||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ఇరువది ఏడవ సర్గ ||

||త్రిజటాస్వప్నము||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ సప్తవింశస్సర్గః

తత్త్వదీపిక
త్రిజటాస్వప్నము

ఈ సర్గలో ముఖ్యమైన ఘట్టము, త్రిజటాస్వప్నము.

ఈ సర్గలో చెప్పదగిన మాటలు కూడా ఎక్కువే వున్నాయి.
వాటిలో మొదటిది పదమూడవ గాయత్రీ బీజాక్షరము, 'స్య'.

ముఖ్యముగా ఈ సర్గలో వున్న 13వ గాయత్రీ బీజాక్షరము.

రామాయణములో 24000 శ్లోకాలని,
గాయత్రీ మంత్రములోని 24 అక్షరాలు ఈ శ్లోకాలలో వున్నాయని విన్నమాటే.
రామాయణములో మొదటి శ్లోకములో గాయత్రిలో మొదటి బీజాక్షరము వున్నది.
అలాగ ప్రతి వెయ్యిశ్లోకాలకి ఒక బీజాక్షరము వున్నది.

సుందరకాండ మొదటి సర్గ లోమొదటి శ్లోకము లో 12వ గాయత్రీ బీజాక్షరము "వ" వున్నది.
అంటే ఆ మొదటి శ్లోకము 12వ సహస్రములో మొదటి శ్లోకము (11001) అన్నమాట.
ఆ శ్లోకములో గాయత్రీ మంత్రములోని 12 వ అక్షరము "వ" వున్నదని కూడా విదితమే.

గోవిందరాజులవారి టీకా తాత్పర్యము రామాయణ శిరోమణి ప్రకారము,
రామాయణములోని 13వ సహస్రములో మొదటి శ్లోకము,
అలాగే 13 వ బీజాక్షరము 27 వ సర్గలో వుంది.
అంటే 12001 శ్లోకము 27 వసర్గలో వున్నది అన్నమాట.
ఆ శ్లోకములో 13 వ బీజాక్షరము అంటే ' స్య' వున్నది.

ఆ 12001 శ్లోకము ఇక్కడ ఇవ్వబడినది.

శ్లో|| తతస్తస్య నగస్యాగ్రే హ్యాకాశస్థస్యదన్తినః|
భర్త్రా పరి గృహీతస్య జానకీ స్కన్ధమాశ్రితా||(27-14)
తా|| " అప్పుడు పర్వతాగ్రముపై నున్న ఆ జానకి
ఆకాశములో నిలబడిన ఆ ఏనుగు పైకి ఎక్కి భర్త చెంత చేరెను".

ఈ శ్లోకములో గాయత్రీ మంత్రములోని పదమూడవ అక్షరము "స్య",
మొదటి పాదములో నాలుగొవ అక్షరము త"స్య" లో వస్తుంది.
ఈ శ్లోకములో గాయత్రీ బీజాక్షరము వుంది కనక ఇది చాలామందికి ముఖ్యమైన శ్లోకము.

గాయత్రీ బీజాక్షరము వున్న శ్లోకము ఈ సర్గలో వుండడము వలన,
ఈ త్రిజటా స్వప్న వృత్తాంతము సర్గ కూడా చాలామందికి చాలా ముఖ్యము.
ఇంకా విశేషాలు వున్నాయి.
అవి చివరలో చూస్తాము.

ఇప్పుడు ఈ సర్గలో ముఖ్యమైన ఘట్టము త్రిజటా స్వప్నము విందాము.

ఈ సర్గ మళ్ళీ రాక్షస స్త్రీలు సీతమ్మను భయపెట్టడముతో మొదలు అవుతుంది.
రాక్షస స్త్రీలు, సీత శాపము ఇస్తున్నట్లు అనిన మాటలు విని,
మరింత కోపముతో సీతను తినేస్తామని భయపెట్టుతూ వుంటే ,
అది విని అప్పుడే లేచిన ఒక ముసలి రాక్షసి, త్రిజట, ఇలా అంటుంది.

"ఆత్మానం ఖాదతానార్యా న సీతా భక్షయిష్యథ"
"మిమ్మలిని మీరే తినండి సీతను కాదు", అని.

