||సుందరకాండ. ||

||తత్త్వదీపిక- ముప్పది ఐదవ సర్గ ||

||"రామః కమలపత్రాక్షః " !||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ పంచత్రింశస్సర్గః

తత్త్వదీపిక
రామః కమలపత్రాక్షః

హనుమంతుడు వినిపించిన రామ కథను విని,
"ఏతి జీవన్తి మానందో నరం వర్ష శతాదపి" అనుకుంటూ ఆనందపడినా గాని,
మళ్ళీ తనతో మాట్లాడుతున్నవాడు "మాయావీ" రావణుడా?
అని శంకలో పడినది సీత.

ఆ సీతకి, హనుమంతుడు
"రాముడు 'ఆదిత్య ఇవ తేజస్వీ లోకకాంతః శశీ యథా' ,
అంటే సూర్యునివలే తేజోవంతుడు ,
చంద్రునివలె లోకమునకు ఆహ్లాదము కలిగించువాడు",
అంటూ సీత మనస్సుకి ఆహ్లాదము కలిగిస్తాడు.
ఇది మనము ముప్పది నాలుగొవ సర్గలో విన్నకథ.

"నాహమస్మి తథా దేవీ" అంటూ ,
"నేను రామదూతను, నీవు శంకిస్తున్నట్లు రావణుని కాదు"
అన్న హనుమంతుని మాటతో మనస్సు కుదుటబడినా,
సీతకి రాముని గురించే ఇంకా వినాలనిపిస్తుంది.

మన మనస్సు కి ఆహ్లాదపరిచే పాట వింటే మళ్ళీ వినాలనిపిస్తుంది.
పసిపిల్ల చెప్పిన కధే మళ్ళీ మళ్ళీ చెప్పమని అడుగుతూ వుంటుంది.
బ్రహ్మజ్ఞానముపై మళ్ళిన మనస్సు కి బ్రహ్మజ్ఞానముగురించే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
అలాగే సీత కు తనకు ఉపశమనము కలిగించు రాముని గురించి ఇంకా వినాలనిపిస్తుంది.

ముప్పది ఐదవ సర్గ ఆ సీతమ్మ ప్రశ్నలతో మొదలవుతుంది.
అప్పుడు సీత హనుమంతుని ఇలా అడుగుతుంది.

'క్వతే రామేణ సంసర్గః
కథం జానాసి లక్ష్మణం|
వానరాణాం నరాణాం చ
కథమాసీత్ సమాగమః|"

అంటే ' ఓ వానరోత్తమా ! నీవు రామునితో ఎప్పుడు కలిసితివి ?
లక్ష్మణుని ఎటుల నెఱుంగుదువు?
నరులకు వానరులకు సమాగమము ఎట్లు సంభవించెను.
ఓ వానరా! రాముని చిహ్నములు ఏమి ?
లక్ష్మణుని చిహ్నములు ఏమి? అవి నీవు మళ్ళీ చెప్పుము.
అప్పుడు నా శోకము శమించును.
రాముని సంస్థానమెట్లుండును?
రాముని రూపము ఏట్లుండును?
ఊరువులు బాహువులు ఎట్లుండును ?
అలాగే లక్ష్మణుడెట్లుండును?'

రాముని చిహ్నములు ,
సంస్థానము, ఊరువులూ , బాహువులూ గురించి సీతకు అన్నీ తెలుసును.
సీతమ్మకి తెలుసు అని హనుమంతునికి కూడా తెలుసు.
అయినా కాని తన ద్వారా వినాలనే కోరికతో అడిగినది అని హనుమకు అర్థమవుతుంది.

ఒకప్పుడు బాగాతెలిసికూడా అడిగే ప్రశ్నలు,
తమని కించపరచడానికి అడిగిన ప్రశ్నలా అని కించపడే వాళ్ళు ఉంటారు.
అలాగ అహంకారము తో నిండినవారు మరో విధముగా ప్రవర్తిస్తారు.
కాని హనుమంతుడు అలాంటివాడు కాదు.
ఆ ప్రశ్నలు తన అదృష్ఠముగా భావించి ,
హనుమంతుడు రాముని యథాతథముగా వర్ణించుటకు ఉపక్రమించెను.

