భరించింది అన్నమాట.

ఇక ఈ సర్గలో జరిగిన వృత్తాంతము చూద్దాము.

మొదటిలో రాక్షస స్త్రీల చేత భయపెట్టబడిన సీత
రాక్షసస్త్రీలకు ఇచ్చే సమాధానము వింటాము.

" మనుష్య స్త్రీ రాక్షసునియొక్క భార్య కాలేదు.
నన్ను మీరందరూ చంపుకు తినండి.
మీ వచనములను నేను పాటించను".

రాక్షస స్త్రీల మధ్యలో రావణునిచేత భయపెట్టబడిన సీత
సురలతో సమానమైన సీత,
ఆ దుఃఖమునుంచి బయటకు రాలేకపోయెను.

వనములో తన సమూహమునుంచి విడివడి
నక్కలచేత చుట్టబడిన లేడివలె
సీత తన అంగములను తనలోనే ఇమడ్చుకొని వణుకుచుండెను.
శోకముతో భఘ్నమైన మనస్సు కలదై
ఆ అశోకవనములో పుష్పించిన చెట్ల శాఖలను పట్టుకొని
తన భర్త గురించి ఆలోచించ సాగెను.
కన్నీటి ధారలతో చింతించుచున్న సీతకు
శోకసముద్రముయొక్క అంతు కనపడలేదు.

దుఃఖముతో శోకముచే బాధింపబడుతున్నఆ మైథిలీ
నిట్టూర్పులు విడుస్తూ కన్నీళ్ళు కారిస్తూ విలపించెను.
దుఃఖముతో "హా రామా" అని మళ్ళీ "హా లక్ష్మణా" అని
అలాగే " హా అత్త అయిన కౌసల్యా" " ఓ సుమిత్రా" అని విలపించెను. "

"అకాలే దుర్లభో మృత్యుః"
అంటే అకాలములో మృత్యువు కూడా దుర్లభము అన్న లోకోక్తి ని చెపుతూ
సీత ఈవిధముగా చెపుతుంది.
"ఇక్కడ ఈ క్రూరమైన రాక్షసులచేత పీడింపబడుతూ ,
రాముని ఎడబాసి దుఃఖములో ఒక క్షణమైన జీవించుచున్నాను అంటే
స్త్రీ కి గాని పురుషునుకి గాని అకాలమృత్యువు దుర్లభము అన్న
పండితుల వచనములో ఎంతో సత్యము కలదు" అని.

తను చూడలేక పోయినా ,
రాముని చూడగలిగినవారి జన్మ ధన్యము అని చెపుతుంది .
"తామరరేకుల వంటి నేత్రములు గల,
సింహగమనము కల, కృతజ్ఞత కల,
ప్రియమైన మాటలు పలుకు నా నాథుని చూచు వారు నిజముగా ధన్యులు."

తన దీన స్థితికి తనేకారణము అని అనుకుంటూ సీత ఇలా చెపుతుంది

" ఇట్టి ఘోరము దారుణమైన దుఃఖము పొందిన నాచేత
ఎటువంటి పాపము పూర్వ జన్మములో చేయబడెనో?
ఈ మహత్తరమైన శోకముతో జీవితము వదులటకు కోరికగా నున్నది.
ఈ రాక్షసుల చేత రక్షింపబడుతున్న నన్ను రాముడు పొందలేడు.
ఈ మానవ జీవితము హేయము.
పరులవశములో నుండుట హేయము.
జీవితము వదులుదామనిపించిననూ అది చేయలేని స్థిలో ఉన్న దానను".

మానవుడు తమో రజ గుణములు అధిక్యతలో ఉన్నప్పుడు
తన దీనస్థితికి ఇంకెవరో కారులు అన్నమాటతో ముందుకు సాగుతాడు.
అవి అదుపులో ఉన్నప్పుడే తన దీనస్థితికి కారణము అన్వేషించకలుగుతాడు.
ఇక్కడ సీతావిలాపములో మనకి తెలిసి వచ్చు మాట అదే.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకిరామాయణములో సుందరకాండలో ఇరువది ఇదవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||