ఎందుకు? అంటే, తనకి ఒక కల వచ్చిందట.
ఆ కలలో ఏమి తెలిసింది ?

"రాక్షసానాం అభావాయ
భర్తుః అస్యాః భవాయ చ"||

రాక్షసులకు భయము, సీత భర్తకి విజయము సూచిస్తూ వచ్చిన కల అది.

వెంటనే ఆ రాక్షస్త్రీలందరు త్రిజట చుట్టూ చేరి ఆ కల అంతా చెప్పమంటారు.
త్రిజట ఆ కల అంతా చెపుతుంది.

ఆ కలలో "రాఘవశ్చ మయాద్రష్టం" అంటే రాఘవుడిని చూచిందిట.
ఏలాంటి రాముడిని?
"ఆరుహ్య పుష్పకం దివ్యం" - దివ్యమైన పుష్పకవిమానము నెక్కి
"ఉత్తరాం దిశంమాలోక్య జగామపురుషోత్తమః "
ఉత్తరదిశను అనుసరించి వెళ్ళిపోయాడుట, ఆ పురుషోత్తముడు.
అది విజయసూచకము.

అలాగే రావణుడు తనపరివారముతో
"గర్ధభేన యయౌ శీఘ్రం దక్షిణాం దిశమాస్థితః"
గాడిదను ఎక్కి దక్షిణ దిశగా పయనించాడుట.
అది పరాజయ పలాయన సూచకము.

అంతే కాదు రావణుని అనుచరులు కూడా అదే దిశలో పయనిస్తారుట.

"వరాహేణ దశగ్రీవః శింశుమారేణ చేన్ద్రజిత్|
ఉష్ట్రేణ కుమ్భకర్ణశ్చ ప్రయాతా దక్షిణాం దిశమ్||"

దశగ్రీవుడు పంది మీదా , ఇంద్రజిత్తు మొసలి మీద,
కుంభకర్ణుడు ఒంటె మీద దక్షిణ దిశలో పయనమౌతారుట.
అది పరాజితుల పలాయన సూచకము.

కాని విభీషణుని గురించి ఒక ప్రత్యేకమైన అంశము చెపుతుంది త్రిజట.

"ఏకస్త్రత్ర మయా ద్రష్టః
శ్వేతః ఛత్రో విభీషణః |"

"నేను విభీషణుని తెల్లని చామరముతో చూశాను".
అది శుభ సూచకము

మరి లంక సంగతి ఏమిటి?

"లంకా దృష్టా మయా స్వప్నే రావణే నాభిరక్షితా||36||
దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్వినా |"

" నా కలలో రావణ రక్షితమైన ఈ లంకని ఒక రామ దూత దగ్ధము చేశాడు అని చూశాను"

అంటే త్రిజట కలలో లంకా సర్వనాశనము పూర్తిగా చిత్రీకరింపబడినది.

అలాగ కల గురించి చెప్పి, రాబోయే ఈ ఉపద్రవమునుంచి తప్పించుకోడానికి
" సీతను బాధించకుండా , సీతమ్మని వేడుకోండి" అని చెపుతుంది.

"ప్రణిపాతా ప్రసన్నాహి
మైథిలీ జనకాత్మజా|
అలమేషాపరిత్రాతుమ్
రాక్షస్యో మహతో భయాత్||"

"నమస్కరించిన మాత్రముననే ప్రసన్నమగు సీతమ్మని వేడుకోండి,
రాక్షసులకు కలిగే మహత్తరమైన భయము నుంచి ఈమె ఒక్కరితే రక్షింపకలదు" అని.

ఈ శ్లోకములో వాల్మీకి మాతృభావము లక్ష్మీ స్వభావము, సీతాస్వభావము చిత్రీకరించెను.
ఆమెకే ప్రత్యక్షముగా అపరాధము చేసినవారిని కూడా క్షమింప గలిగిన ఔదార్యవతి.
తాను క్షమించడమే కాదు. ఇతరులను కూడా హింసాకార్యక్రమములనుంచి నివారించకల శక్తి కలది.