"ఓ జనకాత్మజా ! రాముడు పుట్టుకతో కమలపత్రాక్షుడు.
అన్ని విధములుగా మనోహరుడు.
రూపము దక్షత సంపదలుగా గలవాడు.
తేజస్సులో సూర్యునితో సమానుడు.
క్షమలో భూమితో సమానుడు.
బుద్ధిలో బృహస్పతి తో సమానుడు.
యశస్సులో ఇంద్రునితో సమానుడు.
జీవలోకమును రక్షించువాడు.
తన జనములను రక్షించువాడు.
శతృవులను తపించు పరంతపుడు.
తనను ఆశ్రయించినవారిని ధర్మమును రక్షించువాడు.
ఓ దేవి లోకములో నాలుగు వర్ణములవారిని రక్షింఛువాడు.
అతడు లోకములో మర్యాదలను నిలపెట్టువాడు పాటించువాడు".

" అత్యంత తేజోమయుడు.
పూజితుడు.
బ్రహ్మచర్య వ్రతములో నిష్ఠగలవాడు.
సాధువులకు ఉపకారము చేయుటలో ప్రజ్ఞకలవాడు.
కర్మలను పాటించుటలో, పాటింపచేయబడుటలో ప్రజ్ఞ కలవాడు.
అతడు రాజవిద్యా వినీతుడు.
బ్రాహ్మణులను ఆదరించువాడు.
అతడు పరంతపుడు.
వేదవిద్యలలో పారంగతుడు .
శీలము కలవాడు.
బుద్ధిమంతుడు.
యజుర్వేదము తెలిసినవాడు.
వేదములను తెలిసిన వారిచేత పూజింపబడువాడు.
వేదములలోనూ వేదాంగములలోనూ ధనుర్వేదములోనూ నిష్ఠ కలవాడు".

" ఓ దేవి రాముడు విశాలమైన భుజములు కలవాడు.
పెద్ద బాహువులు కలబాడు.
కంఠము శంఖాకారములో నున్నవాడు.
మంగళప్రదమైన ముఖము కలవాడు.
రాముడు మూపుసంధి ఎముకలు గూఢముగా గలవాడు.
మంచి తామ్రవర్ణముగల కళ్ళు కలవాడు.
రాముడు లోకములో అందరికి తెలిసినవాడు.
రాముని స్వరము దుందుభి వంటిది.
నిగనిగలాడు మేలిమి ఛాయకలవాడు.
ప్రతాపము కలవాడు.
అన్ని అవయవములు సమానమైన ప్రమాణములో కలవాడు.
శ్యామవర్ణముతో నిండినవాడు".

ఇవి రాముని గుణ వర్ణనలు.
రాముడు సుగుణాభిరాముడు అనే మాట ఈ శ్లోకాలలో మనకు విదితమౌతుంది.

ఈ శ్లోకాలను అధ్యాత్మిక రూపముగా కూడా చూడవచ్చు.

ఆ వర్ణనలో మొదటి శ్లోకము :

రామః కమలపత్రాక్షః సర్వసత్త్వ మనోహరః|
రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే||

హనుమంతుడు తన వర్ణనలో "రామః" అంటూ మొదలెడతాడు.
సీతారామ కల్యాణఘట్టములో జనకుడు అన్న
" ఇయం సీతా" లో ఎన్ని ధ్వనులు వినిపిస్తాయో
ఎన్నిసంగతులు ఇమిడిఉన్నాయో,
అలాగే ఇక్కడ కూడా హనుమంతుడు "రామః" అన్నప్పుడు
అన్నిఅర్థాలు ధ్వనులు వినిపిస్తాయి.

రామః అంటే సంస్కృతములో "రమయతి ఇతి రామః"
రమయతి అంటే రమింపచేయువాడు.
అంటే ఆనందము కలిగించువాడు.
చూచెడి వారి చూపులను మనసులనూ ఆకర్షించెడివాడు రాముడు.
పుట్టిన ప్రతి బిడ్డ తల్లికి రాముడే.
చూచెడి వారి చూపులను మనసులనూ ఆకర్షించెడివాడు కనకే రాముడు అనే పేరు వచ్చింది
ఆ దశరథాత్మజుడు రాముడు.
రాముని గుణములు వర్ణన చేయబోతున్నహనుమ "రామః " అంటాడు.
ఇక్కడ "రామః" అన్న ఒక్కమాటలోనే ఓ "సీతమ్మా నీ భర్త రాముడు"
అంటే "సీతమ్మా నీ భర్త ఆనందము కలిగించువాడు" అని !

