||సుందరకాండ. ||
||తత్త్వదీపిక- ముప్పది రెండవ సర్గ ||
|| తథాస్తు నాన్యథా!||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ ద్వాత్రింశస్సర్గః
తత్త్వదీపిక
తథాస్తు నాన్యథా !
ముప్పది ఒకటవ సర్గలో
"స్వయం ప్రహర్షం పరమం జగామ
సర్వాత్మనా రామమనుస్మరంతీ"
అంటూ రాముని గురించే ధ్యానిస్తూ ,
రామకథ విని అన్ని దిశలలో చూస్తూ,
సీత స్వయముగా ఆనందము పొందింది అని వింటాము.
రామ కథ వింటే హర్షమే వస్తుంది.
అప్పుడు అన్ని దిశలలూ చూస్తున్న సీత ,
వృక్షశాఖలలో లీనమైన తెల్లని వస్త్రము ధరించిన ,
మెఱుపుతీగల వంటి వర్ణము కల వానరుని చూచి
సీత మనస్సు కొంచెము చలిస్తుంది.
అప్పుడు కనపడినది ఒక వానరుడు.
ఆ వానరుడు వినయముగా వికశించిన పుష్పములకాంతితో శోభిల్లుతున్నవాడు.
పుడిమి బంగారపు కాంతులుగల నేత్రములతో ,ప్రియవచనములు పలుకుతున్న వాడు.
అలాగ వినయముగా మాట్లాడు వానరుని ఎప్పుడూ చూడలేదు.
విస్మయము చెందిన మైథిలి, చలించిన మనస్సుతో ఆలోచిస్తుంది.
ఆ చలించిన మనస్సుకి శోబిల్లుచున్న,
బంగారు కాంతులు గల నేత్రములతో వున్న వానరుడు భయంకరముగా కనిపించాడు.
"అయ్యో ఈ వానరుని రూపము భయంకరముగా సమీపింప సాధ్యముకానిదిగా ఉన్నది".
"చూడడానికి కూడా అశక్యముగానున్నది"
ఈ విధముగా తలచి మళ్ళీ కలత చెంది తీవ్రముగా విలపింపసాగెను.
మళ్ళీ ఆ వానరుడు అతి వినయముగా చెట్టు మీద కూర్చుని వున్నవాడు.
అలా కూర్చునివున్న వానరశ్రేష్ఠుని చూచి ఇది కలయే అని అనుకొనెను.
అయితే కలలో వానరుని చూడడము శుభము కాదని శాస్త్రములలో నిషిద్ధింపబడినది
ఆ ఆలోచనలతో వెంటనే మూర్ఛిల్లి , ప్రాణము పోయినదానివలె ఆయ్యెను.
విశాలనేత్రములు కల ఆ దేవి వెంటనే తేరుకొని మరల ఆలోచించసాగెను.
"ఇప్పుడు నేను శాస్త్రములో నిషిద్ధింపబడిన వానరుని స్వప్నములో చూచితిని.
లక్ష్మణునితో కూడిన రామునకు,
అలాగే రాజు నా తండ్రి అగు జనకునకు శుభము అగుగాక.
ఇది స్వప్నము కూడా కాదు.
పూర్ణచంద్రుని బోలి ముఖముగల రాముని బాసి
శోకములో దుఃఖముతో పీడింపబడుతున్న నాకు నిద్రకూడా లేదు కదా.
రామా రామా అంటూ సదా అదే చింతనతో ఆయననే స్మరిస్తూ,
అందుకు అనుగుణముగా అలాంటి కధలనే వింటూ చూస్తూ ఉన్నట్లు ఉన్నాను.
నేను ఆయనతో మనస్సు నిండినదై , పీడింపబడినదై ,
అన్నివిధములుగా ఆయనపై భావము కలదాననై ఆయననే చూస్తూ వింటూ ఉన్నాను.
నేను విన్నది నిజము కాదు,
అది నా మనోరథము అని అనుకుంటాను.
కాని ఇప్పుడు ప్రత్యక్షముగా కనిపిస్తున్న వానర రూపము మాట్లాడు చున్నది.
అది ఎలాగ?"
ఇలా మధనపడిన సీతకి ఒకటే దోవ కనిపిస్తుంది.
" ఇంద్రునకు నమస్కారము.
బృహస్పతికి, బ్రహ్మదేవునకు నమస్కారములు.
నా ముందున్న ఈ వనవాసుడు చెప్పినది నిజము అగు గాక."
"తథాస్తు నాన్యథా !"
"అది అసత్యము కాకూడదు గాక ! "
మనస్సు కలత చెందినపుడు అది అనేక మార్గాలలో పోతుంది.
దానిని అదుపులోకి తీసుకురావడము మొదటి కార్యక్రమము.
సీత బృహస్పతికి బ్రహ్మదేవునకు నమస్కారము చేస్తూ,
తథాస్తు అనుకోవడములో సీత చేసినది అదే.
అదే ముప్పది మూడవసర్గలో మనము వినే మాట
||ఓం తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||