యుద్ధకాండలో , యుద్ధము అయిన తరువాత,
రాక్షస స్త్రీల హింసాకాండను చూచిన హనుమ ,
ఆ రాక్ష స్త్రీల వధకు పూనుకుంటాడు.
అప్పుడు సీత చెపుతుంది.
"న కశ్చిన్నాపరాధ్యతి".
"తప్పు చెయని వాడు ఎవరు"?అని చెప్పి , హనుమని నివారించెను.
అది సీతమ్మ మాతృభావము.

త్రిజట తనుచూస్తున్న సీతకు కలగబోతున్న శుభసూచకములను కూడా చెపుతుంది.

"నేను వైదేహి కోరికలు నెరవేరు సూచనలు చూచుచున్నాను.
అలాగే రాక్షస వినాశనము రాఘవుని జయము కూడా చూచుచున్నాను. .
ఈమెకు మహత్తరమైన ప్రియము వినిపించుటకు శకునములు కనపడుచున్నవి.
ఆమె పద్మపత్రములాంటి ఎడమ కన్ను అదురుచున్నది".

"శుభ సూచకములను సూచిస్తూ దక్షత కల ఈ వైదేహి ఎడమ భుజము కంపిస్తున్నది.
ఏనుగు తొండము లాంటి ఎడమ తొడ అదురుతూ రాముని చూచుట సూచించుచున్నది".

అలా రాముని విజయము రావణు ని పరాజయము సూచిస్తూ కనపడే
శుభసూచకములను గురించి చెపుతూ ఇంకా ఇలా అంటుంది.

పక్షీ చ శాఖా నిలయః ప్రహృష్టః
పునః పనశ్చోత్తమసాంత్వ వాదీ |
సుస్వాగతాం వాచ ముదీరయానః
పునః పునశ్చోదయతీవ హృష్ఠః||

"ఆ వృక్షశాఖలలో వున్న పక్షి
ఇది శోకమునకు తగిన సమయము కాదు అని సూచిస్తూ
మళ్ళీ మళ్ళీ ఉత్తమము అయిన సాంత్వవచనములను పలుకుచున్నట్లు ఉంది.
రామునకు సుస్వాగతము కూడా పలుకుచున్నట్లు వుంది"

ఈ శ్లోకము "పక్షీ" అన్నమాటలో , "శాఖానిలయః" అనడములో ,
"ప్రహృష్టః" అనడములో అనేకమైన ధ్వనులు వినిపిస్తాయి.

ఆ చెట్టుమీద శాఖలలో ఉన్న పక్షి, మనకి వినపడే ధ్వని చెట్టు మీదా దాగి ఉన్న హనుమ.
ఆ హనుమ సుందరకాండలో మొదటి శ్లోకము లో చెప్పబడిన ఆచార్యుడు.
రామునికి దూరముగా వున్న సీతకు రాముని సందేశము అందింపవచ్చి,
ఇంతవరకు పరిక్షించుచున్న హనుమ మాట్లాడే శుభసమయము ఆసన్నమైనది అన్నమాట.
బ్రహ్మనిష్టుడై ఆచరణముచే పరిపూర్ణూడైన ఆచార్యుడు, జ్ఞాని అగు మహాపరుషుడు "పక్షి"

పక్షి అంటే
పక్షములు కలది పక్షి.
ఇది ఆకాశమున విహరించును
అలా ఆకాశమున పోవుటకు సాధనములు పక్షము లు- రెక్కలు.
ఆకాశమే పరబ్రహ్మము.
ఆకాశమున విహరించుట పరబ్రహ్మమును చేరుట
ఆ = అంతట పూర్తిగా ; కాశ = ప్రకాశించునది
ఆకాశము అంటే స్వయం ప్రకాశమైనది అదే పరమాత్మ
రెండు రెక్కలతో పక్షి ఆకాశములో సాగునట్లే,
జ్ఞాన కర్మలచే పురుషుడు పరమగతి నొందును అని.

యజ్ఞము దానము తపస్సు అనునవి ఆచరించి,
అంతఃకరణ నిర్మలత్వము పొందినప్పుడే జ్ఞానము ఆవిర్భవించును.
ఆట్టి జ్ఞానముతో ఆరాధ్యుడగు పరమపురుషుని తెలిసికొని,
పరమపురుషుని సమారాధనరూపముగా కర్మలను ఆచరించుటయే సిద్ధి.