ఎవరిలోనైన మొదటిగా ఆకర్షించేవి కళ్ళు.
ఇక్కడ హనుమంతుడు మొదటచెప్పినమాట " రామః కమలపత్రాక్షః"
రాముని కళ్ళు కమలపత్రమును పోలి యుండు నేత్రములట.
"రూప దాక్షిణ్య సంపన్నః" అంటే రూపము దాక్షిణ్యము కలవాడు.
రూపము అనడములో దేహగుణములు
దాక్షిణ్యము అనడములో ఆత్మగుణములు సూచింపబడతాయి.
ఆలాంటి దేహగుణములతో ఆత్మగుణములతో కూడియున్నవాడు రాముడు.

ఈ గుణములు సంపాదించిన గుణములు కావు.
"ప్రసూతః" గుణములతో నే పుట్టినవాడు.

ఈ వర్ణనలో ఆంజనేయుడు రాముని యొక్క పరతత్త్వముని గుర్తించాడు అంటారు అప్పలాచార్యులవారు.

"రామః" - రమయతి ఇతి రామః - అనడములోనే రాముడు ఆనందస్వరూపుడు,
ఆనందము గుణముగా కలవాడు,
ఆనందము ఇచ్చువాడు అని.
ఈ ఆనందస్వరూపుడు అనే మాటతో స్ఫురించేది
జగత్కారణ తత్త్వమైన పరమాత్మ సచ్చిదానంద స్వరూపమే.
అంటే రాముడు ఆ పరమాత్మ స్వరూపమే.

ఛాందోగ్యోపనిషత్తు లో వినే మాట.
జగత్కారణమైన పరతత్వము ఉపాసకుల సౌలభ్యము కోసము,
సూర్యమండలమున వుండును.
ఆ సూర్యమండలావర్తి యగు నారాయణుని వర్ణిస్తూ
ఛాందోగ్యోపనిషత్తు ఇలా చెపుతుంది.

"హిరణ్మయః పురుషః దృశ్యతే
హిరణ్య శ్వశ్రుః హిరణ్య నఖః|
అ ప్రణఖాత్ సర్వ ఏవ స్వర్ణః
యథా కప్యాసం పుండరీక మేవ అక్షిణీ"||

సూర్యమండలములో హిరణ్యమయమైన పురుషుడు
-"దృశ్యతే"- కనిపిస్తాడు.
ఎలా కనిపిస్తాడు?
హిరణ్మయ కేశములతో, హిరణ్మయ నఖములతో అంటే బంగారు గోళ్ళతో కనిపిస్తాడు.
అంతా హిరణ్మయ రూపములో కనపడే ఆ పురుషుడు,
నీటిలోంచి మొలచి, లావైన కాడపై నిలిచి,
అప్పుడే ఉదయించిన సూర్యకిరణములచే వికసించిన
తామరపూవులని పోలిన కళ్ళు కలవాడు.
అంటే ఆ పురుషుడు 'కమలపత్రాక్షుడు'.
అది ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడిన మాట
అదే హనుమంతుడు ఇక్కడ అన్నమాట కూడా .

ఆ పరతత్త్వమే సూర్యమండలాంతర్వర్తి యగు పురుషుడు.
అతడే మళ్ళీ సూర్యవంశమున దివ్యమంగళ విగ్రహ గుణములతో ,
దివ్యాత్మ గుణములతో పరిపూర్ణుడై
అందరి కన్నులకు గోచరించునట్లు రాముడిగా జన్మించినవాడు.
"ప్రసూతః" అనడములో , జన్మము లేని వాడు జన్మించెను అని.

రాముని ఈ పరమాత్మ స్వరూపముతో పోలుస్తూ మొదలెట్టి ,
హనుమంతుడు మిగిలిన దేహాత్మ విశేషాలన్నీ కూడా చాలా వివరముగా చెప్పాడు.

ఆ తరువాత రూప వర్ణనలో అన్నివిధాల సమోన్నత మైన రాముని ఘనస్వరూపాన్ని వర్ణిస్తాడు.

"త్రిశ్థిరః, త్రిప్రలంబః, త్రిసమః,
త్రిషుచోన్నతః, త్రితామ్రః,
త్రిషుస్నిగ్ధః, త్రిషు గంభీరః,
త్రివలీవాన్ , త్ర్యవనతః, త్రిశీర్షవాన్,
చతుర్వ్యంగః, చతుష్కలః, చతుర్లేఖః,
చతుష్కిష్కుః, చతుస్సమః, చతుర్దశ సమద్వంద్వః,
చతుర్దంష్ట్రః, చతుర్గతిః,
మహోష్టహనునాసః, పంచస్నిగ్ధః, అష్ఠవంశవాన్,
దశపద్మః, దశబృహత్, త్రిభివ్యాప్తః, ద్విశుక్లవాన్,
షడున్నతః, నవతమః, త్రిభిఃవ్యాప్నోతి,"
ఇత్యాది వర్ణనలతో.

ఇవన్నీ శ్రీరాముని వర్ణనలు.
సీత లక్ష్మణుని గురించి కూడా అడుగుతుంది అదే హనుమంతుడు చెపుతాడు.

'భ్రాతా తస్య ద్వైమాత్రః
సౌమిత్రిరపరాజితః
'అనురాగేణ రూపేణ
గుణైశ్చైవ తథావిథః'

అంటే "అతని తమ్ముడు, సవితితల్లి కోడుకు ,
సుమిత్రానందనుడు అగు లక్ష్మణుడు అపరాజితుడు.
రూపము అనురాగము గుణములలో రాముని వంటి వాడే".

అప్పుడు మిగిలినకథ అంటే నరవానర సమాగమనము ఎట్లు అయినదీ వివరిస్తాడు.

" ఆ నరశార్దూలు ఇద్దరూ నీ దర్శనముకై ఆతురతతో
భూమండలము అంతా నిన్ను వెతుకుతూ మమ్ములను కలుసుకున్నారు.
నిన్ను వెతుకుతూవున్న సమయములో
పూర్వజునిచేత బహిష్కృతుడైన వానరాధీశుడగు సుగ్రీవుని చూచెను.
ఆ నరశార్దూలు ఇద్దరూ అనేకమైన వృక్షములు కల ఋష్యమూక పర్వతములో
అన్నతో భయపడి దాగివున్న ప్రియదర్శనుడగు సుగ్రీవుని కలిసిరి.
మేము రాజ్యమునుంచి అగ్రజునిచేత వెడలగొట్టబడిన సుగ్రీవుని పరిచర్యలలో వున్నవారము".

" అప్పుడు నారచీరలు ధరించి ధనస్సును చేతిలో పట్టుకున్న రామలక్ష్మణులు,
ఇద్దరూ ఋష్యమూక పర్వతమువద్దనున్న రమ్యమైన ప్రదేశమునకు వచ్చితిరి.
నరవ్యాఘ్రములవలెనున్న ఆ నరవరులను చూచి భయపడినవాడై
వానరాధీశుడు ఆ పర్వత శిఖరముకు ఎగిరి వెళ్ళెను.
ఆవానరేంద్రుడు ఆ శిఖరమునందే ఉండి
ఆ వారిద్దరి సమీపమునకు నన్ను వెంటనే పంపించెను".

" నేను ప్రభువైన సుగ్రీవుని వచనములతో
రూపలక్షణసంపన్నులగు వారిద్దరికి అంజలిఘటించి నిలబడితిని.
వారి తత్త్వమును తెలిసికొనిన నేను
ప్రీతి ప్రసన్నతకల వారిద్దరినీ నా పృష్ఠముపై నెక్కించుకొని
వారిని మా దేశమునకు కొనిపోయితిని.

మహాత్ముడైన సుగ్రీవునకు వారి తత్త్వము నివేదించిన పిమ్మట
వారిద్దరి అన్యోన్య సల్లాపములతో మైత్రి ఉదయించెను.
అలాగ ప్రీతిసంపన్నులగు వారిద్దరూ
పూర్వము జరిగిన వృత్తాంతములతో పరస్పర ఆశ్వాసము పొందిరి".

" అప్పుడు స్త్రీ కారణముగా అన్నయైన వాలిచేత వెళ్ళగొట్టబడిన సుగ్రీవుని
లక్ష్మణాగ్రజుడు ఊరడించెను.
పిమ్మట లక్ష్మణుడు క్లిష్ఠమైన కార్యములు సాధించ గల రాముని
దహించుతున్న శోకమును ఆ వానరేంద్రునికి నివేదించెను.