అట్తి జ్ఞాన కర్మలు కలవాడే ఆచార్యుడు.
ఆచార్య శబ్దమునకు నిర్వచనము కూడా అదే.

"ఆచనోతి హి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి
స్వయమాచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే" ||

శాస్త్రార్థములను తెలిసికొని, తను ఆచరించి, ఇతరులచే ఆచరింపచేయువాడే ఆచార్యుడు.
ఆ చెట్టుమీద వున్న "పక్షి" -హనుమ అటువంటి అచార్యుడు.

ఆ పక్షిని - "శాఖానిలయః" అంటారు. ఆ శాఖలలో ఉన్న పక్షి అన్నమాట.

వేద శాఖలే ఇక్కడి శాఖలు.
ఆ వేద శాఖలలో మునిగి వున్నవాడే గురువు - ఆచార్యుడు - అదే హనుమ.

శ్లోకములో శాఖానిలయః ప్రహృష్టః అని చెపుతారు.

ప్రహృష్టః అంటే సంతుష్టమైన హృదయము కలవాడు అని.
అది ఎవరు?
విషయభోగముల కోరికలతో,
వాటిని పొంది లాభాలాభములతో సంతుష్టుడుగా వుండడము కాదు.
సదా భగవద్గుణములనే అనుభవించుచూ ,
ఆ అనుభవముచే కలిగిన ప్రీతితో నిండిన హృదయముకలవాడు సంతుష్టుడు.
ఎల్లప్పుడూ సంతుష్టుడై వుండాలి.
అలాంటి అనుభవముతో సంతుష్టుడై వున్నవాడే ఆచార్యుడు.

ఆ పక్షి ఏమి చెపుతున్నట్లు వుంది?

"పునః పునశ్చ ఉత్తమ సాంత్వవాది"
మరల మరల ఉత్తమమైన సాంత్వ వచనములను చెపుతూ వున్నట్లు వుంది ఆ పక్షి.
ఆ ఆచార్యుడే ఇలా సాంత్వ వచనములు చెప్పకలిగినవాడు.

ఆ ఆచార్యుడే సాంత్వ వచనములు చెప్ప తగినవాడు.
ఆచార్యుడు భగంతుని చేరుట కష్టముకాదని ,
ఎక్కడ పొందవలెననిన అక్కడనే వుండునని,
ఏమియు సమిర్పింపనక్కరలేదని ,
సర్వ సులభుడని,
ఆచార్యుడు శిష్యునకు సాంత్వవచనముల తో చెప్ప గలిగినవాడు.

అలాంటి ఆచార్యుడు ఏమి చెపుతున్నాడట?

"సుస్వాగతం వాచం ఉదీరయానః"

సు=చక్కగా సంప్రదాయబద్ధముగా
స్వ= తనకు
ఆగతం= వచ్చిన
వాచం = వాక్కును అంటే మంత్రమును
ఉదీరయానః = చెప్పుచున్నాడు.

భగవంతుని నుండి పూర్వచార్య పరంపరలో వచ్చిన మంత్రములను
ఆచార్యుడు శిష్యులకు ఉపదేశించుచుండును.
అది ఆచార్యుని మార్గము.
అచార్యుడు ఎలాగ చెపుతున్నాడు.

"పునః పునశ్చోదయతీవ "
మరల మరల చెపుతున్నాడుట.
శిష్యుడు అపమార్గమునపడకుండా ప్రేరణ చేసేవాడే గురువు.

అట్టి గురువగు "పక్షి" చెట్టుశాఖలలో మరల మరల దుఃఖములో ఉన్న సీతకు
శాంత్వ వచనములను చెప్పినట్లు కూస్తున్నాడుట.