ఆ వానరేంద్రుడు లక్ష్మణుని చేత చెప్పబడిన మాటలను విని
గ్రహము పట్టిన సూర్యుని వలె తేజోవిహీనుడయ్యెను.
అప్పుడు భూమిపై పడినట్టి
నీ అవయవములకు శోభను కలిగించు
ఆభరణజాలమును చూపించెను.

వానర ముఖ్యులు ఆ ఆభరణములన్ని తీసుకువచ్చి
సంతోషముతో రామునకు చూపించ సాగిరి.
నీవు ఎక్కడికి తీసుకుపోబడితివో ఆ మార్గము వారికి తెలియదు.
నా చేత సేకరింపబడిన వాటిని రామునికి ఇచ్చితిమి.

వాటిని చూడగానే గుర్తించిన రాముడు మూర్చ్ఛిల్లెను.
చూపించిన ఆభరణములను తన ఒడిలో ఉంచుకొని
దేవతలవలె ప్రకాశించుచున్న ఆ దేవుడు
పరిపరివిధములుగా విలపించెను".

" ఆ అభరణములను చూస్తూ మళ్ళీ మళ్ళీ విలపిస్తూ మండిపోతున్న దాశరథి శోకమును
ఆ ఆభరణములు మరింప ప్రజ్వలింపచేశాయి.
దుఃఖములో మునిగి పడిపోయిన ఆ మహాత్ముని
నేను కూడా వివిధ మాటలతో లేవతీసితిని.

ఆ మహాబాహువులు కల రాఘవుడు
ఆ ఆభరణములను మరల మరల చూచి,
సౌమిత్రితో కలిసి సుగ్రీవునకు అప్పగించెను.
ఆర్యుడైన రాఘవుడు నీ దర్శనము లేక
అగ్ని పర్వతము వలె జ్వలించుచూ పరితపిస్తున్నాడు".

"నీ గురించి మహాత్ముడగు ఆ రాముడు నిద్రలేక
శోకముతో చింతతో అగ్నిచే ప్రజ్వలిస్తున్న అగ్ని పర్వతము వలె తపించిపోతున్నాడు.
నీ దర్శనము లేక శోకములో రాఘవుడు మహత్తరమైన భూకంపముతో చలించిన
మహత్తరమైన పర్వతము వలె చలించి పోతున్నాడు.
నిన్ను కానక రమ్యమైన వనములలో తిరుగుతున్నప్పటికీ రతిని పొందుటలేదు".

"ఓ జనకాత్మజా మనుజ శార్దూలుడు అగు రాఘవుడు
రావణుని బంధుమిత్రులతో సహా సంహరించి నిన్ను తప్పక పొందును.
అప్పుడు రామసుగ్రీవులిద్దరూ వాలిని హతమార్చుటకు
అలాగే నీ అన్వేషణమునకు అంగీకారముకు వచ్చితిరి.

అప్పుడు ఆ హరీశ్వరుడు వీరులగు రాజకుమారులిద్దరితో కిష్కింధ వచ్చి
యుద్ధములో వాలిని సంహరించిరి.
యుద్ధములో వాలిని సంహరించిన రాముడు
అప్పుడు సుగ్రీవుని సమస్త వానర సంఘములకూ అధిపతిగా చేసెను".

" ఓ దేవీ రామసుగ్రీవుల ఐక్యము ఈ విధముగా కుదిరెను.
నన్ను వారిద్దరి దూతగా ఇక్కడికి వచ్చిన హనుమంతుడు అని తెలిసికొనుము.
సుగ్రీవుడు స్వరాజ్యము పొంది వానరలందరిని పిలిపించి
నీ అన్వేషణార్థము పది దిక్కులలో మహాబలము కలవారిని పంపసాగెను.
వానరేంద్రుడు మహాతేజస్సుగల సుగ్రీవుని ఆదేశము ప్రకారము
నిన్ను వెతుకుటకై అనేక మంది వానరులు బయలుదేరిరి".