అంటే ఈ శ్లోకములో
"జ్ఞానకర్మలు చేయువాడు,
విద్యా వినయ సంపన్నుడు,
భగవదనుభావ జనిత ఆనందము అనుభవించువాడు,
భగవద్విషయములగు సాంత్వ వచనములు పలుకువాడు,
ఆచారపరంపరాప్రాప్తమగు మంత్రములను ఉపదేశించువాడు,
సదా శిష్యుని పరిశీలించువాడు ,
శిష్యానుభవముచే ఆనందించువాడు ,
అట్టివాడే గురువుగా ఉండతగినవాడు. "

అలాంటి పక్షి ( వానరుడు) ,
అంటే ఆచార్యస్వరూపుడగు హనుమంతుడు చెట్టుపై ఉన్నాడు.
సాంత్వ వచనములను చెప్పుచున్నాడు.
అది శుభ సూచకము.

అదే ఈ స్వర్గ ఆఖరిమాటగా చెప్పబడినది.
ముందున్న ఘటనలను సూచిస్తూ.
ఆ సూచనతో ఈ సర్గ అంతమౌతుంది.

ఆయితే ఈ సర్గలో ఇంకొన్ని విశేషాలు వున్నాయి అని ముందే విన్నాము.
అవి ఇప్పుడు చూద్దాము.

ఈ సర్గలో వున్న ఇంకో విశేషము.

త్రిజట తన స్వప్న వృత్తాంతము చెపుతూ ఇలా అంటుంది.

శ్లో|| యస్యాం ఏవం విధః స్వప్నో దుఃఖితాయాం ప్రదృశ్యతే||42||
సా దుఃఖైః వివిధై ర్ముక్తా ప్రియం ప్రాప్నోత్యనుత్తమమ్|

తా|| దుఃఖములో నున్న ఎవరికి ఇట్టి స్వప్నము వచ్చునో వారు అనేక రకములైన దుఃఖములనుంచి విముక్తులగుదురు. అసమానమైన ప్రియమును పొందుదురు

అంటే ఈ త్రిజటా స్వప్న వృత్తాంతము వినతగినది చదవతగినది అని.
తత్త్వదీపికలో ఈ సర్గ గురించి రాస్తున్నప్పుడు అన్ని శ్లోకాలు పూర్తిగా విశదీకరింపబడ లేదు.
అందుకని ఈ సర్గ చివరిలో త్రిజటా స్వప్న వృత్తాంతము మళ్ళీపూర్తిగా విశదీకరింపబడుతుంది.

ఈ సర్గలో ఇంకో మాట.

ఈ త్రిజట కల తెల్లవారుజాములో ప్రాతఃకాలము ముందర వచ్చిన కల.
ఈ కలలో మాటలన్నీ నిజమౌతాయి.
ఆ సంగతి మిగిలిన సర్గలలో మనకి విదితమౌతుంది.
రామాయణము కాలములోనే ప్రాతఃకాలము ముందర వచ్చిన కలలు,
"నిజమౌతాయి" అని లోకోక్తి వున్నదో లేదో మనకి తెలియదు.
ఆ లోకోక్తి వుంటే వాల్మీకి, శకునముల గురించి చెప్పిన కవి,
ఆ లోకోక్తి గురించి కూడా చెప్పేవాడు అని ఒక ఆలోచన.

ఏది ఎమైనా "ఈ కాలము"లో అలా ప్రాతః కాలపు కలలు నిజమౌతాయి అని ఒక నమ్మకము.
ఆ నమ్మకము బహుశః ఈ త్రిజటా స్వప్నము తో నే మొదలైది కాబోలు.
ఆ మాట సందిగ్ధమే అయినా,
ఈ కలలోని విశేషాలు కొన్ని లోకోక్తులలోకి మారాయి .
అవి ముందు వచ్చే కార్యములను సూచించే లోకోక్తులన్నమాట.
ఈ మాట రామాయణ తిలకలో రాయబడినది.

త్రిజట కలలోని ఒక సన్నివేశములో
సీతమ్మ పర్వతశిఖరము మీదనుంచి ఆకాశములో వున్న గజము పైకి ఎక్కుతుంది.
ఆ సన్నివేశము విడమరుస్తూ రామాయణ తిలకలో ఇలా రాస్తారు.

||తి. టీ ||తదుక్తమ్ - అందువలన ఈ విధముగా చెప్పబడినది
'ఆరోహణం గోవృషకుఙ్జరాణాం ప్రాసాదశైలాగ్రవనస్పతీనాం |
ధృవమర్థలాభమ్ 'ఇతి|

"స్వప్నములో గోవు వృషభము కుంజరము , ప్రాసాదము ,పర్వత శిఖరము ఎక్కినవారికి అర్ధ లాభము ధృవము" అని.