" అప్పుడు వానరులందరూ సుగ్రీవుని ఆదేశానుసారము
నిన్ను వెదుకుతూ భూమండలము అంతా తిరుగుచున్నారు.
కపిశార్దూలుడు వాలిసూనుడు లక్ష్మీవంతుడు అగు అంగదుడు
మూడుభాగములలో ఒకవంతు సైన్యముతో బయలుదేరెను.
వింధ్యపర్వతములలో దారితెన్నూతెలియక
అత్యంత శోకసముద్రములో అహోరాత్రములు గడిచినవి".

" మేము అందరము కార్య నిరాశవలన
కాలము గడిచిపోవుటవలన
కపిరాజుపై భయముతో ప్రాణములు త్యజించుటకు సిద్ధపడితిమి.
వనదుర్గములు కొండలు లోయలూ అన్వేషించి
దేవి యొక్క స్థానము కనుగొనలేక ప్రాణములను త్యజించుటకు సిద్ధపడితిమి.
ప్రాయోపవేశమునకు సిద్ధపడిన వానరులందరినీ చూచి
అంగదుడు దుఃఖసాగరములో మునిగిపోయెను.

ఓ వైదేహీ, నీ అన్వేషణావిఫలము,
వాలి వథ, జటాయుషు మరణము ఇవన్ని కారణములయ్యెను.
స్వామి అదేశములపై నిరాశతో ప్రాణత్యాగమునకు సిద్ధమైన సమయములో
సమయానుకూలముగా వీరుడైన గొప్ప పక్షిఅక్కడికి వచ్చెను.

అతడు పక్షిరాజు జటాయువు సోదరుడు,
సంపాతి అనబడు పక్షిరాజు.
సంపాతి తన భాతృ వధగురించి విని కోపముతో ఇట్లు పలికెను.

'వానరోత్తములారా నా తమ్ముడు ఎవరిచేత ఎక్కడ హతమార్చబడెనో
మీచేత చెప్పబడుటకు కోరుచున్నాను'.
అప్పుడు నీ కొఱకు భీమరూపముగల రాక్షసుడు
జనస్థానములో చేసిన (జటాయు) మహావథను యథా తథముగా చెప్పితిని.

ఓ వరాననా ఆ అరుణాత్మజుడు జటాయువు మరణము విని దుఃఖపడి
నువ్వు రావణుని అంతఃపురములో వున్నట్లు చెప్పెను.
ఆ సంపాతి యొక్క ప్రీతిని కలిగించు మాటలు విని
అంగదప్రముఖులు మేము అందరము అచటినుంచి వెంటనే బయలు దేరితిమి".

' ఆకాశములో ఎగరగల వారందరమూ
నీ దర్శనము కలుగుననే ఉత్సాహముతో
వింధ్య పర్వతమునుంచి లేచి సాగరము యొక్క ఉత్తర తీరము చేరితిమి.
అంగద ప్రముఖులు నిన్ను చూడవలను ఉత్సాహముతో సముద్రతీరము చేరి,
సముద్రము చూచి బయపడి మరల చింతాక్రాంతులైరి.
అప్పుడు నేను సాగరము చూచి
వానరసైన్యము యొక్క భయము తొలగిస్తూ
వందయోజనముల సాగరమును లంఘించితిని'.

" రాక్షసులతో నిండి యున్న లంకానగరము రాత్రి ప్రవేశించి
రావణుని కూడా చూచి ,
శోకములో మునిగియున్న నిన్ను చూచితిని.
ఓదేవీ, ఈ వృత్తాంతము యథా తథము గా వివరించితిని.
నాతో మాట్లాడుము.
నేను దాశరథి దూతను.
ఓ దేవి నీ కోసమై రామునిచేత నియోగింపబడి
ఇక్కడికి వచ్చిన పవనాత్మజుని అగు నన్ను సుగ్రీవుని సచివునిగా తెలిసికొనుము".

" సమస్త అస్త్రములను ధరించువారిలో శ్రేష్ఠుడైన నీ కాకుత్‍స్థుడు కుశలము.
గురువును ఆరాధించు లక్ష్మణుడు కూడా కుశలము.
ఓ దేవి వీరుడు నీ భర్త యొక్క హితము కోరువాడు అగు నేను
సుగ్రీవుని వచనములతో ఒక్కడినే వచ్చితిని.
నీజాడ తెలిసికొనగోరి, కోరిన రూపము ధరించగల నేను
ఇంకెవరి సహాయము లేకుండా తిరుగుతూ ఈ దక్షిణప్రాంతమునకు వచ్చితిని".

" అదృష్టముకొలదీ నిన్ను చూచిన వార్త,
నీ జాడతెలియక సంతాపములో మునిగియున్న
వానరసైన్యముయొక్క శోకమును తొలగించును.
అదృష్టము కొలదీ నీ దర్శనము చేసిన కీర్తిని నేను పొందెదను.
ఇక మహావీరుడు రాఘవుడు మిత్రభాంధవులతో కలిపి
రావణుని హతమార్చి త్వరలో నిన్ను చేరును".

" వైదేహీ పర్వతములలో ఉత్తమమైనది మాల్యవంతమనే పర్వతము.
అచటినుండి కేసరి అనబడు వానరుడు గోకర్ణమనే పర్వతమునకు వెళ్ళెను.
దేవఋషుల ఆదేశానుసారము నా తండ్రి ఆ పుణ్య నదీతీరములో శంబసాదనుని సంహరించెను.
ఓ మైథిలీ ఆ వానరుల క్షేత్రములో వాయుదేవుని అనుగ్రహముతో జన్మించిన నేను
నా చేతల వలన హనుమంతుడు అనే పేరుతో పేరుపొందితిని".

"ఓ వైదేహీ నీకు విశ్వాసము కలిగించుటకు
నీ భర్త గుణములను చెప్పితిని.
ఓ దేవి రాఘవుడు అచిరకాలములో వచ్చి నిన్ను తీసుకుపోవును".

శోకములో మునిగియున్న సీత కూడా
హనుమంతుని మాటలతో హేతువులతో విశ్వాసము పొంది,
ఆ వానరుని రాముని దూతగా గుర్తించెను.
జానకి అత్యంత ఆనందముతో అందమైన కనుబొమలద్వారా కన్నీళ్ళు కార్చెను.

ఆ ఎర్రని అంచుగల కళ్లతో ఆ విశాలాక్షి ముఖము
రాహువు ముఖమునుండి వివడిన చంద్రుని వలె శోభించెను.
ఆమె హనుమంతుడు వానరుడే ఇంకొకడు కాడు అని గ్రహించెను.
అప్పుడు హనుమంతుడు ప్రసన్నమైన చూపులుగల ఆమె తో ఇట్లు పలికెను.

"ఓ మైథిలీ ఇదంతా సర్వస్వము చెప్పితిని విశ్వసింపుము.
ఏమి చేసినచో సంతోషపడుదువో చెప్పుము.
"ఓ మైథిలీ మహర్షుల అదేశానుసారము కపిప్రవరుడు శంబసాదనుని హతమార్చెను.
నేను మహర్షుల దీవెనలతో వాయుదేవుని వరప్రసాదముగా పుట్టి
ప్రభావము లో వాయుదేవునితో సమానమైన వాడను".

రామాయణము అంతటిలో హనుమ
"తతోఽస్మి వాయుప్రభవో హి మైథిలి"
'ఓ మైథిలీ వాయుదేవునితో సమానమైన బలము కలవాడను' అంటూ
తనకు గల అసాధారణమైన శక్తి గురించి మాట్లాడడము ఇక్కడే చూస్తాము.
ఇక్కడ సీతకి విశ్వాసము కలిగించడానికి తనపుట్టుక,
వంద యోజనములను దాటగల,
వాయుదేవునితో సమానమైన శక్తిగల,
తన శక్తి ని కూడా ఇక్కడ వివరిస్తాడు.

మళ్ళీ ముందు ఇంకోచోట
సీతకి రామసుగ్రీవుల దగ్గర ఇంకా పెద్ద సైన్యము వుంది అని చెప్పడము అవుతుంది.
అప్పుడు నిరహంకారరహితుడైన హనుమ
రామసుగ్రీవుల సైన్యములో అందరూ తనకన్న గొప్పవాళ్ళే కాని
తనకన్న తక్కువ వారు లేరు అని చెపుతాడు హనుమ.

అదే హనుమ గొప్పతనము

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి సుందరకాండలో ముప్పది ఇదవ సర్గ సమాప్తము

||ఓమ్ తత్ సత్||
|| ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్త్వగీతలో మాకు తెలిసినమాట||
||ఓమ్ తత్ సత్||