ఆ తరువాత ఇంకో సన్నివేశములో సీతమ్మ రాములవారి తో చేరి సూర్యమండలము చంద్ర మండలము స్పృ సిస్తున్నట్లు త్రిజట స్వప్నములో వస్తుంది. రామాయణ తిలకలో ఇది విశదీకరిస్తూ ఇలా చెపుతారు.

||రా.టీ|| తదుక్తమ్ , (అందుకని ఇలా చెప్పబడినది).
"ఆదిత్య మణ్డలం వాపి చన్ద్రమణ్డలమేవవా|
స్వప్నే గృహ్ణాతి హస్తాభ్యాం మహద్రాజ్యం సమాప్నుయాత్||"

తా| స్వప్నములో ఎవరైన ఆదిత్యమండలము కాని చంద్రమండలము కాని వారి చేతులతో పట్టుకొనితే వారికి మహత్తరమైన సామ్రాజ్యము లభిస్తుంది. అని.

ఇక వాల్మీకి చెప్పిన త్రిజట స్వప్న వృత్తాంతము పూర్తిగా విందాము.

"దుష్టులైన వారిచేత భయపెట్టబడుచున్న సీతను చూచి వృద్ధురాలైన రాక్షసి త్రిజట అప్పుడు ఈ వాక్యములను పలికెను.

"జనకుని కూతురు దశరథుని కోడలు అయిన సీతను తినకుడు. మిమ్మలిని మీరే తినుడు. ఇవాళ నేను ఒక స్వప్నము చూసితిని. అది దారుణము రోమహర్షణము అయినది. అది ఆమె భర్త జయమును రాక్షసుల వినాశనమును సూచించుచున్నది".

త్రిజట చెప్పిన ఆ మాటలు వినిన రాక్షస్త్రీలందరూ భయముతో క్రోధమూర్చితులై ఈ మాటలను చెప్పిరి. "రాత్రి నీవు చూసిన స్వప్నము ఏలాంటిదో చెప్పుము"అని. రాక్షసస్త్రీల ముఖమునుంచి వచ్చిన ఆ మాటలు వినిన త్రిజట వారికి తనకి వచ్చిన స్వప్నము గురించి చెప్పసాగెను.

" రాఘవుడు తెల్లని వస్త్రములు ధరించినవాడై లక్ష్మణుని తో సహా అంతరిక్షములో గజదంతములతో కూడిన వేయిహంసలు మోస్తున్న పల్లకీమీద వచ్చెను. అప్పుడు స్వప్నములో తెల్లని బట్టలతో సాగరమధ్యములో నున్న పర్వతముపై కూర్చుని ఉన్న సీతాదేవిని చూచితిని".

"కాంతి భాస్కరునుతో కూడినట్లు సీత రామునితో చెరినది. నాలుగు దంతములుకల పర్వతములతో సమానమైన మహాగజముల పై లక్ష్మణునితో కూడా వున్న రాముని కూడా చూచితిని. అప్పుడు తెల్లని వస్త్రములు ధరించిన నరశార్దూలురు వారిద్దరూ తమ తేజస్సుతో వెలుగుతూ సీతవద్దకు వచ్చిరి. అప్పుడు పర్వతాగ్రముపై నున్న ఆ జానకి ఆకాశములో నిలబడిన ఆ ఏనుగు పైకి ఎక్కి భర్తచేత చేరెను. అప్పుడు కమలలోచనుడగు ఆ భర్త అంగములనుంచి లేచి చంద్ర సూర్యులను స్పృశించినట్లు చూసితిని. అప్పుడు విశాలాక్షి అయిన సీత, ఆలాగే కుమారులు ఇద్దరూ కూర్చుని ఉన్న ఆ గజము లంకా నగరముపైన నిలబడెను".

"ఆ కాకుత్‍స్థుడు భార్య సీతతో సహా ఎనిమిది వృషభములు కల రథముపై స్వయముగా ఇక్కడికి వచ్చెను. ఆ వీరుడు సీతా లక్ష్మణులతో కలిసి దివ్యమైన సూర్యునితో సమానమైనకాంతిగల దివ్యమైన పుష్పక విమానమెక్కి ఉత్తరదిశలో సాగిపోయెను. ఈ విధముగా విష్ణు పరాక్రమము గల రాముడు, భార్య అయిన సీతతో అలాగే తమ్ముడు లక్ష్మణునితో కలిసి ఉండడము స్వప్నములో నేను చూచితిని. పాపులకు స్వర్గము పొందుట ఎలా శక్యము కాదో అలా రాక్షసుల చేత గాని ఇతర సురాసురుల చేత గాని మహాతేజోవంతుడు అగు రాముడు జయింపబడుట శక్యముకాని పని".

" రక్తపు రంగు వస్త్రములతో తాగి మత్తులో కరవీర పుష్పముల మాల ధరించి, తైలము తో పూయబడి భూమి మీద పడియున్న రావణుని కూడా చూచితిని. శిరో ముండనము చేయబడిన నల్లని వస్త్రములు ధరించియున్న రావణుని ఒక స్త్రీ ఈడ్చుకు పోతూవున్నట్లు , మళ్ళీ రావణుడు విమానము నుంచి భూమిపై పడుతున్నట్లు చూచితిని. రావణుడు ఎఱ్ఱని పూలమాలతో మైపూతలతో నూనె తాగి పిచ్చిగా నవ్వుతూ నృత్యము చేస్తూ గాడిదలు పూన్చిన రథముపై దక్షిణ దిశలో వెళ్ళెను. రాక్షసేశ్వరుడగు రావణుడు భయమోహితుడై గాడిదమీదనుంచి కింద పడినట్లు మళ్ళీ నాకు కనపడెను. రావణుడు వెంటనే లేచి భ్రాంత చిత్తుడై, భయముతో మదముతో వివశుడై, బట్టలు లేని వాడై పిచ్చివాని వలె సహించలేని దుర్వాక్యములను ప్రేలాపించుచూ ఘోరము నరకముతో సమానమైన అంధకారమయమైన మలపంకములో పడి మునిగి పోయెను".

"ఎఱ్ఱని వస్త్రములు ధరించియున్న అంగములపై బురదపూసుకొనిన ఒక నల్లని స్త్రీ దశగ్రీవుని కంఠములో తాడుకట్టి దక్షిణ దిశగా ఈడ్చుకుపోసాగినది. అక్కడ నిశాచరుడు అగు కుంభకర్ణుడు అలాగే రావణుని పుత్రులందరూ శరీరమునకు తైలము పూసికొని నట్లు కనబడిరి. దశగ్రీవుడు వరాహముపై, ఇంద్రజిత్తుమొసలిపై, కుంభకర్ణుడు ఒంటె పై ఎక్కి దక్షిణ దిశగా పోవుట కనపడినది".

ఆ స్వప్నములో విభీషణుడు ఒక తెల్లని చత్రముతో తెల్లని బట్టలు ధరించి గంధములు పూసికొని కనపడెను. విభీషణుడు శంఖదుందుభి ఘోషలతో నృత్య గీతములతో పర్వతమువలె నున్న మేఘ గర్జనలతో సమానమైన గర్జనలు చేయుచున్న నాలుగు దంతములు కల దివ్యమైన గజములపై ఏక్కి వుండెను. నలుగురు సచివులతో కూడి ఆకాశములో నిలపడియుండెను".

" తాగివున్న ఎఱ్ఱని పూలమాలలు వస్త్రములు ధరించియున్న రాక్షసులను, పాటలుపాడుతూ వున్న సమాజములను కూడా నేను చూచితిని. పడిపోయిన గోపురములు తోరణములతో కూడియున్న లంకానగరము గుర్రములు ఏనుగులతో సహా సాగరములో మునిగిపోవుట నేను చూచితిని . రావణునిచేత రక్షింపబడిన లంక రాముని దూత వాయువేగముకల వానరుని చేత దగ్ధము చేయబడినట్లు చూచితిని. భస్మరాసులతో నిండిన లంకలో రాక్షస స్త్రీలు నూనెతాగి పిచ్చిగా పెద్దగా ధ్వనిచేస్తూ నవ్వుతూ వున్నట్లు కనపడిరి. కుంభకర్ణాదులు అలాగే అందరూ రాక్షసపుంగవులు వస్త్రములు లేకుండా గోవుపేడగుంటలలో ప్రవేశించిరి ".

"ఓ రాక్షస స్త్రీలారా మీరు నశించిపోయెదరు. రాఘవుడు సీతను పొందును. అమితమైన కోపము కల రాఘవుడు మీ అందరినీ చంపివేయును. రామునికి ప్రియమైన వనవాస దీక్షతీసుకున్న భార్యను భయపెట్టిన దుర్భాషలాడిన వారిని వధించును".

" అందుకని ఈ క్రూర వాక్యములు చాలు. ఆమెతో శాంతముగా ప్రవర్తించుడు. వైదేహిని బ్రతిమాలుటయే మంచిది. నాకు అదే మంచిది అనిపించుచున్నది. దుఃఖములో నున్న ఎవరికి ఇట్టి స్వప్నము వచ్చునో వారు అనేక రకములైన దుఃఖములనుంచి విముక్తులగుదురు. అసమానమైన ప్రియమును పొందుదురు. రాక్షసులారా భయపెట్టినప్పటికీ ఆమెను యాచించుడు. ఇంకాచెప్పుట అనవసరము. రాక్షసులకు ఘోరమైన ఆపద సంభవించనున్నది".

"రాక్షసులారా జనకాత్మజ అయిన ఈ మైథిలి నమస్కరించబడి ప్రసన్నురాలై మహత్తరమైన భయమునుంచి మనలను రక్షింపగలదు. ఈ విశాలాక్షి అంగములలో అశుభకరమైన సూచనలు కనపడుటలేదు. ఆకాశమార్గములో ఉన్న ఆమెలో ఒక్క ఛాయమాత్రముగా తేడా వున్నది. దుఃఖము అనుభవించతగని ఆమెకు అమిత దుఃఖము సంభవించినది".

"నేను వైదేహి కోరికలు నెరవేరు సూచనలు చూచుచున్నాను. అలాగే రాక్షస వినాశనము రాఘవుని జయము కూడా చూచుచున్నాను. . ఈమెకు మహత్తరమైన ప్రియము వినిపించుటకు శకునములు కనపడుచున్నవి. ఆమె పద్మపత్రములాంటి ఎడమ కన్ను అదురుచున్నది".

"శుభ సూచకములను సూచిస్తూ దక్షత కల ఈ వైదేహి ఎడమ భుజము కంపిస్తున్నది. ఏనుగు తొండము లాంటి ఎడమ తొడ అదురుతూ రాముని చూచుట సూచించుచున్నది".

ఆ శాఖల మీద నున్న కోకిలలు మధురమైన కూతలు పదే పదే కూయుచూ అత్యంత ఆప్తునికి స్వాగతము చెపుతూ ఉన్నట్లు ఉన్నాయి. అవి సంతోషముతో పదే పదే చెపుతూ ఉన్నట్లు ఉన్నాయి".

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయనములో సుందరకాండలో ఇరువది ఏడవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||

----------------------------------------------------------------------------

సుందరకాండ.
అథ సప్తవింశస్సర్గః

ఈ విధముగా సీత చేత దుఃఖములో రాబోవు ఘటనలను సూచిస్తూ శాపపూర్వకముగా చెప్పబడిన మాటలు వినిన రాక్షసులు కొందరు ఆ విషయము చెప్పుటకు రావణుని వద్దకు పరుగిడిరి.

అప్పుడు సీతను చేరి ఘోరరూపముకల రాక్షసులు ఒకే అర్థముగల అనర్థమైన మాటలు మరల చెప్పసాగిరి." ఓ అనార్యా! పాపములో నిశ్చయముగా వున్న నీ మాంసము ఈ దినమే రాక్షసులందరూ సుఖముగా తినెదరు."
|| ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||